Saturday, January 7, 2012

మరిమరి నీ మగటిమికీ మంగళమన వస్తిమి! ~ కాత్యాయనీ వ్రతం - 24

నీల మందిరపు తలుపు నెమ్మదిగా తెరచుకుంది. గోపికలు కోరినట్టే "గహ్వరము విడిచి బయటకు వచ్చే మృగరాజు వలే" నడుచుకుంటూ కృష్ణుడు వెలుపలకు వచ్చాడు. పరిమళ దీపాల వెలుగులో నల్లనయ్య మేనిరంగు వింత కాంతులు వెదజల్లుతోంది. రెప్ప వేయుట, ఊపిరి తీయుట మరచి చిత్తరువులై నిలబడిపోయారు గోపకాంతలు. వారిని దాటుకుని, వారి మాట ప్రకారం మణిఖచిత సింహాసనం పై పురుష సింహము ఆసీనుడయ్యాడు.

మునిజనానికి రాక్షస పీడ వదిలించేందుకు వెడలిన కోదండపాణిని, పసుపు గడపనానుకుని నిలబడి చూసిందట అరవిందలోచన 'సీతాకాంత'! ఆమె చూపులే హారాలై, హారతులై రాముని వెంట తోడున్నాయట! అలాగే ద్వారాన్ని ఆనుకుని నిలబడిన నీల, తన స్వామికి హారతి ఇచ్చింది.. తన చూపులతో, తన ప్రేమతో.. 'ఆద్వారమనువవ్రాజా మంగళాభిదక్షుసీ!'

గోపీజన మనోహరుడు ఆసీనుడయ్యాడు. చేష్టలుడిగి నిలబడిన గోపభామలను చూసాడు. చూపులతోనే కుశలమడిగాడు. ఆర్తిగా తనను తడుముతున్న వారి చూపులవానలో తడిసిపోయాడు. క్షణాలు గడుస్తున్నా ఉలకని పలకని గోపకాంతలను తానై పలకరించడం రాజోచితం కాదనుకున్నాడేమో! తనకు తానుగా వలచి వచ్చిన కాంత చులకన కదూ! విలాసంగా ఎడమ కాలు చాచుకున్నాడు. కుడికాలు పైకెత్తి ఎడమ కాలిపై వేసుకుని దర్పంగా కూర్చున్నాడు.

"సవ్యం పాదం ప్రసార్యా ఆశ్రిత దుహితహరం దక్షిణం కుంచయిత్వా.." అని పలికాయి ఆ గోపభామినుల లేపెదవులు. "అవును.. మీరు కోరినట్టే వచ్చానా..! మీరు కూర్చోమన్నట్టే కూర్చున్నానా..! ఇంకా..?" అన్నట్టు చూసాడు పుండరీకాక్షుడు. గోపికల చూపులు కృష్ణుని నీలాల కురులు సవరించి, కమలాల కనులు దాటి, పలువరుస వెన్నెలలు తాగి, సుందర బాహువులను తడిమి, విశాలంగా మగసిరి ఉట్టిపడుతున్న పీనవక్షస్థలంపై ఒక లిప్తకాలం తారట్లాడి, సన్నని దృఢమైన నడుము దాటి, పీతాంబరపు పసిమి గాంచి, అపరంజి కడియాలను ముద్దాడి, ఎరనెర్రని అరవిందాలవలే మెరుస్తున్న పాదాల వద్ద ఆగిపోయాయి. వాటి సౌందర్యం వర్ణించుట.. దేవాదిదేవతలు, మునిగణాలు, యోగిపుంగవులు, ధరణీపతులు, 'కవిత్వపటుత్వసంపదల్' కల్గిన కవిరాజులు.. ఎవరికి సాధ్యం? ఎవరి తరం? 'తన సౌందర్యగరిమ చూసి వలచి.. ఆ వెర్రి గొల్లలేమైపోతారో!' అని ఇసుమంతైనా జాలి లేని నిర్దయుడేమో కృష్ణస్వామి!

