Sunday, April 24, 2016

నువ్వు = నేను?

నీ ఒక్కో ప్రశ్నా వేల డాలర్ల విలువైనది. దోచిపోసినా తీరని ప్రశ్నలు కాదో!

గతవారం 'రాముడూద్భవించినాడూ రఘుకులమ్మునా..' అన్నానో లేదో, 'రాముడ్లాంటి వాడు కావాలీ, అక్కర్లేదూ కూడా.. కదా?' అని ఓ ములుకు వేసిపారేశావ్. 

కావాలా, అక్కర్లేదా? 'సీతా అండ్ హర్ షివల్రీ' అని ఉపన్యసిస్తే ముక్కున వేలేసుకుంటారో, ముక్కుకోసేస్తారో కానీ నువ్వన్నది మాత్రం నిజం. కన్న కొడుకుగానో, విల్లువిరిచే శౌర్యంగానో రాముడు కావాలిగానీ మరోలా అక్కర్లేదు మా ఆడవాళ్ళకి. భరించలేం. 

'త్రిభిః వ్యాప్తః రాఘవః' - కావాలి మాకు. 'త్రిభిః వ్యాప్నోతి' రాఘవుడున్నాడు చూడూ.. ఈ కాలంలో అసంభవం. దొరికితే మహద్భాగ్యం అనుకో! అది వేరే సంగతి. 

అలా చూడకు. టీకా చెప్తున్నా చెప్తున్నా. తేజస్సూ, యశస్సూ, కాంతి.. ఈ మూడిటిచే వ్యాపించేవాడు రాఘవుడట. అలాగే ధర్మార్ధకామాలను వరుసగా ముప్పూటలా ఆచరించేవాడట. ఈ టెంపరేచర్ కీ, టెన్షన్ లకీ, అన్నిటా దిక్కుమాలిన పీర్ ప్రెషర్ కీ.. మూడోది సరే, మొదటి రెండూ అయినా సాధ్యమా చెప్పు! 

సిలికాన్ వాలీలో ఆడ పనివాళ్ళకోసమని ఎగ్ షురెన్స్ వచ్చి మూడేళ్లవుతోందా.. వెన్నెల రాత్రులనీ, వెచ్చని కౌగిళ్ళనీ ఎవడబ్బ ఇన్ షూర్ చెయ్యగలడోయ్ బంగారూ?

పిల్లాడు రైన్ కోట్ పోగొట్టుకున్నాడని తిట్టిపోసాను. వాడిలోకంలో వాడున్నాడని 'ఆర్ యూ లిజనింగ్ టు మీ ?' అని బలవంతాన పీక్కొచ్చిమరీ తిట్టాను. వాణ్ణటు స్కూల్లో దింపేసి చూద్దునా అలమరలో మూలన పచ్చ రైన్ కోట్! చటుక్కున తలదించేసుకునే ఉంటాను. 'వింటున్నాడు కదా అని తిట్టాను. పాపం..' అని నీకు చెప్పుకుంటే వెటకారంగా నవ్వుతావా! స్కాఫ్!! ఓ పంటిగాటు తప్పించుకుంది నీ భుజం, ఆఫీస్ లో ఉండబట్టి. 

'నువ్వో అద్భుతమైన తల్లివేకానీ, చదువబ్బే సమయాల్లో పిలకాయల్ని బయటకి లాక్కురావడం కుదర్దు పో.. బడివిడిచేవేళకి రా. అప్పుడు చెప్పుకో నీ క్షమాపణలు.' అందా సిండీ మహాతల్లి.

'అలా పిల్లల్ని తిట్టామని స్కూల్లో చెప్పకండెప్పుడూ! రేప్పొద్దున్న లేనిపోనివన్నీ. అమెరికాలో పిల్లల్ని పెంచుతున్నామని మర్చిపోతున్నారు మీరు. అయినా పిల్లలు మనలా మనసులో పెట్టుకోరేమీ. ఇంతకీ వాడికి సారీ చెప్పారా?' అంది సుచిత్ర. సలహా చెప్పేవాడికి సమస్య చెప్పుకున్నవాడు లోకువ. 

ఎక్కడున్నాం మనం? ఎందుకొచ్చాం? పవర్ కట్ కీ, పొల్యూషన్ కీ పారిపోయొచ్చామా? వద్దొద్దు.. చిక్కుముళ్ళు వేసుకున్నది మనమేనని తెలిసీ ప్రశ్నించడానికి నేను వెర్రిదాన్నేం కాదు. లెట్స్ నాట్ గో దేర్. 

