Tuesday, December 7, 2010

స్వామికి లేఖ

ఈ పాటికి మాల వేసుకొని ఉంటావ్. ఎలాంటి భావోద్వేగంలో ఉన్నావో, లేదా నిశ్చలంగా జరుగుతున్నది చూస్తున్నావో మరి. కొన్ని లక్షల మంది, కొన్ని లక్షల సార్లు తీసుకున్న నియమమే అయినా మన దగ్గరకి వచ్చేసరికి కొత్త, వింత కదూ? నీకు చెప్పేన్ని విషయాలు నాకు తెలీదు. నిన్ను నడిపించేంతటి దాన్నో, వెన్నుతట్టేంతటి దాన్నో కాదు. దినచర్యలో మార్పుకి నువ్వెలా సర్దుకుంటావో, తత్తరపడతావో అని నా స్వభావసిధ్ధమైన మాతృ హృదయం కొంచెం బెంబేలు పడుతోంది. ఓ ఉత్తరం కొంచెం భారంతీరుస్తుందని అనిపించింది.

 నీకు నేను ఏంకర్ ని కాదు, నువ్వే నాకు ఔట్ లెట్ వి ఏమో..! ఎప్పటిలాగే.

చాలా మార్పులుంటాయేం? ఇష్టమైనవి వదిలేసుకోవడం, కష్టమైనవి ఆచరించడం..కేవలం మన స్థాయి ని మనం అంచనా వేసుకోవడమేనంటావా? "నేనిది చేస్తే నాకది ఇస్తావా?"  అని ఎక్కడో కొండమీద కొలువున్న దేముడిని అడగడానికి కాదు.'నా దైనందిన జీవనంలో మార్పు కోసం' అన్నావు. మార్పు మాత్రమే కాదు. ఈ మండలం అయ్యేసరికి నువ్వు ఎన్నో తెలుసుకుంటావనిపిస్తుంది. చేస్తున్న పనిని, ఆచరిస్తున్న విధానాన్ని మనస్పూర్తిగా విశ్వసించు.ఆరాధించు. ఇది మాత్రం గుర్తుంచుకో. తప్పదు కాబట్టి అని కాదు. నువ్వు కోరుకున్నది కనుకా కాదు. ఇది విధానం. దాన్ని ఆచరించడం నీ విధి కాబట్టి.

నువ్వు అమ్మ, దీక్షామాల విహారి. అంత ప్రేమించు. అంత అనుభవించు. అంత ఆనందించు.

భక్తి, మోక్షం, కట్టుబాటు, పూజలు ఇలాంటివన్నీ మనుషుల భావోద్వేగాలకి పర్యాయపదాలని నా అభిప్రాయం. అవి మనం సృష్టించుకున్నవే. మనని ఏలుతున్నాయ్ ఈ రోజు. పసిపాపకి ఏం కట్టుబాట్లు, కోరికలు ఉంటాయ్ చెప్పు? స్వఛ్ఛమైన పాల మీద బతుకుతాడు. రుచులు అక్కర్లేదు.  నిద్ర వస్తే ఎక్కడైనా పడుకుంటాడు. అలా పాకుతూ ఏ సోఫా వెనుకో, గోడ వారనో..భోగాలక్కర్లేదు. అమ్మ ఒడి, అమ్మ ప్రేమ, అమ్మ లాలన, అమ్మ స్మరణ..  వేరేమనిషి వాడికి అక్కర్లేదు. 'అన్యథా శరణం నాస్తి' అంటాడు కాబట్టే అమ్మ వాడిని వదలదు. వదిలి మనలేదు.  ఇది కాక సౌభాగ్యమిదికాక వరము ఇంకేముందని అనిపించదూ, ఇలాంటి బంధం ఏర్పడితే? ఆత్మ - పరమాత్మే కానక్కర్లేదు. తండ్రి-కొడుకులు, స్నేహితులు, ఆలుమగలు యే ఇద్దరి మధ్య కల్మషం లేని ప్రేమ ఉంటుందో, ఆ బాంధవ్యం విజయవంతం, ఆనందదాయకం అవుతుంది. ఇదేం కొత్త విషయం కాదు గా..  కాస్త ధైర్యం రావడానికి చర్వితచర్వణమంతే! 'single soul dwelling in two bodies' అనే నీ మాటకి అర్ధం ఇదేకదూ? 

ఇలాంటి మచ్చలేని బంధానికి కోటిరూపాలు .. భక్తి, ప్రేమ, కర్తవ్యం, దేశ భక్తి, ద్వేషం.. ఇలా ఎన్నో.. "ద్వేషమేమిటి మధ్యలో" అంటావా? వాలి, రావణుడు, కంసుడు, శిశుపాలుడు,గాడ్సే.. ఎంచుకున్న దారి అదే. గమ్యం ఏదైనా కానీ,వారు ఎంచుకున్నది మనస్పూర్తి గా నమ్మారు. సాధించారు. అది చూడు.

