Friday, October 21, 2011

చినచేప

ఆ రోజు ఆది వారం. మధ్యాన్నం భోజనాలు చేసి ఇంటిల్లి పాదీ కూటి కునుకు తీస్తున్నారు. మండువా పంచలో కూర్చుని చింత పిక్కలు ఆడుకుంటూ, నీళ్ళ కుండీలో తల ముంచి తపతపా విదిలిస్తున్న కాకిని చూస్తున్నాను. వీధిలో సైకిలాగిన అలికిడి.

"మాలక్షబ్బా, టాటగారికి జెబ్బు దల్లీ, రాంబూర్టి వొజ్జాడని!" జేబులోంచి రుమాలు తీసి నుదుటి మీంచి కళ్ళలోకి కారబోతున్న చమట ధారలను తుడుచుకుంటూ, వీధరుగు మీద కూలబడ్డారాయన. అయిదడుగుల బక్కపలచటి రూపం. ఫేంటు చొక్కా. కాళ్ళకి అరిగిపోయిన బాటా చెప్పులు, అవీ తాతగారివే. కళ్ళకి చత్వారం కళ్ళజోడు. ఆయన తల ఎత్తి గమ్మత్తుగా చూస్తూ మాట్లాడుతూంటే ముక్కు మీదికి జారడానికి అనువుగా సాగిపోయి ఉండేదది. చేతిలో నగల షాపు వారు ముద్రించిన  పేరు దాదాపు చెరిగిపోయిన ఓ బేగు.

లోపలికెళ్ళి నాయనమ్మ చూడకుండా రాగిబిందెలోంచి చెంబెడు నీళ్ళు, ఆ పక్క ఉన్న వైరు బుట్ట లోంచి  రెండు అరటి పళ్ళూ చేజిక్కించుకుని బయటి కొచ్చాను. మంచి నీళ్ళ చెంబు అందుకుని గటగటా తాగేసి "హబ్బయ్య.. మా లక్షివే దల్లీ!!" అని నా వైపు చూసి నా చేతిలోంచి అరటి పళ్ళు అందుకున్నారు. ఆయన అవి తిని తొక్కలు పారేసి వచ్చేలోపు, తాతగారొచ్చి అరుగు మీద వాల్చిన పడక్కుర్చీలో కూర్చున్నారు.

నెమ్మదిగా అక్కడి నుంచి ఖాళీ చెంబు పట్టుకుని వెళ్ళిపోయాను. ఓ పది నిమిషాల్లో తాతగారు ఎలాగూ పిలుస్తారని తెలుసు. పోనీ అక్కడే ఉందామంటే, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు అక్కడ ఉండకూడదని వచ్చినవాళ్ళు వెళ్ళగానే మెత్త మెత్తగా చీవాట్లేస్తారు. పిలుపు వినబడగానే అలవాటు ప్రకారం, తాతగారి కరణీకం బల్ల మీద ఉన్న పర్సులోంచి ఐదు రూపాయల నోటు తీసి బయటికి తీసుకెళ్ళబోయాను.

"ఎక్కడికే! డబ్బులు తీసుకు బయలుదేరావూ?" ఎదురుగా నాయనమ్మ.
"రాంబూర్టి మేష్టారొస్తేనూ.." నసిగాను.
"ఐదు రూపాయలే! రెండు శేర్ల పాలొస్తాయ్. మీ తాతగారు ఆ డబ్బుల చెట్టు ఇంకాస్త గట్టిగా దులిపితే, కూతుళ్ళకి తలా కాసూ బంగారమైనా పెట్టేదాన్నిగా!" చిన్నగొంతుతో కసిగా సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
బతుకు జీవుడా అని ఆ నోటు తీసుకెళ్ళి రాంబూర్టి మేష్టారికి ఇచ్చి దణ్ణం పెట్టాను.
"షుభవ్, విడ్డా పాప్తిరష్టూ!" దీవించేసి సైకిలెక్కారాయన.

కుర్చీ చేతి మీదెక్కి"నాయనమ్మ చూసేసింది." గుసగుసగా చెప్పాను తాతగారికి.
"హ్మ్.." అన్నారాయన ఏమీ మాట్లాడకుండా.
"రాంబూర్టి మేషారంటే నాయనమ్మకి ఎందుకూ కోపం?" ఎన్నిసార్లు అడిగినా సమాధానం రాని ప్రశ్నే మళ్ళీ అడిగాను.
"రామ్మూర్తీ.." చెవి దొరకబుచ్చుకుని చెప్పారు తాతగారు.
విడిపించుకుంటూ చెప్పాను." ఏం కాదు. ఆయనే చెప్తారు 'రాంబూర్టి' అని. ఆయన పేరు ఆయనకి తెలీదా?"
"ఆయన పలకలేరు. మనం తప్పుగా పలకకూడదు."
"నత్తా?"
"తప్పూ.. నశ్యం"
"నశ్యమంటే?"
"ఏదీ, నిన్న ఎక్కడి దాకా చెప్పుకున్నాం? "కరచరణ సరోజే కాంతిమన్నేత్ర మీనే..."
"మురభిది మా విరమస్వ చిత్తరంతం" అయిష్టంగా మొదలెట్టాను.
"రంతుం" సవరించారాయన.
"సుఖతరమపరం నజాతు జానే.. హరిచరణ స్మరణామృతేన తుల్యం"
రామ్మూర్తి మేష్టారు వారానికి రెండు సార్లు తాతగారి దగ్గరికి రావడం, ఐదు రూపాయిలు తీసుకెళ్ళడం చాలా ఏళ్ళు జరిగింది. ఆయనేం తాతగారి స్నేహితుడు కాదు, సహోద్యోగీ కాదు.. అసలాయన మేష్టారే కాదట. అటెండర్. కానీ ఎవరూ ఆయనకి టీ కాఫీలు తేవడం లాంటి చిన్న చిన్న పన్లు చెప్పరు. బేంక్ పన్లు అవీ చేస్తారట హై స్కూల్లో. ఎప్పుడైనా హై స్కూల్ వైపు వెళ్తే కార్బన్ పేపర్లు, పెన్సిళ్ళు కావాలంటే తెచ్చి ఇచ్చే వారు.

ఓ సారి దసరాకి కళాభారతి ఆడిటోరియంలో బోలెడు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. "మంగళం పల్లి బాలమురళీ కృష్ణ" గారట. ఆయన కూడా వస్తారట, మదరాసు నుంచో.. ఎక్కడి నుంచో! ఆయనెవరు అంటే ఆకాశ వాణి విశాఖపట్నం కేంద్రం ఉంది కదా! అందులో ఉదయం భక్తి రంజనిలో "గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే.. గంగలోని చేప కప్ప ఎంగిలన్నవిరా లింగా.. మాహానుభావా.. మా దేవ శంభో" అని పాడుతారు కదా.. ఆయనన్నమాట!

