Monday, January 20, 2020

హంపి

'ఎవరిదలఁచు చుంటివే?' యని యడిగిన
'నెవరుగలరు నాకు భువి?' నటంచు,
గోలుగోలుమనుచు గొంతెత్తియేడ్చి యా 
యింతి మమ్ముఁగూడ నేడిపించె! 

వందలయేళ్ళనాటి వైభవాన్ని తల్చుకు వెక్కిళ్లు పడుతున్న హంపిని చూసొద్దామని నువ్వు..  ఎప్పటిలాగే నీ వెనుక నేను.. 

"అప్పుడు పుట్టి ఉంటే?" అని పురాస్మృతులని తరచి తడుముతూ... నా దారి దీపానివి.. నీ వెనుకే నేను.. 

********

"కమలాపురం! కామలాపురం ఇది.. తిరుమల రామచంద్ర చెప్పలేదూ? విజయనగర ప్రభువుల పూజాకమలాలు ఇక్కడి నుంచే వెళ్లేవట. ఆ చెఱువు ఎక్కడో?" అంటూ మట్టిదారుల రోజులకి చెయ్యిపట్టుకు తీసుకుపోయావు. కాళ్ళు నేలమీదే ఉన్నా ఊహలు మబ్బు పొత్తిళ్లలోనే. 

ఓం ప్రథమమని కాలుపెట్టిన హంపీ విరూపాక్ష దేవాలయానికి "రాయలవారూ రాణులూ వచ్చేవారు కదూ?" అని తలవాకిట నా ఆలోచనలకి కొక్కేలు తగిల్చి ఆపై నువ్వేదో చెప్తున్నావు. నాకేమీ పట్టలేదింక. 

'హేమకూటానికి దారి ఇదే..' అని దారిలో భటుడొకడు చెప్పాడనుకో. చరిత్రకి సాక్ష్యాలుగా మౌనంగా నిలిచిన ఆ కొండరాళ్లలో ఏం వెతుకుతాం? కదంబమాల ఎరుగుదుం. కదంబమాలలా గోపురాలా! మన నాగరాజులా... నేర్చుకునేందుకు వచ్చిన కుఱ్ఱ శిల్పులు చెక్కినవంటావా? మరి ఎక్కడా పిల్లి బొమ్మ కింద మల్లి అని రాయలేదే! వెతికాను. అంతలేసి బండలు, ఆపైన చెక్కిన మెట్లు! ఎలా సాధ్యమో, ఆ కాలానికి ఎంతలేసి మనుషులో! గుట్ట మొగలో రాతి మంటపాలు. కూలిన కోటల్లో తిరిగినా కలగని వింత అనుభూతి. బహుశా చూడవచ్చే వారికి, గుర్రాలకి విశ్రాంతిగృహాలుగా ఊహించుకుంటే ఆరోజుల తీరు కొద్ది కొద్దిగా ఊహకి అందుతుంది. విరూపాక్షుని కోనేటి మెట్లు, పూల అంగళ్ళు, కోవెల దారులు... వినే చెవులకోసం ప్రతీ రాయీ కథలెన్నో దాచుకుని ఎదురుచూస్తున్నట్టు కనబడడం మొదలయింది. 

చిన్నికృష్ణుడి కోవెలొకటి.. ముక్కలు చెక్కలైపోయింది. మిగుళ్ళూ తగుళ్ళూ ఎక్కడో దాచిపెట్టారట. సున్నపు కట్టు మధ్య అస్థిపంజరాల్లా పొడుచుకొచ్చిన ఇటుకల రాజగోపురం చూస్తే నొప్పేసింది. భోరుమంటానని తెలిసి నా తీరుమళ్లించేవాడివి నువ్వు. "అచ్చం మీ పద్మనాభం కుంతీమాధవస్వామి కోవెలలా లేదూ?" అని ఆశ్చర్యపోయావు. మా పుట్టినింటి గజపతుల పీచమడిచాడీ కృష్ణదేవరాయలు! పోనీలే... ఈ ఊరిపేరూ విజయనగరమేగా. ఆ సామ్యానికి నెమ్మదించాను. ఆలయం ఎదురుగా బజారు ముందు శంఖుచక్రాలు తీర్చిన రాతి హుండీ! ఏనుగులు కదిపినా కదిలేలా ఉందా దానిపై మూత? పక్కనే ఎక్కడైనా కుండీలు కూడా కనిపిస్తాయేమో అని వెతికాను. అశ్వదళాన్ని పెంచేందుకు రాయలవారు దిగుమతి చేసుకున్న మేలుజాతి గుర్రాల పిల్లలకి పాలుపట్టే రాతి కుండీలుండాలెక్కడో! విస్తరించిన కృష్ణబజారు ఆనవాళ్లు కనుచూపుమేరా కనిపించాయి. రత్నాలు రాసులు పోసినారిచట? ఇక్కడ కాదట. ఇది తిరనాళ్ల బజారే! 

