Monday, December 26, 2011

నిలువ చోటు లేదు! నిదుర లే! - కాత్యాయనీ వ్రతం - 12

కృష్ణపక్షానికి వీడ్కోలు పలికింది ఆకాశం. నిన్ననే పుట్టిన తన జాబిలికూనని మురిపెంగా యమునకి చూపిస్తోంది.

రేపల్లెలో ఆ ఇంటి వింతలు చెప్పుకోనివారు ఉండరు. ఆలనా పాలనా లేనిదే ఆ ఇంటి పశువులు అంత పాడి ఎలా ఇస్తున్నాయో అందరికీ ఆశ్చర్యమే! నీళ్ళు తోడి పొయ్యకపోయినా ఆ ఇంటి ముంగిట్లో పూలతోట అంత పచ్చగా ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కాదు. ఆ ఇంటి గోపన్న పొద్దస్తమానం కన్నయ్య వెంట తిరుగుతాడు మరి! గోపన్న కన్నయ్యకి ప్రియనేస్తం. నిద్ర లేచింది మొదలు ప్రతిక్షణం కన్నయ్య వెంట అతనూ ఉండితీరాల్సిందే! ఆలమందలను మేతకు తీసుకువెళ్ళేటప్పుడు కృష్ణుడి కంటే ఓ అడుగు ముందే నడుస్తాడతడు. ఏ ముల్లైనా కృష్ణుడిని గుచ్చే ప్రమాదం ఉంటుందని అతడి బెంగ. చల్ది మూటలు మోస్తాడు. కొండవాగుల్లోంచి చల్లని నీళ్ళు ఆకుదొన్నెల్లో పట్టి తెస్తాడు. కన్నయ్య వేణువూదితే ఒళ్ళు మరచి నాట్యం చేస్తాడు. పుట్టతేనెలు తెచ్చి కృష్ణుడి నోట్లో పిండుతాడు. కొండగోగుపూలు పరిచి కన్నయ్య విశ్రమించేందుకు పడక సిధ్ధం చేస్తాడు. తన తొడపై తలుంచి కృష్ణుడు నిద్రపోతూంటే రెప్పవెయ్యకుండా అతని రూపాన్ని కళ్ళలో పదిల పరుచుకుంటాడు. 'ఏమరుపాటుగా ఉన్న కృష్ణుడిపై ఏ రక్కసి వచ్చిపడుతుందేమో!' అని అనుక్షణం చురుకుగా కావలి కాస్తాడు. కృష్ణుణ్ణి ఇంట్లో దింపి యశోదమ్మ పక్కనే నిలబడి దిష్టి తీసేదాకా ఊరుకోడు. కన్నయ్య బువ్వ తిని నిద్దరోయాక అతని ముద్దు మోము మరోసారి చూసి కడుపు నింపుకుని ఇంటికొచ్చేస్తాడు. మళ్ళీ వేగుచుక్క పొడవకముందే నిద్రలేచి నందగోపుడి ఇంటి ముందు నిలబడతాడు.

"గోపన్నా.. అన్నం తినడం మర్చిపోయినా నవనవలాడతావు. అమృతం తాగావేంట్రా!?" అని గోపన్న తల్లి ఆశ్చర్యపోతుంది. "కన్నయ్యని చూస్తే కడుపు నిండిపోతుందే! పాయసం కంటే తియ్యగా ఉంటాయి ఆ పలుకులు! అమృతం నాకెందుకో..!" అని నవ్వేస్తాడు. "నీ అశ్రధ్ధకి చిక్కనైనా చిక్కవురా ఎనుములు..!! నువ్వేం తింటున్నావో.. వాటికేం మేపుతున్నావో!" అని బుగ్గలు నొక్కుకుంటుందావిడ. కృష్ణనామామృతం తాగి సమృధ్ధిగా చిక్కటి కమ్మటి పాలనిస్తాయి గోపన్న ఇంటి ఎనుములు.

