Thursday, December 15, 2011

మంచి వెన్నెల వేళ: కాత్యాయనీ వ్రతం -1

తెలవారు ఝామున అందరినీ నిద్ర లేపే బాధ్యత   సురభికి అప్పచెప్పి, గోపభామలందరూ ఇళ్ళకి చేరుకున్నారు. పడక మీదకి చేరిన వారందరి మనసుల్లోనూ ఒకటే ఆలోచన. "తెల్లవారు ఝామున తెలివొస్తుందా?"

ఇంటిల్లి పాదికీ మరో మారు తనని తెల్లవారుఝామున  నిద్రలేపమన్న విషయం గుర్తు చేసింది తరళ. "తెలివి రాదేమో! రాత్రంతా జాగరణ చేద్దామా?" అని ఆలోచిస్తోంది మేదిని. దుప్పటి కప్పుకోకుండా నిద్రకి ఉపక్రమించింది మంజుల.. చలికి తెలివొస్తుందన్న ఆశతో! కిటికీ తలుపు ఓరగా తెరచిపెట్టుకుంది కమలిని, సురభి పిలిచినప్పుడు వినిపించడానికి వీలుగా.

"దేముడి మీద భక్తి కాదర్రా.. మీరంతా ప్రసాదం భక్తులు! చూద్దాం..  మీది ఆరంభ శూరత్వమో, నెల్లాళ్ళూ నియమం తప్పకుండా వ్రతం చేస్తారో!" ములుకుల్లాంటి మాటలతో గుచ్చింది ఓ అమ్మాయిని ఆమె నాయనమ్మ. కోపంగా పళ్ళు నూరుతూ ముసుగు తన్నిందా మనుమరాలు. నిజంగానే "నల్లనయ్య కావాలి." అనే కోరికే వాళ్ళందరి మనసుల్లోనూ లేకపోతే ఆ సుమసుకుమారులు కఠిన నియమాలతో కూడిన ఇలాంటి వ్రతానికి తలపెట్టేవారు కాదేమో!

అక్కడ సురభి మనసులో వెయ్యి ఆలోచనలు. "నిద్ర లేపుతానని మాటిచ్చాను. బాధ్యత నెత్తి మీద వేసుకుని నేనే నిద్ర లేవలేకపోతేనో! మునిపల్లెలో తెలుసుకుని వచ్చిన నియమాలన్నీ ఇంకా అందరికీ చెప్పలేదు. రాజుగారితో మాట్లాడిన విషయాలు కూడా! నియమాలు చెప్తే మంజుల, వసుధ లాంటి పిరికి పిల్లలు వెనక్కి తగ్గుతారా? ఏమో! ఎవరొచ్చినా రాకపోయినా నేనైతే ఈ వ్రతాన్ని చేసి తీరుతాను. వంశీమోహనుడు నా సొంతం కావాలి. పైగా ఊరికి మేలు జరుగుతుందట కూడాను." ఆలోచిస్తూండగానే నిద్రా దేవి ఆమెని తన ఒళ్ళోకి తీసుకుంది.

అర్ధరాత్రి దాటగానే మెలుకువొచ్చింది కమలినికి. "హమ్మయ్యో! సురభి వచ్చి వెళ్ళిపోయిందా?" అని గాభరా పడుతూ లేచి, ఒక్క ఉదుటన వీధిలోకి వచ్చింది. పుచ్చపువ్వులా వెన్నెల విరగకాస్తోంది. చలికి కదులుతున్న గోవుల సడి, కీచురాళ్ళ రొద తప్ప వేరేదీ వినిపించడం లేదు. సమయం ఎంతయిందో కూడా అర్ధం కాలేదామెకి. గబగబా సురభి ఇంటివైపు అడుగులు వేసింది. కిటికీ తలుపు తోసి చూస్తే, సురభి గాఢంగా నిద్రపోతూ కనిపించింది . కమలిని ఒక్క క్షణం గర్వంతో పొంగిపోయి, తనని తనే మెచ్చుకుంది. అందరికంటే ముందు తనే నిద్ర లేచింది!