తలెత్తి చూసినా తనివితీరని ఎత్తులో ఎక్కడో ఉన్నతంగా కూర్చున్న నారసింహుడి ఒళ్ళోని లక్ష్మిని దాడి చేసి ఎత్తుకుపోయారట. ఆమే హంపీ ఐశ్వర్యానికి చిహ్నమనిపించింది. ముష్కరులు రాతిని కూడా ఇనుప గుళ్ల ఫిరంగులతో పేల్చి నాశనం చేసేసారు. మనసు కెలికినట్టు, రుద్రభూమిలో తిరుగుతున్నట్టు... నిర్వేదమేదో మనసుకి ఇంకుతోంది. ఇంతా ఇక్కడికొచ్చి పోగువేసుకు వెళ్ళేది ఇదేనా? 

పిళ్లారి గీతాలలో 'లంబోదర లకుమికరా..' అని సరిగమలు నేర్పే బొజ్జ గణపయ్య, ఆ పురందరదాసు పాడిన అంబాసుతుడు ఇక్కడి కొండమీది కడలేకాళ్ (సెనగగింజ) వినాయకుడే! ఇంకాస్త చిన్నగా ఉన్న సాస్వీరేళ్ వినాయకుడి బొజ్జ నిజంగా ఆవగింజలా నున్నగా గుండ్రంగా ఉంది! సెనగగింజని మాత్రం నుజ్జు నుజ్జు చేసేసారు! హంపీ చేరాక మొదటిసారి అనిపించింది.. నిజంగా దేవుడుండి అడ్డుకోరాదా ఈ విధ్వంసాన్ని అని. 

గాజుల గలగలలు ఏ రాతిలోనైనా ప్రతిధ్వనించేలా ఉంటుందని ఊహించిన అంతఃపురాన్ని చూసేందుకు వెళ్తే... పగిలిన రాతిముక్కలున్నాయి. రాతి పునాది మీద మొదలు నరికిన ఐశ్వర్యచిహ్నాలున్నాయి. సమూలంగా నాశనం చేయడమెలాగో తెలిసిన జాతొకటి కిరాతకంగా బొబ్బలు పెట్టినట్టు వినిపిస్తోందక్కడి గాలి. ఆశ చావక ఒక చెట్టు మొదలు తడిమి అడిగాను గుర్తుందా? ఈ చెట్టు వయసెంతుంటుందీ అని. ఫిరంగుల రణగొణల్లో, కాసులు దోచే ఆత్రంలో ఇనుపపాదాలు తొక్కకుండా విడిచివెళ్లిన పసిమొక్కేదో ఇంతయి ఉంటుందా అనే ఆశ. అయితే మాత్రం... దానికి జీవితమంతా తన వేళ్లే సంకెళ్లయిన ఒంటరితనమేగా? పాపం ఏమంటుంది? బావురుమని తెగిపడిన నల్లపూసల సౌరు కథలుగా వినిపిస్తుందా? చిందిన రక్తాన్ని, ఖణేల్మన్న యముని మహిషపు లోహఘంటల మ్రోతని వర్ణిస్తుందా? విని తట్టుకునే దిటవున్న గుండెలా మనవి? 

విశాలమైన మైదానమొకటి మిగిలింది.. అక్కడక్కడా కూలిన రాతిగోడలు. ఒకవైపు ఖజానా, మరోవైపు జనానా. ఆపై కలువపూవు మేడ. ఎన్ని వీణలు మోగిన విశ్రాంతి మందిరమో! కూతవేటు దూరాన పట్టపుటేనుగుతో కలిపి మొత్తం పదకొండు ఏనుగులకి మహలొకటి. ఆ పట్టపుటేనుఁగు... రాజ్యలక్ష్మిని, సాహితీ సరస్వతిని, పరాశక్తిని తనపై ఆరోహణ గావించుకున్న భాగ్యశాలి! ఒళ్ళు గరిపొడిచింది. ముచ్చటైన గుమ్మటాలని చూస్తే అక్కడినుంచి కదలబుద్ధవలేదు. కరి మకరి సంవాదం, తుంగభద్ర సుడులలో మొసళ్లు... మనసు పరివిధాల కొమ్మచ్చులాడుతోంది. 

ఎంత యాకఁలి గొనియున్న నిదిగొచూడు! 
దయిత కరణీముఖంబును దలఁచుచుండి
తినమనసురాని కుంజరమునకు వాడెఁ 
దొండమున యందె తామరతూండ్లపిడుచ 

తన ఆడుదాని ముఖం గుర్తొచ్చి ఆకలేస్తున్నా తినలేక, ఆ ఏనుగు తొండం చివర పట్టుకున్న తామరతూండ్ల పిడచ ఎండిపోయిందట. 