సాయంత్రం ఆరయ్యేసరికి తాతగారితో పాటూ ఏదో ఫలహారం తినేసి వెళ్తే, నిద్దరొచ్చేదాకా పాటలూ, పద్యాలూ వినచ్చు. హరికథలు, యక్షగానాలు, లలిత సంగీతం, బాలకనకమయ చేల, భామనే సత్యా భామనే.. అన్నీ చూడచ్చు. ఒకవేళ నిద్రపోయామా.. "రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ" అయిపోయే వేళకి తాతగారు నిద్రలేపుతారు. అప్పుడు పళ్ళెంలో డబ్బులు వేసి దణ్ణం పెట్టేసుకుంటే తాతగారి శాలువ మనం కప్పేసుకుని, నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోవడమే!

ఆ బాలమురళీ కృష్ణ గారు వచ్చినప్పుడు మన రామ్మూర్తి గారు కూడా స్టేజ్ ఎక్కారన్నమాట. ఆయన వాతాపి గణపతిం, ఎందరో మహానుభావులు, తిల్లానా, పిబరే రామరసం ఇలా ఎన్ని పాటలు పాడారో అన్నింటికీ, రామ్మూర్తి గారు తబలా మోగించారు. తప్పు తప్పు.. సహకారం అందించారు అనాలట.

మర్నాడు ఓ నాటిక వేసారు ఉత్సవాల్లో. మూకాభినయం అంటారట దాన్ని. అంటే మాటలుండవన్నమాట. ఆకలిగా ఉన్న ఓ మనిషి ఊరంతా వెతుకుతాడు. ఎక్కడా తినడానికి ఏదీ దొరకదు. అలా వెళ్ళగా వెళ్ళగా ఓ నూతిగట్టు మీదకి వాలి ఉన్న జాంచెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టెక్కి పండొకటి కోసుకుంటూ ఆ మనిషి నూతిలో పడతాడన్నమాట. నూతిలోంచి బయట పడడానికి సహాయం కోసం చూస్తూంటే ఇంకో మనిషి వచ్చి తాడు వేసి బయటికి లాగుతాడు. ఇద్దరికీ ఆకలిగానే ఉంటుంది. బయటికి వచ్చిన మనిషి చేతిలో జాంపండు కోసం ఇద్దరూ పెనుగులాడుకుని ఈసారి ఇద్దరూ కలిసి నూతిలో పడతారు. కలిసి పంచుకుంటే ఇద్దరికీ కడుపు నిండేది, అపాయమూ తప్పేది అని నీతిట. ఇంకా నయం, అది బాదం చెట్టవలేదు!  నీతి కంటే మాటల్లేకుండా అట్టముక్కలతో చేసిన నూతిలో పడడం, పెనుగులాడడం, నీళ్ళలోంచి బయటికి లాగడం అవీ భలే బాగున్నాయ్. నాకేం పెద్దగా అర్ధం కాలేదు కానీ, అందరూ బాగా చప్పట్ట్లు కొట్టారు. నేనూ కొట్టాను. దాన్ని సభా మర్యాద అంటారట.

నాటకం అయ్యాక మా ఊరి రాజా వారి చేతుల మీదుగా ఆ నటులకు సన్మానం జరిగింది . వారితో పాటూ రామ్మూర్తి మేష్టారికి కూడా. "ఆయనకెందుకూ?" అని అడిగితే తాతగారు చెప్పారు. ఆ నాటకం మొత్తం నేపధ్యంలో తబలా సహకారం ఇచ్చింది మేష్టారేనట. నీళ్ళలో దబ్బున పడడం, మునక వేస్తున్నట్టు శబ్దం, తాడు వేసి లాగుతున్నప్పుడు మళ్ళీ నీళ్ళ శబ్దం అంతా తబలా మీద అందించినదేనట. రామ్మూర్తి మేష్టారు ఎంత గర్వంగా నవ్వేసుకుంటున్నారో అనిపించింది స్టేజి మీద ఆయన్ని చూస్తే. చెప్పొద్దూ.. నాకూ గొప్పనిపించేసింది. నన్ను "మాలక్షివబ్బా.." అని ఈయనేగా అనేవారు అని గర్వమన్నమాట.

ఇది జరిగిన నెల రోజుల దాకా రామ్మూర్తి మాస్టారు చాలా రిహార్సల్ కి వెళ్లేవారట. నెల తరువాత మా ఇంటికి వచ్చారు. నేను చెంబుతో మంచి నీళ్ళు తెచ్చేలోగా, నాయనమ్మ నా చేతికి మజ్జిగ గ్లాసిచ్చింది. ఇదేంటా అని ఆశ్చర్యపోయేలోపు తలుపు వార నిలబడి ఆయనతో మాట్లాడింది కూడాను! మేష్టారు అమేరికా వెళ్తారట. మొన్న ఉత్సవాల్లో వేసిన నాటిక రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా వేసి నెగ్గారట. అంతా మేష్టారి గొప్పేనంట.  అమేరికాలో తెలుగు సభల్లో వెయ్యడానికి వెళ్తున్నారట. మేష్టారు "అమేరికా రాంబూర్టిగారై"పోతారన్నమాట. ఆయన 'అమేరికా' అని ఎలా పలుకుతారో విందామని నేనూ అక్కడే నిలబడ్డానా.. నాయనమ్మ కసిరేసి లోపలికి పొమ్మంది. నేనూరుకుంటానేంటి? వీధి గది కిటికీ దగ్గరికి వెళ్ళి విన్నాను అమేరికా కబుర్లు.

రెండు నెలల్లో ప్రయాణమట. చలిగా ఉంటుందని కోటు, బూట్లు కొనుక్కోమన్నారట మేష్టారిని. మొత్తం ట్రూపు అంతటికీ రాఘవరాజు లీడరట. అంటే ఆ రోజు నూతిలో పడిన మొదటాయనన్నమట. అతనే డైరెట్రు కూడానట. అమేరికాలో గాజు రోడ్లుంటాయట. అద్దాల కార్లు, తాడెత్తు ఇళ్లూ ఉంటాయట. మనుషులందరూ ఎర్రగా పొడుగ్గా, సినిమా హీరోలు కృష్ణ, శోభన్ బాబు కంటే అందంగా ఉంటారట. మన భాష వాళ్ళకి రాదుట. బ్రెడ్డే తింటారట. ఇలా బోలెడు కబుర్లు చెప్పారు మాష్టారు.

