Monday, December 19, 2011

ఒప్పుల కుప్పలు : కాత్యాయనీ వ్రతం - 5

కృష్ణ పక్షం జాబిలి దీపపు వత్తిని కాస్త తగ్గించి, చీకటి దుప్పటి కప్పి, రాత్రంతా రేపల్లెని హాయి ఊయలూచింది. తెలవారడానికి ఇంకా సమయం ఉంది. సుకుమారమైన ఆడపిల్లల్లాంటి పారిజాతాలు "కాత్యాయనీ వ్రతానికి" తామూ వస్తామని చలిగాలి పల్లకీ ఎక్కి నేల చేరుతున్నాయి. గోప కాంతలందరూ ఆదమరచి వేకువఝాము కలలు కంటున్నారు. మేదినికి మాత్రం రాత్రంతా కలత నిద్రే! ఏవో కలలు, ఏదో బెంగ. ఇక చాలునని పడక మీద నుంచి లేచి కూర్చుంది. మనసంతా రకరకాల ఆలోచనలు. ఎవరితోనైనా పంచుకుంటే బాగుండనిపించే తలపులు. లేచి బయటకు వచ్చింది. ప్రకృతి ఆహ్లాదంగా ఉంది. పూల సజ్జ తీసుకు వచ్చి మంచు తానాలాడుతున్న గులాబీలూ, నంది వర్ధనాలూ కోసి సజ్జ నింపింది. ఆ పై పారిజాతాలు ఏరింది. ఆనందినిని నిద్ర లేపేందుకు అడుగులు వెయ్యసాగింది. నిద్ర లేచేందుకు సిధ్ధమవుతున్న పిట్టలు, పశువులూ చలికి బధ్ధకంగా మసలుతున్నాయి. ఆనందిని అప్పటికే నిద్ర లేచి బయటకు వచ్చింది.

"అప్పుడే పువ్వులేరి తెచ్చావే!" అని నవ్వుతూ పలకరించింది ఆనందిని.
"అవును. రాత్రంతా సరిగా నిద్ర లేదు. చేసేదేముందనీ.. ఈ పని పూర్తి చేసాను."
"కళ్ళు మంకెనల్లా ఉన్నాయి. ఏం, ఒంట్లో కులాసానా?"
"ఆ.. కన్నయ్యని కట్టేసిన రోలల్లే నిక్షేపంగా ఉన్నాను. నాకేం! ఎందుకో రకరకాల బెంగలు." నవ్వు లేని మేదిని మొహం ఆకాశంలో దూరంగా మినుకుమంటున్న తారలా ఉంది.
"ఏమయిందమ్మా.. చెప్తేగా బెంగ తీరేది!"
"కలొచ్చింది. నేనేమో ఆదమరచి నిద్దరోతున్నానట. నిద్ర లేపీ లేపీ విసుగొచ్చి మీరంతా వెళ్ళిపోయారట. అది మొదలూ ఎంత బెంగగా ఉందో!" బేలగా చూస్తూ చెప్పింది.
"హహ్హహ్హహా.. ఓసి పిచ్చి పిల్లా! ఇంత మాత్రానికేనా! నువ్వు నిజంగా అలాగే నిద్దరోయావనుకో! అందరం కలిసి నిన్ను ఎత్తుకెళ్ళి చల్లని యమున నీళ్ళతో కళ్ళు తుడిచి, నిద్ర లేపి మరీ లాల పోసేస్తాం. వెర్రి దానా! నిన్ను వదిలేస్తామా!  నేనే నిద్ర లేవకపోతే, నన్ను నువ్వు అలాగే వదిలేసి వెళ్ళీపోతావా చెప్పు!?" చిరు మువ్వలు గలగల్లాడినట్టు నవ్వేస్తూ అడిగింది ఆనందిని.
"ఊహూ.. వదలను. 'కృష్ణా కృష్ణా' అని నీ చెవిలో అరిచి మరీ నిద్ర లేపేస్తాను." మబ్బుచాటు తొలిగిన నెలవంకల్లే నవ్వేసింది మేదిని.
"ఇంకేం! అయినా సందేహమెందుకు! మనం తలపెట్టినది మంచి పని. మన వెనుక ఉన్నది దేవదేవుడు. ఎలాంటి అడ్డూ లేని మందాకినిలా మన వ్రతం సాగిపోతుంది."
"శ్రేయాంసి బహు విఘ్నాని" అని అంటారు కదా! మంచి పనికే పరీక్షలు, ఆటుపోట్లూ ఎక్కువ! ఏవిటో.. ఈ బెంగ నీడలా వెంటాడుతోంది."
"లాభం లేదమ్మాయీ! హనుమ లాగే నీకూ నీ బలం తెలీయడం లేదు. సముద్ర లంఘనానికి ఆలోచిస్తున్న ఆయనకు వానర సైన్యమంతా గుర్తు చేసినట్టు, నేనూ నీకు మన బలమూ, మన వెనుక దన్నూ గుర్తు చెయ్యక తప్పదు!"
"నీ మాటలు వింటే ధైర్యమొస్తుంది. చెప్పు ఆనందినీ!"

