Monday, January 9, 2012

అల్లరి చాలించు, కన్నా! ~ కాత్యాయనీ వ్రతం - 26

"కృష్ణా!"
"ఊ.."
"కన్నా! వరాలమూటా!!"
"మా అమ్మ పిలిచినట్టు పిలిస్తే లొంగిపోతాననుకున్నారా?" అని మనసులో అనుకుంటూ ఓ చిరునవ్వు చిందించాడు.
"రేపు రండి. అని చెప్పి పంపించావు."
"ఊ.."
"వచ్చాము. మేము కోరిన వస్తువులిచ్చి పంపించవూ!"
"ఏం కావాలి మీకు?" వారి చూపులతో చూపులు కలిపి క్షణకాలం సూటిగా చూసాడు.
"నువ్వే! ఇంకేం కావాలి మాకు!" అని పలుకబోతున్న పెదవులను అతి ప్రయత్నం మీద అదుపు చేసుకున్నారు.
"నెలకు మూడు వానలు కురిసేనని పెద్దలు చెప్తే, అందరి హితం కొరకూ వ్రతం చేస్తున్నాం. "కావలసినవన్నీ కన్నయ్యనడిగి తీసుకోండి" అని మీ అయ్య నందయ్య మాతో చెప్పగా విన్నావు కదా! ఏమీ తెలియని వాడిలా ఈ పరీక్షలేమిటి కన్నా!?"
"అరెరే! భలే వారే! మీకేం కావాలో మీరు చెప్పకుండా నాకెలా తెలిసేను! ఇప్పుడు చెప్పండి. ఏమేం కావాలి. సంశయం లేకుండా అడగండి. ఏం కావాలి?" మాయ కన్నయ్య మాటలెంత మధురంగా ఉంటాయో!
గోపకాంతలు ఒకరితో ఒకరు 'ఏమేం కావాలో!' అని గుసగుసలాడుకున్నారు. మళ్ళీ కృష్ణుని మనసు మారకుండా అడగాలని నిశ్చయించుకుని చెప్పడం మొదలు పెట్టారు.

"కృష్ణా! వరదాయీ! మాకో శంఖం కావాలి."
"ఊ.. సరే.. శంఖము..." ఒక వేలు ముడిచి లెక్కపెట్టాడు.
"ఆగాగు! శంఖం అంటే అలాంటిలాంటి శంఖం కాదు. పాల వలే తెల్లనిది.. భూమి దద్దరిల్లేలా శబ్దం కలుగ చేసేది, నీ పాంచజన్యాన్ని పోలిన శంఖములు కావాలి."
"ఓహో.. అవునా! ఊ.. ఇంకా?"
"మహా శక్తివంతమైన శబ్దం చేసే పర వాద్యం కావాలి."
"అలాగే! శంఖములూ, పర వాద్యం .." రెండు వేళ్ళు ముడిచాడు.
"ఇంకా మాకు వ్రతం చేసేందుకు మంగళ మణి దీపికలు కావాలయ్యా!"
"ఓహో దీపాలు, మణిదీపాలూ.."
"నీ పేరు మరిమరి తలిచి, నీకు మంగళము పలికే పాటగాళ్ళు కావాలి."
"ఓహో.. ఊ..!"
"మేము వ్రతం చేపట్టిన వారమని ప్రజలకు తెలియాలంటే మాకో జెండా ఉండాలి కదా! ఒక గరుడ ధ్వజం కావాలి."
"హ్మ్.. ఐదు.."
"ఇంకొక్కటి.. బంగారపు జలతారు చందువా, పసిడి పళ్ళెరాలు కూడా కావాలి."
"సరే! వితానమూ.. పళ్ళెరాలూ..." లెక్క చెప్పాడాయన.
"అవును. ఈ వస్తువులన్నీ కావాలి."

