Saturday, January 14, 2012

భోగ్యమైన రాసలీల ~ కాత్యాయనీ వ్రతం - 30

పుచ్చపువ్వల్లే వెన్నెల కాసిన వేళ... మృదు మోహన మురళీ రవళి విని గోపికల మది ఝల్లన పొంగిన వేళ.. గొల్లపల్లెలో పడుచులందరూ చేతిలో ఉన్న పని విడిచి, కాలుచేయాడక.. నిశ్చేష్టితులై.. తృటిలో తేరుకుని వంశీకృష్ణుని చేరేందుకు.. మొగలి పొదవైపు నాగకన్నియలు పరుగులు తీసినట్లు, చరచరా పరుగులు తీసిన వేళ.. వీడిన సిగలతో, చెమటలో తడిసి కరిగి కుంకుమ ఎదలోయల్లోకి పారుతూండగా, జారిన పయ్యెదలతో, తడబడు అడుగులతో, తమ ప్రియుని.. మాధవుని వెదకే కనులతో, బంధాలను విడిచి బృందావని చేరారు. కృష్ణచంద్రుని కన్నార్పక చూచే కలువభామల వలే తనను పరివేష్టించిన గోపాంగనలను చూచి నల్లనయ్య నవ్వాడు.

"భామినులారా! ఇంత రాత్రివేళ ఎలా వచ్చారు? దారిలో అడవి పురుగూ బూచీ ఉంటాయే.. మీకు భయం కలుగలేదూ! మీ ఇంట్లో వారు ఏమనుకుంటారో! మురళీగానం విన్నారు కదా.. ఇంక మరలి వెళ్ళండి." అని పలికిన కృష్ణుని పలుకులు ఆ గోపతరుణుల మనసులలో మునుపు నాటిన సుమశరుని విరికోలలకంటే పదునుగా గుచ్చి గాయపరచినవి.

"కృష్ణా! మనోహరా! నిను కోరి కాత్యాయనీ వ్రతమొనర్చి, నీ పిల్లన గ్రోవి పాటకు మైమరచి.. బంధాలన్నీ తెంచి నిన్ను చేరాము. ఇదంతా నీ సంకల్పమే కదూ! ఇప్పుడు నువ్వే మమ్మల్ని వెనుతిరిగి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నావే! నీకిది న్యాయమా? ఈ విశ్వంలో ఏ ప్రాణికైనా సంతత ప్రేమోద్దీపకుడవు! మదనుడైనా కన్నార్పక చూసే భువనమోహన సౌందర్యం నీది. నిను కోరి వచ్చిన వనితలను చులకన చేస్తావా?" అతివలు బేలగా అడిగారు.
"అయ్యో!  పరపురుషుని కోరి వచ్చారే! మీకిది తగునా?" పగడాల పెదవిపై తర్జని ఆన్చి తప్పు వలదన్నాడు మాధవుడు.

"కృష్ణా! సర్వ భర్తవు! అగ్ని వలే దేనిని దహించినా మాలిన్యము అంటని వాడవు. తామర తేనియ రుచి మరిగిన తేటిని వేరే విరులు ఆకర్షించునా? మా మనసు నీ యందే లగ్నమై ఉన్నదన్న నిజం గ్రహించి, నీ చిరునగవు వెన్నలల కొరకు చకోరాలమై నీ ముందు నిలచిన మమ్మల్ని ఆత్మారాముడవై స్వీకరించవలసినదని" వేడుకున్నారు ఆ గోప వనితలు.

మదనకీలకు మరుగుతున్న వారి నిట్టూర్పులను తన చల్లని చూపులతో, స్పర్శతో శాంతింపజేసాడు యదునందనుడు. చుక్కల మధ్య నిండు జాబిలి వలే ప్రకాశిస్తూ గోపికలతో కలసి బృందావనిలో విహరించసాగాడు. ఆటలలో అకస్మాత్తుగా అల్లరికృష్ణుడు మాయమయ్యాడు. అది గ్రహించిన గొల్లపడుచులందరూ కలవరపడుతూ నలుదెసలా గాలించనారంభించారు. మోహావేశితలై, గద్గద స్వరంతో చెట్టునూ, పుట్టనూ ప్రశ్నించనారంభించారు.

"మన్మథుని శరాలకు మమ్మల్ని ఎర చేసిన ఆ మాధవుడు మాయచేసి ఈ నట్టడివిలో వీడిపోయాడు. ఇది న్యాయమా? ఓ పున్నాగమా! పురుషోత్తముడైన కృష్ణుని చూసావా? ఓ తిలకమా! ఘనసారమా! మా మనోహరుని  చూసారా? ఓ వెదురు పొదా! నీ వెదురుతో చేసిన వంశిని చేతబూనిన ఆ అల్లరివాడిని నువ్వేమైనా చూసావా? ఓ చందన వృక్షమా! చల్లని మా స్వామి నీకు కనిపించాడా!

పున్నాగ కానవే  పున్నాగవందితు దిలకంబ కానవే తిలకనిటలు
మన్మథ కానవే మన్మథాకారుని వంశంబ కానవే వంశధరుని
ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు
జందన కానవే చందన శీతలు గుందంబ కానవే కుందరదను

నల్లని వాడు పద్మ నయమబులవాడు కృపారసంబు పై
జల్లెడు వాడు మౌళి పరిసర్పిత పింఛము వాడు నవ్వు రా
జిల్లెడు మోము వాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలచాటున లేడుగదమ్మ చెప్పరే!

ఓ మల్లికలారా! మా కృష్ణుని గురుతులు మీకు చెప్తాము. అతడు నల్లని వాడు. పద్మనేత్రముల కృపారసమ్ము చిందించేవాడు. నవ్వుమోమున రాజిల్లు వాడు. నెమలిపింఛం అలంకరించుకున్న నీలాలకురుల సొగసుకాడు. మా మానధనం కొల్లగొట్టి మీ పొదల వెనుక దాగి ఉన్నాడేమో చెప్పరూ!

ఓ పాటలీ లతలారా! ఓ ఏలకీ లతలారా! మాధవీ వల్లికలారా! వాని బంధించి మాకు అప్పగించరూ! ఓ చూతమా! వాని చూసావా! ఓ కేతకీ, ఓ కోవిదారమా! మీ సురభిళ వీచికలతో మమ్మల్ని ఇంకా హింసింపక నల్లనయ్యను పట్టివ్వరూ! "అని బృందావని కలియతిరుగుతున్న గోపికల ఎదుట జగన్మోహనుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో నిలిచాడు.

ఎదుటపడిన ప్రియుని నిందించేదొకతె. తన చూపుల తీవెలతో అతని చుట్టి కనులు మూసి ఆతని రూపు హృదయమందు నిలిపి ఆనందపులకాంకితయైనది వేరొకతె. కోపము నటించేదొకతె. వాలుచూపుల వయ్యారి ఒకతె. గ్రక్కున కావలించేదొకతె. చేయి పట్టేదొకతె. గాటపు వలపున చుంబించేదొకతె. "నీ ఎడబాటున నేను మరణించలేదేలా!" అని కన్నీరై కరిగేదొకతె. "విడిచిపోకుమా!"యని కాళ్ళను బంధించేదొకతె. "ప్రాణేశ్వరా!" అని ఎలుగెత్తి పలవరించేదొకతె. "కృష్ణా!" అని ఆతని మోము తడిమిచూసేదొకతె.

"మగువలూ! మీరు చెప్పిన మాటే! ఎదురుచూసి కష్టపడి దక్కించుకున్న ఫలము బహు తీయన!" అని మనోహరంగా నవ్వాడు కృష్ణుడు. ఆ పిదప గోపభామినుల చేరి వేయి బంగరురేకుల తామరలో వెలిగే కర్ణికవలే ఒప్పారుతూ రాసలీలల తేలియాడాడు కృష్ణ స్వామి. లావణ్యవీణ మీటినదో లేమ. వల్లకి పలికించినదో తరుణి. అచ్చరలు పూవులవాన కురిపించగా, గంధర్వాదులు మోహవివశులవగా, చుక్కలు చంద్రుని సరసన చేరి మక్కువతో చూస్తూండగా గోపసుందరులతో కలసి రసనాట్యమాడాడు.

ఆపై గోపీసమేతుడై జలక్రీడలకు ఉపక్రమించాడు. గోపికలు నీటిలో నిదురిస్తున్న రాయంచలను అదల్చి తామరలను కోసి సిగలో తురుముకున్నారు. తామరాకులపై తపోనిద్రలో ఉన్న చక్రవాకాలను "తమ సొగసులకు సాటి రాలేరు పొమ్మని" వెక్కిరించారు. నీట మునిగి మోము మాత్రమే చూపి చందమామను పరిహసించారు. దోసిళ్ళతో వారు చిమ్మిన నీటి ముత్యాలు వినీలదేహంపై మెరుస్తూ ఉండగా.. ఆడు ఏనుగుల మధ్య చేరి జలకాలాడుతున్న మత్తేభం వలే కృష్ణమూర్తి కనువిందు చేసాడు.



నీళ్ళలో ఆటలాడి, అలసి.. పొద్దు పొడిచే వేళ బయటకు వెడలి సేదదీరుతున్న గోపకాంతల ఒడిలో చేరి ఒకడే వేయి కృష్ణులై, ఒకరికి ఒక కృష్ణుడై ఆత్మాభిరాముడై గోపీవల్లభుడు వినోదించాడు. వేయి కొలనులలో ప్రతిబింబించినా గగనాన దినమణి ఒక్కడే కదూ!





                            *********************************


కర్కటే పూర్వ ఫల్గున్యాం తులసీ కాననోద్భవాం
పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం

క్రీ. శ. 776 నలనామ సంవత్సర కర్కాటక (ఆషాఢ) మాసంలో, పూర్వ ఫల్గునీ నక్షత్ర యుక్త శుభసమయాన, శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే విష్ణుభక్తునికి తన పెరటి తోటలో ఒక తులసి మొక్క పాదులో, చైతన్యం గల ఒక అపరంజి బొమ్మ కనిపించింది. విష్ణుచిత్తులు ఆ పసికందును దైవప్రసాదంగా భావించి పుత్రికా వాత్సల్యంతో "కోదై" (గోదా) అని ఆమెకు పేరుపెట్టి పెంచుకోసాగారు. 'కోదై' అంటే తమిళంలో కుసుమ మాలిక.

విష్ణుచిత్తులకు ప్రతిరోజూ పరమభోగ్యములైన పుష్పమాలికలను వటపత్ర శాయికి సమర్పించి ఇంటికి రావడం అలవాటు. మగువలకు మాల్యధారణ బహుప్రీతిపాత్రమైనది కదా! ఆ సుకుమారి తండ్రి చూడకుండా, ఆ మాలలను అలంకరించుకుని, అద్దంలో చూసుకుని చప్పుడు చేయక మరల బుట్టలో ఉంచివేసేది. కొన్నాళ్ళకు పూవులదండలో చిక్కిన కేశమును చూచి విష్ణుచిత్తులు కుపితులై ఆమెను నిందించారు. ఆ వేళ మాలలు సమర్పించలేదు.

ఆ రాత్రి ఆయన కలలో కనిపించిన వటపత్రశాయి "ఆ చిన్నది ముడిచిన మాలలే తనకు ముద్దని" చెప్పగా విని విష్ణుచిత్తులు ఆమె మానవమాత్రురాలు కాదని, లక్ష్మీస్వరూపమని గ్రహించి ఆ నాటి నుండీ గోదా ముడిచిన మాలలనే స్వామికి సమర్పించేవారు. అందుకే ఆమెకు "ఆముక్తమాల్యద" అని పేరు.

యుక్త వయసు వచ్చిన ఆమె రంగనాధుని పతిగా వరించి ఆతని పొందేందుకు ధార్మికులనడిగి "భాగవతంలో" ప్రస్తావించబడిన "కాత్యాయనీ వ్రతాన్ని" విల్లి పుత్తూరునే రేపల్లెగాను, తన చెలులనే తోటి గోపికలుగాను, విల్లిపుత్తూరు వటపత్రశాయినే కృష్ణునిగానూ భావించి ముప్పది దినముల వ్రతమాచరించింది. ఆ సమయంలో రోజుకొక పాట చొప్పున కృష్ణునికి పూవులదండ వలే సమర్పించింది. ఆ పాటలే "తిరుప్పావై". ఉపనిషత్ సారమంతా అందమైన పాటల రూపంలో అందించిన గోదా వ్రత పరిసమాప్తి కాగానే రంగనాధుని కల్యాణమాడి ఆతనిలో ఐక్యమైనదని చరిత్ర. ఈ ముఫ్ఫై దినముల కాత్యాయనీ వ్రతమును శ్రధ్ధగా చేసిన వారు, చూసిన వారు ఇష్ట కామ్యార్థములను పొందగలరని ప్రతీతి.


* సదా వెన్నంటి ఉండే ఆచార్య కటాక్షాన్ని పొందిన నా పున్నెం ఈనాటిది కాదు.
  కృష్ణ రసాన్ని గరిపిన తాతగారిని తలచుకుంటూ "కృష్ణార్పణం".

Thursday, January 12, 2012

మా మనసు నీకు తెలియదనా? ~ కాత్యాయనీ వ్రతం - 29

కాత్యాయనీ వ్రతానికి ప్రత్యక్ష సాక్షియైన యమున నెమ్మదిగా కదులుతోంది. రేరేడు కొలువు చాలించి ఇంటికి బయలుదేరినవాడే.. గోపికల రాకను గమనించి ఆగి చూసాడు. తూర్పున శుక్రుడు ఉదయించాడు. రంగురంగుల పుష్పాలతో నిండిన సజ్జలను, పూజాద్రవ్యాలనూ చేతబూని ఆ ఎలనాగలు యమునాతటి చేరారు.

నీట మునిగి "హరిహరీ" అని పైకి లేచిన ఆ గోప తరుణులు ఎనలేని ప్రకాశంతో వెలుగొందసాగారు. సైకత "కాత్యాయని" ప్రతిమ ఎదుట మంగళ దీపికలు వెలిగించి, ధూపమునుంచి, విరులతో అర్చించి, వేడి పొంగలి నివేదన చేసి, కర్పూర హారతులిచ్చారు. కాత్యాయని నిండుగా నవ్వింది. పూజ సంతృప్తిగా పూర్తి చేసుకుని కృష్ణుని వద్దకు నడిచారు.

"రమణీ లలామలారా! మీరడిగిన పరవాద్యమదిగో! తీసుకుని మీ వ్రత పరిసమాప్తి కానివ్వండి." నగుమోముతో పలికాడు నల్లనయ్య.
"గోవిందా! పరిహాసమా?" ప్రశ్నించారు గోప తరుణులు.
"అయ్యో, మీరు విరిచేడెల వలే సుకుమారులు. మీ మనసులూ అంతే కోమలమైనవి. వాటిని కష్టపెట్టడానికి, మీతో పరిహాసాలాడడానికీ నాదేమైనా రాతి గుండె అనుకున్నారా? "
"లేదు కన్నా! నవనీతమంటి మనసు నీది!"
"మీరడిగిన పర వాద్యమిస్తే నిష్టూరాలాడుతున్నారే!"
"నిన్నటి వరకూ మేము పరవాద్యమనీ, ఆభరణాలనీ, పూజాద్రవ్యాలనీ అడిగిన మాట వాస్తవం. కానీ మాకు కావలసినవి అవి కావు."
"మరి వ్రతం సంపూర్ణమయ్యేదెలా?"
"విశ్వకర్తా! నీకు తెలియనిదుంటుందా! కేవలం వాచ్యార్థాన్నే తెలుసుకుని ఒక డప్పు కావాలని కోరుకున్నాం. నీ నామ సంకీర్తనతో మాలో పాపాలను పారద్రోలే శబ్దాన్ని దశదిశలా వ్యాపింపచేసే పరవాద్యం మాకు అవసరమని గ్రహించలేకపోయాం. "నారాయణా.." అని పలికితే ఆ శబ్దమే కోటి 'పర'ల సాటి."

"సరే! ఈ వాయిద్యం వద్దన్నారు. మీకేం కావాలో చెప్పండి!"

కృష్ణత్వదీయ పదపంకజ పంజరాంతం అద్యైవమే విశతు మానస రాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫః వాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే?

కృష్ణా! నీ పాదాంబుజాలనే పంజరంలో మా మానస రాజహంసను అవశ్యం ప్రవేశించనీ! ఎందుకో తెలుసా? ఈ భవజలధిలో పడి కొట్టుమిట్టాడుతూ జీవితపు చరమాంకానికి వచ్చేనాటికి కఫ,వాత,పిత్తాలచే మా గొంతు పూడుకుపోతుందేమో! అప్పుడు నిన్ను తలచేదెలా? అప్పటి దాకా మమ్మల్ని అజ్ఞానంలో పడిపోనీయక, ఇప్పుడే బంధించు.

"మీరు బాగా ఆలోచించుకునే అడుగుతున్నారా, అమ్మాయిలూ!"
"ముమ్మాటికీ నీ సాన్నిధ్యం తప్ప వేరే ఏ కోరికా లేదు, కృష్ణా! అయినా మా మధ్య పుట్టి, మా మనసులను దోచి, నీ వద్దకు రప్పించుకున్నది నువ్వే కదా! నువ్వు చేసిన పనిపై నీకే సందేహమా! మనసా, వాచా, కర్మణా.. మేము కృష్ణ పదదాసులము. వేరే భోగభాగ్యాలు మాకొద్దు. ఏడేడు జన్మలకు నీ సాంగత్యమున్న చాలు. మాకు నీ పై మనసు నిలిచేలా, మిగిలిన కోరికలు గాలిలో వదలివేసిన కర్పూరం తీరున హరించేలా వరమివ్వు చాలు."

"మరి మీ పెద్దలకేం చెప్తారు? నెలకు మూడు వానలు కావాలన్నారు! వ్రతం చేసినదే అందుకని కదా!"
"గోవు అంటే భూమి కదా! గోవిందుడవు.. ఈ భూమిభర్తవు నువ్వే! మా బాగోగులు నీకు తెలియదా? అయినా మాకు నీతో తప్ప వేరెవ్వరితోనూ బంధం వద్దు.  మాకు తండ్రి, అన్న, బంధువు, భర్త, పుత్రుడు అన్నీ నువ్వే! "భ్రాతా భర్తాచ బంధుశ్చ పితాచ మమ రాఘవ" అన్న లక్ష్మణుని వలే మా సర్వం నువ్వే కావాలి. మా ఈ సుందర తనూలతికను సృష్టింపబడింది పరదాస్యానికా? నీ పేరు పలికితే మది ఝల్లన పొంగే హాయి ముందు అమరభోగాలైనా తృణప్రాయం కదూ!

జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం
పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కధా: శ్రోత్రద్వయ త్వం శృణు
కృష్ణం లోకయ లోచనద్వయ హరేర్గచ్చాంఘ్రియుగ్మాలయం
జిఘ్ర ఘ్రాణ ముకుందపాదతులసీం మూర్ధన్ నమాధోక్షజం

ఓ నాలుకా! నీలాల ముంగురుల నల్లనయ్యనే తలుచుకో. కేశవుని కల్యాణ గుణాలను పాడు!
ఓ చేతుల్లారా! సిరిని చేపట్టిన శ్రీధరుని అర్చించుట తప్ప వేరేదీ చేయకండి సుమా!
చెవులారా! అచ్యుతుని కథలు మాత్రమే వినండి. అన్యమైనవి మీకొద్దు.
ఓ లోచన ద్వయమా! కృష్ణుని చూడండి! ఆ అందగాడినే రెప్పవేయక చూడండి.
హరిని చేరే దారిలో నడవమని మా పాదాలను కోరుకుంటున్నాం.
నీ పాదాలనర్చించిన తులసి సుగంధం తప్ప వేరే సువాసనా సోకవలసిన అవసరమే లేదు.. మా నాసికకు! అధోక్షజునికి నమస్కరించడానికే మా శిరస్సు!

మురారీ! మోహన మురళీధరా! నీ చెంతనుండే భాగ్యమిస్తివా.. వేయి జన్మలెత్తేందుకైనా సిధ్ధం! మాకు జన్మ రాహిత్యమొద్దు. మోక్షమూ వద్దు. పరమపదము అసలే వద్దు. ఋషులు కైవల్యాన్ని కోరుకుంటారే కానీ, అక్కడ నువ్వు మాకింత చేరువగా ఉంటావో ఉండవో, నిన్ను ఇంత దగ్గరగా చూడగలమో లేదో, నిన్నిలా "గోవిందా!" అని పిలవచ్చో కూడదో.. మాకేం తెలుసు! మాకు కావలసినదల్లా ఇలా ఈ రేపల్లెలో నీ మ్రోల నిలచి నిన్ను కన్నార్పక చూడడం మాత్రమే!"

ఒకటే కోరిక మా కిక
ఓ స్వామీ! గోవిందా!
మా మనసు నీకు తెలియదనా?
ఈ మనవి చేసుకొనుట!