ప్రాసాదంలో పనిచేసే పరిచారకుల విడిది గృహమొకటి విస్తారమైన చావిడిలా తరగనంత మేర పరుచుకునుంది. ఒక్క క్షణమాగి ఆలోచిస్తే.. ఎందరికి ఉపాధి, ఎంత స్వయంప్రతిపత్తి అని ముచ్చటేసింది. వర్తమానపు కొలతల్లో చరిత్రని కొలిచే సాహసం చేయకూడదు. కొందరు మనుషులు అటువెళ్లకపోతే బావుండునని మొక్కుకున్నాను. "రాణీగారు స్నానం చేసి, పూజాగృహానికి వెళ్లి, వస్తూ ఏనుగులకు ఏ వెలక్కాయలో తినిపించి వెనక్కొచ్చేసరికి పొద్దు గడిచిపోతుంది." అని నవ్వుకున్నాం కానీ, కోట గోడలు ఆపలేని విపత్తు వస్తే బతికుండగానే కనిపించగల నరకపు మెట్లు ఆ రాణీవాసపు ముంగిల్లోనే ఉంటాయి.  "మల్లీశ్వరి రాణివాసానికి ఇక్కడికే వచ్చింది." నమ్మకంగా చెప్పావు. అవును.. హజార రామస్వామి మందిరం కనిపించేలా గవాక్షమెక్కడో వెతుక్కుని నిలబడే ఉంటుంది. మమతలెరిగిన మేఘమాలని బతిమాలుతూ...  

నల్లరాతిలో చాళుక్యుల నగిషీ పనితనపు నమూనా గోపురాలు, చిన్న చిన్న ఆరాధనా విగ్రహాలు, నాగిని ప్రతిమలు, వీరగల్లు, సతిగల్లు, యాళి, సప్తాశ్వరథి, చిలుక తత్తడి రౌతు, లింగాకృతులు, పక్షులు, రోళ్ళు, కల్వం, పనిముట్లు... ఆఖరికి గుర్రప్పిల్లలకు పాలు పట్టే కుండీ కూడా కనిపించింది! అన్నీ దొరికాయి.. తవ్వకాల్లో. పీలికలు చీలికలైన మానవత్వమెక్కడో పాతాళానికి జారిపోయి ఉంటుంది.

చనిన యోవనంబు వెనుకకు రాదు; జీ 
వంబు చూడ శాశ్వతంబె కాదు;
ఒక్క నాఁడువోలె  నొక్క నాడుండదు;
జనులకింత కటికతనము లేల? 

చినచేపను పెదచేప.. చినమాయను పెనుమాయ! 

మాయమత్తు పూసుకుని ఉత్సాహం తలదాల్చి ముందుకెళ్లి చూస్తే సభామంటపం! నవరాత్రి మంటపం!! కత్తిపట్టి నిలిచిన విశ్వనాథనాయకుని బొమ్మచెక్కిన మంటపం! సాక్షాత్తూ సాహితీసమరాంగణ సార్వభౌముడి సభామంటపం! మనసు చిందులేసి ఇంకెక్కడికీ పోకుండా నీ చేయి ఆసరాతో అడుగు ముందుకే వేసాను. అష్టదిగ్గజాలు.. అన్నమాట బయటికి పలికి మొహాలు చూసుకునే ధైర్యం మనకి లేదని బాగా తెలుసు. రాజులసొమ్ము రాళ్ళపాలు కావొచ్చుగాక. సుకవి నివాసం కాలప్రభావానికి కూలిపోనిది. అక్షరమన్నారెందుకే. 

నిలిచిపోయిన కీర్తికాయం ఈ అవశేషాలలో మిగిలినందుకు గుడ్డిలో మెల్లనుకోవాలా? విద్యారణ్యస్వామి ఆశీస్సులతో బుక్కరాయలు పరిగెత్తగలిగినంత మేరా ఆదిశేషుడు గండి చేస్తే బుక్కసాగరమయిందట కదా! కథని కొట్టిపారేసినా అక్కడ నుంచి తవ్వించిన తురతకాలువ నుంచో, నేరుగా తుంగభద్ర నుంచో రాతి తూఱలతో నీరు మళ్లించిన స్నానవాటిక, అది కూడా సభాస్థలి కాస్త దూరాన! ఆ నల్లఱాయి మెట్ల అమరిక చూస్తే నోరు అలా వెళ్ళబెట్టాల్సిందే! స్నానాలకు, నిరంతర అన్నపానాదులకి కట్టించిన వంటిళ్ళు, వసారాలు, సదుపాయాలు, అక్షరాలా వేయి రామచిత్రకథలతో హజార రాముని సన్నిధి, భద్రమైన కోటగోడల వెనుక జనజీవితం. శిబి ప్రముఖులుం బ్రీతిన్యశఃకాములై యీరే కోర్కెలు? - కేవలం కీర్తి కాముకులై రాజులు ఇవన్నీ చేసి ఉంటారా? రాజ్యభారం భుజాలపై పడ్డాక స్వాతంత్ర్యపు గాలి పీల్చడం కష్టమని - చిన్నాదేవితో రాయలవారు చెప్తున్న దృశ్యం కళ్లకి కట్టింది. 

