Sunday, December 18, 2011

కరిమబ్బు కావాలి : కాత్యాయనీ వ్రతం - 4

రేపల్లెకి రాత్రి కావలి కాయడానికి వచ్చే జాబిలిని చుక్కలు ఒక్కటంటే ఒక్క క్షణం కూడా ఏమరపుగా విడిచిపెట్టవు. అవును! వాటికి అసూయ! చుక్కల్ని మించిన అధిక చక్కని భామలున్నారు రేపల్లెలో. వాళ్ళ నవ్వుల ముందు వెన్నెల ఓడిపోతుంది. వాళ్ళ వన్నెల ముందు చుక్కలు చిన్నబోతాయి. ఒకరికి తీసిపోని సొగసు మరొకరిది. మిలమిలలాడే మీనుల కన్నుల చిన్నది ఒకతె. సంపెంగ ముక్కుకి పెట్టుకున్న రవ్వల ముక్కెర తళుక్కుమనేలా వయారాలు పోయేదొకతె. గులాబి పెదాల మధ్య దానిమ్మ గింజల పలువరస జిగేల్మనేలా నవ్వులు రువ్వేదొకతె. 'శ్రీ'కారాన్ని పోలిన పల్చని ఎర్రని చెవులకి మరకతాలు పొదిగిన చెవికమ్మలు, ముత్యాల బావిలీలు ధరించి వగలు పోయేదొకతె. నలక నడుము చుట్టూ జారిపోతున్న పాలెల మొలనూలు సవరించుకుంటూ నడిచే సొగసరి మరొకతె. తమలపాకుల్లాంటి పాదాలకు పసుపు పారాణి పెట్టుకుని, పాంజేబు కడియాలు, మువ్వలు ఘల్లుమనేలా అడుగులు వేసేదొకతె. ఇంత మంది అందాల భరిణల మధ్య వెలవెల బోయే పిల్లొకరుంది. ఆమే 'సుమన'.

సుమన అనాకారి కాదు. కానీ అందగత్తె అంతకన్నా కాదు. ఒకప్పుడు ఆమెకు అద్దంలో తన చింతాకు కళ్ళు చూసుకోవడమంటే తగని వెరపు. చట్టి ముక్కు చూసుకుంటే ఆమెకి మహా రోత. పెదాలూ అంత బాగోవు. నవ్వా.. నవ్వినదెప్పుడని? ఒడ్డూపొడవూ అంత గొప్పగా ఉండదు. రంగు వెలిసిన బొమ్మలా ఉంటుంది.  రవ్వల మధ్య మట్టిబెడ్డలా వెలతెలబోవడం ఇష్టం లేక ఆమె మిగిలిన గోప కాంతలతో వన విహారాలకూ, వెన్నెల స్నానాలకూ వెళ్ళేది కాదు. ఆమె క్రమం తప్పక ధరించేది మేలిముసుగును మాత్రమే!

రేపల్లెలో దూరంగా విసిరేసినట్టుండే ఓ ఇంట్లో ఉంటుందామె. ఆ ఊరి మీదుగా వెళ్ళే యాత్రీకులకు అడగకుండానే అతిధిమర్యాదలు చేసి పంపుతుంది. తెలవారక ముందే యమున నీళ్ళు తెచ్చి కడవల్లో నింపి వేసవి కాలమంతా చలివేంద్రం నడుపుతుంది. వర్షాకాలంలో దారి తప్పి ఊళ్ళోకొచ్చిన ప్రయాణీకులకు రాత్రికి బస ఏర్పాటు చేస్తుంది. ఏ వేళలో ఎవరొస్తారో అని ఎప్పుడూ పదిమందికి సరిపడే భోజనం సిధ్ధం చేస్తుంది. అతిధి రాని రోజు ఆమెకు అన్నం సహించదు. తన నట్టింట్లో కనీసం పది విస్తళ్ళు లేవని రోజు ఆమెకు మా చెడ్డ లోటుగా ఉంటుంది. అంతేనా.. ఊళ్ళో ప్రతి బాలింతకీ పథ్యం ఆమే పంపుతుంది. ప్రతి పాపాయికీ అగరు, కాటుకా తనింట్లో వేసి ఇస్తుంది. జ్వరం పడ్డ వాళ్ళకి జావ కాచి తీసుకెళ్ళి పలకరించి వస్తుంది. ముసలీ ముతకకి ఇంట్లో పిల్లలా సాయం చేస్తుంది.