"నీకో కథ చెప్తాను విను. ఓ చీమ ఉండేదట. దానికి గంగలో మునక వెయ్యాలని చాన్నాళ్ళ నుంచీ కోరిక. కానీ అది తీరే దారేదీ! మేరు పర్వతంలా రోజురోజుకూ పెరిగిపోతున్న తన కోరికని సాధించుకునేందుకు ఆలోచించీ ఆలోచించీ దాని చిట్టి బుర్రలో ఓ ఉపాయం తట్టిందట! ఓ శివాలయం ముందున్న బిల్వవృక్షం ఎక్కి కూర్చుందిట. ఉదయాన్నే శివార్చన కోసం బిల్వ దళాలు కోసిన పూజారి పూలసజ్జతో చీమ శివ సన్నిధిని ప్రవేశించిందట. అర్చన చేస్తూ చీమ ఎక్కిన బిల్వ దళాన్ని శివుని శిరస్సుపై ఉంచాడట. శివుని తలపై ఉండే గంగమ్మ చీమ భక్తికి మెచ్చి పొంగిపోయిందట. అలా చీమ కోరిక కాస్తా తీరిందన్నమాట! ఉపాయమూ, కోరికా ఉంటే ఎంతటి పనైనా చెయ్యగలం, అమ్మడూ!"
"కథలదేముంది లే ఆనందినీ..ఎన్నైనా చెప్తావూ! నేనూ ఓ కథ చెప్తాను విను. ఓ తుమ్మెద పద్మం పై వాలిందట. మకరందం తాగి ఆ మత్తుకి కళ్ళు మూసుకుని అక్కడే పడి నిద్రపోయిందట."
"కలలో నువ్వు కృష్ణ రసాయనం తాగీ తాగీ మొద్దు నిద్ర పోయినట్టే!" ఆటపట్టించింది ఆనందిని.
"ఇదిగో, ఇలా అయితే నేను చెప్పను." మూతి ముడిచిందా ముద్దుగుమ్మ.
"లేదు లే! అదిగో సురభీ, కమలినీ, విష్ణుప్రియా వస్తున్నారు. తరళ కూడా..మిగిలిన వాళ్ళు యమున ఒడ్డుకే వచ్చేస్తారనుకుంటా! చెప్పు చెప్పు. నీ కథ వాళ్ళూ వింటారు." అంది ఆనందిని. వాళ్ళను చేరిన మిగిలిన చెలులు కూడా ఆసక్తిగా వింటూ నడవసాగారు.

"తేనె తాగి నిద్దరోయిన తుమ్మెద మేలుకునే సరికి సాయంకాలం అయిపోయింది. పద్మం ముకుళించుకుపోయింది. "సర్లే, మళ్ళీ తెల్లారదా!" అని ఎదురు చూస్తూ అలా పద్మంలో బందీయై తుమ్మెద రాత్రంతా ఉండిపోయిందట. తెల్లారింది. ఉదయాన్నే స్నానానికి ఆ కొలనులోకి వచ్చిన ఓ మదపుటేనుగు ఆ పద్మాన్ని పెకలించి విసిరేసింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయింది. మన కర్మలు మనని ఎటు తీసుకు వెళ్తాయో చెప్పలేం కదా! కృష్ణుడంతటి వాడిని కోరుకోవాలంటే.. వెర్రి గొల్ల పడతులం! మన పుణ్యం సరిపోతుందా! వర్షాలు కురిపించి ఊరికి మేలు చేసేంతటి వాళ్ళమా!?"

