Monday, December 12, 2011

నెచ్చెలీ!!

అల్యూమినియం స్కూల్ పెట్టెల్లోపలి వైపు స్కెచ్ పెన్నుల్తో ఇద్దరం ఒకేలా రాసి అతికించుకున్న టైం టేబుల్..

ఆర్ట్ పేపర్ల బొత్తీ, డాగియర్డ్ పాటల, ముగ్గుల పుస్తకాల మధ్య వచ్చి చేరిన కవితల పుస్తకాలూ, మన కలం పేర్లూ..

మీ ఇంట్లో పూచిన ముద్ద నందివర్ధనం నా జడలో, మా ఇంటి తెల్ల చామంతులు నీ జంట వేణీబంధాల్లోనూ..

కొనుక్కు పంచుకున్న పెప్సీకోలాలూ, చిట్టి చెగోడీలూ, వేపిన శనగపప్పూ, మీ అమ్మగారు చేసిచ్చిన బెండకాయ కూరా..

వెంట సైకిలెక్కి వచ్చే కుర్రకళ్ళ ఆరాధనని ఓరకళ్ళ చూస్తూ కిసుక్కున నవ్వుకున్న ఆమధ్యే ఓణీలేసుకున్న మన గర్వం!

నీ సైకిల్ నడిపిస్తూ నేనూ, నా భుజం మీద చెయ్యి ఆన్చి రోజూ ఊరిపోయే కబుర్ల ఊటబావికి ఏతమేస్తూ నువ్వు.

అపుడప్పుడూ గొంతు పూడ్చేసే అపార్ధాల పడిశం.. కన్నీళ్ళూ ఒట్లూ సత్యాలూ దాన్ని కోసేసే 'లక్ష్మీవిలాస రస'గుళికలు.

కరెంట్ రాగానే గిర్రున తిరిగే ఫేన్ రెక్కల్లా.. కాలచక్రం ఒకేసారి పధ్ధెనిమిదేళ్ళు చకచకా తిరిగేసిందేమ్మ్.. ఆశ్చర్యం!!

మా ఇంటి పోపుల పెట్టెలో ఇంగువ ఘాటు నేను, ఆ ఇంటి ముంగిట్లో ముత్యాల 'గంధపు గిన్నె ముగ్గు'లా నువ్వు!

నీ ఒళ్ళో, నీ చీర కుచ్చిళ్ళలో ఒదిగి కూర్చునే నా బుజ్జాయి.. నా మామిడల్లం మాటలకి తల ఊచి నవ్వేసే నీ బంగారు తల్లి!  ఎంత దూరం వచ్చేసామో!!

"అడుగడుగో దినరాజు చూడూ.. పాల కడలి తరగల పైన.." అని పాడే నీ గొంతు ఇక్కడెక్కడా!? వేల మైళ్ళ దూరంలో.. నీ ఆకాశంలో వెలుగుల ఎకిమీడు - నాకు వెన్నెల రేడు!!

నా రోజుని వెలిగించే కేరమెల్ మాకియాటో, ఫేస్ బుక్ అప్ డేట్లూ, ఐఫోన్ యాప్సూ, క్యూపన్ కటింగులూ.. నీకు గ్రీకూ లాటినూ!

నువ్వేసుకునే రంగురంగుల మట్టిగాజులూ, కట్టుకునే కాటన్ చీరా, బండెక్కి ఝామ్మున తిరిగే మన ఊరి రోడ్లూ, పనిమనిషీ, చాకలీ..

చీకటి పడుతూనే నువ్వు గాఢంగా పీల్చుకుని జడలో తురుముకునే జాజుల పరిమళం, డాబా మీద నిద్ర.. ఇవన్నీ నన్నూరించే గగన కుసుమాలు.

అయినా చిన్ననాటి స్నేహం, పంచుకున్న రహస్యాలూ, చేసుకున్న బాసలూ.. పీసీ సర్కార్ ని తలదన్నే ఇంద్రజాలికులేమో !

నీ కాఫీగ్లాసుకి సాయం నేనూ, నాకు వంటింట్లో సాయం నువ్వూ.. చిటికెలో తలపుల ప్రయాణం! వీసాలూ, టికెట్ల ఖర్చూ, సెలవుల లెక్కా లేకుండా!!

"ఏవిటా పరధ్యానం! రిమోట్ ఎక్కడుందో చూసావా?" అని వినిపించే గొంతు కాస్త తపోభంగం చేస్తుందనుకో.. అయినా సరే!

నీకూ నాకూ గుత్తంగా ఇంకో వందేళ్ళ జీవితం కోరుకోవాలని ఉంది.. మనం కలిసి ఖర్చు పెట్టేసుకున్న రోజులాంటిది మళ్ళీ ఒక్కటి రాకపోతుందా అని ఆశ!

"హ్మ్మ్.. సర్లే! ఇప్పట్లో అయ్యే పనేనా!" అని నిట్టూర్పు.. ఆ వెనకే నిరాశ నిన్నూ నన్నూ ముంచేసే లోపు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పెయ్యనీ!

