Saturday, December 17, 2011

సిరుల వాన : కాత్యాయనీ వ్రతం - 3

ఎలదమ్మి రేకుల కనురెప్పల వెనుక వెలిగే స్వప్న లోకాలలో, కృష్ణుడు ఏం వింతలూ విడ్డూరాలూ చూపుతున్నాడో, ఎంత హాయిగొలిపేలా మాట్లాడుతున్నాడో కానీ, నిద్దరోతున్న ఉత్పల మోమంతా చిరునవ్వే..!! కిటికీ సందుల్లోంచి లోనికి వచ్చిన పల్చని వెన్నెల ఆ అద్దాల చెక్కిళ్ళలో ప్రతిఫలించి రెట్టింపై వెలుగుతోంది. ఉండుండీ విచ్చుకుంటున్న ఆమె పెదాలు వెన్నెల్లో అరవిరుస్తున్న పసి గులాబి రేకులని తలపిస్తున్నాయి. ఆమెను మేల్కొలిపేందుకు కిటికీ తలుపు తోసి తొంగి చూసిన కమలినికి ఉత్పల ముద్దు మోము రెండో చంద్రబింబంలా కనిపించింది.

చప్పుడు చెయ్యకుండా వెనక్కి తిరిగి "నువ్వే చూడు.." అన్నట్టు సురభికి సైగ చేసింది. తొంగి చూసిన సురభి నవ్వుతూ "కలల్లో తేలుతోంది సొగసరి! పాపం! ఎలా నిద్ర లేపడం?" చిన్నగా గుసగుసగా అంది.
"తప్పదుగా.. ఉండు.."అని కిటికీ తలుపు పూర్తిగా తెరిచింది కమలిని. గుండెల నిండా ఊపిరి పీల్చుకుని మంద్రంగా, హాయిగా "కృష్ణా..." అంది. అమ్మ సడి విన్న పసి పాపలా కళ్ళిప్పి చూసింది ఉత్పల. కిటికీలోంచి జంట కలువల్లా సిరినవ్వుల చెలులు కనిపించారు.

అప్పటికే బయలుదేరిన విష్ణుప్రియా, మేదినీ, తరళా వీధి మొగలో కనిపించారు. ఆరుగురూ కలిసి ఆనందినీ, నళిని, మల్లికలు ఉండే వీధి వైపు అడుగులు వేసారు.
"కృష్ణవేణి ఇల్లు ఈ వెనుక వీధిలోనే కదా.. అటు వెళ్ళి అప్పుడు ఆనందిని దగ్గరకి వెళ్దాం. మళ్ళీ ఇటు రానక్కర్లేదు." చెప్పింది మేదిని.
"వద్దు వద్దు.. అందరినీ లేపే లోపు తను నిద్ర లేచి రాకపోతే, అప్పుడు వెళ్దాం వాళ్ళింటికి." చెప్పింది ఉత్పల.
"అదేం?"
"కృష్ణవేణిని నిద్ర లేపితే వాళ్ళ ఇల్లంతా నిద్ర లేస్తుంది. వద్దు."
"అవును! వాళ్ళింట్లో చిలకలూ, ఆవుల దగ్గర నుంచీ అన్నిటి పేరూ కృష్ణే కదా! .. కృష్ణ శబ్దం వినిపిస్తే నిద్ర లేచి కూర్చుంటాయ్.. కృష్ణవేణిని 'కృష్ణా' అని కాక ఇంకెలా నిద్ర లేపడం?" అంగీకరించింది సురభి.
"ఉత్పలా.. అప్పుడెప్పుడో వాళ్ళింటి కథ చెప్తానన్నావ్.. ఎందుకు ఆ ఇంట్లో అన్నిటి పేరూ 'కృష్ణ'?" అడిగింది మేదిని.
"హ్మ్.. మా వెనుక వీధేగా వాళ్ళది. ఆ కథ ఓ రోజు మా నాయనమ్మ చెప్పింది. ఇది మనం పుట్టక ముందు కథ. కృష్ణుడు రేపల్లెకి రాక ముందు కథ."
"చెప్పు చెప్పు..మనం ఇంకా చాలా దూరం నడవాలిగా.."
వెన్నెల్లో మెరుస్తున్న రేపల్లె వీధులు ఓ కథ వినడానికీ, కీచురాళ్ళ సడితో ఊ కొట్టడానికీ సిధ్ధమయ్యాయి. కన్నయ్య కబుర్లు లేని కథ రేపల్లెలో ఉండదని వాటికీ బోలెడు నమ్మకం!

