Wednesday, December 21, 2011

దొరసానీ! లేవవే!! - కాత్యాయనీ వ్రతం - 7

అప్పుడే నడక నేర్చిన అల్లరి బుజ్జాయి వెనుక పగలంతా పరుగులు తీస్తూ, వాడు చేసే కొంటె పనులను ఓ కంట కనిపెడుతూ, వచ్చే పోయే అతిధులతో కళకళ్ళాడే పెద్ద ఇంటిని సమర్ధించే ఇల్లాలు, పొద్దు గూకిన తరువాత ఇల్లు చక్కబెట్టుకుని, పక్కలో పాపడిని పొదువుకుని అలసి సొలసి ఒళ్ళెరగక నిద్రపోయినట్టుంది.. సద్దుమణిగి నిద్దరోతున్న ఆ గొల్లపల్లె. రాత్రైనా నిద్ర లేనిది ఒక్క కన్నయ్యకే! అవును! గోప భామినుల కలల్లోకి వెళ్ళి కన్నయ్య ఎన్ని కబుర్లు చెప్పాలో, ఎంత అల్లరి చెయ్యాలో, ఎవరి అలకలు తీర్చి మురిపించి మరిపించాలో కదా! క్షణమైనా ఆ గోపాల చూడామణిని మరువని వారిని కలలో కూడా అతడు వదలలేడు.

నిన్నటి రోజు తనని చెలులు అతి ప్రయత్నం మీద నిద్ర లేపారని, ఈ రోజు ఓ గడియ ముందే నిద్ర లేచింది వకుళ. పసిడి పాదాల అందెలు ఘల్లు ఘల్లున చేతి గాజుల సంగీతానికి జతగా సడి చేస్తూంటే, పూలసజ్జ నింపుకుని ఉత్పల ఇంటికి వెళ్ళింది. వకుళ పిలుపు విని నిద్ర లేచిన ఉత్పల కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చింది.

"ఊరికి ముందే నిద్ర లేచేసావా? చిన్నారీ! బుధ్ధిమంతురాలివి సుమీ!" అని నవ్వింది.
"ఏం చెయ్యమంటావు చెప్పు! మీరంతా ఇంటి బయట అలా నిలబడి ఎదురుచూస్తూ ఉంటే భలే బాధనిపించింది." చిన్నబోతూ చెప్పింది వకుళ.
"భలే దానివే! ఈ చలికి ఎవరైనా మత్తుగా నిద్దరోవాల్సిందే!
"లేదులే అక్కా! నాకే ఏదో మాయ కమ్మేసింది."
"కన్నయ్య మాయ! కలలో కృష్ణుడు నీ వీణాగానం వింటూ కదలనన్నాడో! ఇద్దరూ బృందావనిలో చెలరేగి పూలబంతులతో ఆడుకుంటున్నారో!" ఆటపట్టించింది ఉత్పల.
"ఏమాటకామాటే అక్కా! నిద్ర లేచేసరికి కృష్ణ లీలలు చెవిన పడడం అంత మధురమైన సుప్రభాత గీతిక మరొకటి ఉండదు తెలుసా!" నిన్నటి కబుర్లు తలుచుకుంటూ చెప్పింది వకుళ.
"కాదూ మరి! తేనె కంటే తీయనిది కన్నయ్య పేరు .. మాయల్లో పెనుమాయ కన్నయ్య చేష్టలూ.. నీ పుణ్యమా అని మేమూ ఎన్ని మంచి మంచి సంగతులు మాట్లాడుకున్నామో!" చెప్పింది ఉత్పల.

