Sunday, March 6, 2011

రాధ ఏమంది?

నెచ్చెలీ,
కుశలమా? 'నువ్వెలా ఉన్నావే?' అని నన్ను పొరపాటున కూడా అడగకు సుమా!
చెలియలి కట్ట తెంచి మరీ నా కన్నుల నీరు చూడగలవా? నేను బాగా లేను నేస్తం.

వెన్నెల స్నానమాడి రేయి మత్తుగా గడుస్తోంది. మనం బొమ్మల పెళ్ళెళ్ళు, దాగుడుమూతలు ఆడుకున్న కదంబవనం, పాల కడవలాంటి గోకులం, గుమ్మడి పాదంటి గోశాల, రెండో ఝాము నిద్రలో మునగదీసుకున్నాయి. నువ్వు చిక్కులు తీసి, పాయలల్లి, జాజులు ముడిచిన నా నల్లని జడలా యమున మాత్రం వెన్నల వెలుగుల పువ్వులద్దుకొని వడి వడిగా పరిగెడుతోంది. ఎంత అందమో తెలుసా! ఈ నలుపు, తెలుపుల చిత్రాన్ని నువ్వు చూస్తే, నీలి కలువల్లాంటి నీ కళ్ళు తిప్పుకోకుండా, నీ పసిడి మోము అద్దంలో ఆనందం వెయ్యింతలవుతూండగా, నా చేయి నొక్కి చెప్తావు. "రాధా, చూడవే.. రెప్ప వేయకే.. కునుకు తీయకే.. ఈ ప్రకృతిని అవమానించకే.." అని. యమున ఒడ్డున ఇసుక తిన్నెల మీద, చల్లగాలిని చీల్చుకొని మెరుపు బాణాల్లా పరుగులు తీస్తూ అలసేదాకా ఆడేవాళ్లం. మురళి రవళి ఎక్కడిదని చెట్టూ, పుట్టా గాలించి గెలిచేవాళ్ళం. ఇలాంటి ఎన్ని చల్లని వేళలు కలిసి కబుర్లు చెప్పుకున్నాం! ఎన్ని పాటల పొగడ దండలు కట్టుకున్నాం! ఎన్ని పరాచికాలాడుకున్నాం! ఆ రోజుల్లో ఒక్కటైనా తిరిగి వస్తుందా, సఖీ? సృష్టి లో ఏ బంధానికీ ఎడబాటు తప్పదా? ఒక దాన్ని మరొకటి రద్దు చేయనిదే మనలేవా ఈ ప్రాపంచిక సంబంధాలు? నువ్వో తెల్లావు, నేనో ఎర్రావునైనా ఒకే మందలో వెర్రి జీవితం గడిపేసేవాళ్ళం కదా! ఆత్మ బంధం ఈ చుట్టాలు, పక్కాలతో కుదిరేదా చెప్పు!

నువ్వెళ్ళిపోయావు. నీ మువ్వల మెట్టెలు చూస్తూ, పెదవంచున దుఃఖం ఆపుకుంటున్న నన్ను లేగదూడని సవరదీసినట్టు అక్కున చేర్చుకుని 'ఆషాఢ మాసం తొందర్లో రానుంది. వచ్చేస్తానుగా! నా గులాబి మొక్కలు జాగ్రత్తా! జలజల రాలేని జాజులు ఇంక మా రాధమ్మకే . పోటీ రాను గా నేనూ! అయినా నీలా ఉన్న ఊళ్ళో మనువు అందరికీ దొరుకుతుందా.. ఏం?' అని మేలమాడి మొహం తిప్పుకు వెళ్లిపోయావే కానీ నీ కళ్ళలో బెంగ నాకు తెలియనిదా నేస్తం?

రేపల్లెలో ఒంటరిగా మిగిలినది ఈ రాధ, ఆ కడిమి చెట్టూ..
ఆశ్చర్యపోతున్నావా! అవును. కృష్ణుడు వెళ్ళిపోయాడు. నువ్వలా వెళ్ళిన రోజే ద్వారక నుంచి వచ్చారు. నా సంతోషాన్ని రాచకార్యం పేరు చెప్పి దోచుకుపోయారు. మురళీ గానం వినిపించని రేపల్లె ఎంత మూగబోయిందో తెలుసా? నా జీవితమంత.

మహా మాయావి సుమీ అతడు. మనసే అనుకున్నాను. నిద్ర, ఆకలి, విషయాసక్తి, అనందం ఆఖరికి బాధ కూడా తీసుకుపోయాడు తనతో! విరహమనుకున్నాను. కాదు. ఇది అహరహమూ ఉండే వెలితి. వంశీ మనోహరుని నోట వినని నా పేరు నాకే చేదు. మాధవుడు చూడని నా సొగసు నాకే బరువు. ఇక ఇంతేనా? వెన్నెలల సొగసు ఏటిపాలేనా? మల్లియల ఉసురు రాతిపాలేనా?