రామ్మూర్తి మేష్టారి అమెరికా యాత్ర మా ఇంట్లో ఓ పెద్ద చర్చనీయాంశమైపోయింది. నెల రోజుల అమెరికా యాత్రలో ఆయన ఏం చూస్తారో ఏం చేస్తారో కానీ, మా నాయనమ్మ మాత్రం బోలెడు ప్రశ్నలడిగేది తాతగారిని. "అదే నెలలో ఉన్న మాష్టారి తల్లిగారి ఆబ్దికం సంగతెలాగో!" అని కూడా నాయనమ్మకే బెంగ. ఏది ఏమయినా ఆయన చేత అమెరికా సబ్బులు తెప్పించమని మాత్రం కచ్చితంగా చెప్పేసింది. అవి రుద్దుకుంటే ఆమడ దూరం సువాసన వస్తామట. "యోజనగంధిలాగా?" అని నేనడిగితే చల్లకవ్వం విసిరేసింది నామీద. ఓ పది సబ్బులైనా తెప్పించాలని చెప్పేసింది. అన్నిటికీ తాతగారు నవ్వేసి "వెర్రి దానా" అనేవారు, అంటే అలాగే అనో.. కుదరదనో నాకు తెలీదు మరి.

మేష్టారు కోటు కొనుక్కు తెచ్చుకున్నారు. బూట్లు కొనుక్కోవాలని చెప్పారు. నెలకి సరిపడా గ్రాసం సమకూర్చుకోవాలని చెప్పారు. ఉప్పూ, కందిపొడి సరే, గొల్ల నరస పోసే పాలు, రెండో పూట దాటితే విరిగిపోతాయని అమ్మ చెప్తుంది కదా!  నెల రోజులకి పాలెలా పట్టుకెళ్తారో నాకర్ధం అయ్యేది కాదు. ఏమైనా మాట్లాడితే ఏమంటారో అని నా అనుమానాలన్నీ నాలోనే దాచేసుకునే దాన్ని. పాపం నేను!

అమెరికా ప్రయాణం నాలుగు రోజుల్లో ఉందనగా, ఓ రాత్రి వేళ తలుపు కొట్టారు మేష్టారు. నాన్న తలుపు తీసి వచ్చి గాభరాగా తాతగారిని లేపారు. వీధి అరుగు మీద కూలబడిన మేష్టారిని ఇంట్లోకి భుజాలు పట్టి తీసుకొచ్చారు నాన్న. కుర్చీలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు మేష్టారు! భలే బాధనిపించింది. అప్పుడెప్పుడో ముదినేపల్లివారి ఇంటరుగు మీద నుండి పడిపోయి, మోకాలు చీరుకు పోయి కుట్లు వేసినప్పుడు కూడా నేను అంతలా ఏడవలేదు. కాసేఫున్నాక చెప్పారు ఏంటో.. అసలే ఆయన మాటలు అర్ధం కావేమో, నిద్ర కళ్ళమీదున్న నాకేం బోధపడలేదు. ఉదయం దాకా ఆయన అలా పంచపట్టునే నిద్రపోయి, ఉదయాన్నే వెళ్ళిపోయారట.

ఉదయం స్కూల్ కి వెళ్ళే ముందు అడిగాను తాతగారిని "ఇంతకీ రామ్మూర్తి మేష్టారెందుకు ఏడ్చారు? అమెరికా తీసుకెళ్ళనన్నారా ఆయన్ని?" అని. జానకత్త ఇంటికి నన్ను తీసుకెళ్ళకుండా నాయనమ్మ ఒక్కర్తే వెళ్ళిపోయినప్పుడు నాకూ ఇంతే ఏడుపు వచ్చినట్టు గుర్తు. "లేదమ్మా, నువ్వు మాష్టారు కనిపించినా ఏం అడక్కు. తెలిసిందా?" అన్నారు. "మరి నాటకమెలా వేస్తారు వాళ్ళు? మేష్టారు లేనిదే?" అని అడిగాను. అమెరికా వాళ్ళు చప్పట్లు కొట్టకపోతే సభామర్యాద కాదు కదా! "రికార్డ్ చేసుకుని తీసుకెళ్ళారట. మేష్టారికి టికెట్ దొరకలేదని" అన్నారాయన.

నాన్న చెప్పులు వేసుకుంటూ "ముసలాయనకి ఆశ పెట్టడం అన్యాయం. వాళ్ళేం బాగుపడతారు? పాపం, వెర్రి మనిషి, అసలే అర్భకపు ప్రాణి!" అన్నారు తాతగారితో. "టికెట్టు డబ్బులు మిగులని కాబోలు వెధవాయిలు. అమేరికా వెళ్తే ముసలాయనకి డబ్బు వదిలెయ్య్.. పేరయినా దక్కేదా? ముష్టి నూటపదహార్లు చేతిలోపెడతారా... ఘోరం!!" కోపంగా, బాధగా అంది నాయనమ్మ.  "ఈయన వెళ్తే వాళ్ళు కనిపించరు కదా అమ్మా! ప్రాణం పోసాడు వాళ్ళ వెర్రి గెంతులకి."అన్నారు నాన్న

"ఎవరి స్వార్ధం వారిది. ఏం చెప్తాం! చిన చేపను పెద చేప." అన్నారు తాతగారు, నిట్టూరుస్తూ. "అడిగే వాళ్ళు లేక! కళని దోచుకుంటారా? రాత్రికి రాత్రి రికార్డింగ్ చేయించుకు పోయారు త్రాష్టులు!" పటపటా పళ్ళు కొరికారు నాన్న.
తాతగారి ముఖం శాంతంగానే ఉన్నా చెయ్యి పడక్కుర్చీ చేతిమీద బిగుసుకోవడం కనిపించింది నాకు.

Tuesday, October 18, 2011

మణిదీపం

* తెనుగు వాకిళ్ళలో తెలి వెలుగు రేక పొడిచే వేళ పలికే మేలుకొలుపు

తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా..

* గిల్లికజ్జాల ఆప్యాయపు పసి స్నేహపు పాట

కొమ్మల మీద కోతికొమ్మచ్చులాడింది
తెల్లా తెల్లని ఓ బుల్లి ఎండ
నేల మీద వాలింది వాలుమొగ్గలేసింది
నల్ల నల్లని ఓ బుజ్జి నీడ

* వలచిన చినదాని వగరూ, హొయలూ పొగిడే మాటకాడి మురిపెం ..

చికిలింత చిగురు సంపంగి గుబురూ
చినదానీ మనసూ.. చినదాని మీద మనసూ..

* పగిలిన గుండె నెత్తుట చిమ్మే నిరాశను మాటల్లో పొదిగితే..

లాయిరీ నడి సంద్రములోనా
లంగరుతో పనిలేదోయ్
సుడిలో దూకి ఎదురీదక
మునకే సుఖమనుకోవోయ్

* విద్దెల తల్లి ముద్దుబిడ్డడి మనసున ఆయమ కొలువున్న తీరు చెప్పిన సౌరు..