చూసారు.. తనివి తీరా చూద్దామనుకున్నారు.. తనివి తీరేదెప్పటికని!? ఉన్నట్టుండి ఆ అరుణిమ చూసి ఉలిక్కి పడ్డారు. 'కందిన ఆ పదరాజీవాలు ఎంత నొచ్చి ఉంటాయో!' అనే ఊహే అసిగాయమైంది వారి మనసుల్లో!

"కృష్ణా! గోపీజన నాథా! నీ చరణాంబుజముల వాలే షట్పదములు మా చూపులు! మా దృష్టే తగులుతోందయ్యా! చూడడమొక్కటేనా? ఎన్ని వెర్రి కోరికలు కోరాం నిన్ను! పొద్దైనా పొడవక ముందే నిద్రలేవమన్నాం. నీ కనుల ధావళ్యమే ఎరుగిన వాళ్ళం. ఈ కెంజాయ చూస్తే బాధగా ఉంది. నడిచి రమ్మన్నాం! మా మనవి విని వచ్చావు. చూడు.. నీ పాదాలు ఎంత కందిపోయాయో! అయ్యో! అయ్యో! ఏం చేయ్యడం!?"

"సురభీ.. వెన్నైనా లేదే!"
"కమలినీ.. పోనీ పువ్వులతో ఒత్తితే..!
"ఒద్దులే! మంచులో స్నానాలు చేసి ఉన్న కుసుమాలు బిరుసుగా ఉంటాయి. కన్నయ్యకి గుచ్చుకుంటాయి."

"ఎలా.. నీకు దిష్టి తగిలితే యశోద విలవిలలాడుతుంది! నందుడికి కోపమొస్తుంది! బలదేవుడికీ ఆగ్రహమొస్తుంది! నీల నొచ్చుకుంటుంది! ఎలా, కృష్ణా! నీకు దిష్టి తొలగించే మార్గమేమిటి?" ఇలా పలువిధాల మాట్లాడుకుంటున్న వారిని చూసి ఓ మందహాసం చిందించాడు కృష్ణుడు. ఆ నవ్వు చూసి ఇంకా మోహపరవశులైపోయారు వారందరూ!

"ఆనందినీ! కన్నయ్యకి తక్షణం దృష్టి దిగదుడవాలి. మార్గం చెప్పు!" ప్రశ్నించింది సురభి.
"నాకేం ఆలోచన రావట్లేదే! ఆ.. మంగళ హారతి పాడడమే!"
"అంతలేసి కళ్ళతో తేరిపార చూసేస్తున్నాం! వట్టి పాటలతో పోయే దిష్టా!"
"తప్పక పోతుంది. ఋజువులున్నాయి. విశ్వామిత్రుడు నిద్రపోతున్న రామచంద్రుని సౌందర్యానికి ముచ్చట పడి తన దృష్టే తగులుతుందేమో! అని మంగళవచనాలతో "కౌసల్యా సుప్రజా! రామా! లోకానికి మంగళమొనరించేవాడా! నీకు మంగళం!" అని పలికాడు."
"ఎంత రాచబిడ్డలకైనా అడవుల్లో ఉండే తాపసి అంతకన్నా ఎలా మంగళం పలుకుతాడు? ఉత్తుత్తి మాటలు కాదు ఆనందినీ! ఆలోచించు!" త్వరపెట్టారు అందరూ.
"చెలియలారా! నాకింకో విషయం గుర్తొచ్చింది."
"ఏమిటేమిటి?"
"తన గారాలపట్టి సీతను కన్యాదానం చేసేటపుడు జనక రాజర్షికీ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సీతాభామిని కరపల్లవాన్ని రాముని చేతిలో పెడుతూ.. ఒక్క లిప్త ఆ వరద హస్తపు ఎర్రదనాన్ని, సౌందర్యాన్నీ చూసి వివశుడయ్యాడట జనకుడు. "అయ్యో! రామభద్రునికి దృష్టి తగులుతుందేమో!" అని "ఇయం సీతా మమ సుతా సహధర్మచారిణీ తవ, ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా!" అని చెప్పాడట.
"ఇందులో వింతేముంది! నా కూతుర్ని పెళ్ళి చేసుకోవయ్యా!" అన్నాడు. రామయ్యకి దిష్టి తగిలే ఉంటుంది, పాపం!"
"భద్రం తే! అన్నాడు చూడు. నీకు భద్రమగు గాక! నీకు మంగళమగు గాక! అన్నాడన్నమాట!"
"అవునా! జనకుడు కూడా అన్నాడంటే.. మంగళవాక్యాలు సరిపోతాయేమో!" అని సరిపెట్టుకుని గోపాలచూడామణి వైపు చూసారు. వింత చూస్తూ వినోదిస్తున్నాడాయన!

