Monday, January 2, 2012

పలుకవా నళినేక్షణా! ~ కాత్యాయనీ వ్రతం - 19

తెలి వెన్నెల తెరలు కట్టిన నింగి పల్లకీ ఎక్కి ఊరేగుతున్న జాబిలిని చూసి నిట్టూర్చింది సురభి.
"రోజుకో కళ పెరుగుతూ మన విరహానికి ఆజ్యం పోస్తున్నాడు." సురభిని చూసి తానూ నిట్టూరుస్తూ చెప్పింది తరళ.
"పదండి. కాత్యాయనికి మనసారా మొక్కి నడవండి. ఈ రోజు నీలను నిద్ర లేపాల్సిందే! కృష్ణుని చూడాల్సిందే." బయలుదేరదీసింది ఆనందిని.
"ఈ రోజైనా మన మనోరథం నెరవేరేనా?" నిరాశగా అంది సురభి.
"సురభీ! నువ్వే ఇలా బెంబేలుపడితే మిగిలిన వారికి ధైర్యం చెప్పేదెవరు? ఒక్కో రాయీ పేర్చితేనే వారధి అయింది. రాముడికే తప్పలేదీ విరహం. మనబోంట్ల సంగతి చెప్పేదేముంది? సహనం వహించక తప్పదు. పదండి అమ్మాయిలూ!" చుక్కానిలా రెపరెపలాడింది చకచకా నడుస్తున్న ఆనందిని పైట కొంగు.

నీల మందిరపు ముంగిట నిలబడ్డారు. గాలిలో తేళివస్తున్న అగరు ధూపం, చందన పరిమళాలు వారి విరహబాధను రెట్టింపు చేస్తున్నాయి. బంగారు కిటికీలకు అలంకరించిన తెరలతో తెమ్మెర సరాగాలాడుతూ,  ఆ పడకింటి అవ్యక్తమైన అందాలను, ఆ గోపవనితల ఊహకు అందిస్తోంది. ఆకుల సవ్వడి వినిపించినా అది నీల మంజీరాల రవళేమో అనుకుంటున్నారు. నాసికకు సోకే సుగంధంలో వనమాల సౌరభాన్ని వెతుక్కుంటున్నారు. కనురెప్పైనా వెయ్యక ఆ మందిర సౌందర్యాన్ని చూస్తున్నారు. ఆ తలుపుల వెనుక ఉన్న తమ మనోహరుని పిలవసాగారు.

"ఓ రాజీవ లోచనా! నీ నయన సౌందర్యానికి ఓడి నీ ముంగిట నీ కోసం ఎదురుచూస్తున్నాము. నీకు తెలియనిదేముంది! మేము అడగాల్సిన పనేముంది? అయినా అడుగుతున్నాం. మా వ్రత సాఫల్యానికి కావలసిన వాయిద్యం ఇస్తానని మాటిచ్చావు. నిష్ఠగా నోము నోచుకుంటున్నాం. రోజులు గడుస్తున్నాయే కానీ నీ దర్శనభాగ్యం లేదు. మా మాట మరచావేమో అని గుర్తు చేద్దామని వచ్చాం. కనీసం "ఓ"యని బదులైనా పలకలేవా? ఒక్క మాటైనా మాటాడకుండా, ఈ అమాయక గొల్లపడుచులందరినీ నీ ముంగిట నిలుపుకున్నావు. నీకిది న్యాయమా?" కన్నుల చిప్పిల్లుతున్న కవోష్ణ ధారలు కట్టు దాటకుండా ఉగ్గబట్టుకుంటూ పిలిచారు గొల్ల పడుచులు.

సమాధానం లేదు. కోపమొచ్చింది కొందరికి. నిరాశ నిస్సత్తువైపోయింది ఇంకొందరికి. అయినా పట్టువిడువక పిలిస్తున్నారు.
"నీల అనుపమాన సౌందర్యవతి. ఆ కలికి చనుగవ నీ తలగడగా చేసుకుని పడుకుని ఉంటావు, కృష్ణా! ఇంక మా పిలుపు నీకెలా వినబడుతుంది? కనీసం పెదవి విచ్చి ఒక్క మాట మాట్లాడలేవా?" నిష్టూరం రంగరించి పలికింది కమలిని. చెలులందరూ ఆమె వైపు నీకెలా తెలుసన్నట్టు చూసారు. ఇంకా ఏం ఊహించావని అడిగారు.