సాక్షాత్తూ విజయనగర సామ్రాజ్య పట్టమహిషి, రాణీ వార్ల స్నానవాటికని చూసే అవకాశం అప్పట్లో నేనే మల్లీశ్వరినో, పోనీ గందోళినో అయితే తప్ప ఉండేది కాదేమో కానీ, ఇప్పుడందరికీ ప్రవేశముంది. కట్టడానికి వాడినది సున్నమో, వెన్నో అర్ధం కానంత నగిషీ పనితనం!! ఛిద్రమైన అందమే ఇంత అద్భుతంగా ఉందే!! సంగీత సల్లాపాలతో, కలరవాలతో, కేళీవిలాసాలతో మత్తెక్కి ఉండేదేమో ఆ గాలి. పూల తివాచీలను, పునుగు జవ్వాది మైపూతలను, చందనపు నలుగులను, పన్నీటి జలకాలను ఊహించుకుంటే తప్పేమిటి? ఊహలకి అదుపేముంది! గాలికంటే తేలిక, చవక. 

కోపంతో బుసలు కొట్టడం 
గుసగుసలు మాట్లాడడం 
ముఖం చిట్లించడం 
చేతిగాజులు గలగల్లాడించడం 
ఓ కుసుమ వృక్షమా! నిన్ను చూసైనా 
కన్నెపిల్లలు నేర్చుకుంటే ఎంతబావుంటుంది! 

అన్నట్టు పువ్వులు రాల్చిన చెట్లెన్నో ఆ స్నానవాటిక ముంగిల్లో ఉపశమనంగా కనిపించాయి. ఆ స్నానాల ఇంటి చుట్టూ మెడబంటి కందకమొకటి ఉంది.. అది దాటుతూంటే మరీ మరీ "సొంత ప్రదేశమిది!" అన్న భావన. చెప్తే పెదవి బిగించి నవ్వుతావుగానీ.. 

ఐదువందలు - అంటే అంతేగా అనిపిస్తుంది. పలకమీద గీసే గీతలయితే అంతే. అదే జీవితకాలంలో లెక్కించుకుంటే ఎన్నెన్ని తరాలు, ఆచారాలు, అలవాట్లు, నుదుటిరాతలు. 

ఎన్నిగంటలు, పూటలూ చూసినా సరిపోదని విన్న విఠలుడి సన్నిధికి నడిచిపోతూ ఉంటే కుడిచేతివైపు ఆకర్షించిన గజ్జెల మంటపాన్ని ఎంత చూస్తే తనివి తీరుతుంది! నాట్యానికి అనువైన వేదిక! ఆ భంగిమలు చెక్కిన ఆ స్తంభాల సొగసు చూడాల్సిందే. అప్పటికే దారంతా చూసిన మంటపాలన్నీ ఒక ఎత్తు.. గజ్జెల మండపమొక ఎత్తు. చుట్టూ పచ్చదనంతో, చెదరని వన్నెతో ఎంతసేపు కూర్చున్నా, పరిశీలనగా చూసినా ఇంకా ఒలికే సౌందర్యానికి దాసోహమవ్వక ఏం చెయ్యగలం! కుదిరేగుంబె మంటపం దాటి పుష్కరిణిలో నీడలు చూసుకుని విఠలుడి కోవెల చేరే దారికిరువైపులా రాళ్ల కుప్పలైన రత్నాల అంగళ్లు. మైలు పొడవున రెండంతస్తుల బజారు. ఎవరు చెప్తారక్కడి బేరసారాల కబుర్లు? ఎవరు చూపిస్తారు మనకా మిలమిలలు? ఈ ఒక్క ఉదాహరణ చాలదా రాజ్యం సుభిక్షమని, ప్రజలు సంతుష్టులని అర్థమవడానికి. సామాన్య జీవితమెంత సుఖంగా గడిచేదో ఊహించుకోడానికి! కడుపుకి తిండి, మనసుకి ప్రేమ దొరికేదని సంబరపడడానికి. ఎక్కడినుంచి ఎక్కడికి జారిపోయాం! పురోగమనమంటే ఇదైతే అక్కర్నేలేదు కదా!  

అతిప్రయత్నం మీద కదిలి విఠలుని సన్నిధిని, సంగీత మంటపాన్ని, రాతిరథాన్ని.. ఇంకా మిగిలిన ఆశల్లా అక్కడక్కడా కనిపించిన రంగుల చారికలని చూస్తుంటే అర్ధం కాని ఉద్వేగం. చిత్రాతిచిత్రమైన ఆ శిల్పకళని చిలవలుపలవలుగా వర్ణించాడొక చిరంజీవి. అదిగో రాయల్ని తూచిన తులాదండమన్నాడు. వెఱ్ఱివాడా.. రాయలేడీ? తూచే సొమ్మేదీ? చప్పట్లు కొట్టిన ప్రజ ఏరీ? గొడుగుపాలుడిలా నాకో, నీకో ఒకరోజు ఈ సామ్రాజ్యం దక్కితే అణుమాత్రమైనా మిగలని మనసుతో ఏం చెయ్యగలమోయీ అని అడిగితే? రాతి గట్టుని ఆనుకుని మొలిచిన సువర్ణగన్నేరుని చూస్తుంటే చటుక్కున తట్టింది. ఎలాంటిదో, కుంటిదో, గుడ్డిదో.. కునిష్టిదో నా ఈ జీవితం చాలా చిన్నదని. సగం దూరం నడిచొచ్చేశామని.. యాత్రాఫలశృతి ఇదేనా? 

