Friday, May 27, 2011

తెల్లవారు వచ్చె

"నలుపు నారాయణుడు మెచ్చు" అని నానుడి ప్రత్యేకంగా చెప్పాలి గాని, "తెలుపు నరులెల్లరూ మెచ్చు." అందర్లాగే నాకూ తెల్లని మల్లెలన్నా, తెలతెల్లని మంచు జల్లులన్నా, నేను వలస వచ్చిన దేశపు తెల్లవాళ్ళన్నా మంచి అభిప్రాయమే ఉంది. "స్మిత భాషణం, స్మిత పూర్వభాషణం రాముడి లక్షణాలని వాల్మీకి వర్ణిస్తాడూ.. అవి అమెరికా ప్రజలక్కూడా ఉన్న లక్షణాలోయ్.. " అని మా మాతామహులు వారి అమెరికా ట్రావెలాగ్లో రాసుకున్నారు.  చిన్నప్పుడే నేను  అది చదివి 'అహ్హా.." అని నోరెళ్ళబెట్టి నమ్మేసాను కూడా. గువ్వలన్నీ వాటి గూట్లో అవి ఆనందంగా గడిపేస్తూ ఉన్నాయ్ .

ఇంతలో, ఓ శుభసాయంత్రాన కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన శ్రీవారు చెప్పారు. వారి తెల్ల బాసు, పెళ్ళాం గారు సాపాటికి వస్తారని. వచ్చేసింది. అమెరికా వెళ్ళిన ప్రతి భారత నారికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే రోజు.. తెల్ల వాండ్రకు వండిపెట్టే రోజు. విశేషణాలేం వాడదలచుకోలేదు. అప్పటికే చాలా మంది చెప్పడం వల్లా, చాలా బ్లాగుల్లో తెల్లవారితో మనవారి బంతి భోజనాల ముచ్చట్లు విన్నందువల్లా నేనేం పెద్దగా చలించలేదు.

ఆ రోజు వచ్చింది. మెనూ మీకు చెప్పకపోతే ఎలా? బుట్ట పకోడీ (భయపడకండి. కేబేజీని బుట్ట అని, కాలీ ఫ్లవర్ని పువ్వు అని మా నాయనమ్మ భాషలో పిలుచుదురు.) ఏం చెప్తున్నాను? ఆ.. బుట్ట పకోడీ, మినీ మసాలా దోసె, బాసుపత్నికి ఇష్టమని చెప్పిందని బంగాళదుంప - పువ్వు కూర, (ఆలూ గోబీ), చీస్ లేనిదే వాళ్ళ పొట్ట బరువెక్కించలేం కనుక పనీర్ బటర్ మసాలా, వెజ్ బిర్యానీ, ఆఖరున సేమ్యా పాయసం విత్ వెనిల్లా ఐస్క్రీం. విందుకి పిలిచిన మరో జంట భారతీయులే. ఆవిడ ఈ శతాబ్దపు రుచికరమైన మైసూర్ పాక్ లు చేసి తెచ్చింది.

అనుకున్న సమయానికి అనుకున్నట్టు కేథీ సమేత కెన్ మహాశయులు విచ్చేసారు. అట్టహాసాలు, వావ్ లు.. మా అద్దె గృహమును "వాహ్ టే బ్యూటిఫుల్ కొంపని" మెచ్చి మురిసిపోవడాలు, ఆ రోజు విందుకు విచ్చేసిన మరో ఇండియన్ జంట పిల్లల్ని, నా పిల్లాడిని మెచ్చి ముద్దిచ్చి బొమ్మలిచ్చి ఆనందించడము జరిగింది. తెల్లవారితో కబుర్లలో సాధారణ టాపిక్ లు, మన పెళ్ళిళ్ళు, తలిదండ్రులతో కలిసి ఉండడం, వెజిటేరియనిసం (ఇక్కడా వీగన్ లు ఉన్నప్పటికిన్నీ) ఇలా ఉంటుందని నేను చెప్పక్కర్లేదుగా. ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఎలా నడిచిందయ్యా అంటే..

