వాణి పెళ్ళికూతురయ్యింది.
'రేపు పెళ్ళి పీటలమీద కాస్త ఒద్దిగ్గా కూర్చో.. మరీ చిన్న మధుపర్కాలు! నెరువు సరిపోకపోతే ఎలాగో ఏవిటో!' అమ్మమ్మ మాట వాణికి పెళ్ళి ముందురోజు నిద్రలోకూడా గుర్తొస్తూనే ఉంది.
నారింజరంగుకి ఆకుపచ్చ అంచున్న పట్టుచీరలో ముస్తాబయ్యింది. గౌరీపూజ, కన్యావరణం అవగానే బుట్టలో కూర్చోబెట్టారు. మేనమావలు తీసుకొచ్చి పెళ్ళి మండపంలో దింపారు. అమ్మమ్మ చెయ్యిపట్టుకుని పైకిలేద్దామంటే బుట్టకూడా కదిలిపోతోందాయె! తన పరిస్థితి గమనించకుండా లెమ్మని చెయ్యిచ్చిన అమ్మమ్మ మీదా, ఈ తంతంతా క్షణం విడవకుండా రికార్డ్ చేసేస్తున్న వీడియోగ్రాఫర్ మీద పీకమొయ్యా కోపమొచ్చింది వాణికి. ఇంతలో ఎవరో చూసి అడ్డుగా నిలబడి గండంగట్టెక్కించారు.
'ఇదిగో.. ఆ మధుపర్కాలు కట్టేసుకో. రాజ్యం పిన్ని సాయం చేస్తుంది. మీ అమ్మ వస్తుంది ఇక్కడే ఉండు.' చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది అమ్మమ్మ.
వాణి సరిపెట్టుకోవడం అప్పటినుంచీ మొదలుపెట్టిందేమో..
***
'రంగడత్తా, మా ఇంటినిండా సామానే. మీ మనవరాలు ఇంకొన్ని తీసుకొస్తే చోటుండదు. ఇంటిల్లిపాదీ నిలువుకాళ్ళమీద నిలబడాలి. కొత్తింటికి వెళ్ళాక మీరేం ఇచ్చుకుంటారో.. మీ మనవరాలేం తెచ్చుకుంటుందో మీ ఇష్టం." వాణి అత్తగారు అమ్మమ్మతో కరాకండీగా చెప్పేశారు.
సరిగ్గా రెండునెలల్లో వాణి మెడలొంచినవాడికి అమెరికా వీసా వచ్చింది. వాణిని వెనకే రమ్మని చక్కావెళ్ళాడు.
***
విమానయోగం వాణిచేతిలో ఉందని అమ్మమ్మా, తనకొడుకు వల్లే వాణికి విదేశయానమని అత్తగారూ ప్రకటించారు. ఈ లెక్కన కొత్తిల్లు కాస్తా ఫ్లైటెక్కి సముద్రాలు దాటాక ఉంది మరి. సామాను పంపడమా మానడమా? అనే మీమాంసలో వాణీవాళ్ళమ్మ కొట్టుమిట్టాడింది.
ఖాళీగానే ఏడేసికేజీలున్న సూట్కేసుల బరువు, సామాన్లతో పాతిక కిలోలకి మించకూడడని విమానంవాడి హెచ్చరిక. కొడుక్కోసం అత్తగారు సర్దినవి ముట్టుకోకుండా సర్దుకుని సర్దుకుని ప్రయాణమయ్యింది వాణి.
***
కూరగాయల ఎంపిక నుండీ, ఏజ్డ్ వైన్ దాకా అతనికి తెలియని విషయం లేదు. ఆ వల్లమాలిన తెలివితేటలూ, పొంగిపొరలే ఉత్సాహమూ చూసి దారిచ్చేసేది వాణి.
బ్లాక్ ఫ్రైడేలూ, క్రిస్మస్సులూ వచ్చేయంటే ఆ అపారమైన మేధస్సుతో సీడీ ప్లేయర్ దగ్గర్నుంచీ, డిజిటల్ ఫొటోఫ్రేం దాకా.. వీ దగ్గర నుంచీ గేమింగ్ కాన్సోల్ దాకా పరమచీపుగా కొని లేనిమీసం మెలేసేవాడు. ఆ నాల్రోజులూ వాణికి మాత్రం అతను మీసం మీద వాటర్ మెలన్ లు నిలబెట్టి నడుస్తున్నట్టు కనిపించేది.