హంపి ఒక పురాస్వప్నం, సడలిపోయిన శిల్పసుందరి, దొంగలు పెళ్ళగించిన మణిమంజూష. తెలుగు లెస్సన్న కృష్ణరాయలవారి రాజధాని. మన దురదృష్టానికి మిగుల్చుకున్నదేదైనా ఉంటే అవి కాసిని అక్షరాలు! దొంగలెత్తుకపోనివి కనుక. 

*********

ఐదువందల సంవత్సరాల క్రితం ఆ నేలపై నడిచిన నాగరికతల ఆనవాళ్లు ఇలా వెతికితే దొరికేవి కాదు. విరిగిన ముక్కల్ని అతికించుకుని ఊహల్లో ప్రహేళిక పూరించడమే. అయితే ఒక దారుంది. సైద్ధాంతిక ప్రమాణమేదీ లేకపోయినా అక్షరాలలో పొదిగిన ఆనవాళ్లు కొన్నున్నాయి. కృష్ణదేవరాయలు తనకంటే ఎనిమిది వందల సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనని మాలిక అల్లాడు. ఆముక్తమాల్యద. మరి ఆయన గతించిన కాలాన్ని ఎలా ఊహించాడు? విల్లిబుత్తూరుని, మధురని, జనసామాన్యాన్ని అతి సునిశితంగా పరికించి ఎలా అక్షరబద్ధం చేసాడు? ఎంత కల్పనే అయినా, అప్పటికి రచించి ఉన్న శాస్త్రాల ఊనికతోనే రాసిన ప్రబంధమైనా, రాయలవారి కాలంనాటి హంపీ ప్రాభవం ఆముక్తమాల్యదలో తొణికి ఉంటుందని అనుకోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు. హంపీ నగరాధీశుడి ఊహ ఎంత గొప్పదో కావాలంటే చూడు.. 




పొట్నూరు దగ్గర కృష్ణదేవరాయల విజయస్తంభముంది. ఆకాశమార్గాన సింహాచలస్వామి తిరనాళ్ళకి వెళ్లొచ్చే దేవతలు ఆగి, ఆ స్తంభంపై రాసిన అక్షరాలు చదివే ప్రయత్నం చేస్తారట. స్పష్టంగా లేని తాళపత్రం చదవాలంటే నల్లని మసి పూసి చదవడం అప్పటి అలవాటేమో.. దేవతలు గజపతి పరాజయమనే నల్లనిరంగు పూసి విజయస్థంభాన్ని చదువుతారట! అలాంటి ప్రబలరాజాధిరాజ వీరప్రతాప రాజపరమేశ్వరార్థదుర్గానటేశ సాహితీసమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయలవారి కాలానికి మా సింహాచలం మీదుగా వెళ్దాం రా.. 

నీలాల కోయిలలు, మరకతాల చిలుకలు, కెంపుల కలశాలు, ముదురుపచ్చల ఏనుగుల చెక్కడపు పనితో మణిమయ సౌధాలతో నిండిన తీరైన వీధులు. వివాహానికి నొసట కట్టిన బాసికమంత నిట్టనిలువుగా వీధుల అమరికతో ఆ ఊరు. ఎఱ్ఱని బొండాల కొబ్బరిచెట్లు మణిమయాలైన రహదారులకి ఇరువైపులా బారులు బారులుగా ఉన్నాయి.  

వీధుల్లో ఒల బావులు ఉండేవి. బొడ్డుటొఱ దాకా వచ్చిన నీళ్లలో తిరిగే చేపల్ని అందుకునేందుకు ఇంటి చూరుల్లోకి సాగిన కొమ్మల దాగి లకుముకి పిట్టలు రివ్వురివ్వున దూకుతున్నాయట. వీధుల వెళ్లే అంగనలతో ఆ ఇళ్ళు పొంచి ఉండి పూలచెండులాడుతున్నట్టు మనోహరంగా ఉంటుందా దృశ్యం. 

ఉద్యానాలలో చెంగలువల కొలనులో స్త్రీలు పసుపు పూసుకుని స్నానం చేసి, కోవెలలో స్వామికి అభిషేకజలం కడవలతో మోసుకుపోతారు. నీటితో భారమైన కడవలు నడుముకి అన్చి, పూజార్థమై చేతిలో పట్టుకున్న కలువలు ఆ కడవనీటిలో తొణికిసలాడుతుండగా వనాల లోపలిదారులగుండా స్వామిని చేరుతారు. తోవ పొడవునా దివ్యప్రబంధాలు వల్లెవేస్తూ, పాడగములు ధరించిన చక్కని పాదాలతో నడచి వెళ్తారట. 

