Sunday, February 14, 2016

సుచిత్ర చెప్పిన కథ

ఒక్కోసారి మనం ఏమాత్రం ఊహించని మనుషుల దగ్గర ఊహకందని కథలుంటాయ్. సుచిత్ర దగ్గర విన్నానిది. 

***

"The last thing I want now is to talk about Suchitra and her project." విశ్వ మొన్నరాత్రే అన్నాడీమాట. 
తనకాలిగోరు నా అరికాలిని పలకరిస్తూ ఉండిఉండకపోతే 'నేను వినట్లేదా నీ ఆఫీస్ కబుర్లన్నీ..' అనేదాన్నే. 

సుచిత్ర టీమ్ లో చేరి ఎనిమిదినెల్లవుతోందేమో. తనపేరు వినగానే బంగాలీ అనుకున్నాను. ఇంటిపేరు వినగానే కాస్త దూరంగా ఉంటే మంచిదేమో అనిపించింది. విశ్వ ఇంటిపేరూ అదే కాబట్టి.. మాకు మనుషులంటే పెద్దగా గిట్టదు కాబట్టి. 

చేరినరోజు నేరుగా వచ్చి పరిచయం చేసుకుంది. 'తెలుగేనా మీరూ?' అంటూ. 

ఒక రిలీజ్ పూర్తయ్యేసరికి కలిసి లంచ్ తినడం, ఒకట్రెండు సినిమాలకి వెళ్ళడం దాకా వచ్చింది. ఇంటికేనాడూ పిలవలేదు, నేనూ వెళ్ళలేదు. అర్ధమయిందేమో.. మిగిలిన అందరి విషయాల్లోనూ విపరీతమైన ఆసక్తి చూపించి, గంటలతరబడి గాసిప్ మాట్లాడే సుచిత్ర నన్నెప్పుడూ ఏదీ గుచ్చి ప్రశ్నించలేదు. 'నీతో చెడగొట్టుకుంటే ఎలా! అర్ధరాత్రీ ఆపరాత్రీ ఫోన్ చేసినా పనిచేసిపెట్టేవాళ్ళెవరు దొరుకుతారు?' అంటాడు విశ్వ.

***

"రాఘవ్ కి మీటింగ్ ఇంకా అవలేదట. ఊబర్ రైడ్ తీసుకోమన్నాడు." సాయంత్రం బయల్దేరుతూ అంది. 
ఇద్దరు వెళ్ళే దారీ ఒకటే అయి కూడా మరీ అలా వదిలేసి వెళ్ళిపోవడం బావుండదనిపించింది. నా కారెక్కమని అనకతప్పలేదు. ఇంట్లోకి రమ్మని బలవంతం చేస్తే ఏం చెప్పి తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను.

ఆఫీస్ కబుర్లు, సినిమాలూ, బిగ్ బాస్ కబుర్లూ అయిపోయినా ఎయిటైటీ ట్రాఫిక్ కదలడం లేదు. 

"ఈ ఏడాది మన పండగలేవీ శనాదివారాల్లో పడలేదు. ఉగాదికి మాత్రం సెలవు పెట్టేస్తానంతే. అన్నట్టు క్రిందటేడు మా ఇంటిదగ్గర న్యూ ఇండియా బజార్ వాడు మంచి వేపపువ్వు పెట్టాడు. ఈ యేడాది దొరుకుతుందే లేదో అని నాలుగు పేకెట్లు కొనిపెట్టాను. అంతకుమునుపు నాలుగేళ్లు వేపపువ్వు లేని పచ్చడే అయింది. మీక్కనకా కావాలంటే తెచ్చిపెడతాను. ఫ్రెష్ ది దొరికితే పరవాలేదు. లేదంటే ఏదోటి.. గుడ్డిలో మెల్ల." అనర్గళంగా చెప్పేస్తోంది సుచిత్ర. 

ఊ కొడుతున్నాను. 