"ఈ రోజెవర్ని నిద్ర లేపాలో! అరే! వకుళాదేవి అప్పుడే నిద్ర లేచిందే!" మేలమాడింది ఎదురుగా మిగిలిన గోపికలందరినీ వెంట పెట్టుకుని వస్తున్న సురభి.
"కమలిని రాలేదింకా.. మీ ఇంటి పక్కనేగా! నువ్వెళ్ళి చూడలేదా సురభీ!" అడిగింది ఉత్పల.
"అయ్యో.. తలుపు వేసి ఉంటే కమలిని నిద్ర లేచి, నన్ను పిలిచి నేను లేవకపోతే మీ దగ్గరకి వచ్చేసిందనుకున్నానే!"
"మంచి దానివే! పద పద.. వెళ్ళి చూద్దాం. ఈ రోజు ఆమె గారు  స్వప్న డోలికలలో ఊగుతోందనుకుంటా!"

అందరూ కలిసి కమలిని ఇంటి ముందు నిలబడ్డారు. నిన్న వకుళ నిద్రపోయినట్టే ఈ రోజు కమలిని గాఢంగా నిద్రపోతోంది. పక్కకు తిరిగి నిద్రపోతున్న ఆమె 'పడమటి కొండల బారులా' ఉంది. రెండు కొండల మధ్య పొంగి నేల చేరుతున్న పాల జలపాతంలా.. చెదరిన ఆమె జలతారు వల్లెవాటు, నడుము పై నుండి కిందకు జారి వేలాడుతోంది. అలసిసొలసి నిద్రపోతోందేమో.. చెదిరిన ముత్యాల సరాలు ఆమె గుండెలపై చిక్కులు పడి అదివరకు ఎవరూ పెట్టుకోని వింత ఆభరణంలా ఉన్నాయి. ఆమె చేతిలో దంతపు కట్టున్న చిన్న అద్దం ఉంది. ఆమె నుదుట కస్తూరి రంగరించిన తిలకం అర్ధ చంద్రాకృతిలో దిద్ది ఉంది. "తిలకం ఇలా దిద్దుకుంటే బాగుంటుందా! కృష్ణుడికి నచ్చుతుందా?" అని నిద్రపోయే ముందు దిద్దుకుని అద్దంలో చూసుకుంటూ నిద్రపోయినట్టుంది.

"ఓ దొరసానీ! నువ్వే ముందు ఉండి మమ్మల్ని నిద్ర లేపే దానివి.. ఈ రోజు ఇంకా నిద్దరోతున్నావేవమ్మా! కమలినీ! ఓ కృష్ణప్రియా! లే లే!" పిలిచింది సురభి. ఆమె గది కిటికీ దగ్గరకి వెళ్ళి తట్టి చూసింది.

బయట నిలబడ్డ చెలులందరూ ఒకే సారి "కృష్ణా.. కృష్ణా!!" అని పిలిచారు. వెయ్యి వీణలు ఒక్క సారి మీటినట్టు, వెయ్యిమంది విలుకాళ్ళు ఒకే సారి బాణాలు వదిలితే అల్లెత్రాటి ఝుంకారాలు మిన్నంటినట్టూ వాళ్ళ గొంతులు మ్రోగాయి.

చలనం లేదామెలో! నిశ్చింతగా నిద్దరోతోంది.
"కమలినీ.. ఇంతలా పిలిచినా లేవట్లేదు! అదిగో మా కృష్ణ శబ్దాన్ని చెట్ల మీది ఏట్రింతలు అనుకరిస్తున్నాయి విను!!"
చెట్లమీది కాటుక పిట్టలు వాటి చిట్టి గొంతులిప్పి "కృష్ణా. కృష్ణా.. కృష్ణా.. " అని అరుస్తున్నాయి. ఒక పిట్ట అరుపు విని మరో పిట్ట అందుకుని కృష్ణ శబ్దం అలలు అలలుగా రేపల్లె మొత్తం మారుమ్రోగింది. ఆ శబ్దానికి ఇళ్ళలో నిద్ర లేచిన గొల్ల ఇల్లాళ్ళు, పక్కల్లో అప్పుడే నిద్ర లేచి కళ్ళు తెరవకుండానే ఒళ్ళు విరుచుకుంటూ బధ్ధకాలు తీర్చుకుంటున్న తమ పసి కందుల్ని నెమ్మదిగా తీసి, గుడ్డ ఉయ్యాళ్ళలో వేసారు. నిద్రలో వదులయిన చీర ముడి సరి చేసుకుని, విడిన కొప్పులు ముడుచుకుంటూ చంటి పాపాయిలకు ఊరు తెలవారక ముందే ఉగ్గు పట్టేందుకు సిధ్ధపడుతున్నారు.

