Showing posts with label రేపల్లెలో జరిగిన కథ. Show all posts
Showing posts with label రేపల్లెలో జరిగిన కథ. Show all posts

Monday, December 21, 2020

మంచి వెన్నెలవేళ

కార్తీక మార్గశిరాలు నాపేరన గుత్తి కట్టేసుకోవాలనిపించేంత అరుదైన జ్ఞాపకాలూ, అనుభవాలూ ఉన్నాయీ కాలంలో! 

దాదాపు పదేళ్ల క్రితం మార్గశీర్షంలో అనాలోచితంగా మొదలుపెట్టి రాసుకున్న  నెల్లాళ్ళ తిరుప్పావై కథా కుసుమాలు నా ప్రయాణంలో ఒక మైలురాయి. అయితే ఈ రాతల్లో నాదంటూ ఏమీ లేదు. మహానుభావుల కవిత్వానికి నా పైత్యం జోడించి అల్లినవే.  మున్నుడి నుండీ ముగింపు దాకా మెరిసిన వాక్యాలన్నీ  పురాకవిత్వం నాలో ఇంకి ప్రతిఫలించిన వెలుగులైతే, ఓగులన్నీ అచ్చంగా భవదీయురాలివి. 

"అరసికాయ కవితా నివేదనం శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ"  అని వాపోతాడో కవి. రసజ్ఞత లేనిచోట మాట్లాడవలసిన గతి పట్టించవద్దని బ్రహ్మకే మొరపెట్టుకోవడమన్నమాట. నా భాగ్యానికి అచ్చంగా నాదైన బ్లాగు ముంగిట్లోకొచ్చి చదివి వెళ్లే రసజ్ఞులైన అతిథులూ, సద్విమర్శకులూ దొరికారు. గొప్ప నేస్తాలు కుదిరాయి. 

అప్పటి తిరుప్పావై కథలని ఈ మార్గశిరంలో కూర్చి మాలకట్టే ప్రయత్నం చేసాను. e-book రూపంలో కాస్త ముస్తాబు చేసాను. ఈ లింక్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

అడగగానే కవర్ పేజీ కోసం నా బాల్యమే రూపుకట్టినట్టున్న బొమ్మనిచ్చిన శ్రీ కేశవ్ వెంకటరాఘవన్ గారికి శిరసా నమస్సులు. కన్నయ్య కథలంటూ మురిసి తన బ్లాగులో అతిథిగౌరవమిచ్చిన వేణూ శ్రీకాంత్ గారికీ, పుస్తకం పని ఎందాకా వచ్చిందని నన్నంటిపెట్టుకుని ఆసక్తిగా ఎదురుచూసిన వంశీకృష్ణకీ, శ్రీనిధికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు.  

జీవనమాధుర్యమే తానైన మురళీ మనోహరునికి ఏమివ్వగలను! కృష్ణార్పణం. 


Saturday, January 14, 2012

భోగ్యమైన రాసలీల ~ కాత్యాయనీ వ్రతం - 30

పుచ్చపువ్వల్లే వెన్నెల కాసిన వేళ... మృదు మోహన మురళీ రవళి విని గోపికల మది ఝల్లన పొంగిన వేళ.. గొల్లపల్లెలో పడుచులందరూ చేతిలో ఉన్న పని విడిచి, కాలుచేయాడక.. నిశ్చేష్టితులై.. తృటిలో తేరుకుని వంశీకృష్ణుని చేరేందుకు.. మొగలి పొదవైపు నాగకన్నియలు పరుగులు తీసినట్లు, చరచరా పరుగులు తీసిన వేళ.. వీడిన సిగలతో, చెమటలో తడిసి కరిగి కుంకుమ ఎదలోయల్లోకి పారుతూండగా, జారిన పయ్యెదలతో, తడబడు అడుగులతో, తమ ప్రియుని.. మాధవుని వెదకే కనులతో, బంధాలను విడిచి బృందావని చేరారు. కృష్ణచంద్రుని కన్నార్పక చూచే కలువభామల వలే తనను పరివేష్టించిన గోపాంగనలను చూచి నల్లనయ్య నవ్వాడు.

