Tuesday, January 3, 2012

మేలుకో ఓ సిరీ! శాతోదరీ! ~ కాత్యాయనీ వ్రతం - 20

సురభిళ సుమవల్లరులతో, నికుంజాలతో, బంగారు ఊయలలతో, స్పటికంలా మెరిసే నీటితో నిండిన తటాకాలతో ప్రకాశిస్తున్న పుష్పవనం దాటి నీల మందిరం చేరుకున్నారు గోపభామినులు. "ఏ క్షణమైనా తటాలున తలుపులు తెరచుకుని కృష్ణుడు వచ్చేస్తాడేమో!" అనే ఆశ వారి బేలకళ్ళలో నిండి ఉంది.

"శ్రీ కృష్ణా! ముల్లోకాలకూ దిక్కు నువ్వే! సకల చరాచర సృష్టికీ నాథుడవు నువ్వే! నీ చాలుబడి ఇంతా అంతానా? నీ పరాక్రమానికి పోలికే లేదు. అయితే మాకో అనుమానం! నీకు దేవతలే తప్ప సామాన్యులు కనబడరా? వారికి ఆపద వస్తే తక్షణం రక్షిస్తావు. నీ సుదర్శన చక్రాన్ని ఉపయోగించి దేవేంద్రునికి సింహాసనాన్ని గెలిచి ఇచ్చావు. "ఆకాశం పడిపోనీ, భూమి బ్రద్దలు కానీ, సముద్రము శుష్కించిపోనీ, హిమవత్పర్వతం ముక్కలైపోనీ.. నా మాట కల్ల కాదు." అని ఆశ్రితులకు అభయమిచ్చినవాడివి. ఋజువర్తనము మాకు నేర్పేవాడివి. మా కోసం నువ్వేమీ పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. నీ చిరునగవు మా ఈ కనులతో కరువుతీరా చూడనీ! అన్ని ప్రాణుల విషయంలోనూ సమదృష్టి కలిగి ఉంటానని చెప్పావు. అలాంటిది మమ్మల్ని నువ్వే చిన్న చూపు చూస్తావా? మేలుకో! బయటకు వచ్చి మా మొరాలకించు!"

మేలుకో శ్రీ కృష్ణ! మేలుకొనవేమీ!
చాలుబడి గల దేవ! మేలొసగు స్వామీ!

మున్నేగి ముప్పదియు మూడు కోటుల సురల
బన్నముల బాపు బలశాలీ! వనమాలీ!
వెన్ను దవిలి విరోధివితతికి వనటగూర్చి
చెన్ను తొలగించు ఆపన్నజనతావనా!

సమాధానం లేదు. ఉసూరని ఒకరినొకరు చూసుకున్నారు.
"నిన్న నీలను మనం నిష్టూరమాడిన మాటలు విని కన్నయ్య కోపం తెచ్చుకుని ఉంటాడా?" ఉన్నట్టుండి ప్రశ్నించింది సురభి. "ఏమో! అయి ఉంటుందా!" అని కలవరపడ్డారందరూ! పరుషవాక్యమేదైనా ధ్వనించిందేమో అని గుర్తు చేసుకున్నారు. "ఏమో! నోరుజారి ఏమైనా అనకూడదని మాట అన్నామేమో! నీలను విస్మరించి కృష్ణుని నేరుగా నిద్ర లేపామని ఆమెకు కోపమొచ్చి స్వామిని ఆపిందేమో!" అని భయపడ్డారు. ఆమెను ప్రసన్నం చేసుకోవాలని తలచి పిలువసాగారు.

"ఓ నీలా! అసితేక్షణా! నిద్ర లే! స్త్రీ హృదయం స్త్రీ కే తెలుస్తుందంటారు. లిప్తకాలం కృష్ణుని ఎడబాటు భరించలేని దానివి. మా విరహాన్ని నీకు వివరించి చెప్పాలా? మా పై జాలి కలగడం లేదూ! లోకాలేలే రేడుని కనుసన్నలలో మెలిగేలా చేసుకున్న దానివి. నీ ఆనతి లేనిదే మాకు ఒనరేదేమైనా ఉందా? ఒక్క సారి బయటకు రా! నీ సౌందర్యానికి కృష్ణుడే దాసుడయ్యాడు కదా! మా కన్నులతో ఒక్క సారి నీ హొయలు చూడనీ!" తేనెలొలికే పలుకులతో పిలుస్తున్న వారిపై కాస్త దయకలిగిందేమో నీలకి! చందువా తెరలు తొలగించి శయ్య దిగి, పసిడి మువ్వలు ఘల్లుమనేలా పదపల్లవాన్ని నేల మోపింది. ఆ సవ్వడికే పరమానందభరితులై గోప వనితలు ఇనుమడించిన ఉత్సాహంతో నీలను పిలువనారంభించారు!

