Friday, March 16, 2012

కరి మింగిన వెలగపండు

"చదవేస్తే ఉన్నమతి పోయిందని ఇదేం పాడుబుధ్ధిరా తండ్రీ! 'మచ్చా మరకా లేని పిల్లాడ'ని నలుగు పెట్టిన ప్రతీ సారీ మురిసిపోయేది మీ అమ్మ. దానికి కోపం వచ్చిందంటే రాదూ!" తరుగుతున్న వంకాయ ముక్కల్ని గిన్నెలో నీళ్ళలో వేస్తూ కాక్క మెత్తమెత్తగా చీవాట్లు వేస్తోంది.
పేపర్ పక్కన పడేసి లోపలికెళ్ళి షేవింగ్ కిట్లోంచి నెయిల్ కటర్ తెచ్చుకొచ్చి కూర్చున్నాను.
"మంగళారం పూటా గోళ్ళు తీసుకుంటున్నావా! ఆపు.." గొంతు ఇంకాస్త తగ్గించి కసిరింది. నిర్లక్ష్యంగా గోళ్ళు తీసుకోబోతూ ఆగి, నెయిల్ కటర్ పైజమా జేబులోకి జారవిడిచి మళ్ళీ పేపర్ లోకి మొహం దూర్చాను. అక్షరాలు అర్ధం కావట్లా..! అమ్మ వచ్చి వంకాయ ముక్కలు తీసుకెళ్ళింది.

"అమ్మడూ! కొబ్బరి పచ్చడి చేస్తానంటివే..తురమనా?" అడిగింది కాక్క
'కాక్క' అమ్మకి పినతల్లి. ఆవిడకెవరూ లేరు. అమ్మతో అరణం వచ్చింది. అమ్మ ఆవిడని 'కక్కి' అని పిలుస్తూంటే నేను 'కాక్కా..' అనే వాడినట. ఇప్పటికీ అదే అలవాటు.
"ఇదిగో.. పొద్దెక్కక ముందే స్నానం కానిచ్చి ఇంటిపట్టున ఉండు. ఊరమ్మట పోకు. ఏ సాయంత్రానికో మీ అమ్మ కోపం తగ్గితేనే ఇంట్లో అందరికీ మనశ్శాంతి. ఏం పిల్లలో ఏమో..!" సణుగుతూ పైకి లేవబోయి తూలింది. టక్కున ముందుకు వంగి చెయ్యివ్వబోయా.
"ముట్టుకోకు. ఇంకా పూజా గట్రా కాలే.." సంభాళించుకుని చేతికర్ర అందుకుని తాపీగా అడుగులేస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయిందావిడ..

"మైథిలొచ్చింది." ట్రావెల్ బేగ్ భుజాన వేసుకుని లోపలికొస్తూ చెప్పారు నాన్న.
"ఏరా రాఘవా! రాత్రొచ్చావా?" నోరంతా తెరిచి నవ్వుతూ లోపలికొచ్చింది మైథిలి.. మా పిన్ని.
"లేదు. తెల్లవారు ఝామున వచ్చాను... ఒక్కర్తివే వచ్చావా?" కుర్చీలోంచి లేచి ఎదురెళ్ళాను.
"అవున్రా.. రేపు సాయంత్రం వెళ్ళిపోవాలి. ఎల్లుండి మీ బాబాయ్ కేంప్ కి వెళ్ళాలట." నా భుజం మీదోసారి చెయ్యి వేసి నిమిరి లోపలికెళ్ళింది.

లోపలికి వెళ్ళి మామూలుగా ఉండలేక హాల్లోనే ఉండిపోయాను. మనసూ, శరీరం కూడా చిరాగ్గా ఉన్నాయ్. స్నానం చేద్దామని తువ్వాలు భుజాన వేసుకుని గదిలోంచి వస్తూండగా పిన్ని కాఫీ గ్లాసు ఊదుకుంటూ ఎదురొచ్చి కళ్ళెగరేసింది. "మీ అమ్మ ఎందుకు కోపంగా ఉంది?" అని అర్ధమన్నమాట. మాట్లాడకుండా టీషర్ట్ స్లీవ్ పైకి మడిచి జబ్బ చూపించా..

"పచ్చబొట్టా!! నిజందే!!" గట్టిగా ఆశ్చర్యపోబోతున్న దాని నోరు నొక్కేసి "ష్షూ" అన్నాను.
"ఏవిటది.. తేలా?!"
"ఊ.. స్కార్పియన్"
"నొప్పెట్టలేదూ!!"
"కొంచెం.. ఉహూ..కాదులే.. బాగా నొప్పెట్టింది. ఒక్కసారేగా!"
"అయినా తేలేంట్రా! ఎంచక్కా ఏ పువ్వులో, దేవుడి బొమ్మలో వేయించుకోవలసింది."
"ఛ ఛా.. పువ్వులు అమ్మాయిలకి. ఇది నా జోడియాక్ సైన్" జబ్బ మడిచి కండ చూపిస్తూ నవ్వాను.
"అందుకా కోపం! సర్లే.. స్నానం చెయ్య్.. లక్ష్మత్త ఇంటికి వెళ్ళొచ్చేద్దాం."
                    