"భామినులారా! ఇంత రాత్రివేళ ఎలా వచ్చారు? దారిలో అడవి పురుగూ బూచీ ఉంటాయే.. మీకు భయం కలుగలేదూ! మీ ఇంట్లో వారు ఏమనుకుంటారో! మురళీగానం విన్నారు కదా.. ఇంక మరలి వెళ్ళండి." అని పలికిన కృష్ణుని పలుకులు ఆ గోపతరుణుల మనసులలో మునుపు నాటిన సుమశరుని విరికోలలకంటే పదునుగా గుచ్చి గాయపరచినవి.

"కృష్ణా! మనోహరా! నిను కోరి కాత్యాయనీ వ్రతమొనర్చి, నీ పిల్లన గ్రోవి పాటకు మైమరచి.. బంధాలన్నీ తెంచి నిన్ను చేరాము. ఇదంతా నీ సంకల్పమే కదూ! ఇప్పుడు నువ్వే మమ్మల్ని వెనుతిరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నావే! నీకిది న్యాయమా? ఈ విశ్వంలో ఏ ప్రాణికైనా సంతత ప్రేమోద్దీపకుడవు! మదనుడైనా కన్నార్పక చూసే భువనమోహన సౌందర్యం నీది. నిను కోరి వచ్చిన వనితలను చులకన చేస్తావా?" అతివలు బేలగా అడిగారు.
"అయ్యో!  పరపురుషుని కోరి వచ్చారే! మీకిది తగునా?" పగడాల పెదవిపై తర్జని ఆన్చి తప్పు వలదన్నాడు మాధవుడు.

"కృష్ణా! సర్వ భర్తవు! అగ్ని వలే దేనిని దహించినా మాలిన్యము అంటని వాడవు. తామర తేనియ రుచి మరిగిన తేటిని వేరే విరులు ఆకర్షించునా? మా మనసు నీ యందే లగ్నమై ఉన్నదన్న నిజం గ్రహించి, నీ చిరునగవు వెన్నలల కొరకు చకోరాలమై నీ ముందు నిలచిన మమ్మల్ని ఆత్మారాముడవై స్వీకరించవలసినదని" వేడుకున్నారు ఆ గోప వనితలు.

మదనకీలకు మరుగుతున్న వారి నిట్టూర్పులను తన చల్లని చూపులతో, స్పర్శతో శాంతింపజేసాడు యదునందనుడు. చుక్కల మధ్య నిండు జాబిలి వలే ప్రకాశిస్తూ గోపికలతో కలసి బృందావనిలో విహరించసాగాడు. ఆటలలో అకస్మాత్తుగా అల్లరికృష్ణుడు మాయమయ్యాడు. అది గ్రహించిన గొల్లపడుచులందరూ కలవరపడుతూ నలుదెసలా గాలించనారంభించారు. మోహావేశితలై, గద్గద స్వరంతో చెట్టునూ, పుట్టనూ ప్రశ్నించనారంభించారు.

"మన్మథుని శరాలకు మమ్మల్ని ఎర చేసిన ఆ మాధవుడు మాయచేసి ఈ నట్టడివిలో వీడిపోయాడు. ఇది న్యాయమా? ఓ పున్నాగమా! పురుషోత్తముడైన కృష్ణుని చూసావా? ఓ తిలకమా! ఘనసారమా! మా మనోహరుని  చూసారా? ఓ వెదురు పొదా! నీ వెదురుతో చేసిన వంశిని చేతబూనిన ఆ అల్లరివాడిని నువ్వేమైనా చూసావా? ఓ చందన వృక్షమా! చల్లని మా స్వామి నీకు కనిపించాడా!

పున్నాగ కానవే  పున్నాగవందితు దిలకంబ కానవే తిలకనిటలు
మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని
ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు
జందన కానవే చందన శీతలు గుందంబ కానవే కుందరదను

నల్లని వాడు పద్మ నయమబులవాడు కృపారసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలచాటున లేడుగదమ్మ చెప్పరే!