"ఓ నీలా! కృష్ణుని ఇల్లాలా! నీ ఎరనెర్రని చిగురు పెదవి ఎంత కోమలంగా తేనెలురుతూ ఉండనిదే కృష్ణుడు నీ కొంగు విడవకుండా ఉంటాడు చెప్పు! నీ కలికితనం మా కన్నులతో చూడనీ! నిండైన చనుకట్టు కలదానివి. సింహ మధ్యమవి! నీ నలక నడుము అందం ఈ పూల తోటలో ఏ మంజరికీ అబ్బి ఉండదు! నీ సౌందర్యానికి పరిపూర్ణత కృష్ణ సంశ్లేషమే కదూ! అందమైన మాటకు అర్ధంలా, దివ్వెకు వెలుగులా, కుసుమానికి పరిమళంలా ఒకరినొకరు సంపూర్ణులను చేసుకోగలిగే వారే లక్ష్మీ నారాయణులు! యదుకుల మంగళ దీపం శ్రీకృష్ణుడు! ఆతని వెలుగువు నువ్వు! గోపకుల మంగళదీప రేఖా! మేలుకో! కురంగ నయనా! నీ కనులు విచ్చి మమ్మల్ని చూడు!"

పున్నమి జాబిల్లి లాంటి మోము కలదీ, తమ్మిరేకుల కన్నులదీ, అణువణువునా చక్కదనం ఒలికే చిన్నదీ.. కనులు తెరవగానే కృష్ణుని చూసే భాగ్యం దక్కిన ఐశ్వర్యవంతురాలు నీల నిదుర లేచింది. శింజినులు మ్రోగాయి. గాజులు గలగలమన్నాయి. 'నీలాతుంగ స్థనగిరి తటీ సుప్తుడైన' శ్రీకృష్ణుని నెమ్మదిగా తలగడపైకి చేర్చి, ఆపాదమస్తకమూ ఆతని మరొక్క మారు చూసుకుని శయ్య దిగి తలుపు తీసేందుకు కదలబోయింది.

మేలుకో ఓ సిరీ! శాతోదరీ!
మేలుకో ఓ నీల! పరిపూర్ణురాలా!
మేలుకో నవకిసలయాధరా!
కలశోపమపయోధరా!

బంగరు తలుపులు తెరచుకున్నాయి. పసిడి బొమ్మలా, పాలకడలి కన్న ముద్దుగుమ్మలా.. చిరునగవుతో, సిరి కనుల ముందు నిలబడితే ఇంక కావలసిందేముంది!
"సకియలూ! కుశలమేనా?" మధుస్వనానికి ఈ మధురిమ ఎక్కడిదీ? అందుకే ఈ నీల ఇంటితోటలో చేరి నేరుద్దామని వృధాప్రయాస చేస్తోందేమో!
"తూరుపు తెలవారక ముందే వచ్చి ముంగిట నిలచారు. ఏం కావాలో చెప్పేరు కాదు!"
అప్పుడే నిద్ర లేచినట్టు మాటలకు వెతుక్కున్నారు గోపకాంతలు. ఒకరివైపొకరు చూసుకుని "నువ్వంటే నువ్వని" గుసగుసలాడారు.
"నీలా! ఓ రాజాననా! నిన్ను చూస్తే చాలనిపిస్తోంది. కానీ నీ మేనిపరిమళానికి తోడై ఉన్న ఆ వనమాలా సౌరభం మాకు కర్తవ్యబోధ చేస్తోంది. మాకు కావలసినవి రెండు వస్తువులు. విసనకర్ర, అద్దము." చెప్పారు గోపబాలలు.