మంగళమని పాడవస్తిమి.
మరిమరి నీ మగటిమికి మంగళమని!
ముంగిట నిలబడిన మా కొ
సంగుదువని పరవాద్యము

అల్లనాడు లోకమ్ముల
అలవోకగ కొలిచిన నీ
పల్లవారుణ శ్రీపద
పద్మమ్ములకు మంగళమని

పెల్లుగ నీవెత్తి వెడలి
సుందర లంకాద్వీపము
తల్లడబడ మాపిన నీ
దర్పమునకు మంగళం

కాలదన్ని ఒక త్రుటిలో
కరకు శకట దైత్యుని
నేలరాలు నటు జేసిన
నీ కీర్తికి మంగళమని

కూళను వత్సాసురు నవ
లీలగ చిరుకోల వలె
తూలవిసురు దుడుకు అడుగు
దోయికినీ మంగళం

దండిగ గోకులమునకై
దయదాలిచి గొడుగువోలె
కొండనెత్తి వేసిన నీ
గుణమునకూ మంగళమని

భండమున నొక వ్రేటున
పగతుర పీచమ్మడంచి
చెండాడిన నీ చేతి ప్ర
చండాసికి మంగళం

"కృష్ణా! మేము వచ్చినదైతే.. నువ్వు పరవాద్యమిస్తావనే! కానీ ఈ భువనమోహన రూపాన్ని చూసాక మాకు వేరే మాట రావడం లేదు. నిన్ను చూడాలని, చూస్తూనే ఉండిపోవాలనీ ఉంది. నరుని దృష్టి అతి శక్తివంతమైనదంటారు. నీ సద్గుణాలకూ, సౌందర్యానికీ మంగళహారతి ఈయనిదే మా మనసు ఊరుకోదు.

కృష్ణా! త్రివిక్రమా! మూడు అడుగులతో ముజ్జగాలనూ కొలిచావట! నీ పాద రజ మహిమ వల్లే భూమి రత్నగర్భ అయింది. పంటలు పండుతున్నాయి. పశు సంపద వృధ్ధి చెందుతోంది. ఆకాశం వర్షాన్ని కురుస్తోంది. బ్రహ్మ కడిగిన పాదానికి మంగళం! బ్రహ్మము తానైన పదపంకజానికి మంగళమగు గాక!

కొండకోనలు దాటి సీతమ్మ కోసం ఎంత కష్టపడ్డావో!సుందర లంకను ఏలే రావణుని, నేలకూల్చిన నీ శౌర్యానికి మంగళం!

కృష్ణా! నల్లనయ్యా! బంగారు తండ్రీ! బండి రిక్కలో పుట్టావని బండిని ముక్కలు చెయ్యాలా చెప్పు!? నెలల పసికందువి! బండిని తన్నావు! శకటాసురుని ముక్కలు ముక్కలు చేసావు!   నీ మువ్వల పాదమెంత నొచ్చి ఉంటుందో! ఆ అందమైన పాదాలకు మంగళం!

అంతే కాదు! ఆవుదూడ రూపంలో వచ్చిన వత్సాసురుని చిన్నకట్టెని విసిరినట్టు గిరగిర తిప్పి విసిరావు. ఆ విసిరినప్పుడు భూమిపై నీ పాదాలు ఎంత నొక్కిపెట్టి, చేతులతో బలంగా విసిరి ఉంటావు! నీ పాదాలూ, చేతులూ ఎంత నొచ్చి ఉంటాయో! ఎంత దుడుకు వాడివి! నీ దుందుడుకు అడుగులకు కనుదిష్టి తగలకుండు గాక!

