Friday, August 15, 2014

ఆశ

"ఇదేవిట్రా! నేనుండగా చూడాల్సినవా ఇవన్నీ.."

లక్ష్మికి టైఫాయిడ్ తిరగబెట్టి ఎమర్జెన్సీలో ఉందని తెలిసినరోజు, బస్ దిగుతూనే నన్ను చూసి బావురుమన్న అక్క మొహం ఇంకా కళ్ళముందే కదులుతోంది. ఎంత బెంగ పెట్టేసుకుందని! తన కాళ్ల నొప్పుల్ని కూడా లెక్కచేయకుండా పసిపిల్లకి చేసినట్టూ సేవచేసి, మంచానికి అతుక్కుపోయిన లక్ష్మిని మళ్ళీ మనిషిని చేసింది. బావ నెలల తరబడి ఒక్కడే ఉండి వండుకు తింటూ, వస్తూవెళ్తూ అన్నిరకాలుగానూ ఎంత సహకరించాడో! ఆయన కలిసి రాబట్టేగా..

ఆలోచనల్ని తెగ్గొడుతూ ఆటో ఆగింది. జేబు తడుముకుని డబ్బులు తీసిచ్చి, క్షణకాలం ఇంటి ముందు నిలబడిపోయాను. రంగు వెలిసిపోయి, పెచ్చులూడిన వీధిగేటుని చూస్తే చెయ్యాల్సిన పనులు చాలానే ఉన్నాయనిపించింది. సందువైపున్న కుళాయి విప్పుతూనే బుస్ మంటూ గాలి, వెంటనే వేడి నీళ్ళు.. గబగబా కాళ్ళు కడుక్కుంటూ ఉండగానే గ్రిల్ తలుపు చప్పుడయ్యింది. డోర్ మేట్ మీద కాళ్ళు రాసుకుంటూ చేతిసంచీ లక్ష్మికి అందించాను. 

"ఏమన్నారు?" మంచినీళ్ళు అందించి పక్కన కూర్చుంది. 
నిజాన్ని దాచడం కంటే అబద్ధం చెప్పడం కష్టం.
"ఇంకో టెస్ట్ రిజల్ట్ రావాల్ట. వస్తే ఆయనే ఫోన్ చేస్తానన్నారు."
"వెళ్ళక్కర్లేదా?"
మాటలు తూచి వేయడానికి కాస్త సమయం పడుతోంది నాకు.
"ఏమో లక్ష్మీ, ఆయన ఫోన్ చేస్తే తెలియాలి. ప్రస్తుతానికి ఉన్న మందులే వాడమన్నారు. అయిపోయిన రకం తెచ్చాను."
నిట్టూర్చింది.

"రండి బోయనానికి.." లక్ష్మి లేచి వంటింట్లోకి నడిచింది.

"అక్క ఫోనేమైనా చేసిందా?"
"లేదు.."
"ఈ విషయాలేవీ చెప్పకు."
సమాధానం రాలేదు. చెప్పేసిందా కొంపదీసి!

"ఊరికే గాభరా పడుతుంది. అసలే బీపీ మనిషి." బట్టలు మార్చుకోడానికి వెళ్తూ చెప్పాను. 

***

భోజనం కానిచ్చి పడక్కుర్చీలో వాలాను. ఆయాసంగా ఉంది. కలిపిన కూరా అన్నం సగం కూడా తినలేకపోయాను కానీ ఆయాసం. కింద కూర్చుంటే బావుండనిపిస్తోంది కాసేపు. ముందు గదిలో పేముసోఫాకి చారబడి టీపాయ్ మీదున్న పేపర్ అందుకుని తిరగేద్దామనుకునేలోగా పవర్కట్.. ఇష్షో..

నుదిటి మీద చెమటని తుడుచుకుని చెయ్యి దించుతూ చూసుకున్నాను.. ఎడమచేతి మణికట్టుకి కాస్త పై భాగంలో నీలంగా కవిలినట్టూ మచ్చ. ప్చ్..  మరోటా!

"శనగపిండి వాడికి పడదమ్మాయ్! తెలుసు కదా? పొరపాటున కలిసినా దద్దుర్లొచ్చేస్తాయ్. గుర్తెట్టుకో.. ఊరుకాని ఊరిలో మాకు దూరంగా ఉండాలింక. జాగ్రత్త."  ఏనాడో కొత్తకాపురంలో తిరగేసి లక్ష్మికి నా గురించి అప్పగింతలు పెట్టి ట్రైనెక్కిన అక్క గుర్తొచ్చింది. 