నీల నవ్వింది. లేలేత గులాబి రేకు అరవిచ్చినట్టు నవ్వింది. మువ్వ దొరలినట్టు నవ్వింది.
" చెలులూ! తప్పకుండా ఇస్తాను. ఇంత చలిలో ఇంత దూరం వచ్చినది ఆలవట్టమూ, అద్దమూ అడగడానికా! ఆశ్చర్యం!!" పాలుగారు నునుచెక్కిట ఎరనెర్రని చేయి చేర్చి వింతగా కనులార్పుతూ అడిగింది.

"నీకు ఈనాటి దాకా ఎప్పుడూ అనుభవంలోకి రానిదొకటి మాకు తెలుసు! అదే విరహం! గ్రీష్మంలో తపనుని కిరణాల గాడ్పు సోకినట్టుంది మాకు! నిదుర రాదు. మనసు కుదురు లేదు. యమునలో స్నానం తప్ప వేరే దారి కానరావడం లేదు. నీకు తెలిసే ఉంటుంది. మేము కాత్యాయనీ వ్రతం చేస్తున్నాం. నెలకు ముమ్మారు శ్రేష్ఠమైన వానలు పడాలని కోరుతూ నోము నోచాం. తెలవారక ముందు యమునలో స్నానమాచరిస్తున్నాం. కానీ ఆ మంచు కంటే చల్లని యమున నీళ్ళు సైతం మా విరహ తాపాన్ని చల్లార్చలేకపోతున్నాయి. స్నానం చేసి ఒడ్డుకు చేరే లోపు మళ్ళీ చెమటలు! తాపం!! అందుకని మాకొక విసనకర్ర కావాలి." చెప్పింది సురభి.
"అవునా! ఎంత బాధ పడుతున్నారు! అయ్యో! తప్పకుండా ఇస్తాను. మీ తాపాన్ని చల్లార్చే మార్గం ఉందంటే నా వంతు సహాయం తప్పకుండా చేస్తాను. ఇంతకీ అద్దం దేనికి?"
"నీలా! అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటే మాకు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు! మాతో సర్వకాల సర్వావస్థలయందూ ఉన్నాడని ధీమా కలుగుతుంది. అందుకని మాకు అద్దం కావాలి."
"అయ్యో! వెర్రి అమ్మాయిలూ! ఎంత బాధపడుతున్నారు! మీకెంత ప్రేమ! ఇంతమంది హృదయారవిందాలలో కొలువున్న కృష్ణుడెంత భాగ్యశాలో అనిపిస్తోంది! తప్పకుండా అద్దం కూడా ఇస్తాను. ఇంకా ఏమైనా ఇవ్వగలదానినా? మొహమాటపడకుండా అడగండి. మీలో ఒకతెనని తలచి అడగండి." చెరగని స్వఛ్చమైన నవ్వుతో అడిగింది నీల.

ఒకరి ముఖాలొకరు చూస్కున్నారు. ఒక నిర్ణయానికి వచ్చి అడిగేసారు.
"ఓ నీలా! మాతో కృష్ణుడిని స్నానానికి పంపు."
"కృష్ణుడినా!"
"అవును! మావి లౌకికమైన కోరికలని తలచకు! తప్పు పట్టుకోకు! "హరిసరసి విగాహ్యాపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్నః ఖేదమద్యత్యజామి!" "హరి" అనే సరస్సులో స్నానమే ఈ సంసార తాపాన్ని తగ్గించగలిగినది. ఈ బాధకు విరుగుడు హరి సామీప్యమే! కృష్ణుని చెంత ఉండడమే! ఆ కృష్ణునితో కలిసి స్నానం చేస్తే మా తాపం తగ్గుతుందని ఆశ!

ఆలవట్టము, అద్దమొసగి నీ స్వామిని
ఆలసింపక పంపవమ్మ నీరాడ!" చెప్పారా గొల్ల పిల్లలు.

"సరే! మీకు నేను ఇవ్వగలిగిన వస్తువులు ఇస్తాను. కృష్ణుని ఇవ్వగలిగేంతటి దాన్ని కాదు. ఒక కౌగిట బందీయై ఉండేవాడు కాదని మీకూ ఎరుకే కదా! నేనూ మీలాంటి దాన్నే. నిదురపోతున్న కృష్ణుని వెళ్ళి తట్టి లేపగలిగేదాన్ని కాను. మీతో కలిసి కమ్మని పాటలతో మేలుకొలుపు పాడే భాగ్యం నాకూ పంచండి. రేపు తెలవారకనే రండి. నేనూ మీతో కలిసి కృష్ణునికి సుప్రభాతం పలుకుతాను." చెప్పింది నీల.
"సరే! తెలవారక ముందే వస్తామని, ఆమెను బయటకు వచ్చి ఉండమని" వేయి సార్లు చెప్పి ఆనందంగా ఇళ్ళకు మరలారు అందరూ! సౌందర్యాధిదేవతలా అలరారుతున్న నీల చెంత లేనందుకైనా కృష్ణునికి తెలివి వస్తుందని వారి నమ్మకం!