"ఎన్నేళ్ళయింది మీకు పెళ్ళయి?" బాసిణి ప్రశ్న.
"ఎనిమిది."
"పెద్దలు కుదిర్చిన పెళ్ళేనా? అలా ఎలా చేసుకుంటారు?"
"అయ్యో రాత. పెద్దలు కుదిర్చినదైనా, మనం కుదుర్చుకున్నదైనా పెళ్ళంటూ అయితే ఆపై అంతా మిధ్య తల్లీ"
"మీ బుడ్డోడికి కూడా మీరే కుదురుస్తారా?"
నోటి దురద ఆపుకోలేక జోకొకటి పేలుద్దామనుకొని అక్కడున్న మన ఇండియన్ జంట మనో భావాలను దెబ్బతీయడం ఇష్టం లేక ఊరుకున్నాను.

ఇక్కడ చిన్న వెనుక వెలుగు. అనగా ఫ్లాష్ బాక్. మా ముత్తవ్వ గారి ముత్తవ్వ గారు మంచి ఎండలో భోజనం వేళకి వచ్చిన ఒక మహామునికి తన వాటా "పణత పొట్లకాయల కూర" తో భోజనం పెట్టారట. ఆ రుచికి, త్యాగానికి మెచ్చిన మునివర్యులు వరమిచ్చారట. ఇంట పుట్టిన ఆడ పిల్లలు ఎదురులేని తేజస్సు గలిగి ఉంటారని. ఆయనే దూర్వాస ముని. ఆ తేజం ముక్కోపం. కట్ చేస్తే నా పెళ్ళిలో ఎదుర్కోలు పానకపు బిందెల దగ్గర మా తండ్రిగారు తినిపించిన లడ్డూని మాత్రమే తిని చెయ్యి భద్రంగా వాపసు ఇచ్చేసిన నా పతిదేవుని భోళాతనానికి మెచ్చి, నా దుర్వాస మానస పుత్రిక అంశను, కోడి గుడ్డుకు ఈకలు పీకే అంశను పుట్టింట్లో ఉట్టి మీద వదిలి వెళ్ళమని నా చేత ప్రమాణం చేయించుకున్నాకే, నన్ను కన్యాదానం చేసారు మా తండ్రిగారు. అప్పటి నుంచి నేను చూసీ చూడనట్టు అన్ని విషయాలు లైట్ తీస్కుంటూ ఉంటాను. నేను మెతకదానినని, అమాయకురాలిననీ, ఏ అభిప్రాయం లేనిదానినని భ్రమించే జనులను చూసి ఆడ 'ఇంద్ర' లా మనసులో "వెర్రి వాళ్ళారా..! " అని నిట్టూరుస్తూ ఉంటాను. ప్రపంచ శాంతి కోసం మా పితృదేవులు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యకి కట్టుబడి ఉన్నానన్న మాట.

"మీ తలిదండ్రులు ఎప్పుడూ దెబ్బలాడుకోలేదా? డైవోర్స్ అనే పధ్ధతే లేదా? పెళ్ళయిన రెండు నెలలకు మొగుడు నచ్చలేదనుకో,కరకర ఏం కర చేసేదానివి?" పకోడీ ప్లేట్ చేత ధరించిన బాసు సుందరి మరో ప్రశ్న.
దీన్సిగతరగా.. నా జీవితం గురించి నాకున్న ప్రశ్నలు చాలవా, ఏం?  కానీ అక్కడ మళ్ళీ నోరు పెగలదు నా బోటి వాళ్ళకి.
"Luckily we survived to bug each other.. హిహ్హీ"  ఛీ.. నా జీవితం.
కాసేపు ఈ కబుర్లు, ఆ కబుర్లు చెప్తూ వండినదంతా తోడుకు తినేసామా?
"సో, మీ అమ్మ వాళ్ళూ గుర్తొస్తారా? మిస్ అవరా? మీకు ఇక్కడ నచ్చిందా? ఇండియా బాగుంటుందా?"

పురజనులారా, అర్ధం అయిన వాళ్ళు కాసేపు రామ నామ స్మరణ చేస్కోండి. కానివాండ్ర కళ్ళు తెరిపించాలి నేను.