"సురభీ.. లే లే.." అని పిలిచింది. ఉలిక్కి పడి లేచింది సురభి. మంకెనల్లాంటి కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చి గజగజా వణుకుతూ "అర్ధరాత్రి దాటిందే కమలినీ ఇంకా.. నీ ఆత్రం బంగారంగానూ!" అని విసుక్కుంది.
"అవునా! తెలివొచ్చిందని ఇలా వచ్చేసాను. నువ్వెళ్ళి పడుకో." కమలిని నొచ్చుకుంది.
"ఇంక నిద్ర పట్టదులే. రా.. లోపలికి. ఓ ఝాము గడిస్తే ఎలాగూ బయలుదేరాలి. నీకు నిద్రొస్తే ఇక్కడే పడుక్కో. నాకింక మెలకువే." ఎర్రబడ్డ కళ్ళలో ఊరుతున్న చెమ్మని పైట చెంగుతో అద్దుకుంటూ చెప్పింది సురభి.
"నాకూ ఇంక నిద్ర పట్టదులే. కాసేపు కబుర్లు చెప్పుకుందాం." ఇంట్లోకి దారితీస్తూ అంది కమలిని.
"వెన్నెల చూడు.. పాల తరకలా ఎలా మెరిసిపోతోందో!" తలుపేస్తూ ఆకాశంవైపు చూసి చెప్పింది సురభి.
"ఈ మాసమే ఎందుకంత గొప్పది సురభీ? వెన్నెల వేళలనా?"
"హ్మ్.. అదీ ఓ కారణమనుకో.. చంద్రుడు ఓషధులకు అధిపతి. సత్వగుణ సంపన్నుడు. అలాంటి చంద్రుడు వృధ్ధిలో ఉండే కాలమిది. పైగా ఇంకో నెలలో ఉత్తరాయణం వస్తుంది. నీకు తెలుసు కదా! దేవతలకు ఉత్తరాయణం పగలు, దక్షిణాయణం రాత్రీను. అంటే ఈ నెల తెల్లవారుఝామన్నమాట. దేవతలకే అమృత గడియలివి. ఈ కాలంలో చేసిన పూజలు వృధా కావు. పైగా చంద్రుడి మూలంగా మనందరిలోనూ సత్వగుణం పెరుగుతుంది. అంటే మంచితనమన్నమాట! మంచి మాటలు మాట్లాడాలనీ, మంచి పనులు చెయ్యాలనీ అనిపిస్తుందన్నమాట. నిజమే కదూ! ప్రకృతి ఇంత మనోహరంగా, చల్లగా, హాయిగా ఉంటే ఎవరితోనైనా దెబ్బలాడబుధ్ధేస్తుందా చెప్పు? మొన్నటికి మొన్న మా అత్తమ్మ అడగకుండానే, ఆవిడకిష్టమని మినపసున్ని చేసిపెట్టాను. "పాపం లెద్దూ! ఆవిడకెవరు చేస్తార్లే.." అనిపించింది. ఆ..  ఏం చెప్తున్నానూ... అందుకని ఇది మంచి కాలమన్నమాట!"