తెలవారక మున్నే, దేవా, నీ సన్నిధి
చెలులము చేరి, నీ కొలువే కోరి,
సరస సుందరములు
సంఫుల్ల సరోజములు నీ
చరణములకు మంగళా
శాసనము చేయుట
పరవాద్యమున కనా?
ఓ స్వామీ గోవిందా!

ఆల మేపి బతికే ఈ
బేలలలో ఒకడవై
అవతరించుటేల? మా
అనుగవు కానేల?
ఈ బంధము నిలుపుము ఏ
డేడు జన్మముల కైన!
ఈ కైంకర్యము మానము
ఏనాటికి ఎప్పటికీ!

వికసిత పద్మాల వలే అందాలు చిందే మోములతో, ఆర్ద్రమైన కన్నులతో, ముకుళించిన చేతులతో, హిమస్నాతలైన విరుల వలే స్వచ్చమైన హృదయాలతో.. అపరంజిబొమ్మల వలె తన చెంత ఆర్తితో నిలిచిన ఆ గొల్ల పడుచులను చూసి నవ్వాడు కృష్ణుడు. వెన్నెల సోన కురిసినట్టై గోపీమానస చకోరాలు పులకించాయి.

"ప్రియ భామినులూ! మీ కోరిక కాదనుట నావల్లనయే పనేనా!!  మీ ప్రేమకు బానిసను!"కాత్యాయనీ వ్రతం" చక్కగా సంపూర్తి చేసుకున్నారు. నన్ను పొందడమే మీ గమ్యమైతే మీ అభీష్టం సిధ్ధించినట్టే! నా పరిష్వంగన సుఖం తప్ప వేరేదీ వద్దన్న మీ గాఢమైన కోరికకు, కౌగిలికి బందీనయ్యాను." అని మృదుమధురంగా పలికాడు. గోపికల మనసులు గోపాలకృష్ణునితో ఏకమయ్యాయి.


* ఇంకా ఉంది.


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


Wednesday, January 11, 2012

వట్టి వెర్రి గొల్ల పొలతులము! ~ కాత్యాయనీ వ్రతం - 28

"చెలియా! నిన్నటి ఆనందం వేరొకరికి దక్కేది కాదు. బ్రహ్మేంద్రాదులైనా తలక్రిందులుగా తపస్సు చేస్తే మాత్రం కన్నయ్య సరసన కూర్చుని భోజనం చెయ్యగలరా? మన పున్నెం ఎంతని చెప్పాలి! ఇంత పరమానందం మన సొంతమయినాక కూడా, పరవాద్యమీయమని కృష్ణుని ఎలా అడగడం?" వాపోయింది కమలిని.
"నిజమే! ఎన్ని మాటలన్నాము! ఎన్ని నిందలు మోపాము. ఇవేవీ పట్టనట్టు ఒక్క క్షణంలో మనని మహదానందంలో ముంచి వెళ్ళిపోతాడు కదా! కన్నయ్య కరుణ అపారం!" పూవులేరి సజ్జ నింపుతూ కమలినితో చెప్పింది సురభి.
చెంత చేరిన సాటి గొల్లెతలు వారి మాటలను విని తలొకరూ తాము చేసిన మునుపటి తప్పులను తలచుకోనారంభించారు. తోటి గోపబాలుర మధ్య సింహపు కొదమ వలే ఒప్పారే కృష్ణుని శైశవక్రీడలను మరి మరి తలచుకు మురిసారు. అతడు సామాన్యుడని తలచి "అల్లరి వాడని" యశోదకు చాడీలు చెప్పిన తమ తెలివితక్కువ తనాన్ని గురుతు తెచ్చుకుని బాధపడ్డారు.

కన్నయ్యకు కడుపు నిండుగా పాలిచ్చి, ముద్దులొలికే ఆ నందకిశోరుడి మోము చుట్టూ చేతులు తిప్పి, కణతలకు నొక్కుకుని మెటికెలు విరిచి, పాలబుగ్గన ముద్దిచ్చి, గృహకృత్యాలలో పడిన యశోద కళ్ళు గప్పి, ఇరుగుపొరుగుల ఇళ్ళలో దూరేవాడు నల్లనయ్య. గోపికలు పెరుగు చిలుకుతూ ఉంటే కవ్వాన్ని గట్టిగా పట్టుకుని ఆపి వెన్న పెట్టమని మాటి మాటికీ నిర్భంధించేవాడు. "కన్నయ్యా, ఏదీ ఒక మారు నృత్యం చేస్తివా.. ఇదిగో ఈ వెన్నముద్ద నీ  చేత పెడతా"మని గోపికల చేత అడిగించుకుని ఘల్లుఘల్లుమంటున్న గజ్జెలతో, మొలనూలి మువ్వలతో, మొలక నవ్వు చిందులేస్తున్న ముద్దు మోముతో.. ఆడి కనువిందు చేసేవాడు. మైమరచి చూస్తున్న గోపికల చేత వెన్న ముద్దను తటాలున చేజిక్కించుకొని 'గున్న ఏనుగు తొండం చివర మెరిసే తెల్లకలువ మొగ్గవలే' అందాలు చిందే తన చేత వెన్నముద్దను చూపుతూ, నవ్వుతూ పరుగులు తీసేవాడు.

అందరి ఇళ్ళలోనూ చక్కగా కాగిన పాలు, రాయి వలే తోడుకున్న పెరుగు, నేయి, వెన్న, మీగడ తను తిన్నంత తిని స్నేహితులకు పెట్టి మిగిలిన కుండలు పగులగొట్టి పాలన్నీ నేలపాలు చేసి వెళ్ళేవాడు. ఎంతో ఎత్తున ఉట్లలో జాగ్రత్తగా పెట్టుకున్న వెన్న కడవలకు తూట్లు పొడిచి నవనీతం యధేచ్ఛగా ఆరగించేవాడు. ఇన్ని దొంగిలించి భోంచేసినా, ఏమీ ఎరుగని వాని వలే తల్లి ఒడిలో చేరి పాలిమ్మని మారాం చేసేవాడు.

తనతో పాటు బలరాముడు, మిగిలిన గోపబాలురను వెంటపెట్టుకుని "మీరు ఆవులు, నేను ఆబోతును" అని రంకెలు వేసే వాడు. "నేను రాజును, మీరు నా భటులు" అని రాజ కార్యాచరణకు ఉపక్రమించేవాడు. "నేనేమో దొంగను,  మీరు గృహస్థులు" అని నిద్రపోతున్నట్టు నటిస్తున్న వారి సొమ్ములు అపహరించి, ఎవరికీ తెలియని స్థలంలో దాచి తనూ దాగేవాడు. చేతి బంతులతో ఆటలు, ఉయ్యాలలు, దాగిలిముతలు ఇలా అనేకవిధాలైన ఆకతాయి ఆటలు ఆడుతూ గొల్లపల్లెలో వాడవాడల గగ్గోలుగా పరుగులు తీసేవాడు.

గోపకిశోరుని అల్లరిపనులను గొల్లెతలు తాళలేక యశోదతో మొరపెట్టుకున్నారు.." ఓ యశోదమ్మా! నీ ముద్దులపట్టి వల్లమాలిన అల్లరితో మమ్ములను బతకనీయడం లేదమ్మా! మా కడవల్లో ఎర్రగా కాగినపాలన్నీ తన తోటి వారికి పోసి, తాను తాగి వెళ్ళిపోతే బాగుండేది. కడవలన్నీ ముక్కలుచేసి మిగిలిన పాలన్నీ నేలపాలు చేయడమేమైనా పిల్ల చేష్టా? పసివారికి పాలులేవని బాలెంతలు వాపోతూ ఉంటే, మీ వాడు లేగదూడలను విడిచిపెట్టి మా ఆవుల పొదుగుల్లో చుక్క పాలు మిగులనివ్వడు. ఈ అల్లరికి హద్దుందా?

బాలురకు బాలు లేవని, బాలింతలు మొఱలువెట్ట పకపక నగి యీ
బాలుడాలము సేయుచు, నాలకు గ్రేపులను విడిచె నంభోజాక్షీ!

వట్టి పసివాడని భ్రమసేవేమో! ఉట్టి మీద కుండలని అందుకోడానికి రోళ్ళు, పీటలు ఒక దానిపై ఒకటి పెట్టి ఎక్కేస్తాడు. తిన్నంత తిని కుండలకు తూట్లు పెట్టడమేమిటో? ఏమైనా బాగుందా? పోనీ వెళ్ళేవాడు వెళ్ళిపోకుండా నిదురిస్తున్న ఓ  కోడలి మూతికి కాస్త వెన్న రాసి పోయాడు. దొంగిలించినది కోడలేనని అనుకుని అత్త నింద మోపిందని, అత్తాకోడళ్ళూ సిగపట్లు పట్టుకున్నారు. ఇంకొక ఇల్లు దూరి పాలన్నీ గుటుకు గుటుకు తాగి ఆ కుండలు వేరొక చోట విడిచి వచ్చాడట! ఆ రెండు కుటుంబాల పోరూ అంతా ఇంతా కాదు. మైమరచి నిద్రిస్తున్న ఆమె కొడుకు పిలకకు లేగదూడ తోకని ముడి వేసి దాన్ని వీధిలోకి తోలాడట నీ ముద్దుల కృష్ణుడు! ఏమైనా చిన్న ఆగడమా ఇది! వీధి చివర ఆడుకుంటున్న ఓ పిల్లాడి కుత్తుక వరకూ వెన్న బలవంతంగా తినిపించాడట! మా పిల్లలు పిల్లలు కారా? మేము ఈ గొల్లపల్లెలో బతకాలా, వద్దా?" అని ప్రశ్నించారు.

బిత్తర పోయి చూస్తున్న యశోద ముందుకు.. దురుసుగా ఒక అడుగు వేసిన ఓ గొల్లెత "ఓ యశోదమ్మా! మేము మీ అంత భాగ్యవంతులము కాదమ్మా! పది కడవల పాలు నేల దొర్లించి కడవలను పిండి చేసాడు. "నువ్వేం చేస్తున్నావని" నా మొగుడు నన్ను తిట్టిపోసాడు. తాళం పెట్టిన ఇంట్లో ఎలాదూరాడో, నీ మాయ పిల్లడు!" అని వాపోయింది. మరో గొల్ల పడుచు "మా లేగలు, ఆవులను ఒక చోట చేర్చి పెద్ద పెద్ద బొబ్బలు పెట్టాడు నీ కొడుకు! అవి బెదిరి అడవిలోకి పరుగులు తీసాయి. ఎంత వెతికినా కనిపించలేదు. మేమెలా బతకాలో నువ్వే చెప్పు!"అని కన్నీళ్ళు పెట్టుకుంది.

ఓయమ్మ నీ కుమారుడు మా యిండ్లను బాలుబెరుగు మననీడమ్మా
పోయెదమెక్కడికైనను, మాయన్నల సురభులాన మంజులవాణీ!

 "అందరూ కలిసి వేరే ఎక్కడికైనా వలసపోతాం, నువ్వూ, నీ గారాల కృష్ణుడూ ఒంటరిగా ఈ గొల్లపల్లెలో ఉట్టికట్టుకు ఊరేగండని"  కోపంగా చెప్తున్న వారికి మంచి మాటలు చెప్పి, 'నా బిడ్డ నా చన్ను వీడి రాడ'ని ఒట్లు పెట్టి, వారిని శాంతింపచేసి ఇళ్ళకు పంపించింది యశోదమ్మ.

ఇంటికి వచ్చిన కన్నయ్య అన్యమనస్కంగా కూర్చున్న అమ్మ ఒడిలో దూరి "ఆకలేస్తోందమ్మా! పాలివ్వవూ!" అని ఒక చేత్తో ఆమె కొంగు లాగుతూ, మరో చేతిని ఆమె గడ్డం కింద ఉంచి ముద్దు ముద్దుగా బతిమాలాడు. కరిగి నీరైన ఆ తల్లి చప్పున కన్నయ్యకి పాలివ్వనారంభించింది. పాలునిండిన బొజ్జతో ఆయాస పడుతూ, పాలచారికలతో మెరిసే బుగ్గలతో అమాయకంగా తననే చూస్తున్న కృష్ణునితో "కన్నయ్యా! పాలు తాగి మనింట్లోనే ఉండి ఆడుకోరాదా? ఎందుకు ఇరుగుపొరుగు వారి మాటలు పడుతున్నావు! నా వద్ద పాలెప్పుడూ జాలై ప్రవహిస్తున్నవి కదా! "తల్లిపాలు గుక్కెడు - మిగిలినవి పుట్టెడు సరిసమాన"మన్న నానుడి నా పట్ల బొంకైనదేల! ఎందుకు నీకింతటి లేనిపోని రొష్టు?" అని ప్రశ్నించింది. మారాడక తల్లి గుండెలపై తల ఆన్చి కనులు ఓరగా మూసుకుని నిద్రపోయాడు కన్నయ్య.

తెల్లారిందో లేదో "అమ్మా! తమ్ముడు మన్ను తిన్నాడని" బలరాముడు పరుగున వచ్చి చెప్పాడు. నిన్న చెప్పిన సుద్దులు అప్పుడే పెడచెవిన పెట్టాడన్న కోపంతో పరుగు పరుగున కన్నయ్య వద్దకు వెళ్ళింది యశోద.
"కన్నా! మన్ను తిన్నావా? నీకు ఆకలైతే పాలూ, వెన్నా లేవా? అతి రుచికరమైన భక్ష్యాలు ఎల్లవేళలా ఇంట్లో ఉంటాయి కదా! మన్ను తినాల్సిన అగత్యమేమొచ్చింది?" అని గద్దించింది.
"లేదమ్మా.. అన్న కొండేలు చెప్తున్నాడు. నేనేమైనా వెర్రి వాడినా? కొంటె పనులు మానేసానమ్మా! వీళ్ళందరూ నాపై చాడీలు చెప్తున్నారు. నమ్మకం కుదరని దానివైతే ఇదిగో.. నా నోరు చూడు!" అని ముత్యాల పాల పలువరుసతో, ఎర్రనెర్రని చిట్టి నాలుకతో ప్రకాశిస్తున్న నోటిని తెరచి చూపాడు.

యశోద కృష్ణుని నోటిలోకి తేరిపారా చుసింది. ఎక్కడా మన్ను జాడలేదు. కానీ సూర్యచంద్రులూ, తారకలూ, గ్రహాలూ, సప్తసముద్రాలతో, పర్వతాలతో కళకళలాడుతున్న విశాలవిశ్వం సాక్షాత్కరించింది. ఆ మాయ 'కలో, నిజమో!' తెలియనిదై నందుని ఇల్లాలు చిగురాకువలే వణికింది.

కలయో వైష్ణవమాయయో యితర సంకల్పార్థమో సత్యమో
తలపన్ నేరకయున్నదాననో యశోదాదేవి గానో పర
స్థలమో బాలకుడింత యాతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుటకేమి హేతువొ మహాశ్చర్యంబు చింతింపగన్

"తన ఎదుట ఉన్నది సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే"నని తెలుసుకుని కైమోడ్చి నమస్కరించింది. తృటిలో తన తల్లికి ఆ స్మృతి తొలగి మామూలుగా అయ్యేలా మాయ చేసాడు కన్నయ్య.

"అలాంటి కన్నయ్యని సామాన్యుడని తలచి ఎన్ని మాటలన్నాము! ఎన్ని పేర్ల పిలిచాము, మన పాపానికి నిష్కృతి లేదు. కృష్ణుడే దయ చూపి మనని అక్కున చేర్చుకోవలసినదే కానీ, మనం చేసేదేమీ లేదని" పదే పదే అనుకుంటూ కాత్యాయనికి పూజ పూర్తి చేసుకున్నారు గోపవనితలు. యమున ఒడ్డున కూర్చుని ఇప్పుడేమి చేద్దామన్నట్టు ఒకరినొకరు చూసుకున్నారు.

"చెలియలూ! గోవిందుని శరణనడం తప్ప మనం చేయగలిగినదేమీ లేదు. అతడెక్కడ లేదు కనుక! వెర్రి పొలతులమై ఆ ఇంట్లో ఉన్నాడని, ఈ తలుపు వెనుక ఉన్నాడని తలచి మేలుకొలుపులు పాడాము. వెర్రి కోరికలు కోరాము. "పరవాద్యము తప్ప వేరేదీ అక్కర్లేదని" మనసారా కృష్ణుని తలచి కలసి వేడుకుందాం." అని చెప్పింది ఆనందిని. "ఔనని, కృష్ణుడే శరణమ"ని ఏకకంఠంతో పాడసాగారు గోపవనితలు.

చీకాకు పడకూ - చిడుముడి పడకూ-
నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు?

మా పున్నెము వలన గదా
మా కోసమె గాదా, మా
గోపకులములోన దిగి
గోవిందుడవైనావు!

గోవులవెంబడి ఏవో
కోనలలో కానలలో, బడి
పోవు వట్టి వెర్రి గొల్ల
పొలతులము

చిన్ని పేర పిలిచాము ఎన్నొ మాటలన్నాము
ఎన్ని జన్మమములదో ఈ వీడని మన బంధము
ఇక దయచేయుము వరము పరవాద్యము

చీకాకు పడకు చిడుముడి పడకు
నీ కరుణ వినా మాకేమున్నది చెప్పు!

"కృష్ణా! ఆశ్రిత వత్సలా! మాకేమీ తెలియదు. కుడిఎడమల తేడా ఎరుగని వెర్రి గొల్లలం. గోవుల వెంట కొండల్లో తిరిగే మా పున్నెం ఎంత గొప్పదో..! మా మధ్య మా వాడివై పుట్టావు. నీ అసలు రూపం తెలుసుకొనుట నీ తల్లికే సాధ్యపడలేదు. మా వల్లనయేదా చెప్పు! ఎన్ని మాటలన్నామో, ఎన్ని పేర్లతో పిలిచి నిన్ను చిన్నతనపరిచామో! మా యందు దయ ఉంచాలే తప్ప మాదేమీ లేదు. సూర్యుని కాంతి వీడనట్టు, పూవుని పరిమళం వీడిపోలేనట్టు నిన్ను విడిచి మేమూ లేము. మా వ్రత సంపూర్తికి పర వాద్యము వరమివ్వాల్సిన వాడివి నువ్వే!" అని వేడుకున్నారు.

అమర్యాదః క్షుద్రః చలమతిః అసూయా ప్రసవభూః
కృతఘ్నో, దుర్మానీ స్మరపరవశో వంచన పరః
నృశంసః పాపిష్ఠః కథమిహమితో దుఖః జలధేః
అపారాత్ ఉత్తీర్ణః తవ పరిచరేయం చరణయోః

"మర్యాద లేని వాడను, క్షుద్రుడను, చంచలమైన మనస్సు కలిగిన వాడను, అసూయ నిండిన మనసుతో పుట్టిన వాడను, కృతఘ్నుడను, మానము లేని వాడను, కామపీడితుడను, వంచనపరుడను, చెడ్డమాటలాడేవాడను, పాప కార్యాలను చేసేవాడను.. ఇన్ని దుర్గుణాలున్న నన్ను దుఖఃజలధి దాటించే నావ నీ చరణములే!" అని ఒప్పుకుని శరణన్న వాడికి పరమాత్మ క్షణమైనా వీడి ఉండలేడు. "అమ్మా.. తప్పు చేసాను." అని ఒప్పుకున్న వాడిని అక్కున చేర్చుకుని కన్నీరు తుడిచేదే తల్లి.. కదూ!

* పరవాద్యము దక్కేనా? రేపు చూద్దాం!



( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)



Tuesday, January 10, 2012

వేడ వచ్చునా మరికొన్ని! ~ కాత్యాయనీ వ్రతం - 27

నెలవంకను పోలిన నుదుటిపై సరాగాలాడుతున్న ముంగురులను, కరకంకణాలు సవ్వడి చేసేలా సుతారంగా సవరించుకుంటూ, కెమ్మోవులపై చెంగలించే చిరు చిరు నగవులతో.. ఆ తిలకినీబృందం కాత్యాయనీ దేవిని అర్చించి, మంగళారతులిచ్చారు. పూజావిధి పూర్తి చేసి యమునాతటి పై కూర్చున్న వారికి ప్రకృతి మనోహరంగా తోచింది. అరుణోదయవేళకు సమాయత్తమవుతున్న తూర్పుకాంత మనోజ్ఞంగా ఉంది.

"చెలీ! ఇంత హాయిని కృష్ణుని సన్నిధిలో తప్ప వేరే వేళా ఎరుగమే! కన్నయ్య ఇక్కడెక్కడైనా ఉన్నాడంటావా?"
సురభి సందేహానికి ఉలిక్కి పడ్డారందరూ! నిన్న చీరలెత్తుకెళ్ళి అల్లరి చేసిన చిత్తచోరుడు అక్కడే ఉన్నాడేమో అనే ఊహ వారి చెక్కిళ్ళలో కెంపులు పూయించింది. తత్తరపడుతున్న నెన్నడుములతో, అందెలు ఘల్లనేలా అటూఇటూ కలియతిరిగారందరూ! ఎపుడొచ్చాడో, ఎటునుంచి వచ్చాడో తెలియదు కానీ, నవ్వుతున్న మోహన మురళీధరుడు తమ మధ్యలో..  మణిహారం మధ్యలో మెరిసే అనర్ఘ రత్నంలా తళుక్కుమన్నాడు. ఒక్కసారి తడబడ్డారు. ఎదురుచూడకనే ఎదురైన ఆనందానికి వారి మోములు దీపాల వలే మెరిసాయి.