ఓ మల్లికలారా! మా కృష్ణుని గురుతులు మీకు చెప్తాము. అతడు నల్లని వాడు. పద్మనేత్రముల కృపారసమ్ము చిందించేవాడు. నవ్వుమోమున రాజిల్లు వాడు. నెమలిపింఛం అలంకరించుకున్న నీలాలకురుల సొగసుకాడు. మా మానధనం కొల్లగొట్టి మీ పొదల వెనుక దాగి ఉన్నాడేమో చెప్పరూ!

ఓ పాటలీ లతలారా! ఓ ఏలకీ లతలారా! మాధవీ వల్లికలారా! వాని బంధించి మాకు అప్పగించరూ! ఓ చూతమా! వాని చూసావా! ఓ కేతకీ, ఓ కోవిదారమా! మీ సురభిళ వీచికలతో మమ్మల్ని ఇంకా హింసింపక నల్లనయ్యను పట్టివ్వరూ! "అని బృందావని కలియతిరుగుతున్న గోపికల ఎదుట జగన్మోహనుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నిలిచాడు.

ఎదుటపడిన ప్రియుని నిందించేదొకతె. తన చూపుల తీవెలతో అతని చుట్టి కనులు మూసి ఆతని రూపు హృదయమందు నిలిపి ఆనందపులకాంకితయైనది వేరొకతె. కోపము నటించేదొకతె. వాలుచూపుల వయ్యారి ఒకతె. గ్రక్కున కావలించేదొకతె. చేయి పట్టేదొకతె. గాటపు వలపున చుంబించేదొకతె. "నీ ఎడబాటున నేను మరణించలేదేలా!" అని కన్నీరై కరిగేదొకతె. "విడిచిపోకుమా!"యని కాళ్ళను బంధించేదొకతె. "ప్రాణేశ్వరా!" అని ఎలుగెత్తి పలవరించేదొకతె. "కృష్ణా!" అని ఆతని మోము తడిమిచూసేదొకతె.

"మగువలూ! మీరు చెప్పిన మాటే! ఎదురుచూసి కష్టపడి దక్కించుకున్న ఫలము బహు తీయన!" అని మనోహరంగా నవ్వాడు కృష్ణుడు. ఆ పిదప గోపభామినుల చేరి వేయి బంగరురేకుల తామరలో వెలిగే కర్ణికవలే ఒప్పారుతూ రాసలీలల తేలియాడాడు కృష్ణ స్వామి. లావణ్యవీణ మీటినదో లేమ. వల్లకి పలికించినదో తరుణి. అచ్చరలు పూవులవాన కురిపించగా, గంధర్వాదులు మోహవివశులవగా, చుక్కలు చంద్రుని సరసన చేరి మక్కువతో చూస్తూండగా గోపసుందరులతో కలసి రసనాట్యమాడాడు.

ఆపై గోపీసమేతుడై జలక్రీడలకు ఉపక్రమించాడు. గోపికలు నీటిలో నిదురిస్తున్న రాయంచలను అదల్చి తామరలను కోసి సిగలో తురుముకున్నారు. తామరాకులపై తపోనిద్రలో ఉన్న చక్రవాకాలను "తమ సొగసులకు సాటి రాలేరు పొమ్మని" వెక్కిరించారు. నీట మునిగి మోము మాత్రమే చూపి చందమామను పరిహసించారు. దోసిళ్ళతో వారు చిమ్మిన నీటి ముత్యాలు వినీలదేహంపై మెరుస్తూ ఉండగా.. ఆడు ఏనుగుల మధ్య చేరి జలకాలాడుతున్న మత్తేభం వలే కృష్ణమూర్తి కనువిందు చేసాడు.



నీళ్ళలో ఆటలాడి, అలసి.. పొద్దు పొడిచే వేళ బయటకు వెడలి సేదదీరుతున్న గోపకాంతల ఒడిలో చేరి ఒకడే వేయి కృష్ణులై, ఒకరికి ఒక కృష్ణుడై ఆత్మాభిరాముడై గోపీవల్లభుడు వినోదించాడు. వేయి కొలనులలో ప్రతిబింబించినా గగనాన దినమణి ఒక్కడే కదూ!