"కృష్ణ వేణి తండ్రి అసలు పేరు పుండరీకుడట. మీకెవరికీ తెలిసి ఉండదు. మహా కోపిష్టి. మనిషి పొడ గిట్టదు. ఇల్లాలని గౌరవమూ, పెద్దలని భక్తీ, పిన్నలని ప్రేమా ఉండేది కాదట అతనికి. కుండలు చెయ్యడం కదా అతని వృత్తీ.. పాలకో, చల్లకో కడవ కొనాలని వెళ్ళే ప్రతీ వాళ్ళూ అతని ముక్కోపానికీ, దురుసు మాటలకీ, గర్వానికీ విసుక్కొనే వారట. తను చేసిన కుండలే రేపల్లెకి దిక్కని గర్వమట. "వెయ్యి మందలున్న రాజైనా వాడేది నా కుండలే!" అని తలెగరేసి చెప్పేవాడట. అతని మొహంలో నవ్వనేది ఉండేది కాదట.

ఇలా ఉండగా కన్నయ్య పుట్టాడు. "రాజుగారబ్బాయైతే నాకేమైనా గొప్పా..?" అని కనీసం వెళ్ళి చూడలేదట. ఇతను మనిషి కాదని ఊళ్ళో వాళ్ళంతా దాదాపు పుండరీకుడిని వెలేసినంత పని చేసారు. అయితే "మనం పెంచే పశువుల్లాగే మనకీ కట్టు ముఖ్యం. పొగరు గిత్త పట్లైనా కొన్నాళ్ళు సహనం వహించాలని" నందగోపుడు ఊరివాళ్ళకి సర్ది చెప్పాడట. శుక్ల పక్ష చంద్రుడిలా కన్నయ్య ఎదిగి పెద్దవాడవుతున్నాడు. సరిగ్గా రాజుగారి పెరట్లోంచి పుండరీకుడి పెరడు, కుమ్మరి చక్రం, కుండలు కాల్చే ఆవము కనిపిస్తాయి కదా! కిట్టయ్య అసలే తుంటరి వాడు!! పుండరీకుడు తయారు చేసిన కుండ తయారు చేసినట్టు రాళ్ళు విసిరి బద్దలుగొట్టేవాడట. పంచాయితీలూ, పరిహారం ఇప్పించడాలూ చాలా సార్లే జరిగాయట.

"ఈ చెడ్డ పేరు నీకెందుకు కన్నా, అల్లరి మానెయ్య్.. " అని యశోదమ్మ కన్నీళ్ళు పెట్టుకుందని కన్నయ్య ఓ రోజు పుండరీకుడి కుండలు బద్దలుగొట్టడం మానేసాడట. ఆ రాత్రి పుండరీకుడు హాయిగా నిద్రపోయాడు. తెల్లారి లేచే సరికి అందరిళ్ళలో కుండలూ బద్దలైపోయి ఉన్నాయట. కన్నయ్యని రాత్రంతా వాళ్ళమ్మ పొదువుకునే పడుకుంది మరి! అయినా ఊరంతా తిరిగి ఒక్క రాత్రిలో వేల కుండలెలా బద్దలు గొడతాడని, ఇదేదో దృష్టనీ, మాయనీ తీర్మానించుకుని, పుండరీకుడిని పిలిపించి కుండలు చేసివ్వమన్నారట రాజుగారు. గొల్లపల్లెలో కడవలు లేనిదే క్షణమైనా గడుస్తుందా! మనుషుల్ని సాయం ఇచ్చి పంపించారట. పుండరీకుడు పని మొదలు పెట్టాడు. ఒక్క కుండా సరిగ్గా రాదే! ఏ కుండైనా వచ్చినా ఆవంలో పగిలిపోయేది. చీకటి పడే దాకా ప్రయత్నం చేసి సాయం వచ్చిన వారంతా వెళ్ళిపోయారట. పుండరీకుడికి కృష్ణమాయ అర్ధం కాక చక్రం ఎదుట తల పట్టుకుని నిశ్చేష్టుడై కూర్చున్నాడట.