అలాంటి అన్నకి వెన్నుతట్టి పుట్టిన చెల్లెలు అమృత. పాలు పితుకుతూ కడవపొర్లి ధారలు నేలపై పారినా ఒంటిపై తెలివి రాదాపిల్లకి. చల్ల చిలుకుతూ చిలుకుతూ వెన్న ఏర్పడి కరిగిపోయినా పట్టదా అమ్మడికి! పువ్వులు కోస్తున్నాననుకుని ఆకులు దూసి మాలలు కడుతుంది. కాటుకతో బొట్టు దిద్దుకుంటుంది చంద్రహారం నడుముకు చుడుతుంది. అనుక్షణం కృష్ణస్మరణలో ఇహం మరచి ఎప్పుడూ బృందావనిలోనే ఉంటుందామె మనసు!

"ఇంకా అమృత నిద్ర లేవలేదు. అసలే పరధ్యానం పిల్ల. అసలు గదిలో ఉందో లేదో!" అని కిటికీ సందుల్లోంచి చూసారు చెలులు. ఆ వేళ చలి మిక్కుటంగా ఉందేమో చిగురుటాకుల్లా వణికిపోతున్నారందరూ! లోపల హాయిగా నిద్రపోతోంది అమృత.

"ఓ పిల్లా! అమృతా.. నిద్ర లే లే! పొద్దు పొడిచే వేళయిపోతోంది. మీ ఇంటి పశువులు ఎప్పుడనగా నిద్రలేచాయో! వాటి అంబారావాలకు మీ తోటలో గూడుకట్టుకున్న పక్షులన్నీ నిద్రలేచి ఎప్పుడో ఎగిరిపోయాయి. నీకు ఇంకా తెలివి రాలేదా?" పిలిచింది కమలిని.
"ఓ అమ్మాయీ! నువ్వు తొందరగా నిద్ర లేచి రాకపోతే మా అందరం నీ ఇంటి ముందు గడ్డకట్టుకుపోయేలా ఉన్నాం. ఈ రోజు మంచు వర్షంలా కురుస్తోంది. అబ్బో! చలి భరించలేకపోతున్నాం. మా మీద దయుంచి లే తల్లీ! ఈ మంచు వానలో తడిసే కంటే యమునలో మునగడం మహా సులువు!" గజగజా వణుకుతూ చెప్పింది ఉత్పల.

"ఈ నేలంతా ఎంత చిత్తడిగా ఉందో చూసారా!" కిందకి చూస్తూ అంది కమలిని.
"అవును! నిద్ర లేచిన ఎనుములు దూడలను తలుచుకుని పాలను వాటంతట అవే కార్చేస్తున్నాయి. ఆ పాల మడుగులివి!"
"అవునా! ఏం చోద్యమిది! పాలు పిదికి కడవల్లో నింపుకోవాలి కానీ, నేలపాలు చేస్తారా!? అపచారం.. అపచారం!" లెంపలు వేసుకుని ఆ పాల మడుగు దాటి గుమ్మానికి దగ్గరగా నిలబడింది కమలిని.
"మన రేపల్లె మొత్తానికి గోపన్న ఒక్కడేనేమో.. ఇలా పనులు మానుకు కన్నయ్య వెనుక తిరిగే వాడు. పోషణ లేకపోయినా పాలిస్తాయి ఈ ఇంటి పశువులు.. నీళ్ళుపొయ్యకపోయినా ఆ చామంతులు చూడు! పచ్చని తివాచీలా ఎలా పూచాయో! ఈ పిల్ల తలలో ఎప్పుడు చూసినా.. చేమంతి ఆకుల దండే! అదేమని అడిగితే అప్పుడే తెలివొచ్చినట్టు చూసి నవ్వేస్తుంది. అన్నా చెల్లెలూ ఇద్దరూ ఇద్దరే!" చెప్పింది ఉత్పల.
"ఎంత అదృష్టమది! ఇహం మరచి, తన సుఖం విడిచి కన్నయ్య వెంట తిరిగే అదృష్టం ఎందరికుంటుంది!" అంది సురభి.
"నువ్వు మరీ చెప్తావులెద్దూ! నిన్నేగా తేజస్వినిని చూసి, పనిమంతురాలూ. ఆమెకోసమే కన్నయ్య వస్తాడు అని అనుకున్నాం.. ఈ రోజు రెండో నాలుకతో మాట్టాడుతున్నావేవమ్మా?"
"తేజస్విని పని వదిలి రానిదీ కన్నయ్య కోసమే.. ఈ గోపన్న పనిమాలా వెంట తిరిగేదీ కృష్ణ సానిధ్య సుఖం కోసమే!"చెప్పింది సురభి.
"హ్మ్.. ఆమె భరతుడైతే ఈతడు లక్ష్మణుడంటావ్!"
"నిస్సందేహంగా..! లక్ష్మణో లక్ష్మిసంపన్నః  అన్నారు. ఆనాడు ఆ లక్ష్మణుడి దగ్గరా, ఈనాడు ఈ గోపన్న దగ్గరా ఉన్నది కైంకర్యమనే లక్ష్మి. అందుకోసం కర్మని తోసిరాజన్నా సంపద వారి వెంటే ఉంది చూడు! సర్వైశ్వర్యాలూ, అమరభోగాలూ, ఏడేడులోకాల సార్వభౌమాధికారమూ ఇచ్చినా రామన్న పక్కన ఉండే అనుభవిస్తానన్నాడు లక్ష్మణుడు. ఇంత సంపద ఉండి గోపన్నకి ఏమైనా పట్టిందా.. తెలవారితే మళ్ళీ కన్నయ్య చెంతకు లేగదూడలా పరుగులు తీస్తాడు."

