Thursday, January 12, 2012

మా మనసు నీకు తెలియదనా? ~ కాత్యాయనీ వ్రతం - 29

కాత్యాయనీ వ్రతానికి ప్రత్యక్ష సాక్షియైన యమున నెమ్మదిగా కదులుతోంది. రేరేడు కొలువు చాలించి ఇంటికి బయలుదేరినవాడే.. గోపికల రాకను గమనించి ఆగి చూసాడు. తూర్పున శుక్రుడు ఉదయించాడు. రంగురంగుల పుష్పాలతో నిండిన సజ్జలను, పూజాద్రవ్యాలనూ చేతబూని ఆ ఎలనాగలు యమునాతటి చేరారు.

నీట మునిగి "హరిహరీ" అని పైకి లేచిన ఆ గోప తరుణులు ఎనలేని ప్రకాశంతో వెలుగొందసాగారు. సైకత "కాత్యాయని" ప్రతిమ ఎదుట మంగళ దీపికలు వెలిగించి, ధూపమునుంచి, విరులతో అర్చించి, వేడి పొంగలి నివేదన చేసి, కర్పూర హారతులిచ్చారు. కాత్యాయని నిండుగా నవ్వింది. పూజ సంతృప్తిగా పూర్తి చేసుకుని కృష్ణుని వద్దకు నడిచారు.

"రమణీ లలామలారా! మీరడిగిన పరవాద్యమదిగో! తీసుకుని మీ వ్రత పరిసమాప్తి కానివ్వండి." నగుమోముతో పలికాడు నల్లనయ్య.
"గోవిందా! పరిహాసమా?" ప్రశ్నించారు గోప తరుణులు.
"అయ్యో, మీరు విరిచేడెల వలే సుకుమారులు. మీ మనసులూ అంతే కోమలమైనవి. వాటిని కష్టపెట్టడానికి, మీతో పరిహాసాలాడడానికీ నాదేమైనా రాతి గుండె అనుకున్నారా? "
"లేదు కన్నా! నవనీతమంటి మనసు నీది!"
"మీరడిగిన పర వాద్యమిస్తే నిష్టూరాలాడుతున్నారే!"
"నిన్నటి వరకూ మేము పరవాద్యమనీ, ఆభరణాలనీ, పూజాద్రవ్యాలనీ అడిగిన మాట వాస్తవం. కానీ మాకు కావలసినవి అవి కావు."
"మరి వ్రతం సంపూర్ణమయ్యేదెలా?"
"విశ్వకర్తా! నీకు తెలియనిదుంటుందా! కేవలం వాచ్యార్థాన్నే తెలుసుకుని ఒక డప్పు కావాలని కోరుకున్నాం. నీ నామ సంకీర్తనతో మాలో పాపాలను పారద్రోలే శబ్దాన్ని దశదిశలా వ్యాపింపచేసే పరవాద్యం మాకు అవసరమని గ్రహించలేకపోయాం. "నారాయణా.." అని పలికితే ఆ శబ్దమే కోటి 'పర'ల సాటి."

"సరే! ఈ వాయిద్యం వద్దన్నారు. మీకేం కావాలో చెప్పండి!"

కృష్ణత్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవమే విశతు మానస రాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫః వాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే?

కృష్ణా! నీ పాదాంబుజాలనే పంజరంలో మా మానస రాజహంసను అవశ్యం ప్రవేశించనీ! ఎందుకో తెలుసా? ఈ భవజలధిలో పడి కొట్టుమిట్టాడుతూ జీవితపు చరమాంకానికి వచ్చేనాటికి కఫ,వాత,పిత్తాలచే మా గొంతు పూడుకుపోతుందేమో! అప్పుడు నిన్ను తలచేదెలా? అప్పటి దాకా మమ్మల్ని అజ్ఞానంలో పడిపోనీయక, ఇప్పుడే బంధించు.

"మీరు బాగా ఆలోచించుకునే అడుగుతున్నారా, అమ్మాయిలూ!"
"ముమ్మాటికీ నీ సాన్నిధ్యం తప్ప వేరే ఏ కోరికా లేదు, కృష్ణా! అయినా మా మధ్య పుట్టి, మా మనసులను దోచి, నీ వద్దకు రప్పించుకున్నది నువ్వే కదా! నువ్వు చేసిన పనిపై నీకే సందేహమా! మనసా, వాచా, కర్మణా.. మేము కృష్ణ పదదాసులము. వేరే భోగభాగ్యాలు మాకొద్దు. ఏడేడు జన్మలకు నీ సాంగత్యమున్న చాలు. మాకు నీ పై మనసు నిలిచేలా, మిగిలిన కోరికలు గాలిలో వదలివేసిన కర్పూరం తీరున హరించేలా వరమివ్వు చాలు."