అంగనల సంగతలా వుండగా వారాంగనలెంతటి వారో విను. సన్యాసుల హృదయాన్నైనా ఝల్లనిపించేంత రూపసులు. సరే, అరుగుల మీద కూర్చుని పాచికలాడడం వారికి వినోదం. ఎవరొచ్చినా మొగమెత్తి చూడరు. కోవెలకి వెళ్లొచ్చే భగవత్ కైంకర్యపరులయితే మాత్రం ఠక్కున లేచి మొక్కుతారు! వారి కడగంటి చూపుకోసమే దేవేంద్రుడు కూడా ఆ దేవాలయ పరిచారకత్వం కోరుకుంటాడట. ఆలయపు సమయాలలో వినబడే శంఖారావానికి బెదిరి పాచిక జారవిడుస్తూండగా కొప్పుజారెనా.. అది ముడిచే సొగసైన తీరు చూసి తీరవలసిందే. 

కప్పురవిడెము నిరంతరమూ పరిమళించే నోట పలువరుస వెన్నెలలు వెలిగేందుకు... ఒక్క శాలిధాన్యపు బీజంతో దంతధావనం చేసుకుంటారట. పసుపు రాసుకుని తెల్లని వస్త్రంతో రుద్దిచూసినా పసిమి వారి ఒంటిని వదిలిపెట్టదు. పరిమళ లేపనాలు పల్చగా రాసుకుని జలకమాడుతారు. ఎంతటి ధనవంతుడైన విటుడొచ్చినా, గుణగణాదులు తెలియనిదే అతనిని చేరనివ్వరు. పూర్వపు చెలిమి గుర్తుంచుకుని ధనము లేకపోయినా మంచివాడిని ఆదరిస్తారు. అంతఃపురకాంతలకి సరితూగే వనితలు వారు. చక్కగా కృతి చెప్పగల విద్యావతులు. 

ఆ ఊరి యువతులు నవనాగరీకులు. చిలుము పడుతుందని బంగారం పెట్టుకోరు. వారికి ఆభరణాలంటే మేలిమి ముత్యాలే! పూవులు ముడిస్తే కురులు తడుస్తాయని సాంబ్రాణి ధూపంతోనే సువాసనలు అద్దుకుంటారు. పునుగు జవ్వాదితో ఒళ్లు జిడ్డు తేలుతుందని కస్తూరి మాత్రమే అలుముకుంటారు. సన్నని జిలుగు చీరలే తప్ప ఇంకొకటి కట్టరు. 

ఆ ఊరి అమ్మాయిలు తమ ఇంటివెనుక కొలను ఒడ్డున రతనాల మెట్ల మీద పసుపుకొమ్ము అరగదీసుకుంటారు . పెరటి హంసలు ఆ పసుపు చాయల్లో దొర్లి రెక్కలన్నీ బంగారువర్ణానికి తిప్పుకున్నాయట. 

సంపెగపూల తోమాలలా విరగకాసిన అరటిపళ్ళ గెలలు, పోకచెట్లని అల్లుకున్న తమలపాకు తీగలు, పాకాలూరే చెరకు తోటలు, సస్య కేదారాలు, వాలుగచేపలు మిక్కుటంగా తిరిగే కలువల బావులు అక్కడి సర్వసాధారణ దృశ్యాలు. 

దేవాలయంలో వెలసిన కృష్ణుని మెడలోని తులసీమాలికల చల్లదనం, అక్కడి పొంగళ్ల కమ్మదనమూ, అట ఆడిన ఆటవెలదుల కొప్పుల ముడిచిన చెంగలువల సౌరభమూ కలిసిన గాలి అక్కడ తిరుగాడుతూ ఉంటుంది. 

పురవీధుల్లో తిరిగే మదపుటేనుగులది మరొక గమ్మత్తైన వ్యవహారం. మావటీలని లెక్కజేయకుండా అడ్డొచ్చినవారి మీద విజృంభిస్తూ శత్రువులపై ప్రయోగించిన శక్తుల్లా ఉంటాయవి. అస్తమానము పైన మన్ను ఎత్తి పోసుకోవడమొక ఆట. ఆ గజాలను ఏ చెట్టుక్రిందైనా నిలిపితే పైనున్న పక్షుల ముక్కుల చిక్కిన గింజలు ఆ ఏనుగులపై రాలేవట. ఆపై తొండాలతో నీరు జల్లుకుంటే ఆ గింజలు మొలకెత్తి నడిచే పర్వతాలలా కనుపట్టేవి. 

ఇక బాహ్లిక పారశీక శకధారా ఆరట్ట ఘోట్టాణ దేశాలనుండి తెప్పించిన గుర్రాలు రెండందాలా రౌతులనే ఇబ్బందిపెడతాయట. పరిగెట్టేప్పుడు కురచై కాళ్ళు నేలకి తాకి భయమూ, గుర్రం పైకెక్కేటప్పుడు రెండంకవన్నెలు అంటే రెండు రికాబులు ఎక్కితే కానీ సామాన్యుడెవడూ వాటిని అందుకోలేనంత ఎత్తుగా ఉండి రౌతుకి అవమానం కలుగుతుంది. 

