Tuesday, August 16, 2011

ప్రేమలో నేను - అరడజను సార్లు

"దీని అసాధ్యం కూలా.. రాసేసిందీ? " అని కుర్చీలో ముందుకు జరిగి శోభాడే 'సోషలైట్ ఈవెనింగ్స్'  చదివినంత ఉత్సాహంగా చదివెయ్యడానికి సిధ్ధపడితే మీరు పప్పులో కాలేసినట్టే!  నన్ను అమాంతం  ప్రేమలో పడేసిన ఆరడజను మరపురాని పదార్ధాల గురించి నోరూరించేలా  చెప్తానని మాత్రం షడ్రుచుల మీద ఆన. "తిండితో ప్రేమేంటి?" అనడానికి మీరేం మాయాబజార్ చూడని తెలుగువారు కాదుకదా!

పొరుగింటి పుల్లకూర : .. రుచి" అని వెక్కిరించిన వారి పొరుగింట్లో మా సుబ్బలక్ష్మాంటీ లాంటివారు ఉండి ఉండరు. పూర్ణకుంభానికి ఏడుగజాల పుల్లేటికుర్రు చీర కట్టి, వెన్నపూసంత చల్లని చిరునవ్వు తగిలిస్తే సుబ్బలక్ష్మాంటీ. పేరంటాలకి, నోముల వాయినాలు తీసుకోడానికి సాయం వెళ్ళడానికి ఆవిడ ముగ్గురు కూతుళ్ళూ మొండికేస్తే, అభిమాన పుత్రిక హోదాలో నేను ఆవిడ వెంట తిరిగే దాన్ని. అదే హోదాలో ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర అయ్యే సరికి నా చెవులు రిక్కించుకు ఎదురుచూసేదాన్ని, గోడ అవతల నుంచి వినపడే పిలుపుకోసం.

 ఓ కాలు చాపుకు ముక్కాలి పీటమీద కుర్చోని, పంపు స్టవ్ మీద పెట్టిన  పెనం మీద,  పక్కన న్యూస్ పేపర్ పై  తయారు గా ఒత్తి పెట్టుకున్న చపాతీలు కాలుస్తూ ఉండేవారు ఆంటీ. పక్కనే పెద్ద కుంపటిమీద ఇంకాస్త పెద్ద గిన్నెలో పొగలు కక్కుతూ చిక్కదనాన్ని సంతరించుకుంటున్న బంగాళదుంపల కూర. అది సాదాసీదాగా తయారు చేయబడే ఓ మహత్తరమైన పదార్ధం.  ఆవాలు, జీలకర్ర, బోలెడు పచ్చి మిరపకాయలు, అల్లం, కరివేపాకు తాలింపు చిటపట్లాడాక ముందు ఉడికించి చిదిమి ఉంచిన బంగాళ దుంపలు వేసి, కాస్త ఉప్పు, పసుపు, ఆ తరువాత నీళ్ళలో కలిపిన శెనగ పిండి కలిపి ఉడికాక ఓ నాలుగు చుక్కల అమృతం చిలకరించి కుంపటి సెగ తగ్గించి అలా ఓ అరగంట ఉడికిస్తే .. ఆ.. ఏమంటారూ, అమృతం తియ్యగా ఉంటుందా!  నాన్సెన్స్... ఎవరు చెప్పారు మీకు?

స్టీల్ ప్లేట్లో గరిటె జారుగా ఉన్న కూర వేసి ఇచ్చేవారు. చేతులు కాలకుండా జాగ్రత్తగా ప్లేట్ పట్టుకొని కూర్చుంటే, పెనం మీద నుంచి నూనె పూసుకొని పొంగి ఆవిరి వదులుతూ ఘుమఘుమలాడే చపాతీ సరాసరి ప్లేట్లోకి దూకేది. ఎడం చేత్తో ప్లేట్ జారిపోకుండా పట్టుకొని గొంతుక్కూర్చొని కుడి చేత్తో ఓ  చపాతీముక్క  తుంపి సెగలుకక్కుతున్న కూరని దొరకబుచ్చుకొని అలా నోట్లో పెట్టుకుంటే నాలుక మీద దీపావళి.  వేడి, కారం, మళ్ళీ వేడి, ఉప్పదనం, చపాతీ కమ్మదనం, అల్లం ఘాటు, మళ్ళీ కారం.. ఓహ్.. రుచి మొగ్గలు పిల్లి మొగ్గలేసేవంటే నమ్మండి! మనిషి  నోరు ఎన్ని డిగ్రీల వేడిని తట్టుకోగలదో దానికి ఖచ్చితంగా ఇరవై ముఫ్ఫై డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే ఆ చపాతీ కూర నోట్లోకి వెళ్తూంటే కళ్ళలో నీళ్ళు, ముక్కు పై చెమట , నాలుకపై ఇదీ అని చెప్పలేని అద్భుతమైన రుచి.. వెరసి సుబ్బలక్ష్మాంటీ  చేసిపెట్టే  శనివారం ఫలహారం.

ముత్యాల జల్లు కురిసే :  ఊళ్ళో పెళ్ళయితే ఎవరికో హడావిడి అన్నట్టు, నా చిన్నతనంలో మాకు తెలిసినవాళ్ళెవరి ఇంట్లో పెళ్ళి జరిగినా నాకే భలే సంబరంగా ఉండేది. బంధువర్గంలో పెళ్ళి ఏదైనా కుదిరితే బంగారం రామానుజయ్య అండ్ సన్స్లో, మధుపర్కాలు గోపాలరావు షాపులో, లడ్డూ తయారీ మా తాతగారి చేతిలో. తెల్లవారుఝామున మొదలయ్యే లడ్డూ మహా యజ్ఙం ఇంచుమించు మిట్ట మధ్యాహ్నానికి ఓ కొలిక్కి వచ్చేది. కట్టి, ఆరబెట్టిన లడ్డు బుట్టల్లోకి ఎత్తి పైన అడ్డాకులు వేసి జాగ్రత్తగా పెళ్ళివారింటికి పంపించేసేవారు. అంతా అయ్యాక నూనె మూకుడు ఉంది కదా! అని వంక పెట్టి  అటక మీద నుంచి ఇంకో జత బూందీ చట్రాలు తీసేవారు. మోతీచూర్ లడ్డూ చేయడం కోసం.. నాకోసం ప్రత్యేకంగా!

 అతి సామాన్యమైన శెనగపిండిలో కాసిని నీళ్ళు కలిపి ఓ చట్రం లో పోసి, టక్ టక్ మని శృతి బధ్ధం గా కొడుతూంటే, జల్లులా పిండి వేడి నూనెని తాకడం,  సెకనులో నాలుగోవంతులో చిన్నచిన్న ముత్యాల్లా బంగారు రంగు బూందీ గా పరిణామం చెందడం, బలిష్టమైన తాతగారి ఎడమచెయ్యి ఇంకో చట్రం తో అలవోకగా ఆ బూందీ తీసి పక్కనున్న పళ్ళెంలో జారవిడవడం.. నా మస్తిష్కంలో అదో చెరిగిపోని అద్భుతం. తయారుగా ఉన్న పాకంలో బూందీ ఒక్క మునక వేసిందా.. జిహ్వకి, మనసుకి ఒకే సారి తీయని స్వర్గ ద్వారాలు తెరిచి రారమ్మని పిలిచే మోతిచూర్ లడ్డూ తయార్. స్వర్గంలో రంభ లడ్డూలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, నా మట్టుకు నాకు ఇష్టమైన పదార్ధాల స్వర్గంలో రంభ లడ్డూయే!  