"మరి మీ పెద్దలకేం చెప్తారు? నెలకు మూడు వానలు కావాలన్నారు! వ్రతం చేసినదే అందుకని కదా!"
"గోవు అంటే భూమి కదా! గోవిందుడవు.. ఈ భూమిభర్తవు నువ్వే! మా బాగోగులు నీకు తెలియదా? అయినా మాకు నీతో తప్ప వేరెవ్వరితోనూ బంధం వద్దు.  మాకు తండ్రి, అన్న, బంధువు, భర్త, పుత్రుడు అన్నీ నువ్వే! "భ్రాతా భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ" అన్న లక్ష్మణుని వలే మా సర్వం నువ్వే కావాలి. మా ఈ సుందర తనూలతికను సృష్టింపబడింది పరదాస్యానికా? నీ పేరు పలికితే మది ఝల్లన పొంగే హాయి ముందు అమరభోగాలైనా తృణప్రాయం కదూ!

జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు
కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ ముకుందపాదతులసీం మూర్ధన్ నమాధోక్షజం

ఓ నాలుకా! నీలాల ముంగురుల నల్లనయ్యనే తలుచుకో. కేశవుని కల్యాణ గుణాలను పాడు!
ఓ చేతుల్లారా! సిరిని చేపట్టిన శ్రీధరుని అర్చించుట తప్ప వేరేదీ చేయకండి సుమా!
చెవులారా! అచ్యుతుని కథలు మాత్రమే వినండి. అన్యమైనవి మీకొద్దు.
ఓ లోచన ద్వయమా! కృష్ణుని చూడండి! ఆ అందగాడినే రెప్పవేయక చూడండి.
హరిని చేరే దారిలో నడవమని మా పాదాలను కోరుకుంటున్నాం.
నీ పాదాలనర్చించిన తులసి సుగంధం తప్ప వేరే సువాసనా సోకవలసిన అవసరమే లేదు.. మా నాసికకు! అధోక్షజునికి నమస్కరించడానికే మా శిరస్సు!

మురారీ! మోహన మురళీధరా! నీ చెంతనుండే భాగ్యమిస్తివా.. వేయి జన్మలెత్తేందుకైనా సిధ్ధం! మాకు జన్మ రాహిత్యమొద్దు. మోక్షమూ వద్దు. పరమపదము అసలే వద్దు. ఋషులు కైవల్యాన్ని కోరుకుంటారే కానీ, అక్కడ నువ్వు మాకింత చేరువగా ఉంటావో ఉండవో, నిన్ను ఇంత దగ్గరగా చూడగలమో లేదో, నిన్నిలా "గోవిందా!" అని పిలవచ్చో కూడదో.. మాకేం తెలుసు! మాకు కావలసినదల్లా ఇలా ఈ రేపల్లెలో నీ మ్రోల నిలచి నిన్ను కన్నార్పక చూడడం మాత్రమే!"

ఒకటే కోరిక మా కిక
ఓ స్వామీ! గోవిందా!
మా మనసు నీకు తెలియదనా?
ఈ మనవి చేసుకొనుట!

తెలవారక మున్నే, దేవా, నీ సన్నిధి
చెలులము చేరి, నీ కొలువే కోరి,
సరస సుందరములు
సంఫుల్ల సరోజములు నీ
చరణములకు మంగళా
శాసనము చేయుట
పరవాద్యమున కనా?
ఓ స్వామీ గోవిందా!

ఆల మేపి బతికే ఈ
బేలలలో ఒకడవై
అవతరించుటేల? మా
అనుగవు కానేల?
ఈ బంధము నిలుపుము ఏ
డేడు జన్మముల కైన!
ఈ కైంకర్యము మానము
ఏనాటికి ఎప్పటికీ!

వికసిత పద్మాల వలే అందాలు చిందే మోములతో, ఆర్ద్రమైన కన్నులతో, ముకుళించిన చేతులతో, హిమస్నాతలైన విరుల వలే స్వచ్చమైన హృదయాలతో.. అపరంజిబొమ్మల వలె తన చెంత ఆర్తితో నిలిచిన ఆ గొల్ల పడుచులను చూసి నవ్వాడు కృష్ణుడు. వెన్నెల సోన కురిసినట్టై గోపీమానస చకోరాలు పులకించాయి.