"ఓ ప్రభూ, యే ఇంట్లో కోడళ్ళు ప్రాంతీయతా భావాలని తోసిరాజని పుట్టింటి వంటల్ని వండగలరో,
యే ప్రాంతంలో విగ్రహాలు విద్వేషాలకు బలికాకుండా ప్రేమ పాత్రమవుతాయో, గర్వకారణమవుతాయో,
యే రాష్ట్రంలో పూతరేకులు, దం బిర్యానీ సమానంగా ఆదరించబడి ఆనందించబడతాయో,
యే దేశంలో రాష్ట్రాలు తోడేళ్ళు, గురివిందల ప్రమేయంలేకుండా సదుపాయమే ప్రాతిపదికగా విభజించబడతాయో,
యే ప్రపంచంలో తెలివితేటలు అవకాశాలతో పాటు అసూయని కొనితెచ్చి ద్వేషించబడవో,
యే లోకంలో సహనం, గుట్టుగా ఉండడం చవలాయ్ తనం గాను,భావ దారిద్ర్యం/రాహిత్యం గాను పరిగణించబడవో,
యే కుటుంబంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు గిఫ్ట్ గా ఇవ్వబడి, " పోవోయ్, ఇది నీకెందుకూ " అని వెనక్కి తీసుకోబడవో,
అలాంటి ఉదయంలో, అలాంటి ప్రపంచంలో నన్ను, నా ప్రపంచాన్ని నిద్రలేవనీ ప్రభూ.. !

(టాగోర్ కి ప్రేమతో కూడిన క్షమాపణలతో)

P.S. : "Don't you miss your parents? Are you gonna stay or go back?"
"Yeah, I do miss'em but after getting married wherever you be with your kids, that's home. Provided, a husband to pay the bills."

సర్వే జనా సుఖినోభవంతు

Saturday, May 21, 2011

పాపాల భైరవుడు, గంగా బొండాం మరియు ఇంకొంతమంది

కుక్కపిల్లకైనా, కాఫీ షాపుకైనా, పుస్తకాలకైనా, బ్లాగు రాతలకైనా, వీటన్నింటినీ ప్రేమించే మనిషన్నవాడికైనా ఓ 'పేరు' కావాలి. ఎదుటివాడు పిలవడానికి, పదిమందిలో ఉదహరించడానికి, ఆ పై ఒళ్ళు మండితే తిట్టుకోడానికీ.

పేర్లు ముఖ్యం గా మూడు రకాలని నేను విభజించాను. మనం పుట్టగానే తేరగా నోరులేని, కాదనలేని, కదిలి పారిపోలేని ప్రాణి దొరికిందని అమ్మో, మేనత్తో, తాతో చంకలు గుద్దుకొని, వాళ్ళ భాషా ప్రావీణ్యం ప్రదర్శించి, వాళ్ళ వాళ్ళ కవి హృదయాలను గోకి నిద్రలేపి మరీ ఓ మూడు నుంచి మున్నూట అరవై అక్షరాల పేరు మన మొహాన తగిలించేస్తారు. బ్రహ్మ ఏం రాసి పంపాడో జాన్తా నహీ కాని, వీరు రాసిన పేరు మనం జీవితమంతా రకరకాల ఫాంట్స్ లో, రకరకాల భావోద్వేగాలతో రాస్తూనే ఉంటాం. అడిగినవాడికి కాదనకుండా కరక్టుగా మనం చెప్పేది మన పేరు మాత్రమే. (అక్రమ కార్య కలాపాలు నడిపే వారికి మరియు బ్లాగు ఓనర్లకు మినహాయింపు కలదు.)

"మా ఇంట్లో పుట్టిన పిల్లలు ఆడైనా, మగైనా "శ్రీ" తో మొదలయ్యే పేరే పెడతామని" ఊసుపోక కొత్త పెళ్ళాంతో చెప్పాడొక శ్రీధరుడు. "అదేం రూలోయ్ ! అన్ని పేర్లకీ "శ్రీ"తో జత కుదురుతుందా! లేక అలా మొదలయ్యే పేరుతో సర్దుకుపోవాలా? అని నెవ్వెరబోయింది ఆ భార్యామణి. "హాత్తెరీ, మా సాంప్రదాయం, గోంగూర" అని గిల్లి కజ్జా పెట్టుకున్నాడతను. మర్నాటి నుంచి పెంపుడు కుక్కపిల్లని "శ్రీ స్నూపీ" అని పిలుస్తున్న భార్య చతురతని, అన్యాపదేశంగా అంటించిన చురకని చూసి నవ్వుకున్నాడో, తేలుకుట్టిన దొంగలా ఊరకున్నాడో మీ ఊహకే వదిలేస్తున్నాను.

పిల్లలకు పెట్టే అర్ధం పర్ధం లేని పేర్లని, అరువు సంస్కృతిని చాకి రేవు పెట్టే పేరా ఈ పోస్టులో లేదు. కాసిని పేర్లు మాత్రం సూచిస్తా. నచ్చితే విచ్చలవిడిగా వాడేస్కోండి. మధుమేహ, ఆవేష్, భవ్క్త్యస్య... ఊ.. ఇంకా.. గూగుల్ కూడా బావుంటుందండోయ్!