"ఆ మందిరంలో గుత్తులు గుత్తులుగా కప్పురపు దివ్వెలు వెలుగుతుంటాయి. ఆ దివ్వెల వెలుగులో నీల నీలాల కురుల పరిమళం తాకేలా ఆమె హృదయసీమ పై పవళించి ఉంటాడేమో!" చెప్పింది కమలిని.
"అంతేనా! తెల్లని దంతపు కోళ్ళతో ఉన్న పంచతల్పం పై శయనించి ఉంటాడు. అంత సుఖమైన నిద్ర కనుకే తెలివి రావట్లేదు." అంది సురభి.
"దంతపు కోళ్ళా? పంచతల్పమా?"
"అవును! మధురానగరానికి వెళ్ళిన బలరామకృష్ణులకు, మదమెక్కి రహదారిలో చిందులేస్తున్న కువలయాపీడమనే కంసుని పట్టపుటేనుగు ఎదురుపడిందట. కృష్ణుడు సింహం లంఘించినట్టు ఆ ఏనుగు కుంభస్థలం పైకి ఎగిరి చేతులతో మోది దాని ప్రాణాలు హరించాడు. కువలయాపీడానికి నాలుగు బ్రహ్మాండమైన దంతాలుండేవి. ఆ ఏనుగును సంహరించిన పిదప, తన పరాక్రమానికి గుర్తుగా ఆ నాలుగు దంతాలూ మంచపు కోళ్ళుగా చేసి నీలకు బహూకరించి ఉంటాడు."
"మరి పంచతల్పమంటేనో?"
"చలికాలములో వెచ్చగానూ - వేసవి కాలంలో చల్లగానూ ఉండేది, మెత్తనిదీ, విశాలమైనదీ, పరిమళాలు వెదజల్లేదీ, మల్లెపూవల్లే తెల్లగా ఉండే శయ్యను పంచతల్పమంటారు." చెప్పింది మంజుల. "అవునా!" అని ఆశ్చర్యపోయారు మిగిలిన వారు.
"అంత హాయిగా నిద్దరోతున్న స్వామి కళ్ళెలా విప్పుతాడు. నీల అయినా నిద్రలేస్తే బాగుండును."
"మన పిలుపు విని లేచి వద్దామని ఒక్క అడుగు వేసాడనుకో! ఆ నీల వెళ్ళనిస్తుందా? కనులతోనే వారించి మళ్ళీ తన గుండెల్లో దాచేసుకుందేమో!" అనుమానం వెలిబుచ్చింది విష్ణుప్రియ,
"లేదు. కృష్ణుడే మాయావి. ఆమె మంచిదే పాపం!" తనకు తెలుసన్నట్టు చెప్పింది కమలిని.

"ఓ నీలా! కాటుక రేఖలు తీర్చిన నీ సోగకన్నులను ఒక్క మారు అల్లన విచ్చి చూడవమ్మా! నీలాంటి సుగుణరాశికి తగినదేనా ఇది? భోగాలన్నీ విడిచి పల్లె కోసం, మాకోసం నోము నోచాము. నువ్వేమో హాయిగా కృష్ణుని కౌగిట ఒదిగి నిద్దరోతున్నావు. మా మొర వినబడదా? మాపై దయతలచి, నువ్వు ఒక్క అడుగు వేసేలోపు నీ విరహాన్ని క్షణమైనా భరించలేని అతడు నీ చెయ్యి పట్టి ఆపాడా.. ఏం?"


పలుకవా నళినేక్షణా
బదులైన
పలుకవా నవమోహనా!

పలుకవా రవ్వంత! పవ్వళింతువు గాని
కలికి చనుగవ పైని తలగడగ కేలూని

తళుకు దంతపుకోళ్ళ మంచమ్ము పై,
లలిత సురభిళ పంచ తల్పమ్ము పై,
ఒరిగి కప్పురపు దివ్వె వెలుగులో, అల నీల
నెరుల విరితావిలో, నిదురింతువే గాని!