"మీకు శ్రమ ఎందుకని నేనే వచ్చాను." కృష్ణుడు పలికాడా? గండు తుమ్మెద ఝుమ్మందా? వారి కనులు కలువలయ్యాయి! శిఖిపింఛాన్నీ, నల్లని ముంగురులనూ, వనమాలనూ, పీతాంబరాన్నీ అల్లరిగా తాకివెళ్తున్న తెమ్మెరపై పట్టలేని ఇడుగడ కలిగింది గోపకాంతలకు.

"పూజ పూర్తి చేసుకున్నారా?"
"ఓ.."
"నా వద్దకేగా బయలుదేరబోతున్నారు!"
"ఊ.. అవును."
"నేనే వచ్చానుగా! చెప్పండి."
"కృష్ణా! ఎంత ఆనందంగా ఉందో!"
"ఊ..."
"ఎంత కష్టపడి తెలవారక మునుపే నిద్రలేచావో! ఇంత దూరం మా కోసం వచ్చావో!"

"మాయ మాటలు మాని ఏం కావాలో చెప్పండి, వయ్యారులూ!"
"ఏం కావాలన్నా ఇస్తావా?"
"నేనేం ఇవ్వడానికి సమర్ధుడనో మీకు తెలియదా!"
"నువ్వు వాసుదేవుడవు! నీకు సాధ్యం కానిది ఉందా?"
"అన్నీ తెలుసుకున్నారు కదా! ఏం కావాలో చెప్పండి మరి!"

"మాకు గాజులు కావాలి."
"పూలచెండ్లల్లే సుకుమారంగా ఉన్న మీ చేతులు సూడిగముల కాఠిన్యానికి నొచ్చవూ!"
"ఇదిగో.. మాయ మాటలొద్దు కన్నా!"
"ఊ.. సరే సరే! గాజులు.. అంతేనా?"
"జుమికీలూ, చెవి తమ్మెట్లకి అలంకరించుకునే పువ్వులూ కావాలి."
"తలిరాకుల చెవులకు పువ్వుల జుమికీలు, చెవాకులు! బాగు బాగు!"
"మరి మా కాళ్ళకు అందెలో!?"
"పదపల్లవాలకు లత్తుక చాలదూ! నూపురాలు ఒత్తుకుని నొచ్చితే, నేనేగా సేవలు చేయాల్సినవాడిని!"
కృష్ణుడి మాటలకు ఉక్రోషపడదామనుకుని ఆగిపోయారు. "చిక్కని పూపొదరింటో, ఏ పొగడ తిన్నె పైనో, మావి కొమ్మ ఊయలలోనో కూర్చున్న తన పాదాలకు నల్లనయ్య మక్కువగా పారాణి అద్దిన నాటి గురుతు" ప్రతి గోపిక మనసులోనూ మెదిలి వాగ్బంధనం చేసింది. చిగురుకటారి కోలలకు విలవిల్లాయి వారి ఎడదలు!

"సూడిగములు, జుమికీలు, చెవి ఆకులు, పాడగములు.. అంతేనా?"
ఇంకా ఏం అడుగుదామని ఒకరినొకరు చూసుకున్నారు. గాజులకి జోడు 'బాహుపురులు' కూడా ఉంటే చేతులు నిండుగా ఉంటాయని అనుకున్నారు.
"కేయూరములు కూడా కావాలి, కన్నా!"
"ఊ.." ఇంకా.. అన్నట్టు చూసాడు.
"ఆడువారికి చీరలంటే ఎంతో ప్రీతి. నీకు తెలిసిందే కదా! మాకు వన్నెల చీరలు కావాలి." తల తాటించి నవ్వాడు.

"ఆడు వారి కోరికలని నవ్వుకుంటున్నావా? మాకు పెద్ద పెద్ద కోరికలేమీ లేవయ్యా! తన అన్న వాలిని చంపమని సుగ్రీవుడు కోరితే కాదన్నావా? తమ్మునితో నేస్తం కట్టి అన్నని చంపావు కదా!" ఒక గోపి నిష్టూరాలు ఆడింది. మారాడక నవ్వాడు నల్లనయ్య.
"శత్రు వర్గం వాడైనా శరణుజొచ్చాడని విభీషణుడిని లంకాధిపతిని చేసావు. మాకు రాజ్యాలక్కర్లేదులే!" ఈ మాటకీ వెన్నలా చల్లని చిరునవ్వే సమాధానం!
"రాముడై ఏం చేసావో ఎందుకిప్పుడు! కృష్ణుడివై పుట్టావు. గోకులాన్ని కాచేందుకు కొండనెత్తావు. గోవిందుడవైనావు. గోవిందా! మాకోసం ఇప్పుడు నువ్వేమీ కొండలు ఎత్తక్కర్లేదయ్యా! కూడదనక మేమడిగిన చిన్ని చిన్ని కోరికలు తీర్చు చాలు!" తన వంతు మాటలు ఇంకో గొల్లెత అనేసింది.
"ఏదో, నీరాడి వచ్చి వ్రతం నోచుకున్న సంతోషంలో అడుగుతున్నామంతే! మా పూజ పూర్తి అయ్యే సమయానికి నువ్వు వచ్చావు. ఎంత ఆనందంగా ఉందో! ఈ ఆనందంలో నీతో కలిసి పాయసం తినాలని ఉంది కన్నా!" అందరి మనసులలోనూ ఉన్న కోరికను ఎరిగినట్టు కమలిని చెప్పింది. అవునన్నట్టు తలలూచారందరూ!
"గోపబాలురతో కలిసి చల్దులు భోంచేసావట! మా అన్నలు తమ్ములూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో.. "కన్నయ్య మా చల్ది తిన్నాడని, మా ఊరుగాయ బాగుందన్నాడనీ! నాకు తినిపించాడనీ, నా చేతి వెన్నముద్ద తిన్నాడనీ" మాకా భాగ్యం కలిగించవూ!" తమ చిరకాల వాంఛ బయటపెట్టారు గోపికలు!

"ఊహకే ఎంత ముద్దుగా ఉంటుందో! ఊరుగాయ నాకుతూ మాటిమాటికీ వేలు మడిచి ఊరించేదొకడు. ఒకని చల్దిముద్ద దొంగలించి గుటుక్కున మింగి "చూడు లేదని!" నోరు చూపునొకడు. ఇద్దరికి కలహం సృష్టించి వారి చల్దులు ఆరగించేవారట మిగిలిన వారు! "కృష్ణా! మా అమ్మ చేసిన భక్ష్యమిదిగో!" అని నీచేత తినిపించేదొకడు. నవ్వే వాడొకడు. నవ్వించేదొకడు. వింత చేష్టల వాడొకడు. వినోదించేవాడొకడు.. ఈ సందడిలో లేగదూడవలే ముద్దొచ్చే నువ్వెంత అందంగా ఉండి ఉంటావో!!

కడుపున దిండుగా గట్టిన వలువలో లాలితవంశనాళంబు జొనిపి
విమల శృంగంబును వేత్ర దండంబును జాఱి రానీక డాంచక నిఱికి
మీగడ పెరుగుతో మేళవించిన చల్దిముద్ద డాపలి చేతమొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు వ్రేళ్ళసందులయందు వెలయ నిఱికి

సంగిడీల నడుమ జక్కగ కూర్చుండి, నర్మ భాషణముల నగవు నెఱపి
యాగభోక్త కృష్ణుడమరులు వెఱగంద, శైశవంబు మెఱసి చల్ది గుడిచె

వంశీ మోహనా! అల్లరి కన్నయ్యా!! నడుము చుట్టూ కట్టిన ఉత్తరీయం సందున నీ పిల్లనగ్రోవి, ఊదుకునే కొమ్ము బూర, పశువులనదలించే బెత్తం జారకుండా దూర్చుకుని, మీగడపెరుగుతో కలిపిన చల్ది ముద్ద ఎడమ చేత్తో భుజిస్తూ మధ్యలో చెలికాండ్రు తెచ్చిన ఊరుగాయలు వేళ్ళసందుల జిక్కించి నాకుతూ..  బ్రహ్మాదులు వింతగా చూసేలా, అసూయ చెందేలా గొల్లపిల్లలతో కలిసి చల్దులారగించావట! బ్రహ్మ ఆ అసూయతోనే గోపబాలురనూ, గోవులనూ దొంగలించి ఉంటాడు. యాగభోక్తవి! నీతో కలిసి చల్దులు తిన్న ఆ వెర్రి గొల్లలదెంత పున్నెమో! వారెంత ధన్యులో!!

మాకూ నీతో కలిసి బంతిన కూర్చుని పాయసము తాగాలని ఉంది. నేయి, పాలు పోసిన మధురమైన పరమాన్నం తినాలని ఉంది. తింటూ ఉంటే మోచేతి నుంచి నేయి ధారగా కారేలా, నీతో కలిసి భోగ్యమైన పాయసం ఆరగించాలని ఉంది, కన్నా!"

వేడవచ్చునా మరికొన్ని మా
వేడుకకై కొన్ని!
కూడని వారిని ఓడించే
శుభ గుణములు గల గోవిందా!

ఆడువారి కోరికలనుకోకు!
కూడదనకు గోవిందా! నీ
రాడి వచ్చి వ్రతమూనిన ముదమున
అడిగెదమంతే స్వామీ!

సూడిగములు, జుమికీలు, చెవాకులు,
పాడగములు, కేయూరములు,
తొడవులన్ని కయిసేయగవలదో!
తొడగవలదొ పలువన్నెల వలువలు!

ఇంతకన్న శుభవేళ ఏదీ?
ఇంతకన్న ఆనందమేదీ?
బంతులుగా నీతోడ గూడి,
ఇంతులమెల్లరము
నేయి వెన్న మీగడలు
తీయని తీయని పాయసము
చేయిమునుగగా ఆరగింపగా
చేయవా! చిత్తగింపగా!

గోపతరుణులు కోరిన కోరికా, పాడిన పాటా.. పాల పాయసమంత తీయగా ఉంటే గోవిందుడు కాదనగలడా!

"గోప భామలూ! మీ కోరిక సబబైనదే! గొల్లపిల్లలై ఉండీ ఇన్ని రోజులుగా నేయీ, పాలూ లేకుండా వ్రతమొనర్చారు. నన్ను మెప్పించారు. ఈ రోజు మీ కోరికను కాదనను. "అహం అన్నం అహమన్నాదః" అన్నమూ నేనే, అన్నము భుజించేదీ నేనే! మీకు దోషమంటదు. అదిగో.. గోపన్న తెచ్చిన పాయసం ఆరగిద్దాం రండి!" అని అటుగా చేయి చూపాడు.

నూట ఎనిమిది కడవలతో మధురమైన పాయసము సఖులతో కలిసి తెచ్చి గోవిందునికి సమర్పించాడు గోపన్న. ఆశ్చర్యంగా తనని చూస్తున్న చెల్లెలు అమృతని, మిగిలిన గోపబాలలనూ చూసి నవ్వాడు.
"అమ్మాయిలూ! ఇంత దీక్షగా వ్రతం చేస్తున్నారే! మీ కోరిక ఫలించాలని కోరుకుంటూ, కృష్ణ స్వామి మీపై దయ చూపిస్తే పాయసం తినిపిస్తానని మొక్కుకున్నాను. కన్నయ్యతో కూడి ఆరగించండి!" పాలతరగలా నవ్వుతూ చెప్పాడు గోపన్న.

ముత్యాల కోవలా కూర్చున్న గోపికల నడుమ నీలమణి వలే జిగేల్మంటున్న మోహనకృష్ణుడు! వారి మోచేతుల నుండి నేతిధారతో కలిసి కారుతూ కమ్మని తీయ తీయని పాయసం! నారింజ కాంతులు చిమ్ముతూ తూర్పున ఉదయిస్తున్న భాస్కరునికి.. శీతగాలిలో నేతి సువాసనతో కలిసి తేలుతున్న కుంకుమ పువ్వు, యాలకులు, పచ్చకప్పురపు ఘుమఘుమలు నోరూరించే ఉంటాయి!!


* మరి పర వాద్యం సంగతేమిటో!? రేపు చూద్దాం!


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


Monday, January 9, 2012

అల్లరి చాలించు, కన్నా! ~ కాత్యాయనీ వ్రతం - 26

"కృష్ణా!"
"ఊ.."
"కన్నా! వరాలమూటా!!"
"మా అమ్మ పిలిచినట్టు పిలిస్తే లొంగిపోతాననుకున్నారా?" అని మనసులో అనుకుంటూ ఓ చిరునవ్వు చిందించాడు.
"రేపు రండి. అని చెప్పి పంపించావు."
"ఊ.."
"వచ్చాము. మేము కోరిన వస్తువులిచ్చి పంపించవూ!"
"ఏం కావాలి మీకు?" వారి చూపులతో చూపులు కలిపి క్షణకాలం సూటిగా చూసాడు.
"నువ్వే! ఇంకేం కావాలి మాకు!" అని పలుకబోతున్న పెదవులను అతి ప్రయత్నం మీద అదుపు చేసుకున్నారు.
"నెలకు మూడు వానలు కురిసేనని పెద్దలు చెప్తే, అందరి హితం కొరకూ వ్రతం చేస్తున్నాం. "కావలసినవన్నీ కన్నయ్యనడిగి తీసుకోండి" అని మీ అయ్య నందయ్య మాతో చెప్పగా విన్నావు కదా! ఏమీ తెలియని వాడిలా ఈ పరీక్షలేమిటి కన్నా!?"
"అరెరే! భలే వారే! మీకేం కావాలో మీరు చెప్పకుండా నాకెలా తెలిసేను! ఇప్పుడు చెప్పండి. ఏమేం కావాలి. సంశయం లేకుండా అడగండి. ఏం కావాలి?" మాయ కన్నయ్య మాటలెంత మధురంగా ఉంటాయో!
గోపకాంతలు ఒకరితో ఒకరు 'ఏమేం కావాలో!' అని గుసగుసలాడుకున్నారు. మళ్ళీ కృష్ణుని మనసు మారకుండా అడగాలని నిశ్చయించుకుని చెప్పడం మొదలు పెట్టారు.

"కృష్ణా! వరదాయీ! మాకో శంఖం కావాలి."
"ఊ.. సరే.. శంఖము..." ఒక వేలు ముడిచి లెక్కపెట్టాడు.
"ఆగాగు! శంఖం అంటే అలాంటిలాంటి శంఖం కాదు. పాల వలే తెల్లనిది.. భూమి దద్దరిల్లేలా శబ్దం కలుగ చేసేది, నీ పాంచజన్యాన్ని పోలిన శంఖములు కావాలి."
"ఓహో.. అవునా! ఊ.. ఇంకా?"
"మహా శక్తివంతమైన శబ్దం చేసే పర వాద్యం కావాలి."
"అలాగే! శంఖములూ, పర వాద్యం .." రెండు వేళ్ళు ముడిచాడు.
"ఇంకా మాకు వ్రతం చేసేందుకు మంగళ మణి దీపికలు కావాలయ్యా!"
"ఓహో దీపాలు, మణిదీపాలూ.."
"నీ పేరు మరిమరి తలిచి, నీకు మంగళము పలికే పాటగాళ్ళు కావాలి."
"ఓహో.. ఊ..!"
"మేము వ్రతం చేపట్టిన వారమని ప్రజలకు తెలియాలంటే మాకో జెండా ఉండాలి కదా! ఒక గరుడ ధ్వజం కావాలి."
"హ్మ్.. ఐదు.."
"ఇంకొక్కటి.. బంగారపు జలతారు చందువా, పసిడి పళ్ళెరాలు కూడా కావాలి."
"సరే! వితానమూ.. పళ్ళెరాలూ..." లెక్క చెప్పాడాయన.
"అవును. ఈ వస్తువులన్నీ కావాలి."

అవధరింతువా అనుగ్రహింతువా!
ఆశ్రిత జన వత్సలా! నీవవధరింతువా?
మార్గశిర స్నానమునకు మా నోమునకు
మాకు వలయు వానిని మహేంద్రమణి ప్రభామూర్తి!

క్ష్మా మండల మదిరిపడగ శబ్దించేవీ,
పాలవన్నె నొప్పారెడు పాంచజన్యమట్టివీ,
శంఖములూ, ప్రబల బహుళ
పటాహములూ పరవాద్యములనుగ్రహింతువా!

మంగళ మణిదీపికల,
భృంగారపు చందువాల,
బంగారపు పళ్ళెరాల,
రంగురంగు ధ్వజపటాల,
పొంగుచు మంగళాశాస
నము పాడే గాయకుల
అవధరింతువా! అనుగ్రహింతువా!

ఓ వటపత్ర శాయీ! వరదాయీ! వరదాయీ!

గోపికల కోరికలను విని నవ్వాడు గోవిందుడు. నవ్వి ఇలా చెప్పాడు. "ప్రియభామినులూ! నిన్న వచ్చి ఒక వస్తువడిగారు. ఈ రోజు ఇంకొన్ని వస్తువులు చేర్చి అడుగుతున్నారు. మీకేం కావాలో పది సార్లు కాకుండా ఒకే సారి అన్నీ చెప్పాలి. ఈ రోజు అడిగినవి ఇచ్చి పంపేస్తే, రేపు ఇంకో అవసరమొస్తే పాపం ఇంత దూరమొచ్చి మళ్ళీ అడగాలంటే..  పూవులకంటే సుకుమారులు.. కందిపోతారు! కనుక మీకేమేం కావాలో అన్నీ ఆలోచించుకుని రేపు అడగండి."

"నిజమే! ఏమేం కావాలో ఆలోచించుకుని వస్తాం." అని ఇళ్ళకు బయలుదేరారు గొల్లెతలు. ఆలోచన చేసేందుకు మధ్యాహ్నం యమున ఒడ్డున సమావేశమవుదామని నిర్ణయించుకున్నారు.

యమున ఒడ్డుకి ఒక్కొక్కరే వచ్చిన గోపీబృందం, తాము వచ్చిన పని మరచిపోయి కబుర్లలో పడ్డారు. కృష్ణుని మరి మరీ తలుచుకు పెరిగిన తాపాన్ని తగ్గించుకునేందుకు వారికి స్నానం చెయ్యాలనిపించింది. చుట్టూ చూసారు. ప్రశాంత సైకత వేదికలను ముద్దాడే యమున కెరటాల హోరు తప్ప వేరే శబ్దమేమీ వినబడలేదు. ఒక్కొకరూ ఒక్కో వలువా విప్పి ఓ పొదరింట విడిచారు. నీట మునిగి జలకాలు ప్రారంభించారు. జల్లు పోరాటాలతో జలక్రీడలాడుతూ, కిలకిలా నవ్వుతూ, కేరింతలు కొడుతున్న ఆ లావణ్యరాశులను దూరం నుండే చూసాడు కృష్ణుడు! తన నేస్తాలను అడవిలో ఉండమని పలికి, నెమ్మదిగా తానొక్కడే పిల్లి వలే నక్కి నక్కి ఆ చీరలన్నీ ఓ వల్లెవాటులో మూట కట్టాడు. నెమ్మదిగా పక్కనే ఉన్న ఎత్తైన కడిమినెక్కి ఆ చీరలమూట ఓ కొమ్మపై పెట్టి కూర్చున్నాడు. వినోదంగా గోపభామినులను చూడనారంభించాడు.

జలకాలాడుతున్న ఆడు ఏనుగులవలే నీరంతా చిమ్మి, కేరింతలు కొడుతున్న వారిని చూస్తూ మోహన మురళి మ్రోగించసాగాడు. తమ నవ్వుల ధ్వనిలో కలిసి వినిపిస్తున్న మురళీరవళికి ఒక్క మాటు ఉలిక్కిపడ్డారందరూ! చుట్టూ చూసారు. సమ్మోహనంగా వినిపిస్తున్న ఆ సంగీతమెక్కడినుంచని వెతికారు. అల్లంత దూరాన కడిమి చెట్టెక్కి చిటారు కొమ్మన కూర్చున్న అల్లరి కన్నయ్య కనిపించాడు. సిగ్గుతో ఎర్రబడ్డ కలువల్లా ఉన్న వారి ముఖాలను చూస్తూ నవ్వు రువ్వాడు యదునందనుడు.