                             ******

ఆర్ ఎండ్ బీ బంగ్లా పక్కనుంచి మట్టి రోడ్లోకి బండి తిప్పుతూ "నాల్రోజులుండేలా రావల్సిందే.." అన్నాను వెనక కూర్చున్న పిన్నితో.
"కుదరదులేరా. అయినా చిన్న పనేగా. ఒక్క సంతకం." గాలి కోసేస్తున్న మాటలు ముక్కలుముక్కలుగా వినిపించాయి.
"ఇప్పుడెందుకా ఇల్లు అమ్మడం?"
"ఎప్పటికైనా అమ్మేయాల్సిందేగా! పాత ఇల్లు. పల్లెటూరు. ఎవరు చూస్తారు? మంచి బేరం వచ్చిందిగా.."
"..."
"అవున్రా.. అక్కడి సామాను తెప్పించేసారా?"
"ఆ.. నిన్న సాయంత్రం నాన్న తెచ్చారట. మేడ మీద పెట్టించారు."
"మీ అమ్మ ఓకేనా?"
"ఒకే కాదు. ఉదయం నేను వచ్చేసరికే డల్ గా ఉంది. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నా టాటూ మీద పడింది."
"తిట్టిందా?"
"కొట్టినా బాగుండు! మాట్లాడదుగా.. మొండిది." పళ్ళు బిగిస్తూ అన్నాను.
"హ్హహ్హా.. అది చిన్నప్పటినుండీ అంతేరా.." నవ్వింది పిన్ని.
"మీ ఇద్దరికీ ఎంత తేడా పిన్నీ! నీలా తనూ కూల్ గా ఉండచ్చుగా!"
"ఐదు వేళ్ళూ ఒకేలా ఉంటాయా? అయినా దానికున్న డిసిప్లిన్, ప్రిన్సిపుల్స్ నాకు లేవు. మీ బాబాయ్ ఎప్పుడూ పోల్చి తిడుతూ ఉంటారు."
"జులాయి పిల్లా.. అనేనా?" బాబాయ్ పిన్నిని "జూపీ.. జూపీ" అని పిలుస్తాడు. చాలా రోజులు బతిమాలి దాని అర్ధం తెలుసుకున్నాను.
"చుప్.. భడవా!" భుజం మీద చరుస్తూ నవ్వుతూ చెప్పింది "శౌరి గాడు టాటూ వేయించుకుంటే ఆమేర తొక్క తీసేస్తా నేనయితే.."
"వాడు నాలా ఊరుకోడు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకు యే నాగేస్సర్రావు బొమ్మో టాటూ వేయించేస్తాడు."
"ఛీ.. ఊహకైనా యే రాజేష్ ఖన్నావో హృతిక్ రోషనో అనచ్చు కదరా!" పకపకా నవ్వింది.
లక్ష్మత్త ఇంటి ముందు బండి ఆపి చెప్పాను. "ఆశ లావే కానీ.. సోది తొందరగా పూర్తి చేసి రా.. నేను బజార్లోకి వెళ్ళొస్తాను. మధ్యాహ్నం మేడ మీది సామాన్లు సర్దాలి. అది మన డ్యూటీ."
"మన కాదు. 'న్నీ' డ్యూటీ. నేను సాయం చేస్తున్నాను... రాత్రి సినిమాకి తీసుకెళ్తున్నావు కాబట్టి." చెప్పి గేటు తీసుకుని వెళ్ళిపోయింది. నవ్వుకుంటూ బండి వెనక్కి తిప్పాను.
             
                             *****

"ఇదేంట్రా ఇంత తక్కువ సామానుంది?" వక్కపొడి డబ్బా తెరిచి చేతినిండా ఒంపుకుని నోట్లో వేసుకుంటూ లోపలికొచ్చిన పిన్ని ఆశ్చర్యపోయింది.
"కుర్చీలూ అవీ ఊళ్ళో ఎవరికో ఇచ్చేసారు. పందిరి మంచం ఆ పక్క గదిలో వేసారు. వంట సామాను ఆ మూటల్లో.. అటక మీద సామాను ఇదిగో.." ట్రంకు పెట్టెలు పక్కకి జరిపి పిన్ని కూర్చునేందుకు జాగా చూపిస్తూ చెప్పాను.
"అవున్లే.. ఎప్పటి సామానిదీ..! మా తాతగారి హయాంలో ఓ వెలుగు వెలిగిన ఇల్లది. అదో వైభోగంలే! మీ అమ్మ పెళ్ళి అయిన ఏడాది మా నాన్న పోయారు. మరో రెండేళ్ళకి నువ్వు పుట్టక ముందే మా అమ్మ వెళ్ళిపోయింది. మహా ఇల్లాలు! నా పెళ్ళి మీ అమ్మే చేసింది. అప్పటికి నువ్వు అడుగులు వేస్తున్నావింకా."
"నీకంటే అమ్మకే ఎక్కువ బంధమేమో కదా ఈ ఇంటితో. "అమ్మ వచ్చే ముందే సామాను సర్దేసి అటక ఎక్కించెయ్. పిచ్చిది.. చూస్తే ఏడుస్తుంది" అన్నారు నాన్న."
"ఏమోరా.. నేను ఆకతాయితనంగానే ఉండేదాన్ని. మీ అమ్మ ఎప్పుడూ కొంచెం సీరియస్సే. నాకూ బాధ ఉంటుంది కానీ దానికే ఎక్కువనుకుంటా.." ఆలోచిస్తూ అంది పిన్ని.
"నువ్వు బయట పడవంతే. నీకు మాత్రం ఉండదూ!" సర్దేసాను. ఆ కబురూ ఈ కబురూ చెప్పుకుంటూ ఒక్కో వస్తువు వెనుకా ఉన్న కథ పిన్ని చెప్తూఉంటే వింటూ పని దాదాపు పూర్తి చేసేసాను.

"ఇదెవరే? " ఓ పెట్టెలోంచి పాత ఫోటో ఫ్రేము పైకి తీస్తూ అడిగాను.
"చూడనీ.."
చెదలు పట్టి సగం పాడయిపోయిన బ్లాక్ అండ్ వైట్ ఫోటో.. లంగా వోణీ వేసుకున్న పదిహేనేళ్ళ అమ్మాయి పక్కన నాలుగైదేళ్ళ పిల్ల.. పిల్లేనా? రిబ్బన్లు కట్టిన జడలు.. మోకాళ్ళ దాకా ఉన్న పెద్ద చొక్కా..!
"నువ్వూ అమ్మానా? కాదే.. మీ ఇద్దరికీ అయిదేళ్ళేగా తేడా?"
"మేం కాదు." ఆ ఫోటో చేతిలోకి తీసుకుంటూ చెప్పింది పిన్ని. ఫోటో వైపు దీక్షగా చూసి మళ్ళీ పెట్టెలో పెట్టేసి "పైన పెట్టెయ్ రాఘవా.." అంది.
"పెట్టేద్దాం లే. ఎవరది? చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులే.."
"మా అమ్మ, మావయ్య" పొడిగా చెప్పేసి కిందకి వెళ్ళిపోయింది.
అంత హఠాత్తుగా పిన్ని ముభావంగా వెళ్ళిపోవడం వింతగా అనిపించింది. మిగిలిన పని పూర్తి చేసుకుని కిందకి వెళ్ళేసరికి అన్యమనస్కంగా కనకాంబరాలు మాల కడుతోంది.