పాడెద నీ నామమే :  "మసాలా.." అని పాడి తీరుతారు మా ఊళ్ళో నాగభూషణ్ మసాలా ఒక సారి తిన్నవాళ్ళు. వీధికో నాలుగు ఛాట్ బండీలు పుట్టుకొస్తున్నా, విజయనగరం ఊళ్ళో ఎవర్ గ్రీన్ "నాగభూషణ్ మసాలా".  హై స్కూల్లో ఉండగా  సాయంత్రం నాలుగున్నర అయ్యేసరికి రెక్కలు విప్పుకొని పక్షుల్లా వాలిపోయేవాళ్ళం  కోట బయట శ్రీ డెంకేషా వలిబాబా గోరీకి అభిముఖంగా ఉండే ఓ సాదాసీదా బఠాణీ ఛాట్ అమ్మే బండి దగ్గర. "నాగభూషణ్ మసాలా" అని ఎర్ర వంకర టింకర అక్షరాలతో  రాసి ఉంటుంది బండి మీద. పెద్ద పెనం మీద రాశి పోసి మరిగిస్తున్న కాబూలీ శనగలు, చుట్టూ పెద్ద కోట గోడలా కేరట్, బీట్రూట్ తురుము. అందులో ఏముంటుందో చిదంబర రహస్యం కానీ, ఎలా ఉంటుందో మా ఊరి పిల్ల జనాలని ఎవరిని అడిగినా చెప్తారు.

ఇనుకోండి.. వేడిగా పొగలు కక్కుతూ, కొత్తిమీర ఘుమఘుమలతో  నోట్లోకి ప్రవేశించిన ఆ మసాలా ఏమేం చేస్తుందో తెలుసా.. నాలుక మీద రుచుల విస్ఫోటనం!!!  చిన్న ప్లేట్లో మీ చేతిలో ఉన్న ఆ చాట్ అలా అలా అలా మీ సర్వేంద్రియాలని లోబరుచుకొని, మీ ఏకాగ్రతని తన పై నిమగ్నం చేయించుకొని, ఆ క్షణంలో ప్రపంచం మునిగిపోయినా, మీరు మాత్రం ఆ ప్లేటు చేత్తో పట్టుకొని యే మర్రాకు మీదో కూర్చొని పూర్తి చేసి తీరేలా చేస్తుంది.. విక్రమార్కుడికి మా నాగభూషణ్ మసాలా సంగతి తెలిసి ఉంటే, ఒక్క ప్లేట్ మసాలా కొనిపెట్టి భేతాళుడి నోరు మూయించి మోసుకుపోయేవాడు.

మావా..మావా..మావా... : అయిదడుగుల ఎత్తు, సాంప్రదాయ వస్త్రధారణ, చమత్కారం చెమక్కుమని మెరిసే మాటతీరు, పనసపొట్టు కుర్మా అత్యద్భుతంగా చేసే నైపుణ్యం మా మూడో మేనమామ రాజగోపాల్ సొత్తు. ఇంటికి పెద్దల్లుడయిన మా నాన్నగారు వచ్చారంటే అమ్మమ్మగారింట్లో మహ సందడిగా ఉండేది. "బారూ (బావగారు).. పనసకాయ కొట్టెయ్మంటారా?" అని తెలతెలవారుతూనే అడిగేవాడు గోపాల్ మావయ్య.  సై అంటే సై అనుకొని మరీ లేతగా లేని మంచి పనసకాయ తెచ్చి పనసపొట్టు కొట్టడంతో పని మొదలయ్యేది మావయ్యకి. "అరవై నాలుగు కళల్లో పనసపొట్టు కొట్టడం ఒకటి" అని నేను నమ్ముతాను. మీరు నమ్మకపోతే ఒక సారి పనసపొట్టు కొట్టి చూడండి.

 పెరట్లో స్టవ్ తెచ్చి పెట్టుకొని ఇత్తడి మూకుడు (బాణలి/బాండీ) పెట్టి యాలకులు, లవంగం, దాల్చినచెక్క, అనాస పువ్వు, నేతిలో దోరగా వేయించి రోట్లో దంచి మసాలా తయారుచేసుకొనేవాడు. అదే పాత్రలో జీడిపప్పు వేయించుకొని పెట్టుకొనేవాడు. ఆ తరువాత అంతా విష్ణుమాయ. ఇవే పదార్ధాలతో ఓ నలభైసార్లు నేనూ పనసపొట్టు కూర వండి ఉంటాను. నలభైసార్లూ చక్కగా కుదిరింది. కానీ కూర వేడి అన్నంలో కలుపుకొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే కళ్ళు మైమరుపుగా మూతలు పడలేదు. తింటున్నంత సేపు ప్రపంచం ఇంద్రధనస్సు మీద ఊయలలూగలేదు. తిన్నాక నాలుక నాకు తృప్తిగా థాంక్యూ చెప్పలేదు. అదీ సంగతి. మావయ్యా.. మజాకా?

కొత్తగా.. రెక్కలొచ్చెనా.. :  బెంగుళూరు వెళ్ళండి. జేపీ నగర మూడో ఫేస్ బస్ స్టాండ్ ఎదురుగా ఓ పార్క్ ఉంటుంది. ఆ రోడ్ లో అలా నడుస్తూ వెళ్ళండి. ఓ రెండు వందల అడుగులు వేసాక ఇంక మీ కాళ్ళు నడవనంటాయ్. ముక్కు మూరెడు పొడవున ముందుకు పెట్టి మరీ గాలి పీల్చుకుంటూ, ఓ నాలుగైదు నిముషాలు పారవశ్యంలో మునిగిపోయాక అప్పుడు మెదడు పనిచెయ్యడం మొదలుపెడుతుంది. "ఓయ్.. ఇదేం సువాసన.. ఇదేం మత్తు.. కాఫీ... కాఫీ.. ఏదీ... ఎక్కడ..?? " అని కేకలు వినిపిస్తాయ్ మీ లోంచి మీకే. మీకు కుడివైపు "కొత్తాస్ ఫిల్టర్ కాఫీ" (Cothas Coffee)  తయారుచేసే బ్రూవరీ ఉంటుంది. అక్కడ వాసనే తప్ప కాఫీ దొరకదు. వాచ్ మన్ మిమ్మల్ని చూసి "లక్షా ఎనభైవేల మూడొందల నాలుగో పిచ్చాడు" అని నవ్వుకొని లెక్క రాసుకుంటాడు. అస్సలు సిగ్గు పడకుండా శక్తి కూడగట్టుకొని ఒక్క ఏభై అడుగులు వేసారా.. అక్కడ 'పార్క్ వ్యూ' అని ఓ చిన్న రెస్టారెంట్ ఉంటుంది. అందులో కొత్తాస్ వాడి స్టాల్ ఉంటుంది. చిక్కటి నిశిధిలాంటి ఫిల్టర్ డికాషన్ కళఫెళా మరుగుతున్న కమ్మటి పాలలో కలిపి మోక్షాన్ని గ్లాసులో పోసి అందించే శ్రీ మహా విష్ణువులా అందిస్తాడు. ఓ దండం పెట్టి దక్షిణ చెల్లించుకొని పక్కకి రండి. పంచదార కలుపుకున్నారా? ఆ.. ఇంక కానివ్వండి.

మొదటి సారి ఆ కాఫీ తాగి పార్కంతా భానుప్రియలా ఎగురుకుంటూ పాట పాడాక తెలిసింది. "కొత్తగా రెక్కలొచ్చెనా.." పాట తమిళంలో, మళయాళంలో, కన్నడలో కూడా చాలా మంది భానుప్రియలు, వెంకటేష్లు పాడుతూ బెంగుళూరంతా తిరుగుతూ ఉంటారని. నమ్మ బెంగళూరంతా కొత్తాస్ వాడి స్టాల్స్ ఉంటాయి.  కోత్తాస్ ఫిల్టర్ కాఫీకీ జై!