"ఓ.. కన్నయ్యా! ఇక్కడేం చేస్తున్నావ్? ఆడపిల్లలు స్నానం చేస్తూంటే రావచ్చునా?" కమలిని ఎలుగెత్తి అడిగింది.
"యమున మీ పెరటి కొలనేం కాదే! ఇటుగా వచ్చాను. మీరూ ఇక్కడే ఉన్నారు."
"సరే లే! వస్తే వచ్చావు కానీ, ఆ ముద్దుల మురళి మ్రోగించడం మాని వెళ్ళిపో!"
"భలే వారే! "ఊదుమా నీదు మురళి ఒక్క మారు బాలకృష్ణా!" అని కోకిలగానంతో బతిమాలినది నువ్వేకదూ!"
"తీయతేనియ బరువు మోయలేదీ బ్రతుకు, మ్రోగించకోయ్ మురళి మ్రోగించకోయ్ కృష్ణా!"
"మీ ఇష్టమేనా అన్నీ?" పెంకెగా పెదాలు బిగించాడు మోహనవంశీధరుడు.
తరుణులందరూ గుసగుసలాడుకున్నారు. దారేమిటని ఆలోచించారు. అర్ధించాలని నిశ్చయించుకుని పలుకసాగారు.

"కృష్ణా! కన్నయ్యా! నీ అల్లరి మాకూ ముద్దే! కానీ చలిలో బిగుసుకుపోతున్నాం. తాపం తీర్చుకునేందుకు యమునలో దిగి చాలా సేపు జలకాలాడామేమో! చలిగా ఉంది. నువ్వు అటు వెళ్తే మేము బయటకు వచ్చి చీరలు కట్టుకుంటాం" అభ్యర్ధనగా, మంచిగా పలికారు.
"పాపం! చలిగా ఉందా! సరే! ఏవీ.. ఈ బట్టలేనా కట్టుకుంటారు? ఈ మావిడి చిగురు వల్లెవాటు సురభిది, ఈ సంపెంగ రంగు పావడా కమలినిదేనా? ఈ నారింజ చీర ఎవరిదబ్బా? ఆ.. తరళది!" మురళితో చీరలను కదుపుతూ అల్లరిగా అడిగాడు.
"హమ్మయ్యో!!! చూసుకోనేలేదు. చీరలెత్తుకెళ్ళావా?! దొంగా! అల్లరి పిల్లాడా!! ఇదేమైనా బాగుందా? ఈ కృష్ణుడి ఆగడాలకు అంతు లేకుండా పోతోంది.  మీ అమ్మతో చెప్పామంటే చెప్పమూ మరి!" కోపంతో మరింత ఎర్రబారాయి వారి ముఖాలు.
"చెప్పండి చెప్పండి. తప్పక చెప్పండి. మీరు బయటకు వచ్చి ఈ చీరలు తీసుకుని సింగారించుకుని, చరచరా నడిచి నేరుగా మా అమ్మ దగ్గరికే వెళ్ళి చెప్పండి."
"చెప్పక ఊరుకుంటామనుకున్నావేమో! చెప్పి తీరుతాం." ఉక్రోషంతో ముక్కుపుటాలెగరేస్తూ బుసలు కొట్టారు గోపవనితలు.
"సరే సరే! రండి.. వచ్చి చీరలు తీసుకోండి."

క్షణాలు గడుస్తున్నాయి. గాలులు చల్లబడడం మొదలయ్యింది. గజగజా వణకసాగారు. ఇంక బతిమాలుకోక తప్పదని అర్ధమయింది గోపికలకి.
"కృష్ణా! కన్నయ్యా! మేము యశోదతో చెప్పనే చెప్పం కదా! మంచి వాడివి. బంగారు తండ్రివి! నీలాల రాశివి! మా చీరలివ్వవా? చలి..!! ఈ చలికి మేము బిగుసుకుపోతే నీదే పూచీ!"
"ఆహా.. నాదే పూచీ. మిమ్మల్ని చూస్తూంటే నాకే చలేస్తోంది. పాపం! త్వరగా బయటకు రండి. చేపపిల్లల్లా ఎంత సేఫు ఆ నీళ్ళలో!?" అమాయకంగా పిలిచాడు.
"ఎలా వస్తాం? నువ్వేమో అలా కన్నార్పకుండా చూసేస్తూ ఉంటే ఎలా?" సిగ్గుగా అడిగారు.
"ఈ ఎరుపు మీ లేత బుగ్గల సిగ్గుదా? సంజె వెలుగులదా? చీకటి పడుతుంది ఇంకో గడియలో! జాగు చేయక రండి భామలూ! నాకు బోలెడు పనులున్నాయి. మీ చీరలకు కావలి కాయడమేనా నా పని!?"
"ఎలా వస్తాం? నగ్నంగా ఉన్నామిక్కడ!" లజ్జతో తలలు వంచుకుని నెమ్మదిగా చెప్పారు.
"అయితే ఏం? వచ్చి తీసుకుంటే మీకే మంచిది. బాబోయ్! చలి చలి!" వణుకు అభినయిస్తూ నవ్వాడు.
"కన్నయ్యా! ఎలా రమ్మంటావు?"
"నడిచి రండి. నేనేమైనా పరాయి వాడినా?"
"అయ్యో! కాదు కాదు! కానీ.."
"కానీ...?"
"సిగ్గు..పట్టపగలు.."
"ఏం పరవాలేదు. బయటకు రండి. నాకు తెలియనిదేముంది? 'సర్వ వ్యాపీ, సర్వాత్మా!' అని పిలిచారుగా?"
"నిజమే కృష్ణా! కానీ.. నవయవ్వనంతో మిసమిసలాడుతూ, మోహాన్ని కలిగించే పురుషోత్తముడివి! మోహనాకారుడివి! నీ ఎదుటకు దిసెమొలతో రమ్మనడం భావ్యమా?"
"మీరూ చక్కని వారేగా! రండి! వచ్చి చీరలు తీసుకోండి."

పలుకలేక మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు. తప్పేదేముందని ఎట్టకేలకు వారందరూ ధైర్యం తెచ్చుకుని సిగ్గుని పక్కకు నెట్టి, జలమధ్యం నుంచి వెలువడి, కంకణ కాంతులతో మెరుస్తున్న కరకమలాలతో ఊరువుల మధ్యభాగాన్ని కప్పుకుని ముడుచుకున్న తామరమొగ్గలవలే చలిగాలికి వణుకుతూ, ప్రౌఢలగు కామినులను ముందు నిలబడమని, మిగిలిన వారు వారి వెనుక దాగి ఒడ్డుకు వచ్చారు. సిగ్గుతో ఎర్రనైన చెక్కిళ్ళతో, లలిత దరహాసాలను దాచలేక తలలు వంచుకుని నిలబడ్డారు.

"మంచి పిల్లలు!"
"ఆ చీరలిలా విసురు, కన్నా!" అతికష్టం మీద అడిగారు.
"నాకు చేతులెత్తి మొక్కితే ఇస్తాను."
కంపించిపోయారు గోపభామలు! బేలగా చూసారు కృష్ణుడి వైపు! వేడుకున్నారిలా..

మామా వలువలు ముట్టకు, మామా కొనిపోకు మన్నింపు తగన్
మామాన మేలకొనియెదు, మామానపహరణ మేల మానుము కృష్ణా!

"నువ్వింతటి వాడివి. మాకు దిక్కు నువ్వే!"అని  వట్టి మాటలేనా..? ఊ.. నమస్కరించండి!" గద్దించాడు.
అవనత శిరస్సులతో గుండెలకు అడ్డుపెట్టుకున్న చేతిని పైకెత్తి నమస్కారం చేసారు.
"ఒక్క చేత్తో నమస్కరించిన వాని చేతిని ఖండించమంది శాస్త్రం!"ఖణేల్మంది కృష్ణుని గొంతు.
రాబోతున్న కన్నీళ్ళను ఆపుకుని, కదలక మెదలక నిలబడ్డ వారిని చూసి, జాలి అంకురించిందాతని హృదయంలో!

"ముద్దు గుమ్మలూ! మీ మనసులనూ, మరియాదనూ కించపరచాలన్నది నా అభిమతము కానే కాదు. వ్రత నియమాలను ఉల్లంఘించి నగ్నంగా స్నానమాచరించుట తగునా? ఊరిప్రజల శ్రేయస్సు కోరి, నన్నే మనసులో నింపుకుని కఠోర నియమాలతో మీరు చేస్తున్న వ్రతానికి ముప్పు వాటిల్లబోతోందని తెలిసే ఈ పని చేసాను. మీరీ వ్రతం చక్కగా ఫలించాలని సంకల్పించుకుని చేతులెత్తి నాకు నమస్కారం చెయ్యండి. మీ వ్రతభంగం నాకు మాత్రమూ భరింపతగినదా? నాకు మాత్రం మీ సాన్నిధ్యం వద్దూ!" లాలనగా పలికాడు.
కృష్ణుని ప్రేమకు కరిగి నీరైనాయి గోపికల మనసులు. "తప్పు తెలుసుకుని, మన్నించమని, 'నేను' అనే అహం వదిలి" ఆ పురుషోత్తమునికి రెండు చేతులూ ఎత్తి, కంకణాలు గలగలమని సవ్వడి చేసేలా భక్తిగా, ప్రేమగా చేతులు ముకుళించి నమస్కారం చేసారు. మౌనంగా చీరలు అందుకుని ధరించి, కృష్ణుని మనోహర రూపాన్ని పెంపెక్కిన అనురాగంతో కనురెప్పపాటైనా లేకుండా చూడసాగారు.
"రతనాల కొమ్మలూ, మీ మనోగతాభిలాష ఎరుగని వాడిని కాను. నన్ను అర్చిస్తే మోక్షమే దక్కినప్పుడు మిగిలిన కోరికలదేముంది! కాత్యాయనీ వ్రతం సాంగోపాంగంగా సంపూర్తి చేసుకుని, అవశ్యం నా సాంగత్యాన్ని పొందగలరు." అని మధురంగా పలికి వారిని ఇళ్ళకు పంపివేసాడు గోపీవల్లభుడు.

మనసు నొప్పించినా, కపటకృత్యాలతో అల్లరి చేసినా, పరిహసించినా, ప్రాణప్రియుని చేతలు కామినులను కించపరుచవు కదా!


* రేపు ఏమవుతుందో! చూద్దాం!



(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Sunday, January 8, 2012

ఒక అమ కొమరుడవై, వేరొక అమ ఒడిలో దాగి! ~ కాత్యాయనీ వ్రతం - 25

ఒక లేమ అన్యమనస్కంగా చీరచెంగుని వేలితో ముడి వేస్తోంది. మరో ముదిత ముంగురులు మాటిమాటికీ సర్దుకుంటోంది. మరో లలన కింది పెదవి పదే పదే కొరుకుతూ, ఆలోచనలోంచి తేరుకోలేకపోతోంది. వేరొక చాన కృష్ణుని ఇంటి దారి పై నిలచిన చూపు మరల్చలేకపోతోంది. వేరొక అతివ తత్తరపాటుతో తన చీరకుచ్చిళ్ళు తానే తొక్కుకొని తూలబోయింది. ఇంకొక తరుణి కంపిస్తున్న చేతులతో పక్కనున్న భామిని చేతిని నలిపేస్తోంది. "కాత్యాయని" పూజకి స్నానించి సిధ్ధమైన గోపవనితలలో, ఏ ఒక్కరి మనసూ మనసులో లేదు. సైకత కాత్యాయని ప్రతిమను చూడగానే అమ్మని చూసిన పిల్లల్లా తమ మొర వినిపించారు. "కన్నయ్య ఎంత మాయ చేసాడో!" చెప్పుకు బాధపడ్డారు. "అతనికి అలవాటేగా!" అని కృష్ణుని మునుపటి చేష్ఠలు తలచుకున్నారు. పూజ పూర్తి చేసుకుని "నీదే భారమని" కాత్యాయనికి మరిమరి చెప్పి కృష్ణుని వద్దకు బయలుదేరారు.

"ఈ రోజు ఆ మాయవానికి లొంగిపోకూడదు. నిన్న కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీకేం కావాలని అడగలేదు. ఇవాళ మాత్రం మనకు కావలసినవి అడిగేద్దాం." ఒకరితో ఒకరు చెప్పుకుని దృఢ నిశ్చయంతో కృష్ణుని ముంగిలి చేరారు.

కృష్ణుడు నిన్న కూర్చున్న చోటే.. అదే పైడిగద్దెనెక్కి కూర్చుని ఉన్నాడు. గోపబాలలను చూసి పలకరింపుగా నవ్వాడు! జర్రున జారిపోతున్న మనసులను ఒడిసిపట్టి, పెదవులపైకి దూకేస్తున్న మందహాసాన్ని అదిమిపట్టి, ముఖరాజీవాలను అలంకరించబోతున్న సంతోషాన్ని మరుగుపరచి.. బింకంగా నల్లనయ్య ఎదురుగా నిలబడ్డారు.

"పూబంతులూ.. కుశలమేనా?" మరుని వింటినారి ఝుమ్మంది.
"ఊ.." అతిప్రయాసపై బదులుపలికారు. అతని సమ్మోహన శక్తి సామాన్యమైనదా?
"వేగుచుక్క తోడుగా చక్కని చుక్కలు మేలుకొలిపేందుకు వస్తే బాగుంది కానీ, చలి..!! ఇంత దూరం నడిచి వచ్చారే! అయ్యో!"
"హ్మ్.." బింకం సడలిపోతోంది. ఏ క్షణమైనా దాసోహమనేసేలా ఉంది వారి పరిస్థితి.
"సరే! ఇంతకీ ఏ పని మీద వచ్చారు?" అమాయకంగా ప్రశ్నిస్తున్న కృష్ణుడిని చూస్తే, ఉక్రోషం ముంచుకొచ్చింది గోప వనితలకి.
"నువ్వు రప్పించుకునే వాడివి! మేము రావాల్సిన వాళ్ళమూను!" నిష్ఠూరంగా అన్నామనుకున్నారు.
"ఓహో! అవునా! హ్మ్.. పనేమిటో చెప్పారు కాదు!" కొంటెనవ్వు కలనేసిన ప్రశ్న సంధించాడు. గుచ్చుకుంది.
"కృష్ణా! పరవాద్యమిస్తావని వచ్చాం. నిన్ను అర్ధించి తీసుకెళ్దామని వచ్చాం."
"అయ్యో! ఎంత మాట! అర్ధించడమా!! అయినా మీకు ఇచ్చేంతటి వాడినా! ఏదో.. మీ ఇళ్ళలో పాలూ, వెన్నా దొంగలించి పెరిగిన వాడిని!" అమ్మకి చెప్పిన చాడీలను మర్చిపోతాడా, వెన్నదొంగ! హన్నన్నా!!
"మీ అమ్మకి నీ మీద కొండెం చెప్పామనే కదా! అప్పుడు తెలియదులేవయ్యా.. నువ్వింతటివాడివని!" ఉక్రోషంతో లలనల ముఖాలు ఎర్రబారిపోయాయి.
"ఇప్పుడైనా ఎంతటి వాడిని కనుక! గోవులు కాచే గోపన్నని!!" అమాయకత్వం కన్నయ్యకి పెట్టని ఆభరణం మరి!
"నీ గురించి మాకు తెలియదనుకున్నావా?" ప్రశ్నించారు వెర్రి గొల్లెతలు.
"నా గురించా.. ఏం తెలుసేంటి?" కవ్వించాడు అల్లరి కృష్ణుడు.

"నీ పుట్టుపూర్వోత్తరాలు ఎరిగిన వాళ్ళం. మాకేం తెలియదనుకున్నావా? ఆయమ్మకు పదవ మాసం ప్రవేశించిన పిదప ఐదు గ్రహాలు ఉచ్ఛ స్థానాలలో ఉన్న తరుణంలో శ్రావణ బహుళాష్టమి నాడు రోహిణీ నక్షత్రమందు జన్మించావు. ఇసుమంతైనా ప్రసవవేదన కలగనీయక నల్లని ఉంగరాల వంటి చిన్ని చిన్ని ముంగురులతో, తేనెసోనల వంటి చిరునవ్వుల చిందులతో, శ్రావణమేఘపు వన్నెతో.. ఉదయభానుని వలే కన్నులపండువగా పుట్టిన నిన్ను చూసి ఆ తలిదండ్రులు ఎంత మురిసి ఉంటారో!"
"ఊ.." తన చిన్ననాటి కబుర్లు వినాలనే ఆసక్తికి లోకేశ్వరుడైనా అతీతుడు కాదేమో!

"కంసుని బారి నుండి నిన్ను కాపాడేందుకు ఓ తట్టలో పడుకోబెట్టి, తలకెత్తుకుని ఆ అర్ధరాత్రి యమున దాటాడు.. నిను కన్న తండ్రి! నువ్వు సామాన్యుడివే అయితే.. మింటిధారలు నిన్ను తడపకుండా శేషుడు గొడుగై వెంట నడిచేవాడా! మెత్తని ఇసుకదారి విడిచి యమున రెండుగా చీలిపోయేదా?"
"అవునా.. అప్పుడు!"

"ఈయమ్మ పొత్తిల్లో పడుకోబెట్టాడు. నవమాసాలూ మోసిన పున్నెం ఆమెదైతే, పాలిచ్చి.. నీ ఊసులు, తారంగాలు, బోర్లా పడి పారాడే చిన్నెలు, తప్పటడుగులూ, పరుగులు, అల్లరి పనులు, అలకలూ, కబుర్లూ, కథలూ.. కనులారా చూసి, సొంతం చేసుకోవడం.. ఈ తల్లి పుణ్యాల ఫలం!" తల్లుల పేర్లు చెప్పకుండా రహస్యం రహస్యంగానే ఉంచి లౌక్యంగా మాట్లాడామనుకుని గర్వపడ్డారా గొల్లపిల్లలు!

"నల్ల పిల్లాడినని వెక్కిరించారుగా!" ఎనిమిదేళ్ళ ముద్దుల బుజ్జాయి ఉక్రోషంగా బుంగమూతి పెట్టుకుని అడుగుతున్నట్టే కనిపించి ఫక్కున నవ్వేసారు గోపికలందరూ!
"నల్ల పిల్లాడివే! మట్టిలో పొర్లాడి, నోటి నిండా పాల చారికలతో, వెన్న పూసుకుని, కాటుక అలికేసుకుని.. అబ్బెబ్బే.. నీలాంటి పిల్లాడిని మేమెక్కడా చూడలేదమ్మా!" కన్నయ్యని ఉడికించారా భాగ్యశాలులు!
"పోన్లెండి.. అలాంటి వాడి వెంట ఎందుకు పడతారు మరీ? వెళ్ళండి.. మీరేమో అన్నుల మిన్నలూ.. నేను నల్లనివాడిని..!" 'నల్లనివాడు.. పద్మనయనమ్ముల వాడు.. నవ్వు రాజిల్లెడు మోము వాడు.. మౌళి పరిసర్పిత పింఛము వాడు..' అలుక నటించాడు. అలిగిన కృష్ణుని అందాన్ని చూసి మురిసారా ముద్దు గుమ్మలు.

"కృష్ణా! సౌందర్యముద్రామణీ! త్రైలోక్య రక్షామణీ! నీ దొరతనాన్ని పొగిడే మాటలు మాకెక్కడివీ! సిరి తనకు తానుగా వలచి పెండ్లాడిన సుందరుడివి! అనురాగపు గనివి! నిను హింసించిన అసురులను దహించే మంటవు! అర్థులకు అమృతాల పంటవు!! నీ కల్యాణ గుణగానం చేస్తూ.. మమ్మల్ని మేము మరచిపోతాం. నీ తీయని పేరు తలిస్తే చాలు.. విరహమైనా మమ్మల్ని బాధించదు! మా పెద్దవారు చెప్పిన వ్రతానికి అవసరమైన పరవాద్యం మాకు ఇచ్చి పంపు."

అర్థులము, అనుగులము!
అంజలింప వచ్చినాము
అడిగిన వరమిడుదువని
అనురాగపు గని వనీ!

ఒక అమ కొమరుడవై, వే 
రొక అమ ఒడిలో దాగి,
ఒదిగిన నిను హింసింపగ
ఊహించిన కంసునకు,
అసురునకు కడుపు మంటవు!
అర్థులకూ అమృతాల పంటవు!

సిరి కూడా వలచే నీ
దొరతనమూ, దోర్వీర్యము
పరవశమున పాడి, పాడి
విరహమెల్ల మరతుము!
పరవాద్యము కరుణింపుము
పరమానంద మొసంగుము!

నల్లనయ్య చల్లగా నవ్వాడు. "అపరంజి బొమ్మలూ! మీ శ్రమని గుర్తించని వాడిని కాను కానీ.. మీరడిగిన వస్తువు ఉందో లేదో, మంచీ చెడూ చూడాలి కదా! నాకు కొంచెం సమయం ఇవ్వండి. రేపు రండి."

