Saturday, December 29, 2012

సగం మనుషులం..


చిన్నమ్మా,
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ
ఓపిక లేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యంలేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య
డైనమేట్ పేలాలి
డైనమోలు తిరగాలి

పేలాయి డైనమేట్లు.. చాలా సార్లు!


"సమాజం" ఎంత పెద్దపదమో! బరువుగా.. దినపత్రికల్లోనో, కవితల్లోనో, ఉపన్యాసాల్లోనో మాత్రమే ఇమిడే పదం. అక్కడ మాత్రమే బావుండే పదం. "నాన్నా, లేమ్మా పొద్దెక్కిందీ.. సమాజం ఎదురుచూస్తూంటుంది. మరమ్మత్తులు చెయ్యద్దూ!" అని ఏ అమ్మా మేలుకొలుపు పాడదు. "ప్రియా, నా జీవితం నీతో పెనవేసుకుంది. నా ప్రాణాలన్నీ నీకోసం తపిస్తున్నాయి. మనం ఏకమై మన పాపాయిని ప్రేమకి ప్రతిరూపంలా పెంచి సమాజానికి కానుకిద్దాం." అని ఏ ప్రియుడూ ప్రేమలేఖ రాయడు. ఎందుకు లేస్తున్నామో, ఎందుకు కడుపుకింత తింటున్నామో, ఎందుకు సంపాదిస్తున్నామో, ఎందుకు కంటున్నామో, ఎందుకు ఉంటున్నామో.. మోకాటి చిప్ప బద్దలైన క్షణం మాత్రమే పుట్టే ప్రశ్నలు. ఉదయాన్నే "కరాగ్రే వసతే లక్ష్మీ.." అనుకుంటూండగా మెదిలేవి కానేకావు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే బావుంది. అప్పుడప్పుడూ మనకి బోర్ కొడుతుంది. ఏదైనా కలకలం జరిగితే కుతూహలంగా ఉంటుంది. ఎవడో తాగి కార్ తోలి హత్య చేస్తే కోపమొస్తుంది. ఎవడో తవ్విన గోతిలో పడ్డ పాపాయి గురించి పేపర్లలో రాస్తే మన గుండె బరువౌతుంది. మనకీ ఏదో ఒక పని ఉండద్దూ! అప్పుడు గుర్తొస్తుంది. మనం సమాజంలో భాగమే అని. ఇంట్లో కూర్చుని చర్చించేవాళ్ళు ఎందరో..! బయటికెళ్ళి టీవీ మైక్ ముందు మాట్లాడేవాళ్ళు కొందరు. వెరసి సమాజం మారాలని కోరుకునే వాళ్ళమే అందరం!


సమాజమంటే ఏంటబ్బా? అద్దంలో చూసుకుంటే కనిపిస్తుందని, ఒళ్ళో కూర్చుని ఆడుకుంటుందనీ, 'స్కూల్ బస్ అందుకోలేకపోయాననీ, లేటయిపోయిందనీ' రాగాలు గునుస్తూ నాలుగున్నర అడుగుల ఎత్తున మన లివింగ్ రూమ్ లో నిలబడుతుందనీ, పప్పులో పోపు వేస్తూ ఇంగువైపోయిందని మైండ్ నోట్ చేసుకుని, మరో వైపు దోసె పెనం మీద తిరగేస్తూ వెనక్కి తిరిగి వాల్ క్లాక్ నీ, డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ ఖాళీగా ఉందో ఎదురుచూస్తోందో చెక్ చేసుకుంటూ ఉంటుందనీ, ఈవెనింగ్ వాక్ వెళ్ళివస్తూ దార్లో కనబడ్డ జాంకాయల్ని తను తినలేనని తెలిసీ కొనుక్కొచ్చే మూడుకాళ్ళ నడకలో ఉంటుందనీ.. మనం ఊహించం!!


మనిషి పుట్టుకకి కర్త నిజంగానే పైనెక్కడో ఉండి ఉంటే.. అతను చేసిన పెద్ద తప్పు "మనిషికి తెలివి, బాధపడే మనసూ ఇవ్వడం" అదుండబట్టే ఆలోచించీ చించీ చించడానికే జీవితమంతా ఖర్చుపెట్టేస్తాం కానీ ఆచరణకొచ్చేసరికి ఎన్ని అడ్డంకులో! వాటిని తీసి పక్కన పెట్టి నడవగలిగే తెలివి మాత్రం ఉండదు. ప్చ్.. ఐరనీ! బాధపడీ, పడీ.. తెల్లారేసరికి మర్చిపోతాం. మళ్ళీ లేస్తాం తింటాం కంటాం.. ఏది మానేసాం!


ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది.