మది శారదాదేవి మందిరమే..
కుదురైన నీమమున కొల్చేవారి మది.. శారదాదేవి మందిరమే!
                          ***

సూర్యుడికి దివిటీ పట్టడమంత అవివేకం.. మహా రచయిత, పుంభావ సరస్వతి, బహుభాషాకోవిదుడు, అజాతశత్రువు, కీర్తిశేషులు శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని గురించి పరిచయవాక్యాలు రాయడమంటే. చంద్రునికి నూలుపోగు సమర్పించడమంత అల్పాత్యల్పం వారి వైదుష్యాన్ని పొగడడమంటే..

"వచన రచనకు మేస్త్రి - రామకృష్ణ శాస్త్రి" అని ఆంధ్ర సాహితీ లోకం జేజేలు పలికిన మల్లాది వారి కథలు, హాస్య వ్యంగ్య ధోరణిలో పలువురు కవి మిత్రుల గూర్చి మల్లాది వారు రాసిన వ్యాస సంకలనం చలవ మిరియాలు, నా కవిమిత్రులు,  మణిదీపాలు, కిరణావళి గేయసంపుటం,  గోపిదేవి, బాల వంటి నాటకాలు,   హంస వింశతి, రాధికా స్వాంతనము వంటి తెలుగు కావ్యాలకు వారు రాసిన పీఠికలు.. తెలుగువారి భాగ్యాల కొలనులో పూచిన పొందామరలు. తేట తెలుగు ఉనికిని నిబిడీకరించిన మాధురులు.

2005లో మల్లాది వారి శతజయంతి సందర్భంగా.. ప్రముఖ రచయితలు వివిధ పత్రికలలో వ్యాసాలు, పద్యాలు, గేయాల రూపేణా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పరమపదించినప్పుడు అర్పించిన నివాళులను, కొంతమంది ఈ తరం రచయితలు వారి గురించి రాసిన వ్యాసాలను "ఏ. పీ. సినీ రైటర్స్ అసోసియేషన్" వారు సంకలనంగా ప్రచురించారు. అదే "మణి దీపం". సంకలన బాధ్యతను సినీ గీత రచయిత కులశేఖర్ వహించారు. ఆ మణి దీపపు కాంతి రేఖల్లో కాసిని ఇక్కడ..

ఎనభై పేజీల ఈ పుస్తకంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జీవిత విశేషాలు, ఉషాపరిణయం అనే సినిమాకి వారి చేతి రాతతో రాసి ఇచ్చిన పాటలు, (కమలాకర కామేశ్వర రావు గారి దర్శకత్వంలో రావలసిన ఆ సినిమా ఎందువలనో షూటింగ్ వరకూ వెళ్ళలేదట) వీటితో పాటూ తాపీ ధర్మారావు, సముద్రాల రాఘవాచార్య, శ్రీ శ్రీ, పింగళి, ఆత్రేయ, ఆరుద్ర, సంగీత దర్శకుడు అశ్వథ్థామ, పీ బీ శ్రీనివాస్, రావి కొండల రావు, వేటూరి, భువన చంద్ర, కులశేఖర్ వరకూ ప్రతిఒక్కరు రాసిన ప్రతీ వ్యాసం మహ సొగసుగా మల్లాది కవిభాస్కరుని కాంతి పుంజాలను, వెన్నెల సోనల్లా ప్రతిఫలించాయి.

వ్యక్తిగా, స్నేహితునిగా, గురువుగా, రచయితగా, మార్గదర్శిగా, తలవంచని మేరుసమానుడిగా, చిరునవ్వు చెరగని చల్లని మనసుగా, తన బహుభాషా కౌశల్యాన్ని కానీ, శాస్త్రాలు నేర్చిన నేర్పరితనాన్ని కానీ, పుట తిరగేసే అవసరం లేని ధారణని కానీ ఈషణ్మాత్రమైనా గొప్పగా  ప్రదర్శించని నిగర్విగా మల్లాది వారి బహు పార్శ్వాలను వీరందరూ చూపిన వైనం చదివి తీరాల్సిందే.

"పోయినోళ్ళందరూ మంచోళ్ళు" అని వారి వెనుక వారిని పొగడడం లోకతీరు. కానీ రచనల విషయంలో వారి గుప్త సహకారాన్ని ప్రస్తావిస్తూ "నేను పక్కనే ఉంటాను కానీ, రచన అన్నగారి(సముద్రాల) పేరుమీదే సాగనీ, బ్రదర్!" అని శాస్త్రిగారు నిర్మాత దర్శకులతో అనేవారని, సముద్రాలే స్వయానా చెప్పారని ఆరుద్ర వెల్లడి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వెండి తెరపై కావచ్చు, పుస్తకపు పుటల్లో కావచ్చు.. తన పేరు చూసుకోనవసరం లేదనుకునే కీర్తి కాంక్ష లేని రచయితను తాటిచెట్ల ప్రమాణంలో మనుషులు, సముద్రాలంతేసి వాళ్ళ మనసులూ ఉండే సత్తెకాలంలోనే కానీ, ఈ కాలంలో చూడం కదా!

ఇవన్నీ ఒక ఎత్తు, వ్యాసాల రూపేణా రచయితలందరూ మల్లాది వారిని సంస్మరిస్తూ రాసిన అచ్చ తెలుగు జోతలు మరో ఎత్తు. "ఏమి చక్కని భాష!! ఎంత అందమైన తెలుగు!!" అనుకోకుండా ఉండలేం. అవును మరి! రతనాల కోనలోకి సామాన్యుడు వెళ్ళి కొంగున ముడేసుకు వచ్చిన ముడి రంగు రాళ్ళకీ,  రత్నకారుడు ఏరి తెచ్చి, బహుచక్కని చెక్కడపు పసిమి నగలో పొదిగిన జాతిమణికీ తేడా ఉంటుంది కదా! మల్లాది వారి రచనలను, వారి వ్యక్తిత్వాన్నీ ప్రముఖ రచయితల విశ్లేషణగా వినడం మనోరంజకంగా ఉంది. ఈ పొత్తానికి మణిదీపమన్న పేరు సార్ధక నామమనిపిస్తుంది.



"ఈ పుస్తకం బాగుంది" అని చెప్పి ఊరుకోకుండా, నేను చదువుతున్నప్పుడు తళుక్కుమని మెరిసి నా మనసు రంజిల్ల జేసిన కొన్ని వాక్యాలను ఇక్కడ రాయకుండా ఉండలేకపోతున్నాను.
                    
