Sunday, April 24, 2016

నువ్వు = నేను?

నీ ఒక్కో ప్రశ్నా వేల డాలర్ల విలువైనది. దోచిపోసినా తీరని ప్రశ్నలు కాదో!

గతవారం 'రాముడూద్భవించినాడూ రఘుకులమ్మునా..' అన్నానో లేదో, 'రాముడ్లాంటి వాడు కావాలీ, అక్కర్లేదూ కూడా.. కదా?' అని ఓ ములుకు వేసిపారేశావ్. 

కావాలా, అక్కర్లేదా? 'సీతా అండ్ హర్ షివల్రీ' అని ఉపన్యసిస్తే ముక్కున వేలేసుకుంటారో, ముక్కుకోసేస్తారో కానీ నువ్వన్నది మాత్రం నిజం. కన్న కొడుకుగానో, విల్లువిరిచే శౌర్యంగానో రాముడు కావాలిగానీ మరోలా అక్కర్లేదు మా ఆడవాళ్ళకి. భరించలేం. 

'త్రిభిః వ్యాప్తః రాఘవః' - కావాలి మాకు. 'త్రిభిః వ్యాప్నోతి' రాఘవుడున్నాడు చూడూ.. ఈ కాలంలో అసంభవం. దొరికితే మహద్భాగ్యం అనుకో! అది వేరే సంగతి. 

అలా చూడకు. టీకా చెప్తున్నా చెప్తున్నా. తేజస్సూ, యశస్సూ, కాంతి.. ఈ మూడిటిచే వ్యాపించేవాడు రాఘవుడట. అలాగే ధర్మార్ధకామాలను వరుసగా ముప్పూటలా ఆచరించేవాడట. ఈ టెంపరేచర్ కీ, టెన్షన్ లకీ, అన్నిటా దిక్కుమాలిన పీర్ ప్రెషర్ కీ.. మూడోది సరే, మొదటి రెండూ అయినా సాధ్యమా చెప్పు! 

సిలికాన్ వాలీలో ఆడ పనివాళ్ళకోసమని ఎగ్ షురెన్స్ వచ్చి మూడేళ్లవుతోందా.. వెన్నెల రాత్రులనీ, వెచ్చని కౌగిళ్ళనీ ఎవడబ్బ ఇన్ షూర్ చెయ్యగలడోయ్ బంగారూ?

పిల్లాడు రైన్ కోట్ పోగొట్టుకున్నాడని తిట్టిపోసాను. వాడిలోకంలో వాడున్నాడని 'ఆర్ యూ లిజనింగ్ టు మీ ?' అని బలవంతాన పీక్కొచ్చిమరీ తిట్టాను. వాణ్ణటు స్కూల్లో దింపేసి చూద్దునా అలమరలో మూలన పచ్చ రైన్ కోట్! చటుక్కున తలదించేసుకునే ఉంటాను. 'వింటున్నాడు కదా అని తిట్టాను. పాపం..' అని నీకు చెప్పుకుంటే వెటకారంగా నవ్వుతావా! స్కాఫ్!! ఓ పంటిగాటు తప్పించుకుంది నీ భుజం, ఆఫీస్ లో ఉండబట్టి. 

'నువ్వో అద్భుతమైన తల్లివేకానీ, చదువబ్బే సమయాల్లో పిలకాయల్ని బయటకి లాక్కురావడం కుదర్దు పో.. బడివిడిచేవేళకి రా. అప్పుడు చెప్పుకో నీ క్షమాపణలు.' అందా సిండీ మహాతల్లి.

'అలా పిల్లల్ని తిట్టామని స్కూల్లో చెప్పకండెప్పుడూ! రేప్పొద్దున్న లేనిపోనివన్నీ. అమెరికాలో పిల్లల్ని పెంచుతున్నామని మర్చిపోతున్నారు మీరు. అయినా పిల్లలు మనలా మనసులో పెట్టుకోరేమీ. ఇంతకీ వాడికి సారీ చెప్పారా?' అంది సుచిత్ర. సలహా చెప్పేవాడికి సమస్య చెప్పుకున్నవాడు లోకువ. 

