Wednesday, December 28, 2011

మాకు చెప్పి నీవే నిద్దరోతావా? - కాత్యాయనీ వ్రతం - 14

మంచుతెరల దుప్పటి తొలగించుకుని నిద్ర లేచే ప్రయత్నం చేస్తోంది రేపల్లె. నిన్న రాత్రి చెలికాని చేత చిక్కి నేలజారిన జవరాలి జలతారు వల్లెవాటు క్రీనీడలలో మెరిసినట్టుంది యమున.

ఈనాటికి ఎన్ని రోజుల వ్రతం పూర్తయిందో లెక్కపెట్టుకుని సంతృప్తిగా పడకలు దిగారు కొందరు గొల్లెతలు. "ఇంకా సగం దూరమైనా రాలేదే!" అనుకుంటూ ఉస్సురని తలగడని కావలించుకుని, శయ్యల మీద ఇంకాసేఫు పొర్లసాగారు మరికొందరు. చెదిరిన కురులు సర్దుకుని బయటకు వచ్చి, పూలతోటలో తిరుగుతోంది కమలిని. ఆకు కనబడకుండా పూచిన నందివర్ధనాలను చూసి ముచ్చటపడింది. చెట్టు మొదట నేల కనబడకుండా రాలిన పారిజాతాలను ఏరింది. బయట అలికిడై అటుచూస్తే కదంబమాల నడిచివస్తున్నట్టు కిలకిలా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ చెలులందరూ తన ఇంటివైపే వస్తున్నారు. నవ్వుతూ ఎదురెళ్ళింది.

"నెచ్చెలులూ! పక్షుల కంటే ముందు పడతులే నిద్రలేస్తున్నారు రేపల్లెలో! బాగు బాగు! అందరూ వచ్చేసినట్టేనా?" పలకరించింది.
"తరళా.. ప్రియంవదా, ఉత్పలా.. అదిగో విష్ణుప్రియా.. " మునివేళ్ళ మీద లేచి లెక్కెట్టుకుంది. "ఆనందిని లేదు!!"
అందరూ ఒకరి మొహాలు మరో సారి చూసుకున్నారు. అందరికంటే ముందుండే ఆనందిని ఈ రోజు ఇంకా నిద్ర లేవలేదన్న ఆశ్చర్యం! దాని వెంబడే.. అన్నీ తెలిసిన పిల్ల ఒక వేళ ఇంకా నిద్రపోతే ఏం చెప్పి నిద్రలేపాలా? అని ఆలోచన!
"నిద్ర లేచే ఉంటుంది. దారిలో ఏ పువ్వులైనా కోస్తోందేమో!" సమాధానపరుచుకుంటూ చెప్పింది ఉత్పల.
"అవునవును. వాళ్ళ పెరటి కొలనులో తామరలు కోసి తెస్తానని నిన్న అంది. అందుకని ఆలస్యమయిందేమో!" గుర్తు చేసుకుంది విష్ణుప్రియ.
"సరే.. సరే.. పదండి." అని ఆనందిని ఇంటి వైపు కదిలారందరూ.

విశాలమైన ప్రాంగణంలో బొమ్మరిల్లులా ఉంటుంది ఆనందిని ఇల్లు. పెరటి వైపు అందమైన చిన్న కొలను. పెంపుడు లేడికూనలు ఓ పొదరింట ముడుచుకుని నిద్రపోతున్నాయి. మరో వైపు పలుపు తాడు నములుతూ అరుస్తోంది ఓ లేగదూడ. యజమానురాలు విప్పగానే చెంగున వెళ్ళి తల్లి పొదుగులో దూరిపోదామని ఆత్రపడుతోంది. ఇంటి చుట్టూ బారులుతీరిన చేమంతులు కళ్ళు విచ్చి, లోపలికి వస్తున్న ఆ ఇంతులను పలకరించాయి.