"ప్రభుత్వం అనకపోయినా ప్రజాదృష్టిలో ఆయన ఒక మహోపాధ్యాయుడు. పానగల్ పార్కులో వారు విశ్రమించే చెట్టొక బోధి వృక్షం. వారు కూర్చునే రాతిబల్ల అధ్యక్ష పీఠం. అక్కడ మదన శాస్త్రం నుంచీ మంత్ర శాస్త్రం దాకా వారు బోధించేవారు." - సముద్రాల రాఘవాచార్య

"కవికుల పిత
రసికుల నేత" - ఆత్రేయ

"ఆయన నవీన నాగరికతకు దూరుడు కాదు. కానీ సిగరెట్టు ఆయన కథల్లో 'శ్వేత కాష్ఠమై'పోతుంది. కాఫీ 'తిక్తమధురమై'పోతుంది." - పాలగుమ్మి పద్మరాజు

"విశ్వకోశానికి కాళ్ళు రాగా వీరై నడిచింది. ఎవరేదడిగినా ప్రమాణయుక్తంగా ఆశువుగా ప్రవచించగల ప్రజ్ఞాశాలి" పీ.బీ. శ్రీనివాస్

"తన రచనలు తాను భద్రపరచని గుణం సాహిత్యపరులలో కొద్దో గొప్పో చాలామందికి ఉంది కానీ, ఈ విషయంలోనూ రామకృష్ణ శాస్త్రిగారు మాంచి మోడలిస్టు." జరుక్ శాస్త్రిగారి నిష్టూరంతో నిండిన ఆవేదన.

"మల్లాది సీంబాదంపప్పు, కలకండ కలేసి తిన్నట్టుండే తియ్యటి పాటలు రాసారు" - ఎం వీ ఎల్

"గరుడపచ్చమాలలు అల్లినట్టుండే హస్తాక్షరి వారిది. ఒక సారి పాట రాస్తే సవరణ ఉండదు. "పాట అర్ధం కాకపోతే నువ్వు నీ చూపు మార్చుకో, తెలుగు నేర్చుకో, అంతే కానీ పాట మార్చమనకు" అన్న నిరంకుశుడాయన." - వేటూరి మాటల్లో "హంసపాదెరుగని వలరాజహంస" మల్లాదివారు.

"చెలువారు మోమున లేలేత నగవుల కలహంస నడకల కలికీ ఎక్కడికే?" అని సరళంగా రాసినదీ ఆయనే. "సామగ సాగమ సాధారా! శారద నీరద సాకారా! ధీరాధీనా ధీసారా!" అని గ్రాంధిక గుంఫనతో రాసినదీ ఆయనే." - రావి కొండలరావు.


"శ్రీశ్రీ ని ఆవాహన చేసుకుని విప్లవకవిత్వాన్ని, కృష్ణ శాస్త్రిని ఆవాహన చేసుకుని భావకవిత్వాన్నీ వ్రాయచ్చేమోగాని మల్లాది వారి మనసుని ఆవాహన చేసుకోడం ఇంపాజిబుల్." - భువనచంద్ర

"కొదమ షట్పదం కృష్ణ గీతాలాలపిస్తూనే వుంది
కరాగ్ర ధూమ శిఖ కవనబోధ చేస్తూనే వుంది
కృష్ణ రసాన్ని, కృష్ణసాన్ని తెలుగువాడికి పరిచయం చేసిన ఘనత మీది" - కులశేఖర్

ఇవి మచ్చుకు మాత్రమే! ఇల విడిచివెళ్ళిన రాజహంసను తలుచుకు నొచ్చిన తెనుగు మనసు, వారి కైతల కాన్కలను తలుచుకుని దాశరధి మాటలకు ఔనని తల ఊచి తీరుతుంది.

ఆంధ్ర జనులార! మీ హృదయాంగణముల
మల్లెపందిళ్ళువేసి యా మండపముల
మల్లెకన్న మెత్తని మనసులుల్లసిల్ల
సరసు మల్లాదిని ప్రతిష్ఠ సలుపుడోయి

("మణిదీపం" - వెల రూ. 50/-, అన్ని ప్రముఖ పుస్తక విక్రయ శాలలయందూ, ఏవీకేఎఫ్ లోనూ లభ్యం.)

Wednesday, October 5, 2011

కొలువు తీరిన జ్ఞాపకాలు

అదో వేసవి సాయంత్రం. ఎక్కడో కూస్తున్న కోయిల పాట అప్పన్న కొండని తాకి మారు మ్రోగుతోంది. "హాత్తెరీ.. సరి లేరు నాకెవ్వరూ..!" అని మళ్ళీ మళ్ళీ కూస్తోంది మత్తెక్కిన పొగరు కోయిల. పెరట్లో ఆవు దూడ ఉండుండీ "అంబా.." అంటోంది. వంటింటి చూరు కింద కాగుతున్న నూనె మూకుట్లో, గులాబీ పువ్వుల చట్రం "సయ్..య్" మని మునక వేసింది. వేడెక్కిన చట్రాన్ని పిండిలో ముంచి తీసి నూనెలో మరో మునక వేయించింది అమ్మమ్మ. తేలిన బంగారు రంగు గులాబీలని పంచదార పాకంలో ముంచి పెద్ద ఇత్తడి పళ్ళెంలో ఆరబెడుతోంది అమ్మ. గడప మీద ఆనుకుని ఓ రెండేళ్ళ పాపాయి "అమ్మమా... గులాగీ.." అని గారాలు పోతోంది. నీలం చుక్కల తెల్ల కాటన్ గౌను, కుచ్చులు కుచ్చులుగా నుదుటిమీదికి పడుతున్న నల్లని వంకీల జుట్టు, ముంజేతులకి మురుగులు, కాళ్ళకి వెండి గజ్జెలు.. అంత ముద్దొస్తున్న పాపాయి ఎవరని మళ్ళీ అడుగుతారేం.. కచ్చితంగా నేనే.

అలా నేను పన్నెండో గులాబీ పువ్వు పట్టుకెళ్ళి ఇస్తే, సందులో కుంకుడు చెట్టు నీడలో నులక మంచం మీద నడుం వాల్చి, తెచ్చిన గులాబీ తెచ్చినట్టు నోట్లో వేసేసుకుంటూ, కన్యాశుల్కం నూట పన్నెండో సారి చదువుకుంటున్నారు మా నాన్నారు. "ఉంకో గులాగీ తెస్సానేం.." అని ఆయనతో చెప్పి, మళ్ళీ వెళ్ళి అడిగినపుడు అమ్మమ్మకి అనుమానం వచ్చింది. "ఏం పిల్లా.. నువ్వే తినేస్తున్నావా? ఏ కాకికైనా తినిపిస్తున్నావా?" అని సందులోకి వస్తూ నోరు జారేసి నాలిక్కరుచుకుంది. యధాలాపంగా ఆవిడ అన్న మాట తన శ్యామలఛ్ఛాయని చూసి వెక్కిరిస్తూ అన్నదేనని చిన్నబుచ్చుకున్నారు ఇంటల్లుడు.