"ఇదిగో.. మావయ్యా.." అని కన్నయ్య గోడవతల ముక్కాలి పీట వేసుకుని, గోడ మీద నుంచి తొంగి చూస్తూ నల్ల నల్లని కళ్ళతో నవ్వుతూ పిలిచాడట.
అసలే చేష్టలుడిగి కూర్చున్న పుండరీకుడు మాయ కన్నయ్య వైపు అయోమయంగా చూసాడట.
"మరేమో! మా ఇంట్లో కుండలన్నీ రాత్రి బూచి బద్దలు గొట్టేసిందట. మా ఎర్రావు పొదుగు దగ్గర తల పెట్టి పాలు తాగేసాననుకో. కానీ పెరుగూ బువ్వా కావాలంటే కుండలుండాలట! అమ్మ చెప్పింది. నా బొజ్జకి ఎక్కువ పెరుగేం వద్దులే. ఓ బుజ్జి కుండ చేసివ్వవూ.." అని ముద్దు మాటలతో అడిగాడట.
కన్నయ్య చక్రాల కళ్ళలోకి చూస్తూ రెప్పకొట్టడం మరచి, మంత్రమేసిన వాడిలా "సరే!"నన్నాడట పుండరీకుడు.
అంతే! చక్రం తిరగడం మొదలెట్టింది. తెల్లారేసరికి పుండరీకుడి ఇల్లంతా కుండలే! మాయపొరలు వీడిన మనిషేమవుతాడు..!? పరమానందానికి రాజవుతాడు. ఆ రోజు నుంచీ పుండరీకుడి లోకం 'కృష్ణ శబ్దమే!' కుండలు కృష్ణ.. పిచికలు కృష్ణ.. చిలకలు కృష్ణ.. పశువులు కృష్ణ... ఆఖరుకి కూతురూ కృష్ణే! తన పేరు కూడా తను మరచిపోయాడు. "కృష్ణా.." అంటేనే పలుకుతాడు.

నల్లనయ్య ఒకనాడు దంతపు బొమ్మలాంటి కృష్ణని చూసి, "పాల మీగడలా ఉన్నావు! నీకు "కృష్ణా" అని పేరు పెట్టాడా మీ అయ్య! వెర్రిమారాజు! నేను కృష్ణుడినీ, నువ్వు కృష్ణవేణివీ!" అని ఆ పిల్ల నల్లని తెగబారెడు జడలో ఓ చామంతి పువ్వు తురిమాడు. అలా కృష్ణ కాస్తా కృష్ణవేణయ్యింది." కథ ముగించింది ఉత్పల. అందరి మనసులలోనూ మాటల కందని భావన! ఏరువాకలో పైరులా మనసు తడిసి, ఆపై కనులను తడిపితే మాటలేం వస్తాయ్!!

అందరిలోనూ ముందు తేరుకున్న సురభి చెప్పింది. "మహ మాయగాడు సుమీ! మనసులో ప్రవేశించడమే ఆలస్యం! సర్వవ్యాప్తమైపోతాడు. ఇహమూ, పరమూ తానేననిపించేస్తాడు. ఆనాడు బలి చక్రవర్తి అంతటి వాడే ఇతగాని 'ముద్దు బుడత రూపం' చూసి వశమై, మూడడుగుల నేలనిచ్చి ముల్లోకాలూ కొలిచిన ఆ దివ్య పాదాన్ని తలపై దాల్చాడు. ఇంక వెర్రి కుమ్మరి వాడి లోకాన్ని జయించడం కన్నయ్యకి చిటికెలో పని కదూ!"

మేదిని కలలోంచి తేరుకున్నట్టు చెప్పింది. "సత్యం!"

ఇంతింతై వటుడింతై మఱియు దానంతై నభోవీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రునికంతయై ధ్రువునిపైనంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై

రవిబింబం బుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై...

యమున అల్లంత దూరాన గొల్ల పడుచుల నోట వినిపిస్తున్న వామన మూర్తి విశ్వరూప దర్శనాన్ని విని ఉప్పొంగి స్వాగతం పలికింది. ఇంతలో కృష్ణవేణి వచ్చి నేస్తాలను చేరింది.

యథావిధిగా స్నానమూ, పూజా, నివేదనా పూర్తయ్యాక కాత్యాయనికి హారతినిస్తూ ఆనందిని చెప్పింది. "అమ్మాయిలూ! మన పల్లెలో సమృధ్ధిగా నెలకు మూడు వానలు కురియాలనీ, పాడీ పంటా లోటు లేకుండా పెరగాలనీ, అందరూ క్షేమంగా ఉండాలనీ కోరుకోండి." తామరతూడుల్లాంటి చేతులు ముకుళించి కాత్యాయనికి తమ్మిమొగ్గల వందనం చేసారు గోపబాలలందరూ!