పేర్ల లో రెండో రకం అబ్బో.. మీకు చెప్పక్కర్లేదు. ముద్దు పేర్లు.. బుజ్జి, చిట్టీ, లతా మంగేష్కరు, మా హీరోయిన్, మా చంటి వాడు, మా హనీ, స్వీటీ, కుకీ, చెగోడీ, సన్నీ.. "ప్రద్యుమ్న" అని కొడుక్కి పేరు పెట్టుకున్నావిడ, వాడిని 'నందూ' అని ఎందుకు పిలుస్తుందో నాకు అర్ధం కాలేదు. అడిగి తెలుసుకున్నాను లెండి అదో ముద్దు పేరని. ముద్దు పేరు అందమైన నా పేరు కి ప్రత్యామ్నాయం, చిన్నతనం, అనవసరం అని నిర్ణయించుకొని నాకు ముద్దు పేరు నేను పెట్టుకోలేదు. సర్వకాల సర్వావస్థలయందూ భవదీయురాలు అచ్చంగా "కొత్తావకాయే".

"శ్రీమన్మహారాజ! మార్తాండ తేజా! ప్రియానంద భోజా!  ఏ తల్లి కుమారులో తెలియదు గానీ, ఎంతటి సుకుమారులో తెలుసును నాకు"
ఎర్ర ఓణీ వేసుకొని విరజాజిలా నవ్వుతున్న పూర్ణిమ గుర్తొచ్చిందా? "అహా..ఏం రాసారు మాష్టారూ!" అని వేటూరి ని తలుచుకొని, స్వర్గంలో అమృతం కాఫీ కప్పులో పోసుకు ఆరారా తాగుతున్నాయనకి వెక్కిళ్ళు తెప్పించారా? నాకు మాత్రం "అసలేం రాజయోగం ఆనందరావ్ ది!" అనిపిస్తుంది.

ఈ పాట వింటే మగాడిని పేరు పెట్టి పిలిచే ప్రతి భార్యా గుర్తొస్తుంది. తప్పని కాదు, కూడదని కాదు, ఆయుఃక్షీణమని అసలు కాదు. సమానత్వం వద్దనీ కాదు. " శ్రీవారూ! కరంట్ బిల్ వచ్చింది. ప్రాణ నాధా! తడి టవల్ మంచం మీద పడేస్తే పీక నొక్కుతా!" అనమనీ కాదు. గౌరవం బయటకు చూపించి, చాటున గారాలు పోవడం ఆడదానికి అందం. గంభీరంగా కనిపిస్తూ, మాటుగా మగువ పాదాలైనా ఒత్తడం మనసులేలే దొరల రాచలక్షణం. కొత్తావకాయ కాదు "పాత చింతకాయ పచ్చడి" అని విసుక్కుంటున్నారా? హ్హహ్హాహ్హా.. వంద సార్లు పేరు పెట్టి పిలిచేసుకొని , ముద్దొస్తే ఊరందరూ పిలుచుకునే అదే హనీ, స్వీటీ అని పిలిచేసుకుంటున్నారే.. అయ్యో.. మారు పేర్ల మాధుర్యం మిస్ అయిపోతున్నారేమో అని నా ఘోష. అవడం లేదా..? గుడ్ టు నో.

నాణానికి రెండో వైపు నండూరి వారి ఎంకి మాటల్లో :

ఏకాంతమునైన "ఎంకి" యని పిలువడే
చెప్పన్ని పెర్లెట్టు - చెప్పుకుంటే రట్టు
పక్షి పేరొక మారు, పండు పేరొక మారు
రాలేన ఒక తీరు - పూలేన పలుమారు!

ఏనాటి వరములో ఈ నాగరీకాలు
పాటలో తన పరువె, బతుకులో బరువటే?

(ఇది వెలితా? మురిపెమా? మురిపాలలో వెలితా?)

ముద్దు పేర్ల అంకం దాటి ముందుకొస్తే వ్యవహారిక నామాలు. సదరు వ్యక్తుల వింత చేష్టలు, విచిత్రమైన పోకడలు చూసి, అభిమానం తో, అంతులేని అదో రకం ప్రేమతో ఇచ్చే శాశ్వత విశేషణాలను "బిరుదులు" అంటారు. ఆంగ్లమున "నిక్ నేంస్".