                            *********************************


కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం

క్రీ. శ. 776 నలనామ సంవత్సర కర్కాటక (ఆషాఢ) మాసంలో, పూర్వ ఫల్గునీ నక్షత్ర యుక్త శుభసమయాన, శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే విష్ణుభక్తునికి తన పెరటి తోటలో ఒక తులసి మొక్క పాదులో, చైతన్యం గల ఒక అపరంజి బొమ్మ కనిపించింది. విష్ణుచిత్తులు ఆ పసికందును దైవప్రసాదంగా భావించి పుత్రికా వాత్సల్యంతో "కోదై" (గోదా) అని ఆమెకు పేరుపెట్టి పెంచుకోసాగారు. 'కోదై' అంటే తమిళంలో కుసుమ మాలిక.

విష్ణుచిత్తులకు ప్రతిరోజూ పరమభోగ్యములైన పుష్పమాలికలను వటపత్ర శాయికి సమర్పించి ఇంటికి రావడం అలవాటు. మగువలకు మాల్యధారణ బహుప్రీతిపాత్రమైనది కదా! ఆ సుకుమారి తండ్రి చూడకుండా, ఆ మాలలను అలంకరించుకుని, అద్దంలో చూసుకుని చప్పుడు చేయక మరల బుట్టలో ఉంచివేసేది. కొన్నాళ్ళకు పూవులదండలో చిక్కిన కేశమును చూచి విష్ణుచిత్తులు కుపితులై ఆమెను నిందించారు. ఆ వేళ మాలలు సమర్పించలేదు.

ఆ రాత్రి ఆయన కలలో కనిపించిన వటపత్రశాయి "ఆ చిన్నది ముడిచిన మాలలే తనకు ముద్దని" చెప్పగా విని విష్ణుచిత్తులు ఆమె మానవమాత్రురాలు కాదని, లక్ష్మీస్వరూపమని గ్రహించి ఆ నాటి నుండీ గోదా ముడిచిన మాలలనే స్వామికి సమర్పించేవారు. అందుకే ఆమెకు "ఆముక్తమాల్యద" అని పేరు.

యుక్త వయసు వచ్చిన ఆమె రంగనాధుని పతిగా వరించి ఆతని పొందేందుకు ధార్మికులనడిగి "భాగవతంలో" ప్రస్తావించబడిన "కాత్యాయనీ వ్రతాన్ని" విల్లి పుత్తూరునే రేపల్లెగాను, తన చెలులనే తోటి గోపికలుగాను, విల్లిపుత్తూరు వటపత్రశాయినే కృష్ణునిగానూ భావించి ముప్పది దినముల వ్రతమాచరించింది. ఆ సమయంలో రోజుకొక పాట చొప్పున కృష్ణునికి పూవులదండ వలే సమర్పించింది. ఆ పాటలే "తిరుప్పావై". ఉపనిషత్ సారమంతా అందమైన పాటల రూపంలో అందించిన గోదా వ్రత పరిసమాప్తి కాగానే రంగనాధుని కల్యాణమాడి ఆతనిలో ఐక్యమైనదని చరిత్ర. ఈ ముఫ్ఫై దినముల కాత్యాయనీ వ్రతమును శ్రధ్ధగా చేసిన వారు, చూసిన వారు ఇష్ట కామ్యార్థములను పొందగలరని ప్రతీతి.


* సదా వెన్నంటి ఉండే ఆచార్య కటాక్షాన్ని పొందిన నా పున్నెం ఈనాటిది కాదు.
  కృష్ణ రసాన్ని గరిపిన తాతగారిని తలచుకుంటూ "కృష్ణార్పణం".

Wednesday, December 14, 2011

ఒకసారి ఏం జరిగిందంటే..