సురభీ, ఆనందినీ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. తమ నేస్తం మనసును కబళించిన సందేహాల రాహువును విడిపించే శక్తి, సుదర్శన చక్రంలాంటి కృష్ణ గాధలకే ఉందని తెలిసి చెప్పనారంభించింది ఆనందిని.
"ఇందాకా ఏమన్నావు మేదినీ! కృష్ణుడిని కట్టిన రోలల్లే ఉన్నానని కదూ! కన్నయ్యని యశోదమ్మ ఎలా కట్టేసిందో నీకేమైనా తెలుసా?"
"తాడుతో!"
"అదే ఎలా?"
"అల్లరి కన్నయ్యని కట్టేందుకు ఒక తాడెక్కడ సరిపోతుందీ! పాపం వెర్రి తల్లి బోలెడు తాళ్ళు తెచ్చి, ముడులు వేసీ వేసీ అలసిపోయి కూలబడిపోయిందట. చమటతో ఆవిడ ఒళ్ళంతా తడిసిపోయిందట. జుత్తు ముడి జారిపోయి విడిపోయిందట. బొట్టు చెమటకి చెదిరిపోయిందట. ఆయాసపడిపోతోంది! అమ్మని అలా చూసే సరికి, కన్నయ్యకి బోలెడు జాలేసిందిట. వెన్నలాంటి మనసు కదూ! బొజ్జ కాస్త లోపలికి లాక్కున్నాడట. అంతే! ముడి వేసి రోటికి కట్టేసింది." వెలిగిపోతున్న మొహంతో ఉత్సాహంగా చెప్పింది మేదిని.
"మరి! ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుంది. "పట్టుబడతాడా?" అనే సందేహం ఆమెకు లేదు. పట్టుబడితే చాలన్న తపన ఉంది. అంతే. ముద్దులు మూట కడుతున్నబుల్లి బుజ్జాయి బొజ్జకి కట్టేందుకు మూరెడు తాడు సరిపోలేదేవిటా! అనే సందేహం లేదు. దామోదరుడు మాయగాడు కదూ!" ఆనందిని ఇంక చెప్పక్కర్లేకుండానే అర్ధమయ్యింది అందరికీ.

"నల్లనయ్య పుట్టిన ఉత్తర మధురాపురి సామాన్యమైన ఊరు కాదు తెలుసా! వామనావతారంలో బలి చక్రవర్తి యాగం చేసిన సిధ్ధాశ్రమం అక్కడే ఉండేదట! వామన మూర్తి త్రివిక్రముడై ముల్లోకాలూ జయించినదీ ఇదే నేల మీద. ఆ పై విశ్వామిత్రుడు తపస్సు ఆచరించినదీ అదే స్థలంలో. రాముని కాలంలో ఆ అడవిలో శత్రుఘ్నుడు గొప్ప నగరం నిర్మించాడని చెప్తారు. అంత గొప్ప ప్రదేశం మధుర. "మధురా నామ నగరీ పుణ్యా పాపహరీ శుభా.. యస్యాం జాతో జగన్నాథః సాక్షాత్ విష్ణుః సనాతనః" అలాంటి నగరానికి రాజు మన కన్నయ్య. అలాంటి వాడు మన కోసం యమున దాటి ఈ రేపల్లెకి వచ్చి 'యశోద కడుపు చల్లగా' పెరుగుతున్నాడంటే.. మనం పుణ్యాల పుట్టలం కదూ! ఒప్పులకుప్పలం కదూ! మీరే చెప్పండి!?" అడిగింది సురభి. విచ్చిన కల్హారాల్లాంటి వాళ్ళ కళ్ళలో ఆశ్చర్యం, ఆనందం కలిసి స్వఛ్చంగా మెరుస్తున్నాయి.

