Tuesday, February 10, 2015

ఎంతెంత దూరం?? ~ 1

నీలి తెరలను దాటి కిటికీలోంచి పడుతున్న వెలుగుకి కళ్ళుతెరిచింది వికా. 

తలగడ కిందకి పెట్టుకున్న కుడిచేయి తిమ్మిరిగా అనిపించి.. నెమ్మదిగా చేతులు సాగదీసుకుంటూ ఒళ్ళువిరుచుకుంది. బీజ్ రంగు గోడకి ఆన్చి ఉన్న వాలుకుర్చీని చూడగానే నిద్రమత్తంతా వదిలిపోయిందామెకు. ఇష్టంలేని విషయాన్ని తలుచుకోవడం వాయిదా వేయాలనే ప్రయత్నమన్నట్టూ కళ్ళు మూసేసుకుంది.  క్షణాలు గడుస్తున్నకొద్దీ పొద్దుటెండ చురుక్కున పొడుస్తోంది. అలా పరుపులోకి కూరుకుపోతే బావుండుననుకుంది.

"హనీ.."

ఆమె వీపుకి మొహం ఆన్చి దగ్గరగా లాక్కుంటూ వెనుకనుంచి పిలిచాడు ఏడెన్. ఇంకాగలేనట్టు కన్నీళ్ళు జారిపోయాయి వికా కనుకొలకుల్లోంచి.

***

రౌట్ సిక్స్ మీద ఎగ్జిట్ ఫార్టీ తీసుకోగానే ఉంటుంది హాట్ క్రీక్. ఘోస్ట్ టౌనే కానీ ఇప్పుడిప్పుడే అలికిడి పెరుగుతోంది. ఊళ్లోకి కొత్తగా వచ్చి చేరిన ఒకట్రెండు టింబర్ డిపోలు, రెస్టోరేషన్ షాప్ ల వల్ల జనసంచారం మొదలయింది. ఊరవతల మైనింగ్ మొదలవుతుందనే వార్త పుట్టాక రెండువందల మైళ్ళ దూరంలో ఉన్న మెరిల్ రాంచ్, కంట్రీ క్రీక్ ల నుంచి రాకపోకలూ బాగానే పుంజుకున్నాయి.

ఆ చిన్న ఊళ్ళో పొద్దుపోయాక హడావిడంతా కస్మోపాలిటిన్ నైట్ క్లబ్ లోనే. ఎనభై ఏళ్ళ వయసున్న ఆ పబ్ ని వేర్ హౌస్ స్టైల్ లో మరమ్మత్తులు చేయించాక కుర్రకారు బాగా చేరుతోందక్కడ. ఓ చలిచలి వారాంతపు రాత్రి స్నేహితులతో కస్మోపాలిటిన్ లో గడిపి బయటికి వచ్చి, పార్కింగ్ లోంచి కార్ తీసి రివర్స్ చేస్తూ.. తనకు కుడివైపు పార్క్ చేసి ఉన్న వేన్ బంపర్ స్టికర్ ని యధాలాపంగా చదివింది వికా. కొంతదూరం వెళ్ళాక ఒక సిగ్నల్ దాటుతూండగా తన పక్కగా అదే వేన్!! కుతూహలంగా చూసింది. మామూలు కంటే కాస్త నెమ్మదిగా నడుపుతూ గమనిస్తోంది కానీ ఆమెని అస్సలు పట్టించుకోకుండా ముందుకు దూసుకుపోయిందా వేన్.

'సే మై నేమ్.. సే మై నేమ్.. ' అని సన్నగా హమ్ చేస్తూ సీడర్ ఏవ్ వైపుకి తిరిగింది. ఆరోజు రాత్రి నిద్రపట్టే ముందు ఆమెకి మళ్ళీ ఆ బంపర్ స్టికర్ గుర్తొచ్చింది. "Four out of three people have trouble with fractions"

మరో పదిహేనురోజుల తరువాత కస్మోపాలిటిన్ లోకి వెళ్తూండగా మళ్ళీ ఆ వేన్ తారసపడింది వికా కి.. ఈసారి అందులోంచి దిగి క్లబ్ లోకి నడుస్తున్న యువకుడు కూడా స్పష్టంగా కనిపించాడామెకు. అయస్కాంతంలా ఆకర్షించే తన నవ్వుతో, లేతాకుపచ్చరంగులో తళతళా మెరిసే కళ్ళతో మిడిసిపడే వికా, ఏడెన్ దృష్టిలో పడేందుకు పెద్దగా కష్టపడక్కర్లేకపోయింది. సరిగ్గా రెండు డేట్ల తరువాత తన ఇంట్లో ఆ బీజ్ రంగు గోడల మధ్య గడిచిన రాత్రి చెప్పింది.. మొదటిసారి తను ఏడెన్ ని ఎక్కడ చూసిందో. ఆశ్చర్యపోయాడతను.