అవధరింతువా అనుగ్రహింతువా!
ఆశ్రిత జన వత్సలా! నీవవధరింతువా?
మార్గశిర స్నానమునకు మా నోమునకు
మాకు వలయు వానిని మహేంద్రమణి ప్రభామూర్తి!

క్ష్మా మండల మదిరిపడగ శబ్దించేవీ,
పాలవన్నె నొప్పారెడు పాంచజన్యమట్టివీ,
శంఖములూ, ప్రబల బహుళ
పటాహములూ పరవాద్యములనుగ్రహింతువా!

మంగళ మణిదీపికల,
భృంగారపు చందువాల,
బంగారపు పళ్ళెరాల,
రంగురంగు ధ్వజపటాల,
పొంగుచు మంగళాశాస
నము పాడే గాయకుల
అవధరింతువా! అనుగ్రహింతువా!

ఓ వటపత్ర శాయీ! వరదాయీ! వరదాయీ!

గోపికల కోరికలను విని నవ్వాడు గోవిందుడు. నవ్వి ఇలా చెప్పాడు. "ప్రియభామినులూ! నిన్న వచ్చి ఒక వస్తువడిగారు. ఈ రోజు ఇంకొన్ని వస్తువులు చేర్చి అడుగుతున్నారు. మీకేం కావాలో పది సార్లు కాకుండా ఒకే సారి అన్నీ చెప్పాలి. ఈ రోజు అడిగినవి ఇచ్చి పంపేస్తే, రేపు ఇంకో అవసరమొస్తే పాపం ఇంత దూరమొచ్చి మళ్ళీ అడగాలంటే..  పూవులకంటే సుకుమారులు.. కందిపోతారు! కనుక మీకేమేం కావాలో అన్నీ ఆలోచించుకుని రేపు అడగండి."

"నిజమే! ఏమేం కావాలో ఆలోచించుకుని వస్తాం." అని ఇళ్ళకు బయలుదేరారు గొల్లెతలు. ఆలోచన చేసేందుకు మధ్యాహ్నం యమున ఒడ్డున సమావేశమవుదామని నిర్ణయించుకున్నారు.

యమున ఒడ్డుకి ఒక్కొక్కరే వచ్చిన గోపీబృందం, తాము వచ్చిన పని మరచిపోయి కబుర్లలో పడ్డారు. కృష్ణుని మరి మరీ తలుచుకు పెరిగిన తాపాన్ని తగ్గించుకునేందుకు వారికి స్నానం చెయ్యాలనిపించింది. చుట్టూ చూసారు. ప్రశాంత సైకత వేదికలను ముద్దాడే యమున కెరటాల హోరు తప్ప వేరే శబ్దమేమీ వినబడలేదు. ఒక్కొకరూ ఒక్కో వలువా విప్పి ఓ పొదరింట విడిచారు. నీట మునిగి జలకాలు ప్రారంభించారు. జల్లు పోరాటాలతో జలక్రీడలాడుతూ, కిలకిలా నవ్వుతూ, కేరింతలు కొడుతున్న ఆ లావణ్యరాశులను దూరం నుండే చూసాడు కృష్ణుడు! తన నేస్తాలను అడవిలో ఉండమని పలికి, నెమ్మదిగా తానొక్కడే పిల్లి వలే నక్కి నక్కి ఆ చీరలన్నీ ఓ వల్లెవాటులో మూట కట్టాడు. నెమ్మదిగా పక్కనే ఉన్న ఎత్తైన కడిమినెక్కి ఆ చీరలమూట ఓ కొమ్మపై పెట్టి కూర్చున్నాడు. వినోదంగా గోపభామినులను చూడనారంభించాడు.