ఇలా కబుర్లు చెప్పుకుంటూ తెల్లవారుఝాము దాకా గడిపేసారిద్దరూ. ఇంకో రెండూ గడియల్లో తెలవారుతుందనగా బయలుదేరి మిగిలిన వాళ్ళని ఒక్కొక్కరినే నిద్రలేపసాగారు.
రాజుగారి వీధిలో ఉండే ఉత్పల బయటికొస్తూ "రేరాణి పరిమళం కూడా తెలియకుండా చేసేసింది యశోదమ్మ. రేపల్లె కాస్తా 'కర్పూరపు పల్లె' అయిపోయేలా ఉంది. నిన్న రాత్రి కొడుక్కి రెండు తుమ్ములెక్కువొచ్చాయట! ఒకటే విలవిల్లాడిపోతూ దిగతుడుపులూ, ఆర్భాటమూను. సూర్యగుమ్మడికాయంత కర్పూరం వెలిగించి దిగతుడిచింది!!" అని చెప్పింది.
"పోనీలెద్దూ, నువ్వో పిల్లాడిని కను. నీకూ తెలుస్తుంది. ఏమాటకామాటేలే! అయినా అంతలేసి కళ్ళతో ఆయమ్మే పొద్దస్తమానం కొడుకుని చూస్తూ ఉంటుందాయె. దిష్టి తగిలిందంటే తగలదూ! పైగా వద్దంటున్నా బతిమాలి చలికాలంలోనూ పెరుగు వడ్డించిందనుకుంటా. పాపం, బాగా తుమ్మాడా ఏంటి?" కలవరపడుతూ వాకబు చేసింది సురభి.
"కొంచెం ఎక్కువే తుమ్మాడనుకో.. కాత్యాయని చల్లగా చూడాలి. నేను కన్నా అంత అందగాడిని కనగలనా చెప్పు! కన్నయ్యది యశోదమ్మ పోలికేనంటావా?"
"ఆ.. కళ్ళు మాత్రం ఆవిడవే."
"ఏం కాదు. ఆ కళ్ళకి పోలిక లేదు. సారసాలు కూడా పనికిరావు." కమలిని నమ్మకంగా చెప్పింది.
"యశోదమ్మ కళ్ళేనే. కాకపోతే ఆవిడవి గంగిగోవు కళ్ళయితే, ఆ కుర్రాడివి చెంగనాలు వేసే కోడెగిత్త కళ్ళు. కోణంగి చూపులొకటీ మళ్ళీ. " ముక్తాయించింది సురభి.
"లేగదూడ కాదతడు. సింహపు కొదమ!" చెప్పింది ఉత్పల.
"దరి చేరినవారికి చల్లని చూపుల చంద్రుడూ, కానివారికి సూరీడూను." అతడిని తలుచుకు మురుస్తూ అంది కమలిని.
ఇలా మాట్లాడుకుంటూ ఊరికి దూరంలో ఉన్న మేదిని ఇంటికి నడిచారందరూ.
"అబ్బా.. అంత దూరం వెళ్ళి మరీ ఆవిడగారిని నిద్ర లేపాలా?" అడిగింది ఉత్పల.
మేదినికీ, ఉత్పలకీ ఉప్పూ నిప్పూను. వామన గుంటల దగ్గర నుంచీ దాగుడుమూతల దాకా ప్రతీ ఆటలోనూ ఉత్పల మేదిని చేతిలో ఓడిపోవడం మామూలు.
"తప్పు! అలా అనకూడదు. మంచి పనికి అందరినీ తోడు తీసుకెళ్ళాలి. లేకపోతే ఫలితం దక్కదు. పంచుకు తినే తాయిలం బహు తియ్యన కదూ! "ఏకస్వాదునభుంజీత" అని నీతివాక్యం! మరిచిపోయావా?" మెత్తగా మందలించింది సురభి.