ఓ రాజస్థానీ ప్రేమ వంటకం : తిరుపతి లడ్డూ ఆత్రంగా ఓ పెద్ద ముక్క నోట్లో పెట్టేసుకున్నారనుకోండి ఎలా ఉంటుంది? గుటుక్కున మింగలేరు. అలా అని ఉమ్మనూలేరు. ఉక్కిరిబిక్కిరిగా ఉన్నా భరించేస్తాం. తప్పక కాదు. ఇష్టమైన కష్టం కనుక.  అచ్చం అలాగే ఉంటుంది తొమ్మిదో నెల గర్భం అంటే. (తెలియని వాళ్ళకి చెప్తున్నాసుమండీ! ) నిండు చూలాళ్ళు ఓ ముగ్గురిని (నేను, నా ఇద్దరు స్నేహితురాళ్ళు) భోజనానికి పిలిచింది మా రాజస్థానీ దోస్తు పూనం. ఆపసోపాలు పడుతూ వెళ్ళి కూలబడ్డాం. ఇల్లంతా ఆనంద నిలయుని పోటులా నేతి వాసనలతో ఘుమఘుమలాడిపోతోంది. కాస్త స్థిమితపడ్డాక "వీటిని దాల్ బాటి అంటారు.  భలే బావుంటాయ్. మీరు తిని ఉండరని చేసాను." అని తలో ప్లేటు చేతికి అందించింది. మేం ముగ్గురం తెలుగు వాళ్ళమేలెండి.

గోధుమ పిండి తో చేసిన లడ్డూలు అవెన్లో ఉడికించి నేతిలొ ముంచి తీస్తారు. వాటిని బాటీ అంటారు. లవంగం, దాల్చిన చెక్క వేసి ఉడికించిన కంది పప్పు లో నేతి తాలింపు దట్టించి వేసి ఆ పప్పు ఈ బాటీల మీద పొసి, పైన తలో గరిటెడు నెయ్యి పోస్తారు. ఎన్ని కేలరీలో లెక్కపెట్టుకోవడం అనవసరం. రుచి ఎలా ఉంటుందని అడగండి చెప్తాను. గోధుమ పిండి దేవతలు, పప్పు దేవతలు కలిసి నేతి దేవత ని తోడు తీసుకు వచ్చి "ఓహోహో భక్తులారా.. మీ జన్మ ధన్యం చేసుకోండి" అని ప్రసాదించిన పరమాద్భుతమైన పదార్ధమే దాల్ బాటి. కడుపులో కూనలని కాస్త పక్కకి జరిపి మరీ దట్టించేసాం. ఆ రుచి అమోఘం. మహత్తరం!! ఆ కమ్మదనాన్ని పూనం ప్రేమతో మాత్రమే పోల్చగలను.

లా రోసాస్ . . Amore mio : మరువం, తులసి మనం తలలోకి, పూజకీ వాడితే Pizza లో వేసి ప్రపంచాన్ని జయించేసారు ఇటాలియన్స్. నాకు మొదట్లో Pizza అంటే అంత గొప్ప అభిప్రాయమేం ఉండేది కాదు. ఓ వర్షం కురిసిన రాత్రి వంటచేసే ఓపికలేక, ఇంటిపక్క ఉన్న Pizzeria కి వెళ్లేవరకూ. అదే 1945 లో పుట్టిన "LaRosa's Pizzeria." వెజ్జీ మీడియం అని చెప్పి కూర్చున్నాం. పది నిముషాల లో ఓ వేడి వేడి వృత్తాకారపు slices of love మా ఎదుట నిలిచింది. గొలుసు  Pizzeria ల్లో తిని ఉన్న వాళ్ళ ఊహలకి కూడా అందదు ఈ Pizza. హోటల్ లో తిన్న ఇడ్లీ కి, అమ్మ చేసి పెట్టిన ఆవిరి కుడుము కి ఉన్నంత తేడా. అక్షరాలా హస్తిమశకాంతరం. 

 చక్కగా ఆలివ్ నూనెతో కలపబడిన రొట్టె మీద దేశవాళీ provolone, mozzarella cheese  వేసి, చక్కటి రోమా టొమాటోలతో  marjoram వేసి చేసిన సాస్ పూసి, దాని మీద ఆర్టిచోక్ హృదయాలు, బెల్ పెపర్ (కాప్సికం), వంకాయ, ఆలివ్స్ మరియూ బేసిల్ ఆకులు పరిచి సరైన ఉష్ణోగ్రతకి bake చేసి oven లోంచి తీసాక మళ్ళీ pizza అంచులపై ఆలివ్ ఆయిల్ పూసి అప్పుడే తురిమిన బేసిల్ ఆకులు జల్లి తెచ్చి పెట్టాడు. తింటూన్నది నోట్లో కరిగిపోవడం అంటే ఏమిటో మొదటిసారి తెలిసింది.అసలు నేను ఆ Pizzeria కి వెళ్ళి ఉండకపోతే, అసలు నేను ఆ Pizza  తిని ఉండకపోతే.. అని ఊహించుకుంటేనే "హమ్మయ్యో!!" అనిపిస్తుంది.

అవండీ నాకు ప్రియమైన పదార్ధాలు. మరి మీకు?

(హితభుక్ మితభుక్.
మీకు ఎక్కువైన మెతుకు - ఆకలితో ఉన్నవారికి బతుకు .)

66 comments:

 1. అబ్బ! ఏం ఊరించేసారండీ బబూ! ఇది చాలా అన్యాయం. ఇలా ఇన్ని రుచికరమైన పదార్ధాలని మీ అందమైన అచ్చతెలుగు పదాల్లో నేతి తాలింపేసి మమ్మల్ని అందులో ముంచేయడం భావ్యమా అధ్యక్షా!! :))

  ఇంకోటి ఏంటి అంటే...మీరు చివరన చెప్పిన ఆ నాలుగు ముక్కలు నాకు తెగ నచ్చెసాయి :)

  ReplyDelete
 2. మీరు రాత్రి అయింది. ఇలాంటి టపాలు రాసేసి పడుకుంటే..ఇక్కడ మేము పొద్దున్నే ఆరున్నర కి చదివి ఏమైపోవాలి?

  మీరు చెప్పిన లిస్టు లో ఉన్న పదార్థాలని వాటిని మీరు వర్ణించిన విధానం చూశాక, కనీసం ఒక్కటైనా ఈ పూట ఎంజాయ్ చేయాల్సిందే అని ధృఢ నిశ్చయం తో వంటింట్లోకి వెళ్తున్నాను కొతాస్ ఫిల్టర్ కాఫీ చేసుకుని తాగుతాం!

  ReplyDelete
 3. మీ పోస్ట్ చాలా రుచికరంగా వుంది. ఆఖరి నాలుగు మాటలూ ఇంకా "మనో" రుచికరంగా అనిపించాయి.

  ~లలితా TS

  ReplyDelete
 4. మీరు సిన్సిన్నాటి లో వున్నారా ?...
  లేక ఇంకెక్కడైన LaRosa's pizzeria వుందా ?

  ReplyDelete
 5. అందరికీ ఇష్టమైన పదార్ధాలు ఉంటాయి.కానీ ఇంత అందంగా చెప్పడం ..బ్యూటిఫుల్
  చాలా బాగా ఊరించారు

  ReplyDelete
 6. అబ్బ ! ఎంత వివరంగా రాసేరండీ.. చవులూరించేలా.. ! 'రుచి కీ ఆకలి కీ అవినావభావ సంబంధం వుంటుంది అనుకోండి కానీ కొన్ని ఒక సారి రుచి తెలుసుకుంటే, అదో అభిరుచి అయి తీరుతుందని' జీవ్స్ ఏనాడో చెప్పాడు. నేనెప్పటికింత రసరమ్యమనోహరంగా రాస్తానో అనిపించింది. మీ పూనం గారు చేసిన పని మా బావగారు (My husband's Brother) చేసారు. అపుడు నాకేమీ తినాలని కోరికలూ అవీ ఉండేవి కావు. ఒక రకమైన టెన్షన్ తో ఉండేదాన్ని ! అపుడోసారి ఒక డెలీషియస్ సండే తెచ్చిచ్చారు. వావ్ ! అస్సలు మర్చిపోలేను.