"వీకెండ్ ఏం చేస్తున్నారు?" అడిగింది. 

ఏం చెప్తే ఏమొస్తుందా అని ఆలోచించేలోగానే తనే అందుకుంది. 

"మా ఇంటిదగ్గర సాయిబాబా టెంపుల్ ఉంది. చాలా బావుంటుంది. ఈసారెపుడైనా వెళ్దాం."

"ఊ.."

"అక్కడ స్పెషల్ అభిషేకం ఉంది ఈ ఆదివారం. వేలంటైన్స్ డే స్పెషల్." నవ్వింది గలగలా.. 

"నిజమా!" 

"నిజంగానే. ఏదో అకేషన్ కావాలి అంతే." 

నవ్వుతున్నాను. 

"మాకో టెన్ మైల్స్ దూరంలో సత్యనారాయణస్వామి టెంపుల్ ఉంది. చాలా బావుంటుంది. వ్రతం అన్నవరంలో చేసినట్టే పద్దతిగా చేస్తారక్కడ. కథ తెలుగులో చదువుతారు చక్కగా. అంతకు ముందు వెళ్ళేవాళ్ళం తరచూ.." 

మరీ బావుండదేమో అన్నట్టు ఓహో అన్నాను. 

"మీరు వెళ్లి ఉండకపోతే, ఉగాదికి వెళ్ళండి. చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయ్. ఫుడ్ కూడా బావుంటుంది. మేం అక్కడికి వెళ్ళడం మానేశాం. అదో కథలెండి."

కథ అనగానే నాకు ఏదో సినిమాలో సునీల్ మొహం గుర్తొచ్చి నవ్వొచ్చింది. బలవంతంగా ఆపుకుని ఆ సినిమా ఏవిటా అని ఆలోచిస్తుంటే సుచిత్రే మళ్ళీ.. 

"మీకు బోర్ కొడితే చెప్పేయండి ఆపేస్తాను కానీ, ఆ స్టోరీ చెప్పనా? ట్రాఫిక్ మరీ బంపర్ టు బంపర్ ఉందసలు.. " 

ఈసారి బేతాళుడు గుర్తొచ్చి ఇంకాగలేక నవ్వేసి సారీ చెప్పాను. ఆవిడ అడిగిన తీరుకి నవ్వొచ్చిందని నమ్మబలికి కథకి చెవొగ్గాల్సి వచ్చింది. 

***

"దీప అని.. నాతో రెమెడీలో పనిచేసేది. మౌంటెన్ వ్యూ లో ఆఫీస్.. కార్ పూల్ చేసేవాళ్ళం. దీపకి ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు మా శశాంక్ వయసువాడే. చిన్నవాడికి అప్పట్లో మూడేళ్ళుంటాయ్.

ఇక్కడిలా పెద్ద కంపెనీ కాదు. స్టార్టప్. పనీ ఎక్కువ ఉండేది, బాగా ఫ్రెండ్లీగా ఉండేది వాతావరణం. ఇలా రాజకీయాలు కూడా లేవు.
సరే.. టూ థౌజండ్ చివర్లో రెసెషన్ వచ్చింది చూడండీ.. యూరోప్ లో మొదట, ఆ తరవాత అమెరికాలో. అప్పటికి మీరింకా ఇక్కడికి రాలేదనుకుంటానేం? మాకందరికీ ఉద్యోగం ఏమవుతుందా అని భయం. ఉదయం ఆఫీస్ కి వస్తే బ్రేక్ రూమ్ లో ఇవే కథలు. అక్కడలా అయిందట.. తరవాత మనమేనట.. అని. బిక్కుబిక్కుమనేవాళ్ళం. మేమూ, దీపావాళ్ళూ కూడా అప్పుడే ఇళ్ళు కొనుక్కున్నాం. అదృష్టం బావుండి మాకేం కాలేదు కానీ, దీపా వాళ్ళాయన ఉద్యోగం పోయింది. యూరోపియన్ బేస్డ్ స్టార్టప్ లో చేసేవాడాయన. సరే.. ఒక ఉద్యోగమైనా ఉందని సర్దిచెప్పుకుని వెంటనే మళ్లీ వెతుక్కుంటే, దొరికింది కానీ బిజినెస్ ట్రిప్స్ ఉంటాయన్నారు. చిన్నపిల్లలతో కష్టమే కానీ, సరే చూద్దామనుకున్నారు పాపం. 