"ఫ్రాక్షన్స్ తెలిస్తే ఫర్నిచర్ ఎందుకు చేస్తాను? ఐ హేట్ మేథ్. అయినా ఆ స్టికర్ అతికిస్తూ అస్సలు అనుకోలేదు తెలుసా.. ఓ అందమైన అమ్మాయి దాన్ని చూసి నవ్వుకుంటుందని.." బెడ్ లాంప్ వెలుగులో మిసమిసలాడుతున్న ఆమెను చూసి కళ్ళు మెరిపిస్తూ చెప్పాడు.

***

వికా అచ్చం వాళ్ల నాయనమ్మ ఏనా లాగే ఉంటుందని బాగా దగ్గరివాళ్లు అంటూంటారు. మొండితనం కూడా నాయనమ్మ పోలికేనని గ్రాండ్ పా డేనీ దెప్పుతూ ఉంటాడు. 

ఆర్మీలో పనిచేసి కాలుపోగొట్టుకుని వెనక్కి వచ్చిన ప్రియుడు డేనీని చూసి, ఏనా  అస్సలేడవలేదట. పైగా.. వాళ్ళ పెళ్లిలో క్రెచెస్ సాయంతో నిలబడ్డ డేనీని అమాంతం పైకెత్తి ముద్దు పెట్టుకుందని చెప్పుకుంటారా ఊళ్ళో. వికా చిన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకుని ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. మనవరాల్ని పెంచుకుంటామని ముసలివాళ్ళిద్దరూ అడగడమే చాలన్నట్టు ఒప్పుకుని వికాని విడిచిపెట్టేసారు. 

ఆ అమ్మాయి హైస్కూల్ లో ఉండగా శాశ్వతనిద్రలోకి జారుకుంది  గ్రానీ ఏనా. ఎనభైల్లోకి వస్తూ కూడా హుషారుగా సీనియర్ సిటిజన్స్ హోమ్ నడుపుతూ ఉంటాడు గ్రాండ్ పా డేనీ. 

***

కస్మోపాలిటిన్ బయట సిగ్నల్ దగ్గర ఏడెన్ ని వికా చూసిన రోజునే, ప్రతీ యేడాదీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. మొదటి ఏడాది వెగాస్ ట్రిప్ కి వెళ్ళారిద్దరూ. రెండో యానివర్సరీ ముందు వికా కి న్యుమోనియా వచ్చింది. పదిరోజులు హాస్పిటల్ లో ఉండి డిస్చార్జ్ అయి ఇంటికొచ్చిన ఆమెని జాగ్రత్తగా పొదివి పట్టుకుని గదిలోకి తీసుకొచ్చాడు ఏడెన్. మంచానికి ఎడమవైపు గోడకి ఆన్చివేసిన వాలుకుర్చీలో కూర్చున్న పావుగంటకి గమనించింది.. తన గదిలోకి కొత్తగా వచ్చిన ఆ వస్తువుని. 

ఏడెన్ స్వహస్తాలతో తయారుచేసిన ఆ కుర్చీ ఆ రోజు నుండీ ఆమెకు ప్రాణప్రదం. అవును మరి! వర్క్ షాప్ లో పని అయ్యాక, అతను పదిరోజుల పాటు రోజూ రెండేసి గంటలు కష్టపడితే తయారైన రూపమది. ఆ వుడ్ కూడా నాలుగు నెలల క్రితమే కొని ఉంచాడు. సాల్వేజ్ అని మొదట సంశయించినా దాని మహాగనీ షేడ్ బాగా నచ్చేసిందతడికి. రెండో యానివర్సరీ గిఫ్ట్ గా ఇద్దామనుకున్నది.. కాస్త ముందుగానే అలాంటి సందర్భంలో ఇవ్వాల్సివచ్చినందుకు బాధపడ్డాడతడు. ఆ సందర్భం వచ్చినందుకు వికా మాత్రం చాలా సంతోషించింది.

సరిగ్గా మూడో ఏడాది నిండుతూండగా...  ఏడెన్ ఊరు కదలాల్సి వచ్చింది.

***
"ఆర్ హెచ్ లో అవకాశం ఊరికే రాదు హనీ.." వికా కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పాడు ఏడెన్.

"మరి మనం..?" అనబోతున్న మాట సగంలోనే తుంచేసిందామె.