"నెలకు మూడు వానలా? అదేం లెక్క?" తామరాకులో పొగలు చిమ్ముతున్న కమ్మటి పొంగలిని నోట్లో వేసుకుంటూ అడిగింది తరళ.
"నెలకి మూడు వానలంటే వరుసగా కాదు. తొమ్మిది రోజులకి ఒక సారి ఒక వర్షం. తొమ్మిది మూళ్ళు ఇరవై ఏడు.. వర్షం పడ్డ రోజులు మూడు.. మొత్తం కలిపి ఒక మాసం. ఇలా కనుకా శ్రేష్టమైన వానలు పడితే పంటలు ఏపుగా పెరుగుతాయట! పైరు మొదళ్ళలో చేపలు ఎగిరేంత నీరు నిలుస్తుందట! అలాంటి నీటిలో విరిసిన కలువల్లో నిండిన తేనె తాగీ, ఊయలలూగీ ఎలతేంట్లు నిద్దరపోతాయట! ప్రసాదం నోట్లో పడుతూనే మనకి కంటి నిండా నిద్దరొచ్చేయట్లేదూ.." నవ్వింది ఆనందిని.
"ఇంకా ఇప్పుడేం నిద్రా.. ఇళ్ళకి వెళ్ళాలి. పాలు పితకాలీ, చద్దులు మూట కట్టాలీ.. చల్ల చిలకాలీ.." పనుల్ని గుర్తు చేసింది మేదిని.
"మన నోము ఫలించి నెలకి మూడు వానలు పడితే ఇంకా పనులు పెరిగిపోతాయి తెలుసా, అమ్మడూ! సమృధ్ధిగా పచ్చిక మేసిన పశువులు పాల ధారలు వర్షంలా కురిపిస్తాయి."
"అంత కంటే కావలసినదేముంది చెప్పు! ఏదీ కమలినీ.. పాట పాడవూ.." అడిగింది మేదిని.

మంచి అర్ధమూ, నడకలో ప్రాస కలిగిన అందమైన పదాలతో ఎవరో మహా కవి కూర్చిన మధురమైన పద్యంలా కనిపించారు ఒక చోట చేరిన ఆ పడుచులందరూ.. అప్పుడే తొంగి చూస్తున్న బాల భానుడికి. తెలివెలుగు కిరణాలలో మెరుస్తున్న కమలిని 'మధ్యమావతి' ఆలపిస్తోంది.


ఎనలేని సిరులతో నిండును
ఈ సీమ
ఈతిబాధలు కలుగకుండును!

మునుకొని త్రివిక్రముని నామములు పాడి
మొనసి మన నోమునకు తాన మాడితిమేని

నెలనెలా మూడు వానలు కురియును
బలిసి ఏపుగ పైరులెదుగును
అల పైరు సందులను మీ లెగురును
కలువల ఎలతేంట్లు కనుమూయును

కడగి కూర్చుండి పొంకంపు చన్నులను
ఒడిసి, పిదుకగ, పట్టి - రెండు చేతులను
ఎడము లేకుండ పెను జడుల ధారలను
కడవల ఉదార గోక్షీరములు కురియును

ఎనలేని సిరులతో నిండును ఈ సీమ..

( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )

* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

13 comments:

 1. చాలా బాగా రాస్తున్నారు...ఇంతకు మించి మాటల్లేవ్ ...:))

  ReplyDelete
 2. ఎలదమ్మిరేకుల హా...ఇక్కడే ఫ్లాట్....ఏరువాకలో పైరులా...తమ్మి మొగ్గలు(ఇవంత అందగా ఉండవు.తమ్మి పువ్వులే అందంగా ఉంటాయి)...ఆహా....ఎలతేంట్లు ...

  ReplyDelete
 3. నేను తెలుగు సాహిత్యం పెద్దగా చదవలేదు. కృష్ణశాస్త్రి, మల్లాది వారి పేర్లు వినడమే కాని ఎప్పుడూ వారి రచనలు చదివింది లేదు. తెలుగింత అందంగా ఉంటుందా అని మీ టపాలు చదువుతుంటేనే అనుభవమౌతోంది.
  అద్భుతంగా రాస్తున్నారు..నిజం.
  ఈ కధావ్రతం ఎప్పుడు ముగిసిపోతుందా?.. అన్న భయం ఇప్పుడు కొత్తగా కలుగుతోంది.. ముగింపు లేకుండా ఇలానే కొనసాగుతే ఎంత బావున్నో..అన్న అత్యాశ కూడా!.