"ఏ సినిమాకెళ్దామే?"
"ఏం వద్దులే."
"సాయం చెయ్యలేదని నేనేమీ అనుకోలేదులే. హిందీయా తెలుగా?"
"తలనొప్పిగా ఉందిరా. నువ్వెళ్ళు పరవాలేదు." బలవంతంగా నవ్వుతూ చెప్పింది.
కోపం తగ్గని అమ్మ.. ఎందుకు ముక్తసరిగా మాట్లాడుతోందో తెలియని పిన్ని.. ఇల్లు చాలా వేడిగా ఉందనిపించింది. సినిమాకి ఒక్కడినే వెళ్ళాలనిపించక స్నేహితుల్ని కలిసి బయట తిరిగి పదింటికి ఇంటికి చేరాను. అమ్మ నిద్రపోతోంది. పిన్ని నిద్ర నటిస్తోంది.

                             *****

"రిజిస్ట్రీకి నేను రావాలేంట్రా?" కాక్క ఉదయాన్నే అడిగింది. తను లీగల్గా ఆ ఇంటి మనిషి కాదని ఆమెకు తెలీదు మరి.
"నువ్వెందుకూ.." అనబోతున్న నన్ను ఆపినట్టు అమ్మ చెప్పింది. "లేదు కక్కీ.. రిజిస్ట్రార్ మనకి తెలిసినాయనే. నువ్వు పెద్దదానివి.. రాలేవని తెలుసు. పరవాలేదులే." అని నావైపు తిరిగి "నేనూ పిన్నీ ఆటోలో వచ్చేస్తాం. నువ్వూ నాన్న ముందు వెళ్ళండి. అరగంటలో రెడీ అవాలి." అంటూ కాఫీ గ్లాస్ అందించింది.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. అమ్మ ఎప్పుడూ తిట్టలేదు, కొట్టలేదు. మౌనం ములుకు, చూపులు కమ్చీలు.. ఇంక దెబ్బలెందుకు!! తాత్కాలికంగా పిన్ని సంగతి మరిచిపోయాను. మధ్యాహ్నం భోజనాలవేళప్పటివరకూ..

                               *****
"ఏవిటలా కెలుకుతున్నావ్?" అమ్మ మాట విని పిన్ని వైపు చూసాను. కళ తప్పినట్టున్న మొహం దించుకుని గబగబా నాలుగు ముద్దలు తినేసి మేడమీదకి వెళ్ళిపోయింది.

"ఏమయింది పిన్నీ.. చెప్పక పొతే ఎలా తెలుస్తుంది?" మేడ మీద వాలుకుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకున్న పిన్ని ఎదురుగా కూర్చున్నాను.
"ఏం లేదురా.. ఇంటి గురించి ఆలోచన. అంతే." బుకాయించింది.
"కమాన్..! నువ్వు ఎంత ప్రాక్టికలో నాకు తెలుసు. నిన్న ఆ ఫోటో చూసాక మూడీగా తయారయ్యావ్."
మాట్లాడకుండా లేచి దండెం మీద ఆరవేసి ఉన్న చీర తెచ్చి మడతవేస్తోంది.
"అమ్మమ్మ గుర్తొచ్చిందా?"
"లేదురా.. మీ అమ్మ నాకా లోటు ఎప్పుడూ రానివ్వలేదు." సూటిగా నా కళ్ళలోకి చూస్తూ చెప్పింది.
"ఊ.. మరి?"
"మావయ్య..."
"ఓ.. ఫోటోలో ఉన్న పిల్లాడా? ఎక్కడుంటారు?"
"ఏమో.."
"అంటే?"

కుర్చీలో కూర్చుంది ఓపిక లేనట్టుగా..
"నువ్వు అడిగావు కనుక చెప్తున్నాను. ఎవరి దగ్గరా నోరుజారకు. నీకీ విషయం తెలీదు. సరేనా?"
"ఊ.. ప్రామిస్"
"మా అమ్మకి ఇద్దరు చెల్లెళ్ళు, ముగ్గురు తమ్ముళ్ళు. నిన్న ఫోటోలో చూసావే శేషాద్రి మావయ్య.. ఆఖరువాడు. అమ్మ పెద్దది కదా.. మావయ్యని తనే పెంచిందట. అమ్మ కాపురానికి వచ్చేటపుడు తమ్ముడిని పంపమని తాతగారిని అడిగిందట కూడా. పంపలేదనుకో.. అంత ఇష్టం ఒకరంటే ఒకరికి. ఎప్పుడూ మా ఇంటిదగ్గరే ఉండేవాడు.

మావయ్య బొమ్మలేసేవాడు. అందంగా చక్కగా వేసేవాడు. పత్రికలకి పంపేవాడు. హిందీ పాటలు వినేవాడు. ఏమేమో రాసుకునేవాడు. నేను హైస్కూల్లో ఉండగా అనుకుంటా..  ఓ రోజు చాలా పెద్ద గొడవ జరిగింది. బొమ్మలు, నాటకాలంటూ తిరుగుతున్నాడని తాతగారు కొట్టారట. ఇంట్లోంచి వెళ్ళిపోతానని గొడవ. మా ఇంటికొచ్చి అమ్మతో 'మద్రాసెళ్ళి సినిమాల్లో చేరిపోతానని' చెప్పాడు. నాన్న చాలా తిట్టారు. నేనూ, అక్కా పెరటి అరుగు మీద కూర్చుని అంతా విన్నాం. తాతగారికి కబురు పెట్టారు. ఇంకేముంది.. అరుపులు, ఏడుపులు. ఒక ఆరునెలల తరువాత నిజంగానే వెళ్ళిపోయాడు. అమ్మకి క్రమం తప్పకుండా ఉత్తరాలు రాస్తూండేవాడు. "చిట్టిని, కనతల్లినీ అడిగానని చెప్పు." అని చివర్లో రాసే ఒక్క వాక్యం పదేపదే చదువుకునేవాళ్ళం. మా కంటికి నిజంగా హీరోలాగే కనిపించేవాడు. అందునా పెద్దల్ని ఎదురించడం అంటే ఆ వయసులో మాకూ గొప్పగానే ఉండేది.

ఏదో ఉద్యోగం చేస్తున్నాడన్నారు. పోన్లే అనుకున్నాం. దాదాపు రెండేళ్ళపాటు కనిపించలేదు. ఓ సంక్రాంతికి ఇంటిల్లిపాదికీ బట్టలు తీసుకుని వచ్చాడు. అందరూ సంతోషించాం. పెళ్ళి చేసుకోమని అంటే నవ్వేసి ఊరుకున్నాడట. మీ అమ్మని ఇవ్వమని అడిగారు. మా నాన్న కుదరదని చెప్పేసారు."