ఎక్కడున్నాం మనం? ఎందుకొచ్చాం? పవర్ కట్ కీ, పొల్యూషన్ కీ పారిపోయొచ్చామా? వద్దొద్దు.. చిక్కుముళ్ళు వేసుకున్నది మనమేనని తెలిసీ ప్రశ్నించడానికి నేను వెర్రిదాన్నేం కాదు. లెట్స్ నాట్ గో దేర్. 

'పర్లేదమ్మా.. నీ క్షమాపణలు నేను ఆమోదించాను.' అని ఇంగ్లీష్ లో క్షమించాడు కొడుకు.

వస్తువు పారేస్తే అసహనం. లంచ్ బాక్స్ వెనక్కొస్తే కోపం. 
కూచుని మొహంలోకి చూస్తూ మాట్లాడలేని హడావిడి. 
'అన్నీ ఉన్నా అంచుకు తొగరే తక్కువ మీ పిల్లాడికి..' అంటున్న రిపోర్ట్ కార్డ్ చూస్తే బాధ. 
తాపీగా పిల్లల పెంపకాన్ని బోధించే సాటితల్లుల గొంతులు.. దూరదర్శన్ లో వ్యవసాయదారుల కార్యక్రమంలో... అర్ధమైంది కదా? ఆ టోన్ లో వినిపిస్తూంటే ఛిరాఖు.

తీరాచేసి వాడికి నేనేం చెయ్యగలుగుతున్నానని ఆలోచన రాగానే,  సేవింగ్స్ అకౌంట్ గుర్తొచ్చి నామీద నాకే అసహ్యమేసింది. బాల్యానికి ఖరీదు కట్టినందుకు. 

అప్పట్నుంచీ.. మనసు దొలిచేస్తోంది. ఉహూ.. వాడిగురించి కాదు. నేను దిద్దుకునే అవకాశముందింకా అక్కడ.

మనగురించి ఆలోచిస్తున్నాను. 

నీ స్పర్శకి పులకలుతేలే రోజులు పోయాయని, నిరుటి హిమసమూహాలని గుర్తుచేసుకుని ఏడుస్తూంటాను కదూ! 
మెకానికల్ గా తేనె మోసుకొచ్చే తేనెటీగలే ఆఫీసుల్నిండా! తల్చుకుంటే భయమేస్తోంది. ఎక్కడికి ఎవాల్వ్ అవుతున్నాం?

ఆర్గానిక్ కూరల్లా, ఆర్గానిక్ రోజులు ఎక్కడైనా అమ్మితే కొనుక్కొచ్చేసుకుందాం. 
డెడ్ లైన్లు, అప్రైజల్ లూ లేని పని. 
సాహిత్యసమావేశాలక్కర్లేని వాలుకుర్చీ, పుస్తకాల బీరువా రోజులు. 
సున్నిపిండితో చర్మం మెరిసే ఆరోగ్యాలు.

సర్లే.. కారణాలు వెతుక్కుని జీవితాన్ని తిట్టుకోడమెందుకుకానీ, అసలు నిజం చెప్పేస్తున్నా. 

వీటన్నిటికంటే ముఖ్యంగా.. మనం నడిచొచ్చిన దారిలో అప్పటి నేనెక్కడో జారిపోయానేమోనని చిన్న అనుమానం. 
గట్టిగా అంటే, ఔననేస్తావేమోనని చెప్పలేదిన్నాళ్ళూ.

నువ్వు ప్రేమించాలి.. నేను నీ ప్రేమను ఆస్వాదించాలి.
నేను ప్రేమిస్తే నువ్వు కిక్కురుమనకుండా ప్రేమించబడాలి. 

ఇరవై పౌండ్ల బియ్యంబస్తా నువ్వు మోసుకొస్తూంటే, కూరలసంచీ నేను తీసుకొచ్చినప్పుడు సమానత్వాన్ని నిస్సిగ్గుగా విడిచిపెట్టేశాను నేను. 
నా పీఎమ్మెస్ భరించినవాడికి కూడా హార్మోన్లుంటాయనీ, చిరాకులుంటాయనీ కన్వీనియెంట్ గా మర్చిపోయాను.