జలకాలాడుతున్న ఆడు ఏనుగులవలే నీరంతా చిమ్మి, కేరింతలు కొడుతున్న వారిని చూస్తూ మోహన మురళి మ్రోగించసాగాడు. తమ నవ్వుల ధ్వనిలో కలిసి వినిపిస్తున్న మురళీరవళికి ఒక్క మాటు ఉలిక్కిపడ్డారందరూ! చుట్టూ చూసారు. సమ్మోహనంగా వినిపిస్తున్న ఆ సంగీతమెక్కడినుంచని వెతికారు. అల్లంత దూరాన కడిమి చెట్టెక్కి చిటారు కొమ్మన కూర్చున్న అల్లరి కన్నయ్య కనిపించాడు. సిగ్గుతో ఎర్రబడ్డ కలువల్లా ఉన్న వారి ముఖాలను చూస్తూ నవ్వు రువ్వాడు యదునందనుడు.

"ఓ.. కన్నయ్యా! ఇక్కడేం చేస్తున్నావ్? ఆడపిల్లలు స్నానం చేస్తూంటే రావచ్చునా?" కమలిని ఎలుగెత్తి అడిగింది.
"యమున మీ పెరటి కొలనేం కాదే! ఇటుగా వచ్చాను. మీరూ ఇక్కడే ఉన్నారు."
"సరే లే! వస్తే వచ్చావు కానీ, ఆ ముద్దుల మురళి మ్రోగించడం మాని వెళ్ళిపో!"
"భలే వారే! "ఊదుమా నీదు మురళి ఒక్క మారు బాలకృష్ణా!" అని కోకిలగానంతో బతిమాలినది నువ్వేకదూ!"
"తీయతేనియ బరువు మోయలేదీ బ్రతుకు, మ్రోగించకోయ్ మురళి మ్రోగించకోయ్ కృష్ణా!"
"మీ ఇష్టమేనా అన్నీ?" పెంకెగా పెదాలు బిగించాడు మోహనవంశీధరుడు.
తరుణులందరూ గుసగుసలాడుకున్నారు. దారేమిటని ఆలోచించారు. అర్ధించాలని నిశ్చయించుకుని పలుకసాగారు.

"కృష్ణా! కన్నయ్యా! నీ అల్లరి మాకూ ముద్దే! కానీ చలిలో బిగుసుకుపోతున్నాం. తాపం తీర్చుకునేందుకు యమునలో దిగి చాలా సేపు జలకాలాడామేమో! చలిగా ఉంది. నువ్వు అటు వెళ్తే మేము బయటకు వచ్చి చీరలు కట్టుకుంటాం" అభ్యర్ధనగా, మంచిగా పలికారు.
"పాపం! చలిగా ఉందా! సరే! ఏవీ.. ఈ బట్టలేనా కట్టుకుంటారు? ఈ మావిడి చిగురు వల్లెవాటు సురభిది, ఈ సంపెంగ రంగు పావడా కమలినిదేనా? ఈ నారింజ చీర ఎవరిదబ్బా? ఆ.. తరళది!" మురళితో చీరలను కదుపుతూ అల్లరిగా అడిగాడు.
"హమ్మయ్యో!!! చూసుకోనేలేదు. చీరలెత్తుకెళ్ళావా?! దొంగా! అల్లరి పిల్లాడా!! ఇదేమైనా బాగుందా? ఈ కృష్ణుడి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది.  మీ అమ్మతో చెప్పామంటే చెప్పమూ మరి!" కోపంతో మరింత ఎర్రబారాయి వారి ముఖాలు.
"చెప్పండి చెప్పండి. తప్పక చెప్పండి. మీరు బయటకు వచ్చి ఈ చీరలు తీసుకుని సింగారించుకుని, చరచరా నడిచి నేరుగా మా అమ్మ దగ్గరికే వెళ్ళి చెప్పండి."
"చెప్పక ఊరుకుంటామనుకున్నావేమో! చెప్పి తీరుతాం." ఉక్రోషంతో ముక్కుపుటాలెగరేస్తూ బుసలు కొట్టారు గోపవనితలు.
"సరే సరే! రండి.. వచ్చి చీరలు తీసుకోండి."