"హాలీవుడ్ స్టార్స్ వాడే ఫర్నిచర్ ఆర్ హెచ్ అంటే.. ఒక్క ఏడాది అక్కడ చేసానా..!"

"అక్కడ చేసాక వెనక్కెలా వస్తావు..?" అని వికా అడగలేదు. మౌనంగా ఉండిపోయింది.

పుట్టి పెరిగిన ఊరునీ, హోమ్ లో ఉన్న గ్రాండ్ పా నీ వదిలి ఆమెను రమ్మని అతనూ అడగలేదు.

***
"నెలకోసారైనా వస్తాను కదా.. కాస్త సెటిల్ అయ్యాక నువ్వైనా రావొచ్చు." కాఫీ మగ్ నింపుకుని బ్రేక్ ఫాస్ట్ బార్ దగ్గర కూర్చుంటూ చెప్పాడు. 

ఎదురుగా కూర్చుంది. మౌనంగా క్షణాలు దొర్లిపోతున్నాయి. 

"నమ్మకంలేదా నా మీద?" అడగాలనుకున్నాడు. 

లేచి అతని వీపుమీదకి వాలి చెంపకి చెంప ఆన్చి మెడచుట్టూ చేతులువేసింది.

"వాట్ డూ యూ వాంట్ మీ టు డూ..?" కాస్త చిరాకు, నిస్సహాయత అతని గొంతులో..

"నథింగ్.. ఇంకా ఏం పేక్ చేసుకోవాలి?"

***
సిల్క్ లా తాకే ఆమె ఒళ్ళు, నవ్వే ఆ పెదవులు విడిచిపెట్టి.. దూరంగా కొన్ని వందల మైళ్ళ దూరంలో ఒంటరిగా రోజులెలా గడపాలో ఏడెన్ కీ అర్ధం కాలేదు. ఏదో మొండితనం నడిపిస్తోందతన్ని ఆ క్షణం దాకా. తనకి కావలసినవన్నీ వేన్ లో వేసుకుని ఇంట్లోకి వచ్చాడు. తను వెళ్ళిపోతున్నాడనే ఆరోజు వర్క్ కి వెళ్ళలేదు వికా. బెడ్ రూమ్ లో ఏవో సర్దుతోంది.

"హనీ.."

"..." 

"టేక్ కేర్.." 

దగ్గరగా వచ్చి వికా పెట్టిన ముద్దు చాలా పొడిగా అనిపించిందతడికి. విలువైనదేదో చేజేతులారా జారవిడిచేసుకుంటున్నాననే ఫీలింగ్.

"హానీ.. ఐ లవ్ యూ.. "
"ఇట్ వోంట్ వర్కౌట్ ఏడెన్.." నెమ్మదిగా, స్పష్టంగా చెప్పింది.
"ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది?"
"డోంట్ నో.."
"నాతో వచ్చేయమని ఎలా అడుగుతాను నిన్ను..?"
"తెలుసు.."
 "హనీ.." చేతుల్లో బంధించాడామెని. సున్నితంగా విడిపించుకుంది.

"వచ్చేస్తాను. ఒక్క ఏడాది నాకోసం ఎదురుచూడలేవా?"
"చాలా మారిపోతాయ్ ఏడాదిలో.. సీజన్స్ తో పాటు.."
"నన్ను నమ్ము.. నేను మారను. మనం ఎప్పటికీ ఇలాగే ఉంటాం."
మాట్లాడలేదు వికా.

"ఆల్రైట్.." పెదాలు బిగించాడు. 

వేన్ దాకా తనతో వచ్చిన వికాతో చివరిమాట సూటిగా చూస్తూ చెప్పాడు.

"అర్ధంచేసుకుంటావనుకున్నాను.. "

పెదవి కొరుకుతూ ఆలోచించిందో క్షణం. క్షణాల్లో ఇంట్లోకెళ్ళి బయటికొచ్చింది.. చేతిలో చిన్న బోనుతో.

అందులో సరిగ్గా అరచేతిలో పట్టేంత పరిమాణంలో.. మెరిసే కళ్ళతో చూస్తున్న ఓ జంతువు ఉంది. 