రెండేళ్ళు మంచురాష్ట్రాల్లో గడిపాక, చలో బే ఏరియా అన్నాడతగాడు. సిలికాన్ వేలీ అంటే సాఫ్ట్ వేరుజ్జోగాలూ, మిరపకాయబజ్జీలూ, మ్యూజికల్ నైట్లూ .. బాలసుబ్రహ్మణ్యాలూ, వెలిగివెలిసిపోయిన సినిమాతారలూ, వెరసి తెలుగుదనమూ సమృద్ధి మరి!
***
మిగులు తగులూ డాలర్లతో సరిపెట్టుకుంటూ సంసారబ్బండీ నడుపుకోవడానికి అమెరికాలో నల్లేరు దొరకదు. క్రెడిట్ కార్డులు మాత్రం పుష్కలంగా దొరుకుతాయి. వాటికి అలవాటుపడ్డాక వడ్డికాసులవాడు తరచూ గుర్తొస్తాడు.
వాణికి కొత్తవస్తువు చూస్తే కొనుక్కోవాలనీ, ఇంటికి తెచ్చుకోవాలనీ సరదా. కానీ వస్తువు తెచ్చి ఇంటి తాళం తీసేసరికి.. లోపల్నుంచి సోఫాలు, కాగితాలూ , వంటింటిసామానూ, బార్బిక్యూ గ్రిల్లు. గడపలోదాకా వచ్చి పళ్ళికిలిస్తూ పలకరించేవి. భయపడి కొన్నవస్తువు గభాలున షాపులో పెట్టేసి వస్తూండేది.
మరో రెండేళ్ళలో పాలసీసాలు వేడిచేసుకునే మిషను, పదమూడడుగుల బెడ్రూమ్ లోనుండీ చంటిది ఏడిస్తే, అక్కడికి సరిగ్గా మూడున్నర అడుగుల దూరంలో ఉన్న వంటింట్లోకి వినిపించే బేబీ మానిటర్ తో మొదలుపెట్టి, అడుగులేసే సమయానికి గిరగిరా తిరిగే వాకరూ, అన్నం తినిపించడానికి కూర్చోబెట్టే మూడడుగులెత్తు కుర్చీ.. ఇల్లుపట్టని సంపద! వద్దంటే సామాను. ఇల్లు సర్దుతుంటే చైనీస్ చెక్కర్ ఆడుతున్నట్టుండేది వాణికి.
వాడేశాక కూడా పూచికపుల్ల పారేయని జాగ్రత్త అతనిది. ఇంటావంటా అలవాటులేదనేవాడు. పైగా పిల్లలున్న ఇల్లు.
వాణికి పిల్ల బట్టల బాస్కెట్టూ, వాషింగ్ మిషను, టేబుల్ లేంపు.. తనమీద పడిపోతున్నట్టు కలలొచ్చేవి.
అతనికీ కలలొచ్చేవి. క్రెడిట్ కార్డు పర్సులో పట్టనట్టూ, బేంక్ అకౌంటుకున్న సన్నని చిల్లుద్వారా సిలికాన్ వేలీ ఇసుక జారి పారిపోతున్నట్టూ..
***
ఓ రోజు చన్నీళ్ళు సాయం లేకపోతే కష్టమన్నాడు. తలూపి ఓ చిన్న క్రెడిట్ కార్డు సంపాదించుకుంది.
ఇంట్లో ఇద్దరూ ఉజ్జోగాలు చేస్తే, పిల్లదాని బాగోగులు చూసుకుంటామని అమ్మమ్మా, అత్తగారూ పోటీపడ్డారు. పెద్దవాళ్ళని రమ్మని పిలిస్తే కాళ్ళుతొక్కుకోవాలని కిక్కురుమనలేదతను. సిలికాన్ వేలీలో ఉజ్జోగాలు సమృద్ధే కానీ, ఇళ్ళు బహుప్రియం. అమ్మమ్మకీ, అత్తగారికీ మార్క్ జుకర్బర్గు ఫేస్ బుక్ అకౌంట్లు ఇస్తాడు కానీ, ఉజ్జోగం ఇవ్వడుకదా మరీ! వాణే సర్దుకుంది.
కార్డులు అడ్డుపెట్టి చిల్లు మూసేస్తున్నట్టు అతనికీ, గడియారం ముళ్ళు పట్టుకు వేలాడుతున్నట్టు వాణికీ కొత్తకలలు రావడం మొదలయ్యింది.