"ఏట్రింతల మరో పేరు భరద్వాజ పక్షులు కదూ! భరద్వాజుడు భరతుడిని పరీక్షించినట్టు అవి నిన్ను పరిక్షిస్తున్నాయనుకుంటున్నావా?" ఆ కథ గుర్తొచ్చి నవ్వుకుంటూ అడిగింది ఆనందిని.
"భరద్వాజుడా..? భరతుడా..? చెప్పకుండానే నవ్వేసుకుంటున్నావే! చెప్పు ఆనందినీ.. ఇంకా సమయం ఉందిగా! ఆ మహరాణి లేచి రావాలిగా ఇంకా!" అడిగారు విష్ణుప్రియా, మేదిని.
"అమ్మాయిలూ, క అన భయం. కథ అంటారుగా!" నవ్వింది ఆనందిని.
"చెప్పవూ! భరతుడంటున్నావూ.. నువ్వు రామ కథలు మహగొప్పగా చెప్తావు కూడానూ!" ఇంటి అరుగు మీద కూర్చుంటూ అడిగింది సురభి.
"సరే తప్పేదేముంది! చెప్తాను వినండి." చెప్పడం ప్రారంభించింది ఆనందిని. చెక్కిట చేతులు చేర్చుకు కొందరూ, పక్క వాళ్ళ భుజం మీద చెయ్యాన్చి నిలబడి కొందరూ.. ఊ కొట్టేందుకు సిధ్ధమయ్యారు.

"ఉచక్షుడనే మునికి మమత అనే భార్య ఉండేది. ఆమెకి పుట్టిన వాడే భరద్వాజుడు. ఆయన సాక్షాత్తూ బృహస్పతికి ఔరసుడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాధ్యయనం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు భరద్వాజుడు. శతాయుః పురుషః అన్నారు కదా.. ఆ నిండూ నూరేళ్ళూ శ్రధ్ధగా వేదాధ్యనం చేసాడతడు. చదివిన చదువు తృప్తి కలిగించలేదు. ఇంకా చదవాలనుకున్నాడు. తన ఆయుష్షు అయిపోనుందని గమనించి ప్రజాపతిని మరో వందేళ్ళు వరమడిగాడు. "సరే"నన్నాడు ప్రజాపతి. ఆ రెండో వందేళ్ళూ అయినా భరద్వాజుడికి వేదాలు నేర్చుకునేందుకు సరిపోలేదట. మరో వందేళ్ళు అడిగి తెచ్చుకున్నాడు. మూడు వందలేళ్ళు పూర్తవుతూండగా ఇంకా సంతృప్తి చెందక మళ్ళీ వరమడిగాడు."
"ఊ.."
"అప్పుడు ప్రజాపతి భరద్వాజుడిని ఓ నాలుగు పేద్ద పర్వతాల దగ్గరికి తీసుకెళ్ళాడట."
"ఊ.."
"అప్పుడు ప్రజాపతి అన్నాడటా.. "భరద్వాజా..! ఇదిగో ఇవే వేద పర్వతాలు. మూడు వందల సంవత్సరాలు కఠోర దీక్షతో నువ్వు అధ్యయనం చేసిన వేదభాగం ఎంతో తెలుసా..?" అని మూడు పిడికిళ్ళ మట్టి తీసి పక్కన పెట్టాడట!"
"ఆ..!!!" ఆశ్చర్యం వారి కళ్ళని రెండింతలు చేస్తే, అందమేమో పదింతలయ్యింది.
"వేదం అనంతం. వేదాలు వర్ణించిన ఆ పరంజ్యోతి గొప్పతనంలాగే! ఎన్ని వేల సంవత్సరాలు నేర్చుకుంటే నీకు తృప్తి కలుగుతుంది కనుక! పో.. వెళ్ళి ఈ మూడు వందల ఏళ్ళు నువ్వు వేదాధ్యయనం వల్ల గడించిన తపోసంపద, శక్తీ వినియోగం చేసిరా! నీకు మోక్షమే!" అన్నాడట ప్రజాపతి.
సరే అని బయలుదేరిన భరద్వాజుడు లోకమంతా తిరిగాడట. అప్పటికే రాముడు తన ఇల్లాలినీ, అనుజుడినీ వెంటపెట్టుకుని అడవులకెళ్ళిపోయాడు.