పుట్టడం అందరం అలాంటి మానసికస్థైర్యంతోనే పుడతాం.అంత కల్మషం లేని స్థితి నుంచి కల్లబొల్లి మాటలు, కుళ్ళు కుతంత్రాలు, ఎత్తులు, పైఎత్తులు నేర్చుకుంటాడు మనిషి. తప్పేంలేదనుకో.. ఇవల్యూషనరీ థియరీ, ఆ పై మనుగడకై పోరాటం. ఒకటేమిటి?  ఈ ఝంఝాటాల్లొ పడి కొట్టుకొని విసుగొచ్చి "దేముడా! ఎందుకిలా జరుగుతోంది? సుఖం, శాంతి లేవా నా ఖాతా లో? " అని ప్రశ్నిస్తాం.  ఆడదానికైతే పిల్లల్ని ఇస్తాడు. మగాడికి ఇదిగో... ఇలాంటి దీక్షలూను. ఈ రెంటికీ పోలికేమిటనకు. బోలెడు నేర్చుకోడానికి అవకాశాలు ఇవి. నేర్చుకోవడమా.. 'హమ్మయ్య..గడిపేసాం రా బాబూ!' అనుకోవడమా.. మన ఇష్టం.

మన కర్మానుసారంగానే నడుస్తాం కాని, నీకెందుకు ప్రత్యేకించి చెప్తున్నానంటే.. నువ్వు తృష్ణ ఉన్నవాడివి, యోగభ్రష్టుడివి. ఇప్పుడు నీకు దన్ను ఇవ్వడం, నీకు చెప్పాలనిపించడం కూడా నా కర్మ పరిపాకానికేనేమో. నీ వల్ల నాకేం రాసి ఉందో..  నిన్ను చూసి నేనేం నేర్చుకోవాలో.. ఏమో..! ఏ నావదేతీరమో..!

నీ ఉత్తరం కోసం ఎదురుచూస్తాను.
నీ అనుమతి లేకుండానే ఈ ఉత్తరం నా బ్లాగ్ లో పోస్ట్ చేస్తున్నాను.
కీర్తి కండూతి అని నవ్వుకోకు. ఇదోక మైలురాయి అని అనిపించడం వల్ల మాత్రమే.
ఈ ఉత్తరం ఇంకొకరికి అర్ధం అవుతుంది, పనికి వస్తుందని మాత్రం అనుకోను.
నీకెంతవరకు సాంత్వన , ధైర్యం, జవాబు ఇచ్చిందో, ఏమిచ్చిందో నువ్వే చెప్పాలి.

పి.ఎస్.: మనం రాసుకొనే ఉత్తరాల్లో సంబోధన, సంతకం అవసరం రాకపోవడం నిజంగా వరమే తెలుసా! ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో. I hate dilemma.

3 comments:

  1. ఇంతకు మునుపు మీబ్లాగు చూసిన గుర్తు లేదు. అమృతపు ధార పట్టుకుని వచ్చి మరి కొన్ని టపాలు చదివాను. చాలా చక్కటి అభివ్యక్తి. అభినందనలు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు. కొత్తావకాయనిలెండి. :)

    ReplyDelete
  3. "...అమ్మ ఒడి, అమ్మ ప్రేమ, అమ్మ లాలన, అమ్మ స్మరణ.. వేరేమనిషి వాడికి అక్కర్లేదు. 'అన్యథా శరణం నాస్తి' అంటాడు కాబట్టే అమ్మ వాడిని వదలదు. వదిలి మనలేదు. ఇది కాక సౌభాగ్యమిదికాక వరము ఇంకేముందని అనిపించదూ, ఇలాంటి బంధం ఏర్పడితే? ఆత్మ - పరమాత్మే కానక్కర్లేదు. తండ్రి-కొడుకులు, స్నేహితులు, ఆలుమగలు యే ఇద్దరి మధ్య కల్మషం లేని ప్రేమ ఉంటుందో, ఆ బాంధవ్యం విజయవంతం, ఆనందదాయకం అవుతుంది. ఇదేం కొత్త విషయం కాదు గా.. కాస్త ధైర్యం రావడానికి చర్వితచర్వణమంతే! "

    -ఏం చెప్పారండీ ?? నిజం గా నిజం . నాకు బా...గా.. నచ్చాయి ఈ వాక్యాలు. సునిశితమైన పరిశీలన!

    ReplyDelete