Thursday, July 28, 2011

కొత్తావకాయ చెప్పిన జంట కథలు - 1

                               కుతూహలం

పసలపూడిలో ఒంటరిగా కాలం గడుపుతున్న సుభద్రమ్మగారికి గుండెనొప్పి వచ్చింది. పసల పూడి వదిలి తణుకు వచ్చెయ్యమని కొడుకూ, కోడలూ బలవంతం చేసారు. ఒక్కగానొక్క కొడుకు మాట కాదనలేక, ఒంటరిగా చేసుకోలేక ఆవిడా సుముఖత చూపించారు. లంకంత పాతకాలపు ఇంటి చాకిరీ, పల్లెటూరి కబుర్లు వదిలి పట్నవాసానికి అలవాటు పడడం కష్టం గానే ఉన్నా సర్దుకుపోసాగారు.

ఇంటిల్లిపాదికీ వండి పెడుతున్న కోడలి కి కూరగాయలు తరిగి ఇచ్చేవారు.
ఉద్యోగానికి పరిగెడుతున్న మనవడి పెళ్ళానికి జడ వేసి పంపించేవారు.
అన్నం తిననని మారం చేస్తున్న ముని మనవడికి కథలు చెప్పి మరిపించేవారు.

ఎన్ని చేసినా మధ్యాహ్నం అయ్యేసరికి, వేళ గడిచేది కాదు ఆవిడకి. చేతులు కట్టేసినట్టుండేది. అది మొదలు వీధి అరుగు మీద కుర్చొని వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని చుస్తూ, కూరలు, పళ్ళూ అమ్మడానికి వచ్చేవాళ్ళని పిలిచి కబుర్లు చెప్తూ ఉండేవారు.

ఓ రోజు నల్లగా మొద్దు గా ఉన్న ఓ మగ మనిషి నెత్తిన బుట్ట పెట్టుకొని వీధిలోకి రావడం చూసారు. "ఎవడ్రా.. నేనొచ్చిన పది రోజుల్లోనూ ఒఖ సారి కూడా చూడలేదు వీడిని..!" అనుకుంటూ వాడు గుమ్మం ముందుకి వచ్చే దాకా ఎదురు చూసారు. వీధి మొదట్లో ఓ రెండు ఇళ్ళ దగ్గర ఇటూ అటూ తిరిగి వెళ్ళిపోయాడు వాడు.

మరో నాల్రోజుల తరువాతా వచ్చాడు వాడే! "... పోతన్నాయ్".."తాజా .... పోతన్నాయ్" అని వాడి కేక గాలిలో తేలుతూ వీధి చివర నుంచి వినిపించింది. కుర్చీలోంచి లేచి ఓ అడుగు ముందుకేసి విన్నారు. అబ్బే! "ఇదిగో.. అబ్బీ" అని పిలిచారు. వాడు వెనక్కి తిరిగి చూసి, వెళ్ళిపోయాడు.

మళ్ళీ ఆ అబ్బి ఎప్పుడొస్తాడో.. ఏం పోతున్నాయో చూడాలని సుభద్రమ్మ గారికి మహా కుతూహలం గా ఉంది. రోజూ మధ్యాహ్నం కాచుకు కూర్చొనేవారు. ఓ రోజు దొరికాడు వాడు, వీధిలోకి అడుగు పెడుతూ.. అప్పు తీసుకున్న వాడు కనిపించినంత సంతోషం కలిగింది ఆవిడకి. గబగబా లేచి కర్ర ఊతం చేసుకొని, నాలుగు అడుగులు వేసి "ఓ అబ్బీ.. రా.. ఇలా రా.." అని గాఠి గా కేక పెట్టారు.
అనుమానం గా ఆగిన వాడిని రమ్మన్నట్టు రోడ్డు మధ్యలో నిలబడి సైగ చేసారు.
వాడు నెమ్మది గా వస్తున్నాడు.
"నల్లని వాడు పద్మ నయనమ్ముల వాడు.." వాడే దిగి వచ్చినా అంత సంబర పడరేమో ఆవిడ.