గోవర్ధన గిరిని సునాయాసంగా ఎత్తి చిటికెన వేలిపై నిలిపావు. మా కోసమే! మా గోకులాన్ని రక్షించడం కోసమే!! అలా ఒకటా రెండా..! ఏడు రోజులు విలాసంగా కాలు అటుదిటు చేసి మరీ నిలబడ్డావే! ఎంత నొప్పి కలిగి ఉంటుంది నీకు! వ్యత్యస్థ పాదారవిందుడవైన గోవర్ధన గిరిధారీ! నీకు మంగళం!

శార్జ్ఞపాణీ! వైరి వర్గానికి నీ శార్జ్ఞమంటే సింహస్వప్నం! నీ చేతి కత్తి కలలోకి వచ్చినా నీ శత్రువులందరూ బెదిరిపోతారు! అలాంటి ప్రచండాసి చేత దాల్చిన నీకు మంగళం! శుభ మంగళం!"

తనను చూపులతో అభిషేకించి, పలుకులతో, పాటలతో మంగళారతి పలికి, "ఇంకా అక్కడే నిలిస్తే మళ్ళీ కన్నయ్యని చూసేస్తామేమో!" అని వెనుతిరిగి వెళ్ళిపోతున్న ఆ అమాయక గొల్లపడతులను చూస్తూ మోహనకృష్ణుడు నవ్వుకున్నాడు. అతని అల్లరికి అంతేముంది!* వెర్రి గొల్లెతలు రేపేం చేస్తారో! చూద్దాం!(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

6 comments:

 1. వ్యత్యస్థ పాదారవిందా....
  నిత్య వందితా ముకుందా...

  నారాయణ తీర్థుల వారి "కృష్ణలీలా" (కూచిపూడి) తరంగాలు గుర్తు వచ్చాయండీ...

  మొత్తానికి శ్రీ కృష్ణుల వారు కరుణించారు...

  ~లలిత

  ReplyDelete
 2. చదువుతున్నాను, అక్కడక్కడా అర్ధం కాకపోయినా సరే. తెలుగు నేర్చుకోడానికి ఆన్ లైన్ క్లాసులు చెప్పకూడదూ మీరు? నాలాంటి వాళ్ళకు ఉపయోగం.

  ReplyDelete
 3. బండి రిక్కలో పుట్టావని బండిని ముక్కలు చెయ్యాలా చెప్పు!?
  యెంత అందమైన ప్రశ్న!!

  ReplyDelete
 4. మన్నించండి! నా వ్యాఖ్యలో చిన్న తప్పు దొర్లింది...

  వ్యత్యస్థ పాదారవిందా....
  విశ్వ వందితా ముకుందా...

  అని వుండాలి. ఇది శ్రీ నారాయణ తీర్థుల వారి

  "బాల గోపాల కృష్ణా... పాహి పాహి...
  నీల మేఘ శరీరా...నిత్యానందం దేహి దేహి " అనే తరంగం లోని చరణం.

  ReplyDelete
 5. @ లలిత: నిత్య వందితుడైనా, విశ్వ వందితుడైనా అతనే కదా! పరవాలేదు లెండి. నాకూ ఆ తరంగమే గుర్తొచ్చిందండీ! ధన్యవాదాలు! :)

  @ Chandu S: భలేవారే! నేనూ నేర్చుకుంటున్నానండీ. నేర్పేంతటిదాన్ని కాదు! మీకు అర్ధం కానివి వ్యాఖ్యలో అడిగేయండి. నాకు తెలిస్తే సరేసరి, లేదా మీ వలన నేనూ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. :)ధన్యవాదాలండీ!

  @ మురళి: ప్రశ్నకు ప్రోద్బలమైన ఆ రిక్కదే గొప్పంతా! :) ధన్యవాదాలు!

  ReplyDelete
 6. హ్మ్.. ఆ కృష్ణ దర్శనం కల్గిన ఆనందం లో వచ్చిన కారణం మరిచి వెళ్లి పోయారన్నమాట ఈ గోపెమ్మలు..

  ReplyDelete