క్షణాలు గడుస్తున్నాయి. గాలులు చల్లబడడం మొదలయ్యింది. గజగజా వణకసాగారు. ఇంక బతిమాలుకోక తప్పదని అర్ధమయింది గోపికలకి.
"కృష్ణా! కన్నయ్యా! మేము యశోదతో చెప్పనే చెప్పం కదా! మంచి వాడివి. బంగారు తండ్రివి! నీలాల రాశివి! మా చీరలివ్వవా? చలి..!! ఈ చలికి మేము బిగుసుకుపోతే నీదే పూచీ!"
"ఆహా.. నాదే పూచీ. మిమ్మల్ని చూస్తూంటే నాకే చలేస్తోంది. పాపం! త్వరగా బయటకు రండి. చేపపిల్లల్లా ఎంత సేఫు ఆ నీళ్ళలో!?" అమాయకంగా పిలిచాడు.
"ఎలా వస్తాం? నువ్వేమో అలా కన్నార్పకుండా చూసేస్తూ ఉంటే ఎలా?" సిగ్గుగా అడిగారు.
"ఈ ఎరుపు మీ లేత బుగ్గల సిగ్గుదా? సంజె వెలుగులదా? చీకటి పడుతుంది ఇంకో గడియలో! జాగు చేయక రండి భామలూ! నాకు బోలెడు పనులున్నాయి. మీ చీరలకు కావలి కాయడమేనా నా పని!?"
"ఎలా వస్తాం? నగ్నంగా ఉన్నామిక్కడ!" లజ్జతో తలలు వంచుకుని నెమ్మదిగా చెప్పారు.
"అయితే ఏం? వచ్చి తీసుకుంటే మీకే మంచిది. బాబోయ్! చలి చలి!" వణుకు అభినయిస్తూ నవ్వాడు.
"కన్నయ్యా! ఎలా రమ్మంటావు?"
"నడిచి రండి. నేనేమైనా పరాయి వాడినా?"
"అయ్యో! కాదు కాదు! కానీ.."
"కానీ...?"
"సిగ్గు..పట్టపగలు.."
"ఏం పరవాలేదు. బయటకు రండి. నాకు తెలియనిదేముంది? 'సర్వ వ్యాపీ, సర్వాత్మా!' అని పిలిచారుగా?"
"నిజమే కృష్ణా! కానీ.. నవయవ్వనంతో మిసమిసలాడుతూ, మోహాన్ని కలిగించే పురుషోత్తముడివి! మోహనాకారుడివి! నీ ఎదుటకు దిసెమొలతో రమ్మనడం భావ్యమా?"
"మీరూ చక్కని వారేగా! రండి! వచ్చి చీరలు తీసుకోండి."

పలుకలేక మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. తప్పేదేముందని ఎట్టకేలకు వారందరూ ధైర్యం తెచ్చుకుని సిగ్గుని పక్కకు నెట్టి, జలమధ్యం నుంచి వెలువడి, కంకణ కాంతులతో మెరుస్తున్న కరకమలాలతో ఊరువుల మధ్యభాగాన్ని కప్పుకుని ముడుచుకున్న తామరమొగ్గలవలే చలిగాలికి వణుకుతూ, ప్రౌఢలగు కామినులను ముందు నిలబడమని, మిగిలిన వారు వారి వెనుక దాగి ఒడ్డుకు వచ్చారు. సిగ్గుతో ఎర్రనైన చెక్కిళ్ళతో, లలిత దరహాసాలను దాచలేక తలలు వంచుకుని నిలబడ్డారు.

"మంచి పిల్లలు!"
"ఆ చీరలిలా విసురు, కన్నా!" అతికష్టం మీద అడిగారు.
"నాకు చేతులెత్తి మొక్కితే ఇస్తాను."
కంపించిపోయారు గోపభామలు! బేలగా చూసారు కృష్ణుడి వైపు! వేడుకున్నారిలా..

మామా వలువలు ముట్టకు, మామా కొనిపోకు మన్నింపు తగన్
మామాన మేలకొనియెదు, మామానపహరణ మేల మానుము కృష్ణా!