పండగ సెలవుల వెనకే వచ్చే హాఫ్ ఇయర్లీ మార్కుల్లా.. రేపటి నుంచీ వయసు గడిలో 'ఒకటి' కలిపి రాయాలన్న నిజం ములుకులాంటిది, నెల క్రితమేగా నాకూ గుచ్చుకుందీ!!

అయినా తప్పదు బేబీ! హేపీ బర్త్ డే!! పుట్టినరోజు శుభాకాంక్షలు, అమ్మడూ!!

                  

28 comments:

  1. wowwwwwwwww.......!!
    ఎంత చక్కటి జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ...మీ నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు భలే చెప్పారు..!!
    మీ నేస్తానికి నా తరఫున కూడా పుట్టిన రోజూ శుభాకాంక్షలు :)

    ReplyDelete
  2. That's a Wonderful Way of sending Birthday wishes to a childhood friend, Susmitha!

    Have a Fabulous Birthday - please give these wishes to your friend from me.

    - Lalitha

    ReplyDelete
  3. నీకు గుర్తుందా లేదా చెప్తావా చెప్పవా అని ఎదురుచూస్తున్నా..అన్నీ గుర్తున్నాయే.. థాంక్ యు సో మచ్..

    జస్ట్ కిడింగ్..బావుందండీ మీ స్నేహం.
    మీ స్నేహితురాలికి నా తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  4. కోవా గారు ఎంత బాగా చెప్పారో విషెస్ !

    మీ ఫ్రెండ్ కి నా నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు !

    జోతిర్మయి గారు నేను ఫస్ట్ లైన్ చదవగానే మీరే కోవా గారి ఫ్రెండ్ అనుకున్నా ఒక్క క్షణం :)))

    ReplyDelete
  5. ఎంతచక్కని శుభాకాంక్షలు, మీ నెచ్చులికి? మీ నెచ్చిలికి మా తరపునా శుభాకంక్షలు.

    ఎంత అందమైన బాల్యమూ, తీపి జ్ఞాపకాలూ? జీవముంది మీ జ్ఞాపకాలలో; జీవించిన ఆ జీవితంలో. చదివాకా మాటలు రాలేదు, ఎంతమంది ఆస్వాదించుంటారు తాటొచ్చిన కాలాన్ని? మీ కళా హృదయానికి జోహార్లు...

    ReplyDelete
  6. ఇలా ఓ పండగో, పుట్టినరోజో వస్తే గానీ కదలదేం మీ కలం? మీ నెచ్చెలికి మా తరఫున కూడా శుభాకాంక్షలు చెప్పండి.యాస్ యూసువల్ చెప్పేదేముంది మీ రాత గురించి అందరూ ఆల్రెడీ చెప్పేసారు.

    ReplyDelete
  7. మీ శుభాకాంక్షలు చాలా బాగున్నాయ్ అండీ... మీ నెచ్చెలిగారికి నా తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  8. శ్రావ్య గారూ ఒక్క క్షణం అనుకోవడమేమిట౦డీ..నేను తన ఫ్రెండ్ నో కాదో కోవాగార్నే అడగండి..

    ReplyDelete
  9. వావ్... నా శుభాకాంక్షలు కూడా కలుపుకోండి....

    ReplyDelete
  10. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలా కూడా చెప్పచ్చన్నమాట,సరిలేరు మీకెవ్వరూ నోరూరించే కొత్తావకాయ గారికి సరిలేరు మీకెవ్వరూ... (మీ నెచ్చెలికి నా తరపున కూడా శుభాకాంక్షలు తెలియచెయ్యండి)

    ReplyDelete
  11. వేణీ బంధాలు, ఓణీ లేసుకున్న గర్వం, లక్ష్మీ విలాస రస గుళికలూ, గంధపు గిన్నె ముగ్గు, కరుణ శ్రీ చూపిన వెలుగుల ఎకిమీడు.... ఆహా అమ్మాయీ! తేట తెలుగు పదాలతో విందు చేస్తున్నావు! నిన్ను మించిన భావుకురాలు ఉండరేమో! శభాష్! మావిడల్లం మాటలా.. నీవి? బెల్లం ముక్కలైతేనూ!

    ReplyDelete
  12. మీ నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు !

    ReplyDelete
  13. చిన్ననాటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నేస్తానికి పుట్టినరోజు శుభాకాంక్షలు - అద్బుతం అండి.

    Happy returns of the day to your friend

    ReplyDelete
  14. :( :( :(..నేనెళ్ళిపోయాను మన స్కూలికెళ్ళిపోయాను నా తలపుల తలుపులు తెరుచుకుని మరీ వెళ్ళిపోయాను.
    నువ్వు చెప్పిన ప్రతీ వాక్యం వెనుక దృశ్యాలు కళ్ళముందు గిర్రున తిరిగాయే!
    మన నేస్తానికి పుట్టినరోజు శుభాకంక్షలు!