"ప్రియ భామినులూ! మీ కోరిక కాదనుట నావల్లనయే పనేనా!!  మీ ప్రేమకు బానిసను!"కాత్యాయనీ వ్రతం" చక్కగా సంపూర్తి చేసుకున్నారు. నన్ను పొందడమే మీ గమ్యమైతే మీ అభీష్టం సిధ్ధించినట్టే! నా పరిష్వంగన సుఖం తప్ప వేరేదీ వద్దన్న మీ గాఢమైన కోరికకు, కౌగిలికి బందీనయ్యాను." అని మృదుమధురంగా పలికాడు. గోపికల మనసులు గోపాలకృష్ణునితో ఏకమయ్యాయి.


* ఇంకా ఉంది.


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


7 comments:

 1. ఆల మేపి బతికే ఈ
  బేలలలో ఒకడవై
  అవతరించుటేల? మా
  అనుగవు కానేల?.........నాకు చాలా ఇష్టమైన ప్రశ్నండీ...
  ప్చ్.. అప్పుడే కథ ముగింపుకి వచ్చేస్తోందా :(

  ReplyDelete
 2. ఇవాళ మీ కథ తలపింపజేసిన నరసింహ శతక పద్య రత్నమిది:

  బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని
  మరణ కాలమునందు మరతునేమొ
  యావేళ యమదూత లాగ్రహంబుగ వచ్చి
  ప్రాణముల్బెల్లించి పట్టునపుడు
  కఫ వాత పైత్యముల్ గప్పగా భ్రమచేత
  గంప ముద్భవమంది కష్టపడుచు
  నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు
  బిలుతునో శ్రమచేత బిలువలేనొ

  నాటికిప్పుడె చేసెద నీ నామ భజన
  తలచెదను జేరి వినవయ్య దైర్యముగను
  భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస
  దుష్టసంహార నరసింహ దురితదూర

  ~లలిత

  ReplyDelete
 3. భక్త రామదాసు గారు చెప్పారు

  ముప్పునఁ గాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్
  గొప్పరమైనచోఁ గఫము కుత్తుక నిండిన వేళ, బాంధవుల్
  గప్పిన వేళ, మీ స్మరణ గల్గునొ గల్గదొ, నాటికిప్పుడే
  తప్పక చేతు మీ భజన దాశరథీ కరుణాపయోనిధీ!

  ReplyDelete
 4. నాకీ పద్యం కూడా గుర్తుకొచ్చింది:

  కమలాక్షు నర్చించు కరములు కరములు
  శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
  సురరక్షకుని జూచు చూడ్కులు చూడ్కులు
  శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
  విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
  మధువైరి దవిలిన మనము మనము
  భగవంతు వలగొను పదములు పదములు
  పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి

  దేవదేవుని జింతించు దినము దినము
  చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
  కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
  తండ్రి! హరి జేరుమనియెడి తండ్రి తండ్రి!

  ReplyDelete
 5. "నారాయణా నిన్న నామద స్మరణెయ సారామృతవెన్న నాలిగెగె బరలి."
  ఆహా, ఎంత చక్కగా చెప్పావమ్మా.
  మీరు ఈ పదాల టపాల వ్రతం మొదలు పెట్టినప్పుడు, ఆహా ఎంత చక్కగా ఉన్నది, రోజూ ఒక అందమైన అద్భుతమైన టపా చదివి, గొప్పది కాకపోయినా ఒక ముచ్చటైన వ్యాఖ్య రాసి మురిసిపోదామనుకున్నాను. తానొకటి తలచిన .. పోనీలే .. రేపు నిద్ర లేస్తానేమో, చేజారిన టపాలన్నీ చదివేస్తానేమో .. ఎవరికి తెలుసు?

  ReplyDelete
 6. కొత్తావకాయ గారూ మీరు సరస్వతీ దేవి ప్రియ పుత్రిక.

  ReplyDelete
 7. చాలా బాగుంది. వ్రతం పరిసమాప్తం.

  మళ్లీ యమున తో చాలా పాశురాల తర్వాత టపా మొదలు పెట్టారే.

  ReplyDelete