బుజ్జి డయల్ ఉన్న నాజూకైన వాచ్ నాది.. నీ సమయమంతా నాదే కావాలని పేచీ చాలా సార్లే.
'ఆడపిల్ల' అనే టైటిల్ ని గర్వంగా ధరిస్తూ, నీ భుజాలమీద నా బరువు చాలాసార్లే మోపాను.

అయినా సరే ఇదంతా నీకు తెలియడానికి వీల్లేదు. టీ కప్పుతో పకోడీల ప్లేట్ జోడిస్తే నీకర్ధమవ్వాలంతే. 

ఇంతకీ.. పసుపు రైన్ కోట్ లాగా, నీ మనసు కూడా అలమరలోనే ఉంది కదూ? 

24 comments:

 1. Sweet. కాకపోతే మొదట్లో రాముడి దగ్గర్నించి తరవాత స్వగతంలోకి ట్రాన్సిషన్ .. గంతు వేసినట్టుగా లేదూ?

  ReplyDelete
  Replies
  1. రామాయణం కదండీ.. గంతు సహజమనుకుంటా. :) ధన్యవాదాలు.

   Delete
 2. మరి కుర్రాడికి చెప్పిన క్షమాపణ అయ్యవారికి చెప్పరేం? పిల్లవాళ్ళకి చాలు పప్పుబెల్లాలు అయ్యవారికి ఐదు వరహాలు అంటే అయిదు పకోడీలు నోట్లో పెట్టి చాయ్ అందించటమా? :-)

  ReplyDelete
  Replies
  1. :) అంతే కదండీ మరీ. పకోడీలు క్షమాపణలపాటి చెయ్యవూ? ధన్యవాదాలు.

   Delete
 3. దుష్ట పురుష, అమాయక స్త్రీ పాత్రల స్త్రీవాద కథలు రాజ్యమేలుతున్న రోజుల్లో ఏటికి ఎదురీదే ప్రయత్నం చేశారే!!
  ఒక్కమాటలో చెప్పాలంటే, నేటితరం ఫెమినిస్టులు వ్యాఖ్య రాయడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేలా ఉందండీ కథ..
  మరీ ముఖ్యంగా, మొదటిసారి చదవగానే సారం దాదాపు అర్ధమైపోయింది, గత కథ లాగానే :) కీప్ రైటింగ్..

  ReplyDelete
  Replies
  1. ఒకే గాటకి కట్టేస్తూంటే నొప్పేసిందండీ.. చాలామంది మగవాళ్ళకి అనిపించినట్టే. మాకూ చెవులూ, మనసూ ఉంటాయని చెప్పే ప్రయత్నం. అంతే. ధన్యవాదాలు.

   Delete
 4. పొద్దున్నే ఈ పోస్ట్ చూడగానే ముందుగా అనిపించింది -Et Tu, Brute? Brute కి Literal meaning తీసుకోకండి మరి :) ఈ మధ్య కాలం లో రెండు విషయాలు are creating lot of controversy. 1) రాముడు 2) Feminism. రాముడి విషయంలో నేనేమీ వకాల్తా పుచ్చుకోవక్కర్లేదు లెండి. ఇన్ని వేల యుగాలు మనగలిగిన రాముడు ఎవరు అవునన్నా, ఇంకెవరు కాదన్నా భూమి వున్నంత కాలం - ఎరిగిన వారికి ఎదలో, ఎరుగని వారికి ఎదుటా - వుండనే వుంటాడు. ఇంక ఫెమినిజం. అది నా వరకు నాకు అర్థం కాని విషయం. సమానత్వాసమానత్వాల గురించి మాట్లాడాలంటే వాటి ఉనికి తెలియాలి - అది నాకసలు అనుభవం లోకి రాని భేదం. ఆ విషయ సంబంధమయిన పోస్టుల జోలికి నేనసలు వెళ్ళను - నా తెలియనితనం బయటపడుతుందని. కానీ మీ ఈ పోస్ట్ చదవగానే ఆగలేకపోయాను - చదివిన వెంటనే కామెంట్ పెడదామనుకున్నాను. కానీ ఆ వేడి లో పెడితే అంత balanced గా రాయలేనేమో అనిపించి took time to comment.