అదో పల్లెటూరు. దాన్ని ఒరుసుకుని ప్రవహించే ఓ నల్లని నది. ఆ పక్కనే కొండల వరుస. ఆకాశంలో సాయంకాలం ఎగిరి వెళ్తున్న దేవతలకి ఆ ఊరు "పక్కకి తిరిగి పడుకున్న అందమైన పడతి జడలో మెరిసే నాగరంలా" కనిపిస్తుందట. ఆ ఊరి రంగు బంగారపు రంగు. "ఊరికి రంగేవిటా?" అనేగా మీ ప్రశ్న? ఇళ్ళకి చేరుతున్న గోవుల గిట్టలు రేపే నారింజ ధూళి చిమ్మచీకటయ్యేదాకా గాల్లో తేలుతూనే ఉంటుంది మరి! ఒకటా రెండా.. ప్రతీ ఇంటికి ఓ మంద పశువులుండాల్సిందే!

పాడీ, పంటా సమృధ్ధిగా ఉండే ఆ పల్లె పేరు "రేపల్లె". ఆ పక్కన పారుతున్నది "యమున". ఆ పల్లెలో వీచే గాలిలో నిత్యం తేలే ఓ దివ్య సుగంధం! అవును మరి! వెన్న కమ్మదనం, పున్నాగ పువ్వుల ఘుమఘుమలూ, ఆ ఊరి పడుచులద్దుకునే కస్తూరీ, జవ్వాది పరిమళాలూ.. ఇవన్నీ చాలవన్నట్టు ఆ ఊరి రాజుగారింట్లోంచి సతతమూ వీచే కర్పూర వీచికలూ కలిస్తే గాలి మత్తెక్కక మానుతుందా?

ఆ ఊరి రాజుగారింట్లో కర్పూరానిది ఉప్పుతో సమానమైన వాడుక. "రాచబిడ్డ"కి వాళ్ళమ్మ దిష్టి తీసి హారతివ్వని పూట లేదు మరి! ఎందుకా! నెమ్మదిగా అడుగుతారేం? అతను మహ అందగాడట!! అతనిది నీలిమేఘపు రంగు. అందమంటే అలాంటి ఇలాంటి అందం కాదు! అందానికే మోహం కలిగి, మనసు మరిగి మతి తప్పేంత సమ్మోహనుడట! అదొక్కటేనా? ఓ పాల నవ్వు నవ్వుతాడట! మల్లెలు చిన్నబోయేలా, వెన్నెల తెల్లబోయేలా.. అతని నవ్వు ఎంత బావుంటుందంటే, ఆ ఊరి పడుచులందరూ పాల కడవల్లో, నీళ్ళ బిందెల్లో, అద్దాల్లో, వాళ్ళ చేతుల మణి కంకణాల్లో.. ఇవన్నీ సరిపోక ఒకరి కళ్ళల్లోకి ఒకరు తమ ప్రతిబింబాన్ని చూసుకుని అతనిలా నవ్వుదామని నిత్యం సాధన చేస్తూ ఉంటారట! అయితే వాళ్ళకి ఆ నవ్వు పట్టుబడకపోవడానికి కారణమేవిటో తెలుసా! ఆ నవ్వులో వేరొకరికి చేతకాని 'ఓ చిన్న తుంటరితనం' ఉంటుంది. తుంటరితనం అతనికి కట్టుబానిస! అతను చేసే పనుల్లో, పలికే పలుకుల్లో, నవ్వే నవ్వులో సదా వెన్నంటి వచ్చే దాసానుదాసుడు ఆ 'కొంటెతనం'!

అతనికి ఇంకో విద్య వచ్చు, తెలుసా! పిల్లనగ్రోవి ఊదుతాడట. చిత్రమేమిటంటే అతను మురళిని మ్రోగిస్తూ ఉంటే వినేవారికి ఆ మాధుర్యానికి కళ్ళు తెరవలేని మత్తు కమ్మేస్తుందట! అలా అని మురళీధరుణ్ణి చూడకపోతే ఎలా..? అందుకని ఏకకాలంలో ఆ వేణుగానం వింటూ, కళ్ళు తెరిచి అతన్ని చూడడం ఎవరికి సాధ్యమవుతుందో అని పందాలు కాసుకుంటూ ఉంటారట ఆ ఊళ్ళో. గెలిచినవాడు లేడిప్పటికి!