"అలికిడి లేదు! ఇంకా నిద్ర లేవనే లేదా.. ఏం!" ఆశ్చర్యంగా తలుపు దగ్గరకు వెళ్ళి తట్టి చూసారు. "రామా.. పరంధామా.. వాసుదేవా.. నారాయణమూర్తీ!" అని కైవారాలు చేసారు.
"ఆనందినీ! సర్వం ఎరిగిన పిల్లవి. నీకెలా మేలుకొలుపు పాడాలో మాకైతే అర్ధం కావడం లేదు. నిన్ను మేము నిద్ర లేపవలసి వస్తుందని ఊహించలేదు సుమా! లే.. మేలుకో హరిప్రియా! ఓ ఆనందినీ! లే లే!" పిలిచింది కమలిని.
ఔనంటే ఔనన్నారు చెలులు. కళ్ళు తెరిచేసరికి నవ్వుతూ పలకరించే అమ్మ, ఆ రోజు ఇంకా నిద్రపోతూంటే ఏం చెయ్యాలో తోచని పిల్లల్లా ఉంది వాళ్ళ పరిస్థితి.
"మేమెవరైనా నిద్ర లేవకపోతే మంచి మాటలు చెప్పి, తెలవారుతోందని గుర్తులు చూపించీ, కమ్మని కథలు చెప్పి నిద్రలేపేదానివి! నీకు చెప్పడానికి మాకు మాటలే దొరకట్లేదు!" బేలగా అంది విష్ణుప్రియ.
"మమ్మలని పరీక్షిస్తున్నావా ఆనందినీ! నిన్నటి దాకా నిద్ర లేవకుండా రోజుకొకరం గారాలుపోయామని మాపై కోపమొచ్చిందా?!" తరళ అనుమానంగా ప్రశ్నించింది. విష్ణుప్రియ, ప్రియంవదా, వారిజ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. 'నిజమేనేమో!' అని అనుమానపడ్డారు.
"అబ్బే! మీరలా బెంగ పెట్టుకోకండి. ఆనందిని అలాంటిది కాదు. వెన్న లాంటి మనసున్నది. మనని ముందు నిలబడి నడిపించేది. ఏదో కారణం లేనిదే ఇంతలా నిద్రపోదు! కన్నయ్యని తలుచుకుంటూ రాత్రంతా నిద్రపోలేదేమో! తెలవారు ఝామున గాఢంగా నిద్ర పట్టేసి ఉంటుంది." ధైర్యవచనాలు పలికింది సురభి.
"సురభీ! ఆనందినితో సమానంగా అన్నీ తెలిసిన దానివి! గొప్ప గొప్ప వేదాంత విషయాలు మీ ఇద్దరూ చర్చించుకుంటారు కూడా! నువ్వే ఆమెను నిద్ర లేపేందుకు సమర్ధురాలివి." తరళ ప్రోత్సహించింది.
"అందరం ప్రయత్నిద్దాం!" తలుపు దగ్గరగా వెళ్ళింది సురభి.

"ఓ ఆనందినీ! అమ్మడూ! అందరూ నిద్రలేచారు. నీ గుమ్మం ముందు నిలబడ్డారు. నువ్వు నిద్ర లేచి వస్తావని, బోలెడు కబుర్లు చెప్తావని ఎదురు చూస్తున్నారు. మాటైనా మాటాడక నిద్రపోతున్నావా? అదిగో! నీ పెరటికొలనులో నల్ల కలువలు ముకుళించాయి. ఎర్ర తామరలు విరబూస్తున్నాయి. మంచు బిందువులు నిలచి చలిగాలికి తలలూచుతున్న ఆ కెందామరలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా! నువ్వే వచ్చి చూడు..! "
గాజుల గలగలలో, కాలిమువ్వల శబ్దమైనా వినబడుతుందని ఒక్క క్షణం అందరూ జాగ్రత్తగా విన్నారు. ఊహూ.. పాన్పుపై పక్కకు తిరిగి ఆనందిని మంత్రమేసినట్టు నిద్రపోతోంది.

యమున ఒడ్డున సైకతవేదికలపై చెలియలతో కలిసి దాగుడుమూతలాడుతోంది ఆనందిని. హఠాత్తుగా వెనుకనుంచి నల్లకలువల్లాంటి ఆమె కళ్ళను మూసిన చిరపరిచితమైన చేతుల స్పర్శ!! శంఖాకృతిలో వెలుగులు చిమ్ముతున్న ఆమె మెడ మీదుగా వెచ్చగా.. "ఎవరో చెప్పుకో చూద్దాం!!" అని వనమాలా సౌరభం వెంటరాగా మధురమైన స్వరమొకటి వినిపించింది. "ఎవరని చెప్పాలి..!? మునిజన మానస రాజహంస అనా! గోపికా హృదయ చోరుడనా! మోహన మురళీధరుడనా! నందనందనుడనా! ముల్లోకాల వేల్పు అనా!" పెదవి పలకని మాటలెరిగిన వాడు.. కొంటెగా నవ్వుతున్నాడు! కెందమ్మి కన్నులతో.. పగడాల పెదవితో.. తెలిముత్తెపు పలువరుసతో.. తననే చూస్తూ నవ్వుతున్నాడు.

"నల్ల కలువలు ముడుచుకున్నాయీ.. ఎర్ర తామరలు విచ్చుకున్నాయీ... అంటే నీ కనులు మూసి నవ్వుతున్న యదునందనుడిని తలుచుకుంటున్నావేమో! కలలు చాలించి నిద్ర లేవమ్మా! మమ్మల్ని నిద్రలేపుతానని మాటిచ్చి ఈ రోజు నువ్వే పడక దిగి రానంటున్నావే! నిన్ను అంత మురిపిస్తున్న ఆ స్వప్నమేవిటో!" బయట నుంచి పిలుస్తోంది ఉత్పల.
"పోనీ.. ఇంకో గుర్తు చెప్తాం విను. మీ ఇంటికి వస్తున్న దారిలో మాకు జీయరులు ఎదురయ్యారు. కాషాయాంబరాలు ధరించారు. హరి నామస్మరణ చేస్తున్నారు. వారు "హరీ..!" అని పెదవి తెరచినప్పుడల్లా వారి పలువరుస తళుక్కున మెరుస్తోంది. వారి చేతిలో తాళపు చెవులున్నాయి. కుంచెకోలలతో బీగం తెరిచి కోవెల తలుపు తీసి సుప్రభాత సేవ చేసేందుకు వెళ్తున్నారు. తెలవారిందని నమ్ముతావా.. లే ఆనందినీ! లే బంగారు తల్లీ!"