"ఏమిటవీ బుట్టలో..!?" నడుం మీద చెయ్యి వేసుకొని అడిగారు, చిరు చమట అద్దుకుంటూ.
"తవరు కొనరులేమ్మా.." అన్నాడు వాడు.
"చెప్పవోయ్.. కొంటానో.. కొననో.. ఏమిటవీ?"
"యీదిలో ఈ సివరి నాలుగు ఇల్ల వోల్లు కొనరు గదమ్మా.. సేపలు."
గతుక్కుమని చుట్టూ చూసారావిడ. "ఎవరూ చూడలేదు కదా!" అనుకొని కంగారుగా గిరుక్కున వెనక్కి తిరిగి ఇంట్లోకి వస్తున్న ఆవిడకి వినిపించింది వాడి కేక ఈ సారి స్పష్టం గా...

"ఎగిరీ పోతన్నాయ్.. తాజా సేపలు ఎగిరీ పోతన్నాయ్.." 

_________________________________________________
                     
                     పాలకాయలు - కలిమిలేములు

పాలెంలో పెద్ద గాలి దుమారం వచ్చింది. సత్యనారాయణ గారి పెరట్లో  నేరేడు చెట్టు కొమ్మలు విరిగి నూతిమీద వాలిపోయింది. అది పూర్తిగా కొట్టించడానికి పెద్దిగాడిని రోజు కూలి మాట్లాడి పిలిపించారు. పనిలో పనిగా బాదం చెట్టు కొమ్మలు దగ్గరగా కొట్టెయ్యమన్నారు.  పొద్దున్నే ఏడు గంటలకి మొదలెట్టాడు. చిన్న కొమ్మలు దారికి అడ్డుగా ఉన్నవి కొట్టి తాడు కట్టి వీధి చివర తోపులోకి లాక్కుపోయి పడేసి వస్తున్నాడు. సాయంత్రం దాకా సాగేలా ఉంది పని అనుకున్నాడు.

పది గంటల వేళ పూజ పూర్తి చేసుకొచ్చి అరుగు మీద కూర్చొన్నారు సత్యనారాయణ గారి డెభ్భై అయిదేళ్ళ తల్లి గారు. సత్యనారాయణ గారి కొత్త కోడలు గాయత్రి అక్కడే కూర్చొని. చిక్కుడు కాయలు బాగుచేస్తోంది. ఇల్లాలు సీతమ్మగారు వంటింట్లో పని చేసుకుంటూ, అత్త గారితో లోకాభిరామాయణం మాట్లాడుతోంది.

"అవునే గాయత్రీ ! నీ మొగుడు వచ్చే నెలలో అయినా తీసుకెళ్తాడుటా నిన్నూ? కొత్తగా పెళ్ళయిన వాళ్ళు ఎక్కువ రోజులు దూరంగా ఉండకూడదమ్మా!" ముసలావిడ అడిగింది మనవడి పెళ్ళాన్ని.
"వీసా కి అపాయింట్మెంట్ దొరకాలి కదా బామ్మ గారూ! ఆయనదేముంది?"
"అదేదో తొందరగా కొనమనూ! సినేమా టికెట్లాగ బ్లాకులో దొరుకుతుందేమో కనుక్కోమను. డబ్బు గురించి ఆలోచించవద్దని చెప్పు పీనాసి సన్నాసికి."
"అలాగే చెప్తాను." నవ్వాపుకుంటూ చెప్పింది గాయత్రి.
"వాళ్ళకి తెలియదటండీ! అమెరికా వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో! నాల్రోజులు మనతో పల్లెటూర్లో ఉండనివ్వండీ!" సీతమ్మగారు వంటింట్లోంచి బియ్యం కడిగిన నీళ్ళు పట్టుకొచ్చి కరివేపాకు మొక్క మొదట్లో పోస్తూ చెప్పింది.
"ఆ.. నాకెందుకులే! ఇదిగో.. ఈ పెద్ది గాడి అమ్మ పెళ్ళీ, మీ అత్తగారి పెళ్ళీ ఒకే రోజు జరిగింది. వీడూ నీ మొగుడి ఈడువాడే! వీడి కూతురికి పదేళ్ళు వచ్చేసాక మీ పెళ్ళి జరిగింది. ఇంకా కంగారులేదంటున్నారు." సణుక్కుంది పెద్దావిడ.