అందరూ కలిసి యమున ఒడ్డుకి చేరారు. అందరూ వచ్చారని లెక్క చూసుకున్నాక సురభి ఇలా చెప్పింది. "నేస్తాలూ! ఇంకో ఝాములో తెల్లారుతుంది. ఈ లోగా స్నానం చేసి పూజకి సిధ్ధం కావాలి. నియమాలన్నీ తెలుసుకు వచ్చాం. నిన్న రాజుగారి దగ్గరకు వెళ్ళి ఇలా వ్రతం చేస్తున్నామని విన్నపం చేసాం కూడా! మరి మన మంచీ చెడూ చూడాల్సింది ఆయనేగా!"
"మంచి పని చేసావ్. ఆయన చేతిలో సర్వకాల సర్వావస్థల్లోనూ ఉండే 'కరకు కత్తి'ని చూస్తే ఇంక చెడు మన జోలికి రాదు." ధైర్యం చెప్పుకుంది మేదిని. చీకటి బూచులంటే మహా భయం ఆ పిల్లకి.
"వెర్రిదానా! నువ్వు పుట్టి నాలుగాదివారాలు కాలేదు. ఆయన సంగతి నీకేం తెలుసు? నందగోపుడంత సాధువు నందగోపుడే. ఈ కత్తి 'కొడుకు పుట్టాక చేరిన ఆభరణం'. చీమకి కూడా హాని చేయని నంద భూపాలుడు ఏ చీమ కనిపించినా 'రాక్షసుడేమో!' అని భయపడుతున్నాడీ రోజు. అందుకే ఈ కరవాలమూ, కరకుదనమూను..!  అయినా మనని కాపాడేది కన్నయ్య. సాక్షాత్తూ విష్ణువు. గోవర్ధనగిరి ఎత్తినప్పుడు చూడలేదూ! అతను సామాన్యుడు కాదు. దేముడు వరమిచ్చినా పూజారి అనుమతి ఉండాలి కనుక, నిన్న లోపాయకారిగా రాజుగారితో మన రక్షణ, పూజకి కావలసిన సంభారాలూ వగైరాల గురించి చెప్పాను. నేనూహించినట్టే "కన్నా, ఈ పిల్లలేదో వ్రతం చేస్తున్నారట. ఏం కావాలో చూడు నాన్నా! అల్లరి చేసి వ్రతభంగం కానివ్వకు సుమా! కాత్యాయనీ వ్రతం చాలా నిష్ఠగా చెయ్యాలి." అని కొడుకుని పిలిచి చెప్పారు."
"అవునా!!" నోరెళ్ళబెట్టారు ఈ సంగతి తెలియనివారందరూ. మనసులో ఆనందించారు కూడా!
"మరి పూజకి కావలసినవన్నీ దొరికాయా? కృష్ణుడేమైనా తెస్తానన్నాడా?" అమాయకత్వం నటిస్తూ ఆశగా అడిగింది మంజుల.
"అదిగో.. నీ వెనకే ఉన్నాడు. నువ్వు నీ వల్లెవాటూ, బొట్టు భరిణా మర్చిపోయావట! తెచ్చాడు." అని వేళాకోళం చేసింది కమలిని. కిలకిల్లాడారందరూ.
"ఊరుకో కమలినీ! నువ్వేం తక్కువదానివా? కృష్ణుడు తెస్తానంటే నీ వల్లెవాటేం ఖర్మ తలకాయో, గుండె నో మర్చిపోయి వస్తావ్ ఇంట్లో. ఈ రోజుకి కావలసినవన్నీ తెచ్చేసుకున్నాం. వ్రతం పూర్తయ్యే లోపు మనకో 'పర' కావాలి." చెప్పింది సురభి.
"పరా? అంటే డప్పేనా?"
"అవును డప్పు. అది మ్రోగించాలి కాత్యాయనీ ప్రీత్యర్ధం. తొందరేం లేదులే. వ్రతం పూర్తయ్యేలోపు ఓ రోజు  వెళ్ళి  కృష్ణుడిని అడుగుదాం." చెప్పింది సురభి.

తరువాత వాళ్ళందరూ పూజావిధిని అనుసరించి యమునలో స్నానం చేసి, తడి ఇసుకతో 'కాత్యాయనీ ప్రతిమ'ను చేసి కొండ గోగుపూలూ, పారిజాతాలూ, గులాబీలు, కలువలతో పూజ చేసి, వేడి పొంగళ్ళు వండి నివేదన చేసారు. కాత్యాయనికి హారతిచ్చి అందరి మనసుల్లో ఉన్న ఒకే కోరికని విన్నవించుకున్నారు.