"గ్రాండ్ పా కి ఇవ్వమని నిన్నే ఆంట్ లిండా పంపింది. నువ్వు తీసుకెళ్ళు.."
"వాట్!!" అర్ధం కానట్టు అడిగాడు.
"డోంట్ కిల్ హర్.. ఏడాది పెంచు. నీ కమిట్ మెంట్ నేనూ చూడాలి కదా!" నవ్వింది.
"కమాన్!! దిసీజ్ రిడిక్యులస్ హనీ.."
"ఓ పెట్ కే కమిట్ అవలేని వాడివి, ఏడాది తరువాత నాకోసం వస్తావని ఎలా నమ్మాలి? అయినా చిన్నప్పుడు పిల్లిని పెంచేవాడివని చెప్పావు కదా!"
"అది నేను కిండర్ గార్టెన్ లో ఉన్నప్పుడు!! వెళ్తున్నది న్యూ ప్లేస్. హౌకెనై..?" దాదాపుగా అరిచాడు ఏడెన్. 
"ఏడాది... ఎదురుచూస్తాను. సరేనా? ఈ ఏడాది మనం అస్సలు కలవద్దు."
"ఏంటిది? కలవకుండా.." మాట పూర్తిచేయనే లేదతను. 

బోను వేన్ వెనుక సీట్లో పెట్టి, బకిలప్ చేసింది. దారి ఇస్తూ పక్కకి నిలబడి చెప్పింది..

" బై లవ్.. డ్రైవ్ సేఫ్.. "

***
ఐదుగంటల డ్రైవ్ తరువాత ఒక గేస్ స్టేషన్ దగ్గర ఆగాడు ఏడెన్. 

గేస్ ఫిల్ చేసి పక్కగా ఉన్న పార్కింగ్ లాట్ లో వేన్ ఆపి, కార్ అద్దాలు కిందకి దింపాడు. పక్కన ఆగి ఉన్న కార్లోంచి దిగిన ఓ నడివయసువ్యక్తి ఏడెన్ ని చూసి పలకరింపుగా నవ్వాడు. ఏడెన్ వేన్ లోంచి ఖాళీ కోక్ టిన్, టిష్యూస్ లాంటి ట్రాష్ బిన్ లో వేసి వచ్చేలోగా ఆ వ్యక్తి అక్కడే నిలబడి సిగరెట్ అంటించి తన వేన్ లోకి చూస్తున్నాడు. ఏం చూస్తున్నావని దురుసుగా అడగబోయాడు ఏడెన్. 

"స్మెల్స్ లైకే కిట్.." ఏడెన్ రాకని గమనించి నవ్వాడతను.
"ఇటీజె కిట్.." చెప్పాడు ఏడెన్.
"ఓహ్..  నువ్వు కేలిఫోర్నియా వెళ్తున్నానని మాత్రం చెప్పకు." గట్టిగా నవ్వాడతను.
"యామై మిస్సింగ్ సంథింగ్? నేను కేలిఫోర్నియానే వెళ్తున్నాను. ఎమరీవిల్.."
షాక్ తగిలినట్టు చూశాడావ్యక్తి.

"ఆర్ యూ క్రేజీ! ఫెరెట్ ని తీసుకెళ్తున్నావా కేలిఫోర్నియాలోకి!!" 

సిగరెట్ కింద పడేసి ఏడెన్ వేన్ లో వెనక సీట్ లో స్ట్రాపాన్ చేసి ఉన్న బోను వైపు పరీక్షగా చూశాడతను. గులాబీరంగులో ఉన్న ఆ చిన్న ప్రాణి దగ్గర నుంచి అదోలాంటి వింత వాసన. గుండ్రంగా ముడుచుకుని నిద్రపోతోందది.. చిత్రమైన శబ్దాలు చేస్తూ. 

***

(దూరం పెరుగుతున్నదిప్పుడే కదా..! ఇంకా ఉంది.)

13 comments:

 1. Replies
  1. ధన్యవాదాలు! తరువాయి భాగంలో తెలుస్తుంది కదండీ.. :)

   Delete
 2. ఫెరెట్స్ గురించీ, కాలిఫోర్నియా లా గురించీ బోలెడు తెలుసుకున్నానండీ. కాస్త తరువాయి భాగం ఏ రోజు రాబోంతోందో చెపుతూ వుండురూ...

  ReplyDelete
  Replies
  1. స్ఫురిత గారూ, చాలా సంబరపడ్డానండీ మీ కామెంట్ చూసి.. :) తరువాతి భాగం అతి త్వరలోనే.

   Delete
 3. తెలుగులో రాస్తూ ఇంగ్లీషులు ముక్కలు ఎక్కువైపోయయండి. నా మటుక్కి నాకు పెద్ద వచ్చే రెండో దానికోసం చూసేంత అద్భుతంగా అనిపించలేదు మరి. ఏమనుకోకండేం? :-)

  ReplyDelete
  Replies
  1. ఇంగ్లీషు దేశపు కథవడం వలన తప్పలేదండీ. :) ధన్యవాదాలు.