"ఊ..!" రామ కథలోకి వచ్చేసామని ఆనందం, ఏమవుతుందో అని ఆత్రుత వాళ్ళ గొంతులో!
"భరద్వాజుడు నేరుగా నందిగ్రామానికి వెళ్ళాడు. అక్కడ 'రాముడు విడిచి వెళ్ళిన అయోధ్య.. దేముడు లేని కోవెలలాంటిదని', రామ పాదుకలకు పూజ చేస్తూ, వనవాస వ్రతాన్ని తానూ చేపట్టి ఓ కుటీరంలో ఉన్నాడు భరతుడు."
"ఊ.."
"భరద్వాజుడు వెళ్ళి భరతుడిని అడిగాడటా.. "ఏవయ్యా, మీ అన్న అడవులకెళ్ళాడు కదా! నువ్వు రాజ్యమేలకుండా ఇలా నార బట్టలు కట్టుకుని, జడలు కట్టిన కేశాలతో, కాయా కసరూ తింటూ ఈ కారడవిలో ఉన్నావేం?" అని."
"వాళ్ళమ్మదే పన్నాగమంతా.. పాపం బిడ్డ అమాయకుడే!" తీర్పు ఇచ్చి భరతుడిని వెనకేసుకొచ్చారు  గొల్లపిల్లలంతా.
"ఊ.. మరే! "రామన్న లేని అయోధ్య జీవుడు లేని శరీరం కదా!" అందుకే విడిచిపెట్టానన్నాడు భరతుడు. భరద్వాజుడికి భరతుడి మాటల మీద నమ్మకం కుదర లేదు. నిజంగానే అన్న మీద ప్రేమా? లోకానికి వెరచి రాజ్యం ఏలట్లేదా? అని అనుమానమొచ్చింది."
"ఛ ఛా.. పాపం భరతుడికి అలాంటివి తెలియదు." తమకు తెలుసన్నట్టు చెప్పారు.
"అవునులే! మరి నిజం నిగ్గు తేలాలిగా! అప్పుడు భరద్వాజుడు తన అపార తపశ్శక్తితో ఆ అడవిలోనే ఓ బ్రహ్మాండమైన రాజ్యాన్ని  మణిమయ భవంతులతోనూ, అన్ని హంగులతోనూ నిర్మించి భరతుడితో చెప్పాడట. "నీ భ్రాతృ ప్రేమ కి మెచ్చి ఈ నగరం నీకు కానుక ఇస్తున్నాను. అయోధ్యకైతే వెళ్ళలేవు కానీ, ఈ రాజ్యాన్ని ఏలుకో. రాచబిడ్డవి అడవుల్లో కష్టపడడం నేనే చూడలేకపోతున్నాను." అన్నాడట.
"ఊ..!!"
"ముని వాక్యాన్ని కాదనకుడదు కదా! అందుకని భరతుడు ఆ రాజ్యంలో ప్రవేశించాడు"
"నిజమా!!" అపనమ్మకం.. పాలు నల్లగా ఉంటాయంటే నమ్మగలమా?
"ఊ.. పెద్దల మాట కొట్టివేయడం మహా పాపం! అందుకని భరతుడు ఆ రాజ సభలో ప్రవేశించి, సింహాసనం మీద రామ పాదుకలు ఉంచి పక్కన నిలబడి వింజామర వీస్తూ, కళ్ళంట నీటి ధారలు కారిపోతూ ఉండగా అలా నిలబడిపోయాడట. భరతుడు అచ్చం రాముడిలాగే ఉంటాడట!  అతని కళ్ళలో నీళ్ళు చూసి భరద్వాజుని గుండె కరిగిపోయిందట!!"
కళ్ళ నీళ్ళు బొటబొటా కార్చేస్తూ.. "ఊ.." అన్నారు అందరూ.
"తన అంచనా తప్పనందుకు పరమానంద భరితుడైన భరద్వాజుడు రెండు చేతులతోనూ భరతుడి భుజాలు పట్టుకుని "తండ్రీ! నా శక్తి ని ధారపోసి మరీ నిన్ను పరీక్షించాను. నీ రామ భక్తి ఇంత గొప్పదని లోకానికి చాటాను. మూడువందలేళ్ళు కూడబెట్టిన నా శక్తికి ఇంతకంటే సార్ధకత మరొకటి ఉండదు. రామానుజులను మించిన తమ్ములు వేరొకరికి ఉండరు! భగవంతుని కంటే భాగవతులను అంటే నీలాంటి భక్తులను కళ్ళారా చూడడమే గొప్ప అదృష్టం! " అని పొగిడి వెళ్ళిపోయాడట!"
"ఊ.."
"అలాంటి భరద్వాజుడి పేరు పెట్టుకుని ఆ భరద్వాజ పక్షులు తెల్లవారకుండానే కూసి,  వ్రతం పట్ల ఉన్న మన భక్తిని పరీక్షిస్తున్నాయని అనుకుంటున్నావా? అని కమలినిని అడిగాను."
"నిజంగానే తెల్లవారబోతోంది కానీ, ఈరోజు ఏటిరింతలు మంచి కథే వినిపించాయి." అంది సురభి.
"ఆ విషయం లోపల ఉన్న ఆయమ్మకి తెలియాలి కదా!"
"కమలినీ! వింటున్నావా.. మేమూ, ఏట్రింతలే కాదు రేపల్లెంతా నిద్ర లేచింది."