ఆ ఊరి కాపులు, మేము నాగలి పట్టి దున్నడం వల్లే కదా రాజు రాజరికపు సుఖాలు అనుభవిస్తున్నాడు అని దున్ని కొండలు కోట్లుగా ధాన్యరాశులని పండిస్తారు. కోమట్ల దానజలాలు కాలువలుగట్టి అంగడిలో స్తంభాలు చిగుర్చుతున్నాయట. అసలు వింత, రతనాల అంగళ్ళు. నవరత్నాలు ఎంత ఎత్తు రాశులంటే... త్రిశంకుస్వర్గం దాకా ఆ అంగడిలో పోసిన పోగులేనట.

రాజు ప్రజలని పీడించి పన్ను తీయడు. చెప్పుడు మాటలు వినడు, పొగడ్తకి లొంగడు. తన పరాక్రమానికి తానే గర్వించి ఒకరిని తక్కువచెయ్యని సత్పురుషుడు. 

ఆ రాజ్యంలో మనలాంటి సామాన్యులు బోలెడుమంది ఉంటారు కదా..  వారి జీవితం నల్లేరు మీద బండి నడక. మన ఊహకి కూడా అందని భాగ్యమది. 

*********

చూడూ... కాలానికి లొంగక ఈ భూమ్మీద మిగిలినవి రెండే! అక్షరమూ, ప్రేమ. 

వాటికి పట్టం కట్టిన రాయలరాజ్యంలో పుట్టే ఉంటామా? అనుమానమే లేదు. హజార రామాలయంలో ఉత్సవానికి నీ చేయి పట్టుకు వడిగా నడుస్తున్నట్టనిపిస్తోంది. నువ్వు దిద్దిన నా గోరింట చేతులు జోడించి జీవనమాధుర్యాన్ని ఆస్వాదించే అవకాశమిచ్చిన కాలస్వరూపుడికి మొక్కుతున్నట్టుంది. 


తనివి దీఱకుండఁ గనుఁగొనఁదగి యుండి, 
మనసు మనసుగలిసి, మంచి తనము 
నూని, సుఖము దుఃఖమొకటిగ మనువారి 
పొందుగనుట పెద్దపున్నెమిలను 

15 comments:

  1. అద్భుతం ... మీర్రాసింది చదివాక హంపి మీద ప్రేమ వెయ్యింతలయ్యింది.

    ReplyDelete
  2. // "వాటికి పట్టం కట్టిన రాయలరాజ్యంలో పుట్టే ఉంటామా? అనుమానమే లేదు." //

    చాలా అందమైన ఊహ 👌😊.

    ====================================
    // "అచ్చం మీ పద్మనాభం కుంతీమాధవస్వామి కోవెలలా లేదూ?" //

    ఈ కోవెల గురించే కదూ గొల్లపూడి మారుతి రావు గారి "సాయంకాలమైంది" నవలలో ప్రస్తావన వస్తుంది?

    ReplyDelete
    Replies
    1. అవునండీ. ఆ కోవెలే. హంపి లో కృష్ణుడికోవెల నమూనాలోనే పద్మనాభం కోవెల కట్టారేమో అనిపించింది. ధన్యవాదాలు.

      Delete
  3. Nice post.ur post increased my wish to see Hampi.Hope a day come when I show my kids all historical places in India.I am proud of my country and its rich heritage.whe I used to say this I don't know it's complete meaning.After seeing most of European countries historical places, every where I feel my country has rich culture and heritage where it's being neglected in passing information to future generation.On the other side other countries are making their generations know about their history.Govt should take action to improve historical knowledge to children.Anyway after reading your post once again I could visualise srikrishnadevarayala samrajyam.Thank you for showing it in Ur beautiful narrative post.

    ReplyDelete
    Replies
    1. శిధిలాలని పునరుద్ధరించి పర్యాటకులకి చూసే అవకాశం కల్పించిన UNESCO కి ఎంతైనా ఋణపడిపోయామండీ. చరిత్రని కొంతవరకూ అక్కడ ఫలకాల్లో చదవచ్చుకానీ ఇంకా ప్రచారమైతే జరగాల్సి ఉంది. చరిత్రకారులు ముందుకొచ్చి చెప్పాల్సిన కథలివన్నీ. మీ స్పందనకి ధన్యవాదాలు.

      Delete
  4. "అప్పుడు పుట్టి ఉంటే" అన్న మాట అన్నారు కానీ, మీరు ఒకప్పుడు అక్కడ ఉండి కొంత విరామం తర్వాత రూపు మారిన ఊరిగురించి మా కోసం కళ్ళకు కట్టినట్టు వ్రాసారు. చాలా బావుంది.

    ReplyDelete
    Replies
    1. హంపిలో ఎవరి ఊహకైనా రెక్కలు తొడగాల్సిందేనండీ. స్థలమహాత్మ్యం! ధన్యవాదాలు.

      Delete


  5. బాహ్లిక పారశీక శకధారా ఆరట్ట ఘోట్టాణ దేశాలనుండి తెప్పించిన గుర్రాలు...