  ReplyDelete
 7. "తిండితో ప్రేమేంటి?" అనడానికి మీరేం మాయాబజార్ చూడని తెలుగువారు కాదుకదా! (హ్హహ్హహ్హహ్హహ్హహ్హ)

  ఎడం చేత్తో ప్లేట్ జారిపోకుండా పట్టుకొని గొంతుక్కూర్చొని కుడి చేత్తో ఓ చపాతీముక్క తుంపి సెగలుకక్కుతున్న కూరని దొరకబుచ్చుకొని అలా నోట్లో పెట్టుకుంటే నాలుక మీద దీపావళి.మనిషి నోరు ఎన్ని డిగ్రీల వేడిని తట్టుకోగలదో దానికి ఖచ్చితంగా ఇరవై ముఫ్ఫై డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉండే ఆ చపాతీ కూర నోట్లోకి వెళ్తూంటే కళ్ళలో నీళ్ళు, ముక్కు పై చెమట , నాలుకపై ఇదీ అని చెప్పలేని అద్భుతమైన రుచి.....కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్.

  మోతీచూర్ లడ్డూ చేయడం కోసం.. నాకోసం ప్రత్యేకంగా!(నాదీ సేం బ్రాండ్,ఇంట్లో స్వీట్ అంటే ఇదే తెస్తా)

  వేడిగా పొగలు కక్కుతూ, కొత్తిమీర ఘుమఘుమలతో నోట్లోకి ప్రవేశించిన ఆ మసాలా ఏమేం చేస్తుందో తెలుసా.. నాలుక మీద రుచుల విస్ఫోటనం!!! (మాకు విస్పోటనం మీద విస్పోటనం అవుతోందండి బాబూ)

  "అరవై ఆరు కళల్లో పనసపొట్టు కొట్టడం ఒకటి" అని నేను నమ్ముతాను.(ఎందుకు నమ్మం ఇంత చెపాకా కూడా,అంతేసి తిన్నాక కూడా)

  హ్హహ్హహ్హహ్హ సూపర్ గా రాసారులెండి,హేవిటో లాలాజలం గోదారిలా ఉప్పొంగి పరవళ్ళు తొక్కుతోంది నాయనోయ్

  ReplyDelete
 8. ఏం ఊరించేసారండి..స్వీట్లు తినని..కాఫీ తాగని నాకు కూడా అవి నచ్చేంతగా!

  చివరి పలుకులు బహు రుచిగా ఉన్నాయి.

  ReplyDelete
 9. ట్ఠ.....అంటే ఓ పెద్ద లొట్ఠ అని అర్ధం చేసుకోండి. పైన కామెంటిన అందరితో ఏకీభవిస్తాను ఈ పోస్ట్ రాసిన మీ చేతి మహత్వం గురించి! అంతే!

  ReplyDelete
 10. వాఅ...వాఆఆ... ఇంత దారుణం గా ఊరించేస్తారా?
  మీ వర్ణన కి ఇక్కడా నా చొక్కా అంతా తడిచిపోయిందండీ.
  అర్జెంట్ గా నాకూ, మా సెగట్రీ కీ పై వెరైటీలన్నీ పంపెయ్యండీ.. ;)

  కేక పోస్ట్..

  ReplyDelete
 11. అరడజను సార్లకి ఒకటి ఎక్కువగానే ఉంది. అయినా షడ్రుచులు ఏమిటి నా మొహం, మీ టపా సహస్ర రుచులు చూపించింది. మీరు వ్రాసిన ప్రతీ వాక్యం ఒక్కొక్క రుచి చూపించింది.

  >>>"అరవై ఆరు కళల్లో పనసపొట్టు కొట్టడం ఒకటి"
  అసలు కళ అంటేనే పనస పొట్టు కొట్టడం ఆ తరువాతే మిగిలినవి.

  ఏం చెప్పమంటారు. అద్భుతం.మా ఇల్లంతా ఘుమఘుమ లాడిపోతోంది. మీరు వ్రాసిన విధానం అనితర సాధ్యం. అంతే మరో మాట లేదు.

  ReplyDelete
 12. వా:(((((((((( ఆకలి.... ఆఆ ఆ ..........క........లి....... ఆఆ ఆ ఆఆఆ ఆ ఆ.........క...లి

  ReplyDelete
 13. "అరవై ఆరు కళల్లో పనసపొట్టు కొట్టడం ఒకటి"
  ఇది మాత్రం నూటికి నూరున్నర శాతం కరెస్ట్. పనస పొట్టు కొట్టడం అంత వీజీ కాదు. నేనూ ఈ కళలో ఎక్స్ పర్ట్ నేనండోయ్

  ReplyDelete
 14. మోతీచూర్ లడ్డూకి జై అంతే.

  ReplyDelete
 15. మళ్ళీ ఇక్కడ అంతర్జాతీయ తిండి మహాసభలా? :P పనసతొనలు తింటారుగాని, పొట్టు కూడా వదలరా! ప్చ్.. కరువుకాలం! :O

  ReplyDelete
 16. ఎంత బాగా వర్ణించారండీ... ప్రతి పదార్దం రుచి చూసినట్లే అనిపిస్తుంది మీ పోస్ట్ చదివాక :-)))

  ReplyDelete
 17. koaTa loa kaaleajee loa chadivinaa naaku ee chaaT banDi gurinchi teliyadanDi . ee saari inDiyaa veLLinappuDu tappakunDaa chuustaa...

  ReplyDelete
 18. ఏ విషయాన్నైనా ఎంతందంగా రాస్తారో! మీ వర్ణన ఎంత చక్కగా ఉందో.

  ReplyDelete
 19. వార్నీ ఏమి రాసావే!

  "అన్నిటికన్నా ముఖ్యంగా తినడం పడుకోవడం...ఇవి నాకు నిత్యావసరాలు మాత్రమే కాదు అభిరుచులు కూడా"...అని రాసుకున్నా ప్రొఫైల్ లో....నన్ను ఊరిస్తావా...నీకిది న్యాయమేనా?

  నాగభూషణం మసాలా...ఆహా ఓహో హృదయం, నాలుకతో పాటు ఎక్కడికో పరిగెడుతోంది. ఏమేవ్ అందులో వేసే ఒక అద్భుతమైన పదార్థం మర్చిపోయావు...అవే బ్రెడ్ ముక్కలు.బ్రెడ్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేయించి చాట్ పై అలా అలా జల్లేవాడు...అబ్బో అబ్బబ్బో...అసలా బ్రెడ్ ముక్కల కోసమే నేను నాగభూసహణం మసలా వైపు పరుగెత్తేదాన్ని. మొన్న జనవరిలో వెళ్లినప్పుడు నేను తిన్నానోచ్. రుచి కాస్త పలచబడిందిగానీ స్వర్గానికి ఓ బెత్తెడు దూరంలో నిలబెట్టిందనుకో!

  దాల్ బాటి బలే ఉంటుందే...దానితోపాటు చుర్మా అని ఒకటిస్తారు..రెండూ కలిపి తింటే సూపరు. మోతీచూర్ లడ్డూకి జై.

  ReplyDelete
 20. మాపై ఎంత పగ లేకపోతే ఇంత భీభత్సమైన టపా రాసి మమ్మల్నందరినీ ఇలా నానా రుచులలో ముంచి, ఊరించి..తేలేస్తారు...??? ఎంత దెబ్బ తీసారండి..!! పడ్డామండి ప్రేమలో మరి...మీ టపాలోని రుచులతో మరి...:))

  చాలా బాగా రాసారు.

  ReplyDelete
 21. ఈ మీ పోస్ట్ కి నేను కామెంట్ వెయ్యకపోతే మహా పాతకం చుట్టుకుంటుంది..మహా రుచికరంగా ఉంది మీ పోస్ట్..లాలజలప్రవాహన్ని ఒక్క టిష్యూ బాక్స్ అపలేకపోయి౦ది..నాకుమా అమ్మ చేసే పనకయముక్కలపులావ్ చాలా ఇష్టం..నేను మీ తో ఎకిభావిస్తున్నా పనసపొట్టు కొట్టడం ఓ కళ అని..చాలా చాలా బాగుంది నేను నాఛిన్నప్పటినుంచి పడి చచ్చే రుచులు అన్ని గుర్తు చేసుకున్నాను..