"మా అమ్మనా? ఎందుకివ్వనన్నారు?" ఆశ్చర్యమనిపించింది.
"స్థిరం లేనివాడికి ఇవ్వనని.."
"ఊ.. తరువాత?"
"ఏముంది. నిజంగానే ఓ వెలుగు వెలిగాడు. లక్షలు గడించాడు. అడిగిన వారికి కాదనకుండా సొమ్ము పంపించాడు. మద్రాసులో ఇల్లు కొనుక్కుని ఇంటినిండా సామాను నింపుకుని అప్పుడు పెళ్ళి చేసుకున్నాడు... రాజోలు సంబంధం."

"సినిమాల్లో.."
"ఊ.. సినిమాల్లోనే. కళాదర్శకుడు. బోలెడు సినిమాలు చేసాడు. మండువా లోగిలి మధ్య పంచపాళీ తూముకి అడ్డం పెట్టి నీళ్ళు నింపి మధ్యలో మంచం వేసుకుని ఆకాశంలోకి చూస్తూ రేడియో వింటూ నిద్రపోయేవాడట. వేసిన చొక్కా మళ్ళీ వేసుకునే వాడు కాదట. చుట్టాలూ పక్కాలూ.. వచ్చిన ప్రతీవారినీ ఆదరించాడు. ఇంచుమించు ఒక అయిదేళ్ళపాటు చుట్టాలలో ప్రతీ పిల్లాడినీ చదివించాడు. పెళ్ళీడుకొచ్చిన ప్రతీ పిల్లకీ తన ఖర్చుతోనే పెళ్ళి చేసాడు.

"ఎవరు మోసం చేసారు?" తరువాతి కథ నాకు తెలుసునన్నట్టు అడిగాను.
"ఎవరూ మోసం చెయ్యలేదు. ఆరోగ్యం బాగోక ఒక్క ఆరునెలలు సంపాదించలేకపోయాడంతే."
"అందరూ వదిలేసారా?"
"ఆ.. కట్టుకున్నదానితో సహా.."
"ఎందుకలా?"
"ఏమో.. ఏం జరిగిందో తెలీదు ఒక్క ఏడాదిలో రోడ్డున పడిపోయాడు."
"ఊ.. సిరి తా వచ్చిన వచ్చును.."
"నిజం! కరి మింగిన వెలగపండే అయిపోయింది పరిస్థితి. తప్పు ఎక్కడ జరిగిందో తెలీదు. ఎవరి వల్ల జరిగిందో తెలీదు."
"మళ్ళీ పుంజుకోడానికి ప్రయత్నించలేదా?"
"ఉహూ.. కళాకారులకో శాపం ఉంటుందనుకుంటా.. మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండని రోజులుంటాయి చూడు.. అవి వాళ్ళ జీవితంలో చాలా ఎక్కువ ఉంటాయి."
"బుల్ &%$#  పోయిన చోటే వెతుక్కోవాలి. అంత ఎదిగిన వాడికి కిందపడ్డాక లేవడం తెలియలేదా?"
"ఏమో.. అవకాశం ఉండి కష్టాలెవరు పడతారు చెప్పు? మా ఊరొచ్చేసాడు. మీ అమ్మకి పెళ్ళయి వెళ్ళిపోయింది. మా నాన్న ఒంట్లో బాలేని రోజులు. ఏ తెలవారుఝామునో మా అమ్మ ముగ్గు పెట్టడానికి వాకిలి తలుపు తీసేసరికి అరుగుమీద కూర్చుని ఉండేవాడు."
"...."
"స్నానం చేసి వెళ్ళిపోయేవాడు."
"డబ్బులడిగేవాడటా?"
"ఊహూ.. ఎప్పుడైనా గ్లాసెడు పాలు తాగేవాడట.. మా అమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుందని."
"తరువాత?"
"ఏమో.. మొదట్లో రెండు రోజులకొకసారి కనిపించేవాడు. తరువాత వారం.. నెల.. నెలలు.. అంతే."
"బతికే ఉన్నాడా?" అని అడగబోయి ఆగిపోయాను. పిన్ని మొహంలో అంత బాధ ఎప్పుడూ చూడలేదు. ఇలా ఎగసి విరిగిపోయే కెరటాలు చాలానే ఉంటాయని తనకు మాత్రం తెలీదా? రక్తసంబంధం కదా.. అందుకేనేమో అంత నొచ్చుకుంటోంది. అనిపించింది. కొన్ని క్షణాల నిశబ్దం..

"మీ అమ్మని ఇవ్వక మా నాన్న మంచి పని చేసారు. కదూ..!" ఉన్నట్టుండి ప్రశ్నించింది. పిన్ని చూపులు కొబ్బరాకుల నీడల్ని కుచింపచేస్తున్న ఎండ వైపు చూస్తున్నాయి. దూరంగా కాకుల అరుపులు ఆగీ ఆగీ వినిపిస్తున్నాయ్.
"ఏమోలే.. పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు కదా!" అన్నాను. పిన్ని దగ్గర ఏం మాట్లాడాలో తెలియకపోవడం ఇదే మొదటిసారి.
పాలిపోయినట్టు నవ్వి నెమ్మదిగా చెప్పింది.. "మీఅమ్మని అడిగే బదులు నన్ను అడగలేదేం రా.."
నాకు ఒక్క క్షణం తలతిరిగిపోయింది.
"నీకూ అతనికీ..!!"
"పదేళ్ళు తేడా..." నిర్లిప్తంగా ఉంది పిన్ని గొంతూ.. మొహం కూడా..

37 comments:

  1. ఏమిటో మీరు కొంచం ఇబ్బంది పెట్టారు సుమా

    ReplyDelete
  2. కొత్తావకాయ గారూ కథ సరదాగా మొదలెట్టి ఆఖర్లో మనసు మెలితిప్పారు కదండీ...మీ కథనం గురించి ఇక చెప్పేదేము౦దీ...

    ReplyDelete
  3. అప్పుడే అయిపోయిందా అనిపించింది. అంత ఏకబిగిన చదివించారు ! ఎందుకనో "है सब सॆ मधुर वो गीत जिन्हॆं हम दर्द की सुर मॆं गातॆ है..." పాట గుర్తుకొచ్చింది చదవగానే !! రాయండి..రాయండి..రాయండి...ఇంకా మాంఛి మాంఛి కథలు రాయండి!

    ReplyDelete
  4. కొవా గారు, కధ ట్విస్ట్ మాత్రం అమోఘం!!!!!! ఏంటో ఒక్కసారిగా గుండెలో అలా చిన్నగా కలుక్కుమంది!! నెరేషన్ యధావిధిగా అద్భుతం! టాట్టూ ప్రహసనం మాత్రం భలే సరదాగా, డిఫరెంట్ గా బావుంది... :-)

    ReplyDelete
  5. చాలా బావుంది. మంచి పరిణితి తో రాసారు.