  కథలు అన్న label లో పెట్టారు కానీ - ప్రథమ పురుష లో రాయడంతో ఒక్క క్షణం ఇది కథ కాదేమో అని అనుమానం వచ్చింది. That's okay - కథ అవడం వల్ల నా అభిప్రాయం ఏం మారదనుకోండి :)


  మీరెందుకిలా రాశారు అని అడగను - కానీ మీ మాటే ఒకటి మీకు గుర్తు చేయాలని అనుకున్నాను.


  స్వాధీనే మాధుర్యే
  మధురాక్షర సంహితేషు వాక్యేషు
  కిం నామ సత్త్వవన్తః
  పురుషాః పరుషాణి భాషన్తే॥

  తీయదనం తమవశమై ఉండగా, తీయని పలుకులు తమకు లొంగి ఉండగా బుధ్దిమంతులు పరుషాలెందుకు పలుకుతారో!
  ఇన్ని అందమైన పదాలుండగా వాటిని విడిచిపెట్టి కఠినమైన మాటలు మాట్లాడడమెందుకు? మాట్లాడేటపుడైనా, రాసేటపుడైనా “better word” వెతుక్కుంటే చాలు. మాట, రాత కూడా అందంగా ఉంటుంది.
  పైన మీరు చెప్పిన మీ మాట మాటకే కాదు - భావానికి కూడా వర్తిస్తుందండీ :( మీరు పోస్ట్ లో రాసిన విషయాన్ని ఏది నాకు ఇబ్బంది కలిగించిందో చెప్పాలంటే ఆ మాటలు నేను quote చేయాలి - which I don't want to re-state from your post.  సింపుల్ గా చెప్పాలంటే మీ ఈ పోస్టు ఏ నోము ఫలమో ఏ నోటి వరమో ఈ ప్రేమ జవరాలా అని రాసిన సముద్రాల వారు పిల్లా చావ్వే - I love you అంటే ఛీ కొట్టి పోతావ్ - ఓ పిల్లా చావ్ చావ్ అని రాసినట్టు ఉంది. అంతే !

  ReplyDelete
  Replies
  1. ముందస్తుగా మీ స్పందనకి ధన్యవాదాలు. :)

   ప్రధమపురుష కథనంలో పాత్రలచేత ఈసారెప్పుడైనా లాటరీ టికెట్ కొనిపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచనొచ్చింది. :)

   మీకు నచ్చక, మిమ్మల్ని బాధపెట్టినవాటిగురించి ఒకటే మాట చెప్పగలనండీ.. సముద్రాల అనుకుని ముద్రవేయడం వలన కలిగిన ఇబ్బందే ఇదంతా అనుకుంటాను.

   Delete
  2. తప్పులు చేశానండీ - అందుకే వెనక్కి వచ్చాను.

   1) వ్యక్తులని పోల్చడం అనేది అసలు చేయని నేను పొరపాటున సముద్రాల వారి పేరు తీసుకొచ్చాను. పాటలతో ఆగిపోయివుంటే బావుండేది.


   2) కథ చదవగానే - ఇలాంటివి రాయడానికి బోల్డు మంది వున్నారు కదా , తిను కూడా రాయాలా - అనిపించి ఏదేదో అనేశాను - where I took too much liberty. I should have given it a thought before I added my comment here. My role as a reader should have stopped at either liking and adding an appreciative comment OR not liking the story and keeping quiet after reading it. It's none of my business to comment on your choice of subject / words. I sincerely apologize for going overboard. I know what caused this - based on my interactions with you & my appreciation for your artistry in Telugu, I kind of felt like I was doing good - trying to stop you from exploring unpalatable genres (this unpalatable is only from my view) - which I shouldn't have done. Please don't mind.

   Delete
  3. అయ్యో.. భలేవారేనండీ. పోలికకి కాదుగానీ మొన్నెప్పుడో కే. రాఘవేంద్రరావు ఇంటర్వ్యూలో విన్న ఓ మాట గుర్తొచ్చింది. "పాటలు బా తీస్తాడు. అంటే బాధనిపిస్తుంది. మంచి సబ్జెక్ట్లు కూడా తీసానుకదా అని. మళ్ళీ సర్దేసుకుంటాను." అని. అలా ఉంది నా పరిస్థితి. :)

   Delete
 5. వామ్మో, ఈ పోస్టులోని కొన్ని వాక్యాలు ఏమగాడన్నా రాసుంటే ... వాడికి మూడింది, నాలిగింది అన్నమాటే ! ఆధైర్యం మా పురుష పుంగవులకు లేదు / ఇప్పట్లో రాదు !

