Saturday, April 30, 2011

మిలియన్ డాలర్ ప్రశ్నలు (సమాధానం లేనివి)

పిల్లలు చిన్నప్పుడే ముద్దొస్తారెందుకు?
కాఫీ తాగుతున్నప్పుడే ఫోన్ మోగుతుందెందుకు?
కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడే 'ఆచ్' వెళ్ళడం కుదరదెందుకు?
హాండ్ బేగ్ చేతిలో లేకపోతే నగ్నంగా ఉన్నామనిపిస్తుందెందుకు?
పోపు వేగుతున్నప్పుడే చిట్టితండ్రికి దెబ్బ తగులుతుందెందుకు?
వంకాయ కూర వండిన రోజే చుట్టాలొస్తారెందుకు?
మనం ఫోన్ చెయ్యని రోజే అత్తగారి పుట్టిన రోజవుతుందెందుకు?
ముప్పైయేళ్ళ కంటే ఇరవై తొమ్మిది చాలా చిన్న వయసనిపిస్తుందెందుకు?
జాన్ కార్బెట్ మా వెనకింట్లో పుట్టలేదెందుకు?
మనం వింటున్న హిందీ పాట ఇంట్లోవాళ్లకి " *** గోల" అవుతుందెందుకు?
నచ్చిన షర్ట్ మన సైజులో తయారు చెయ్యరెందుకు?
శనివారం రావడానికి ఆరురోజులు పడుతుందెందుకు?
సగం దూరం వెళ్ళాక 'తాళం వేసామా?'అనే అనుమానం ఎందుకు?
బబుల్ గం కంటే ఆవకాయ డొక్క రుచిగా ఉంటుందెందుకు?
మొగలి పొత్తి సువాసన కళ్ళు మూసుకుని ఊహించుకోగలమెందుకు?
తాతగారిని తలుచుకున్నప్పుడల్లా మన వయసు 'పది' దాటదు ఎందుకు?
పుస్తకం చదువుతున్నప్పుడు పక్క వారి ఘోష వినబడదెందుకు?
నచ్చిన పని చేసేందుకు ఇరవై అయిదో గంట పుడుతుందెందుకు?
చక్కగా కబుర్లు చెప్పే నేస్తానికి టైం అసలుండదెందుకు?
వీసా కార్డ్ కన్నా మూడు సింహాలున్న నోటు అందంగా ఉంటుందెందుకు?
రూపాయికి నలభై ఎనిమిది డాలర్లవలేదెందుకు?
నాన్న ఇచ్చిన డబ్బులే 'మన సొంతం' అనిపిస్తాయెందుకు?
అమ్మ ఇంటికి మన మంచం కింద నుంచి సొరంగమార్గం ఉండదెందుకు?

Saturday, April 16, 2011

వాగుడు కాయ

నోటికి అలుపు లేకుండా, తోచినది తెగ వాగే వాళ్ళని 'వాగుడుకాయం'టారు కదా! 'తల కాయ', 'సత్ర కాయ' లాంటి పద ప్రయోగమే 'వాగుడు కాయ' కూడా అనుకుంటా. అసలీ 'కాయ' కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చిందా అని నాకో సందేహం.  నాకు తెలిసి చెవుల తుప్పొదలగొట్టే కాయలేవీ ఇలాతలం పై లేవు మరి. బూదరాజు రాధాకృష్ణ గారేమంటారో!