నోటి పూత లాగే కొందరు మనుషులకి నోటి దురద ఉంటుంది. అది శాశ్వతమైన జబ్బు కూడా!. చమత్కారానికి నోటి దురద తోడైతే మహా సరదాగా ఉంటుంది, వినేవాళ్ళకి. మా పెదనాన్న ఒకాయనకి ఈ రెండు లక్షణాలు ఉన్నాయ్. శంకరాభరణం బుట్టలు పెట్టుకున్న మా పెద్దమ్మని ఎన్నాళ్ళో " జుంకిణీ" అనేవారాయన. ( జుంకీలు = శంకరాభరణం చెవి లోలకులు) 'నిన్నే పెళ్ళాడతా' సినిమ టీవీ లో వస్తూంటే గిరజాల నాగార్జున ని చూసి "ఒయ్.. ఎవరోయ్ ఈ "గిరజుడు"? మన నాగేస్సర్రావ్ కొడుకేనా?" అని అడిగారు. కొంచెం అందం పాళ్ళు తక్కువున్న ఎవడు కనిపించినా " వీడెవడు? ఝెట్కా వాడిలా ఉన్నాడు? ఆ పిల్లా? ఇత్తడి సిబ్బీ!" అని ఎన్ని వంకలు పెట్టే వారో. తప్పే కానీ ఆయన సందర్భ స్పూర్తి కి నవ్వని వాడు లేడు. ఆయన పెట్టిన పేర్లు మర్చిపోయే వాళ్ళం కాదు. ఉప్మా లో పోపు గింజలు ఎక్కువయ్యాయని "అమ్మలూ! మినప గుళ్లనుకొని ఇనప గుళ్ళేసావే తాలింపులో" అని నవ్వారొక రోజు.  పోపుల డబ్బా చూసిన ప్రతిసారీ ఆయన గుర్తొస్తారు నాకు.

ఇన్ని తాళ్ళను తన్నిన  పెదనాన్న గారిని, తలదన్నే వాడు ఆయన కొడుకు. "తినేస్తున్నాడే బాబు! బాల మిత్ర రాక్షసుడు!" అని చాటుగా తండ్రిని విసుక్కున్నాడొసారి. నిజమే! కోర పళ్ళు, జులపాలు, బాన పొట్ట, నలుపుకి  ఒక్క ఛాయ తక్కువలో, నూరు కేజీలతో అలరారే  పెదనాన్న అచ్చం "బాల మిత్ర ముఖ చిత్ర రాక్షసుడే"!

వీధి చివరి మేడింట్లో మెట్ల మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళతో కబుర్లు చెప్పే అక్కచెల్లెళ్ళ గుంపు ని "సాలభంజిక"లని పిలుచుకునే వాళ్ళం. ఒక సాలభంజిక అలా కుర్చొని కూర్చొని, ఎదురింటి బీఈడీ కుర్రాడితో "కబూతర్ జా.. జా.." పాడేసింది లెండి. అది వేరే కథ.

మా ఇంటికి మా బావ కోసం, ఇద్దరు స్నేహితులు వచ్చేవారు. ఒకతను ఎర్రగా రాజమండ్రి జాంపండులా ఉంటే, ఒకతను నారాయణుడు. అంటే నల్లని వాడు, పద్మ నయనమ్ముల వాడనమాట. వాళ్ళ పేర్లేమిటో ఈ రోజుకి నాకు తెలియదు. వాళ్ళ ని చూడడమే తరువాయి, మా నాయనమ్మ ఒక్క అరుపు అరిచి పిలిచేది మా బావని. " ఒరేయ్ రంగా, ఎర్ర వాడూ, నల్ల వాడూ వచ్చార్రా!" అని. పాపం ఎర్రబ్బాయ్ కేం కానీ, నల్లబ్బాయ్ మాత్రం ఆ మాట వినగానే జేగురు రంగులోకి మారిపోయే వాడు అవమానంతో. పెద్దావిడ పెట్టే జంతికలు, చెగోడీలు తిని ప్రసన్నంగా వెళ్ళేవాడనుకోండి.