ఒక్కడు.. ఒక్కడంటే ఒక్కడు "ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లని జాగ్రత్తగా పెంచాలి. అమ్మ ఎన్ని చూసిందో.. ఇకపై చూసే కాస్తా సంతోషమే అవ్వాలి" అనుకుంటే చాలు.

ఒక్కతంటే ఒక్కతె జోల పాడుతూ "వీడికి ఆడదాని విలువ తెలిసేలా పెంచాలి. దీనికి మగాడిని ఎలా చూసుకుని, పిల్లలని ఎలా పెంచాలో తెలిసేలా పెంచగలగాలి." అని కూనల్ని తడుముకోగలిగితే చాలు.

పెనవేసుకున్న ఆ క్షణం.. ఒకే ఒక్క క్షణం.. ఆమె విలువ అతనికి, అతని విలువ ఆమెకీ అర్ధమవగలిగితే చాలు.

ఒక్కడంటే ఒక్కడు "నీ కళ్ళు పేలిపోను చూడవే నన్ను హాయ్.." హాయిగా లేదని పాట మార్చగలిగితే చాలు.సంతోషంగా ఉంది.. సంవత్సరం ఇలా ముగుస్తున్నందుకు.
సంతోషంగా ఉంది.. ఆమె వెళ్ళిపోయినందుకు.

(No RIPs please!)

21 comments:

 1. సంతోషంగా ఉంది.. ఆమె వెళ్ళిపోయినందుకు.

  ReplyDelete
 2. హ్మ్ సంతోషం గా వుంది ఆమె వెళ్ళిపోయినందుకు...

  ReplyDelete
 3. Very very nice article!

  nenu kooda santosha paddanu..ame vellipoyindi.
  ame naraka yatana ki vimukti dorikindi ani.

  ReplyDelete
 4. <>

  అవును అదే కావాలి ప్రస్తుతం

  ReplyDelete
 5. ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని
  ------------------------
  హ్మ్ ! నిజం .
  ఇంత సెన్సిబుల్ గా రాసినందుకు థాంక్స్ అండి . గత రోజుల నుంచి ఆమెకి వేరే ఐడెంటిటీ లేనట్టుగా వాడిన అడ్రేసింగ్ చూసి విరక్తి పుట్టింది !

  ReplyDelete
 6. తెల్లారేసరికి మర్చిపోతాం. మళ్ళీ లేస్తాం తింటాం కంటాం.. ఏది మానేసాం!
  >> హ్మ్మ్...

  ReplyDelete


 7. అలాగేనండీ !
  ప్రతి అక్షరం కోట్ చెయ్యాల్సినదే.
  చెంప దెబ్బ కు ధన్యవాదాలు.

  ReplyDelete
 8. లేదండి.
  తెల్లారేసరికి మరిచిపోరు. ఈ స్పందన చచ్చిపోదు.
  ప్రజలు విసిగిపోయే రోడ్డు ఎక్కుతున్నారు.
  ఏదో ఒక మార్పు వస్తుంది.

  ReplyDelete
 9. బాధగా వుండింది. ఇప్పుడు "ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది." ఆ సంతోషాన్ని గుర్తించేలా చేసినందుకు ధన్యవాదాలు!

  ReplyDelete
 10. సంతోషం గా ఉంది ఆమె వెళ్లి పోయినందుకు..

  ReplyDelete

 11. ఆ అమ్మాయి అసలింత వేదన అనుభవించకుండా ఇంకా ముందే వెళ్ళిపోవాల్సిందేమో...
  ఏనాటి కర్మ మిగిలి ఉందో... ఇంత నరకం పడింది పాపం ఆ పిల్ల...
  ఇవాళ మనకి ఇది తెలిసింది కాబట్టి ఇంత బాధపడుతున్నాము
  మనకు తెలియని వందల కొద్దీ ఎన్ని నీచమైన దురాగతాలు
  చీకట్లో జరిగి చీకట్లోనే కలిసిపోతున్నాయో కదా... అనిపించింది !!!

  వేల వేల ప్రశ్నలు
  మనసు నిండా అశాంతి
  ఎన్నో వేడి నిట్టూర్పులు..
  హ్మ్....:((((

  ReplyDelete
 12. ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది.
  చాలా బాగా చెప్పారు

  తను వెళ్ళిపోయాకైనా మన చట్టాలలో మార్పొచ్చి ఆ మానవ మృగాలకి వెంటనే కఠినమైన శిక్ష పడాలి.

  ReplyDelete
 13. మనసింకా అక్కడే ఉంది మొద్దుబారిపోయి పేరూ ముఖమూ తెలీకపోయినా ఎంత వేదన పడిందో అన్న దగ్గరే ఆగిపోయింది .ఇంకే స్పందన లేదు ఫుల్స్టాప్. ఒక్కడిక్కూడా అమ్మ,అక్క, చెల్లి గుర్తు రాలేదంటే?