అతని అందానికే వాళ్ళమ్మ దిష్టి తిసేస్తోందనుకుంటున్నారేమో! కాదు.. కాదు! అతను బోలెడు బలమున్నవాడట! ఆ ఊరికి రాక్షసుల బెడద కొంచెం ఎక్కువే, పాపం! ఆడపిల్ల రూపంలోనూ, బండి రూపంలోనూ, కొంగలాగా, ఆవులాగా.. ఇలా రకరకాల మారు వేషాల్లో బోలెడుమంది రాక్షసులు వచ్చి అతని చేతుల్లో ప్రాణాలు విడిచారట. పాపం, తల్లి మనసు కదా! అందుకని ఎటు నుంచి ఏ కీడొస్తుందో అని కొడుకుని చూసి బెంగపడుతూ, అతని అందానికి మురిసిపోతూ మెటికెలు విరుస్తూ ముప్పూటలా దిష్టి తీస్తూంటుందన్నమాట!

మరి ఇంత అందగాడి వెంటపడేవాళ్ళేమైనా తక్కువా? అబ్బే! ఊరందరి కళ్ళూ అతని మీదే! ఆ ఊరి ఆడపిల్లలందరికీ అతనంటే తగని మక్కువ. ఇంట్లో కట్టడి చేస్తున్నా, పెడచెవిన పెట్టి నది ఒడ్డునా, తోటల్లోనూ అతను మురళీగానం చేస్తూంటే పరుగున వెళ్ళి వింటూ ఉండేవారట! అతగాని ఊహల్లో మైమరిచిపోతూ నిత్యకృత్యాలన్నీ అవకతవకలుగా చేసేస్తూ ఉండేవారట. చల్ల చిలికేవేళ అతను గుర్తొస్తే, ఆ చల్లలో వెన్న ఏర్పడి మళ్ళీ కరిగిపోయేదాకా చిలికీ చిలికీ ఆ ఊరి భామలందరి నడుములూ బహుసన్నమైపోయాయట. "ఏ క్షణంలో అతను ఎదురుపడతాడో!" అని ఎప్పుడూ వాళ్ళందరూ అలంకారాలు చేసుకుని, పువ్వులు ముడుచుకుని గంధపు కుప్పెల్లా, నిత్యమల్లె చెట్లలా, బంగారుబొమ్మల్లా మెరిసిపోతూ ఉంటారట!

అలా గడుస్తూండగా శరదృతువు వచ్చింది. ఆకాశంలో మేఘాలు తెల్లని పువ్వుల్లా, తేలికైన, స్వచ్చమైన మనసుల్లా తేలుతున్నాయి. రాత్రుల్లో వెన్నెల చాందినీకి కట్టిన ముత్యాల్లా నక్షత్రాలు మెరుస్తున్నాయి. పండి ఓరగా వాలిన వరిచేలలో, గాలి వీచినప్పుడల్లా గలగలమని వినసొంపైన సడి పుట్టేది. చేలల్లో వాలిన చిలుకలు అదిలించగానే గోలగోలగా ఎగిరిపోయేవి. కొలనుల్లో కలహంసలు కిక్కిరిసి తామరలకి చోటు లేకుండా చేసేసాయి. చామంతులూ, బంతులూ విరిసి పసిడిహారతుల్లా మెరుస్తున్నాయి. ఇంత మనోహరమైన రోజుల్లో ఆ ఊరి పడుచులకి ఒకటే బాధ! మన్మథ తాపం. చెరుకు వింట మన్మథుడెక్కుపెట్టిన నల్ల కలువల బాణాలు నేరుగా ఆ వెర్రి గొల్ల పడుచులకి గుచ్చుకునేవి.