రేపల్లెలో పుట్టిన ప్రతీ పుట్టా, పులుగూ లాగే సుమనకి కృష్ణుడంటే పంచప్రాణాలు. కానీ ఎప్పుడూ ఎదుటపడే ధైర్యం చేసేది కాదు. వేణుగానానికి ఓడి కన్నయ్య చెంతకి పరుగులు తియ్యని ఒకే ఒక ప్రాణి సుమన మాత్రమే! దొంగ చాటుగా అతడిని చూసి కళ్ళు ముసుకు ఇంటికి నడుచుకొచ్చేస్తుంది. రెప్పలు విప్పితే కన్నయ్య రూపం కరిగిపోతుందేమో అని ఆమెకు బెంగ. అందరిలాగే తనూ అందంగా ఉంటే కృష్ణుడి ఎదుట పడేదాన్ని కదా! అనుకునేది. సృష్టిలో ప్రతీ ప్రాణినీ ఒకేలా మలచని దేవుడిది 'అన్యాయమ'ని బాధపడేది.

ఓ సాయంత్రం తప్పిపోయిన తన పెంపుడు నెమలిని  వెతుక్కుంటూ వెళ్ళింది సుమన. బృందావనం వైపు నుంచి నెమళ్ళ క్రేంకారాలు వినిపించి అటుగా నడవసాగింది. అక్కడ మురళిని ఓ చేత పట్టుకుని, విలాసంగా ఓ తిన్నె మీద కూర్చుని కృష్ణుడు కనిపించాడు. ఆ తిన్నె పక్కనే నెమళ్ళ గుంపు. తన నెమలి కూడా ఆ మందలో చేరిపోయినట్టు గమనించింది. చప్పుడు చెయ్యకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అడుగు వెయ్యబోయింది. పిల్లగాలి తాకినట్టు వేణుగానం మొదలయ్యింది. కాలు కదలదే! నేలలో పాతుకుపోయిన మొక్కా మోడూలాగే ఆమె కాళ్ళూ నిలచిపోయాయి. ఎంత సేపు గడిచిందో తెలియదు.

వేణుగాన మాధుర్యం మనసు నిండి పొంగి పొరలుతూ ఉండగా, హఠాత్తుగా ఆపేసాడు కృష్ణుడు. కలవర పడి కళ్ళు తెరిచింది. కదలలేదని తను తలచిన కాళ్ళు తనని ఎప్పుడు నడిపించి ఆతని ముందు నిలబెట్టాయో మరి! ఎదురుగా మోహన కృష్ణుడు చిరునవ్వుతో...!!

"నీ నెమలి కానీ తప్పిపోయిందా?"
"ఊ.."
"ఈ మందలో ఉంటే తీసుకెళ్ళు"
ఎదురుగా కృష్ణుడుంటే వేరే దిక్కు కళ్ళు మరలుతాయా! అతి ప్రయత్నం మీద కళ్ళు తిప్పి చూసింది. తన నెమలికీ మిగిలిన వాటికీ తేడా తెలియడం లేదు. అసలు నెమళ్ళన్నీ ఒకేలా ఉంటాయా? లేక తనే గుర్తు పట్టలేకపోతోందా? ఆశ్చర్యం!
"ఇదా.. కాదు.. అదేమో.. ఊహూ.. ఒకేలా ఉన్నాయే!" అయోమయంగా కృష్ణుడి వైపు చూసింది.
"గుర్తు పట్టలేవా? నువ్వేగా అన్ని ప్రాణుల్నీ ఒకేలా పుట్టించని దేముడిది అన్యాయమన్నావు. ఇదిగో ఇవన్నీ ఒకేలా ఉన్నాయ్. అంతే కాదు, నువ్వూ నేనూ కూడా అచ్చం ఒకేలా ఉన్నాం..!" కావాలంటే చూసుకో అన్నట్టు కాస్త దూరంలో ఉన్న కొలను వైపు చూపించాడు.