  ReplyDelete
 22. వావ్. ఎంత బాగా రాసారో. లడ్డు తప్ప మిగత అన్నిటికి నాకు నోరూరిపోతుంది. మీ నాగభూషణం మసాలా గురించి చదువుతుంటే, వైజాగ్లో బెరేక్స్ దగ్గర ఉండే చాట్ దుకాణం గుర్తొచ్చింది. చాల ఏళ్ళు వైజాగ్ వెళ్ళినప్పుడు తప్పకుండ అక్కడ చాట్ తినడం, సింహాచలం వెళ్ళటంతో సమానంగా నా ఎజెండాలో ఉండేది. అది కళ్ళ ముందు ఊహించుకుంటూ దాని ఎన్ని సార్లు రిప్రోడ్యుస్ చెయ్యాలని ప్రయత్నించినా మిగిలింది ఫేయిల్యురే. :-((
  పనస పొట్టు కొడుతున్నప్పుడు చూడటం నాకింకా ఇష్టం. మీరిప్పుడు అమ్మ చేసే ఆవ పెట్టిన కూర గుర్తుకు తెచ్చారు. అసలే ఎన్నో సార్లు, దాని మీద బెంగ పడిపోయి, ఆఖరికి ఇక్కడ చైనీస్ స్టోర్లో దొరికే కేన్డ్ పచ్చి పనసకాయ తెచ్చి ఆత్రంగా వండి, ట్రేష్ కేన్ కి సమర్పించుకున్నాను. :-(

  ReplyDelete
 23. పనసపొట్టుకూర గురించి చెప్పడం మరచిపోయానే....నాకు ఫేవరెట్ అది. అవును పనసుపొట్టు కొట్టడం 64 కళల్లో ఒకటి...ఒప్పేసుకున్నాం!

  పనసుపొట్టు ఆవపెట్టి కూరచేస్తే వాహ్ వా!
  అలాగే నూలుగుండ వేస్తే ఉంటుంది చూడూ....మా అమ్మ చేతిలో అమృతమే!

  ReplyDelete
 24. ప్రేమ గురించి ఏదో ఘాటుగా రాసి ఉంటారనుకుంటూ వస్తే, మరీ ఇంత స్వీటు టపానా!!!
  మీర్రాసినవి తినలేకా, తినలేకుండా ఉండలేకా ఎన్ని ప్రాణులు యెంత అవస్థ పడతాయో ఒక్కసారి, కనీసం ఒక్కసారి ఆలోచించారా, పోస్టు చేసేటప్పుడు??
  పనస పొట్టు కొట్టే విషయంలో మీతో నిస్సందేహంగా ఏకీభవిస్తున్నాను.. పనసపొట్టు ఆవపెట్టు కూరలో గోదారి వాళ్ళని తలదన్నేవాళ్ళు లేరంటే నమ్మి తీరాలి మీరు :-) :-)

  ReplyDelete
 25. " నా మస్తిష్కంలో అదో చెరిగిపోని అద్భుతం. తయారుగా ఉన్న పాకంలో బూందీ ఒక్క మునక వేసిందా.. జిహ్వకి, మనసుకి ఒకే సారి తీయని స్వర్గ ద్వారాలు తెరిచి రారమ్మని పిలిచే మోతిచూర్ లడ్డూ తయార్. స్వర్గంలో రంభ లడ్డూలా ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ, నా మట్టుకు నాకు ఇష్టమైన పదార్ధాల స్వర్గంలో రంభ లడ్డూయే! " అదీ బెల్లంపాకంలో వేస్తే, ప్రపంచంలో అంత అద్భుతమైనది ఇంకోటుండదు. నీ వర్ణన సూపర్ !!

  ReplyDelete
 26. @ ఇందు గారు,
  హహ్హహ్హా.. నా నేతి తాలింపు కి ఇంగువ ఘుమఘుమలు మీ కామెంట్లు. ధన్యోస్మి.

  @ కృష్ణప్రియ గారు,
  కాఫీ తాగేసి భానుప్రియలా మువ్వల పట్టీలు పెట్టేస్కొని ఘల్లు ఘల్లుమని ఆఫీసుకెళ్ళొచ్చేసారా? మీ రోజంతా కాఫీ ఘుమఘుమలు, కట్టుపొంగలి కమ్మదనం గుర్తొస్తూ గడవాలనే ఆ టైం కి పోస్ట్ చేసాననుకోండి పోనీ. ధన్యవాదాలు.

  @ లలిత గారు,

  చాలా సంతోషమండీ. ధన్యవాదాలు.

  @ అనానిమస్,

  లా రోసాస్ సిన్సినాటి లోనే ఉందండీ. నేను ఇప్పుడు అక్కడ లేను.

  ReplyDelete
 27. @ లత గారు,
  నేను అనుకున్నది అందరికీ నచ్చేలా చెప్పగలిగినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు.

  @ సుజాత గారు,
  మంచి సాహిత్యం, సంగీతం, రుచికరమైన తిండి.. ఇవే కదండీ మన జీవితం పై మనకి ప్రేమ రెట్టింపయ్యేలా చేసేవి. అదో రకమైన టెన్షన్ అంటే నాకు బాగా అర్ధమయింది. సేం పించ్. మీ బావగారు సూపర్. ధన్యవాదాలు.

  @ శ్రీనివాస్ పప్పు గారు,
  మీ కేకలతో నా బ్లాగు దద్దరిల్లిపోయింది. ఇలాంటి నాలుక మీద విస్ఫోటనాల కోసమే కదండీ మానవ జీవితం. ఏమంటారు! మీ లాలాజల గోదారికి శాంతి జరిపించి ఉంటారని ఆశిస్తాను. ధన్యవాదాలు.

  @ సిరిసిరిమువ్వ గారు,
  మీ వ్యాఖ్య నాకు కోటి లడ్డుల సాటి. కొంత మందికి నచ్చని వస్తువులని సైతం నచ్చేలా వర్ణించగలిగానంటే ధన్యోస్మి.

  ReplyDelete
 28. @ సునీత గారు,
  హ్హహ్హహ్హా.. థాంక్సండీ.


  @ చొక్కా తడిచిపోయిన రాజ్ కుమార్ గారు,
  టపాలో నేను నవ్విస్తే, కామెంట్లతో మీరు అదరగొట్టేస్తున్నారు గా! ఈ పదార్ధాలన్నీ పంపించడం కష్టం కానీ, తువ్వాళ్ళు పార్సిల్ చేసాను. వచ్చాక మళ్ళీ చదువుకోండి టపా. థాంక్స్.


  @ బులుసు గారు,
  స్వామీ, దేముడెరుగని సంగతి లేదన్నట్టు.అసలు భలే పట్టుకున్నారండి. ఏడవది కొసరనుకోండి పోనీ. మీ వ్యాఖ్య చూసాక "హమ్మయ్య! టపా విజయవంతమైంది" అనుకున్నాను. ధన్యవాదాలు.

  ReplyDelete
 29. @ శంకర్ గారు,
  రెండు కామెంట్ల వాగ్దానం మరిచిపోలేదు మీరు. భలే కాకినాడ వారు! పనసపొట్టు కొట్టే కళ ఉందని చెప్పాక ఇంక చెప్పేదేముంది. సాహో నాయకా!

  @ మురళి గారు,

  జై జై.

  @ Snkr గారూ,
  అయ్యొ, అయ్యో.. "పనసపొట్టు తింటారా?" అని గట్టిగా అనేరు. అది గొప్ప delicacy కదండీ! తిని చూడండి. వదలరు.

  ReplyDelete
 30. హు ఇంత రుచికరమైన పోస్టు రాస్తే మేమురుకోము అంతే, ఇప్పుడు అర్ధరాత్రి నాకు ఆకలి వేస్తుంది ఈ పోస్టు చూసాకా ;)))

  భలే ఉందండి బాగా రాసారు !

  ReplyDelete
 31. @ వేణు శ్రీకాంత్ గారు,
  నా ప్రయత్నం సఫలం అయినట్టే అయితే. ధన్యవాదాలు.