అబ్బా.. ఏంటిది? ప్రాణభయమా!

ఆమధ్య ఓ రోజు ఉదయం స్నానానికి వెళ్ళబోతూంటే, వెనకనుంచి లక్ష్మి గావుకేక వినిపించి హడిలిపోయాను. అరచేతి మేర మచ్చ.. నా వీపు మీద. 

"ఏమయిందండీ! ఎక్కడైనా పడిపోయారా! ఏం తిన్నారు బయట?" పదే పదే అడుగుతూనే ఉంది. లేదంటే నమ్మదే! 

డ్రసింగ్ టేబుల్ వైపు వీపు పెట్టి, చేతి అద్దంలో చూసుకుంటే కనిపించింది. కానీ అర్ధం కాలేదు.. అలా కవుకు దెబ్బలా ఎలా కమిలిపోయిందో! నొప్పి లేనే లేదు! ఆరోజు రాత్రే.. నిద్దర్లో వణుకు. చలిజ్వరమేమో అనుకుని పేరాసెటమాల్ వేసుకున్నా లాభం లేకపోయింది. పక్కింటి సురేష్ హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. వారానికి జ్వరం కంట్రోల్ అయింది. అప్పట్నుంచీ అడపా దడపా వచ్చిపోతూనే ఉంది. రోజులు గడిచి ఇలా.. ఈరోజు..

చేతులు తుడుచుకుంటూ మాత్రలు, మంచినీళ్ళు తెచ్చిచ్చింది. 
"వదినకి చెప్పలేదు కానీ.."
"ఊ.."
"గౌతమ్ అడిగాడు." చెప్పింది లక్ష్మి.
"ఫోన్ పట్రా.. "

చెప్పీ చెప్పకుండా విషయం చెప్పి, "మీ అమ్మకి ఎట్టిపరిస్థితిలోనూ తెలియనివ్వకురా.. అన్నట్టది వినాయక చవితికి ఇక్కడికి వస్తానంటోంది. మళ్ళీ ఆ టైం కి ఏ టెస్ట్ లైనా ఉంటే దాచలేం. తెలిస్తే గోల పెట్టేస్తుంది. నా ఆరోగ్యం సంగతెలా ఉన్నా అది కూలబడితే కష్టం. కుదిరితే నీ దగ్గరకి పిలుచుకో. ముంబైలో వినాయకచవితి ఇంకా సందడి కదా!" అన్నాను. అలాగే చూస్తానని జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసాడు వాడు.

లేచి నిలబడితే ఒళ్ళు తూలుతోంది. కుదుపు ఆపుకోలేక నెమ్మదిగా లేచి మంచం మీదకి చేరాను. ఏమౌతోంది లోపల? రక్తం కణాలుగా వడివడిగా విడిపోతూ.. 

***

మగతగా ఉంది. లీలగా లక్ష్మి మాటలు వినిపిస్తున్నాయ్. ఫోన్ లో మాట్లాడుతోంది. 

"పక్కింటి వాళ్ళ కోడలిది ఈ ఏడు ఉద్యాపన ఉందండీ.. "
అక్కతోనే..
***

"వాళ్ళు రమ్మంటే మీరు వెళ్ళిపోవడమేనా! ఉత్తరమ్ముక్క వేసి ఊరుకోడం కాదు. తొలిసారి పండక్కి తీసుకెళ్ళడానికి మనిషి రావాలి. ఏమీ..  వాళ్ళ అన్నగారున్నాడు కదా? గాడిదలు కాస్తున్నాడా! వచ్చి వెంటపెట్టుకు వెళ్ళచ్చే.. పద్ధతీ పాడూ లేదేంటి? పెళ్ళి చేసి చేతులు దులిపేసుకుంటే చాలా?" నాన్న కోపంతో ఊగిపోతున్నారు. 

ఏం మాట్లాడాలో తెలియక బిక్కమొహం వేసిన నన్ను అక్కే కాపాడింది. లక్ష్మి వంటింట్లోంచి బయటికి తొంగికూడా చూడలేదు.