    ReplyDelete
  6. చాలా బాగుంది అని చెప్పటం చిన్నమాట. బాగా రాయటం మీకు, అది చెప్పటం మాకూ బాగా అలవాటైపోయిన విషయం.
    @@ఒక్కసారిగా గుండెలో అలా చిన్నగా కలుక్కుమంది!!
    నిషీ, అవును.

    ReplyDelete
  7. చివరిలో ట్విస్ట్ ముందే ఊహించొచ్చు. కానీ కధ నడిపిన తీరు అద్భుతం.కోవాగారు జయహో :)

    ReplyDelete
  8. andaroo cheppaesaaru:)))

    sunita.

    ReplyDelete
  9. కథ బావుందండీ కొత్తావకాయ గారూ.. ఎప్పట్లాగే మీరు చెప్పిన కథ కన్నా కథనం ఇంకా ఎక్కువ ఆకర్షించింది. :)

    ReplyDelete
  10. కొత్తగా నా కామెంటేం చెప్పను? చలనచిత్రం చూపించినట్టు రాశారు :-)
    A great WoW!

    ఏ సాయంత్రానికో మీ అమ్మ కోపం తగ్గితేనే ఇంట్లో అందరికీ మనశ్శాంతి

    తక్కువ మార్కులొచ్చిన హైస్కూల్ పిల్లాడిలా లోపలికి వెళ్ళి మామూలుగా ఉండలేక హాల్లోనే ఉండిపోయాను<

    కళాకారులకో శాపం ఉంటుందనుకుంటా.. మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండని రోజులుంటాయి చూడు.. అవి వాళ్ళ జీవితంలో చాలా ఎక్కువ ఉంటాయి.

    ReplyDelete
  11. భాష..చెప్పే విధానం..మీకు మీరే సాటి..ఇంకేం చెప్పను!

    "రిజిస్ట్రీకి నేను రావాలేంట్రా?" కాక్క ఉదయాన్నే అడిగింది. తను లీగల్గా ఆ ఇంటి మనిషి కాదని ఆమెకు తెలీదు మరి.
    "నువ్వెందుకూ.." అనబోతున్న నన్ను ఆపినట్టు అమ్మ చెప్పింది. "లేదు కక్కీ.. రిజిస్ట్రార్ మనకి తెలిసినాయనే. నువ్వు పెద్దదానివి.. రాలేవని తెలుసు. పరవాలేదులే."....
    ఎంత సున్నితంగా ఆలోచిస్తారండి మీరు. ఇప్పుడీ సున్నితత్వాలే మనలో కరువవుతున్నాయి!

    "మీఅమ్మని అడిగే బదులు నన్ను అడగలేదేం రా.."..
    అడిగితే వాళ్ల నాన్న ఒప్పుకుని ఉండేవారా?..స్థిరం లేని వాడని కదా వాళ్ల అక్కని ఇవ్వనన్నది..మరి ఈ కూతుర్ని మాత్రం ఎలా ఇచ్చేవారు?

    ReplyDelete
  12. ఈమధ్య కాలంలో నన్ను బా....గా వెంటాడిన కథండీ..

    ReplyDelete
  13. వహ్ వా కొత్తావకాయ్ గారు..
    ఆపకుండా చదివించారు.. క్లైమాక్స్ ట్విస్ట్ గురించి ముందే కొంచే ఊహించినా గానీ..ఆ ట్విస్ట్ ని ఒకే ఒక్క గొప్ప లైన్ లో చెప్పారు చూశారూ... "మనసుని మెలితిప్పడం" అంటే ఇదే...
    చాలా బాగుందండీ..

    ReplyDelete
  14. సిరిసిరిమువ్వ గారూ,
    నేను కథా రచయితని కాదు అయినా మీ కామెంట్ కి సమాధానం చెప్పాలనిపించింది.

    "మీఅమ్మని అడిగే బదులు నన్ను అడగలేదేం రా.."..
    అడిగితే వాళ్ల నాన్న ఒప్పుకుని ఉండేవారా?..స్థిరం లేని వాడని కదా వాళ్ల అక్కని ఇవ్వనన్నది..మరి ఈ కూతుర్ని మాత్రం ఎలా ఇచ్చేవారు?

    ఆ అక్క స్ట్రిక్ట్ and సీరియస్ పర్సన్. ఈ చెల్లి అలా కాదు అని కథ క్యారక్టరైజేషన్ లో తెలిపారు కదండి. ఈ చెల్లిని అడిగుంటే నాన్న కాదన్న మావయ్యని చేసుకునేందుకు మొండిపట్టుబట్టు చేసేసుకునుంటుందన్నది నా భావన.

    కొవా గారి సమాధానం ఏమిటో చూడాలి.

    ReplyDelete
  15. కళాకారులకో శాపం ఉంటుందనుకుంటా.. మనం ఎంత కష్టపడినా ఫలితం ఉండని రోజులుంటాయి చూడు.. అవి వాళ్ళ జీవితంలో చాలా ఎక్కువ ఉంటాయి." -- హ్మ్

    ReplyDelete
  16. కధానికలకి,కధలకి బలం కొసమెరుపే!!!కధ కన్నా మీ కధనం అద్భుతం.మీ పోస్టులన్నీ చదువుతుంటాను.మీరు ఇలా రాస్తూనే వుండాలని నా ఆకాంక్ష.

    ReplyDelete
  17. కథన కౌశలమ్ము కనుల ముంగిట నిల్పె
    కథను తీర్చి దృశ్య కావ్యమట్లు
    ఆవకాయ జాడి అమృత భాండమ్మయ్యె
    కథల సుథలు నిండి ఘనత దాల్చి

    బ్లాగు: సుజన-సృజన

    ReplyDelete
  18. కథనం..లో మాటల దారుల గుండా..మేస్మేరిసై..మీ చేతి పట్టుకుని వెళ్ళి పోయాం..ఆఖరికి, ఒక్క సారి చెయ్యి వదిలి..హ్మం..అని కళ్ళు తుడుచు కోవాలి కదా..
    అంతా బాగుందండి..
    వసంతం.