"కమలినీ! రోజూ నువ్వే ముందు ఉండే దానివి. ఈ రోజేంటి వింతగా నువ్వే నిద్రపోతున్నావా? అదిగో! దధి చిలకడానికి తరుణులందరూ సిధ్ధమయినట్టున్నారు! పాల సంద్రంలో మంధరపర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి ని తాడుగా చేసి ఆనాడు అమృతమథనం జరిపినట్టు, పెరుగు చిలికి వెన్న తీయడానికి సిధ్ధపడుతున్నారు. లే.. లే!"

"అదిగో విన్నావా! వాళ్ళ మెడలో కాసుల పేర్లు, పట్టెడలూ ఒకదానికొకటి ఒరుసుకుని గలగలా శబ్దం చేస్తున్నాయి. దధిమథనం మన గొల్లవారికి దేవతార్చనతో సమానం కదా! అందుకని ఉదయాన్నే స్నానం చేసి పువ్వులు అలంకరించుకుని మరీ పెరుగు తరిచే పనిలో ఉన్నారు. తెల్లగా గట్టిగా రాయిలా ఉన్న పెరుగు చిలకడానికి వాళ్ళు బలమంతా ఉపయోగించి అవస్థ పడుతూ ఉంటే, వాళ్ళ జుత్తు ముడి ఊడిపోతోంది. వాళ్ళ కొప్పుల్లో ఉన్న పువ్వుల సువాసన ఊరంతా ఘుమ్మని వ్యాపిస్తోంది. నీకు తెలియడం లేదా! "

కమలిని నెమ్మదిగా కదులుతోంది. ఎక్కడో లీలగా వినిపిస్తున్న మాటలు! నిన్న వకుళని నిద్ర లేపిన విషయం గుర్తొచ్చింది. అలా తనకూ ఏవైనా కథలు చెప్తారేమో అని కళ్ళు మూసుకునే వింటోంది.