ఏం.. ఓ రోజు ఉదయాన్నే ఆఫీస్ కి వెళ్ళేసరికి అంతా గోలగోలగా ఉంది. వాల్డ్ ట్రేడ్ సెంటర్ కూల్చేసారని న్యూస్. ఇంకేవుందీ.. అదిగో పులి అంటే ఇదిగో తోక! మన డంబార్టన్ బ్రిడ్జ్ కూల్చేస్తారని పుకార్లు. ఏవయిందో తెలుసాండి.. న్యూస్ చూస్తూనే మన దీప విరుచుకుపడిపోయింది. వాళ్ళాయన ఆరోజు అక్కడే ఉన్నాడు." చెప్పుకుపోతోంది సుచిత్ర.

"ఓహ్.. న్యూయార్క్ లోనా? " నెమ్మదిగా పరుగందుకుంటున్న ట్రాఫిక్ ని గమనించి గ్యాస్ పెడల్ నొక్కాను. 

"ఆ.. న్యూయార్కే. ఏదో కాన్ఫరెన్స్ కి వెళ్ళాడు. ట్విన్ టవర్స్ లోనేనట కూడా. ఫోన్లు కలవడం లేదు. దీపని పట్టుకోలేకపోయాం. అతని ఆఫీస్ వాళ్ళు కూడా ఎవరినడిగినా ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇంక ఆఫీస్ లో ఉండలేక తనని తీసుకుని ఇంటికి బయల్దేరాను. రాఘవ్ ఆ రోజు వర్క్ ఫ్రం హోమ్ అనుకుంటా."

"ఊ.." 

"దారంతా గోల పెట్టేసింది. ఇంటికి ఎలా వచ్చామో గుర్తులేదు. మా ఇంటికి వెళ్దాం అంటే వీల్లేదంది. ఇంట్లోకి పరిగెడుతూనే ఇండియా కాల్స్ మొదలెట్టింది. వద్దన్నా వినదే..! నాకింకా తన ఏడుపు చెవుల్లో మోగుతోంది."

"అతను సేఫేనా ఇంతకీ?" కొంత విసుగు కూడా ధ్వనించిందేమో మరి.. నా గొంతులో. 

"వినండి.. వాళ్ళమ్మగారికి ఫోన్ చేసి, మధు ఇంటికి రావాలి... ఎక్కడెక్కడ పూజలు చేయిస్తారో, ఏం మొక్కులు మొక్కుతారో నాకు తెలీదు. ఆతను సేఫ్ గా ఉన్నాడని తెలియాలి. అని ఏడుపు.." 

"మీరు రోజా సినిమా చూశారా..?" అని అడగాలనే కోరిక బలంగా అణుచుకున్నాను.

"అప్పట్లో సత్యనారాయణస్వామి టెంపుల్ కి తరచూ వెళ్ళేవాళ్ళం. అక్కడి పూజారిగారు మాకు ఫేమిలీ ఫ్రెండ్. ఆయనకీ కాల్ చేసి చెప్పేసింది. మధు క్షేమంగా తిరిగొస్తే నూరు వ్రతాలు చేయించుకుంటానని."

"ఊ.."

"ఆ రోజంతా ఏమీ తెలియలేదు. మర్నాడు తెల్లవారుఝామున ఫోన్ వచ్చింది వాళ్ళాఫీస్ నుంచి. మధు సేఫ్ అని. కంగారు పడి ఎవరూ న్యూయార్క్ రావద్దని. వారానికి వెనక్కొచ్చాడు. సర్వైవర్స్ అందరినీ బస్సుల్లో ఇళ్ళకి పంపారు. మనిషి బాగా నలిగిపోయాడు. చాలారోజులు కౌన్సిలింగ్, థెరపీలూ అవీ చేశారు. షాక్ ఉంటుంది కదా..."