వెళ్ళి కొలనులో అయోమయంగా తన మొహం చూసుకుంది. కృష్ణుడు కనిపించాడు! కళ్ళు నులుముకుని చూసింది. నిశ్చలంగా ఉన్న కొలను నీళ్ళలో సాయంకాలపు వెలుగులో తళుక్కున మెరుస్తూ కృష్ణుడు! అది కొలను కాదేమో అని చేతితో నీళ్ళు కదిపి చూసింది. తన చేతులు, ఒళ్ళూ చూసుకుంది. మొహం తడిమి చూసుకుంది. నుదుటి మీదకు పడుతున్న ముంగురులనూ, నీలి ఛాయలో మెరుస్తున్న చేతులనూ, మెడలో వ్రేలాడుతున్న కౌస్థుభ మణినీ, చేతిలో ఉన్న వేణువునీ చూసుకుంది. తన ఒంటిని అంటిపెట్టుకుని ఉన్న పీతాంబరాన్ని తడిమి తడిమి చూసుకుంది.  తిన్నె మీద కూర్చున్న కృష్ణుడి వైపు చూసింది.
నవ్వుతున్నాడు. మధురంగా.. చల్లగా.. హాయిగా..
"ఏం మాయ ఇది, కన్నా..!!" గొంతు పూడుకుపోతూ ఉండగా అడిగింది.
"ఏమో మరి! నువ్వూ నేనూ ఒకటే కదా! కాదా?!" ఏళ్ళూ పూళ్ళూ ఘోరతపస్సు చేసే గొప్ప గొప్ప ఋషుల ప్రశ్నలకి సమాధానమది. కన్నీళ్ళు ధారలై మనసులోని న్యూనతనీ, మాయనీ కడిగేస్తూ ఉండగా సుమన నవ్వింది.. పులు కడిగిన మాణిక్యంలా..

"అవును కృష్ణా! నువ్వూ నేనూ ఒకటే. నువ్వే నేను."  నిజమే కదూ! హెచ్చు- తగ్గు, అందం - అనాకారితనం, పేద - గొప్ప, తెలుపు - నలుపు అన్నింటా వ్యాపించి ఉన్న అంతర్యామి అతడు.

అప్పటి నుంచీ సుమన సాయంకాలం యమున ఒడ్డున చేరి, గోపికలందరి తోనూ ఆటలు ఆడింది. పువ్వులు మాలలు కట్టి కృష్ణుడి మెడలో వేసింది. వేణు గానపు సంకేతానికి బృందావనం చేరి, కన్నయ్యతో కబుర్లు చెప్పింది. అందరిలో ఒకరయ్యింది. ఇప్పుడు అందరితోనూ కలిసి కాత్యాయనీ వ్రతమూ చేస్తోంది.

తెలవారు ఝామున తలుపు తీసుకుని బయటకు వచ్చి, ఇంటిముందున్న తోటలోని పువ్వులు కోసుకుని, సజ్జ నింపుకుని బయటకు వచ్చింది సుమన. వెంట వీధిలోకి వచ్చి సాగనంపిన తన పెంపుడు నెమలిని ముద్దు చేస్తూ అక్కడే కాసేపు నిలబడిపోయింది. ఈ లోపు ఆ వీధిలోకి వచ్చిన నేస్తాలని చూసి పలకరింపుగా నవ్వింది.