    ReplyDelete
  19. కథ అన్నది సుఖాంతం/విషాదాంతం అయినప్పుడు - పాఠకు/రాలి/డి/ అనంతర ఆలోచనా స్రవంతి మీద ప్రభావం ఎలా ఉంటుందన్నది దాదాపుగా ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేసినవారంతా చెప్పేసారు. ఒక మంచి రచన అన్నది ఎంత స్ఫూర్తికి ఆధారమో, అక్షరం నిజంగా "అక్షర"మైన ఆనందాన్ని కలుగజేయగలదో అన్న విషయ స్పృహ తో ఒక మాట కలపటం ఇది అంతే!

    ఈ అభిప్రాయాన్ని పైవారికి భిన్నంగా ఇస్తున్నాను, కానీ వెలుపలివారి మాట కన్నా రచయిత/కవిగా మీ వాణి మీకు అసలు విషయం ఎలానూ తెలుపుతుంది. కథగా నవ్యత లేదు కానీ చిన్న కాన్వాసు మీద చక్కగా దృశ్యాన్ని, చెప్పాలనుకున్నదాన్ని చెప్పేశారు. చెప్పాలనుకున్నదాన్ని సాగదీయకుండా స్పష్టంగా చెప్పే సామర్ధ్యం మీకు చాలా ఉంది. ఇవి ఒక రీడర్ గా మా స్పందన. స్వీకరించటం లో మీ ఐచ్చికత ఎలానూ ఉంది. ఇది విమర్శ కాదు నా దృష్టికి అందినవి మాత్రమే.

    అమ్మ కోపం దృష్ట్యా ప్రధాన పాత్ర తో కాక్క సంభాషణ గా మొదలైంది కథ. అక్కడ కాసేపు కాక్కది కావచ్చు మూలకథ అనిపించింది. అలాగే అమ్మ ని గూర్చిన ప్రస్తావనల్లో ఆమె వ్యక్తిత్వం చూపారు. కథలోకి వచ్చిన ఈ 2 పాత్రలు తమ తమ ప్రాధాన్యత చెప్పించుకుని తిరిగి తెర వెనక్కి వెళ్ళిపోనట్లనిపించింది. ఇక పిన్ని పాత్ర వస్తూనే ఒక కదలిక కథలో. కానీ, "తక్కువ మార్కులొచ్చిన హైస్కూల్ పిల్లాడిలా లోపలికి వెళ్ళి మామూలుగా ఉండలేక హాల్లోనే ఉండిపోయాను." - ఎలా అన్వయించుకోవాలో ఈ పోలిక బాబాయ్/కజిన్ శౌరి రాలేదన్న నిరాశకి ఎలా సరిపడిన్దో తెలీలేదు.

    నాన్న పాత్ర నిడివి చాలా తక్కువ కానీ, - "అమ్మ వచ్చే ముందే సామాను సర్దేసి అటక ఎక్కించెయ్. పిచ్చిది.. చూస్తే ఏడుస్తుంది" అన్నారు నాన్న." పరోక్షంగా ఆయనకి భార్యపట్ల అనురాగాన్ని తేటతెల్లం చెయ్యటం బాగుంది.

    సిరిసిరిమువ్వ మరొక నాకు నచ్చిన అంశం చెప్పారు. మావయ్య పట్ల సానుభూతి కలిగించటమూ సాధ్యం చేశారు.

    "చిట్టిని, కనతల్లినీ అడిగానని చెప్పు." అని చివర్లో రాసే ఒక్క వాక్యం పదేపదే చదువుకునేవాళ్ళం. - మేనకోడళ్ళ పట్ల అతని ఆపేక్ష, ఇందులో అపుడపుడే ఈడొస్తున్న ఆడపిల్లల సహజ గుణాన్ని చక్కగా చూపారు. అందుకే, - పాలిపోయినట్టు నవ్వి నెమ్మదిగా చెప్పింది.. "మీఅమ్మని అడిగే బదులు నన్ను అడగలేదేం రా.." - అన్న వాక్యంతో నాకు మైథిలిది ఆ వయసు నాటి ఇంఫాక్టుయేషన్ కావచ్చు. రాఘవకి చెప్తున్నపుడు కూడా ఆ రోజు అంతా ఆమె మెసిలి వచ్చిన మానసిక స్థితి అదీ తాత్కాలిక బాధ అనిపించింది. ఎందుకంటే ఈ ఇద్దరి నడుమా అనుబంధం దృష్ట్యా పిన్ని విఫలప్రేమ ఇలా ఒక ప్రేరణ మూలాన (అంటే పాత సామాన్లలో ఒక ఫొటో ద్వారా) వెలికిరాదు. ఇలా ఒక ఇంపల్సివ్ ధోరణితో వచ్చేవి గతానుభవం లోనూ అవే బేస్ లో జరిగిఉండొచ్చు. లేదా మైథిలి లోతుమనిషి, ఎక్కువగా బయట పడదు అనుకుందామన్నా ఆ పాత్ర పరిచయం అలా లేదు, గలగల్లాడేటి మనిషనిపిస్తుంది.

    ఒక చిన్న ముద్రారాక్షసం - 'కుచింపచేస్తున్న' కాదు 'కుంచింపచేస్తున్న'

    -----

    ఈ పరిచయం పూర్తి చేద్దామని: పోయినేడాది http://kothavakaya.blogspot.com/2011/03/blog-post.html (రాధ ఏమంది?) లగాయతు మీ పోస్టులన్నీ దాదాపుగా చదివేసాను [{నిజానికి ఆ రోజే http://kristnapaksham.blogspot.com/2010/08/blog-post.html లేదూ http://kristnapaksham.blogspot.com/2009/08/blog-post_13.html వంటి భావాలతో కృష్ణ గీతాలు పాడిన నా ప్రియసఖి (మీకు ఆ.సౌమ్య లా :) భావనతో కలిసి మరీ షేర్ చేసుకుంటూ చదివాము.} మీ రాధ ఏమంది? ఒక విధంగా నా పుట్టినరోజు కానుకగా పంపబడింది మరొక స్నేహితులోకారి ద్వారా ;) హమ్మో ఇంత కుట్ర జరిగిందా? అని విస్తుపోయారా...]. వ్యాఖ్యానించటానికి ఇంతాలస్యం అవటానికి కారణం ఉన్న కొద్దిపాటి తీరికలో అలిసాక చదవటం, మొక్కుబడిగా వ్యాఖ్య వదల్లేక తీరిక సమయాలకి వాయిదా వేయటం - ఇంతలో మీరు మరొకటి రాసేసి చదివినదాన్ని పాతది చెయ్యటం - నా లెక్క మళ్ళీ మొదలుకి రావటం ;) మీలా రాస్తున్నవారున్నంతకాలం, పఠనాసమయం విలువ పెరిగినట్లే ఉంటుంది.