"అవును." ఎగ్జిట్ తీసుకున్నాను. లోకల్ రోడ్ల సిగ్నల్స్ మధ్యలో నెమ్మదిగా నడుస్తోంది కార్. 

"అదయ్యాక ఇక్కడ ఇంచుమించు రెండేళ్ళున్నారు. ఆ తరువాత వెస్ట్ కోస్ట్ కి వెళిపోయారు. చెప్పొచ్చేదేంటంటే, మధు వచ్చేశాక వాళ్ళు సత్యనారాయణవ్రతం చేయించుకునేందుకు వెళ్ళినప్పుడల్లా మేమూ వెళ్ళేవాళ్ళం. వాళ్ళు మూవ్ అయిపోయాక మేమూ ఆ కోవెలకి మళ్ళీ వెళ్ళలేదు. బాధొస్తుందబ్బా.."

"బాగా సెన్సిటివ్ అనుకుంటా.." 

"ప్చ్.. "

"ఓ సారి చూడండి. ఇటే కదా.. "

"ఓహ్.. వచ్చేసాం. నెక్స్ట్ సిగ్నల్.. గోమ్స్ ఇంటర్ సెక్షన్ మీద రైట్ తీసుకోండి."

ఇంటికెళ్ళి వండాలా..? కృష్ణా భవన్ నుంచి ఇడ్లీ తీసుకెళ్ళిపోవడమా? ఆలోచన. 

"నైన్ ఇలెవెన్ సర్వైవర్స్ చేత స్కూల్స్ లో మాట్లాడించేవాళ్ళు. మధు కోలుకున్నాక ఓ సారి శశాంక్ వాళ్ళ స్కూల్లో మాట్లాడడానికి వెళ్ళాడు. అంతా బానే ఉంది కానీ, అక్కడ ఓ ప్రెగ్నంట్ టీచర్ ని చూసి వణికిపోయి కిందపడిపోయాడట. ఇక్కడాపండి.. ఆ కల్డీసాక్ దగ్గర.. "

కార్ కర్బ్ కి దగ్గరగా ఆపాను. 

"చాలా థాంక్స్. ఇబ్బంది పెట్టేశాను." దిగుతూ అంది సుచిత్ర.

"పర్లేదు. గుడ్ నైట్. సీ యూ టుమారో.." నవ్వాను.

"లోపలికి రండి."

"మరోసారెప్పుడైనా.. లేటయింది." 

"వెళ్లి వంట చెయ్యాలా?" 

"చూడాలి."

"సరే అయితే. బై.. " డోర్ దగ్గరకి వెయ్యబోతున్న ఆమెని చూసి ఆగానొక్కక్షణం.

"ఇంతకీ అతనికి బానే ఉందా ఇప్పుడు?"

"ఓహ్.. మధుకా? ఊ.. స్కూల్లో పడిపోయాక కొంచెం సిక్ అయ్యాడు కానీ బానే ఉన్నాడు." డోర్ పట్టుకుని నిలబడింది.

"ఊ.. "

"ఆ నెలలో సత్యనారాయణవ్రతం చేయించుకునేటప్పుడు, హిస్టీరిక్ అయిపోయాడు. నా ప్రాణం కోసం మరో ప్రాణాన్ని లెక్కచెయ్యకుండా పరిగెత్తాను అని ఏడ్చాడు బాగా.. పాపం చేశాను అని."