"ఈ అమృత అన్నకు తగిన చెల్లెలే! యమునకు నీళ్ళకు వెళ్ళి కడవ నింపుకుని ఏరోజైనా తిరిగి వచ్చిందా! ఎప్పుడూ ఖాళీ కడవ నట్టింట్లో దించడమే! నాలిక కరుచుకుని మళ్ళీ యమునకి బయలుదేరడమే!" నవ్వింది ఉత్పల.
"అవునవును! నిద్రలేపండి దొరసానిని. చలికి తట్టుకోలేకపోతున్నాం. ఈ ముంగిట్లో నిలబడే చోటు కూడా లేదు" గుమ్మం పట్టుకు ఒంటికాలిపై నిలబడి వణుకుతోంది కమలిని.

ఏమి వింతలొ గాని చెలియరో! అయ్యయో!
నీ మదిని కమ్మినది ఏమాయ నిదురో

జామాయె నీ ఇంటి మోసాలలో వేచి
ఈ మంచులో గడపనానుకుని నిలిచి

వైరియౌ లంకాధిపతిని తునుమాడిన
శౌరిపై,ఆ మనోహారిపై మా పాట
ఊరివారెల్లరును చెవులార విన్నారు!
ఔరౌర! ఇకనైన లేవమ్మ! మా అమ్మ!

తన లేగలను తలచికొని అరచి చేపుగొను
చనుమొనల, ఎనుము ఎడతెగక కురిసే పాల!
మునివాకిటను బందగానైన వీటిలో
ఎనలేని సంపదలు గలవాని చెల్లెలా!

గొంతెత్తి పాడింది ఆనందిని. వింటున్న కాసేపూ చలిని మరచిపోయిన ఆ గొల్లపిల్లలందరూ మళ్ళీ వణకడం ప్రారంభించారు. లోపల నుండి అలికిడైనా లేదు.