మా బంధువొకావిడకి సౌలభ్యం (మాడెస్టీ) పాళ్ళెక్కువ. అదోరకం మాడెస్టీ లెండి. ఎవరు కనిపించినా " నాన్నా! బాగున్నావా! నిన్నే కలలోకొచ్చావు రా! నిన్నే తలుచుకుంటున్నాను!" అని ఎంత ప్రేమ ఒలకబోసేస్తుందో! ప్రేమని తుడిచి పారబొయ్యలేక చచ్చే వాళ్ళం. వరసగా పెళ్ళి పందిట్లో వాళ్ళందరికీ వేరే పనేం లేదా?
"ఆవిడ రోజుకి ఎన్ని గంటలు పడుకుంటుందే!" అడిగాడు ఓ అన్నయ్య నన్ను పక్కకి పిలిచి.
"పోన్లేరా, పెద్దావిడ" అన్నాను నవ్వుతూ.
"ఈ రోజు రాత్రి తొందర గా పడుకోండందరూ! స్లీపింగ్ బ్యూటి కలలోకి కట్టగట్టుకొని వెళ్ళాలి కదా!"
గొల్లుమన్నారు జనాలు. పెళ్ళి అయ్యే దాక ఆవిడ నోరు విప్పి మళ్ళీ ఎవరిని పలకరించలేదు.

"పాపం, టెంత్ పరిక్షలు రాసాడట కదా! మీ చిన్నవాడు. పాపం రిజల్ట్స్ ఎప్పుడూ? ఫస్ట్ క్లాస్ వచ్చిందా? తెలివైన పిల్లాడే పాపం!" ఇవి పాపాల భైరవుల కబుర్లు.

పేర్లు చేసే మేలు చెప్పనా! నా పెళ్ళయిన కొత్తలో జరిగిన మేనమామ కూతురి పెళ్ళికి పతిని, పట్టు చీరలని ప్రదర్శించే నిమిత్తం హాజరయ్యాను. సందట్లో సడేమిటంటే..
"ఏమే, గంగా బోండాం! ఎప్పుడొచ్చావ్?" అంటూ నా భుజం బద్దలయ్యేలా ఓ చరుపు చరిచి, పలకరించింది మా పెద్దమ్మ కూతురు. పక్కనే కూర్చున్న పతి రాజా వారు ఆశ్చర్యం మేళవించిన అమాయకత్వం నటిస్తూ వినపడనట్టు నా పరువు కాపాడదామనుకున్నారు.
దానితో కబుర్లు చెప్పి పంపేసి, ఇటు తిరిగానా! "ముద్దు పేర్లు లేవన్నావ్, గంగా బోండాం!" వెక్కిరించారు ఇకిలిస్తూ.
"అదా! ముద్దు పేరు కాదు ఘనాపాటి, గండరగండడు లాంటి బిరుదు గంగాబొండాం." అన్నాను.
"అదేంటి?"
"నా చిన్నప్పుడు తోటలో, దింపించిన బొండాలు దింపించినట్టు తాగేస్తోంది మా అక్క. "నాకేవీ" అని అడిగితే ఖాళీ బొండాం చేతిలో పెట్టి పళ్ళికిలించింది. అసలే ముక్కోపినేమో.. బొండాం దాని నెత్తినేసి పగలగొట్టాను. ఆరు కుట్లు పడ్డాయి నడి నెత్తిన. అప్పుడు నా వయసు తొమ్మిదేళ్ళు..." చెప్పుకు పోతున్న నాకు కొంచెం దూరంగా జరిగి భయంతో నిండిన ఆరాధనతో చూసారు పతిదేవుల వారు.
అప్పటి నుంచి నా విలువ వింధ్యాచలంలా భీభత్సంగా పెరిగిపోయిందని వేరే చెప్పక్కర్లేదుగా!

Wednesday, May 11, 2011

లంచ్ బాక్స్ లో ప్రేమలేఖ

నువ్వేదో అందని చందమామవని కాదు.
నేను దక్కని ఎండమావిననీ కాదు.
నేనూ..నువ్వూ, బ్యూటీ అండ్ బీస్ట్ కానే కాదు.
నా దారిలో పున్నాగలు పరవకపోయినా..,
జేబులోంచి ఉంగరం "ట డా.." అని తీయకపోయినా,
చెట్టంత నువ్వు, పొట్టిగా ఉన్న నా ఎదుట
ఆకాశం వంగినట్టు , ఒక్కసారి వంగితే
నీ సొమ్మేం పోయేదోయ్?
ఆ క్షణం నా చరిత్రలో
నేనొక ఏడు మల్లెలెత్తు రాకుమారిని అయ్యేదాన్నిగా..!
అప్పుడప్పుడూ నా వంటలో ఉప్పెక్కువయ్యేది కాదుగా!