***
'సమ్మర్ కి ఇండియా ప్లానుందా?' అని ఎవరో అడిగితే వాణికి జడుపుజ్వరమొచ్చింది. షాపింగ్ చేసుకుని సర్దుకున్న, పెద్ద పెద్ద సూట్కేసుల మీద పడుకున్నట్టు తెరిపీమరపూ కలలొచ్చాయి. తెలివొచ్చాక ఏడుపొచ్చింది.
ఏడుగుల కేలిఫోర్నియా కింగ్ మంచం మీద పడుక్కున్నదల్లా చీకట్లో కళ్ళు తెరిస్తే.. కుడిచేతివైపు ఆరు మైళ్ళ దూరంలో వాల్మార్టూ, ఎడమ వైపు ఇరవై మైళ్ళలో 'నమస్తే ఇండియా' రెస్టరెంటూ, ట్రైన్ వెళ్తున్న టన్నెల్ చివరన ఆఫీస్ లో క్యుబికలూ కనిపించాయి. కళ్ళుచించుకుని చూస్తే.. మూడువందలమైళ్ళ దూరంలో ఆకాశాన్నంటేలా ఉన్న యోసెమెటే పర్వతాలు కనిపించి భయమేసింది. ఇటు తిరిగిచూస్తే లేక్ తాహో అంచున నిలబడ్డట్టనిపించి కెవ్వున అరిచి లేచికూచుంది.
నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకుని అమ్మమ్మ కడిగి ముగ్గువేసిన గుమ్మం కనిపిస్తుందేమో అని చూసింది. ముళ్ళకంచె వేసేసి ఉందా ఇంటికి!
***
"వచ్చేవారం ట్రైనింగ్ కి వెళ్ళాలి. రెండురోజులు.. " చెప్పిందతనికి.
***
"వాణి.. హేవె రిజర్వేషన్.."
"టు ఓ ఫోర్.. ఎలివేటర్ దిస్ వే టు యువర్ రైట్.." సంతకం పెట్టించుకుని, రూమ్ కీ ఇచ్చి చెప్పింది రిసెప్షనిస్ట్.
***
"మొన్నెప్పుడో అడుగుదామనుకుని మర్చిపోయాను. మీ ఉదయ్ ఆడుతాడు ఐపాడ్ లో.. ఏవిటదీ.." రూమ్ లోకి రాగానే సుచిత్రకి ఫోన్ చేసి అడిగింది వాణి.
"ఏవిటదీ..?"
".. గోడలూ, ఇళ్ళు కట్టే వీడియో గేమ్ ఏదో. చాలాసార్లు చూశాను."
"అదా.. చచ్చిపోతున్నాం వీడి ఐపాడ్ పిచ్చితో. దూరిపోతాడు దాన్లో. మన చిన్నప్పుడు టీవీ ముందు కూర్చుంటే తిట్టేవారు. వీళ్ళు స్క్రీన్ కళ్ళకే కట్టేసుకుంటున్నారు. మీకు గుర్తుందా? మనకో ఇంగ్లీష్ పోయెం కూడా ఉండేది. టీవీలా అయిపోతాడు పిల్లాడు అందులో. ఎప్పుడో అప్పుడు మా ఉదయ్ ఏ ఐఫోన్ సిక్స్ ఎస్ ప్లస్సో , ఐపాడ్ ఎయిరో అయిపోతాడు." చెప్తూ పోతోందావిడ.
ఓపిగ్గా వింటోంది వాణి.
"మయిన్ క్రాఫ్ట్ అంటారు. ఏ పిల్లాడ్ని చూసినా అదే.. దేనికీ?"
"ఊరికే.."
కాసేపు మాట్లాడి పెట్టేసింది.
***
నీరసమొచ్చేదాకా షవర్ కింద నిలబడిపోయింది వాణి. స్నానం చేసి, నైట్ డ్రస్ వేసుకుని శుభ్రంగా ఉన్న క్వీన్ బెడ్ మీద వాలి చుట్టూ చూసింది.
ఎక్స్టెండెడ్ స్టే అమెరికా గది గోడల మధ్య ఏసీ రొద సన్నగా వినిపిస్తోంది. కడుపులో బాధ లుంగలు చుట్టుకుంటోంది. గట్టిగా ఊపిరి పీల్చివదిలింది.
లేచి బేగ్ లోంచి ఐపాడ్ తెచ్చుకుని తలగడలకి ఆనుకుని కూర్చుని...
యాప్ స్టోర్ --> సర్చ్ --> మయిన్ క్రాఫ్ట్
ఆరు డాలర్ల తొంభైతొమ్మిది సెంట్లు పెట్టి యాప్ కొని, ఆడడం మొదలుపెట్టింది.