"అమ్మడూ! కమలినీ! నారాయణా.. కేశవా.. అని గోవిందనామాలు పాడుతూ చల్ల చేస్తున్నారు అందరూ! విను విను.."
"కేశి అనే రాక్షసుడిని చంపిన వాడా!! అందమైన కేశ సంపద గలవాడా!! అని కన్నయ్యని పొగుడుతున్నారు విను!"
"కన్నయ్యని పొగిడితే లేవవా! సరే! నిన్ను పొగుడుతాం విను!" అని నవ్వుతూ చెప్తోంది సురభి.

"నువ్వే మా బృందానికి శోభ నిచ్చేదానివి. నువ్వు లేకపోతే చిన్నబోయినట్టుంది, బంగారూ! నిత్యం "కృష్ణా కృష్ణా" అని జపం చేస్తూ ఏడు నలుగులూ పెట్టుకుంటావు కాబోలు! గులాబిరేకుల్లో నిద్దరోతావేమో! పాల మీగడ తప్ప వేరేది తినవేమో! వెన్నెల తాగిన వన్నెలాడీ! లే.. లే! నీ శరీరపు వన్నె ఎంత అందమైనదనుకున్నావూ..? నువ్వు కన్నయ్య పక్కన  నిలబడితే, మెరుపుతో కల్సిన మేఘంలా కన్నయ్య మరింత వెలుగులు చిమ్ముతాడు. తేజోరాశివి! చక్కదనాల చుక్కవి! రా బయటికి! లేచి తలుపు తెరు! భరద్వాజుడు భరతుడిని చూసి పొందిన పుణ్యం, మేము నిన్ను చూసి మూట కట్టుకుంటాం! నీలా కన్నయ్యని కొలిచేదెవరని!?"
"హు.. ఈ రాణీ గారికి కూడా పాట పాడాలి కాబోలు! నిన్న వకుళకి తనే మేలుకొలుపు పాడింది. ఈ రోజు మనం పాడక తప్పదు." చెప్పింది మేదిని.

చెలుల పొగడ్తలకూ, కన్నయ్య పక్కన తనని ఊహించుకుని మెచ్చుకున్నందుకూ ఉబ్బితబ్బిబ్బై లేచి కూర్చుని, పాట విందామని చప్పుడు చెయ్యకుండా ఎదురుచూస్తోంది కమలిని. గొంతు సరి చేసుకుని, వేయి వీణలు ఒకేసారి మ్రోగినట్టు  "సింహేంద్రమధ్యమ రాగం"లో మేలుకొలుపు పలుకుతున్నారు బయట నుంచి.

వినలేదటే వెర్రి జవరాలా!
వినియె హాయిగ పవళించేవటే!
తనితనిగ తెలవారెనని కీచుకీచుమని
మునుమునుగ ఏటిరింతలు మూగి పలికెను.

ఘల్లుమనగా కంఠసరులు కాసులపేర్లు,
జల్లగా కడల క్రొమ్ముడులు వాసనలు
గొల్ల ఇల్లాండ్రు తరిగోలలను కైకొనుచు
పెల్లుగా చల్ల తరిచే సవ్వడి

హరిని నారాయణుని కైవారముల మేము
ఆలపించిన ఆలకించనే లేదటే
దొరసాని! వౌరౌర ఓ బాల లేచి,
తెరవవే వాకిలి! ఓసి తేజోవతీ!

మెల్లిగా తలుపు తీసి "హరి..హరీ!" అంటూ చెలులను చూసి నవ్వింది కమలిని. ఆమె చిగురు పెదవులు పలికిన హరినామానికి వాళ్ళందరి ముఖాలూ వికసించాయి. స్నానమాడి, "కాత్యాయని"ని కొలిచేందుకు యమున వైపు .. లేళ్ళ మంద నీళ్ళు తాగడానికి కదిలినట్టు అందరూ గబగబా అడుగులు వేసారు.


* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..



( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)





9 comments:

  1. "అప్పుడే నడక నేర్చిన అల్లరి బుజ్జాయి వెనుక పగలంతా పరుగులు తీస్తూ, వాడు చేసే కొంటె పనులను ఓ కంట కనిపెడుతూ, వచ్చే పోయే అతిధులతో కళకళ్ళాడే పెద్ద ఇంటిని సమర్ధించే ఇల్లాలు, పొద్దు గూకిన తరువాత ఇల్లు చక్కబెట్టుకుని, పక్కలో పాపడిని పొదువుకుని అలసి సొలసి ఒళ్ళెరగక నిద్రపోయినట్టుంది.."

    ఎంత బావుందీ పోలిక!!! పల్లెలో అమ్మని చూపించేశారు.

    ~లలిత

    ReplyDelete
  2. లలిత గారు కోట్ చేసిన లైన్స్ చదివగానే వావ్.. అనుకున్నానండీ.. చాలా బాగా పోల్చారు..

    ReplyDelete
  3. >> భరతుడు అచ్చం రాముడిలాగే ఉంటాడట! తెల్లని రాముని లాగ!

    భరతుడు రూపంలోనే కాదు రంగులోనూ రాముణ్ణి పోలినవాడే, శ్యామలాంగుడే.

    ReplyDelete
  4. కామేశ్వరరావు గారు: పొరబడ్డట్టున్నానండీ! సరిచేసుకున్నాను. ధన్యవాదాలు!

    ReplyDelete
  5. అన్ని భాగాలు క్రమం తప్పకుండా చదువుతున్నా.. ప్రతి రోజూ రేపల్లెకి వెళ్లి వస్తున్నా (అని అనుకుంటున్నా.. నిజానికి రోజంతా రేపల్లెలో ఉన్న భావనే ఉంటుంది నాకు). ఇంత తియ్యని తెలుగులో, అందమైన గొల్ల పడుచుల కథల్ని, ఆ మురళీ మోహనుడి వర్ణనల్ని చదువుతూ ఉంటే, ఇంత మంచి తెలుగు రానందుకు ఈర్ష్య పడుతూనే, చదివి అనుభవించగలుగుతున్నందుకు గర్వ పడుతున్నాను:)
    అద్భుతం అన్నది చాలా చిన్న పదం అవుతుంది.

    ReplyDelete
  6. మీ ప్రతి పోస్ట్ లో రెండేసి కామెంట్లు పెడతానని మాటిచ్చాను. అయితే ఈ సీరీస్ చూస్తూ మీ సమకాలికుడిని అయినందుకు గర్విస్తున్నాను.ఇంతకు మించి ఏమీ చెప్పలేనమ్మాయ్!!!

    ReplyDelete
  7. >>.. లేళ్ళ మంద నీళ్ళు తాగడానికి కదిలినట్టు అందరూ గబగబా అడుగులు వేసారు.

    బావుంది. ప్రతీ టపా ఎంతో ఆహ్లాదంగా సాగుతోంది. ఈ మధ్యన మీ టపాలని చదవడం కుదరలేదు. మళ్లీ అందుకుంటా.

    ReplyDelete
  8. "ఓ దొరసానీ! నువ్వే ముందు ఉండి మమ్మల్ని నిద్ర లేపే దానివి.. ఈ రోజు ఇంకా నిద్దరోతున్నావేవమ్మా! కమలినీ! ఓ కృష్ణప్రియా! లే లే!" ..

    లేస్తామండీ.. ఎప్పుడో ఒకరోజు.. క్రాష్! :)

    అపర్ణ, శంకర్ గార్లు చెప్పిన మాటలే నావీనీ..

    ReplyDelete
  9. నిద్ర లేచేసరికి కృష్ణ లీలలు చెవిన పడడం అంత మధురమైన సుప్రభాత గీతిక మరొకటి ఉండదు తెలుసా!
    so true!!

    ReplyDelete