చేసేదేముందని వెనుతిరిగిన గొల్లపడుచుల్లో కొందరికి కోపమొచ్చింది. "కృష్ణుని పొందాలని మనకే కానీ, అతనికి మనం అక్కర్లేదా?" అని దురుసుగా ప్రశ్నించారు. వారిని వారించి సమాధాన పరిచారు ఆనందిని, సురభి.
"అమ్మాయిలూ! అన్నీ తెలిసినవాడు కృష్ణుడు. నందుడే స్వయంగా "మీకు కృష్ణుడే సహాయపడగలడు." అని చెప్పి మరీ కాత్యాయనీ వ్రతానికి మద్దతు ఇచ్చాడు. నిర్విఘ్నంగా జరిగిపోతుంది. సంశయం వలదు." నమ్మకంగా చెప్పింది సురభి.
"ఏమోనమ్మా! మనం వెంట పడుతున్నాం. మనం విరహంలో వేగిపోతున్నామే కానీ.. కన్నయ్యకి కాస్తైనా దయ లేదే!" వాపోయింది ఓ కోమలి.
"అలా కలలో కూడా అనుకోకు చెలీ! మనకంటే మనని తన వద్దకు చేర్చుకోవాలని పరమాత్మకే ఎక్కువ చింత ఉంటుందట. రాముడూ సీత కోసం ఎంత పరితపించలేదు!" మౌనంగా అడుగులు వేస్తున్న నేస్తాలకు ఉత్సాహం తేవాలని రాముని కథ చెప్పనారంభించింది ఆనందిని.

"చూడామణిని హనుమ చేత ఉంచి "ఇది నా ప్రభువుకు చూపించు. వచ్చి నన్ను తీసుకెళ్ళమను. ఒక్క మాసం కంటే ఎక్కువ కాలం ఎదురుచూడలేనన్నానని చెప్పు. నెలదాటితే నీ సీత బతికి ఉండదని చెప్పు." అని సీతమ్మ చెప్పిందట.
"ఊ.." జాలిగా పలికాయి వారి గొంతులు.
"ఆ కబురు తెచ్చిన హనుమతో రామచంద్రుడేమన్నాడో తెలుసా!"

చిరంజీవతీ వైదేహీ యది మాసం ధరిష్యతీ
న జీవేయం క్షణమపి వినా తాం అసితేక్షణాం
నయా మామపి తం దేశం యత్ర దృష్టా మమ ప్రియా
న తిష్ఠేయం క్షణమపి వినా తాం అసితేక్షణాం

ఒక మాసం బతికేమాటుంటే వైదేహి ఎన్నాళ్ళైనా ఉండగలదు. నల్లని కన్నుల నా సీత లేనిదే క్షణమైనా జీవించలేను. అని బేలగా చెప్పాడట!"
"అవునా! అయ్యో!" జలజల రాలేందుకు నీటి ముత్యాలు సన్నిధ్ధమయ్యాయి.. వారి నల్ల నల్లని కన్నులలో..
"నా ప్రియభామిని ఉన్న దేశానికి నన్ను వెంటనే తీసుకెళ్ళు, హనుమా! క్షణమైనా ఆ అసితేక్షణకు దూరంగా ఉండలేను." అన్నాడట!
"మనసు వెన్న! కన్నయ్య కూడా అంతే! మనని అల్లరి పెట్టాలని కాదు. ఏదో కారణం లేకుండా రేపు రమ్మనడు!" హృదయాలను ఆర్ద్రం చేసిన రామకథను పదే పదే తలుచుకుంటూ ఇళ్ళకు చేరారు గోపకాంతలు.


* రేపు మళ్ళీ వెళ్దాం.. కన్నయ్య దగ్గరకు..!



(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Saturday, January 7, 2012

మరిమరి నీ మగటిమికీ మంగళమన వస్తిమి! ~ కాత్యాయనీ వ్రతం - 24

నీల మందిరపు తలుపు నెమ్మదిగా తెరచుకుంది. గోపికలు కోరినట్టే "గహ్వరము విడిచి బయటకు వచ్చే మృగరాజు వలే" నడుచుకుంటూ కృష్ణుడు వెలుపలకు వచ్చాడు. పరిమళ దీపాల వెలుగులో నల్లనయ్య మేనిరంగు వింత కాంతులు వెదజల్లుతోంది. రెప్ప వేయుట, ఊపిరి తీయుట మరచి చిత్తరువులై నిలబడిపోయారు గోపకాంతలు. వారిని దాటుకుని, వారి మాట ప్రకారం మణిఖచిత సింహాసనం పై పురుష సింహము ఆసీనుడయ్యాడు.

మునిజనానికి రాక్షస పీడ వదిలించేందుకు వెడలిన కోదండపాణిని, పసుపు గడపనానుకుని నిలబడి చూసిందట అరవిందలోచన 'సీతాకాంత'! ఆమె చూపులే హారాలై, హారతులై రాముని వెంట తోడున్నాయట! అలాగే ద్వారాన్ని ఆనుకుని నిలబడిన నీల, తన స్వామికి హారతి ఇచ్చింది.. తన చూపులతో, తన ప్రేమతో.. 'ఆద్వారమనువవ్రాజా మంగళాభిదక్షుసీ!'

గోపీజన మనోహరుడు ఆసీనుడయ్యాడు. చేష్టలుడిగి నిలబడిన గోపభామలను చూసాడు. చూపులతోనే కుశలమడిగాడు. ఆర్తిగా తనను తడుముతున్న వారి చూపులవానలో తడిసిపోయాడు. క్షణాలు గడుస్తున్నా ఉలకని పలకని గోపకాంతలను తానై పలకరించడం రాజోచితం కాదనుకున్నాడేమో! తనకు తానుగా వలచి వచ్చిన కాంత చులకన కదూ! విలాసంగా ఎడమ కాలు చాచుకున్నాడు. కుడికాలు పైకెత్తి ఎడమ కాలిపై వేసుకుని దర్పంగా కూర్చున్నాడు.

"సవ్యం పాదం ప్రసార్యా ఆశ్రిత దుహితహరం దక్షిణం కుంచయిత్వా.." అని పలికాయి ఆ గోపభామినుల లేపెదవులు. "అవును.. మీరు కోరినట్టే వచ్చానా..! మీరు కూర్చోమన్నట్టే కూర్చున్నానా..! ఇంకా..?" అన్నట్టు చూసాడు పుండరీకాక్షుడు. గోపికల చూపులు కృష్ణుని నీలాల కురులు సవరించి, కమలాల కనులు దాటి, పలువరుస వెన్నెలలు తాగి, సుందర బాహువులను తడిమి, విశాలంగా మగసిరి ఉట్టిపడుతున్న పీనవక్షస్థలంపై ఒక లిప్తకాలం తారట్లాడి, సన్నని దృఢమైన నడుము దాటి, పీతాంబరపు పసిమి గాంచి, అపరంజి కడియాలను ముద్దాడి, ఎరనెర్రని అరవిందాలవలే మెరుస్తున్న పాదాల వద్ద ఆగిపోయాయి. వాటి సౌందర్యం వర్ణించుట.. దేవాదిదేవతలు, మునిగణాలు, యోగిపుంగవులు, ధరణీపతులు, 'కవిత్వపటుత్వసంపదల్' కల్గిన కవిరాజులు.. ఎవరికి సాధ్యం? ఎవరి తరం? 'తన సౌందర్యగరిమ చూసి వలచి.. ఆ వెర్రి గొల్లలేమైపోతారో!' అని ఇసుమంతైనా జాలి లేని నిర్దయుడేమో కృష్ణస్వామి!

చూసారు.. తనివి తీరా చూద్దామనుకున్నారు.. తనివి తీరేదెప్పటికని!? ఉన్నట్టుండి ఆ అరుణిమ చూసి ఉలిక్కి పడ్డారు. 'కందిన ఆ పదరాజీవాలు ఎంత నొచ్చి ఉంటాయో!' అనే ఊహే అసిగాయమైంది వారి మనసుల్లో!

"కృష్ణా! గోపీజన నాథా! నీ చరణాంబుజముల వాలే షట్పదములు మా చూపులు! మా దృష్టే తగులుతోందయ్యా! చూడడమొక్కటేనా? ఎన్ని వెర్రి కోరికలు కోరాం నిన్ను! పొద్దైనా పొడవక ముందే నిద్రలేవమన్నాం. నీ కనుల ధావళ్యమే ఎరుగిన వాళ్ళం. ఈ కెంజాయ చూస్తే బాధగా ఉంది. నడిచి రమ్మన్నాం! మా మనవి విని వచ్చావు. చూడు.. నీ పాదాలు ఎంత కందిపోయాయో! అయ్యో! అయ్యో! ఏం చేయ్యడం!?"

"సురభీ.. వెన్నైనా లేదే!"
"కమలినీ.. పోనీ పువ్వులతో ఒత్తితే..!
"ఒద్దులే! మంచులో స్నానాలు చేసి ఉన్న కుసుమాలు బిరుసుగా ఉంటాయి. కన్నయ్యకి గుచ్చుకుంటాయి."

"ఎలా.. నీకు దిష్టి తగిలితే యశోద విలవిలలాడుతుంది! నందుడికి కోపమొస్తుంది! బలదేవుడికీ ఆగ్రహమొస్తుంది! నీల నొచ్చుకుంటుంది! ఎలా, కృష్ణా! నీకు దిష్టి తొలగించే మార్గమేమిటి?" ఇలా పలువిధాల మాట్లాడుకుంటున్న వారిని చూసి ఓ మందహాసం చిందించాడు కృష్ణుడు. ఆ నవ్వు చూసి ఇంకా మోహపరవశులైపోయారు వారందరూ!

"ఆనందినీ! కన్నయ్యకి తక్షణం దృష్టి దిగదుడవాలి. మార్గం చెప్పు!" ప్రశ్నించింది సురభి.
"నాకేం ఆలోచన రావట్లేదే! ఆ.. మంగళ హారతి పాడడమే!"
"అంతలేసి కళ్ళతో తేరిపార చూసేస్తున్నాం! వట్టి పాటలతో పోయే దిష్టా!"
"తప్పక పోతుంది. ఋజువులున్నాయి. విశ్వామిత్రుడు నిద్రపోతున్న రామచంద్రుని సౌందర్యానికి ముచ్చట పడి తన దృష్టే తగులుతుందేమో! అని మంగళవచనాలతో "కౌసల్యా సుప్రజా! రామా! లోకానికి మంగళమొనరించేవాడా! నీకు మంగళం!" అని పలికాడు."
"ఎంత రాచబిడ్డలకైనా అడవుల్లో ఉండే తాపసి అంతకన్నా ఎలా మంగళం పలుకుతాడు? ఉత్తుత్తి మాటలు కాదు ఆనందినీ! ఆలోచించు!" త్వరపెట్టారు అందరూ.
"చెలియలారా! నాకింకో విషయం గుర్తొచ్చింది."
"ఏమిటేమిటి?"
"తన గారాలపట్టి సీతను కన్యాదానం చేసేటపుడు జనక రాజర్షికీ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. సీతాభామిని కరపల్లవాన్ని రాముని చేతిలో పెడుతూ.. ఒక్క లిప్త ఆ వరద హస్తపు ఎర్రదనాన్ని, సౌందర్యాన్నీ చూసి వివశుడయ్యాడట జనకుడు. "అయ్యో! రామభద్రునికి దృష్టి తగులుతుందేమో!" అని "ఇయం సీతా మమ సుతా సహధర్మచారిణీ తవ, ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా!" అని చెప్పాడట.
"ఇందులో వింతేముంది! నా కూతుర్ని పెళ్ళి చేసుకోవయ్యా!" అన్నాడు. రామయ్యకి దిష్టి తగిలే ఉంటుంది, పాపం!"
"భద్రం తే! అన్నాడు చూడు. నీకు భద్రమగు గాక! నీకు మంగళమగు గాక! అన్నాడన్నమాట!"
"అవునా! జనకుడు కూడా అన్నాడంటే.. మంగళవాక్యాలు సరిపోతాయేమో!" అని సరిపెట్టుకుని గోపాలచూడామణి వైపు చూసారు. వింత చూస్తూ వినోదిస్తున్నాడాయన!

మంగళమని పాడవస్తిమి.
మరిమరి నీ మగటిమికి మంగళమని!
ముంగిట నిలబడిన మా కొ
సంగుదువని పరవాద్యము

అల్లనాడు లోకమ్ముల
అలవోకగ కొలిచిన నీ
పల్లవారుణ శ్రీపద
పద్మమ్ములకు మంగళమని

పెల్లుగ నీవెత్తి వెడలి
సుందర లంకాద్వీపము
తల్లడబడ మాపిన నీ
దర్పమునకు మంగళం

కాలదన్ని ఒక త్రుటిలో
కరకు శకట దైత్యుని
నేలరాలు నటు జేసిన
నీ కీర్తికి మంగళమని

కూళను వత్సాసురు నవ
లీలగ చిరుకోల వలె
తూలవిసురు దుడుకు అడుగు
దోయికినీ మంగళం

దండిగ గోకులమునకై
దయదాలిచి గొడుగువోలె
కొండనెత్తి వేసిన నీ
గుణమునకూ మంగళమని

భండమున నొక వ్రేటున
పగతుర పీచమ్మడంచి
చెండాడిన నీ చేతి ప్ర
చండాసికి మంగళం

"కృష్ణా! మేము వచ్చినదైతే.. నువ్వు పరవాద్యమిస్తావనే! కానీ ఈ భువనమోహన రూపాన్ని చూసాక మాకు వేరే మాట రావడం లేదు. నిన్ను చూడాలని, చూస్తూనే ఉండిపోవాలనీ ఉంది. నరుని దృష్టి అతి శక్తివంతమైనదంటారు. నీ సద్గుణాలకూ, సౌందర్యానికీ మంగళహారతి ఈయనిదే మా మనసు ఊరుకోదు.

కృష్ణా! త్రివిక్రమా! మూడు అడుగులతో ముజ్జగాలనూ కొలిచావట! నీ పాద రజ మహిమ వల్లే భూమి రత్నగర్భ అయింది. పంటలు పండుతున్నాయి. పశు సంపద వృధ్ధి చెందుతోంది. ఆకాశం వర్షాన్ని కురుస్తోంది. బ్రహ్మ కడిగిన పాదానికి మంగళం! బ్రహ్మము తానైన పదపంకజానికి మంగళమగు గాక!

కొండకోనలు దాటి సీతమ్మ కోసం ఎంత కష్టపడ్డావో!సుందర లంకను ఏలే రావణుని, నేలకూల్చిన నీ శౌర్యానికి మంగళం!

కృష్ణా! నల్లనయ్యా! బంగారు తండ్రీ! బండి రిక్కలో పుట్టావని బండిని ముక్కలు చెయ్యాలా చెప్పు!? నెలల పసికందువి! బండిని తన్నావు! శకటాసురుని ముక్కలు ముక్కలు చేసావు!   నీ మువ్వల పాదమెంత నొచ్చి ఉంటుందో! ఆ అందమైన పాదాలకు మంగళం!

అంతే కాదు! ఆవుదూడ రూపంలో వచ్చిన వత్సాసురుని చిన్నకట్టెని విసిరినట్టు గిరగిర తిప్పి విసిరావు. ఆ విసిరినప్పుడు భూమిపై నీ పాదాలు ఎంత నొక్కిపెట్టి, చేతులతో బలంగా విసిరి ఉంటావు! నీ పాదాలూ, చేతులూ ఎంత నొచ్చి ఉంటాయో! ఎంత దుడుకు వాడివి! నీ దుందుడుకు అడుగులకు కనుదిష్టి తగలకుండు గాక!

గోవర్ధన గిరిని సునాయాసంగా ఎత్తి చిటికెన వేలిపై నిలిపావు. మా కోసమే! మా గోకులాన్ని రక్షించడం కోసమే!! అలా ఒకటా రెండా..! ఏడు రోజులు విలాసంగా కాలు అటుదిటు చేసి మరీ నిలబడ్డావే! ఎంత నొప్పి కలిగి ఉంటుంది నీకు! వ్యత్యస్థ పాదారవిందుడవైన గోవర్ధన గిరిధారీ! నీకు మంగళం!

శార్జ్ఞపాణీ! వైరి వర్గానికి నీ శార్జ్ఞమంటే సింహస్వప్నం! నీ చేతి కత్తి కలలోకి వచ్చినా నీ శత్రువులందరూ బెదిరిపోతారు! అలాంటి ప్రచండాసి చేత దాల్చిన నీకు మంగళం! శుభ మంగళం!"

తనను చూపులతో అభిషేకించి, పలుకులతో, పాటలతో మంగళారతి పలికి, "ఇంకా అక్కడే నిలిస్తే మళ్ళీ కన్నయ్యని చూసేస్తామేమో!" అని వెనుతిరిగి వెళ్ళిపోతున్న ఆ అమాయక గొల్లపడతులను చూస్తూ మోహనకృష్ణుడు నవ్వుకున్నాడు. అతని అల్లరికి అంతేముంది!



* వెర్రి గొల్లెతలు రేపేం చేస్తారో! చూద్దాం!



(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Friday, January 6, 2012

సింహము వలె నడచిరా! ~ కాత్యాయనీ వ్రతం - 23

యమున ఒడ్డున కాత్యాయనికి పూజ చేసి, హారతులిచ్చి, కృష్ణుని మేలుకొలిపేందుకు బయలుదేరిన గోపకాంతలు విచ్చిన పువ్వుల్లా కళకళలాడుతున్నారు. శుకపికాలకే ముచ్చట గొలిపేలా, కిలకిలా నవ్వుతూ ఆడుతూ పాడుతూ కోలాహలంగా వెళ్తున్నారు.

"సురభీ! ఎంత హాయిగా ఉందో ఈవేళ! నీకూ అంతేనా?" అడిగింది కమలిని.
"ఓ..!"
"ఈ రోజు కృష్ణుడు మేలుకొంటాడేమో! బయటకు వచ్చేస్తాడేమో! శుభ సూచనలు కనపడుతున్నాయి." నవ్వింది కమలిని.
"అప్పుడేనా! ఈ విరహాగ్ని ఎంత హాయిగా ఉందో! ఈ ఎదురుచూపులే ఎంత బాగున్నాయో కదా!" అంది సురభి.
"అయ్యో! అలా అంటావేం చెలీ!" వారించింది తరళ.
"ఏమో! నాకు అలాగే అనిపిస్తోంది." అడిగింది సురభి.

"నీదే భారం, నేను నీవాడిని" అన్న విభీషణుడికే కాస్త ఎదురుచూపు తప్పలేదు. అయితే తనని కాపాడే భారం రాముడి భుజాలపైకి నెట్టేసాక అతనికి చింత ఏల? మనమూ అంతే."ఆనందిని నవ్వింది.
"విభీషణుడు పిలవగానే వినలేదా రాముడు?" సందేహం వ్యక్తపరిచింది కమలిని.
"హ్మ్.. ప్రతీ పనికీ ఒక పధ్ధతి ఉంటుంది కదా! వారధి నిర్మించి వారాశి దాటి లంకను చేరిన రాముని శరణు కోరాలని వచ్చాడు విభీషణుడు. "రాఘవుని శరణు కోరి వచ్చాననీ, తన వారందరినీ విడిచి వచ్చాననీ" చెప్పాడు."
"ఊ.. "
"శత్రువు తమ్ముడు మనకు మిత్రుడెలా అవుతాడని" రాముడిని లక్ష్మణుడు, సుగ్రీవుడు తదితరులు అడ్డుకున్నారు. వారికి నచ్చచెప్పాడు రాఘవుడు. "అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ!" అని దృఢంగా చెప్పాడు. ఆపై విభీషణుని తనవాడిని చేసుకున్నాడు. అదే పురుషోత్తముని సౌలభ్యం!"
"మరి మనమో!"
"మనమూ పధ్ధతి పాటించాము. ఆచార్యుని వంటి నందగోపుని ఆశ్రయించాం. మంత్రం వంటి యశోదని ఉపాసించాం. భాగవతుడైన బలరాముని సహకారం తీసుకున్నాం. ఆ పై పురుషకార భూతురాలైన దేవేరి "నీల"ను ప్రసన్నురాలిని చేసుకున్నాం. ఇక మిగిలినది మన పని కాదు.. ఆయనదే!"
"ఇంత చేసామా! ఆశ్చర్యంగా లేదూ!"
"తప్పు! మనం చెయ్యలేదు. మనకు పరోక్షంగా దిశానిర్దేశం చేసినది కృష్ణుడే! లేకపోతే మనకిన్ని తెలివితేటలెక్కడివీ!"
"అవును, ఆనందినీ! అయితే ఈ రోజు కృష్ణుని చూడగలమా!" ఆశగా, సంబరంగా అడిగింది కమలిని.
"ఊ.. ఇకనో, ఇప్పుడో!" ఊరించింది ఆనందిని నవ్వుతూ!
"అవునా! నాకు ఆనందంతో ఊపిరాడడం లేదు." ఉరకలు వేస్తున్న సంబరం అందరి ముఖాలలో.

"కృష్ణుడిని సింహగతితో నడిచి రమ్మని కోరుదాం." చెప్పింది ఆనందిని.
"సింహగతా? ఏమిటది?"
"వానకారులో వేట మాని గుహలో నిద్దురపోతున్న మృగరాజు ఎలా నిద్ర లేస్తాడో, అలా లేచి రమ్మందాం. అదిగో వచ్చేసాం. పదండి.." మందిరపు మునివాకిట నిలిచారందరూ.