"ఏవమ్మా.. నీ యజమానురాలిని వదలలేకపోతున్నావా? పూజ అవగానే పంపేస్తాములే!" నెమలిని పలకరించింది విష్ణుప్రియ.
"నువ్వు మైమరచి నాట్యం చేసేలా వర్షాలు కురవాలనే ఈ వ్రతం చేస్తున్నాం. మరి వెళ్ళి రమ్మంటావా!" నవ్వుతూ దాన్ని అడిగింది సురభి.
"అసలీ నెమలిదే అదృష్టమంతా.. కన్నయ్య ని నిత్యం అంటి పెట్టుకు ఉండే ఆభరణం దీని పింఛమేగా! నల్ల మబ్బుదీ, నెమలిదీ, నల్లని కన్నయ్యదీ వీడని బంధం కదా!" మురిపెంగా అంది సుమన యమున వైపు దారి తీస్తూ.
"నిజం! నెలకు మూడు వానలు కోరుకుంటున్నాం లే మయూరీ! నువ్వూ ఆనందంగా ఆడచ్చు!" వెనక్కి తిరిగి సుమన ఇంటి ముందు నిలబడి చూస్తున్ననెమలితో అల్లరిగా చెప్పింది కమలిని.
"వానలంటే అలాంటిలాంటి వానలు కాదు మయూరమూ, చెంగలువలూ, పుడమీ, పైరులూ పులకరించే వర్షం రావాలి."
"పుష్కలావర్తక మేఘాలతో ఆకాశం నిండిపోవాలి." అంది ఆనందిని.
"కాస్త అర్ధమయ్యేలా చెప్పకూడదూ! కరిమబ్బులన్నీ ఒకటే కదా! మరీ పుష్కలావర్తకాలేమిటీ?"
"అంటే మేఘ శ్రేష్ఠాలు. నల్లనయ్యలా నల్లగా ఉంటాయి"
"ఉరుములూ మెరుపులూ.. హోరు గాలులూ.. వర్షమంటే నాకు ఎంత భయమో!" చెప్పింది మేదిని.
"వర్షమంటే భయమెందుకూ! మనం కోరుకునే మేఘం అలాంటిలాంటిది కాదు. ఆ మేఘం సగర చక్రవర్తి కుమారులు తవ్విన గుంటల్లో నిండిన నీళ్ళు తాగకూడదు. నేరుగా సముద్రం లోపలి దాకా వెళ్ళాలి. అక్కడ తన దాహం తీర్చుకోవాలి." చెప్పింది ఆనందిని.
"ఊ.. ఇంకా! నల్లనయ్యలా నల్లని రూపం సంతరించుకోవాలి."
"అంతే కాదు! ఫెళ ఫెళా గర్జించాలి. శ్రీ హరి పాంచజన్యం చేసే ధ్వనిలా ఉండాలి దాని గర్జన!"
"హమ్మయ్యో! ఇంకా.." బెదురు చూపులతో అడిగింది మేదిని.
"ఆ మేఘం మరో మేఘంతో రాసుకు ఏర్పరిచే మెరుపు పద్మనాభుడి దక్షిణ హస్తాన జాజ్వల్యమానంగా వెలిగే సుదర్శన చక్రం సృష్టించే మెరుపులా ఉండాలి !"
"సుదర్శన చక్రపు వెలుగెలా ఉంటుందో! కళ్ళు మిరుమిట్లు గొలపవూ! అసలు చూడ శక్యమా!" భయం భయంగా ప్రశ్నించింది మేదిని.
"వెర్రి పిల్లా! భయపడకు. సుదర్శనుడికి ఆహ్లాదంగా నవ్వడమూ తెలుసు. పూర్వం సృష్టి మొదలయినపుడు పాలకడలిలో యోగ నిద్రలో ఉండే శ్రీ మహా విష్ణువు పక్కన శంఖ చక్రాలు మాత్రమే ఉన్నాయట. అప్పుడు స్వామి నాభి నుంచి కమలం పుట్టింది. ఆ కమలం నుండి చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడట. నారాయణుడు ఇంకా యోగనిద్రలోనే ఉన్నాడు. సృష్టికర్త పుట్టాడన్న ఆనందంతో సుదర్శనుడు "పుత్రస్తే జాతః   నీకు కొడుకు పుట్టాడయ్యా! చూడు చూడు!" అని సంబరపడిపోతూ చెప్పాలనుకున్నాడట. మరి సుదర్శనమంటే చక్రం! ఆయన మాటలు మెరుపులే కదా! పట్టలేని ఆనందంతో ఓ బ్రహ్మాండమైన మెరుపు మెరిపించాడట. ఆహ్లాదకరమైన జాజ్వల్యమానమైన మెరుపది. అలాంటి మెరుపు కావాలి."