  ReplyDelete
 4. ధనుర్మాస ప్రత్యేకమా? ఇప్పటి వరకూ నల్లనయ్య రాకుండానే కథ అద్భుతంగా నడిపించారు. రమణ గారి కానుక గుర్తుకొస్తోంది.

  ఫణీంద్ర. పి

  ReplyDelete
 5. రాత్రి ప్రయాణం..యమున వెంబడి రేపల్లె చుట్టూ నడుచుకుంటూ వచ్చామో, హైవే మీద ఎనభై మైళ్ళ వేగంతో వచ్చామో అర్ధం కాలేదు..నిన్నటి మీ టపా ఐఫోన్ లో చదువుతూ మా ఇంటాయనకు వినిపించాను. "ఏదీ మొదటి పార్టు నుండి చదువు" అన్నాక 'ఒకసారి ఏం జరిగిందంటే' దగ్గర నుండి మళ్ళీ చదివేసి తిరుప్పావై వింటూ ఇంటికి చేరాం.

  ReplyDelete
 6. చాలా బాగుంది! బాగా వ్రాస్తున్నారు!

  ReplyDelete
 7. ఎలదమ్మిరేకుల హా...ఇక్కడే ఫ్లాట్..agreed
  మురారి గారు, వారిద్దరి పుస్తకాలు దొరుకుతూనే ఉన్నాయి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారివి కూడా. తెలుగు మాధూర్యం తెలుసుకోవాలంటే తప్పక చదవాలి

  ReplyDelete
 8. @ తృష్ణ: ధన్యవాదాలు!

  @ sunita: "ఎలదమ్మి రేకులూ, ఎలతేంట్లూ.. ఎలనాగలూ" కృష్ణ శాస్త్రి గారివే కదండీ! అందంగా సర్దుకు వాడుకున్నాను, ఆయన మీది అభిమానంతో, ఏమనుకోరులే అనే చనువుతో! ముకుళించిన చేతులు కదా.. అందుకని తమ్మిమొగ్గలన్నాను. ధన్యవాదాలు!

  @ మురారి: తేనె కన్నా తీయనిది తెలుగు కదండీ! మీరు తప్పక తెలుగు సాహిత్యం చదవండి. బాగా ఆస్వాదించగలరు. ప్రతీ ఆనందానికీ ఒక ముగింపు సహజం కదండీ! ధన్యవాదాలు.

  @ ఫణీంద్ర: ఆయన జగన్నాటకసూత్రధారి కదండీ! వెనుకే ఉండి కథ నడిపిస్తున్నాడు. ధన్యవాదాలు.

  @ జ్యోతిర్మయి: మీ ఆదరానికి నాకు మాటలు రావడం లేదు. ధన్యవాదాలు మాత్రం చెప్పగలనంతే!

  @ రసజ్ఞ: ధన్యవాదాలు!

  @ కొత్తపాళీ: ధన్యవాదాలు!

  ReplyDelete
 9. ఎందుకో తెలీదు కానండీ, "రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించీ.." గుర్తొస్తూనే ఉంది అసాంతమూ..
  ఎలదమ్మి రేకులతో మొదలు పెట్టడం వల్లనేమో మరి..

  ReplyDelete
 10. ఎలదమ్మి రేకుల్లాంటి కనురెప్పలు, తమ్మి మొగ్గలని తలపించే ముకుళిత హస్తాలు.. భేష్!

  ఎక్కడినుంచైనా తెచ్చి వాడుకోవాలన్నా.. చదివి ఉండాలి, చదివి రసాస్వాదన చేసి, మస్తిష్కం లో దాచుకుని, ఇలాగ మాతో పంచుకోవాలన్న ఆకాంక్షా ఉండాలి, సమయానికి గుర్తుకు వచ్చి రాయగలగాలి.

  వెరీ నైస్...

  ReplyDelete
 11. "మంచి అర్ధమూ, నడకలో ప్రాస కలిగిన అందమైన పదాలతో ఎవరో మహా కవి కూర్చిన మధురమైన పద్యంలా కనిపించారు ఒక చోట చేరిన ఆ పడుచులందరూ.."...

  ఇంత కన్నా ఆ "ఆటవెలదుల్ని" అందం గా ఎవరైనా వర్ణించగలరా?

  ~లలిత

  ReplyDelete
 12. chaalaaaaaa chaaalaa bagundi ... ivi chadavalana entho adrustam chesukuni undali thanks

  ReplyDelete
 13. భలే బాగుంది. కృష్ణవేణి వాళ్ళింటి కృష్ణగాథ! :)

  ReplyDelete