    ReplyDelete
  20. @ శ్రీనివాస్ పప్పు: అంతేనంటారా! :) ధన్యవాదాలండీ!

    @ జ్యోతిర్మయి: ధన్యవాదాలు!

    @ తృష్ణ: నిజం.. కనీ కనిపించని విషాదం (అసలా పేరే అక్కర్లేదు.. మరేదో..) బావుంటుందండీ. కాఫీలో చిరుచేదులా..
    చదివించగలిగానంటే సంతోషమే! ధన్యవాదాలు!

    @ నిషిగంధ: టాటూ ప్రహసనం నచ్చిందా.. :) థాంక్ యూ!

    @ dvenkat: ధన్యవాదాలు!

    @ పద్మవల్లి: :) ధన్యవాదాలు!

    ReplyDelete
  21. @ MURALI: ధన్యవాదాలండీ!

    @ sinita: ధన్యవాదాలు!

    @ మధురవాణి: ధన్యవాదాలు!

    @ అవినేని భాస్కర్: ధన్యవాదాలు!

    @ సిరిసిరిమువ్వ: ధన్యవాదాలండీ! సున్నితత్వాలు కరువవడమయితే నిజంగా నిజం. మాట కరుకు - మనసు వెన్న అయినా పరవాలేదు. రెండూ బిరుసెక్కిపోతున్నాయి కదా!

    పదేళ్ళ తేడా ఉన్న పిల్లని అడగనూ అడగరూ.. జరగనూ జరగదు. అదో ఊహ.. ఆశ.. రాజేష్ ఖన్నా టాటూలా. ఆశకి గాఢత పెంచినదయితే జాలితో కూడిన అభిమానమే. అంతే.

    ReplyDelete
  22. @ మురళి: :) ధన్యవాదాలండీ!

    @ రాజ్ కుమార్: :) క్లుప్తతే కథకి కీలకం కదండీ! ధన్యవాదాలు.

    @ అవినేని భాస్కర్: :) ధన్యవాదాలండీ!

    @ puranapandaphani: ధన్యవాదాలు.

    @ Indira: తప్పకుండా ప్రయత్నిస్తానండీ! మీ ఆదరానికి ధన్యవాదాలు.

    @ వెంకట రాజారావు - లక్కాకుల: అయ్యా! ధన్యోస్మి!!

    @ Vasantham: ధన్యవాదాలు.

    ReplyDelete
  23. @ ఉష: ముందుగా "ఆహ్లాదకరమైన" కుట్రకి చాలా సంతోషం. :) ధన్యవాదాలు.

    << కుచించు >> - సంకుచించు ఉంది కదండీ!
    క్లుప్తత, స్పష్టత కోసమే నా తపన. అది కొంతైనా నెరవేరిందంటే నిజంగా సంతోషమే. మరో థాంక్స్! :)

    << తక్కువ మార్కులొచ్చిన..>> ఇది పిన్ని ఒక్కర్తే వచ్చిందని కాదండీ.. అప్పటికే అమ్మ కోపం వలన ఉన్న చిరాకు వల్ల పిన్ని వెనుక లోపలికి వెళ్ళలేని బెరుకు. ఇంకాస్త స్పష్టంగా రాయాల్సిందంటారా! సరైన పదం దొరికితే వేస్తానుండండి.

    కాక్క, నాన్న.. కథా గమనానికీ, ఇతర పాత్రలను చిత్రించడానికీ ఉత్ప్రేరకాలుగా మాత్రమే ఉపయోగపడ్డారండీ.

    మైథిలి విషయంలో మీరు అనుకున్నవన్నీ సరిగ్గా అనుకున్నారు. అయితే అంతకుముందు లేనిది ఆ క్షణమే బయటపడడానికి.. తెల్లారితే రిజిస్ట్రేషన్ + అదే సమయంలో ఫోటో - రెండూ కలిపి దోహదం చేసాయని చెప్పగలను. కనిపించేది అంతా నిజం కాదనీ, గలగల్లాడే మనుషులు లోతు తక్కువ వారు కాదని మీకూ తెలిసే ఉంటుంది. (రాఘవకి మాత్రం అప్పుడే తెలిసింది. అదే కదా కథ!) ఆ కోణానికి బలమివ్వడానికే రెండు చోట్ల చూచాయగా ప్రయత్నించాను కూడా.. (శౌరి - టాటూ, "నా కంటే మీ అమ్మకే బాధ ఎక్కువేమో" అని సాలోచనగా నొచ్చుకోవడం)నా ప్రయత్నం ఫలించినట్టేనా?

    తనని ఇమ్మని అడగడం జరగదనీ, తను చేసేదేమీ లేదనీ తెలుసు కనుకే "పదేళ్ళ తేడా.." అన్న ఒప్పుకోలు. ఆశ- ఆమెకి మావయ్య పట్ల ఉన్న జాలికి పరాకాష్ఠ, మనసు పొరల్లో ఉన్న infatuation కి ఓ vent.

    అవ్యక్తంగా చదువరి ఊహకే వదిలేద్దామనుకున్నవన్నీ మీరు వెచ్చించిన సమయం, మీ విశ్లేషణ వలన బయటపడ్డాయి. :) ధన్యవాదాలు!

    ReplyDelete
  24. @ sunita: మీ పేరు రాసేటపుడు టైపో .. :( మన్నించండి.

    ReplyDelete
  25. parlaedanDee:)) ee konchaanikae mannimpulu avasaramaa??ardham chaesukoegalanu.

    sunita.

    ReplyDelete
  26. బావుందండి..ఇప్పటికి మూడో సారి మీ ఈ కథ చదవడం.

    ReplyDelete
  27. చేయి తిరిగిన రచయిత్రి రచన లా వుంది మీ శైలి ...

    "కరి మింగిన వెలగపండు" పేరు ని relate చెస్కోటానికి చాలా రకాలుగా ఆలోచించాను...గల గలా మాట్లాడుతూ పైకి కూల్ గా కనిపించే మైథిలి లోపల చాలా లోతైన మరో మనిషి వుందనే అర్ధం తో అనిపించింది... ఆ పేరు పెట్టడం వెనక మీ అలోచన ఏవిటో చెబుతారా?

    ReplyDelete
  28. @ sunita: :)

    @ శ్రీ: ధన్యవాదాలండీ!