తెలవారుతోంది. యమున గలగలా పారుతోంది. చంద్రుడు అస్తమిస్తున్నాడు. వెలుగు రేకలు పరుచుకుంటున్నాయి. ఆ చలిగాలిలో ఒకరికి ఒకరూ దగ్గరగా కూర్చుని, పొంగలి ఘుమఘుమలు ఆస్వాదిస్తూ, ధూప దీపాలతో కళకళ్ళాడుతున్న కాత్యాయనిని చూస్తే అందరి మనసులూ తృప్తితో నిండిపోయాయి. ఉత్పలా, మంజులా తామరాకుల్లో నైవేద్యాన్ని వడ్డించి అందరికీ అందించే పనిలో పడ్డారు.

ఏ అమరలోకపు తంబురనో మీటినట్టు గొంతు శ్రుతి చేసుకుని, విన్న విషయాలూ, కలిగిన అనుభూతులూ, చెప్పుకున్న కబుర్లూ కలిపి మాల గుచ్చి వంశీమోహనుని మెడలో ఒక పాటగా వేసింది కమలిని. ఆమె బిలహరి రాగంలో పాడుతూ ఉంటే, ఆమె చారడేసి కళ్ళలో మెరుస్తున్న 'హరి'ని చూస్తూ మైమరచిపోయారందరూ...

రారమ్మ ఓ అమ్మలారా! రారేమమ్మ!
నీరాడ మనసున్నవారూ! మీరూ - మీరూ!
శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన
చేరి కన్నియలార! కూరిమి చెలులార!

ఇది మార్గశిరము, వెన్నెలవేళ, భాసురము!
ఇది పరవాద్యవ్రతారంభ వాసరము
మదిలోన జగమెల్ల ముదమంది పొగడ,
కదిసి కంకణ కటక కింకిణులు కదల

మరిమరీ కనికనీ మెరిసేటి కనులతో
మురిసే యశోదమ్మ ముద్దు సింగపు కొదమ
కరిమొయిలు మెయిహొయలు గల అందగాడు,
వరదుడౌ మన రేడు వ్రతమేలువాడు

కరమందు కరకువాల్ కాపుగా దాలిచి
వరలేటి మేటి నందుని నందనుండు
అరుణశశిబింబనిభ శుభవదనుడు
సరసిజాక్షుడె నోము కరుణింపగా

రారమ్మ ఓ అమ్మలారా..

( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )

* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..

(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము"  ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

18 comments:

  1. "మంచి వెన్నెల వేళ..." టపాని మంచు కురిసే వేళలో చదవడం మరీ బాగుంది.

    చాలా బాగా వ్రాస్తున్నారు.
    అయితే... రోజూ మొదట చూసుకోవాల్సింది మీ బ్లాగేనన్నమాట.

    ReplyDelete
  2. చాలా బాగుంది. చదవాలనిపించి చదివేలా.....
    {నాలాంటి పిచ్చి పాఠకులం ఏది కనిపించినా చదివేస్తూ ఉంటాం. ఇది అలా కాదు అని తాత్పర్యం. :) }

    ReplyDelete
  3. "ప్రకృతి ఇంత మనోహరంగా, చల్లగా, హాయిగా ఉంటే ఎవరితోనైనా దెబ్బలాడబుధ్ధేస్తుందా చెప్పు?"
    బ్రహ్మాండం!! గోపకాంతలతో పాటూ, ఇకనుంచీ మీ బ్లాగు పాఠకులు కూడా 'ఇంకా తెలవారదేమీ.. ' పాడుకోవాలేమోనండీ..

    ReplyDelete
  4. సన్నివేశం అంతా దగ్గరుండి చూస్తున్నట్లుగా ఉంది..మీరు ఈ నెలంతా రోజుకొకటి వ్రాస్తారా..ఏమి మా భాగ్యము..