  @ తరంగం గారు,
  ఇప్పుడు కోట ఎదురుగా బొంకులదిబ్బ మీద పెడుతున్నాడు నాగభూషణ్ మసాలా బండీ. యాజమాన్యం మారి రుచి కూసింత తగ్గినమాట వాస్తవమే కానీ ఖచ్చితంగా గొప్ప ఛాట్.

  @ శిశిర గారు,
  ధన్యోస్మి. చాలా సంతోషం కలిగించింది మీ వ్యాఖ్య.

  @ సౌమ్యా,
  ఖండాంతరాల్లో ఉన్నాను. నాకంటే నీకు ఇవన్నీ అందుకోవడం చాలా సులువు. కాబట్టి పరవాలేదు. బ్రెడ్ క్రంబ్స్ సంగతి గుర్తు రాలేదు సుమీ. ఏదీ, రాస్తున్నానన్న మాటే కానీ, లాలాజలం ఏర్లై ప్రవహిస్తోంది ఇక్కడ. ప్చ్..
  పనసపొట్టు ఆవపెట్టి, నూలుగుండ (నువ్వులపొడి) వేసినా, మసలా కుర్మా చేసినా దేనికదే అమోఘంలే. ఈ సారి ఇజినారం వెళ్ళినప్పుడు నా పేరు చెప్పుకొని ఇంకో ప్లేట్ నా.భూ.మసలా లాగించెయ్. నేను సంతసిస్తాను.

  ReplyDelete
 32. తృష్ణ గారూ,
  మెగా ఫుడ్ బ్లాగర్ మీరు. మీకే నోరూరిందంటే ఇంకేం కావాలి నాకు. ధన్యవాదాలు.

  @ సుభద్ర గారూ,
  టపా కంటే ఈ సారి కామెంట్లే రుచిగా ఉన్నాయ్. మీకు నేనో టిష్యూ బాక్స్ బాకీ. సరేనా! ధన్యవాదాలు.

  @ పద్మవల్లి గారు,
  మా మామయ్యది సింహాచలమేనండీ. నేను తిన్నవన్నీ సింహాచలం పనసకాయలు, పళ్ళే. కేన్ డ్ పనస ముక్కలు రబ్బర్లా ఉంటాయండీ. అడపాదడపా ఇండియన్ స్టోర్లో దొరికే పనస చెక్క తెచ్చుకొని నానాపాట్లూ పడి ఇంట్లోనే పొట్టు కొట్టుకుంటున్నాను. వ్యాఖ్య కి ధన్యవాదాలు.

  ReplyDelete
 33. @ మురళి గారు,

  హమ్మయ్యో, మీరూ గోదారి జిల్లా వారేనా! మంచివారే! మా అత్తగారు చేసిపెట్టే పనసపొట్టు ఆవపెట్టిన కూర తిన్న నాలుక ఇది. కాదంటే మహా పాపం చుట్టుకుంటుంది.
  "నాకు నచ్చిన తినుబండారాలు" అని టైటిల్ పెడితే మరీ ఏడో తరగతి వ్యాసంలా ఉండదండీ! అందుకే చిన్న మెలిక పెట్టాల్సి వచ్చింది. ధన్యవాదాలు.

  @ ఫణి బాబు గారు,
  మొత్తానికి గోదారి జిల్లాల అల్లుడనిపించారు. బెల్లం మిఠాయి కొసం ప్రాణాలు ఇచ్చేవారు, తీసేవారు మా ఇంట్లోనూ ఉన్నార్లెండి. ధన్యవాదాలు.

  @ శ్రావ్య గారు,
  మీలా ఎంతమంది తిట్టుకున్నారో నన్ను ఈ టపా చదివి. ఏం చేస్తాం. నేనూ అర్ధరాత్రి cravings తట్టుకోలేక రాత్రంతా కూర్చుని మరీ రాసాను ఈ టపా. ధన్యవాదాలు.

  ReplyDelete
 34. One of the best posts in reset times in telugu blogs

  ReplyDelete
 35. ఆవకాయ చూస్తేనే నోరూరుతుంది. మళ్ళీ, టపాలో కూడా నోరూరిస్తున్నారు.

  ReplyDelete
 36. హమ్మ బాబోయ్.. లాలాజలం అలా వరద గోదారిలా ఊరిపోతూనే ఉంది. అద్భుతం.మరో మాట లేదు. ఇష్టమైన పదార్థాలని ఇంత రుచికరంగా అందంగా చెప్పడంలో మీకు మీరే సాటి. నేను మీ ప్రేమలో పడిపోయా..:))))))

  ReplyDelete
 37. పనసపొట్టు ఆవ పెట్టిన కూర తినడం అంటే ఇంక మా తాతగారి ఇంటికి వెల్లిపోవల్సిందే.. పొట్టు కొట్టడం దగ్గరనుంచి కూర వచ్చి కంచం లో పడే దాకా తెగ ఆవేశం తిన్నాక ఆయాసం వచ్చేది.
  ఇంక మోతిచూర్ లడ్డు అంటే నాకు ఎంత ఇష్టం అంటే నాకు బూంది లడ్డు అంతే ఎంత ఇష్టం లేదో అంత.
  మీ టపా తో నాకు పనసపొట్టు కూర తినేయాలనుంది ఇప్పుడే కాని ఏం చేస్తాం నేను తినడం నేర్చుకున్నాను కాని వండడం నేర్చుకోలేదు ... Super Post. Double like

  ReplyDelete
 38. ఫుడ్ మీద అంతగా ఆసక్తి ఉండని నాకు కూడా మీ టపా నోరూరించేసింది.. అంత రుచికరంగా ఉన్నాయి మీ పదాలు.. చాలా బాగా రాస్తున్నారు.. ఆనందంగా ఉంది.

  ReplyDelete
 39. "గోధుమ పిండి దేవతలు, పప్పు దేవతలు కలిసి నేతి దేవత ని తోడు తీసుకు వచ్చి ".. చిం(నోరూరిం)చేసారండీ.. :-)

  ReplyDelete
 40. నేను ఇందాక ఒక పేఏఏఏఏద్ధ కామెంట్ రాసి, పొస్ట్ చేసేలోపల నా సిస్టం రీబూట్ ఐపోయింది. కాబట్టి నేను అలిగాను.... కామెంట్ రాయను అని ఇప్పటివరకు కూర్చున్నా. కాని, మీ బ్లాగు మళ్ళీ మళ్ళీ చదువుతూ కామెంటకపోతే కళ్ళుపోతాయని... హి హి ...
  అద్భుతం గా ఉంది. తెలుగు బ్లాగుల్లో, ఉపమానాలు వాడటంలో మీ సాటి లేరు ఇప్పటి వరకు. ముఖ్యంగా అతిశయోక్తులు బహు తేలికగా మళ్ళీ అస్సలు ఎక్కువవకుండా..... అసలు ఏ భాషకైనా adjectives వల్లే అందం వస్తుందని నా అభిప్రాయం. మరి మన తెలుగు అందాన్నంతా మీ బ్లాగులో కుమ్మరించేస్తున్నారు. భేష్ (అంటే bravo! అని)!
  ఇక, మీ టపా చాలా రుచుల్ని గుర్తుకు తెచ్చినా, మా ఊరి శెట్టి బండి- మసాలా బఠాణీ ని మాత్రం అచ్చంగా కళ్ళముందు నిలబెట్టేసింది. ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు తింటానో మళ్ళీ !

  ReplyDelete
 41. kastha stress lo unappudu kani bore feel ainappudu kani nee koththavakai ni kalipukuni oka mudhdha tinte haai ga navvukuntu ee lanti alochanalu nqakenduku ravu ani kullu kovachchu ........... chaala baaga rasavu aththa nee blog naalanti bojana priyuduki vindhu bhojanam :)

  ReplyDelete
 42. కెవ్వు కేక. గోదావరి జిల్లా అని గొప్పలు చెప్పుకోవడమేనా లేకపోతే కాకినాడ/మండపేత కాజాలు గురించి రాసేది ఏదైనా ఉందా? ఇంతకీ ఏ ఊరు మనది అమ్మా?ఇజీనారవేనా?