"కనుక అమ్మాయిలూ! మనం చేతులు జోడించి "కృష్ణా!" అంటే చాలు. మనం చేసిన పాపాలేవైనా ఉంటే ధాన్యపు పొల్లు గాలికి ఎగిరిపోయినట్టు, నిప్పులో వేసిన దూది బూడిదైపోయినట్టు మాయమైపోతాయి. ఆ పై మన పని మనం త్రికరణ శుధ్ధిగా చేస్తే చాలు. కన్నయ్య పేరు పలికితే పెదవి తియ్యనైపోతుంది కదూ! మనసు యమునలా పొంగదూ! అసలు 'కృష్ణ' అంటేనే గొప్ప ఆనందమని అర్ధమట." యమున వైపు దారి తీస్తూ చెప్పింది ఆనందిని.

అందరి మనసులూ వాన చినుకులకు తడిసిన పువ్వుల్లా స్వఛ్ఛంగా ఉన్నాయి. ప్రాతఃకాలానికి ముందే యమునలో స్నానం పూర్తి చేసుకుని కాత్యాయనీ వ్రత విధానాన్ని ఆచరించారు. "అమాయకమైన మనకు కలలోనూ, ఇలలోనూ తోడుండి నడిపించేది కృష్ణుడే!" అని మరోసారి ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. సందేహాలూ, బెంగలూ తీరిన మేదిని ముఖం తేటగా ఉంది. 'తోడి రాగం' లో కమలిని హాయిగా పాడుతున్న పాటను వింటూ ఉదయిస్తున్న భానుమూర్తికి స్వాగతం పలికారందరూ.



చెప్పరే! చెప్పరే! శ్రీ నామములను
ఒప్పుల కుప్పలార! తప్పక! తప్పక!
ఎప్పుడో చేసిన తప్పులన్నీ నశింప
నిప్పులో తూలికలుగ! ఇప్పుడే! ఇప్పుడే!

అల్ల వ్రజవంశమ్మునకు కల్యాణ దీపమైన వాని,
తల్లికడుపులకెల్లవేలలా చల్లని వెలుగైన వాని
అల్లన, అమలినలుగా ఏతెంచి ధ్యానించి, ధ్యానించి,
సల్లలిత సుమములర్పించి సేవించి సేవించి

మాయవాని, ఉత్తరమధురాపురికి రేడైన వాని
హాయిగా గంభీర యమునా తీరమున విహరించువాని
ఈయెడ, దామోదరుని ధ్యానించి, మరి ధ్యానించి,
తీయని అచ్చంపు పువులర్పించి మరిమరి సేవించి

చెప్పరే! చెప్పరే! శ్రీనామములను

 
( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
 
 
* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..
 
 
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

17 comments:

  1. బావుంది.

    భావుకత్వంతో... పొందికైన పదాల్తో.. చాలా చాలా బావుంది.

    ReplyDelete
  2. @ గీతిక: ధన్యవాదాలు!

    ReplyDelete
  3. "కన్నయ్యని కట్టేసిన రోలల్లే నిక్షేపంగా ఉన్నాను.."
    :))
    "అసలు 'కృష్ణ' అంటేనే గొప్ప ఆనందమని అర్ధమట.."
    true!

    ReplyDelete
  4. తేనె తాగి నిద్దరోయిన తుమ్మెద కథ నేను వినలేదండీ..కొత్త కథ తెలుసుకున్నానివాళ..

    ReplyDelete
  5. కలలో నువ్వు కృష్ణ రసాయనం తాగీ తాగీ మొద్దు నిద్ర పోయినట్టే!"

    ఆహా! ఎంతటి తియ్యని ప్రయోగం!!!

    కృష్ణ రసాయనం మా అందరికీ పంచుతున్నందుకు ధన్యవాదాలు

    ReplyDelete
  6. @ తృష్ణ: :) ధన్యవాదాలండీ!

    @ జ్యోతిర్మయి: అవునా! :) ధన్యవాదాలు!

    @ Mohanavamshi: "కిమౌషధై: క్లిశ్యసి మూఢ దుర్మతే నిరామయం కృష్ణరసాయనం పిబ"

    ఆ "కృష్ణ రసాయనం" అనే అందమైన ప్రయోగం నాది కాదండీ! కులశేఖరుల 'ముకుందమాల ' లో చిందిన తేనె. ధన్యవాదాలు.

    ReplyDelete
  7. మధురంగా తీయగా ఉంది.

    చదువుతుంటే నా బ్లడ్ సుగర్ కౌంట్ పెరిగి పోతోంది. ఏమి చెయ్యమంటారు?