'పర్లేదమ్మా.. నీ క్షమాపణలు నేను ఆమోదించాను.' అని ఇంగ్లీష్ లో క్షమించాడు కొడుకు.

వస్తువు పారేస్తే అసహనం. లంచ్ బాక్స్ వెనక్కొస్తే కోపం. 
కూచుని మొహంలోకి చూస్తూ మాట్లాడలేని హడావిడి. 
'అన్నీ ఉన్నా అంచుకు తొగరే తక్కువ మీ పిల్లాడికి..' అంటున్న రిపోర్ట్ కార్డ్ చూస్తే బాధ. 
తాపీగా పిల్లల పెంపకాన్ని బోధించే సాటితల్లుల గొంతులు.. దూరదర్శన్ లో వ్యవసాయదారుల కార్యక్రమంలో... అర్ధమైంది కదా? ఆ టోన్ లో వినిపిస్తూంటే ఛిరాఖు.

తీరాచేసి వాడికి నేనేం చెయ్యగలుగుతున్నానని ఆలోచన రాగానే,  సేవింగ్స్ అకౌంట్ గుర్తొచ్చి నామీద నాకే అసహ్యమేసింది. బాల్యానికి ఖరీదు కట్టినందుకు. 

అప్పట్నుంచీ.. మనసు దొలిచేస్తోంది. ఉహూ.. వాడిగురించి కాదు. నేను దిద్దుకునే అవకాశముందింకా అక్కడ.

మనగురించి ఆలోచిస్తున్నాను. 

నీ స్పర్శకి పులకలుతేలే రోజులు పోయాయని, నిరుటి హిమసమూహాలని గుర్తుచేసుకుని ఏడుస్తూంటాను కదూ! 
మెకానికల్ గా తేనె మోసుకొచ్చే తేనెటీగలే ఆఫీసుల్నిండా! తల్చుకుంటే భయమేస్తోంది. ఎక్కడికి ఎవాల్వ్ అవుతున్నాం?

ఆర్గానిక్ కూరల్లా, ఆర్గానిక్ రోజులు ఎక్కడైనా అమ్మితే కొనుక్కొచ్చేసుకుందాం. 
డెడ్ లైన్లు, అప్రైజల్ లూ లేని పని. 
సాహిత్యసమావేశాలక్కర్లేని వాలుకుర్చీ, పుస్తకాల బీరువా రోజులు. 
సున్నిపిండితో చర్మం మెరిసే ఆరోగ్యాలు.

సర్లే.. కారణాలు వెతుక్కుని జీవితాన్ని తిట్టుకోడమెందుకుకానీ, అసలు నిజం చెప్పేస్తున్నా. 

వీటన్నిటికంటే ముఖ్యంగా.. మనం నడిచొచ్చిన దారిలో అప్పటి నేనెక్కడో జారిపోయానేమోనని చిన్న అనుమానం. 
గట్టిగా అంటే, ఔననేస్తావేమోనని చెప్పలేదిన్నాళ్ళూ.

నువ్వు ప్రేమించాలి.. నేను నీ ప్రేమను ఆస్వాదించాలి.
నేను ప్రేమిస్తే నువ్వు కిక్కురుమనకుండా ప్రేమించబడాలి. 

ఇరవై పౌండ్ల బియ్యంబస్తా నువ్వు మోసుకొస్తూంటే, కూరలసంచీ నేను తీసుకొచ్చినప్పుడు సమానత్వాన్ని నిస్సిగ్గుగా విడిచిపెట్టేశాను నేను. 
నా పీఎమ్మెస్ భరించినవాడికి కూడా హార్మోన్లుంటాయనీ, చిరాకులుంటాయనీ కన్వీనియెంట్ గా మర్చిపోయాను.

బుజ్జి డయల్ ఉన్న నాజూకైన వాచ్ నాది.. నీ సమయమంతా నాదే కావాలని పేచీ చాలా సార్లే.
'ఆడపిల్ల' అనే టైటిల్ ని గర్వంగా ధరిస్తూ, నీ భుజాలమీద నా బరువు చాలాసార్లే మోపాను.

అయినా సరే ఇదంతా నీకు తెలియడానికి వీల్లేదు. టీ కప్పుతో పకోడీల ప్లేట్ జోడిస్తే నీకర్ధమవ్వాలంతే. 

ఇంతకీ.. పసుపు రైన్ కోట్ లాగా, నీ మనసు కూడా అలమరలోనే ఉంది కదూ?