  కథ విషయానికి వస్తే, మీరు దీన్ని చెప్పిన విధానం, మీ రచణా శైలి చాలా బావుంది.. !

  ReplyDelete
  Replies
  1. 'మేల్ కొలుపు' ఎప్పుడో పాడారు కదండీ ఒకాయన. :) ధన్యవాదాలు.

   Delete
 6. కొత్తావకాయకు పరిచయం ఎందుకు. పోస్ట్ చూడగానే గబగబా చదివేసా. అధ్బుతం. స్వగతమ? కల్పిక? సప్త సముద్రాలు దాటిన వారెవరైనా, దేశం వదిలిన వాళ్లైన వెంటనే దీనిని అన్వైయం చేసుకోవచ్చు. భలే వ్రాసారు. సాహో నరుడా!!!

  ReplyDelete
 7. అంకెలు వేయకుండా గుప్పెట్లో చుక్కలు ఆరేశారు... కలిపితే ఏ బొమ్మ కనిపిస్తుందో!

  ReplyDelete
  Replies
  1. :) యద్భావం తద్భవతి. ధన్యవాదాలు.

   Delete
 8. Short & sweet! అపాలజీ కూడా ఇంత చక్కగా చెప్పొచ్చా అనిపించింది :-)

  కానీ పైన నారాయణస్వామి గారి మాటే నాది కూడా! రెండు ముక్కలు అతికించినట్టుగా అనిపించింది!

  లేకపోతే నాకే సరిగా అర్థం కాలేదంటారా? :-))

  ReplyDelete
  Replies
  1. ఆడవాళ్ళ అపాలజీలు కూడా ఇలా అర్ధం కానట్టుంటాయన్నమాట. :) ధన్యవాదాలు.

   Delete
 9. ఒక బస్తా ..కూరల సంచీ నాకు ఎపుడూ గుర్తుకు వస్తూనే ఉంటాయి. అందుకే నేనెపుడూ సమానత్వం గురించి ప్రశ్నించను కానీ మనిషికి సమాన న్యాయమైనా దొరకాలి అనిపిస్తుంటుంది.ఒకే తప్పు ఇద్దరు కలిసి చేసినపుడు ఆడవారికొక శిక్ష మగవారికొకరకమైన శిక్ష ఏమిటసలు ? ఈ విషయంలో ఆడవాళ్ళ గొంతు పెగలదు. నేనెపుడూ ప్రధమ పురుషలోనే వ్రాస్తుంటాను.ప్రధమ పురుషలో వ్రాస్తే కధ అనకూడదా ? కధానిక అని అనాలా ? తెలియపరచగలరు.

  ReplyDelete
  Replies
  1. ప్రతీవిషయంలోనూ నాణానికి రెండువైపులూ ఉంటాయి కదండీ. ఆడవారి గొంతు పెగలని సందర్భాల్లాగే, మగవారి గొంతు వినబడని సందర్భాలూ ఉంటాయి.

   నాకు అర్ధమైనంతలో రాయడానికి గీతలూ, గళ్ళూ ఏమీ అవసరం లేదండీ. 'నేను..' అని కథచెప్పడంలో ఓ సులువు మాత్రం ఉంటుంది.

   ధన్యవాదాలు.

   Delete
 10. >ప్రధమ పురుషలో వ్రాస్తే కధ అనకూడదా ? కధానిక అని అనాలా ? తెలియపరచగలరు.
  ప్రథమపురుషలో కూడా నిరభ్యంతరంగా కథలు వ్రాయవచ్చును. కథపరిమాణం చిన్నది ఐనప్పుడు దానిని కథానిక అనటం‌ పరిపాటి. ఈ విషయంలో ప్రథమాది పురుషభేదాలు లేవు.

  ReplyDelete
  Replies
  1. వివరణకు ధన్యవాదాలండీ.

   Delete