  ReplyDelete
 43. ఇదిగో DG గారూ ముందుగా కాకినాడ అన్నందుకు నా ఆనందభాష్పాభివందనం అందుకోండి చెప్తాను. కాకినాడ కాజా గురించి మాట్లాడుకుందాం నా బ్లాగుకొచ్చేయండి. అందాకా ఈ లింక్ చదవండి http://blogavadgeetha.blogspot.com/2011/03/blog-post_07.html

  (మనలో మనమాట మీ కామెంట్ లో మండపేట కాజా అన్నారు. చిన్న సవరణ, అది తాపేశ్వరం కాజా.)

  ReplyDelete
 44. @ శ్రీ గారూ,

  ధన్యవాదాలు.

  @ మనసుపలికే,

  లాలాజల గోదారికి భోగ్యమైన మోతీచూర్ లడ్డు తో ఆనకట్ట వేసెయ్యండి మరి. మీ అభిమానానికి ధన్యవాదాలు.

  @ వెన్నెల్లో ఆడపిల్ల,

  తినాలంటే వండాలి మరి. పాఠానికి వచ్చెయ్యండి. మా మావయ్య దగ్గరికి వెళ్ళిపోదాం. ధన్యవాదాలు.

  ReplyDelete
 45. @ మురారి గారూ,

  హమ్మయ్య, మీరూ ఓటు వేసాకే నేను వర్ణించిన పదార్ధాలకి నిండు వచ్చింది. పదార్ధాలకంటే పదాలు రుచిగా ఉన్నాయంటారు! చాలా సంతోషమండీ! థాంక్స్. :)

  @ రవికిరణ్ గారూ,

  కొత్తావకాయకి స్వాగతం. ఈ తరహా దేవతలు అలాగే నోరూరిస్తారండీ. నైవేద్యం వండుకు తినేయడమే తక్షణ కర్తవ్యం.

  @ Ruth Sir,

  ఏ భాషకైనా అలకారం ఉపమానాలే. నూటికి నూరుపాళ్ళు నిజం మీరు చెప్పినది. అతిశయోక్తులు రవంత వికటించినా రంగం చెడుతుంది. నా అసిధారా వ్రతం ఫలించిందనిపించింది మీ వ్యాఖ్య చూస్తే. నా బ్లాగ్ కి స్వాగతం. వ్యాఖ్యకి బోలెడు ధన్యవాదాలు.

  ReplyDelete
 46. @ నలభీమపాకం,

  థాంక్స్ నాన్నా! మై ప్లెషర్.


  @ DG,
  అవునండీ, ఇజీనారమే. కాజాలు మా శంకర్ గారి వాయినం. నా పేరు చెప్పండి. ఇంకో పుంజీడు ఎక్కువిస్తారు. మీ కేకలకి నా పొలికేకలు.(థాంక్స్ లు)

  @ ఉబ్బు శంకరుడు గారూ,

  మిమ్మల్ని చూస్తే "బందరు ఎస్సై గారే" గుర్తొస్తున్నారు. 'కా..' అన భయం. తీసుకుపొండి విచ్చలవిడిగా. కాజాలు పెట్టి పంపిస్తానంటే చేదా!!

  ReplyDelete
 47. హహహ...బాబోయ్..ప్రేమ అంటే ఏదో కథ చేప్తరనుకుంటే..ఎంటండి...??ఇలా ఎడిపించేసారు ...అన్యాయం..నేను ఇప్పుడు వెళ్లి రుచి పచి లేని మా హాస్టల్ తిండిని తినాలి..
  ఎలా....ఇది చదివాకా..ఎలా??? హౌ..:(
  మీరు రాసిన పద్ధతి sooooooper ..ముందు టపాలు లు కూడా త్వరలోనే చదివేస్తా :)

  ReplyDelete
 48. అన్యాయమండీ...అసలే dieting అని ఏదో అవస్థ పడ్తున్నా...పైగా ఇవాళ ఒక పూట ఉపవాసం చేద్దాం అనుకున్నా...ఇప్పుడు ఈ టపా చూసా...

  మీ టపా చదువుతుంటే నెయ్యి వాసనలు ముక్కుపుటాలదాకా వచ్చేసి...నాలిక మీద కరిగిపోయిన అనుభూతి వచ్చేసింది...

  కొత్తావకాయ అన్న పేరు చూస్తేనే నోరూరిపోయి ఇటు రాలేదిన్నాళ్ళు...మీ శైలి చాలా బావుంది...ఇంకా మీ పాత టపాలన్నీ చదివి మళ్ళీ కామెంటుతా

  ReplyDelete
 49. కొత్తావకాయ బ్లాగరు గారు (క్షమించాలి మీ పేరు తెలీదు నాకు), నిజ్జంగా మీరు నోరూరించేలా అభివర్ణించిన పదార్ధాల కంటే మీరు చెప్పిన విధానం చాలా చాల బావుంది.
  అమాంతం ప్రేమలో పడేసిన ఆరడజను మరపురాని పదార్ధాల గురించి

  అని మీరు ఏడు పదార్ధాల గురించి వ్రాసినా చదివిన వారెవ్వరూ పట్టించుకోనంత :) నాకైనా నాలుగైదు సార్లు చదివితే కాని స్పురణకు రాలేదు.

  నమ్మరా!?...ఇదిగో మీ అరడజను లిస్టు

  ౧) పొరుగింటి పుల్లకూర : ..
  ౨) ముత్యాల జల్లు కురిసే :
  ౩) పాడెద నీ నామమే :
  ౪) మావా..మావా..మావా... :
  ౫) కొత్తగా.. రెక్కలొచ్చెనా.. :
  ౬) ఓ రాజస్థానీ ప్రేమ వంటకం :
  ౭) లా రోసాస్ . .

  ReplyDelete
 50. @ శ్రీ గారూ,

  తిండి రంధిలో పడి లెక్కలు మరిచిపోయాను. :)

  ఈ సంగతి బులుసు సుబ్రహ్మణ్యంగారు చెప్పారు వారి వ్యాఖ్యలో. సరేలే, మార్చడమెందుకని ఉంచేసాను. ఇప్పుడు మళ్ళీ మీకు కనబడింది.

  ReplyDelete
 51. అవునండి నేచూడలేదు బులుసు సుబ్రహ్మణ్యంగారి వ్యాఖ్య. ఏమైనా నేను ఈ టపా ఒక నెల్లాళ్ళు ఆగి చదవాల్సింది. పరదేశంలో ఉన్న నాకు ఇంటి మీదకు మనసు పోవడానికి మీ టపా కూడా ఒక కారణం అయ్యింది ఇప్పుడు. మా అమ్మ చేసే ఆవపెట్టిన పనసపట్టు కూర నా ఆల్ టైం ఫేవరేట్.

  ReplyDelete
 52. చాలా ఆహ్లాదకరంగా ఉన్నది మీ ఈ టపా. అన్నీ ఎవరో మీకు చేసి పెట్టిన వంటల గురించి వ్రాసారు. మీరు మాత్రమే చేసే, మీ ఇంటి వాళ్ళు బాగా మెచ్చే వంటల గురించికూడా మాకు చెప్పండి మరి. సుబ్బలక్ష్మాంటీకి, మీ తాతగారికి, నాగభూషణ్ మసాలాబండి వాళ్ళకి, మేనమామ రాజగోపాల్ గారికి, కొత్తాస్ ఫిల్టర్ కాఫీ ఓనర్లకి , పూనం గారికి, లా రోసాస్ ఓనర్లకి ఈ బ్లాగ్లోకం తరుఫున ధన్యవాదములు తెలుపగలరు.