ఆనందిని మాటల్లో దృశ్యాన్ని ఊహించుకుంటూ కళ్ళల్లో భయాన్ని జయించిన ఆనందం మెరుస్తూ ఉండగా అడిగింది మేదిని.
"ఆహా! ఇంకా.. ఇంకా.."
"రావణుడి మీద రాముడు కురిపించిన బాణ వర్షాన్ని తలపించే చినుకులతో వర్షం కురవాలి. అలాంటి మేఘం కావాలి. మన మార్గశీర్ష స్నానానికి సరిపడా, పైర్లకు సమృధ్ధిగా నీరు ఉండేలా వర్షాలు కురియాలి."
"ఆ మెరుపులు చూసి చెంగలువలు విచ్చుకోవాలి. నెమళ్ళు క్రేంకారాలతో నాట్యం చెయ్యాలి. యమున ఉప్పొంగి పారాలి. అదిగో యమున.. పదండి నేస్తాలూ.. తెలవారక ముందే త్వరపడాలి." స్నానానికి సిధ్ధపడమని నేస్తాలను పిలిచింది సురభి.
"ఏమో ఆనందినీ! అంత గొప్ప మేఘాన్ని కోరుతున్నాం. మన పూజలకూ, మన పిలుపులకూ మెచ్చి వస్తుందంటావా!" సందేహాన్ని వెలిబుచ్చింది కమలిని.
"అయ్యయ్యో! ఎంత మాట కమలినీ! మనమెవరం! సాక్షాత్తూ ఆ కన్నయ్యని కొలిచేవాళ్ళం. అలా తక్కువ చెయ్యకు సుమా!"
"కన్నయ్య పిలిస్తే మేఘమే కాదు సాక్షాత్తూ ఇంద్రుడే వస్తాడు.  కృష్ణుడు గోవర్ధన గిరి ఎత్తినపుడు చూడలేదూ మనం! కానీ మనం పిలిస్తే.."
"సందేహ ప్రాణివి కదూ, నువ్వు!" విసుక్కుంది సురభి.
"సందేహం తీర్చేస్తే పోతుంది కదా సురభీ! నేను చెప్తాను విను. 'ఓ మేఘాన్ని మనం పిలిస్తే వచ్చేనా?' అని సందేహపడుతున్నావ్. ఆ మేఘమే కాదు యముడైనా హరిని నమ్మిన వారికి వెరవాల్సిందే! పిలిస్తే పలికి తీరాల్సిందే! తెలుసా!" నమ్మకంగా చెప్పింది ఆనందిని.
కమలిని కళ్ళలో ఇంకా అపనమ్మకం. మేదిని కళ్ళల్లో ఆనందిని ఏం చెప్తుందా అని కుతూహలం. యమున ఒడ్డుకు చేరి నిలుచున్నారంతా..
"ఇదిగో ఈ యమునమ్మ అన్నగారే యమధర్మ రాజు. ఆయన తన కింకరుడికి ఏం చెప్పాడటో తెలుసా!"
యమున ఆసక్తిగా పుట్టింటి కబురు వినిపిస్తుందని గలగలలు అపి వినసాగింది.
"ప్రభురహం అన్యనృణాం న వైష్ణవాణాం" అని తన కింకరుని చెవిలో చెప్పి మరీ పాశాన్ని ఇచ్చి పంపుతాడట. అంటే మధుసూదనుడిని నమ్మిన వారికి తాను ప్రభువు కాదు. వారి మంచీ చెడూ చూసేది కన్నయ్యే! అని చెప్పాడన్నమాట.
కళ్ళు మిలమిల్లాడించారు కమలినీ,మేదినీ. యమునా కన్నయ్య పక్షమేగా! గర్వంగా నవ్వుకుని మనసులో అన్నగారిని మెచ్చుకుంది. తనని పొంగి పొరలేలా చేసేందుకు రాబోయే వర్షాన్ని తలుచుకు సంబరపడింది.
యమునలో "హరిహరీ!" అంటూ పడుచులందరూ మునిగి తెల్లకలువల్లా పైకి తేలారు.