"వాళ్ళకి పద్ధతి తెలియదనుకోండీ నాన్నా, మీరు ఈ మాటలే ఓ ఉత్తరం రాసి పడేయచ్చు కదా! నాల్రోజులై సాధించిపోస్తున్నారు పాపం వీళ్ళని. వాళ్ళకుండాలి కానీ పిల్లలేం చేస్తారు.. "

ఇంకేం మాట్లాడలేదు నాన్న. ఇంట్లో అక్కమాట రాజశాసనం. అక్కా సమర్ధురాలే. లక్ష్మికి అన్నీ తనే నేర్పుకుంది. వంటలో మెళుకువల నుండీ చీరకట్టు దాకా అంతా అక్క తర్ఫీదే! తోడబుట్టిన ఆడపిల్ల ఉన్న ఊళ్ళోనే ఉండడం ఎంత సుఖమో నా పెళ్ళయ్యాక మళ్ళీ మళ్ళీ తెలుస్తూ ఉండేది.

"నీ పెళ్ళాం మంచిదిరా. మప్పితంగా ఉంటుంది. పుట్టింటి ఊసెత్తదు పాపం. వాళ్ళు మూర్ఖులే కానీ ఈ పిల్ల మనలో బాగా కలిసిపోయింది. దాన్ని కష్టపెట్టకు. చిన్నది.. సర్దుకో." పెళ్ళైన ఏడాది తరువాత ట్రాన్సఫరై వేరు కాపురం పెట్టుకున్నప్పుడు పాలుపొంగించి వెళ్తూ చెప్పిందక్క. అంతిష్టం అక్కకి లక్ష్మంటే. 

***

"సబ్జా గింజలు చలవచేస్తాయన్నారు వదిన. నిమ్మరసంలో వేసి ఇవ్వనా?" 
ఇక దాచలేననిపించింది. 
"కూర్చో ఇలా.." చెయ్యందించాను. 
"జ్వరంగా ఉందా?" ఆందోళనగా చెయ్యి పట్టుకుంది.

"ఉహూ.. మరీ ఏభై ఏళ్ళ వాళ్ళకి రావడం అరుదేనట కానీ, ఎమ్ డీ ఎస్ అనీ.. ఏదో రక్తంలో తేడాట. కొత్త రక్తం పెట్టేలా జాగ్రత్తగా ఉండాలి. మరీ అవసరమైతే.." ఆగాను.
లక్ష్మి కళ్ళలో భయం పెద్దదవుతోంది. 
"రక్తం మారుస్తూండాలన్నారు. పర్లేదు. డాక్టర్లున్నారు." ధైర్యం చెప్పుకున్నాను.

నిశబ్దం.. లక్ష్మి ఏడిస్తే బావుండుననిపించింది. 
***

నాలుగేళ్ళ క్రితం తిరుమల దర్శనం క్యూలోనుండి బయటికి వచ్చి, విమాన వేంకటేశ్వరుడిని చూద్దామని వెళ్తూంటే ఉన్నట్టుండీ కెవ్వుమంది లక్ష్మి. బోసిగా ఉన్న మెడని తడుముకుని అయోమయంగా చూస్తోంది. పాపం పుణ్యం వెంకన్నకే తెలుసనుకుని బయటికి వచ్చేసాం. పసుపు తాడు కొని మెళ్ళో వేసుకుని, బంగారుగోపురం వైపు తిరిగి దణ్ణం పెట్టింది.

"బోలెడు పుణ్యం నీకు. నిలువుదోపిడీ అనుకో" అని నవ్వాను. 
"మీ జేబుకే కదా చిల్లు! పుణ్యమూ మీదే." నవ్వేసింది నొచ్చుకుంటూ

ఆ యేడాది శ్రావణమాసానికి శాస్త్రానికి కొందామనుకున్న బంగారం కాస్తముందే, కాస్త ఎక్కువే కొన్నాను.. లోన్ పెట్టి. ఇలా ఉంటే నాల్రోజులు చూసి వలంటరీ తీసుకోవడమా? ఎంతుంది.. ఎంతొస్తుంది? ఎంత అవసరమవుతుంది? తెల్లవారుఝాముకి ఆలోచనలు కాస్త చిక్కులు విడినట్టనిపించింది.