"ఏరా.. పెద్దీ! మీ అమ్మకి విరిగిన కాలు సర్దుకుందా! లేచి తిరుగుతోందా!" టాపిక్ మార్చడానికి వాడిని కదిలించింది సీతమ్మ గారు.
"కుంటుతోందమ్మా ఇంకా.. పరవాలేదు." చెప్పాడు వాడు.
"వీళ్ళమ్మ కి ఎప్పుడూ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆ మధ్య పార్శ్వపు నొప్పి అని ఎన్నాళ్ళో గిలగిల్లాడిపోయింది. మిరప గింజలు బియ్యంలో నూరీ, కణతలకి పట్టు వేసుకోమన్నాను. రెండు రోజుల్లో తగ్గిపోయింది దెబ్బకి." గర్వం గా చెప్పింది పెద్దావిడ మనవడి పెళ్ళాం తో.
"ఏరా, ప్రతీ ఆదివారం పట్టు వేసుకొని సూర్యుడికి నమస్కారం చేసుకోమని చెప్పాను. చేస్తోందా మీ అమ్మ? అశ్రధ్ధ చేసేసిందా?" వాడిని ఆరా తిసింది.
"ఆ.." సత్తువ కొద్దీ గొడ్డలి చెట్టు మొదట్లో ఏటవాలు గా దింపి చెప్పాడు వాడు.

"పాడు దుమారం. నిక్షేపంలాంటి కనకాంబరం మొక్కలు! చెట్ల కొమ్మలు పడి ఎలా విరిగిపోయాయో చూడు. ఏరా పెద్ది గా! మీ పెరట్లో మల్లె అంట్లు, గులాబీలు ఏమీ అవలేదు కదా! బొండు మల్లె అంటు తెచ్చి మా పెరట్లో పాతమని చెప్పాను రా నీ పెళ్ళానికీ, నువ్వు ఇంటికి వెళ్ళాక ఓ సారి గుర్తు చెయ్ దానికి."
"అట్టాగేనమ్మా!"
"నీ పెళ్ళాం అంటే గుర్తొచ్చింది. ఇక్కడే తింటావా? ఇంటికెళ్ళొస్తావా? మళ్ళీ ఏం వెళ్తావులే. పని వదిలేసి వెళ్ళకు."
"....."
"నువ్వు నాజూకు తిళ్ళు మరిగావా.. ఉదయాన్నే చద్దెన్నం తిని వచ్చావారా!"
"...."
"ఈ ఏడాది పచ్చళ్ళు కావాలని మీ అమ్మ రాలేందేంట్రా? వేసవి కాలంలో మా ఇంటి పచ్చళ్ళకోసం ఠంచనుగా వచ్చేసేదీ"
"...."

"మధ్యాహ్నం కాసిని చెగోడీలు, పాలకాయలు నలుద్దామనుకుంటున్నాను. మీరు కూర్చుంటారా పొయి దగ్గర?" సీతమ్మ గారు అడిగింది అత్త గారిని.
"పిండి జల్లించుకోవద్దూ ముందు! ఇలా పడేయ్ జల్లేడా, పిండి డబ్బా" కోడలికి చెప్పి, "న్యూసు పేపరొకటి తేవే!" ఫోన్ మాట్లాడుకోడానికి తన గదిలోకి జారుకోబోతున్న గాయత్రికి పురమాయించింది.

"న్యూసు అంటే గుర్తొచ్చింది రా పెద్దిగా! మీ మేనబావ రాజకీయాల్లో కి వెళ్ళాడట కదా! ఆ మధ్య టీవీలో కూడా కనిపించాడని చెప్పుకుంటున్నారు. మీ ఆఖరి చెల్లెల్ని ఇవ్వచ్చుకదరా మరీ!"
"ఆ.." నడుముకి కట్టుకున్న తువ్వాలు తీసి చమట తుడుచుకుంటూ చెప్పాడు పెద్ది గాడు.