రోజూ చేసిన విధంగానే తడి ఇసుకతో "కాత్యాయనీ ప్రతిమ" చేసుకుని, సురభిళ పుష్పాలతో, ధూప దీప నైవేద్యాలతో, ఆనాటి పూజ పూర్తి చేసుకున్నారు.

చల్లని గాలి వీస్తోంది. యమున నెమ్మదిగా కదులుతోంది. తొలివెలుగుల్లో ముత్యాల దండలా ఒక చోట చేరి కూర్చున్న వారందరి మనసులలోనూ, కృష్ణ శబ్దమే అమృత వర్షాన్ని కురిపిస్తుంది. పాడీ పంటా పచ్చగా ఉండేందుకు కృష్ణుడి లక్షణాలన్నీ పుణికి పుచ్చుకుని "అమృతం కురిసే మేఘం" రావాలని ఆ గొల్ల పిల్లలు "అమృత వర్షిణి" రాగంలో తీయగా ఆలపించసాగారు.


కురియుము కురియుము వర్షము
వరలగ జగతికి హర్షము
ఓయీ గంభీర హృదయ!
ఓయీ వర్ష నిర్వాహ!

మురిసి మార్గశిర స్నానమును
మును మే మొనరుప తడయక

జలనిధిలో జొరబడి, అట సలిలమెల్ల త్రాగి త్రాగి,
ఫెళఫెళ మని గర్జింపుచు, బిరబిర పైకెగసిఎగసి,
అల కాలోపలక్షిత జగత్కారణుని మూరితి
వలె నీ మెయి నీల నీల వర్ణముతో తేల తేల

సుందరపటుబాహువు అరవిందనాభు మేటి కరము
పొందిన శ్రీ సుదర్శనము పొలుపున తళతళ మెరసి,
క్రందుగ దక్షిణావర్తమగు శ్రీ పాంచజన్యమ్ము
చందమ్మున ఉరిమి, శార్ఞ్జమట్లు అంపజడులు చిమ్మి

కురియుము కురియుము వర్షము

( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )

* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

11 comments:

  1. ఆళీ మళై కణ్ణా .. వరాళి రాగంలో .. ఓహ్! భలే.
    అన్నట్టు దేవులపల్లి వారిదే ఓ పాట ఉన్నది. నీలమోహనా రారా .. అందులో, నాయిక చెలికత్తెలు పాడె భాగం ఒకటున్నది, మాటలు సరిగ్గా గుర్తు రావడల్లేదు .. కరిమబ్బుంటుందా .. నీలి మేఘ మాకాశం వీడి నేల దిగొస్తుందా .. వస్తుందా? ఏమో మరి - వెదురు బొంగులో దూరిన గాలి రాగమై పలికినంత వొట్టు.

    ReplyDelete
  2. కొత్తపాళీగారు ఈ పాట డా.చక్రవర్తిలోనిది..
    కార్తీక రాతిరిలో కఱి మబ్బుంటుందా
    నీలిమేఘ మాకాశము విడిచి నేల నడుస్తుందా
    నడిచే మబ్బులకు నవ్వే పెదవుందా
    నవ్వే పెదవులకు మువ్వల మురళుందా
    పెదవి నందితే పేద వెదుళ్ళు కదలి పాడుతాయా?
    నడిచే మబ్బులకు నవ్వే పెదవులు
    నవ్వే పెదవులకు మువ్వల వేణువులు..

    ఈ కాత్యాయినీ వ్రతం ద్వారా రోజూ కృష్ణశాస్త్రిగారిని పలకరించినట్టుగా ఉంది. పుణ్యానికి పుణ్యం కూడా..