"నువ్వింతటి వాడివి. మాకు దిక్కు నువ్వే!"అని  వట్టి మాటలేనా..? ఊ.. నమస్కరించండి!" గద్దించాడు.
అవనత శిరస్సులతో గుండెలకు అడ్డుపెట్టుకున్న చేతిని పైకెత్తి నమస్కారం చేసారు.
"ఒక్క చేత్తో నమస్కరించిన వాని చేతిని ఖండించమంది శాస్త్రం!"ఖణేల్మంది కృష్ణుని గొంతు.
రాబోతున్న కన్నీళ్ళను ఆపుకుని, కదలక మెదలక నిలబడ్డ వారిని చూసి, జాలి అంకురించిందాతని హృదయంలో!

"ముద్దు గుమ్మలూ! మీ మనసులనూ, మరియాదనూ కించపరచాలన్నది నా అభిమతము కానే కాదు. వ్రత నియమాలను ఉల్లంఘించి నగ్నంగా స్నానమాచరించుట తగునా? ఊరిప్రజల శ్రేయస్సు కోరి, నన్నే మనసులో నింపుకుని కఠోర నియమాలతో మీరు చేస్తున్న వ్రతానికి ముప్పు వాటిల్లబోతోందని తెలిసే ఈ పని చేసాను. మీరీ వ్రతం చక్కగా ఫలించాలని సంకల్పించుకుని చేతులెత్తి నాకు నమస్కారం చెయ్యండి. మీ వ్రతభంగం నాకు మాత్రమూ భరింపతగినదా? నాకు మాత్రం మీ సాన్నిధ్యం వద్దూ!" లాలనగా పలికాడు.
కృష్ణుని ప్రేమకు కరిగి నీరైనాయి గోపికల మనసులు. "తప్పు తెలుసుకుని, మన్నించమని, 'నేను' అనే అహం వదిలి" ఆ పురుషోత్తమునికి రెండు చేతులూ ఎత్తి, కంకణాలు గలగలమని సవ్వడి చేసేలా భక్తిగా, ప్రేమగా చేతులు ముకుళించి నమస్కారం చేసారు. మౌనంగా చీరలు అందుకుని ధరించి, కృష్ణుని మనోహర రూపాన్ని పెంపెక్కిన అనురాగంతో కనురెప్పపాటైనా లేకుండా చూడసాగారు.
"రతనాల కొమ్మలూ, మీ మనోగతాభిలాష ఎరుగని వాడిని కాను. నన్ను అర్చిస్తే మోక్షమే దక్కినప్పుడు మిగిలిన కోరికలదేముంది! కాత్యాయనీ వ్రతం సాంగోపాంగంగా సంపూర్తి చేసుకుని, అవశ్యం నా సాంగత్యాన్ని పొందగలరు." అని మధురంగా పలికి వారిని ఇళ్ళకు పంపివేసాడు గోపీవల్లభుడు.

మనసు నొప్పించినా, కపటకృత్యాలతో అల్లరి చేసినా, పరిహసించినా, ప్రాణప్రియుని చేతలు కామినులను కించపరుచవు కదా!


* రేపు ఏమవుతుందో! చూద్దాం!



(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

12 comments:

  1. ఆహా! నేననుకున్నది మీకు తెలిసిపోయిందో, మీరు వ్రాయబోయేది నేను తలచుకున్నానో. - నిన్నటి మీ తిరుప్పావై కథ చదువుతుంటే నా పెదవుల మీద పలికిన పాట ఏంటో తెలుసా?

    "వంగ పండు చీర...
    భామది వందనాల రైక
    కన్నెలు జలక్రీడ
    కృష్ణుని చిన్నెలు వినరమ్మా...
    చెన్న రంగ వాసా
    పన్నగ శయన రంగధామా...
    కన్నెలు జలక్రీడ
    కృష్ణుని చిన్నెలు వినరమ్మా..."