ఊరు నిద్ర లేవక ముందు మనం నిద్ర లేచినప్పుడో, మనం మాట్లాడాలనుకున్న వాళ్ళ ఫోన్ ఎంగేజ్డ్ గా ఉన్నప్పుడో, జనాలు మనని అదృశ్య పదార్ధం గానో, ఆకాశ వాణి గానో లెక్కేసి పక్కకి తోసేసినప్పుడో, మానవ మాత్రులన్నవారికి తిక్క రేగడం అతి సహజం.  అరే, మణులడిగామా? మాన్యాలిమ్మన్నామా? మాట్లాడదామంటే వినే నాధుడే కరువాయే! కండూతి ఎలాగైనా తీర్చుకుందామనుకున్న వారికి బ్లాగు ఒక భేషైన మాధ్యమం. మన గోల మనది. ఎంచక్కా ముచ్చటైన అక్షరాలలో మన సొద ఏ వారపత్రికలోనో ప్రచురించేసినంత ఆనందం, మహత్తరమైన మనఃశాంతి చిటుక్కున దొరికేస్తాయి. చదివించేలా రాయగలిగిన వాళ్లకి కామెంట్లు , కొండొకచో తలంట్లూను. ఏతావాతా బ్లాగంటే సోది, సొదా.. అమరంలో 'ఆత్మఘోష'.

దీనిలో కూడా సుమతీ శతక కారుడి సిధ్ధాంతీకరణని దాటిపోకుండా నొప్పించక, తానొవ్వక పోకపొతే లేనిపోని తలనొప్పులు తప్పని సరి. 'పుర్రెకి తోచినది రాసిపారేద్దాం'  అనిపించినప్పుడల్లా కనిపించని కళ్ళాలు వెనక్కి లాగుతూ ఉంటాయి. ఆ మధ్య రక్తపోటు తెగ పెరిగిపోయి, మూడో కంటివాడికి తెలియకుండా  కొత్త బ్లాగు మొదలెట్టేద్దామనుకున్నాను. పేర్లు కూడా ఆలోచించానండోయ్! 'మొదటి దానికి మొగుడు లేడు కానీ, కడ దానికి కల్యాణం.' లాంటి సామెతలు గుర్తొస్తున్నాయా? నాకు తెలుసు. 'రహస్య స్నేహితుడనో', 'ఝంఝా మారుతమనో' పేరు పెట్టేసి, నా బ్లాగుతో ప్రపంచాన్ని ఒక ఊపు ఊపెయ్యాలనిపించింది. నా ఏకైక మనసుని కెలికే ఏ భావానికీ వెన్ను చూపించకుండా రాయాలనిపించింది. సాధ్యమా?

మనం ఏం చేసినా, అసలేమీ చెయ్యకపోయినా  'ఓహో..'అని పొగిడే స్నేహితులు, డైరీ,  అద్దం ఎలాంటివో బ్లాగూ అలాంటిదేనాయే. మళ్ళీ ఇందులోనూ అసలు బ్లాగు, రహస్య బ్లాగు అని  కల్తీ చెయ్యడానికి మనసొప్పలేదు. అయినా ముసుగేసుకొని యుధ్ధం చేసేందుకు 'అపరిచితుడినేం' కాదే!  నేను రాసేవి ఎవరికీ తెలియనివో, మార్పుని నలుదిశలా అక్షరాలతో వెదజల్లేవో కాదే!  ఇంతోటి పోచుకోలు కబుర్లని కూడా ఫిల్టర్ చేసేసి ఆత్మ ద్రోహం చేసుకుంటున్నానా?!  అడ్డెడ్డెడ్డే..!!

ఆత్మ బంధువొకడు చెప్పాడు. 'పది మందిలో తొమ్మిది మందికి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేసి, నువ్వు అనుకున్న ఒక్కడికీ మాత్రమే అసలు విషయం చేరవెయ్యగలిగే సామర్ధ్యమే బ్లాగింగ్ అని.' నవ్వొచ్చింది. నిజమే అనిపించింది. నేనేం రహస్యాలు చేరవెయ్యక్కర్లేదు కానీ, నాకు రాయాలనిపించే బోలెడు విషయాల్ని మనసులో మింగెయ్యకుండా రాసేస్తే చాలు. నా బ్లాగుకి, నా రక్తపోటుకి న్యాయం చేసినట్టే. అందుకని కొత్తావకాయలోనే వాగుడు కాయని కలిపి పచ్చడి పెట్టేద్దామని నిర్ణయించేసుకున్నాను.