    @ స్ఫురిత:

    సిరి తా వచ్చిన వచ్చును
    సలలితముగ నారికేళ సలిలము భంగిన్
    సిరి తా పోయిన బోవును
    కరి మింగిన వెలగపండు కరణిని సుమతీ

    అని సుమతీ శతక కారుడు చెప్పాడు కదండీ. అలా సిరి వచ్చి వెళ్ళిపోయిన అతని జీవితాన్ని "కరి మింగిన వెలగపండు" అని పోల్చాను. బయట ఒకటి లోపల మరొకటి అన్న అర్ధంతో కాదు. మీ ప్రశంసకి ధన్యవాదాలు.

    ReplyDelete
  29. మీ ఈ కథ మొదటి సారి గబగబా చదివేశాను. తర్వాత నెమ్మదిగా క్రిందనున్న వ్యాఖ్యలు చదివాక నేను సరిగా చదవలేదని అనిపించింది. అందుకే ఇప్పుడు కొంచెం తీరిగ్గా చదివాను. బావుంది అని ఒక్క మాట లో తేల్చేయడానికి మనసొప్పలేదు. అలాగని ఏ పాత్రని విశ్లేషించాలని అనిపించలేదు. కానీ ఎందుకో తెలీదు కానీ నా చిన్ననాటి "నలుపు-తెలుపు" రోజులు గుర్తొచ్చాయి - ఆ రోజుల మనుషులలో ఆప్యాయతలు కళ్ళకు కట్టినట్టుగా మీరు చెప్తూ వుంటే (For some reason, if I think of my childhood days, I see them in "black & white" - maybe that's because of the black & white movies of those days :)) )

    అలాగే పల్లవి తప్ప మీ కథకి అంత సంబంధం వున్నట్టు కనిపించకపోయే ఒక పాట గుర్తుకొచ్చింది...

    ఆస్తులు - అంతస్తులు అనే సినిమా లో చంద్రమోహన్ నటించిన ...

    మిడిసి పడే దీపాలివి...
    మిన్నెగసి పడే కెరటాలివి...

    అనే పాట...వీలైతే వినండి - ఇళయరాజా వారి విషాదం కూడా ఎంత రొమాంటిక్ గా వుంటుందో అనిపిస్తుంది నా వరకూ :)

    ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ....మైథిలి లాంటి ఎంతో మంది ఆడపిల్లల తరపున ఒక చిన్న కన్నీటి చుక్క - మీ కథకి నా స్పందన.

    ~లలిత

    ReplyDelete
  30. అలాగే ఇంకొక్క మాట...ఆ రోజుల్లోనే కాదు, ఈ కథ ఏ రోజులదైనా పెద్దవారు చూసి చేసే పెళ్ళిళ్ళలో ఒక్కోసారి పదేళ్ళు తేడా అంత "పదేళ్ళతేడా " వంక చెప్పేంత పెద్దగా కనిపించేది కాదు...ఊరికే చెప్పాలనిపించింది - మీ భావన తప్పు అనిపించడానికి మాత్రం కాదు.

    ~లలిత

    ReplyDelete
  31. meeru rasevanni intha bavuntayi entandi??
    Bhojanam lo ruchi, kammadanam anevi okela vinipinche veru veru anubhutulu... meeru danni rachanalloki teesukochharu ippudu...
    rendru rojulaki okasari vachhi mee paata post lu chaduvukuni veltanu kani, eppudu comment pettananta baddakam.. ivala adi kooda daatipoyindi...

    first mamayya gurinchi chebtunte jaali anukunnanu... aa badha lo prema, tane mavayya bharya ayyi unte ila jarigi undedi kademo anna feeling..
    Okka mata inni cheppagalada??
    you are a class apart!!

    ReplyDelete
  32. ఆవకాయ తింటూ మీ కథ చదివేసాను....చివరికి...కారం కారం గా చేసారు...నాకెందుకో ఆవిడ సంవత్సరాల ప్రేమ...నేను చేసుకుని ఉంటె ఇలా అయి ఉండేవారు కాదేమో అన్న భావన స్పురించింది.

    ReplyDelete
  33. చాలా చాలా నచ్చింది. బాగా రాసావ్. కామెంటు పెట్టడం కాస్త ఆలశ్యమైంది :)
    ఈ నిషాలో ఇంకో నాలుగైదు రాసేయొచ్చుగా. :)

    ReplyDelete
  34. @ లలిత: మీరు ఇళయరాజా అంటున్నారు. నాకు మాత్రం యేసుదాసే వినిపిస్తాడు. :) నిజంగా మిడిసిపడే దీపాలే కదా.

    అవును. ఐదేళ్ళ తేడా ఉన్న అక్క ముందు లేకపోతే పదేళ్ళ తేడా ఎక్కువేం కాదండీ.. నిజమే! మీరూహించిన నలుపూ తెలుపూ కాలంలో అయితే ఆ పట్టింపే ఉండేది కాదేమో కూడా. (నేనూ కొన్ని నలుపు తెలుపుల్లోనే ఊహించుకుంటాను.) ఓపికగా మళ్ళీ చదివినందుకు ధన్యవాదాలు! :)

    @ pallavi: మీ బధ్ధకాన్ని దాటించగలిగినందుకు సంతోషంగా ఉంది. :) కథని చదివి అనుభూతించినందుకు ధన్యవాదాలు.

    @ శేఖర్: అన్ని సంవత్సరాల ప్రేమ అయితే కాదు కానీ అదో పేరు పెట్టలేని భావన. ఇంకెవరికీ అతనిపై లేని జాలి.. ఆమెకు మాత్రమే ఉంది మరి. ధన్యవాదాలు.

    @ ఆ.సౌమ్య: నిషావా ఇంకేమన్నానా? నాలుగైదా!! భలేదానివే! :) ఆలస్యం నేను లెక్కపెట్టుకోను. మళ్ళీ అందించిన అభినందనలకి చాలా థాంక్స్.

    ReplyDelete
  35. ఇక్కడ సౌమ్య గారు మరియు కొత్తావకాయ గార్ల కామెంట్లు చదివాక నాలో సందేహాలరావు నిద్రలేచాడు..,
    "ఆలస్యం" కరెక్టా? "ఆలశ్యం" కరెక్టా?

    గూగులమ్మ ని అడిగితే రెండిటికీ సమాన న్యాయం చేసింది.
    http://www.google.co.in/search?q=ఆలశ్యం
    https://www.google.co.in/search?q=ఆలస్యం

    ReplyDelete
  36. Brilliant.
    రాజారావుగారి ఆటవెలది డిటోడిటో

    ReplyDelete