    అనే కృష్ణుని జలక్రీడల పాట.

    ఇవాళ ఆ కథే మీరు వ్రాయగా చూసి బో...ల్డంత ఆనందం గా అనిపించింది.

    ~లలిత

    ReplyDelete
  2. @ లలిత: ఆహా.. ఎంత చక్కని పాట!! నాకు ఈ పాట ఇదివరకు తెలియదు సుమండీ! భలే! పూర్తి పాట వ్రాయగలరా? పంచుకున్నందుకు ధన్యవాదాలు! :)

    ReplyDelete
  3. సుస్మితా! వీలు చూసుకుని - తప్పకుండా "కృష్ణుని జలక్రీడలు" వ్రాసి పంపుతాను.

    (మీకు తెలుసా ...మీ ఈ పోస్ట్ ఇంకా కూడలి లో కనిపించట్లేదు ...నేనూ..నా అత్రమూ - తొందర తొందరగా చదివేసి ఈ రోజుకి నా "వ్యాఖ్యా వ్రతం" పూర్తి చేసేద్దామనే!!!! :)) )

    ~లలిత

    ReplyDelete
  4. యమునలో నుంచే చేతులెత్తి నమస్కరించే దృశ్యాన్ని చాలా పెయింటింగ్స్ లో చూశానండీ..

    ReplyDelete
  5. @ మురళి:

    అంభోమధ్యముననుండి వెల్వడి వెసం బూర్ణేందుబింబాననల్
    చీరలు వచ్చి పుచ్చుకొనుడా మీకిచ్చెదంజెచ్చెరన్

    పోతన భాగవత ప్రకారమయితే నీటి నుండి బయటకు వస్తేనే చీరలు ఇస్తానన్నాడండీ కృష్ణుడు.

    "ఎట్టకేలకు చిత్తంబులు గట్టిపఱచుకొని తనుమధ్యలు తోయమధ్యంబు వెలువడి.." వచ్చారు కూడా! :) ధన్యవాదాలు!

    ReplyDelete
  6. "భృంగారపు చందువాల" - చందువా అంటే చాందినీ, మేలుకట్టు. భృంగారపు చందువా అంటే బంగారపు జరీతో చేసిన చందువా. ఇది తమకి మంచుపడకుండా కాదనుకుంటా. కాత్యాయినీదేవి పూజా మందిరానికో, ఆవిడని ఊరేగించే పల్లకీ కోసమో అయ్యుంటుంది.

    ReplyDelete
  7. కామేశ్వర రావు గారూ, భృంగారము అంటే బంగారమునకు ప్రకృతి అని మరిచిపోయానండీ. నిజమే!వితానము /చాందినీ/ మేలుకట్టు తెలుసు. భృంగారి/భృంగారువు అంటే కీచురాయి కదా.. అలా పదే పదే హరి సంకీర్తన చేసే పాటగాళ్ళని పొరపడ్డాను. చూడబోతే ఘోరమైన తప్పిదమే చేసినట్టున్నాను. సరిచేస్తాను. ధన్యవాదాలు!!

    ReplyDelete
  8. అబ్బే, అదేమంత ఘోరమైన తప్పు కాదు. పానకంలో పుడక, అంతే! :-)

    ReplyDelete
  9. గోపికావస్త్రాపహరణ ఘట్టాన్ని మీ అందమైన అక్షరాల్లో నయనానందకరంగా చూపించారు కొత్తావకాయ గారూ.. :)

    ReplyDelete
  10. బాగుంది...
    లలిత గారు,
    పాట కూడా బాగుంది.

    ReplyDelete
  11. శంఖమా? శంఖములా? ఎన్ని శంఖములు?

    ReplyDelete
  12. కొత్తావకాయ ఏదైనా కొత్తగానే రాస్తారు సుమా....ఇంకా ఇవన్నీ చదవాలి...వీలున్నప్పుడల్లా..👍👌

    ReplyDelete