*కృష్ణుడు నిదుర లేచేనా? వేచి చూద్దాం!


(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..).8 comments:

 1. ప్రశస్తమైన రామ ప్రసక్తి లేకపోయేటప్పటికి కొంచెం బెంగగా అనిపించింది కానీ ....బహు చక్కగా వుందండీ...

  అన్నీ బాగున్నప్పుడు -అదేంటో - ఒకసారి "బాగుంది" అని చెప్పాక మళ్ళీ మళ్ళీ అలా చెప్పాలా ... ఎందుకులెద్దూ అనిపించట్లేదు. నన్ను వ్యాఖ్య పెట్టనీకుండా వుండనీయట్లేదు - మీ ధనుర్మాసపు కథలు.

  అయినా రంధ్రాన్వేషణ చేసి తప్పులెంచే ముందు మొహమాట పడాలి గానీ మెప్పుదలకి కాదు కదా! అందుకే మీకు విసుగనిపిస్తుందేమో అని ఒక్కొక్కసారి అనిపించినా ఒక్కసారన్నా "బాగు...బాగు" అనందే నా రోజు పూర్తి అవట్లేదు సుమండీ...

  అందమైన తెలుగు మీది.

  ~లలిత

  ReplyDelete
 2. ఆకాశం పడిపోనీ, భూమి బ్రద్దలు కానీ, సముద్రము శుష్కించిపోనీ, హిమవత్పర్వతం ముక్కలైపోనీ.. నా మాట కల్ల కాదు." అని ఆశ్రితులకు అభయమిచ్చినవాడివి.

  "సకౄదేవ ప్రసన్నాయ" అన్న రామాయణ శ్లోకం రాముని గూర్చి అనిపించింది.....

  ReplyDelete
 3. @ Mohanavamshi:
  వ్యోః పతేత్. పృధివీ చూర్యేత్, హిమవాన్ శకలీభవేత్.
  తోయనిధిః శుష్యేత్..

  అని ఒక శ్లోకం ఉందండీ మహా భారతంలో. సరిగా గుర్తు లేదు. పాండవులతో కృష్ణుడు చెప్పిన శ్లోకమది.

  సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతిచ యాచతే
  అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ

  ఇది విభీషణ శరణాగతి సందర్భంలోది కదూ! రెండూ ఇంచుమించు ఒకటే మరి! ధన్యవాదాలండీ!

  @ లలిత: ఈ రోజు రాముడు వ్యాఖ్యల్లోకి వచ్చాడండీ! ధన్యవాదాలు. :)

  ReplyDelete
 4. బాగుంది.మధుస్వనానికి ....ఆలవట్టమూ.....ఈ రెండో మాట తెలుగా,సంస్కృతమా?

  ReplyDelete
 5. చాలా బాగుందండీ.. సినిమా కనిపించేస్తుంది నాకు చదువుతూ ఉంటే..

  ReplyDelete
 6. @ సునీత: మధుస్వనమంటే కోకిల. ఆలవట్టమంటే గుడ్డతో చేసిన గుండ్రటి విసనకర్ర. పాత సినిమాల్లో చూస్తాం కదా!అదన్నమాట. ఆలవట్టము సంస్కృతం నుండి వచ్చినదేనేమో! పదం పుట్టుక తెలియదండీ! కనుక్కోవాలి. ధన్యవాదాలు.

  @ రాజ్ కుమార్: హ్హహ్హహా.. సినిమాలా కనిపిస్తోందా? బ్లాక్ అండ్ వైటేనా? ధన్యవాదాలండీ!

  ReplyDelete
 7. ఎట్టకేలకి నీల నిదుర లేచింది.. తర్వాతి కథేమిటో మరి..

  ReplyDelete
 8. పూజారి వరం ఇవ్వటమైందన్నమాట

  ReplyDelete