    వామ్మో! ఏ దేశాలండి‌ ఇవి‌?/



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మంచి రీసర్చే చేయించారుగా నాచేత. ఇవిగోండి వివరాలు. అంతలేసి దూరాలనుంచి గుర్రాలని ఎలా తెప్పించేవారో!

      బాహ్లిక - Bactria, situated in north of Afghanistan

      పారశీక - పర్షియన్

      శక - Scythian - Middle Eastern

      ధారా - మాళవదేశంలో ఒక భాగం అంటారు. పంజాబు, రాజస్థాను దగ్గర్లో

      ఆరట్ట - ఎక్కువ మాట్లాడేవారు ఉండే దేశమట. పంజాబే మళ్ళీ

      ఘోట్టాణ - Khintan in Central Asia, మంగోలులు

      Delete


    2. ఆయ్ :) కాదా మరి :) కొత్తావకాయ సత్తా పూర్తిగా తెలియ వలె కదా :)

      ( రాబోయే కాలములో జాగ్రత్తగా ఇటువంటివి రాసేటప్పుడు కొంత రీసెర్చి చేసి‌ రాయండేం‌ :) లేకుంటే మళ్ళీ నేనడగటం మీరు రీసెర్చీ అంటూ తలమునకలవడం తప్పేను :))



      నెనరుల్స్ !

      జిలేబి

      Delete
  6. వెంటనే హంపీకి ప్రయాణం కట్టాలనిపించేలా రాశారు.. విజయనగర సామ్రాజ్యం అనగానే ఎంటీవోడు, బాలయ్య బాబు గుర్తొచ్చేస్తారు అదేంటో. 'పాట్పూరికి సమీపమున' విజయస్థంభం ప్రస్తావన 'సాయంకాలమైంది' లో ఉంది. ఆ కథ మాత్రం ఇప్పుడే తెలిసింది. 

    ReplyDelete
    Replies
    1. నెమలికన్ను దృక్కోణం ఎప్పుడూ విభిన్నమే. యాత్రావిశేషాల పోస్ట్ కోసం ఎదురుచూస్తానైతే. ధన్యవాదాలు. :)

      Delete
  7. ఎన్నో ఏళ్ల తరువాత మీ వాక్యాలు చదువుతున్నాను. ' హంపీ నుంచి హరప్పా దాకా, ఏది చరిత్ర, ధూర్జటి చారిత్రక నవల' చదివి హంపీ గురించి ఏడ్చాను, జ్వరం వచ్చినంత పనయ్యింది. మీ యాత్రా స్మృతి చదువుతుంటే మళ్లీ అదే అవస్థ. చనిపోయిన ప్రియురాలి సమాధి దగ్గరకి వెళ్ళలేక, వదలలేక మధన పడే ప్రియుడి లాగా, నేనూ...హంపీ... ఎన్నో ఏండ్లు గతించి పోయినవి గానీ ఈ స్మశాన స్థలిన్ అన్నటుగా.. ప్రతీ మాట చాలా బాగుంది , ఇది ప్రస్తావిద్దాం అనుకుంటే, ఇంకోటి, మరోటి...మొత్తం పోస్ట్ అంతా ఉటంకించాలి అలా ఉంది... నమస్సులు 🙏🏼

    ReplyDelete
  8. అద్భుతంగా రాశారండీ. నేన్నిజానికిది first-day-first-show నే చదివేశాను. మళ్ళీ, మళ్ళీ మళ్ళీ చదువున్నప్పుడు మరీటికెట్టు కొనకుండా ప్రయాణిస్తున్నట్టనిపిస్తోంది, అందుకని మీకు అభినందనలు, ప్రశంసలు తెలియజేద్దామని.

    విరిగిపోయిన విగ్రహాలు, కూలిపోయిన గోడలు చూసి గడిచిపోయిన వైభవాన్ని అందంగా ఊహించుకుని(పునర్నిర్మించుకుని) అంతే అందమైన మాటల్తో బొమ్మగీసిపెట్టారు.

    మొదటసలు ఈబ్లాగు చూసిన వెంటనే ‘అరె అప్పుడే రాసేశారే ఈమె’ అనుకుని మళ్ళీ, ఇంతకుముందురాసిన బ్లాగ్ తేదీచూసి ‘మరీ త్వరగా ఏంకాద’నుకుని, మళ్ళీ ‘ఎప్పుడైతేనేం లే, గంగిగోవు పాలు.’ అనుకుని, చదవడం మొదలెట్టాను. చదువుతూ చదువుతూ, ‘కడివెడున్నట్టున్నాయే, వెరీగుడ్’ అనుకున్నాను. ఆఖరుకొచ్చి, ‘పైకి (అంటే గట్టిగా) చదివి రికార్డుచేసుకుని ఈసారి హంపి వెళితే (గిళితే) ఇది చెవుల్లో పెట్టుకుని వింటూ చూడాలి’ అనిపించిందండి. అంత నచ్చిందిఅంత ఆనందించాను. Thank you. Thank you very much. - రవి

    ReplyDelete