విరహబాధ తట్టుకోలేని పడుచులంతా యమునలో జలకాలాడుతూ, గుసగుసగా ఒకరి చెవిలో ఒకరు తమ బాధ చెప్పుకుంటూ, ఒకరినొకరు ఓదార్చుకుంటూ, వేళాకోళం చేసుకుంటూ నల్లనయ్య గురించి కలలు కంటున్నారు. పిల్లనగ్రోవి మ్రోగేసరికి ఒళ్ళుమరిచి ఆ దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ బాధకి ఉపాయం ఏదైనా ఉంటే బాగుండునని తలవని ఆడపిల్ల లేదు.

ఒకనాడు ఉదయం పల్లెలో పెద్దలందరూ ఆడపిల్లలనందర్నీ సమావేశపరిచారు. "ఎందుకో? ఏం చెప్తారో? కారణమేంటో?" అని వాళ్ళందరూ గుసగుసలాడుకుంటున్న ధ్వని తుమ్మెదల గుంపు ఝుమ్మని ఎగురుతున్నట్టు వినిపిస్తోంది. ఓ ముసలి గొల్ల లేచి పువ్వుల దండలా ఓ వైపు నిలబడిన పడుచుల్ని చూసి చెప్పనారంభించాడు. "అమ్మాయిలూ, మీకో ముఖ్యమైన సంగతి చెప్పాలి. నేనూ, మిగిలిన పెద్దలూ ఇందాకే మన పల్లె చివర ఉన్న మునిపల్లెకి వెళ్ళి వచ్చాం. అక్కడి మునీశ్వరుడు చెప్పిన మాటలివి. రాబోయేది హేమంత ఋతువు. మార్గశిరమాసం మంచి కాలమట. ఈ నెలలో ఆడపిల్లలు కాత్యాయినీ దేవిని పూజిస్తే మంచిదట. మంచి వర్షాలు కురిసి, పాడీ పంటా సమృధ్ధి చెందుతుందట."

"ఈ పెద్దాయన ఒకరూ, మంత్రాలకి చింతకాయలు రాలతాయా? అయినా మనకిప్పుడేం తక్కువైందని? అబ్బో, ఈ పూజలూ పునస్కారాలూ మన వల్ల అయ్యేవేనా? ఇళ్ళల్లో పనులో!" ఇలా అమ్మాయిలందరూ గుసగుసలు ప్రారంభించారు.

వాళ్ళ ఉద్దేశ్యం, మాటలూ తెలియని వాళ్ళు కాదు కదా పెద్దలు. అమ్మ పుట్టిల్లు మేనమామ ఎరుగడా? పండిన మీసం చాటున నర్మగర్భంగా నవ్వుకుని పెద్దాయన చెప్పాడు.. "అంతే కాదమ్మాయిలూ, ఈ వ్రతం శ్రధ్ధగా, సక్రమంగా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ తీరుతాయట."

"కోరికలన్నీ అంటే.." ఓ పిల్ల కొంటెగా అడిగి ముందున్న అమ్మాయి వెనక్కి నక్కింది.
"ఆహా.. అన్ని కోరికలూ అంటే అన్ని కోరికలూ.. సురభికి కాసుల పేరూ, నర్మదకి మువ్వల పట్టెడా, మల్లికకి జడ నాగరమూ, ప్రియంవదకి దంతపు బొట్టుపెట్టె, మృణాలినికి సంపెంగ రంగు పట్టు చీరా.. నీకు కోరిన మొగుడూను" ఘొల్లుమని నవ్వారు పడుచులందరూ. ఇందాకా ప్రశ్న వేసిన కమలిని సిగ్గుగా నవ్వుతూ వెనక్కి జరిగింది. సభ తీరిన పెద్దవాళ్ళూ ముసిముసిగా నవ్వుకున్నారు.
"అలా కాదు పెద్దయ్యా, మా చేత వ్రతం చేయించేదెవరనీ?" సందేహం వెలిబుచ్చింది మృణాలిని.
"ముందు మీరంటూ సిధ్ధపడితే, అన్నీ జరుగుతాయి. సురభీ, ప్రియంవదా, ఉత్పలా, కావేరి.. ఇంత మంది ఉన్నారు మీలో అన్నీ తెలిసినవారూ, చదువుకున్న వారూను. మీలో కొందరు ఓ సారి మునిపల్లెకి వెళ్ళి కనుక్కుంటే విషయాలూ, విధానమూ మీకే తెలుస్తాయి. అన్నీ మేమే చెప్పాలంటే ఎలాగర్రా.. మీరే ఉత్సాహంగా అన్నీ తెలుసుకోవాలీ, చెయ్యలీ కానీ!" ఉత్సాహపరిచాడు పెద్దాయన.