ఒక కబురు లేదు. ఎన్నేళ్ళ ఎదురుచూపో లెక్క తెలియదు. పోనీ రాచకార్యం పూర్తయ్యాక రాధ గుర్తొచ్చేనేమో అంటే, అంత సులువుగా అయ్యేది రాచకార్యమెలా అయ్యేను? అయినా అతడు రావాలని ఎదురుచూపేల? నాకే రెక్కలు మొలవకూడదూ? రేపల్లెలో పలుపు తాళ్ళన్నీ రాధని బంధించడానికేనా? పోనీ, మరచిపోదామనుకున్నా.. మరవాలనుకున్నది మాధవుడిని, జగదేక సుందరుని!  పిల్లగాలి, ఆ జాబిలమ్మ, ఆ యమున వల్లే కాలేదు! నేనెంత! మాయ చేసాడే! వాడు మంత్రమేసాడే!

అత్తమ్మ గడుసుది కదా! పసిగట్టేసింది.  "రాచ బిడ్డ ఏదో పసితనం కొద్దీ చల్ల కడవల వెంట, గొల్ల భామల వెనుకా తిరిగాడు. చేతనున్న పాల కుండలో కనిపించినా చంద్రుడు ఉండేది ఆకాశంలోనే. మన పనులు మానుకు చింతిస్తే బువ్వెక్కడిదీ?" అని దుత్తలని, దూడలనీ వంక పెట్టుకొని దులిపేస్తోంది. ఊరంతా తిడుతోంది నన్ను. పరధ్యానం పరువు తీస్తోంది. పొద్దు గూకితే జ్ఞాపకాల చీకటి కమ్మేసి ముంచేస్తోంది. సూరీడి వెలుగు బాధ్యతల బరువు మోసుకొస్తుంది. ఏదీ ఆగదు కదా! అతగాడు ఆపి వెళ్ళిన నా గుండె గడియారం తప్ప.

ఇది తీరే వేదన కాదు. ప్రియంవదా! నీ మాటలు వెన్నలా ఈ మంటని చల్లబరిచే అవకాశం లేదు కదా! స్నేహాన్ని దూరం, కాలం లేశమాత్రం మాపలేవు. నిజమే! కాని దూరం గుండెల్లో బరువుని ఇంత సులువు గా రెట్టింపు చేస్తుందని నాకు తెలియదు సుమా! 'కృష్ణుడు కావాలా? నువ్వు కావాలా?' అని ఇప్పుడు నన్ను అడిగితే నిన్నే కోరుకుంటాను. నువ్వు తోడుంటే ఈ విరహాన్ని ఈదేస్తాను. కృష్ణుడున్నా నువ్వు లేనిదే, నీతో అతని లీలలు, చేష్టలు చెప్పి మురుసుకోనిదే నా ప్రేమాతిశయం పరిపూర్ణం కాదు.

నేను చేసిన పుణ్యానికి నందకిశోరుడిని కొంగున కట్టుకోవాలనుకోవడం అత్యాశే..! ప్రేమ దక్కని క్షణంలో చెంతన స్నేహితురాలు ఉండాలనుకోవడం మరీ అలవిగాని వరం కాదేమో కదా! ఈ లేఖ నిన్ను నిలువనీయదని తెలుసు. నువ్వుంటే చాలు. ఎంతటి వేదననైనా జయించేస్తాను.

పూయని కడిమి తోడుగా నీకోసం ఎదురుచూస్తున్న,

నీ
రాధ.

5 comments:

 1. Wow so expressive,keep itup. Neelo kapi nidra lechinattundi !!!

  ReplyDelete
 2. బాగా చెప్పారు, రాధమ్మ మనసులో మాట.

  ReplyDelete
 3. ఆహా!.. అద్భుతంగా వ్యక్తీకరించారు. వర్ణనలు ఎంత మనోహరంగా ఉన్నాయో!..

  >>నువ్వు చిక్కులు తీసి, పాయలల్లి, జాజులు ముడిచిన నా నల్లని జడలా యమున మాత్రం వెన్నల వెలుగుల పువ్వులద్దుకొని వడి వడిగా పరిగెడుతోంది.

  >>నువ్వో తెల్లావు, నేనో ఎర్రావునైనా ఒకే మందలో వెర్రి జీవితం గడిపేసేవాళ్ళం కదా! ఆత్మ బంధం ఈ చుట్టాలు, పక్కాలతో కుదిరేదా చెప్పు!

  >>వంశీ మనోహరుని నోట వినని నా పేరు నాకే చేదు.

  >>ఏదీ ఆగదు కదా! అతగాడు ఆపి వెళ్ళిన నా గుండె గడియారం తప్ప.

  పై లైన్లు బాగా నచ్చాయి. Thanks.

  ReplyDelete
 4. @మురారి గారు,

  ఎంతో ప్రీతితో రాసుకున్న వాక్యాలు అవి. మెచ్చుకున్నందుకు ఏనుగెక్కినంత సంబరం గా ఉంది. ధన్యవాదాలు.

  @మందాకిని గారు మరియు అనానిమస్ గారు ధన్యవాదాలు.

  ReplyDelete
 5. రాధ వియోగ బాధ కంటే స్నేహానికే ప్రాముఖ్యతనిచ్చి ఎంత బాగా వర్ణించారు. వెన్నెల్లో యమున వర్ణన కళ్ళకు కట్టినట్టుగా వుంది.

  ReplyDelete