"కృష్ణా! నువ్వు రావణుడనే గంధగజం పాలిటి రాఘవ సింహానివి. ప్రహ్లాదుని కాచిన నృహరివి! వర్షాకాలంలో కొండగుహలో నిదురిస్తున్న సింహం వలె యోగ నిద్రలో ఉన్నావు. సృష్టి చింతనలో ఉన్నావేమో! మా మొరాలించి ఇకనో, ఇప్పుడో నిద్రలేచి వస్తావు. మాకు అది తెలుసు. తెలివి రాగానే టక్కున పైకి లేచి, చరచరా నడిచి, తటాలున తలుపుతెరచి వచ్చేస్తావేమో! నువ్వలా రావద్దు. మాదొక కోరిక తీర్చాలి నువ్వు. నీ రాకలో సౌందర్యాన్ని తేరిపారా చూసి మా కనులు ధన్యమవ్వాలి." చెప్పింది ఆనందిని.
"ఎలా రమ్మంటావు కన్నయ్యని? అదీ చెప్పు సఖీ!" ప్రశ్నించారు మిగిలిన వారు కుతూహలంగా.

"కృష్ణా! సింహసంహననుడివి! నీ సర్వాంగ సౌందర్యాన్ని మేము ఆస్వాదించాలంటే, నువ్వు గబగబా నడిచి వచ్చేస్తే కుదరదు. ఇన్ని రోజుల మా ఎదురుచూపులు పండేలా, మా ఎడదలు నిండేలా నడిచి రా! "అయ్యో వెర్రి గొల్లెతలు, ఎదురుచూస్తున్నారే!" అని తొందరపడి అశ్వగతిలోనో, ఏ వృషభ గతిలోనో.. లేదా మరీ నిదానంగా గజగమనంలోనో రాకు. నువ్వు సింహగతిలో రావాలి. సింహంలా నడిచి రమ్మన్నాం కదా! అని లేచి వచ్చేస్తావేమో! విను.. నువ్వెలా నిద్రలేవాలో చెప్తాం. అలాగే మేలుకొని రావాలి. తెలిసిందా!

ఒకే చోట ఉన్న ప్రేమికులకు వర్ష ఋతువు ఎంత ఆహ్లాదకరమైనదో, విరహతాపంలో ఉన్నవారికి అంత దుస్సహం! 'వర్షాకాలం యుధ్ధానికి అనుకూలం కాదన్న' సుగ్రీవుని మాట విని, మాల్యవత్పర్వతంపై కొండ గుహలో విడిది చేసి ఉన్న సమయంలో.. సాక్షాత్తూ రామచంద్రుడే విరహి అయి, సీతావియోగాన్ని తాళలేక లక్ష్మణునితో చెప్పుకుని బాధపడ్డాడట!  విరహోత్కంఠితలమై ఉన్నాము. ఎదురుచూపులనే వానకారు గడిచిందనే అనుకుంటున్నాం. మా విరహం తుదికొచ్చేసిందని మాకు తెలుస్తోంది. నీ దర్శనమింక ఈయక నీకూ తప్పదు, కన్నా!

గుహలో సింహంలా.. నిద్రలే! నీ ఎర్రని కన్నులను నెమ్మదిగా అరవిచ్చి చూడు. సింహం బధ్ధకంతో పొర్లినట్టు నీ సుఖశయ్యపై అటూ ఇటూ పొర్లు! పైకి నెమ్మదిగా లే! మృగేంద్రుడు జూలు విదిల్చినట్టు నీ నీలాల కురులు విదల్చు. ఎందుకో తెలుసా! నీ చుట్టూ రకరకాల పరిమళాలున్నాయి. నీల మందిరంలో అగరుధూపం, చందన సుగంధం, అత్తరు, పన్నీటి వాసనలూ.. ఇవన్నీ కాక 'అరవింద గంధి' నీల ఒంటి సువాసన నిన్ను పట్టి ఉంటుంది. మాకవేవీ అక్కర్లేదు. నీ కురుల సహజ పరిమళం ఆఘ్రాణించాలి. "సర్వగంధః సర్వరసః" అని నిన్ను పొగుడుతారే! అన్ని తావులూ నీలో నింపుకున్న వాడివి. నీ పరిమళం మాకు కావాలి. కురులు విదల్చు! ఆ పరిమళం తావిమోపరి మా దాకా మోసుకొస్తాడు. మేము మా గుండెల నిండా ఆ పరిమళం పీల్చుకుని మైమరచిపోవాలి.

అంతేనా!  సింహం గుహలోనుండి బయటకు వచ్చినట్టు.. గంభీరంగా, అందంగా, హుందాగా నడిచిరా! మా కనురెప్పలు వెయ్యకుండా నీ నడక చూడాలి. శౌర్యాన్ని నింపుకున్న నీ కదలికలు చూడాలి. మగసిరి ఉట్టిపడే నీ ఆకృతిని చూడాలి. అలా బయటకు వచ్చి నిలబడిన నీ 'అవిసె పువ్వు'లాంటి మేనిఛాయ చూసి మురిసిపోతాం. ఎంత అందమైన వర్ణం నీది!! కాఠిన్యం ఇంచుకైనా లేని సుతిమెత్తని అతసీపుష్పాన్ని పోలిన నీ మేని కాంతులను చూడాలి. "అతసీ పుష్పసంకాశం హారనూపుర శోభితం రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుం!"  కృష్ణా! యదుమోహనా! నీ మెడలో హారాలు, నీ చేతుల రత్నకంకణాల శింజితాలు మేము వినాలి. అలా వచ్చి అదిగో అక్కడ నీకో "మేటి రతనాలు పొదిగిన కనక రుచిర సింహాసనం" ఉంది. దానిపై కూర్చో! అది ధర్మపీఠం. అక్కడ కూర్చుని మా కోరికలు వింటే నువ్వు కాదనవు. మేమొచ్చిన పని పూర్తవుతుంది. కృష్ణా! విన్నావా! అలా మేలుకో! అలా నడిచి రా!"

తరలి రాగదే, దేవ! దయచేయగదే!
దరిసింపగవచ్చిన మా పని విని పాలింతుగాని! తరలి రాగదే!

వానకారులోన సింహమొకడు మేల్కాంచి, పొడవు
మేను సారించి, ధూళి తూలించి, కెంపు కనుల
మానుగ వీక్షించి, పరీమళభర సటలుగ, గహ్వ
రాన వెలువడు చందాన మందిరమునుండి, తరలి రాగదే!

భాసుర బహురత్న ఘటిత భర్మ సిం హ పీఠికా
ధ్యాసివై, అనుగ్రహోల్లాసివైన స్వామీ! అత
సీసుమ కోమల శ్యామమోహను, లోకావను, నిను
చూసి చూసి, మనసు వెళ్ళబోసి, కృతార్థులము కాగ - తరలిరాగదే!

"కృష్ణా! వింటున్నావు కదా! ఇవన్నీ మనసులో పెట్టుకో. రేపటి తెలవారు ఝామున వస్తాం! మా కోరిక తీరేలా దర్శనమివ్వు!" అని మళ్ళీ మళ్ళీ చెప్పి మరీ వెనుతిరిగారు గోపకాంతలు. ఇంకా శయనించే ఉన్న మాధవుని పెదవులపై లేనగవొకటి మెరిసింది.


*ఎందుకో మరి! రేఫు చూద్దాం!


(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Thursday, January 5, 2012

ఒక్క కనుకొస చూపే చాలును.. చాలును! ~ కాత్యాయనీ వ్రతం - 22

రాయంచ నడకలతో నీల మందిరాన్ని చేరుకున్నారు గోపికలు. వారి ముఖాలు దీపకళికల్లా మెరుస్తున్నాయి. చూపులు నిబ్బరంగా ఉన్నాయి. కృష్ణుని శయన మందిరం వెలుపల నిలిచి కలకోకిలలు బృందగానం చేసినట్టు పలుకుతున్నారు.

"కృష్ణా! గోపాల చూడామణీ! ఈ పొద్దు లోకమెంతో అందంగా కనిపిస్తోంది. వద్దన్నా ఆగని చిరునవ్వు మా పెదవులపై చిందులేస్తోంది. ఇంత ప్రశాంతత ఇంతకు మునుపు మేమెరుగము. "పురుషుడే తన వద్దకు రావాలి" అని తలచుట స్త్రీస్వభావం. లోకతీరు. కానీ, మాకెందుకో అలా అనిపించడం లేదు. స్త్రీ సహజమైన బింకం వదిలి నీ వాకిట నిలచాం. నువ్వు పురుషోత్తమునివి. నిన్ను చేరేందుకు తపన పడని ప్రాణి ఏది?

మహా పరాక్రమవంతులు, అపరిమిత ఐశ్వర్యవంతులూ, లెక్కకు మిక్కిలి గజ తురగ పదాతి దళాలున్న మహరాజులూ సైతం నీ ఆధిపత్యం ముందు ఓడి తీరవలసినదే! నీ సింహాసనం ముందు తలవంచి నిలబడవలసిందే! వారి కిరీటాలలో ఉండే రతనాల వెలుగులో మెరిసే నీ పదకమలాల సౌందర్యానికి దాసులం! "నీవే తప్ప ఇతఃపరంబెరుగమని" మేమూ ఆ రాజులందరి వలే నీ పాదాల వద్దకు వచ్చి నిలచాం. నువ్వు తప్ప వేరే దిక్కు లేదని తలచి నీ ముంగిట నిలచాం. నిదుర లే! మేలుకుని బయటకురా!

కృష్ణా! అనంగుని అయ్యవు నువ్వు! నవమోహనాకారుడవు! నిన్నేమని వర్ణిస్తే మాకు తృప్తి కలుగుతుంది? పోలికకు అందే అందమా నీది! మాలో ఎన్నో అందమైన ఊహలు మెదలుతున్నాయి. నీ నయన సౌందర్యం చూడాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. నీ కనులు ఎంత అందమైనవో తెలుసా, కృష్ణా! వేకువ ఝామున కొలనులో విచ్చుకోడానికి సిధ్ధమవుతున్న తమ్మిపూవులను చూస్తే మాకు నీ కనులే గుర్తొచ్చాయి. ఎంత లలిత లలితంగా వికసిస్తున్నాయో! మంచు బిందువుల తాకిడికి ఒక్కో రేకూ సుకుమారంగా విచ్చుకుంటూ "ఇంకా తెల్లవారలేదే!" అని సంశయిస్తూ, మువ్వ విచ్చుకున్నట్టు విరియబోతున్న ఆ తామరల సౌందర్యం చెప్పనలవి కాదు! మా పిలుపు విని, నువ్వు నీ రాజీవలోచనాలను నెమ్మదిగా విప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే, నిదుర జాడలు వీడని నీ కళ్ళు కెంజాయ అలదుకొని అలాగే ఉంటాయేమో అనిపించింది. నీ కనుల చక్కదనాన్ని తలచుకుంటే చాలు.. మా మేను పులకాంకితమవుతోంది.

పుండరీకాక్షా! నీ కనులను పోల్చేందుకు పోలిక ఈ సృష్టిలోనే దొరకదు మాకు! నీ కనుల వంటివి నీ కనులే!! కానీ, మా వెర్రి కాంక్ష కొద్దీ పొగుడుతాం, పోలుస్తాం, కలువల్లో నీ కనుల పోలిక వెతుక్కుంటాం. ఎరనెర్రని తామరలతో పోల్చామని నీ చూపులు ఎర్రనివి కాదు సుమా! వెన్నెల కంటే చల్లగా ఉంటాయి. హాయి డోలలూపుతాయి. అరులకు ప్రచండ భానుడివి. సఖులకు సోముడివి. నీ వెన్నెల చూపుల తానాలాడాలి. మా తాపం తీరిపోవాలి. మేలుకో కృష్ణా! మమ్మల్ని చూడు..

ఏదీ! ఏదీ! నీ దయా వీక్షణము!
ఇంచుంచుక పరపుము మాపై మాపై

చిరుగజ్జెలవలె విరిసే ఎరనెర్రని తామరల
తెరగున వికసించే ఆ కెంజాయ కందోయి

అందమగు ఈ లోకమందలి ఏలికలు
అందరును మానాభిమానములు వీడి
సుందరము నీ గద్దెక్రింద బృందములైన
చందమున, నిలుచు మా డెందములు చల్లబడ!

ఒక్క కనుకొస చూపే చాలును చాలును-
పాపముల పరిమార్పను!
ఒక్క కనుకొన ప్రాపే చాలును చాలును
తాపముల చల్లార్పను

ఏదీ ఏదీ! నీ దయా వీక్షణము
ఇంచుంచుక పరపుము మాపై, మాపై!

కృష్ణా! కృపాజలనిధీ! నీ దయ అపారం. ఆ దయతో ఒక్క సారి మమ్మల్ని చూడు చాలు! ఒక్క కనుకొస చూపు చాలు. మా జన్మ జన్మల పాపాలు మాయమైపోతాయి. శబరి నీ చూపు సోకి పునీత అయింది. అహల్య నీ పాదస్పర్శతో శాపాన్ని పోగొట్టుకుంది. నిన్ను శరణు కోరిన విభిషణుడు శత్రువర్గం వాడయినా కాచావు. కాకాసురుడో! కలికి సీతను గాయపరచాడని కోపంతో బాణమే వేసావనుకో! ముల్లోకాల్లో వాడికి దిక్కేదీ? తిరిగి తిరిగి అలసి సొలసీ నీ చరణమే శరణన్నాడు. వాడినే చంపకుండా, కన్ను మాత్రం పొడిచి శిక్షించి వదిలి పెట్టావు. మాపై ఇంకాదయ రాలేదా! మేలుకోవా?"

ఎంత పిలిచినా పలకని కృష్ణుడిపై వారికి కోపం రాలేదు. తమకి ఇంకా ఈ ఎడబాటు ఎందుకు రాసి ఉందో అనుకున్నారు. 'ఇంకా ఏ కర్మ ఫలం మిగిలి కృష్ణుడికి దూరంగా నిలబడేలా చేసిందో!' అనుకున్నారు. "మనమేం చెయ్యగలం! అతనిదే బాధ్యత.. కన్నయ్యే దిక్క"ని అనుకుని వెనక్కి మరలబోతూ ఆగారు. ఇంకొక్క మాట చెప్పి వస్తానని సురభి తలుపు వద్దకు వెళ్ళి చెప్పింది.

"కృష్ణా! నువ్వే వస్తావని ఎదురు చూసాం. ఎందుకు రాడని అలిగాం. పిలిస్తే పలకడేమని నిందలు వేసాం. అవన్నీ కాదు. మా అహంకారాన్నీ, అభిమానాన్నీ విడిచి వచ్చాం. దురభిమానంతో తప్పించుకు తిరుగుతున్న మా పై నీ ప్రేమ అనే మత్తుమందు చల్లావు. నీకు బానిసలను చేసుకున్నావు. అన్ని మెట్లూ ఎక్కివచ్చాం. ఇంక నువ్వే దిక్కు. రేఫు వస్తాం. నిద్ర లేపుతాం."

మంత్ర ముగ్ధల్లా, యోగినుల్లా వెనుతిరిగిన ఆ గోపకాంతలు రేపటి కోసం ఎదురుచూస్తున్నారు.

*మనమూ ఎదురుచూద్దాం!


(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Wednesday, January 4, 2012

నందుని గారాల నందనా! మేలుకో! ~ కాత్యాయనీ వ్రతం - 21

నీలి ముంగురులు గాలికి చెదిరి, వారి ముఖబింబాలకు వింత సోయగాలను అద్దుతున్నాయి. కెమ్మోవులపై చిరునవ్వులు చిందులు వేస్తున్నాయి.  పైట చెంగులు గాలికి రెపరెపలాడుతూండగా గోపకాంతలు పరుగుపరుగున నీల మందిరాన్ని చేరారు. నీల చిరునవ్వుతో ఆహ్వానించింది. స్వామి ఇంకా నిద్దురపోతున్నారన్నట్టు సైగ చేసింది.

"నీలా! నువ్వు మాతో ఉన్నావు కనుక మాకింక భయమేమీ లేదు. కృష్ణుని ఇట్టే నిద్ర లేపుతామని" ధీమాగా పలికారు గోపికలు.
"సరే! వర్షాకాలంలో గుహలో నిద్దురపోతున్న సింహం వలే నిద్రపోతున్న స్వామిని, యోగనిద్ర నుండి నిద్ర లేఫడం బ్రహ్మాదులకే ఒకంతట సాధ్యమైన కార్యం కాదు. అలాంటిది మనం పూనుకున్నాం. ప్రయత్నిద్దాం!" అని చిరునవ్వుతో బదులిచ్చింది నీల. ఆ మాటలకు ఒక్క సారి పాలపొంగు పై నీళ్ళు చిలకరించినట్టు గోపతరుణుల ఉత్సాహం తగ్గింది.
"నిజమే కదూ! 'కృష్ణుడు మాతో కలిసి ఆడాడు, పాడాడు' అనే గర్వంతో అతని సామాన్యుడని తలచి, ఇంకా నిద్దురలేవడం లేదేమని వాపోతున్నాం! మహర్షులకు, యోగసాధకులకు, ఇంద్రాది దేవతలకు చేతకాని పని మా వల్ల అయ్యేనా? వేదవేద్యుడు! అతని కొంగున కట్టుకోవాలని సంకల్పించి నోము నోచుకున్నాం. ఇది జరిగే పనేనా!?" ఇలా సందేహాలతో వారి మనసులు కలవరపడసాగాయి. నీల నవ్వుకుంది.

"చెలియలూ! మీకు స్వామి చిన్ననాటి ఊసులన్నీ తెలుసు. బ్రహ్మగర్వాన్ని భంగపరచిన వృత్తాంతం తెలుసునా?" అని ప్రశ్నించింది.
"లేదు లేద"న్నారు గోపికలు.
"సరే! ఆలకించండని" ఓ ఊయలలో తను కూర్చుని ఎదురుగా ఉన్న తిన్నెలను చూపించింది. కోకిల కంఠంతో నీల చెప్తున్న కథను వినసాగారు గోపబాలలందరూ!

"కొండచిలువ రూపంలో వచ్చి ఆలమందలను, గోపబాలురనూ మింగిన అఘాసురుని నోటిలో కృష్ణుడు ప్రవేశించి, క్షణక్షణానికీ పెరుగుతూ ఆ కొండచిలువ నోటిని చీల్చిన విషయం మీకెరుకే కదా!"
"ఊ.. తెలుసు! తెలుసు!"
"ఆ తరువాత.. ఒకనాడు గోవులను మేఫుతూ చెలికాండ్రతో ఆటలాడుతున్న గోపకిశోరుడిని చూసి, చతుర్ముఖ బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. "ఇంత సామాన్యంగా కనిపిస్తున్న ఈ నల్లపిల్లాడు.. భయంకరమైన కొండచిలువ నోట చిక్కిన తన నేస్తాలనూ, ఆలమందలనూ ఎలా విడిపించుకు పోయాడు? నెత్తిన నెమలిపింఛమూ, మెడలో ముత్యాల పేర్లూ వేసుకుని, కొండ గోగుపూల మాలలు, తులసి దండలూ చుట్టుకుని, ధూళి ధూసరితమైన ఒంటితో, ఒక చేత్తో పిల్లనగ్రోవిని ధరించి, మరో చేత్తో చల్దిముద్ద పట్టుకుని పరుగులు పెడుతున్న ఈ గొల్లపిల్లాడు అంత శక్తిశాలా? సరే! పరీక్షిద్దా"మనుకున్నాడు. కన్నయ్య నీరు త్రాగడానికి ఓ కొండవాగువద్దకు వెళ్ళిన సమయంలో ఆలమందలనూ, గొల్లపిల్లలనూ దొంగిలించి తన మాయతో ఓ కొండగుహలో బంధించివేసాడు."
"అవునా!!"
"ఊ.. అవును! వెనక్కి వచ్చిన కృష్ణునికి తన వారెవ్వరూ కనిపించలేదు. గోవులూ కనిపించలేదు. నవ్వుకున్నాడు కన్నయ్య. తానే గోవులయ్యాడు. తానే తన తోటి గోపబాలురయ్యాడు. అన్ని రూపాలూ తానే ధరించాడు. ఇంటికి వెళ్ళాడు. గోవులు క్షీరధారలు కురియనారంభించాయి. పెయ్యలు తాగినవి తాగగా,  పిదుకనవసరం లేకుండా పెట్టిన కడవ పెట్టినట్టు నిండిపోసాగింది! ఏ పిల్లాడిని హత్తుకున్నా వారివారి తల్లులకు పట్టలేని ఆనందం కలిగేది. అక్కడున్నది సాక్షాత్తూ కృష్ణుడేనాయె! రేపల్లెలో మునుపు లేని ఆనందమేదో ఆవరించింది. పిల్లలందరూ మునుపటివలే మామూలుగా ఉండసాగారు. ప్రతి ఉదయం కృష్ణునితో కలిసి ఆలమందలను అడవిలోకి తీసుకుపోయి మేపి, ఇళ్ళకు చేరేవారు. అన్నీ యధాతథంగా జరిగిపోతున్నాయి.