ఆడపిల్లలందరూ ఒకరి మొహాలొకరు చూసుకుని, గోలగోలగా అభిప్రాయాలూ, సందేహాలూ, అనుమానాలూ వెలిబుచ్చుకుని, తమలో తామే సమాధానాలు చెప్పుకుని ఒక అంగీకారానికి వచ్చారు.
"సరే పెద్దయ్యా.. హేమంతం వచ్చేసరికి సిధ్ధంగా ఉంటాం. అందరం కాత్యాయనీ వ్రతం చేస్తాం. మంచి పనికి వెనకాడేదేముంది?" అని స్థిరంగా చెప్పింది సురభి.

హేమంతం వచ్చేసింది. తెలవారితే వ్రతారంభం. యమున ఒడ్డున స్నానానికి కలుద్దామని, అక్కడే కాత్యాయనీ దేవికి పూజ చేసుకోవాలని.. ముందు రోజే అమ్మాయిలందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు. హేమంతమంటే మాటలా! చలి వణికించేస్తోందప్పుడే! అంత తెలవారు ఝామున లేచి స్నానం చేసి పూజ చేసుకోవాలంటే కష్టం.. మంచు కత్తిలా కోసేసే యమున నీళ్ళలో మూడు మునకలు వెయ్యాలని తలుచుకుంటేనే అందరికీ వెన్నులో వణుకు పుట్టుకొచ్చింది. అదే మాట అంది ఉత్పల. ఖస్సుమని ఒంటికాలిన లేచింది కమలిని. "గారెలు తినాలని ఉందంటే అవి గాల్లో పుట్టవు, అమ్మడూ! మనమే వండుకోవాలి. కోరినవి దక్కాలంటే ఆ మాత్రం కష్టం తప్పదు. మరో మాట లేదు. వేకువ ఝాముకి ఘడియ ముందే నేను మీ ఇంటికి వచ్చి లేపుతాను."అంది చేతులు తిప్పుకుంటూ.
"ఏనుగులు మీద పరిగెట్టినా లేవని దానివి! నువ్వా సుద్దులు చెప్తున్నావ్, కమలినీ!?" వెక్కిరించింది సురభి.
"ఏం కాదు. రేపు చూడండి. ఉత్పల ఒక్కర్తినే కాదు మీ అందరినీ నేనే లేపుతాను." ఉడుక్కుంటూ చెప్పింది కమలిని.
"అబ్బా..ఆగండే! చిటికె వేస్తే తెలివొస్తుంది సురభికి. సురభీ! నువ్వే రేపు మా అందరినీ నిద్ర లేపాలి. నీదే పూచీ. మనం లేవడం ఆలస్యమయి పొద్దు పొడిచిందా.. వ్రతానికి ముప్పు!" హెచ్చరిస్తూ చెప్పింది ఉత్పల.
"సరేనర్రా.. ఇళ్ళకి వెళ్ళి హాయిగా నిద్రపోండి. నేను కోడికూతకి రెండు ఘడియల ముందే లేస్తాను. పక్కనే కమలిని ఇల్లు కదా.. ఇద్దరమూ మిగిలిన వాళ్ళని లేపుతాం." చెప్పింది సురభి.
అందరూ ఇంటిదిక్కు పట్టారు.



*ఇప్పటికి ఇంతే. మిగిలిన కథ రేపు.


(బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి.)