ఇంకో రెండేళ్ళ తరువాత మా అమ్మమ్మగారింటికి ప్రతీ ఏడూ వచ్చినట్టే దసరా పండగ వచ్చింది. దసరా వెళ్ళిన మూడోనాడు అరటి పిలకలు, చేమంతి పువ్వులు కట్టిన ఆటో ఒకటి ముంగిట్లో వచ్చి ఆగింది. ఆకుపచ్చ నేత చీర నడికట్టు కట్టుకుని ఆ ఆటోలోంచి మా అమ్మ దిగింది. అమ్మ చేతిలో కేరు కేరుమంటూ బంతిలా ఓ వస్తువు. పెద మావయ్య చెయ్యి పట్టుకు నిలబడ్డ నాకు, ఆ బ్రహ్మ పదార్ధం ఏంటో అంతు చిక్కలేదు. అమ్మ నన్ను చూసి దూరం నుంచే నవ్వేసి "తల్లీ, ఆం తిన్నావా??" అని అడిగి, చూపులతోనే తడిమేసి ఎందుకు పంపేసిందో అర్ధం కాలేదు. మర్నాడు వచ్చిన నాన్నగారు నన్ను ఎత్తుకొని "అమ్మలూ.. తమ్ముడిని చూసావా?" అని అడిగినప్పుడు బ్రహ్మాండం బద్దలైంది. "తమ్ముడంటే పెద మావయ్య కొడుకులా గునగునా పాకుతూ, మనం పరిగెడుతూంటే మన వెంట పడాలి కానీ కుయ్యో.. అయ్యో అని ఏడవడమేంటి..?!"  అనుకున్నాను.

రెండ్రోజులు విపరీతంగా సహించాక అమ్మమ్మకి చెప్పేసాను. "ఆ ఏడుపు పిల్లాడు నా తమ్ముడేం కాదు" అని. అమ్మమ్మ ఊరుకుంటుందా? "ఎందుక్కాదూ? నువ్వూ చిన్నప్పుడు ఇంతకంటే ఏడ్చేదానివి." అని పెద్దత్త చేత, పిన్ని చేత, మడేలు సూరీడమ్మ చేతా సాక్ష్యం చెప్పించేసింది. అవమానభారంతో సందులో చీమల పుట్టలు చీపురుపుల్లతో పొడుస్తూ చాలా సేపు బాగా ఆలోచించాక, ఓ నిర్ణయానికి వచ్చి మళ్ళీ వెళ్ళి అమ్మమ్మకి చెప్పాను. "ఇంత నల్ల పిల్లాడు తమ్ముడు అయితే నాకు బాగుండదని" వినిపించుకోకుండా ఒక్క కసురు కసిరి తరిమేసారు. గోలు గోలున ఏడుస్తూ కింద పడి కాసేపు దొర్లాక విసుగొచ్చి, పిల్లమూకతో దాగుడు మూతలు ఆడుకునే సందట్లో తాత్కాలికంగా నల్ల బంతి పిల్లాడి విషయం మర్చిపోయాను.

కానీ అమ్మ దగ్గరకి వెళ్ళనివ్వట్లేదని ఏడుపొచ్చేది. కలలో అయినా, కళ్ళు తెరిచినా.. నల్లగా పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రటి నోరు, బోలెడు జుత్తు వేసుకొని, బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఆ బంతి పిల్లాడు మా అమ్మ పక్కలో కనిపించి నన్ను వీర హింస పెట్టసాగాడు. అసహనం పెచ్చరిల్లి ఆటల్లో దొరికిన వాళ్ళని దొరికినట్టు నా ఉక్రోషానికి బలి చేసినా ఉపయోగం లేకపోయేది. "పోన్లే, చిన్న పిల్లాడు కదా.. తొందరగా వాళ్ళమ్మ కి ఇచ్చి పంపెయ్" అని అమ్మకి గుమ్మంలోంచి చెప్పేసి వచ్చేస్తూంటే, పిన్ని ఓ బాంబు పేల్చింది. "వీడికీ మీ అమ్మే అమ్మ" అని. "ఏం కాదు. అమ్మంటే నాకు అమ్మ. వాళ్ళమ్మకి వాడిని ఇచ్చెయ్యండి." అని చెప్పేసి కళ్ళ నీళ్ళు కుక్కుకుంటూ బయటికి వచ్చేసాను.

అది చూసిన అమ్మమ్మ నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోపెట్టుకుని బోలెడు మంచి మాటలు చెప్పానని అనుకుంది. పొర్లుకొచ్చేస్తున్న దుఃఖంలో నాకేమైనా వినిపిస్తేగా! "అమ్మని ఎందుకు ఆటోలో తీసుకెళ్ళావ్. నువ్వే.. నువ్వే చేసావ్. తమ్ముడేం అలా ఉండడు." అని తన్నుకొస్తున్న వెక్కిళ్ళ మధ్యలో అమ్మమ్మ మీద విరుచుకుపడ్డాను. చాలా సేపు నా శోకాలాపనతో విసిగి చివరికి చెప్పింది."పట్నం సంతకి వెళ్ళాం. చింతపండు బేరమాడి డబ్బులిచ్చేసి బుట్ట తీసుకొని ఆటో ఎక్కామా.. బుట్టలో చింతపండుకి బదులు ఇదిగో, ఈ పిల్లాడున్నాడు. డబ్బులిచ్చేసాం కదా అని ఇంటికి తెచ్చేసాం. పాపం ఏడుస్తున్నాడు కదా! మనింట్లోనే ఉంచుకుందాం. మంచి దానివి. అలా ఏడవకూడదు." అని సర్ది చెప్పింది. పక్క గదిలోంచి బయటకు వస్తున్న నాన్నగారి చెవిన పడ్డాయ్ ఈ మాటలు. మరో సారి ఆయన నవజాత సుపుత్ర సమేతంగా వర్ణ వివక్షకి గురయ్యారు.