గడెయైన విభుని ఎడబాయవు.
తడవైన గాని నిద్దుర లేపవు!
సొగసు కాటుక రేక సోగకన్నుల దాన!
తగదమ్మ నీ వంటి సుగుణవతికో చాన!

పలుకవా నళినేక్షణా!

"ఇంతలా మేలుకొలిపినా ప్రయోజనం లేదు! ఇంతేనా? మన వ్రతం నిష్ఫలమేనా?" ఉబికి వస్తున్న కన్నీళ్ళను కొనగోట చిదుముతూ దీనంగా అడిగింది సురభి. ఆమెను అక్కున చేర్చుకుంది ఆనందిని.
"వెర్రిపిల్లా! కన్నీళ్ళు పెడుతున్నావా? నీకిది తగదు సుమా! కృష్ణుడికి తెలియని సంగతి ఉంటుందా? లౌకికమైన ప్రయత్నం చెయ్యాలి కనుక మనం వచ్చి మేలుకొలుపులు పాడుతున్నామే కానీ.. "రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా! రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా!" జీవులను రక్షించేవాడు, ధర్మాన్ని నాలుగుపాదాలా నడిపించే వాడు, తన ధర్మమును, తన వారినీ కాపాడుకునే వాడూ ఆ రామచంద్రుడు. అని చెప్పలేదూ! అతను ఆడిస్తే ఆడే బొమ్మలం. నిరాశనీ, నిస్పృహనీ పక్కన పెట్టి చూడు. ఈ ప్రభాత వేళ కృష్ణుని మందిరం బయట నిలబడి అతని గుణసంపదను పాడే అదృష్టం రమ్మంటే వస్తుందా? రేపు మళ్ళీ వద్దాం. సముద్రాన్ని చేది పోయడమెంతో, ఆ పురుషోత్తముని గుణగానం చెయ్యడమూ అంతే! ఎన్ని పేర్ల పిలిచినా, ఎంత పొగిడినా తరిగేది కాదు." తన తీయని పలుకులతో సఖులకు ఊపిరూదింది ఆనందిని. వెనక్కి తిరిగి చూస్తూ, ఇంటిదారి పట్టారందరూ..


* రేపేం జరుగుతుందో.. ఎదురు చూద్దాం!


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)5 comments:

 1. "తెలి వెన్నెల తెరలు కట్టిన నింగి పల్లకీ ఎక్కి ఊరేగుతున్న జాబిలి"

  అద్భుతం! విజయా వారి చందమామ కనిపించేశాడు మీ మాటల్లో...

  ~లలిత

  ReplyDelete
 2. పంచతల్పం అంటే గిల్పమా ? ....... దహా

  ReplyDelete
 3. @ లలిత: ధన్యవాదాలండీ! విజయా వారి చందమామ పూర్ణ చంద్రుడు కదండీ! ఇంకో నాలుగైదు రోజులాగాలి. :)

  @ బులుసు సుబ్రఃమణ్యం: సర్! పంచతల్పం కానిది గిల్పమేమో! ద.హా.! మీరూ, లలిత గారూ కూడా మాయాబజార్ ని గుర్తు చేసారు. ఈ రోజు వీలు కుదుర్చుకుని ఓ సారి చూడాల్సిందే! ధన్యవాదాలు.

  ReplyDelete
 4. చుక్కానిలా రెపరెపలాడింది చకచకా నడుస్తున్న ఆనందిని పైట కొంగు.
  .............ఒక్క వాక్యాన్ని మాత్రమే ప్రస్తావిస్తే మిగిలినవి నన్ను చూసి నవ్వుతాయని తెలుసు... అయినప్పటికీ.........

  ReplyDelete
 5. లలిత గారు, మురళి గారు చెప్పేశారు నాకు బాగా నచ్చిన వాక్యాలు.. :-(( అవునులెండి ఇంత లేట్ గా చదివితే అంతే!

  ReplyDelete