విశాలమైన మైదానాలు.. పెద్ద ఆకుపచ్చ గోడల ఖాళీ గదులు.. లావా నదులూ..
కాసేపాడాక వాణికి ఓ గదిలో బీరువా, మంచం ఎలా అమర్చుకోవాలో అర్ధమయింది.
"గాడ్రెజ్ బీర్వా.." బయటికే అనేసి నవ్వింది.
వీడియో గేమ్ ఆడీఆడీ నిద్రపోయిన వాణికి ఆ రాత్రి కలలేం రాలేదు.
***
బాగుందండీ ! మొదటి పేరా మరీ మరీ :)
ReplyDelete:) ధన్యవాదాలు.
Deleteఅద్భుతం. మీలో ఈ శైలి ఉందని ఇన్నాళ్ళూ గమనించలేదు. కథ నడక అంతా కలలాగా బావుంది. ఫినిషింగ్ అంతగా నచ్చలేదు.
ReplyDeleteముగింపు మరోలా ఉండచ్చంటారైతే.. :) ధన్యవాదాలు.
Deleteఇండియాలో ఉన్నా మాకు అమరికా ఏంటో చూబించారు...అంత హడావిడిగా రాసినా నిదానంగా అర్ధం అయ్యింది.
ReplyDeleteకృతకృత్యురాల్నయినట్టే అయితే.. ధన్యవాదాలండీ.
Deleteరమణగారు చెప్పినట్టు, అమెరికాని చూపించారండీ..
ReplyDeleteఇల్లంతా అలా సామాన్లతో నింపేయడం ఏదో సైకలాజికల్ డిసార్డర్ అట.. మా బంధువుల్లో ఓ ఫ్యామిలీ మొత్తానికి ఉండది.. వాళ్ళింటికి వెళ్తే ఏదో గోడౌన్ కి వెళ్ళిన ఫీలింగ్ బంధువులందరికీ..
ముగింపు టచింగ్ గా ఉండి కథని గుర్తుండిపోయేలా చేసింది.. వరుసగా అమెరికా కథలు చదవబోతున్నామన్న మాట!
Hoarding disorder. :) వాణి గోడౌన్ లో సర్దుకుందన్నమాట. ముగింపు అందుతుందా లేదా అనే ఆలోచిస్తూ ఉన్నానండీ. పరవాలేదైతే.
Deleteఅమెరికా కథలు.. చూద్దాం.. పిట్స్ బర్గ్ వెంకన్నేం రాయిస్తాడో! :) ధన్యవాదాలు.
kevv! super kova garu :)) naaku maa illu gurtochindi :P
ReplyDelete:) అవునా.. ధన్యవాదాలు.
Deleteతెలుగుదనానికి ;) మీరిచ్చిన నిర్వచనానికి చప్పట్లు.
ReplyDeleteఇల్లు సర్దడాన్ని చైనీస్ చెకర్ తో పోల్చడం కూడా నచ్చేసింది.
~లలిత
:) చైనీస్ చెకర్ ఎన్నిసార్లు ఆడివుంటాను ఈ లెక్కన? Thank you.
Deleteఅమ్మమ్మ కీ అత్తగారికీ మార్క్ జుకెర్బెర్గ్ ఫేస్బుక్ అకౌంట్లు ఇస్తాడు గాని ఉద్యోగాలు ఇవ్వడు కదా !!! hahaha great style sir!
ReplyDeleteధన్యవాదాలు! :)
Deleteఅత్తగారు సర్దినవి ముట్టుకోకుండా సర్దుకుని, సర్దుకుని ప్రయాణమైంది. - యమకాలకారం అద్భుతం.
ReplyDeleteచాలా నచ్చింది కథా చెప్పిన తీరూ.
ReplyDelete-పరేశ్
ఇప్పుడే చదివేను. అమెరికాలో మనవారి బతుకు చూపించేసేరు కాశీపట్నం చూడర బాబూ అన్నట్టు. నిజానికి సిలికాన్ వాలీ గురించిన పేరాలోనే ఉంది మొత్తం కథ.
ReplyDeleteఅమెరికా బహు విశాలం. మనసులో ఇరుకు.
జేజేలు.
భలే చెప్పారు కథ, ముగింపు బావుంది!
ReplyDeleteBaagundi andee
ReplyDeleteచాలా బావుంది అండీ
ReplyDeleteలాస్ట్ లైన్ చదువుతుంటే పెద్ద గుంపు లోంచి బయటకువచ్చి ఊపిరి తీసుకున్నట్టు గా వుంది.