ఇలా ఒకరోజు, రెండు రోజులు కాదు. ఏడాది గడిచింది! ఒక్క బలరామునికి తప్ప వేరెవరికీ జరుగుతున్నది పసిగట్టే శక్తి లేదు. మనుషులకు ఒక యేడాది అంటే బ్రహ్మకు లిప్త కాలం. రేపల్లెలో ఏమవుతోందోనని చూసిన బ్రహ్మకు అంతా మామూలుగా కనిపించింది!! కృష్ణుడు తన చెలికాండ్రతో చల్దులారగిస్తున్నాడు. పశువులు నీడను పరుండి నెమరు వేస్తున్నాయి. ఇది వరకు లేని అందమేదో ఆ అడవి అంతా కమ్ముకుంది. మనోజ్ఞమైన తరువులతో, ఫలాలతో వంగిన కొమ్మలతో, మనోహరమైన పుష్ప సంపదతో నందనవనంలా ఉందా కాననం! ఏమీ అర్ధం కాక బ్రహ్మ తను గోవులనూ, గోపాలకులనూ దాచిన గుహలో చూసాడు. అక్కడ వారందరూ తన మాయకి బధ్ధులై నిద్రపోతున్నారు!

అడవిలో ఎటుచూసినా పరుగులు పెడుతూ ఆడుతూ, నవ్వుతూ గొల్లపిల్లలే! తరచి చూద్దుడు కదా.. గోపాలకులందరూ నీలమేఘశ్యాములయ్యారు. నేలపై నీలిమేఘాలు పరుగులు పెడుతున్నాయేమో అని నెమళ్ళు పురివిప్పి నాట్యమాడసాగాయి. పుష్పవర్షం కురవసాగింది. ఆ బాలురందరూ హారాలతో, కిరీటాలతో, కుండలాలతో, బంగారు అంగుళీయకాలతో, వనమాలికలతో వెలుగొందసాగారు. అందరికీ నాలుగు చేతులు! శంఖ చక్రాలతో గదలతో కమలాలతో నిండి ఉన్నాయి. వక్షస్థలంపై శ్రీవత్సపు చిహ్నమేర్పడింది. పసుపుపచ్చని పట్టు వలువలతో, తెలి వెన్నెల నగవులతో అందరూ శ్రీమన్నారాయణులవలే కనిపించసాగారు! హంస వాహనమెక్కి అవనీతలంపై నిలచిన బ్రహ్మ తన శిరస్సులు వంచి కృష్ణునికి మొక్కాడు. "పరాత్పరా! నీ మాయ ఎరుగని వాడనై, నీ శక్తినే శంకించి నిన్ను పరీక్షిద్దామనుకున్నాను. నువ్విచ్చిన పదవే నాకు గర్వాన్ని తలలకెక్కేలా చేసింది. నేను సృష్టికర్తననుకున్నాను. నన్ను సృష్టించినది నువ్వేనని విస్మరించాను. నీ మోహన రూపం చూసిన నా భాగ్యం ఏమని చెప్పను! క్రొక్కారు మెరుపుతో మేళవించిన మేఘం వలే, ఈ పసుపుపచ్చని ఉత్తరీయం ధరించి వెలుగుతున్నావు. నీ చెవులకు గురివిందలు పొదిగిన కుండలాలు ఎంత రమణీయంగా ఉన్నాయో! నెమలిపింఛంతో ఒప్పారుతున్న నీ నీలాల కురులు చూసిన కొద్దీ మోహాన్ని కలుగచేస్తున్నాయి. వనమాలికలతో అలరారే మనోహరమైన వక్షస్థలముతో, కెందామరల వంటి కరచరణాలతో నీ రూపం.. ఆపాదమస్తకం ఎన్నిమార్లు చూసినా తనివి తీరకున్నది. ఏమి పుణ్యము చేసుకున్నానో!" అని కృష్ణునికి నమస్కరించాడు. మాయను ఉపసంహరించి గోపబాలులను, ఆలమందలనూ కృష్ణునికి అప్పచెప్పాడు.
"అప్పుడేమయింది!?"
"ఏమవుతుంది. మాయ కమ్మిన బాలురకు ఏ మాత్రం తేడా తెలియనివారై మామూలుగా కృష్ణునితో కలిసి మెలగసాగారు. మలిసంజె వేళయిందని ఆలమందలను వాటి ముద్దు ముద్దు పేర్లతో

రా పూర్ణచంద్రిక రా గౌతమీ గంగ రా భాగీరథరాజతనయ
రా సుధాజలరాశి రా మేఘబాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి
రా మనోహారిణి రా సర్వమంగళ రా భారతీ దేవి రా ధరిత్రి
రా శ్రీమహలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి

అని మురిపెంగా పిలుస్తూ ఆలకాపరి, నేస్తాలతో కలిసి రేపల్లెకు చేరాడు."

"అలా బ్రహ్మకు గర్వభంగం చేసాడన్నమాట! మాకు తెలియదే!" ఆశ్చర్యపోయింది సురభి. అందరి కళ్ళలోనూ అదే ఆశ్చర్యం.
"అవును. మరి దేవేంద్రుని గర్వమణచడం మీకు తెలిసిందే!"
"ఓ.. తెలుసు! చెరువుల్లో, నదుల్లో నీరు తాగిన మేఘాలను అడ్డి, వర్షం కురిపించేది గోవర్ధన గిరేనని, పూజలు దానికే జరగాలని చెప్పాడు కృష్ణుడు. అలాగే చేసామని ఇంద్రుడు కోపగించి ఉరుములూ, మెరుపులతో బ్రహ్మాండమైన వర్షం కురిపించాడు!" కళ్ళు వెడల్పు చేసి చెప్పింది తరళ.
" ఏనుగులు తొండాలతో జలధారలు చిమ్ముతున్నట్టే! ఏం భీభత్సమైన వర్షమసలు! ఆలమందలనూ, గోపాలకులనూ కాపాడేందుకు గోవర్ధన గిరిని అమాంతం పైకెత్తి, చిటికెన వేలిపై నిలిపాడు కృష్ణుడు!! భయం లేదని నవ్వుతూ పిలిచాడు. ఆ నవ్వులో ఏం మాయ ఉందో! పరుగున వెళ్ళి తలదాచుకున్నాం."అంది కమలిని.
"కృష్ణుడికి తోడుగా మా తాత ములుగఱ్ఱ కొండకి దన్ను పెట్టాడులే!" నవ్వింది సురభి.
"దేవేంద్రుడు ఏడు రోజులకు తెలుసుకున్నాడు! పరుగున వచ్చి "సచ్చిదానంద రూపా! గోవర్ధన గిరిధారీ!" అని పాదాల మీద పడ్డాడు." గర్వంగా చెప్పింది కమలిని.
"అంతేనా! ఆషాఢ మాసం మొదలుకుని రెండునెలలు తనకూ, రెండు నెలలు కృష్ణుడికీ పూజా ఫలం దక్కేలా ఒప్పందం చేసుకున్నాడు. కృష్ణుడు ఉపేంద్రుడయ్యాడు!" సంబరంగా చెప్పింది తరళ.

"బ్రహ్మేంద్రాదులకు సైతం పూజ్యుడు శ్రీ కృష్ణుడు. వేద ప్రమాణానికి మాత్రమే గోచరమయ్యే పరంజ్యోతి స్వరూపుడు. అలాంటి వాడు మనతో మన మధ్య ఉన్నాడంటే, ఎన్ని జన్మలు బంగారు పువ్వులతో పూజలు చేసి ఉంటాం!" అంది నీల.
"నిజమే! ఓ శ్లోకం, ఓ వేదపాఠం ఏదీ తెలియని వెర్రి గొల్ల పిల్లలం! మాకు దక్కే భాగ్యమా చెప్పు! మాకేం చేతనవును!" మళ్ళీ నిస్సహాయత కమ్మేసింది అందరినీ.
"నేను చెప్పేదీ అదే! జపతపాలకు లొంగనివాడు ప్రేమకు లొంగుతాడు. మీ వద్ద ఉన్నదదే!"
"లేదులే నీలా! ఏదో మా వెర్రిగానీ!"
"మహర్షులు సైతం ఎదురుగా కనిపించిన కృష్ణస్వామి కమనీయ రూపానికి వివశులైపోతారట! "జపమముంచత. హోమమముంచత. తపమముంచత..!" అని జపం, తపం, హోమం అన్నీ వదిలి రెప్పవేయకుండా ఆతనిని చూస్తూ పరవశులైపోతారట. అది తప్పు కాదు. భగవదారాధనలో అతి ప్రధానమైన మార్గం ప్రేమ. గోపికల ఆస్తి అదే!" అని చెప్తున్న నీల వైపు అపనమ్మకంగా చూసారు అందరూ.
"నమ్మరా?  రాముడి వెంట అడవులకు వెళ్ళి, అన్నకు నీడలా మసలుకున్న లక్ష్మణుడు ఏ జపమాచరించాడు? ఏ హోమం చేసాడు?  మాధవుడు ప్రేమకి మాత్రమే కట్టుబడేవాడు." చిరునవ్వు వెన్నెలలు కురిపించింది నీల.
"నువ్వే మార్గ దర్శకురాలివి! స్వామిని నిద్ర లేపేందుకు ఏం చెయ్యాలో చెప్పు!" గోపికలు అడిగారు ఏకకంఠంతో.
"పిలవండి. మనసారా పిలవండి. అన్ని శంకలూ మాని పిలవండి. అరిషడ్వర్గాలు అంటని "శుధ్ధ సత్వరూపం" పరమాత్మ! మానవ రూపంలో ఉన్నా ఆయనని కామక్రోధాలు అంటవు. లోభమోహాలు సోకవు. మదమాత్సర్యాలు చేరవు. మనమూ వాటిని విడిచి పిలిస్తే పలుకుతాడు." వారి మనసులో మిగిలి ఉన్న సంశయాన్నీ, బాధనూ తొలిగించింది. నిష్కల్మషమైన మనసుతో కృష్ణుని ముంగిట నిలచి పాడసాగారందరూ!

బంగరు కడవల నిండా పాలు
పొంగి పొరల కురిపించే ఆలు
చాల కలుగు నందుని గారాల నందనా!
ముని హృదయస్యందనా!

వైకుంఠమ్ము విడిచి, లోక
లోకమ్ములు కడచి
మాకోసము దిగివచ్చిన స్వామీ! మేలుకో!
మేలుకో తేజోమయ! నీలాప్రియ! మేళుకో!
మేలుకో భక్తాశ్రితపాళీ సరసిజహేళీ!

వైరులు నీ శౌర్యమ్మునకోడి!
సైరింపక, నీ వాకిట కూడి,
బీరమేది శ్రీపదముల
వారల కొలిచే తీరున,
చేరి మంగళాశాసన
మును చేసి, ముదమ్మున కై
వారమ్ములు చేసి, వచ్చి
నార మయ్య, నిదురమాని మేలుకో!

కృష్ణుడు నిద్రలేవలేదు. అలికిడి చేయలేదు. పిలుపు విని పలుకలేదు.

"కృష్ణా! నందనందనా! నందుని వద్ద ఎన్ని కడవలైనా నింపే క్షీరధారలు గల ఆలమందలు వేలకు వేలున్నాయి. అది నీ మహిమే కదూ! మాకోసం ఎంత భోగ్యమైన వైకుంఠాన్ని వదిలి వచ్చావు! నీ దయ అపారం! తేజోమయా! నీలాప్రియా! మేలుకో! నిన్ను చూడాలని మా మనసు ఉవ్విళ్ళూరుతోంది. నీ శౌర్యానికి ఓడి నీ ముంగిట నిలచిన శత్రువులను సైతం కాపాడే వాడివి. నువ్వే శరణమన్న విభీషణుడిని కాచావు. యుధ్ధభూమిలో విల్లు విరిగి నిలబడిన రావణుని దయతలచి, రేపటి దాకా సమయమిస్తున్నానని కరుణించి మరొక అవకాశం ఇచ్చావు. అంత దయామయుడివి! మాలాంటి గొల్లలకు ఇంత పరీక్ష ఎందుకు పెడుతున్నావో? నిన్నటి వరకూ మేము బాధతో అల్లాడుతున్నామనుకునే వారం. ఈ బాధలో తీపి ఈనాడు తెలిసొచ్చింది. మాదెంత పున్నెమో అర్ధమయింది. కృష్ణుడే మా వద్దకు వస్తాడనుకునే వారం. కానీ స్త్రీలమనే భావన కూడా విడిచి నీకోసం పరుగున వచ్చాం. ఇంక ఆగలేక వచ్చాం. నిన్ను చూడాలి. నీ సాన్నిధ్యం కావాలి. అనే కోరికతో వచ్చాం. మేలుకో!" అని పిలిచారు. ఎదురు చూసి చూసి "సరే! నిద్రపో! రేపు మళ్ళీ వస్తామని" వెనక్కి మరలారు.
"అయ్యో! ఇళ్ళకు వెళ్ళిపోతున్నారా?" అని జాలిపడింది నీల.
"నీలా! మహా లక్ష్మీ! నీ నోట మాధవుని గుణగానం విన్నాం. మాకది చాలు. రేఫు వస్తాం. రిక్కలనైనా లెక్కించవచ్చు. ఇసుక తిన్నెలో రేణువులెన్నున్నాయో గణించవచ్చు. సముద్రంలో నీటి బిందువులెన్నో కనుక్కోవచ్చు. ఆ పరంజ్యోతి, పరమపురుషుడు, కృష్ణుని సుగుణ గణన ఎవరి తరం?! ఎన్ని కథలు చెప్పుకుంటే కరువు తీరుతుంది! ఎన్ని పాటలు పాడితే తనివి తీరుతుంది! ఈ భాగ్యం కోసం ఎన్ని మార్లైనా వస్తాం. సెలవు!" అని వెనుదిరిగారు గోపవనితలు. తృప్తిగా నవ్వుకుంది నీల. వారి మనసులో సంశయం లేదు. బాధ లేదు. ఉన్నది ప్రేమ ఒక్కటే!


* రేపూ కృష్ణుని మేలుకొలుపుదాం!


(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )

(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)



Tuesday, January 3, 2012

మేలుకో ఓ సిరీ! శాతోదరీ! ~ కాత్యాయనీ వ్రతం - 20

సురభిళ సుమవల్లరులతో, నికుంజాలతో, బంగారు ఊయలలతో, స్పటికంలా మెరిసే నీటితో నిండిన తటాకాలతో ప్రకాశిస్తున్న పుష్పవనం దాటి నీల మందిరం చేరుకున్నారు గోపభామినులు. "ఏ క్షణమైనా తటాలున తలుపులు తెరచుకుని కృష్ణుడు వచ్చేస్తాడేమో!" అనే ఆశ వారి బేలకళ్ళలో నిండి ఉంది.

"శ్రీ కృష్ణా! ముల్లోకాలకూ దిక్కు నువ్వే! సకల చరాచర సృష్టికీ నాథుడవు నువ్వే! నీ చాలుబడి ఇంతా అంతానా? నీ పరాక్రమానికి పోలికే లేదు. అయితే మాకో అనుమానం! నీకు దేవతలే తప్ప సామాన్యులు కనబడరా? వారికి ఆపద వస్తే తక్షణం రక్షిస్తావు. నీ సుదర్శన చక్రాన్ని ఉపయోగించి దేవేంద్రునికి సింహాసనాన్ని గెలిచి ఇచ్చావు. "ఆకాశం పడిపోనీ, భూమి బ్రద్దలు కానీ, సముద్రము శుష్కించిపోనీ, హిమవత్పర్వతం ముక్కలైపోనీ.. నా మాట కల్ల కాదు." అని ఆశ్రితులకు అభయమిచ్చినవాడివి. ఋజువర్తనము మాకు నేర్పేవాడివి. మా కోసం నువ్వేమీ పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. నీ చిరునగవు మా ఈ కనులతో కరువుతీరా చూడనీ! అన్ని ప్రాణుల విషయంలోనూ సమదృష్టి కలిగి ఉంటానని చెప్పావు. అలాంటిది మమ్మల్ని నువ్వే చిన్న చూపు చూస్తావా? మేలుకో! బయటకు వచ్చి మా మొరాలకించు!"

మేలుకో శ్రీ కృష్ణ! మేలుకొనవేమీ!
చాలుబడి గల దేవ! మేలొసగు స్వామీ!

మున్నేగి ముప్పదియు మూడు కోటుల సురల
బన్నముల బాపు బలశాలీ! వనమాలీ!
వెన్ను దవిలి విరోధివితతికి వనటగూర్చి
చెన్ను తొలగించు ఆపన్నజనతావనా!

సమాధానం లేదు. ఉసూరని ఒకరినొకరు చూసుకున్నారు.
"నిన్న నీలను మనం నిష్టూరమాడిన మాటలు విని కన్నయ్య కోపం తెచ్చుకుని ఉంటాడా?" ఉన్నట్టుండి ప్రశ్నించింది సురభి. "ఏమో! అయి ఉంటుందా!" అని కలవరపడ్డారందరూ! పరుషవాక్యమేదైనా ధ్వనించిందేమో అని గుర్తు చేసుకున్నారు. "ఏమో! నోరుజారి ఏమైనా అనకూడదని మాట అన్నామేమో! నీలను విస్మరించి కృష్ణుని నేరుగా నిద్ర లేపామని ఆమెకు కోపమొచ్చి స్వామిని ఆపిందేమో!" అని భయపడ్డారు. ఆమెను ప్రసన్నం చేసుకోవాలని తలచి పిలువసాగారు.

"ఓ నీలా! అసితేక్షణా! నిద్ర లే! స్త్రీ హృదయం స్త్రీ కే తెలుస్తుందంటారు. లిప్తకాలం కృష్ణుని ఎడబాటు భరించలేని దానివి. మా విరహాన్ని నీకు వివరించి చెప్పాలా? మా పై జాలి కలగడం లేదూ! లోకాలేలే రేడుని కనుసన్నలలో మెలిగేలా చేసుకున్న దానివి. నీ ఆనతి లేనిదే మాకు ఒనరేదేమైనా ఉందా? ఒక్క సారి బయటకు రా! నీ సౌందర్యానికి కృష్ణుడే దాసుడయ్యాడు కదా! మా కన్నులతో ఒక్క సారి నీ హొయలు చూడనీ!" తేనెలొలికే పలుకులతో పిలుస్తున్న వారిపై కాస్త దయకలిగిందేమో నీలకి! చందువా తెరలు తొలగించి శయ్య దిగి, పసిడి మువ్వలు ఘల్లుమనేలా పదపల్లవాన్ని నేల మోపింది. ఆ సవ్వడికే పరమానందభరితులై గోప వనితలు ఇనుమడించిన ఉత్సాహంతో నీలను పిలువనారంభించారు!

"ఓ నీలా! కృష్ణుని ఇల్లాలా! నీ ఎరనెర్రని చిగురు పెదవి ఎంత కోమలంగా తేనెలురుతూ ఉండనిదే కృష్ణుడు నీ కొంగు విడవకుండా ఉంటాడు చెప్పు! నీ కలికితనం మా కన్నులతో చూడనీ! నిండైన చనుకట్టు కలదానివి. సింహ మధ్యమవి! నీ నలక నడుము అందం ఈ పూల తోటలో ఏ మంజరికీ అబ్బి ఉండదు! నీ సౌందర్యానికి పరిపూర్ణత కృష్ణ సంశ్లేషమే కదూ! అందమైన మాటకు అర్ధంలా, దివ్వెకు వెలుగులా, కుసుమానికి పరిమళంలా ఒకరినొకరు సంపూర్ణులను చేసుకోగలిగే వారే లక్ష్మీ నారాయణులు! యదుకుల మంగళ దీపం శ్రీకృష్ణుడు! ఆతని వెలుగువు నువ్వు! గోపకుల మంగళదీప రేఖా! మేలుకో! కురంగ నయనా! నీ కనులు విచ్చి మమ్మల్ని చూడు!"

పున్నమి జాబిల్లి లాంటి మోము కలదీ, తమ్మిరేకుల కన్నులదీ, అణువణువునా చక్కదనం ఒలికే చిన్నదీ.. కనులు తెరవగానే కృష్ణుని చూసే భాగ్యం దక్కిన ఐశ్వర్యవంతురాలు నీల నిదుర లేచింది. శింజినులు మ్రోగాయి. గాజులు గలగలమన్నాయి. 'నీలాతుంగ స్థనగిరి తటీ సుప్తుడైన' శ్రీకృష్ణుని నెమ్మదిగా తలగడపైకి చేర్చి, ఆపాదమస్తకమూ ఆతని మరొక్క మారు చూసుకుని శయ్య దిగి తలుపు తీసేందుకు కదలబోయింది.

మేలుకో ఓ సిరీ! శాతోదరీ!
మేలుకో ఓ నీల! పరిపూర్ణురాలా!
మేలుకో నవకిసలయాధరా!
కలశోపమపయోధరా!