"అంటే.. " 

"ఏం చెప్తాం అర్చనా.. సునామీలు, భూకంపాలు అంటే మనం ఆపలేం. కోరి జనాలని చంపేసే క్రూరత్వం ఎలా వస్తుందో ఈ టెర్రరిస్టులకైనా ఎవరికైనా.. కదా! తన తప్పేమీ లేకుండా చావుదాకా వెళ్ళొచ్చాడు పాపం అతను. పైగా బతికున్నన్నాళ్ళూ వెంటాడేదేదో జరిగి ఉంటుంది కళ్ళముందు."

"ఊ.. "

"దీప ఇంకెప్పుడూ అతన్ని టెంపుల్ కి తీసుకెళ్ళలేదు."

***

విశ్వతో చెప్పాలనిపించని కొన్ని విషయాల్లో ఇదొకటేమో. గట్టిగా హత్తుకుని పడుకున్నానారాత్రి. కౌగిల్లో రకాలెన్నో తనకి బాగా తెలుసు. 

"బజ్జో బజ్జో.." వీపు నిమురుతూ చెప్పాడు. 

థాంక్స్ చెప్పాలనిపిస్తుందొక్కోసారి.. మనకున్న జీవితానికి. 

***

23 comments:

  1. మధు మీ చేత మళ్ళీ కధని వ్రాయించాడు. ఎంతెంత దూరం కధని మధ్యలో ఆపేసారేవిటండీ ? దానిని కూడా పూర్తి చేయండి :)

    ReplyDelete
    Replies
    1. కదిలేదీ కదిలించేదీ ఏదో ఒకటుండాలి కదండీ.. ఈసారి మధు వంతు. :) ధన్యవాదాలు.

      'ఎంతెంతదూరం' కథ విషయానికొస్తే.. కొంతదూరం తగ్గిందికదా అని సంతృప్తి పడిపోయాను.:) పూర్తయినట్టనిపించలేదంటారా అయితే.

      Delete
  2. ఈ టాపిక్ ని ఇలాక్కూడా చెప్పొచ్చు అని రాసి చూపించారు. ఇంకా ఎన్ని కథలు రావాలో 911వి!

    ReplyDelete
    Replies
    1. అవునండీ. రావాల్సిన కథలెన్నో ఉన్నాయి. ధన్యవాదాలు.

      Delete
  3. నిజంగానే బాగా సెన్సిటివ్ అనుకుంటానండీ! కోరి జనాలని చంపేసే కౄరులే కాదు, చంపి ఆ నెపం వేరే వారి మీద వేసేసి, ఆ కారణంతో వారినే చంపేసేవారు కూడా ఉంటారు..ఇలాంటి లోకంలో అలాంటి సెన్సిటివ్ మనుషులు బతకటం కష్టమే!

    9/11 అయినా, 26/11 అయినా, నిర్భయలాంటి ఉదంతాలయినా మనలో చాలామంది రెండు రోజులు విపరీతంగా బాధపడి మూడోరోజుకి మర్చిపోతాం కాబట్టి పర్లేదు కానీ 9/11 లాంటివి లోతుగా చూస్తే మనమీద మనమే జాలి పడాల్సిన యదార్ధాలు చాలానే ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. మీ బ్లాగ్ పోస్ట్ లు ఇప్పుడే చూస్తున్నానండీ. ఇదే నేపధ్యంలో మీరు ప్రస్తావించిన 'ది న్యూ పెరల్ హార్బర్ ' చదవాల్సిన పుస్తకమే అయితే. ప్రత్యేక ధన్యవాదాలు.

      Delete
    2. హహ్హ...ధన్యవాదాలు! ఆ పుస్తకం గురించిన పోస్ట్ పబ్లిష్ చేసానని మీ కామెంట్ చూసిన తర్వాతే గుర్తొచ్చింది. డ్రాఫ్ట్ లోనే ఉండిపోయిందని అనుకుంటూ ఉన్నాను ఇన్నాళ్ళూ :-)

      కాకపోతే ఆ పుస్తకం కన్నా మొదటి పోస్ట్ లోని 'must see' వీడియోలు బెటర్ స్టార్టింగ్ పాయింట్ అని నా అభిప్రాయం, కొంచెం ఓపెన్ మైండ్ తో చూడాలంతే!