   Delete
 4. ఇపుడే బావుంది అనికానీ, బాగోలేదని కానీ ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. మొదలవుతున్నదిప్పుడే కదా. చూద్దాం 
  తెలుగులో వ్రాసినపుడు ఇంగ్లీష్ పదాలు ఎక్కువవడంతో నాకేం పేచీ లేదు. ఎలాగూ కొత్త ట్రెండ్ అనీ, కాంటెంపరరీ అనీ విచ్చలవిడిగా పరభాషా బూతులు రాసెయ్యడం ఫేషన్ అయిపోయిందాయే. అయితే ఓ చిన్న ఈక.
  "నాకు నువ్వు కావాలి", "ఇట్ వొంట్ వర్క్ అవుట్ ఏడెన్"--- సంభాషణ ఉన్న భాగమే తీసుకుంటే, అక్కడ ఇద్దరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడి ఉండాలి. ఇద్దరు తెలుగు వాళ్ళ సంభాషణ లాగా ఒకరు తెలుగులో మాట్లాడితే, ఒకరు ఇంగ్లీషులో జవాబు చెప్పడం లాంటిది కాదు కదా. అటువంటప్పుడు ఒకరి మాటలు ఇంగ్లీష్ లోనూ, ఒకరి మాటలు తెలుగు లోనూ వ్రాయటం వల్ల వచ్చిన అదనపు సౌలభ్యం ఏంటో నాకు అర్ధం కాలేదు. ఇద్దరి మాటలూ ఇంగ్లీష్ (అదే తెంగ్లీష్) లోనే అయినా, లేదా తెలుగులో అయినా ఉంటే మరింత సహజంగా ఉండేదని మాత్రం అనిపించింది. బహుశా 'నాకు నువ్వు కావాలి' అన్నదాన్ని 'I want you' అనే చెప్పి ఉండాలి. ఒకవేళ ఆ మాట అలానే వ్రాయటం వలన అక్కడ వేరే అభిప్రాయం కలిగటానికి గానీ, ఆ సన్నివేశం ఇంటేన్సిటీ తగ్గడానికి అవకాశం లేదనే నా అభిప్రాయం.

  ReplyDelete
  Replies
  1. నిజాయితీగా చెప్పాలంటేనండీ.. "యూ ఆర్ ఫన్నీ.." ని తెలుగులో రాస్తూండగా ఆనంద్ సినిమాలో "దారుణమమ్మా ఇది.." అన్నమాట గుర్తొచ్చి నవ్వొచ్చి ఆగిపోయాను. :) నాకు తక్కువ పని పెట్టలేదుగా మీరు!! :) థాంక్యూ సో మచ్ అనగా ధన్యవాదాలు. :)))

   Delete
 5. వావ్!! ఆవకాయ జాడీలో పాస్తాలూ బర్గర్లూనా ఇంట్రెస్టింగ్ అండీ.. మొదటి ప్రయత్నం అనుకుంటా కదా? లేదా నేనేమైనా మిస్ అయ్యానా.. ఏదైనా బాగుంది. ఫెరెట్స్ అండ్ కాలిఫోర్నియా గురించి డిటో స్ఫురిత గారి కామెంట్ అండీ :-) ఓ కొత్త విషయాన్ని తెలుసుకున్నా... మొత్తానికి ఇంట్రెస్టింగ్ మెలికే పెట్టింది వికా... వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ :-)

  ReplyDelete
  Replies
  1. ఇదేదో అనగనగా ఓ తమిళమ్మాయి 'అమరిక' లా ఉందే !

   జేకే!

   చీర్స్
   జిలేబి

   Delete
  2. వేణూశ్రీకాంత్ గారు, ధన్యవాదాలండీ. :)

   జిలేబి గారూ, ధన్యవాదాలండీ. :)

   Delete
 6. మీ సీరియల్స్ చదవడం, నాకు బాగా ఇష్టమండీ. కానీ సీరియల్స్ బ్లాగులోనే రాస్తుండండి. అలా అయితే త్వర త్వరగా చదివెయ్యొచ్చుకదా.

  ReplyDelete
  Replies
  1. ఏమాటకామాటే.. బ్లాగులో రాసుకోవడంలో చాలా సదుపాయాలున్నాయండీ. :) తప్పకుండా.. ధన్యవాదాలు.

   Delete