అది మొదలు చింతపండమ్మే అమ్మి పిల్లాడు కనిపించకపోవడం చూసుకుని, మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి వీడిని పట్టుకుపోతుందని, నేను ఆశగా ఎదురు చూస్తూ గుమ్మంలో కూర్చొనేదాన్ని. రావట్లేదని విసుగొస్తే నాన్నగారిని ప్రశ్నలతో వేధించేదాన్ని. అలా ఆయన క్రోధం పెరిగి పెరిగి కట్టలు తెంచుకుని, అమ్మమ్మ మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. అప్పటి నుంచీ ప్రతి పండగకీ తప్పకుండా అమ్మమ్మగారింటికి వెళ్ళి తీరాలని. ప్రతీ పండగా అంటే ఉగాది మొదలుకొని ప్రభుత్వ సెలవులిచ్చే పండగలు మాత్రమే కాదు, మాస శివ రాత్రి, భగినీ హస్త భోజనం, ఋషి పంచకం, బలిపాడ్యమి, మాఘపాదివారాలు, తిధిద్వయం, బాక్సింగ్ డే మరియు టైలర్స్ డే .. ఇత్యాది పర్వదినాలన్నీ శాస్త్రోక్తంగా పెళ్ళాం బిడ్డలతో సహా పక్కూర్లో ఉన్న అత్తవారింటికి వెళ్ళి జరుపుకొనే వారు. కక్కలేక మింగలేక అమ్మమ్మ కళ్ళ నీళ్ళు కుక్కుకునేది. అవును మరి, "అల్లుడొచ్చాడండీ, సంకష్ట హర చతుర్ధికి" అని ఏం చెప్పుకుంటుంది ఊళ్ళో!! తాతగారికి, నాన్నగారికి ఉమ్మడి కాలక్షేపం చదరంగం కాబట్టి ఆయనకేం ఇబ్బంది ఉండేది కాదు. అల్లుడిలా ఎందుకు పగబట్టాడో అర్ధం కాక అమ్మమ్మే కనీసం నాలుగూళ్ళ అవతల ఉన్న తన పుట్టింటికీ, ఓ పుణ్య క్షేత్రానికి కూడా వెళ్ళలేక మౌనంగా శిక్ష అనుభవిస్తూ ఉండేది.

ఇలా ఓ ఏడాది గడిచింది. అప్పటికి మా ఇంట్లో పెరుగుతున్న నల్ల బంతి పిల్లాడు బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ నా వెనక పడేవాడు. నన్ను చూస్తే నవ్వి చేతులిచ్చేవాడు. నేను బడి నుంచి వచ్చేసరికి గుమ్మంలో ఎదురై "క్క్..క్కా..!" అని కేరింతలు కొట్టేవాడు. ముద్దొచ్చి గట్టిగా కావలించుకు నలిపేసినా ఏడ్చేవాడు కాదు. భలే మెత్తగా ఉండేవాడు. వాడికి సిరిలాక్ కలిపినప్పుడు అడిగితే కాదనకుండా అమ్మ నాకూ ఓ రెండు చెంచాలు ఇచ్చేది. చూసారా.. సహనం వల్ల ఎన్ని లాభాలో!!  పోన్లే, ఇదేదో బాగానే ఉంది కదా అని మా నేస్తాలందరితోనూ "వీడే మా తమ్ముడని" చెప్పేసాను.

ఓ రోజు ఉదయాన్నే మా నాలుగో మేనమామ వచ్చాడు. ఉత్తి చేతులతో ఎలాగూ రాడు. ఎప్పుడూ తెచ్చే పనస పండు, చిట్టి గారెలు, సంపెంగ పూవులతో పాటు, ఓ పెద్ద బుట్ట తెచ్చి అమ్మకి ఇచ్చాడు. ఆ బుట్టలో ఏముందో నన్ను చూడనివ్వలేదు. నాయనమ్మ, తాతగారూ, అమ్మ బోలెడు మాట్లాడుకున్నారు మావయ్య వెళ్ళాక.

నాలుగు రోజులు గడిచాక తాతగారి పుస్తకాల గది ఖాళీ చేసారు. ఆ గదిని పంచ గది అంటారు. ఓ పుస్తకాల భోషాణం గోడకి జరిపి చెక్క పెట్టెలు దాని ముందు వేసి తెల్లటి పంచె పరిచారు. మెట్లు మెట్లుగా భలే పేర్చారు అమ్మ, తాతగారూ. ఆ మెట్లు గబగబా ఎక్కుదామని ఉరికిన తమ్ముడిని నా చేతికిచ్చి దూరంగా కూర్చోమన్నారు. వాడిని ఆపేసరికే సరిపోయింది, ఇంక నేనేం ఎక్కుతానా మెట్లు! ప్చ్.. తమ్ముళ్ళతో పాటూ త్యాగం, సహనం కూడా వచ్చేస్తాయనుకుంటా అక్కలకి.

"నాలుగు మెట్లే వచ్చాయి ఎలా చెప్మా..!" అని అమ్మ, తాతగారూ అనుకుంటూ ఉంటే వంటింట్లోంచి కూర్మావతారం చెక్కి ఉన్న పీట తెచ్చి ఇచ్చింది నాయనమ్మ. "ఇదిగో, ఆ పీట మీద నీ పుస్తకాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి, తెలిసిందా?" అని నాకు చెప్పింది. పొద్దుపోయాక నేనూ, తమ్ముడూ ఎప్పటిలాగే పంచలో కూర్చొని భోజనం చేసేసి, పందిట్లో చిన్న పట్టె మంచం మీద పడుక్కున్నాం. చుక్కలు చూస్తూ వాడితో అన్ని కబుర్లు చెప్పేదాన్నా.. ఉదయం లేచేసరికి ఎంచక్కా గువ్వపిట్టలా అమ్మ పక్కన పడుక్కునే వాడు. వాడికి భయమనుకుంటా.. నేనంటే కాదులెండి. చీకటంటే, చీకట్లో నీడ బూచులంటే.

మర్నాడు ఉదయం లేచేసరికి ఆ మెట్ల నిండా రక రకాల బొమ్మలు పేర్చి ఉన్నాయ్. ఎన్ని రకాల బొమ్మలో.. రంగు రంగులవి. నిద్ర కళ్ళు నులుముకుంటూ అబ్బురంగా చూస్తున్న నాతో అమ్మ చెప్పింది. "కిందటేడు రజని బొమ్మల కొలువు చూసి ఆ బొమ్మలు కావాలని ఏడ్చావు కదా.. ఇదిగో, ఇది నీ బొమ్మల కొలువు. ఉదయం, సాయంత్రం పూజ చేసుకోవాలి. తెలిసిందా! నువ్వు పెద్ద దానివి. తమ్ముడు ఆ బొమ్మలు తియ్యకుండా నువ్వే చూసుకోవాలి" అని దొంగ చేతికి తాళాలిచ్చేసింది.