    ReplyDelete
  15. మీ రచనలు చదివాక కాసేపు ఆ అనుభూతిలో ఉండిపోయి బహు ప్రయత్నం మీద బయటపడ్డాక మీ రచనాశైలినీ, మీ చక్కటి భాషనీ మెచ్చుకుంటూ వ్యాఖ్య రాయాలనిపించినా ఆ అనుభూతిని మాటల్లో పెట్టలేని నా అశక్తతకి నా మీద నేనే అలిగి మీ టపా మరోసారి చదువుకుని మౌనంగా వెనుదిరిగిపోతుంటాను.

    ReplyDelete
  16. శిశిర గారి కామెంటు కి డిట్టో.

    మీ నెచ్చెలి కి శుభాకాంక్షలు.

    ReplyDelete
  17. How Sweet!!
    Happy birthday to your friend! :)

    ReplyDelete
  18. మీ అభినందనల ముందు మేమెన్ని చెప్పినా సూర్యుడి ముందు దివిటీల్లాగా వెలవెలబోతాయి. ఐనా సరే .

    మీ నెచ్చిలికి యాపీ బర్త్ డే..

    ReplyDelete
  19. ఏమిటో వ్రాద్దామనుకున్నా, ఈ బులుసాయనోరు ! ఆయనలాగే , శిశిర గారి వ్యాఖ్యలకి డిట్టో...

    ReplyDelete
  20. హ హ జోతిర్మయి గారు కొట్టారు దెబ్బ లాజిక్ తో :))) కానీ ఈ శుభాకాంక్షలు అందుకుంటున్న ఫ్రెండ్ మీరు కాదు కదా :))

    ReplyDelete
  21. @ kiran: ధన్యవాదాలండీ! మీ అందరి శుభాకాంక్షలూ నా నేస్తానికి అందించేసాను.

    @ లలిత: :) ధన్యవాదాలు!

    @ జ్యోతిర్మయి: అయ్యో భలేవారే!! మర్చిపోతానా? ధన్యవాదాలండీ!

    @ Sravya Vattikuti: తప్పకుండానండీ! ధన్యవాదాలు.

    @ అవినేని భాస్కర్: మీ ప్రశంసకీ, శుభాకాంక్షలకూ బోలెడు ధన్యవాదాలు.

    @ sunita: కదిలేదీ కదిలించేదీ.. ఏదో ఒక కారణం ఉండాలి కదండీ! తరచూ రాయాలనే నా ఆశ కూడా! ధన్యవాదాలు.

    @ వేణూశ్రీకాంత్: అలాగేనండీ! ధన్యవాదాలు.

    ReplyDelete
  22. @ శ్రీనివాస్ పప్పు: ఏం మాట్లాడగలను సర్! ధన్యవాదాలు, అంతే!

    @ Anonymous: ధన్యోస్మి!

    @ తృష్ణ: చెప్తానండీ! ధన్యవాదాలు.

    @ నాగార్జున: ధన్యవాదాలండీ!

    @ ఆ. సౌమ్య: నేనూ చిన్నప్పటి రోజులే గుర్తు చేసుకుంటున్నాను ఈ రోజంతా!

    @ శిశిర: ఎంత పెద్ద ప్రశంస! ధన్యవాదాలండీ!

    ReplyDelete
  23. ప్చ్... అధ్బుతమండీ...
    ఎక్కడికో తీసుకుపోయారు..

    మీ ఫ్రెండ్ కి నా తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండీ.

    ReplyDelete
  24. @ బులుసు సుబ్రహ్మణ్యం గారు: ధన్యవాదాలండీ!

    @ మధురవాణి: ధన్యవాదాలు!

    @ జ్యోతి: ఎంతమాట! మీ అందరి శుభాకాంక్షలూ నా స్నేహితురాలి పుట్టినరోజుని దేదీప్యమానంగా వెలిగించాయి. ధన్యవాదాలండీ!

    @ ఫణిబాబు గారు: :) ధన్యవాదాలండీ!

    @ Sravya Vattikuti: :)

    @ రాజ్ కుమార్: ధన్యవాదాలు!

    ReplyDelete
  25. sorry for writing in english. but i imdtly wanna give comment.

    superb ! this is the first post am reading of yrs.
    chaala chaala rojula tarvatha oka acha telugu kavitha/jnapakam chadivanu. no words. am feeling so happy for the nativity u have explained here. basically am fan of Vamsi pasalapaudi stories, mullapudi garu, yendamuri.. so this reminded me those explanations of Godavari :)

    thanks andi. luvd it.

    ReplyDelete
  26. sorry for writing in english. but i imdtly wanna give comment.

    superb ! this is the first post am reading of yrs.
    chaala chaala rojula tarvatha oka acha telugu kavitha/jnapakam chadivanu. no words. am feeling so happy for the nativity u have explained here. basically am fan of Vamsi pasalapaudi stories, mullapudi garu, yendamuri.. so this reminded me those explanations of Godavari :)

    thanks andi. luvd it.

    ReplyDelete
  27. @ Nachiketa: మీ వ్యాఖ్యలో ఆనందం చూసి చాలా సంతోషమనిపించింది. ధన్యవాదాలు!

    ReplyDelete
  28. చాలా బాగుంది. చదివిన తర్వాత లోపల తెలియని చక్కటి భావన నిండింది. చాలా బాగుంది.

    ReplyDelete