    ReplyDelete
  3. మొన్న తొలిసారి బ్లాగ్ లోకంలో మీ పోస్ట్ కాత్యాయనీ వ్రతం-2 చదివి పులకించి స్పందించేను.అంతటితో ఊరుకోలేదు. వెనక్కి వెళ్శ్సి2008 నుంచి మీరు బ్లాగులో పోస్టు చేసిన రచన లన్నీ చదివాను.మీ శైలి అద్భుతం. ఈ రేపల్లె సీరీస్ మాత్రమే కాదు, మీ చిన్ననాటి కబుర్లు చెప్పిన తీరు కూడా చాలా అలరించే విధంగా ఉంది. మీ తాతగారు మీకు చిన్నప్పుడు నేర్పిన సంస్కృత పాఠాలు కూడా మీ నేటి రచనా శైలికి తోడ్పడి ఉంటాయని చెప్పక తప్పదు.అది మీ అదృష్టం. మీ బ్లాగులో ఇవన్నీ చదవగలగడం మా అదృష్టం.

    ReplyDelete
  4. సారీ నేను చెప్పిన పాట డా.ఆనంద్ సినిమాలోది

    ReplyDelete
  5. పొద్దున్నే 6గం.లకి ఆఫీషుకి వెళ్తున్నా. సాయంత్రం వస్తూనే మీ బ్లాగే ఓపెన్‌ చెయ్యడం..
    చిన్న చిన్న కధల్లోనే గొప్ప కృష్ణతత్వాన్ని ఒదిగిస్తున్నారు కదా!..
    థాంకులు.

    ReplyDelete
  6. @ కొత్తపాళీ: ఆహా.. ఎంత మంచి పాటండీ! "ప్రతి మబ్బూ ప్రభువైతే.. ప్రతి కొమ్మా మురళైతే.." ధన్యవాదాలు!

    @ జ్యోతి: పాట గుర్తు చేసినందుకు ధన్యవాదాలండీ!

    @ పంతుల గోపాలకృష్ణ: అవునండీ! పెద్దల, గురువుల భిక్షా, ఆశీర్వాదమే ఏదైనా! మీకు నా వ్రాతలు నచ్చినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలండీ!

    @ మురారి: సమయం వెచ్చించి రోజూ చదువుతున్నందుకూ, ప్రోత్సహిస్తున్నందుకూ చాలా సంతోషమండీ! ధన్యవాదాలు.

    ReplyDelete
  7. సుమన కథ 'కుబ్జ' ని గుర్తు చేసిందండీ నాకు...

    ReplyDelete
  8. "యమున ఆసక్తిగా పుట్టింటి కబురు వినిపిస్తుందని గలగలలు అపి వినసాగింది" భలే ఉంది ఈ భావన. ఇలా కోట్ చెయ్యాలనుకుంటే ఈ సిరీస్ నిండా అద్భుత వాక్యాలే.

    ReplyDelete
  9. సుమనమ్మ కథ .. Too good. మీరూ చాలా టచింగ్ గా ప్రెజెంట్ చేశారు.

    'అందర్నీ ఒకేలాగా ఎందుకు తయారు చేయలేదు దేవుడు? అన్యాయం :) ' అనుకున్న అమ్మాయి కి ఎంత చక్కటి సమాధానం ఇచ్చాడు కృష్ణుడు? బాగుంది.

    "యమున ఆసక్తిగా పుట్టింటి కబురు వినిపిస్తుందని గలగలలు అపి వినసాగింది" -- ఆహా!

    ReplyDelete
  10. "హెచ్చు- తగ్గు, అందం - అనాకారితనం, పేద - గొప్ప, తెలుపు - నలుపు అన్నింటా వ్యాపించి ఉన్న అంతర్యామి అతడు."

    కృష్ణుడంటే ఇది చదివాక కలిగిన ఇష్టం ఇంతకు ముందు ఎప్పుడూ కలగలేదు, సుస్మితా!

    ~లలిత

    ReplyDelete
  11. అబ్బ.. ఎంత బాగుందో.. సుమన కథ! కృష్ణతత్వాన్ని అందంగా అక్షరాల్లో కూర్చి రాసారు. యమున గురించి మీరు రాసే కబుర్లన్నీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.. ఏమైనా ఇంతన్దమైన కృష్ణ గాథని మా చేత చదివిస్తూ మమ్మల్ని ధన్యులని చేస్తున్నారు. :)

    ReplyDelete