పై మెట్టు మీద రామ పట్టాభిషేకం.. నీలి నీలి రామచంద్రుడు, ఆయనకు ఎడంవైపు ఎర్ర చీర కట్టుకున్న బంగారు బొమ్మ సీతమ్మ, కుడి వైపు అచ్చం పసిమి రామయ్యలా ఉండే లక్ష్మణమూర్తి, పాదాల చెంత అతగాని బంటు రీతి  మారుతి. ఆ మెట్టు మీద పూల గుత్తులు తప్ప వేరే ఏం పెట్టేది కాదు అమ్మ. రెండో మెట్టు మీద అయిగిరి నందిని సింహ వాహిని 'దుర్గ', శుక వారిజ పుస్తక రమ్య పాణి 'వాణి', పద్మోద్భవా పద్మముఖి 'పద్మనాభ ప్రియ' కొలువు తీరే వారు. ఇంక మిగిలిన కొలువులో వెంకన్న, మురళీ మోహనుడు, సిగ్గులొలికే రాధ, కృష్ణ లీలా తరంగిణిలో ఓలలాడుతున్న మీరా, పాల తెల్లని ఆవు - దూడ, వెన్నముద్ద చేతపట్టి పారాడు కన్నయ్య, దీపకన్యలు, మోగని మట్టి 'బొబ్బిలి వీణ' నమూనా, శెట్టయ్య, శెట్టమ్మ, పావడా వేసుకుని తలూచే చారెడేసి కళ్ళ కొండపల్లి బొమ్మాయి, గోళీలకి వైరు అల్లి అమ్మ చేసిన ద్రాక్ష గుత్తులు, పూసలతో అల్లిన కుర్చీలు, డ్రెస్సింగ్ టేబుల్, తిరుపతిలో కొన్న అద్దాల భరిణలు, అద్దాలు అద్దిన ఏనుగు అంబారీ, గడ్డం కింద చేతులు పెట్టుకు కూర్చున్న టోపీ సుబ్బళ్ళు, రంగు నీళ్ళ గిన్నెలోకి నిముషానికోసారి ఊగి తూగి ముక్కు ముంచే గాజు కొంగ, ఒళ్ళో తమ్ముడులాంటి పాపాయిని ప్రేమగా చూసుకుంటున్న అమ్మలాంటి బొమ్మ... నా కళ్ళు ఇలా మూసుకుంటే అలా గుర్తొచ్చి కళ్ళు తడిసేలా చేసేసే నా  బొమ్మలు..

అది మొదలు నవరాత్రులూ తాతగారి నిర్వహణలో "యాకుందేందు తుషార హార ధవళా.. " అని మొదలై
చౌషష్టి విద్యలకు శార్వాణివమ్మ!
బహుశాస్త్ర పుస్తక పాణి నీవమ్మ!
గాన విద్యల కెల్ల కల్యాణివమ్మ!  అని హారతివ్వడంతో  ముగిసే సరస్వతీ పూజ కొనసాగేది.

దసరా పండగ నాడు అమ్మమ్మ తన కూనల్ని, వాళ్ళ కూనల్నీ వెంటపెట్టుకుని, కదిలే బొమ్మల కొలువులా తరలి వచ్చింది. సాయంత్రం బొమ్మల కొలువుకు హారతిచ్చాక వైరు కుర్చీలో నన్ను, నా ఒళ్ళో తమ్ముడినీ కూర్చోబెట్టి హారతిచ్చారు. మంగళ హారతులు పాడారు. బొమ్మలాంటి బుజ్జి తమ్ముడినీ, కొలువు తీరిన నా బంగారు బొమ్మల కొలువునీ మహా గర్వంగా చూసుకున్న దసరా అది. "బొమ్మల కొలువు కోసమైనా ఇంటికో ఆడపిల్ల ఉండాలి." తృప్తి గా అంది అమ్మ. నా వైపు చూసి "అమ్మమ్మ పంపించిన బొమ్మలు బాగున్నాయని చెప్పావా?" అడిగింది. నేను ఏదో అనేలోపే "బొమ్మల కొలువుకీ, నువ్వు కన్న భడవలకీ కూడా దిష్టి తియ్ మా మందంతా వెళ్ళాక" తమ్ముడిని చంకనేసుకుంటూ అమ్మని ఆప్యాయంగా హెచ్చరించింది అమ్మమ్మ. ఇదంతా చూసి తృప్తి చెందిన నాన్నగారు మనసులోనే అమ్మమ్మని క్షమించేసి, ఓ దణ్ణం పెట్టేసుకున్నారు. అప్పటి నుంచీ ఏ పండగైనా మా ఇంట్లోనే అని మీకు వేరే చెప్పాలా!

అది మొదలూ ప్రతీ దసరా ఎన్నో కొత్త బొమ్మల్ని తెచ్చింది. బొమ్మల కొలువు పక్కన పార్క్ నిర్మాణం కోసం వేసిన ఆవాల మొక్కలు "ఎదిగాయా లేదా?" అని రోజూ నిద్ర లేచి చూసుకున్న ఆత్రుత గుర్తుంది. ఏడ్చి పేచీ పెట్టి కుట్టించుకున్న హంసల అంచు తెల్ల శాటిన్ పరికిణీ ఇంకా నన్ను హత్తుకుని రెపరెపలాడుతున్నట్టే ఉంది.

పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పుబెల్లాలు

అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ, ఎర్ర కాగితం, చెమ్కీలు అంటించిన వెదురు విల్లు, బాణాలు పట్టుకొని వీధుల్లో తిరిగి మా పిల్ల సైన్యం దండిన  పైసలు గుర్తున్నాయ్. దసరా వెళ్ళిన మంగళవారం మా గ్రామదేవత "శ్రీ పైడిమాంబ" సిరిమాను సంబరాలకి సిధ్ధమై కిక్కిరిసిన వీధులూ, బంధువులతో నిండి కళకళ్ళాడిన ఇళ్ళూ గుర్తున్నాయ్. వీధుల్లో బారులు తీరిన జాతర సంబరాలు, పండగ మొదలు సిరిమాను సంబరాలయ్యేదాకా వీధుల్లో డప్పుల మోతల మధ్య ఆట కట్టే పులి వేషాలు, దొంగా పోలీస్ వేషాలు తలుపుల చాటున దాక్కుని, తల మాత్రం బయటకు పెట్టి భయం భయంగా చూడడం గుర్తుంది. పండగ వెళ్ళాక పాత బట్టలు  చుట్టుకుని భద్రంగా చెక్క పెట్టెల్లో మళ్ళీ దసరా కోసం ఎదురు చూస్తూ గడిపే మట్టి బొమ్మలు గుర్తున్నాయ్. పుస్తకాలకు మొక్కి పూసిన పసుపు బొట్లని చూసుకుంటూ, దసరా సరదాలని నెమరేసుకున్న పసిప్రాయం గుర్తుంది.

నులివెచ్చని చెమ్మ కళ్ళలో తేలేలా చేసే ఈ జ్ఞాపకాలు, వెన్ను తన్ని పుట్టిన తమ్ముడు, శరత్కాల చంద్రుడు మాత్రం ఎన్ని దసరాలు వెళ్ళినా, ఎన్ని దేశాలు దాటినా నాతోనే..

మీ అందరికీ దసరా శుభాకాంక్షలు!!
అక్షింతలు తెచ్చుకు రారా, దసరా బుల్లోడా!! జన్మదిన శుభాకాంక్షలు.