ఓ నాలుగు నిముషల నిశబ్దం. పిండి జల్లిస్తూ పెద్ది గాడిని మళ్ళీ కదిపిందావిడ.
"పాల కాయలు తిన్నావు రా, పెద్దీ ఎప్పుడైనా? ఏలా చేస్తారో తెలుసా!?"
చేతి నరాలు బిగించి మరో గొడ్డలి దెబ్బ వేసి, ఊపిరి పీల్చుకొని చెప్పాడు పెద్ది గాడు.

"అమ్మా.. ఉన్నోళ్ళు పాలతో సేసుకుంటారు. లేనోళ్ళు నీల్లతో సేసుకుంటారు. దాందేవుందమ్మా!"

20 comments:

  1. భానుమతీ రామకృష్ణగారి "అత్తగారి కథలు" చదివి, అయ్యో అలాటి కథలు లేవే అనుకోకుండా, ఆలోటు తీరుస్తున్నావమ్మా !

    ReplyDelete
  2. రెండు కథలు కూడా చాలా బాగున్నాయండి..

    ReplyDelete
  3. మొదటి కథ ప్రారంభంలో పసలపూడి చూసి చిన్న సందేహం.. కానైతే వంశీ కథలా అనిపించలా :)) .. బాగున్నాయ్ మీ కథలు.. రెండో దానిని కొంచం పెంచి పెద్ద కథ చేసే అవకాశం ఉన్నట్టుగా అనిపించిందండీ..

    ReplyDelete
  4. ఫణి బాబు గారూ,
    ధన్యోస్మి. ఇంతకంటే ఏం చెప్పగలను!

    వేణు శ్రీకాంత్ గారూ,
    ధన్యవాదాలండీ.

    మురళి గారూ,
    పసలపూడి వంశీ సొత్తయిపోయింది కదండీ మరి. మా అత్తగారి ఊరు అదేనండీ. అసలు రెండో కథ కొంచెం పొడవయ్యిందని అనుకున్నాను నేను. భూమిలో అనుకుంటా. సింగిల్ కాలం కథలు అని వచ్చేవి. అంత టూకీగా రాయాలని ఆశ. ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మొదటి కధ బాగుంది. రెండవది ఇంకా బాగుంది.
    ఫణి బాబు గారన్నట్టు భానుమతి అత్తగారి అమాయకత్వము, గడుసు తనము కూడా కొద్దిగా కనిపిస్తున్నాయి.

    ReplyDelete
  6. రెండవ కధ బాగా నచ్చింది. పాత్రల ఆహార్యాలని చెక్కడం, ambiance ని సృష్టించడంలో మీ నైపుణ్యం కనపడుతోంది.

    ReplyDelete
  7. బావున్నాయండి మీ కథలు !

    ReplyDelete
  8. కొత్తావకాయ,

    :) సేపలు, నీళ్లకాయలు.. బాగుంది!!

    మీ తాతమ్మగారా ఆవిడ కారక్టర్ కి ఇన్స్పిరేషన్? మీ శైలి చాలా చాలా బాగుంది.

    ReplyDelete
  9. @ బులుసు గారూ,
    గడుసుతనమూ అమాయకత్వాల మేలు కలగలుపే కదండీ తెలుగుబామ్మలు, భామలూ కూడా! ధన్యవాదాలు.

    @ మురారిగారూ,
    చాలా సంతోషం అండీ. ధన్యవాదాలు. :)

    @ శ్రావ్య గారు,
    ధన్యవాదాలండీ!

    @ కృష్ణప్రియ గారూ,
    ధన్యవాదాలు. మా తాతమ్మగారిని నేను చూడలేదండీ! మా నాయనమ్మ మాత్రం రెండు కథల్లోనూ తొంగిచూసింది.

    ReplyDelete
  10. బావున్నాయండీ.. మీ చిట్టి జంట కధలు.. ;)

    ReplyDelete
  11. Good stories. Reminds me subtle English sense of humor. Thanks for sharing them with us.
    -- Bujji

    ReplyDelete
  12. బావున్నాయి మీ రెండు కధలు, నాకు మొదటిది చాల బాగా నచ్చింది, రెండోది మామూలుగా నచ్చింది :)

    ReplyDelete
  13. @ రాజ్ కుమార్, ధన్యవాదాలు.