    ReplyDelete
  8. చక్కగా వ్రాస్తున్నారండి. చదువుతుంటే అంతా కళ్ళెదుట జరుగుతున్నట్లే అనిపిస్తోంది.

    ReplyDelete
  9. రోజూ దశమస్కంధం చదువుకుంటున్న నాకు మీ రచన అద్భుతమైన దృశ్యమాలికలా వుంది.చదువుతున్నంతసేపు కళ్ళల్లో బాలకృష్ణుడే!3 రోజులక్రితం మీరు వ్రాసిన టపా లో పసివాడు పాల కోసం తల్లి రొమ్ము వెదుక్కున్నట్టు నిజమైన భక్తుడు భగవంతుని పాదాలు చేరతాడన్న భావం నాకు ఎంతగానో నచ్చింది.

    ReplyDelete
  10. కృష్ణుని గొప్పతనం, కొంటెతనం గురించి వినడమే కాని గోపికలు ఎలా ఉంటారా అని ఎప్పుడూ ఆలోచించలేదు. మీ టపాల ద్వారా గోపికలు ఎంత అందమైన మనస్కులో అర్ధమౌతోంది. ధన్యవాదాలు.

    ReplyDelete
  11. మనం చేతులు జోడించి "కృష్ణా!" అంటే చాలు. మనం చేసిన పాపాలేవైనా ఉంటే ధాన్యపు పొల్లు గాలికి ఎగిరిపోయినట్టు, నిప్పులో వేసిన దూది బూడిదైపోయినట్టు మాయమైపోతాయి.
    కృష్ణార్పణం!!

    ReplyDelete
  12. నిజమే కదా, భక్తులు లేకపోతే భగవంతుడే లేడు. భగవంతుని అస్తిత్వానికే మూలం భక్తి. హనుమ నోట భక్తితో వెలువడిన రామనామం రామ బాణాన్నే జయించిందని ప్రతీతి. సంగీత జ్ఞానమూ భక్తివినా సన్మార్గము గలదే అన్నారు త్యాగరాజస్వామి. బాగుంది.

    ReplyDelete
  13. "కృష్ణ పక్షం జాబిలి దీపపు వత్తిని కాస్త తగ్గించి, ఆ.. కన్నయ్యని కట్టేసిన రోలల్లే నిక్షేపంగా ఉన్నాను"

    అధ్బుతాలండీ బాబు.

    ReplyDelete
  14. కృష్ణ పక్షం జాబిలి దీపపు వత్తిని కాస్త తగ్గించి, చీకటి దుప్పటి కప్పి, రాత్రంతా రేపల్లెని హాయి ఊయలూచింది. తెలవారడానికి ఇంకా సమయం ఉంది. సుకుమారమైన ఆడపిల్లల్లాంటి పారిజాతాలు "కాత్యాయనీ వ్రతానికి" తామూ వస్తామని చలిగాలి పల్లకీ ఎక్కి నేల చేరుతున్నాయి." --- sooper!

    తేనె తాగి నిద్దరోయిన తుమ్మెదా, గంగలో మునకేయాలనుకున్న చీమ కథా.. బహు చక్కగా ఉన్నాయి.

    ReplyDelete
  15. "కృష్ణ పక్షం జాబిలి దీపపు వత్తిని కాస్త తగ్గించి, చీకటి దుప్పటి కప్పి, రాత్రంతా రేపల్లెని హాయి ఊయలూచింది."

    - జాబిలి లేని చీకటిరోజులు కూడా మీ వ్రాత పుణ్యమా అని వెలుగులు చిమ్మేస్తున్నాయి.

    ~లలిత

    ReplyDelete
  16. భలే ఉంది చీమ కథ! తేనె తాగి నిద్దరోయిన తుమ్మెద కథ విన్నాక నాక్కూడా బెంగొచ్చేసింది మేదిని లాగా.. అంతలోనే మీరు కృష్ణ మంత్రం వేసి పోగొట్టేసారుగా! :)

    ReplyDelete
  17. అన్నట్టు.. మీరు చెప్పిన కథ విన్నాక 'మధుర' అన్న పిలుపు మరీ మధురంగా వినిపించేస్తుందేమో నాకిప్పటినుంచీ.. :))

    ReplyDelete