కలువ కనుమూసినది
కమలమ్ము పూచినది
కలికిరో! నీ పెరటి కొలనులో!

తెలిదంతముల జియ్యరులు, కావి తాలుపులు,
తరలేరు కుంచెకోలల తెరవ కోవెలలు

మిమ్ము నేనే వచ్చి మేలుకొలిపెదనని
అమ్మచెల్లా! నీవు నిదురింతువే!
కమ్మగా నెరవాది మాటలన్నీ ఆడి
ఎమ్మెలాడీ! నీవు సిగ్గుపడవే!

వరశంఖ చక్రధారిని, హరిని, శౌరిని,
పురుషోత్తముని, వికచజలజ లోచనుని,
తరుణులందరితోడ తనివారగా పొగడ
తరలిరావమ్మ! నిద్దురమాని, ఓ కొమ్మ!

"నీకు చెప్పేందుకు నీకు తెలియని కథలేమీ మాకు తెలియవు! అయినా మాకందరికీ బోలెడు సుద్దులు చెప్పి, నువ్వే నిద్రపోతున్నావా! సిగ్గుగా లేదూ!" నిష్టూరమే గతి అనుకుని సూటిపోటి మాటలాడనారంభించింది కమలిని.
"ఊరుకో పిల్లా! పరుషం పలకూడదని వ్రత నియమం! మర్చిపోయావా!" హెచ్చరించింది తరళ.

"ఓ అమ్మాయీ! ఆ కన్నయ్య చేతిలో ఉండే పాంచజన్యమెంత అదృష్టం చేసుకుందో తెలుసా! అతడి అధర సుధాపానం చేసే అదృష్టం!! ఆ ఎర్రని పెదవిపై ఆనే ఆ శంఖం పుణ్యమెంత గొప్పదో! ఆ వరద హస్తాన నిలచే జన్మ ఎంత సార్ధకమో కదా!! అలాంటి భాగ్యం కోసం వ్రతం చేస్తున్నాం! వేళ మించే పని చెయ్యబోకు సుమా! నిద్ర లేచి రా!"
చటుక్కున కళ్ళు విప్పి, ఒక్క ఉదుటున తలుపు తీసింది ఆనందిని.
"అయ్యో! ఎంత మొద్దు నిద్రపోయాను!" సిగ్గుగా నొచ్చుకుంటూ బయటకు వచ్చింది.
"హమ్మయ్య! లేచావా!! నొచ్చుకోవడం తరువాత.. అంత కమ్మని కలేమిటో చెప్పాల్సిందే!" అల్లరిగా అడిగింది ఉత్పల.
"యమున ఒడ్డున మనమందరం దాగుడు ముతలాడుతున్నామట! ఇంతలో వెనుక నుంచి..." ఆనందిని చెప్తూ యమున వైపు అడుగులు వేసింది. ఆమెను అనుసరిస్తూ కదిలారు "కాత్యాయనీ పూజ" చేసేందుకై గోపబాలలందరూ..*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


6 comments:

 1. బాగుందండీ ఎప్పటిలాగే...

  ~లలిత

  ReplyDelete
 2. కళ్ళు తెరిచేసరికి నవ్వుతూ పలకరించే అమ్మ, ఆ రోజు ఇంకా నిద్రపోతూంటే ఏం చెయ్యాలో తోచని పిల్లల్లా ఉంది వాళ్ళ పరిస్థితి.

  తియ్య తియ్యని మాటలతో కృష్ణ గాధలు.....

  ReplyDelete
 3. దేవులపల్లి వారి గీతం బాగుంది. మీ వ్యాఖ్యానం అంతకన్నా బాగుందేమో నని అనుమానం వస్తోంది.

  ReplyDelete
 4. "చెట్టు మొదట నేల కనబడకుండా రాలిన పారిజాతాలు.." అందమైన దృశ్యం !

  "కదంబమాల నడిచివస్తున్నట్టు .." మంచి పోలిక..:)

  ReplyDelete
 5. తృష్ణగారి మాటే నాదీను...

  ReplyDelete
 6. బాబోయ్ ఈ బ్లాగ్ మాత్రం మా పిల్లలకి చూపించకూడదు.. ఉదయం పూట కూడా ఇలా కథలు చెప్తూ ఇంత చక్కగా నిద్ర లేపాలంటే :)

  ReplyDelete