"మనం ఇంత చలిలోనూ వ్రతం పూనినది కృష్ణుడి కోసమైతే, నువ్వేంటమ్మడూ.. రాముడి ఊసు తప్ప మరోటి మాట్లాడవే!" ఆనందినిని వేళాకోళం చేసింది ఉత్పల.
"హ్మ్.. రామకథ తియ్యగా ఉంటుంది. అదీ కాక తనవారికి నొప్పెడితే తను బాధపడే రాముడినే కదా.. ఈ చలిబాధలో తలుచుకోవలసింది!"
"హ్మ్.."
ఇంకా కథ చెప్తుందేమో అని ఎదురుచూస్తున్న చెలుల ఉద్దేశ్యం గమనించి గలగలా నవ్వింది ఆనందిని.
"పిట్టకథే! పెద్ద కథేం కాదు. వానరసేనను వెంటబెట్టుకుని సంద్రానికి ఆనకట్ట వేసి, సీతను చెరపట్టిన రావణుడితో యుధ్ధానికి తలపడ్డాడట రామచంద్రుడు."
"ఊ.."
"రావణుడు వేసిన బాణమొకటి వచ్చి సుగ్రీవుడికి గుచ్చుకుందట!"
"ఆ..!"
"ఆ దెబ్బ చూసి తనకి దెబ్బ తగిలినట్టు విలవిల్లాడాడట రాముడు."
"పాపం!"
"అంత సుతిమెత్తని మనసు రామచంద్రుడిది. అంతకు తగ్గ మనోహరమైన రూపం ఆయనది. ఆ రూపాన్ని చూస్తేనే దెబ్బలూ, నొప్పులూ, బాధలూ మాయమైపోతాయి. అలాంటి మనోహరుడిని, రాముడిని తలుచుకోవద్దూ ఈ చలిరక్కసి కొరికేస్తూంటే!"

"రామచంద్రా! నిజమేనమ్మాయిలూ.. పాపం! ఎంత చలిలో ఎదురుచుస్తున్నారో! పదండి పదండి!" తలుపుతెరుచుకుని బయటకు వచ్చి పెరటివైపు దారితీసింది అమృత.
"అమ్మాయీ! నల్లటి ఎనుము కదుపులు యమునలా ఉన్నాయి సరే! స్నానానికి సరిపడా పాలనూ కురిపిస్తాయి.. కానీ మనం మునగాల్సింది అసలు యమునలో! అటు వెళ్ళాలి పద!" అని నవ్వుతూ యమున వైపు కదిలారందరూ.*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


6 comments:

 1. "కృష్ణపక్షానికి వీడ్కోలు పలికింది ఆకాశం. నిన్ననే పుట్టిన తన జాబిలికూనని మురిపెంగా యమునకి చూపిస్తోంది."

  శుక్ల పక్ష ఆరంభం ఇంత బాగుంటుందా? లేకపోతే మీరు చెప్పడం వల్ల క్రొత్త అందాలు కనిపిస్తున్నాయా?

  ~లలిత

  ReplyDelete
 2. కృష్ణకథ రామకథతో పెనవేసుకుంది.. అప్పుడే కృష్ణ పక్షం ముగిసిందంటారా అయితే.. కాలం తెలియడం లేదు :(

  ReplyDelete
 3. కడిమి చెట్టు,పాటలీవృక్షం,ఇప్పటి భాషలో ఏమని పిలుస్తారు?

  ReplyDelete
 4. @ సునీత: 'కడిమి'కి కదంబమని మరో పేరు. 'పాటలి'ని (Trumpet flower)కలిగొట్టు అంటారు. పల్లెటూళ్ళలో కడిమి,కలిగొట్టు అనే పేర్లు తెలుస్తాయి.

  http://en.wikipedia.org/wiki/Neolamarckia_cadamba

  http://en.wikipedia.org/wiki/Bignonia_suaveolens

  ReplyDelete
 5. >>కృష్ణపక్షానికి వీడ్కోలు పలికింది ఆకాశం. నిన్ననే పుట్టిన తన జాబిలికూనని మురిపెంగా యమునకి చూపిస్తోంది.

  యమున, ఆకాశాల ముచ్చట్లు ఎంత బావుంటాయో!..

  >>నల్లటి ఎనుము కదుపులు యమునలా ఉన్నాయి..

  :)

  ReplyDelete
 6. :) కృష్ణుడి ధ్యాస లో ఏ పనీ చేయని పిల్ల (తేజస్విని కి పూర్తిగా వ్యతిరేకం)..

  బాగుంది.

  ReplyDelete