  ReplyDelete
 53. ఆ షడ్రుచులూ ఇప్పుడే రుచి చూడాలి అన్నట్లు ఊరీరించేసారు .ఎప్పటికా భాగ్యం కలుగుతుందో :)

  ReplyDelete
 54. ఈ టపా చదివాక అర్జంటుగా మీ మొట్టమొదటి టపాకి వెళ్ళి చూశాను - సుమతీ శతకకారుడిలాగా "నోరూరగ చవులు పుట్ట నుడివెదన్" అని డిక్లరేషన్ ఏమన్నా వేశారేమోనని. ఐతే అక్కడ పూవుల తావులే తప్ప నేతి రుచులు తాకలేదు!
  రంభ లడ్డూలా ఉంటుందా అని అమ్మాయిలు అనకూడదు. నలకూబరుడు ఉంటాడా మోతీచూర్ లడ్డూలాగా అనొచ్చు.
  పనసపొట్టు కొట్టడం నిజంగా కళే. దీన్ని గురించి ఏదో పిట్టకథ ఉండాలి, సమయానికి గుర్తు రావడం లేదు.

  ReplyDelete
 55. ఆరు అనిచెప్పి ఏడు రాసేశారని వంకపెట్టేవారు బేకర్స్ డజన్ సంగతి వినలేదు కాబోలు! :)

  ReplyDelete
 56. మీ టపా చూసి కోపమొచ్చి నేనొక టపా రాసాను...ఒక చూపు చూడండి ( ఒక లుక్కెయ్యండి కి అచ్చమైన తెలుగన్న మాట :) )
  http://naarathalu.blogspot.com/2011/08/blog-post_30.html :D

  ReplyDelete
 57. >>ఆరు అనిచెప్పి ఏడు రాసేశారని వంకపెట్టేవారు బేకర్స్ డజన్ సంగతి వినలేదు కాబోలు! :)
  కొత్తపాళీగారు,
  అది మీకు 'వంక'గా కనపడుతోందా? నేనైతే కొత్తావకాయ గారి రచనాశైలి ని ప్రశంసించాను. మళ్లీ 'ప్రశంసించడానికి' నాకున్న అర్హత ఏమిటంటారా? మంచి శ్రోత అవడానికి శాస్త్రీయ సంగీతం రావక్కర్లేదు కదా, ఇదే అంతే.

  బేకర్స్ డజన్ గురించి విన్నానండి , మా ఊరిలో 'పరక' అని ఇంకో లెక్క ఉందిలెండి దానికే. 1 పరక = 13

  ReplyDelete
 58. @శ్రీ, నేనూ సరదాకే అన్నాలేండి. ఇంతరుచికరంగా వడ్డించిన విందులో నిఝంగా వంకపెట్టేందు కేముంది?
  పరక - మంచి మాట. ఇది పాతికలో సగమని తెలుసుగానీ ఇదికూడా బేకర్స్ డజన్ అని తెలీదు! చెప్పినందుకు నెనర్లు.

  ReplyDelete
 59. @ కిరణ్ గారికి, స్ఫురిత గారికి, చాతకం గారికి, మాలా కుమార్ గారికీ ధన్యవాదాలండీ.

  @ కొత్తపాళీ గారూ,
  ఎంత పెద్ద ప్రశంశ ఇది! ధన్యవాదాలండీ! నలకూబరుడు అంటే మా ఇంటి నలుడొచ్చేస్తాడేమో అని వెనకాడాను. నర్తనశాలలో రంభలా చక్కని నాట్యం చేస్తే చూసెయ్యొచ్చు లెండి. పనసపొట్టు పిట్టకథ గుర్తు తెచ్చుకు చెప్పండేం. ఎదురుచూస్తూ ఉంటాం. పొరపాటుని కూడా పెద్ద మనసుతో "పరవాలేదని, బేకర్స్ డజన్" అనేసి వెనకేసుకొస్తూంటే కొంచెం ఆనందంగా, అంతకు మించి భయంగా ఉందండీ! ఇంత ఆత్మీయతకి పాత్రురాలినేనా అని!

  @ శ్రీ గారూ,
  మీ అభిమానానికి, ఆదరానికి సర్వదా కృతజ్ఞురాలిని. పొరపాటుని ప్రశంశతో చూపిన మీకు, వెనకేసుకొచ్చిన మీ గొప్ప మనసుకి ధన్యవాదాలు.

  ReplyDelete
 60. అద్భుతం గా రాసారు ! కొత్తావకాయ అంత బావుంది

  ReplyDelete
 61. పోస్ట్ మొత్తం నాలుగు సార్లు చదివాను తనివితీరక....మీ బాష అద్బుతం...మీ బ్లాగ్ చూడటమే అదృష్టం గా అనిపించింది...పోస్ట్ చివర్లో వాడిన మాటా చాల బాగుంది

  ReplyDelete
 62. Maa lanti Bachelors ni ila edipistara??? Tattukoleka Ippude velli MOTICHOOR laddu koni tinnamu.......

  ReplyDelete
 63. మాదీ గోదారేనండి. మనది కాకినాడ, మా ఆడోళ్ళది అమలాపురం దగ్గర. మరింక చూసుకోండి పనస పొట్టు కొట్టుడే. ఆవ కూర చిన్నప్పటినుంచీ తినేస్తున్నాము కాని, మసాలా కూర అనే ఆలోచనే రాలేదుస్మీ? కిందటేడాది ఇండియా వెళ్ళినప్పుడు సమయం కాకపోయినా కూడా లేత పనసకాయలు (మనోళ్ళకి కొన్ని పొలాలు ఉన్నాయి లెండి) కొట్టుకొచ్చి, కొట్టి కూర వండించి తృప్తి గా తిన్నాము. చిన్నప్పుడు పనస పొట్టు పెద్ద ముక్కలు గా ముందు కొట్టి తరవాత పీట తిరగవేసి రజను (ఫైన్) గా కొట్టేవాళ్ళం. ఈ మధ్య మా అమ్మ గారు పెద్ద ముక్కలు సుమీత్ లో వేసేసి బోలెడంత శ్రమ తప్పించారు.
  ఇక పొతే మేము కూడా చిన్చినాటి పక్కనే (డేటన్) - మనకి కొన్ని లరోజాస్ ఉన్నాయి కదా - అందుకని ఈ శుక్రవారపు మధ్యాహ్న భోజన పధకం అక్కడ పెట్టించి, సూపర్ అని సర్టిఫై అవగానే తొందరలో ఇంటిల్లిపాదీ వెళ్లి తిని వద్దామని కుట్ర పన్నాను. ఎలా జరిగిందో మళ్ళీ పోస్టుతా.

  ReplyDelete
 64. what a post Kovagaru!!!
  mimmalni oorinchina vantakalantha kammaga undi mee humor and narration style...
  adbutaha!!

  ReplyDelete
 65. ఇప్పటికే ఈ టపాని నేను చాలా సార్లు చదివాను. లెక్కలేనన్ని సార్లు.

  మామూలు బంగాళాదుంప కూరని మీరు అలా వర్ణిస్తే మా నోట్లో లాలాజలం వూరుతుందని అనుకుంటున్నారేమో! అంత లేదులెండి.

  మోతీచూర్ లడ్డు, దాల్ బాటీలు గట్రా తింటే త్వరగా షుగర్ వచ్చేస్తుంది. అలాంటివాటికి నేను ఆమడ దూరం.

  ఇకపోతే అలా రోడ్డు పక్కన నాగభూషన్ మసాలా చాట్లు, అవి కాకపోతే పిజ్జాలు తింటే ఆ తరువాత అగచాట్లే!

  బెంగుళూరులో, జెపి నగర్లో కొత్తాస్ కాఫీ కంటే నేను ఇంట్లో కలుపుకునే నెస్లే ఇన్స్ టంట్ లానే వుంటుంది. పెద్ద గొప్పేముంది?

  పనసకాయతో కూరేంటండీ అసయ్యంగా! కాయో పొట్టో! అది తింటే పొట్ట పాడవుతుందేమో! అదేమంత బాగోదని నాకనిపిస్తోంది!

  మీకేమనిపిస్తోంది? అందని ద్రాక్ష పుల్లన అనిపించడం లేదా? [మాంచి ఆకలి మీదున్న వాడు ఈ టపా చదివితే కడుపు కాలిపోతూనే నిండిపోతుంది.]

  ReplyDelete