    @ bujji, This is the nicest compliment I can get for these stories. Thanks.

    @ శ్రీ, ధన్యవాదాలండీ.

    ReplyDelete
  14. కథలు బాగున్నాయి.

    ఇంగ్లీష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఏమిటి, అది నైసెస్ట్ ఎందుకు అని కూడా తెలుపగలరు.

    ReplyDelete
  15. అనానిమస్ గారు, ధన్యవాదాలండీ. ఇంగ్లీష్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే సున్నితమైన, సునిశితమైన హాస్యం అని అనిపిస్తూ ఉంటుంది నాకు. పెద్ద ప్లాట్ లేకుండానే చిన్న వాక్యం తో నవ్వించడం కొన్ని ఇంగ్లీష్ కథల్లో చదివాను. వాటితో అచ్చతెలుగు కథల్ని పోలిస్తే అబ్బురమనిపించింది. అంటే తెలుగులో అలాంటి కథలు లేవా అంటే ఎందుకు లేవూ ఖచ్చితం గా ఉన్నాయి. భమిడిపాటి రామగోపాలం గారి రచనలన్నీ అలాగే ఉంటాయి. ఒక భాషలో రాసిన వాటిని మరో భాషలో ఉన్న కథల ప్రమాణంతో పోలిస్తే సంతోషమనిపించింది. అంతే. లడ్డు ఎంత బాగుంది అంటే జిలేబీ అంత బాగుంది అని జిలేబీ ప్రియుడంటే ఆనందం కలుగుతుంది కదా లడ్డూప్రియులకి. అలాంటిదన్నమాట. :)

    ReplyDelete
  16. రమణ గారివి లేవూ

    ReplyDelete
  17. మరే! భేషుగ్గా ఉన్నాయ్ కదా శంకర్ గారూ.

    ReplyDelete
  18. లడ్డు జిలేబిలా వుంది అంటే లడ్డు ప్రియులు మాలో ప్రత్యేకత లేదా? చా ఇంతకష్టపడ్డా జిలేబిలా వున్నామా అని బాధ పడాలేమో. ఏదైనా ఇంగ్లీషు అనే పదం చూసి మీకు నైసెస్టు అనిపించిందని నాకనిపించింది.
    షేక్స్పియర్ ఆఫ్ థ ఈస్ట్ అని కాళిదాసును అంటే నాకేమో అంతేనా మా కాళిదాసు అనిపిస్తుంది. :)

    ReplyDelete
  19. లడ్డు జిలేబిలా వుంది అంటే లడ్డు ప్రియులు మాలో ప్రత్యేకత లేదా? చా ఇంతకష్టపడ్డా జిలేబిలా వున్నామా అని బాధ పడాలేమో. ఏదైనా ఇంగ్లీషు అనే పదం చూసి మీకు నైసెస్టు అనిపించిందని నాకనిపించింది.
    షేక్స్పియర్ ఆఫ్ థ ఈస్ట్ అని కాళిదాసును అంటే నాకేమో అంతేనా మా కాళిదాసు అనిపిస్తుంది. :)

    ReplyDelete
  20. మరో విధంగా చెప్పాలంటే, తెలుగు వాళ్ళకు తమిళ సినిమా హాస్యం ఎలా ఎబ్బెట్టుగా ఉంటుందో, తమిళులకు మన తెలుగు హాస్యం సున్నితంగా పస లేకుండా వున్నదనిపిస్తుందిట. ఇంగ్లీషు వాళ్ళ హాస్యం మనకన్న ఒక మెట్టు తక్కువ అనుకొండి. దీన్ని క్లాస్, మాస్ తరహా హాస్యంగా కూడా విభజించవచ్చు. హస్యం పంచ్ మన మూడ్ బట్టిగూడా మారుతుంటుందిగదా. దేని కదే.
    -- బుజ్జి

    ReplyDelete