***

గౌతమ్ ఏం చెప్పాడో కానీ, మర్నాడు సాయంత్రానికి అక్క ఆటో దిగింది. ఆశ్చర్యపోతూ నావైపు చూస్తున్న లక్ష్మికి కళ్ళతోనే కర్తవ్యబోధ చేసాను. అనారోగ్యం పెద్దదేం కాదని నేను ఎలా నటించానో, లక్ష్మి అంతలానూ సహకరించింది. కళ్ళ నీళ్ళు ఆపుకుంటూ, భయంతో, ప్రశ్నలతో వచ్చిన అక్కని, సర్దిచెప్పి రెండ్రోజుల్లో బయలుదేరదీశాను. శుక్రవారం సాయంత్రం డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మరి. 
***

లక్ష్మి పాదాలు నాకిష్టం. ఇంట్లో తను తిరుగుతూ ఉంటే వచ్చే శబ్దం ఇంకా ఇష్టం. సాయంత్రం దాకా వింటూనే గడిపేసాను. డాక్టర్ దగ్గరికి తనూ వస్తానంది. హాస్పిటల్ కారిడార్లో నా అడుగుల చప్పుడుతో కలిసి తన అడుగులు..  ధైర్యంగా అనిపించింది.

***

నైట్ లేంప్ వెలుగులో మా బెడ్రూమ్ పెట్టెలా ఉంటుంది. ఇదేమాట ఓసారి చెప్తే లక్ష్మి నవ్వింది... అగ్గిపెట్టా అని. భోషాణప్పెట్టె అన్నాను.

లక్ష్మిని దగ్గరకి తీసుకున్నాను. నా ఎడమ భుజం మీద తలపెట్టుకోబోయి ఆగింది. పరవాలేదన్నట్టు పొదువుకున్నాను. 

"అమ్ములూ.."
"..."
"ఏమిచ్చాను?"
"ష్..."
"ఏం కావాలి?"

చాలాసేపటి తరువాత వెక్కిళ్ళు.. నావో, తనవో తెలియలేదు. 

"అన్నయ్య.." తడిసిన మాటలు లక్ష్మి గొంతులోంచి అస్పష్టంగా..
"ఏవిటీ?"
మాట్లాడలేదు తను. 

"ఉదయం మాట్లాడుదామా?" నెమ్మదిగా అర్ధం చేసుకుని అడిగాను. 
"ఉహు.."
"మరి?"

"మీలాంటి అన్నయ్యుంటే బావుణ్ణు.."

11 comments:

  1. మామూలే ! టచ్ చేసారు హృదయాన్ని

    ReplyDelete
  2. మొత్తం కథంతా ఓ ఎత్తు.. ముగింపు ఒక్కటీ ఒక ఎత్తు.. కొంచం సమయం పట్టింది తేరుకోడానికి..
    అభినందనలండీ!!

    ReplyDelete
  3. మీ కథ అర్థం చేసుకోవడానికి మరీ ఐదు సార్లు చదవలసి వచ్చింది. మంచి పాఠకుడనే గర్వం మొత్తం పోయింది. మరీ ఇంత కష్ఠం గానా రాయడం. చాలా చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. భలేవారండీ. పాఠకుల ప్రజ్ఞ తక్కువదా! ధన్యవాదాలు.

      Delete
  4. చిట్టావదంలా బుర్రకి పట్టేసింది. మరీ ఇంతద్భుతంగా రాస్తే ఎలా మేడం గారూ. - rsekhard@yahoo.com

    ReplyDelete
    Replies
    1. చిట్టావదం!? ఇదేదో మా ఊరి గొంతులా వినిపిస్తోందే! ధన్యవాదాలు.

      Delete
  5. చాలా హృద్యంగా ఉందండీ! ఆర్ధ్రమైన ముగింపుతో మనసంతా భారమైపోయింది!!

    ReplyDelete
  6. చాలా బాగా రాసారండి. ముఖ్యంగా లక్ష్మి పాదాలు నాకిష్టం .......
    అది ఎంతగానో హత్తుకుందండి.

    ReplyDelete
  7. ఇన్నిన్ని అగాధాలో! ఇప్పుడు మరింత బాగా.... ఓ మంత్రం దండం కావలనిపిస్తోంది.

    ReplyDelete