      Delete
  4. కథ చాలా బావుంది.

    బయట ఎన్ని యుద్దాలు జరిగినా చిట్ట చివరికి మనిషి గెలవాల్సింది తన లోపలి మనిషిమీదే. అది చాలా కష్టం

    ReplyDelete
  5. మొదటి వాక్యంతో నూటికి నూరు పాళ్ళూ ఏకీభవిస్తానండీ..
    పద్మరాజు గారు గుర్తొచ్చారు అక్కడక్కడా..
    చాన్నాళ్ళ తర్వాత మొదటిసారి చదవగానే అర్ధమైన కథ మీ బ్లాగులో :)
    Keep blogging!!

    ReplyDelete
    Replies
    1. మురళి గారూ,
      ఈ మాట నేను అందామని అనుకుని ఆగిపోయానండీ,కొన్నిసార్లు రెండు సార్లు చదవాల్సివచ్చి విరమించుకున్న సందర్భాలే ఎక్కువ ! తెలుగులో నా స్టాండర్డ్ ఇంతే అని బాధపడవలసి వచ్చే బ్లాగుల్లో ఇదొక్కటి :(

      Delete
    2. నా కథల గురించి మురళిగారు చాలా సార్లు అనేమాట ఇదేనండీ. :) ప్రయత్నిస్తాను ఇలా కూడా..

      Delete
    3. మురళి గారూ, ధన్యవాదాలు. :) ఆ పాపరాజు గార్లాంటి వాళ్ళ కథలు చదివే 'కథలు ' అని లేబుల్ పెట్టుకు రాసే ధైర్యం సరిపోవట్లేదండీ.

      Delete
    4. కొత్తావకాయ గారు మీ కథలు అన్ని బాగుంటాయి..అలా మొదటి సరి చదివి అర్థంకాక ఇంకోసారి చదివి అర్థం చేసుకోవడంలో ఉన్న మజాని దయచేసి అలాగె ఉండనివ్వండి.. ఇలాగ రాయండి .. అలాగకూడా రాయండి..(మనలో మన మాట.. అలాగే ఎక్కువ రాయండి)..
      :)

      Delete
    5. హహహా.. (అలాగేనండీ.) ధన్యవాదాలు.

      Delete
  6. వినాల్సినవి చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయ్. ఆవకాయ, అరిసెలు మిస్ అవడమే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయంటూ అమెరికా జీవితాలను చూపించే ప్రయతం..... బావుంది. ప్రొసీడ్.

    ReplyDelete
    Replies
    1. ప్రోత్సాహానికి ధన్యవాదాలండీ.

      Delete
  7. Vratam in satyanarayana temple is done on full moon days. Not ekadashi days :-). Story started in a promising way but ended with a whimper. Sorry Bout the blunt comment but keep writing.

    ReplyDelete
  8. Oops. Thank you. అనుకుంటూ చేసిన పొరపాటు. :) విమర్శ అవసరం.

    ReplyDelete
  9. kova garu......bhale ga undi story...
    super pACE.

    regards,
    your radio fan,
    Jyothy :)

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారూ, టచ్ చేశారు! :) ధన్యవాదాలు.

      Delete
  10. Not that it is such a big thing, but the rain coat's colour is pasupu and at the end it is referred as patcha. Unless it is "pasupupacha!". But keeping this aside it is such a nice piece and a refreshing one to read!:-)

    ReplyDelete
    Replies
    1. రైన్ కోట్ కామెంట్ వేరే కథలో పడ్డట్టుందండీ. :) నచ్చినందుకు ధన్యవాదాలు. ఆకుపచ్చ అని ప్రత్యేకంగా చెప్తే తప్ప పచ్చ అంటే పసుపనే నా బుర్రలో convention. ఆ అలవాటులో రాసేసినట్టున్నానండీ. :)

      Delete