  ReplyDelete
 14. ఇలాంటిదేదో జరిగినప్పుడు మీరు చెప్పినట్టు "మరోసారి" లేవడం మళ్ళీ "మరోసారి" నిద్రపోవడం మన సమాజానికి అలవాటైపోయింది కొత్తావకాయగారూ .మనం ఎప్పటికి పూర్తి మనుషులమవుతామో మరి :(.లేక ఎప్పటికీ సగం మనుషులుగానే మిగిలిపోతామో? Very nice expression.

  ReplyDelete
 15. దేశం నిజంగా నిద్రలేచిందా? నాకైతే అలాంటి భ్రమలేవీ లేవు. ఈ ఆవేశం, ఈ ఊపు, ఈ కోపాలూ తాపాలూ అన్నీ... ఎన్నాళ్ళు గుర్తుంటాయి? ఇవాళ ప్రదర్శనలు చేసిన తరం ఒకట్రెండేళ్ళలో కాలేజీ గేట్లు దాటి జీవిత గమ్యాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళకివి గుర్తుకు రావు. అప్పటి కాలేజీ పిల్లలు మళ్ళీ ఇలాంటి ఒకట్రెండు ఘటనలు జరగ్గానే మళ్ళీ రోడ్లమీదకు వస్తారు.. ఆవేశంగా నినాదాలిస్తారు... చరిత్ర పునరావృతం. ఎక్కడిదాకానో ఎందుకు... మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం వేడుకలు. అర్ధరాత్రి తిరుగుళ్ళు. స్వేచ్చా సమానత్వాల వాదనల సంగతి పక్కన పెడితే... కనీసం ఐదారు ఇలాంటి ఇన్సిడెంట్లు మీడియాకెక్కకపోతే చూడండి.
  This World has Irreversibly and Irreparably changed, donno whether you call it a damage or development.

  You said "No RIPs plz". There is no peace at all.

  నా ఉద్దేశంలో ఇది పెసిమిజం కాదు... రియలిజమే.

  ReplyDelete
 16. ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని ....నిజం .

  ReplyDelete
 17. >>ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది.

  దేశం నిద్రలేచిందని నేననుకోడం లేదు. ఇది నిద్రలో ఒక పీడకలకి పడే ఉలికిపాటు మాత్రమే. ఒక వర్గం ప్రజలు, ప్రభుత్వమూ, మీడియా చూపిన/చూపిస్తున్న స్పందన చూస్తూ ఉంటే యిది ఒక ఉన్మత్తత లాగనే అనిపిస్తోంది కాని చైతన్యంలా కనపడటం లేదు. జరిగిన దానికి ప్రతిక్రియ తప్పిస్తే (కఠిన శిక్షలూ, ఉరి వగైరా వగైరా), ఇలాంటి ఘోరాలు జరగకుండా ఆపేందుకు (కనీసం తగ్గించేందుకు) ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎవ్వరూ ఆలోచించడం లేదు. మహా అయితే పోలీసు రక్షణ బాగా పెంచాలన్నదొక్కటే అందరూ అంటున్నది. మొత్తం బాధ్యత ప్రభుత్వం మీదకి నెట్టేసి, ప్రజలు తమ ఆగ్రహాన్ని ఎలాగో అలా వ్యక్తం చేసేసి, గుండె బరువు దించేసుకొని, చేతులు దులుపుకోడమే తప్ప, ఒక "సమాజం"గా, ప్రజలు దీనికి ఎలాంటి బాధ్యయ తీసుకోవాలి, ఏమిటి చెయ్యాలనేది ఎవ్వరూ అడగడమూ లేదు, ఆలోచించడమూ లేదు.
  ఈ మాస్ హిస్టీరియాలో నాకు వినిపించిన ఒక (ఒకేకొక) తార్కికస్వరం యీ వ్యాసం:
  http://wwa.asianage.com/columnists/rape-death-349

  ReplyDelete
 18. ఒక్కడంటే ఒక్కడు, ఒక్కతంటే ఒక్కతి కాదు కొత్తావకాయ గారు అందరం ప్రభంజనంలా కదలాలి. నేరస్తులకు ఉరివేయడానికి కాదు. నేరప్రవృత్తిని పెంచుతున్న మూలాల మీద దాడి చెయ్యాలి. రేపటి తరం నిర్భయంగా బ్రతకాలంటే మనమీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఈ ఆవేశం ఆరిపోనివ్వకండి.

  ReplyDelete
 19. Mee expression adbhutam! Agree to everything !

  ReplyDelete