    ReplyDelete
  5. "ఏకస్వాదునభుంజీత" ?? :-) Funny, please recheck

    ReplyDelete
  6. @ Anonymous:

    ఏకస్వాదునభుంజీత ఏకశ్చార్ధాన్నచింతయేత్
    ఏకో న గఛ్ఛేదధ్వానం నైకః సుప్తేషు జాగృయాత్

    రుచికరమైన పదార్ధమును ఒక్కరే భుజించకూడదు. కార్యములను గురించి ఒక్కరే ఆలోచించరాదు. అమార్గమున ఒక్కరే ప్రయాణము చెయ్యకూడదు. అందరు నిద్రపోతున్నవేళ ఒక్కరే మెలకువగా ఉండకూడదు. ఇది విదురనీతి వాక్యమండీ. (ఈ కథ నాటికి కురుక్షేత్ర సంగ్రామం(ఉద్యోగపర్వం) జరుగలేదు కదా! అందుకని నీతివాక్యమని వ్రాసి ఊరుకున్నాను.)

    ReplyDelete
  7. ఏ ఆటంకంలేకుండా మీ సంకల్పం కొనసాగి మీకూ, మాకూ తగినంత ఆనందం చేకూరాలని కోరుకుంటున్నా...

    ReplyDelete
  8. టపా ఒక్కటే కాదు, మీ జవాబులు కూడా బాగుంటాయి.

    ReplyDelete
  9. చాలా బావుంది అనడం అల్పోక్తి. మీ మార్గశిర కథావ్రతం నిర్విఘ్నంగా జరగాలని మీకూ మీ బ్లాగు జరిగిన వారికీ వ్రతఫలం సంపూర్ణంగా సిద్ధించాలని కోరుకుంటూ ..

    ReplyDelete
  10. మార్గళి శుభాకాంక్షలండీ!

    ReplyDelete
  11. మీ రేపల్లె కథలతో "కాత్యాయినీ వ్రతం" చేసే భాగ్యం కలిగింది.

    ధన్యవాదాలు.

    ~లలిత

    ReplyDelete
  12. mammlni meeto patu vratam cheyyataniki tisuku veltunnanduku dhanyavadalu.

    kottapali garu cheppinatlu adbhutam chinnamaata

    ReplyDelete
  13. మమ్మల్ని కూడా రేపల్లెకి, యమున ఒడ్డుకి తీసుకెళ్ళిపోయారు.. అద్భుతం అనేది చాలా చిన్న మాటవుతుంది.. అలా చదువుతూనే ఉండాలనిపిస్తుంది.. :)

    ReplyDelete
  14. అన్నట్టు 'సారసాలు' అంటే ఏంటండీ.. నాకు తెలీలేదు.. :(

    ReplyDelete
  15. @ గీతిక: ధన్యవాదాలు!
    @ మందాకిని: :) ధన్యవాదాలు.
    @ మురళి: :) ధన్యవాదాలండీ!
    @ జ్యోతిర్మయి: అవునండీ! చాలా పెద్ద ప్రయత్నమే! ధన్యవాదాలు!

    ReplyDelete
  16. @ MURALI: ధన్యవాదాలు.
    @ Chandu S: ధన్యవాదాలండీ!
    @ కొత్తపాళీ: ధన్యోస్మి!
    @ రహ్మనుద్దీన్ షేక్ : మీక్కూడా మార్గళి శుభాకాంక్షలు!
    @ లలిత: ధన్యవాదాలు!
    @ మైత్రేయి: ధన్యవాదాలండీ!
    @ మధురవాణి: ధన్యవాదాలండీ! 'సారసము' అంటే సరస్సులో పుట్టేది, పద్మం అని అర్ధమండీ. సారస నేత్ర, సారసాక్షి అంటారు కదా!

    ReplyDelete
  17. eenati samajaniki aanaati pavitrathani raasikyam tho jodu chesi andinchina nee budhi kusalathaku vayassulo pedda daanni kanuka santrupthini prakatistu aaseervadisunnanu thalli- tiruvengalamma,vizianagaram

    ReplyDelete
  18. బాగుంది.

    'లేగ దూడ కాదు కృష్ణుడు సింహపు కొదమ'

    ఈ వ్యాఖ్య నాకెందుకు నచ్చిందో మీకు తెలుసు :)

    ReplyDelete