బంగరు తలుపులు తెరచుకున్నాయి. పసిడి బొమ్మలా, పాలకడలి కన్న ముద్దుగుమ్మలా.. చిరునగవుతో, సిరి కనుల ముందు నిలబడితే ఇంక కావలసిందేముంది!
"సకియలూ! కుశలమేనా?" మధుస్వనానికి ఈ మధురిమ ఎక్కడిదీ? అందుకే ఈ నీల ఇంటితోటలో చేరి నేరుద్దామని వృధాప్రయాస చేస్తోందేమో!
"తూరుపు తెలవారక ముందే వచ్చి ముంగిట నిలచారు. ఏం కావాలో చెప్పేరు కాదు!"
అప్పుడే నిద్ర లేచినట్టు మాటలకు వెతుక్కున్నారు గోపకాంతలు. ఒకరివైపొకరు చూసుకుని "నువ్వంటే నువ్వని" గుసగుసలాడారు.
"నీలా! ఓ రాజాననా! నిన్ను చూస్తే చాలనిపిస్తోంది. కానీ నీ మేనిపరిమళానికి తోడై ఉన్న ఆ వనమాలా సౌరభం మాకు కర్తవ్యబోధ చేస్తోంది. మాకు కావలసినవి రెండు వస్తువులు. విసనకర్ర, అద్దము." చెప్పారు గోపబాలలు.

నీల నవ్వింది. లేలేత గులాబి రేకు అరవిచ్చినట్టు నవ్వింది. మువ్వ దొరలినట్టు నవ్వింది.
" చెలులూ! తప్పకుండా ఇస్తాను. ఇంత చలిలో ఇంత దూరం వచ్చినది ఆలవట్టమూ, అద్దమూ అడగడానికా! ఆశ్చర్యం!!" పాలుగారు నునుచెక్కిట ఎరనెర్రని చేయి చేర్చి వింతగా కనులార్పుతూ అడిగింది.

"నీకు ఈనాటి దాకా ఎప్పుడూ అనుభవంలోకి రానిదొకటి మాకు తెలుసు! అదే విరహం! గ్రీష్మంలో తపనుని కిరణాల గాడ్పు సోకినట్టుంది మాకు! నిదుర రాదు. మనసు కుదురు లేదు. యమునలో స్నానం తప్ప వేరే దారి కానరావడం లేదు. నీకు తెలిసే ఉంటుంది. మేము కాత్యాయనీ వ్రతం చేస్తున్నాం. నెలకు ముమ్మారు శ్రేష్ఠమైన వానలు పడాలని కోరుతూ నోము నోచాం. తెలవారక ముందు యమునలో స్నానమాచరిస్తున్నాం. కానీ ఆ మంచు కంటే చల్లని యమున నీళ్ళు సైతం మా విరహ తాపాన్ని చల్లార్చలేకపోతున్నాయి. స్నానం చేసి ఒడ్డుకు చేరే లోపు మళ్ళీ చెమటలు! తాపం!! అందుకని మాకొక విసనకర్ర కావాలి." చెప్పింది సురభి.
"అవునా! ఎంత బాధ పడుతున్నారు! అయ్యో! తప్పకుండా ఇస్తాను. మీ తాపాన్ని చల్లార్చే మార్గం ఉందంటే నా వంతు సహాయం తప్పకుండా చేస్తాను. ఇంతకీ అద్దం దేనికి?"
"నీలా! అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటే మాకు శ్రీకృష్ణుడు కనిపిస్తాడు! మాతో సర్వకాల సర్వావస్థలయందూ ఉన్నాడని ధీమా కలుగుతుంది. అందుకని మాకు అద్దం కావాలి."
"అయ్యో! వెర్రి అమ్మాయిలూ! ఎంత బాధపడుతున్నారు! మీకెంత ప్రేమ! ఇంతమంది హృదయారవిందాలలో కొలువున్న కృష్ణుడెంత భాగ్యశాలో అనిపిస్తోంది! తప్పకుండా అద్దం కూడా ఇస్తాను. ఇంకా ఏమైనా ఇవ్వగలదానినా? మొహమాటపడకుండా అడగండి. మీలో ఒకతెనని తలచి అడగండి." చెరగని స్వఛ్చమైన నవ్వుతో అడిగింది నీల.

ఒకరి ముఖాలొకరు చూస్కున్నారు. ఒక నిర్ణయానికి వచ్చి అడిగేసారు.
"ఓ నీలా! మాతో కృష్ణుడిని స్నానానికి పంపు."
"కృష్ణుడినా!"
"అవును! మావి లౌకికమైన కోరికలని తలచకు! తప్పు పట్టుకోకు! "హరిసరసి విగాహ్యాపీయ తేజో జలౌఘం భవమరు పరిఖిన్నః ఖేదమద్యత్యజామి!" "హరి" అనే సరస్సులో స్నానమే ఈ సంసార తాపాన్ని తగ్గించగలిగినది. ఈ బాధకు విరుగుడు హరి సామీప్యమే! కృష్ణుని చెంత ఉండడమే! ఆ కృష్ణునితో కలిసి స్నానం చేస్తే మా తాపం తగ్గుతుందని ఆశ!

ఆలవట్టము, అద్దమొసగి నీ స్వామిని
ఆలసింపక పంపవమ్మ నీరాడ!" చెప్పారా గొల్ల పిల్లలు.

"సరే! మీకు నేను ఇవ్వగలిగిన వస్తువులు ఇస్తాను. కృష్ణుని ఇవ్వగలిగేంతటి దాన్ని కాదు. ఒక కౌగిట బందీయై ఉండేవాడు కాదని మీకూ ఎరుకే కదా! నేనూ మీలాంటి దాన్నే. నిదురపోతున్న కృష్ణుని వెళ్ళి తట్టి లేపగలిగేదాన్ని కాను. మీతో కలిసి కమ్మని పాటలతో మేలుకొలుపు పాడే భాగ్యం నాకూ పంచండి. రేపు తెలవారకనే రండి. నేనూ మీతో కలిసి కృష్ణునికి సుప్రభాతం పలుకుతాను." చెప్పింది నీల.
"సరే! తెలవారక ముందే వస్తామని, ఆమెను బయటకు వచ్చి ఉండమని" వేయి సార్లు చెప్పి ఆనందంగా ఇళ్ళకు మరలారు అందరూ! సౌందర్యాధిదేవతలా అలరారుతున్న నీల చెంత లేనందుకైనా కృష్ణునికి తెలివి వస్తుందని వారి నమ్మకం!

*కృష్ణుడు నిదుర లేచేనా? వేచి చూద్దాం!


(*ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..).



Monday, January 2, 2012

పలుకవా నళినేక్షణా! ~ కాత్యాయనీ వ్రతం - 19

తెలి వెన్నెల తెరలు కట్టిన నింగి పల్లకీ ఎక్కి ఊరేగుతున్న జాబిలిని చూసి నిట్టూర్చింది సురభి.
"రోజుకో కళ పెరుగుతూ మన విరహానికి ఆజ్యం పోస్తున్నాడు." సురభిని చూసి తానూ నిట్టూరుస్తూ చెప్పింది తరళ.
"పదండి. కాత్యాయనికి మనసారా మొక్కి నడవండి. ఈ రోజు నీలను నిద్ర లేపాల్సిందే! కృష్ణుని చూడాల్సిందే." బయలుదేరదీసింది ఆనందిని.
"ఈ రోజైనా మన మనోరథం నెరవేరేనా?" నిరాశగా అంది సురభి.
"సురభీ! నువ్వే ఇలా బెంబేలుపడితే మిగిలిన వారికి ధైర్యం చెప్పేదెవరు? ఒక్కో రాయీ పేర్చితేనే వారధి అయింది. రాముడికే తప్పలేదీ విరహం. మనబోంట్ల సంగతి చెప్పేదేముంది? సహనం వహించక తప్పదు. పదండి అమ్మాయిలూ!" చుక్కానిలా రెపరెపలాడింది చకచకా నడుస్తున్న ఆనందిని పైట కొంగు.

నీల మందిరపు ముంగిట నిలబడ్డారు. గాలిలో తేళివస్తున్న అగరు ధూపం, చందన పరిమళాలు వారి విరహబాధను రెట్టింపు చేస్తున్నాయి. బంగారు కిటికీలకు అలంకరించిన తెరలతో తెమ్మెర సరాగాలాడుతూ,  ఆ పడకింటి అవ్యక్తమైన అందాలను, ఆ గోపవనితల ఊహకు అందిస్తోంది. ఆకుల సవ్వడి వినిపించినా అది నీల మంజీరాల రవళేమో అనుకుంటున్నారు. నాసికకు సోకే సుగంధంలో వనమాల సౌరభాన్ని వెతుక్కుంటున్నారు. కనురెప్పైనా వెయ్యక ఆ మందిర సౌందర్యాన్ని చూస్తున్నారు. ఆ తలుపుల వెనుక ఉన్న తమ మనోహరుని పిలవసాగారు.

"ఓ రాజీవ లోచనా! నీ నయన సౌందర్యానికి ఓడి నీ ముంగిట నీ కోసం ఎదురుచూస్తున్నాము. నీకు తెలియనిదేముంది! మేము అడగాల్సిన పనేముంది? అయినా అడుగుతున్నాం. మా వ్రత సాఫల్యానికి కావలసిన వాయిద్యం ఇస్తానని మాటిచ్చావు. నిష్ఠగా నోము నోచుకుంటున్నాం. రోజులు గడుస్తున్నాయే కానీ నీ దర్శనభాగ్యం లేదు. మా మాట మరచావేమో అని గుర్తు చేద్దామని వచ్చాం. కనీసం "ఓ"యని బదులైనా పలకలేవా? ఒక్క మాటైనా మాటాడకుండా, ఈ అమాయక గొల్లపడుచులందరినీ నీ ముంగిట నిలుపుకున్నావు. నీకిది న్యాయమా?" కన్నుల చిప్పిల్లుతున్న కవోష్ణ ధారలు కట్టు దాటకుండా ఉగ్గబట్టుకుంటూ పిలిచారు గొల్ల పడుచులు.

సమాధానం లేదు. కోపమొచ్చింది కొందరికి. నిరాశ నిస్సత్తువైపోయింది ఇంకొందరికి. అయినా పట్టువిడువక పిలిస్తున్నారు.
"నీల అనుపమాన సౌందర్యవతి. ఆ కలికి చనుగవ నీ తలగడగా చేసుకుని పడుకుని ఉంటావు, కృష్ణా! ఇంక మా పిలుపు నీకెలా వినబడుతుంది? కనీసం పెదవి విచ్చి ఒక్క మాట మాట్లాడలేవా?" నిష్టూరం రంగరించి పలికింది కమలిని. చెలులందరూ ఆమె వైపు నీకెలా తెలుసన్నట్టు చూసారు. ఇంకా ఏం ఊహించావని అడిగారు.

"ఆ మందిరంలో గుత్తులు గుత్తులుగా కప్పురపు దివ్వెలు వెలుగుతుంటాయి. ఆ దివ్వెల వెలుగులో నీల నీలాల కురుల పరిమళం తాకేలా ఆమె హృదయసీమ పై పవళించి ఉంటాడేమో!" చెప్పింది కమలిని.
"అంతేనా! తెల్లని దంతపు కోళ్ళతో ఉన్న పంచతల్పం పై శయనించి ఉంటాడు. అంత సుఖమైన నిద్ర కనుకే తెలివి రావట్లేదు." అంది సురభి.
"దంతపు కోళ్ళా? పంచతల్పమా?"
"అవును! మధురానగరానికి వెళ్ళిన బలరామకృష్ణులకు, మదమెక్కి రహదారిలో చిందులేస్తున్న కువలయాపీడమనే కంసుని పట్టపుటేనుగు ఎదురుపడిందట. కృష్ణుడు సింహం లంఘించినట్టు ఆ ఏనుగు కుంభస్థలం పైకి ఎగిరి చేతులతో మోది దాని ప్రాణాలు హరించాడు. కువలయాపీడానికి నాలుగు బ్రహ్మాండమైన దంతాలుండేవి. ఆ ఏనుగును సంహరించిన పిదప, తన పరాక్రమానికి గుర్తుగా ఆ నాలుగు దంతాలూ మంచపు కోళ్ళుగా చేసి నీలకు బహూకరించి ఉంటాడు."
"మరి పంచతల్పమంటేనో?"
"చలికాలములో వెచ్చగానూ - వేసవి కాలంలో చల్లగానూ ఉండేది, మెత్తనిదీ, విశాలమైనదీ, పరిమళాలు వెదజల్లేదీ, మల్లెపూవల్లే తెల్లగా ఉండే శయ్యను పంచతల్పమంటారు." చెప్పింది మంజుల. "అవునా!" అని ఆశ్చర్యపోయారు మిగిలిన వారు.
"అంత హాయిగా నిద్దరోతున్న స్వామి కళ్ళెలా విప్పుతాడు. నీల అయినా నిద్రలేస్తే బాగుండును."
"మన పిలుపు విని లేచి వద్దామని ఒక్క అడుగు వేసాడనుకో! ఆ నీల వెళ్ళనిస్తుందా? కనులతోనే వారించి మళ్ళీ తన గుండెల్లో దాచేసుకుందేమో!" అనుమానం వెలిబుచ్చింది విష్ణుప్రియ,
"లేదు. కృష్ణుడే మాయావి. ఆమె మంచిదే పాపం!" తనకు తెలుసన్నట్టు చెప్పింది కమలిని.

"ఓ నీలా! కాటుక రేఖలు తీర్చిన నీ సోగకన్నులను ఒక్క మారు అల్లన విచ్చి చూడవమ్మా! నీలాంటి సుగుణరాశికి తగినదేనా ఇది? భోగాలన్నీ విడిచి పల్లె కోసం, మాకోసం నోము నోచాము. నువ్వేమో హాయిగా కృష్ణుని కౌగిట ఒదిగి నిద్దరోతున్నావు. మా మొర వినబడదా? మాపై దయతలచి, నువ్వు ఒక్క అడుగు వేసేలోపు నీ విరహాన్ని క్షణమైనా భరించలేని అతడు నీ చెయ్యి పట్టి ఆపాడా.. ఏం?"


పలుకవా నళినేక్షణా
బదులైన
పలుకవా నవమోహనా!

పలుకవా రవ్వంత! పవ్వళింతువు గాని
కలికి చనుగవ పైని తలగడగ కేలూని

తళుకు దంతపుకోళ్ళ మంచమ్ము పై,
లలిత సురభిళ పంచ తల్పమ్ము పై,
ఒరిగి కప్పురపు దివ్వె వెలుగులో, అల నీల
నెరుల విరితావిలో, నిదురింతువే గాని!

గడెయైన విభుని ఎడబాయవు.
తడవైన గాని నిద్దుర లేపవు!
సొగసు కాటుక రేక సోగకన్నుల దాన!
తగదమ్మ నీ వంటి సుగుణవతికో చాన!

పలుకవా నళినేక్షణా!

"ఇంతలా మేలుకొలిపినా ప్రయోజనం లేదు! ఇంతేనా? మన వ్రతం నిష్ఫలమేనా?" ఉబికి వస్తున్న కన్నీళ్ళను కొనగోట చిదుముతూ దీనంగా అడిగింది సురభి. ఆమెను అక్కున చేర్చుకుంది ఆనందిని.
"వెర్రిపిల్లా! కన్నీళ్ళు పెడుతున్నావా? నీకిది తగదు సుమా! కృష్ణుడికి తెలియని సంగతి ఉంటుందా? లౌకికమైన ప్రయత్నం చెయ్యాలి కనుక మనం వచ్చి మేలుకొలుపులు పాడుతున్నామే కానీ.. "రక్షితా జీవలోకస్య ధర్మస్య పరి రక్షితా! రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా!" జీవులను రక్షించేవాడు, ధర్మాన్ని నాలుగుపాదాలా నడిపించే వాడు, తన ధర్మమును, తన వారినీ కాపాడుకునే వాడూ ఆ రామచంద్రుడు. అని చెప్పలేదూ! అతను ఆడిస్తే ఆడే బొమ్మలం. నిరాశనీ, నిస్పృహనీ పక్కన పెట్టి చూడు. ఈ ప్రభాత వేళ కృష్ణుని మందిరం బయట నిలబడి అతని గుణసంపదను పాడే అదృష్టం రమ్మంటే వస్తుందా? రేపు మళ్ళీ వద్దాం. సముద్రాన్ని చేది పోయడమెంతో, ఆ పురుషోత్తముని గుణగానం చెయ్యడమూ అంతే! ఎన్ని పేర్ల పిలిచినా, ఎంత పొగిడినా తరిగేది కాదు." తన తీయని పలుకులతో సఖులకు ఊపిరూదింది ఆనందిని. వెనక్కి తిరిగి చూస్తూ, ఇంటిదారి పట్టారందరూ..


* రేపేం జరుగుతుందో.. ఎదురు చూద్దాం!


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)



Sunday, January 1, 2012

గురివింద పొదలందు పలికేను గోరింక! మేలుకో! ~ కాత్యాయనీ వ్రతం - 18

నందగోపుని మందిరపు మొగసాల నిలిచిన గోపకాంతలు పులు కడిగిన మాణిక్యాల వలె ప్రకాశిస్తున్నారు. యమునలో స్నానమాడి, కాత్యాయనికి పూజ చేసి, రయమున రాజమందిరానికి వచ్చి నిలచారు. శుక్లపక్ష చంద్రుడు తోడున్నానని హామీ ఇచ్చి ముందుకెళ్ళమన్నట్టు నవ్వుతున్నాడు. ద్వారపాలకుని ధైర్యవచనాలు నెమరు వేసుకుంటూ, బలదేవుడు చెప్పినట్టు నేరుగా నీలా మందిరం వైపు నడవనారంభించారు.

"సురభీ! నీలాదేవి మందిరం ఎంత వైభోగంగా ఉంది! ఇంద్రభవనానికైనా వంక పెట్టవచ్చేమో కానీ ఈ మందిరానికి మచ్చలేదు కదా! ఆ తటాకాలు, పూలతోటలూ చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఈ మణిఖచిత వేదిక మీద నీలా కృష్ణులు కూర్చుని ఉంటారా? ఈ బంగారు తూగుటూయలలో కన్నయ్య ఊగి ఉంటాడా? ఏం భోగం! ఏం ఐశ్వర్యం! ఈ గాలిలోనే ఏమి దివ్య పరిమళం? అసలు ఈ భవనాన్ని విడిచి బృందావనిలో చెట్ల కింద, అరుగుల మీద, యమున ఒడ్డున ఇసుక తిన్నెలమీద మనతో కృష్ణుడు కలిసి ఆడి పాడాడంటే నమ్మశక్యంగా లేదు! ఎంత అదృష్టవంతులం మనం!" ఆశ్చర్యపోయింది తరళ.
"సాక్షాత్తూ యశోద మేనకోడలు నీల! ఆగర్భ శ్రీమంతురాలు. కోరి వలచి, ఉంకువ చెల్లించి కృష్ణుడు పరిణయమాడిన మామ కూతురు. ఈ వైభోగం ఆమెకు పుట్టుకతో వచ్చినదే!" చెప్పింది సురభి.
"ఏవిటేవిటీ!! ఉంకువ చెల్లించాడా? అంత పుట్టు శ్రీమంతురాలంటున్నావు? ఇంకా శుల్కమెందుకు?"
"వెర్రి దానా! కృష్ణుని పరాక్రమమే ఉంకువ! ధనమో, ఆలమందలో కాదు. తన బాహుబలమే శుల్కంగా చెల్లించి ఈమెను చేపట్టాడు కృష్ణుడు." నవ్వింది సురభి.
"అబ్బా.. వివరంగా చెప్దూ!" చుట్టూ గరుడపచ్చలు పొదిగిన చలువరాతి తిన్నెపై కూర్చుంటూ అడిగింది.

"విదేహ రాష్ట్రంలో గొప్ప శ్రీమంతుడైన గొల్ల ఉండేవాడు. అతని పేరు కుంభకుడు. అతను యశోదకు అనుంగు తమ్ముడు. తనభార్య ధర్మద తో కలిసి పుణ్యకార్యాలు చేస్తూ, సొమ్ములు, పాలు, పెరుగూ అడిగినవారికి కాదనకుండా దానం చేస్తూ ఉండేవాడు. కుంభకునికి శ్రీ ధాముడు, 'నీల' అని ఇద్దరు సంతానం. నీలకే 'నాగ్నజితి' అని మరొక పేరు. పూర్వం తారకాసుర సంగ్రామంలో మహా విష్ణువు చేత చచ్చిన కాలనేమికి ఏడుగురు కుమారులున్నారు. వారు విష్ణువుపై పగబట్టి కృష్ణుని రూపంలో రేపల్లెలో పుట్టిన అతనిపై పగ తీర్చుకునేందుకు, కృష్ణుని మామ కుంభకుని ఇంట భయంకరమైన ఆబోతులుగా పుట్టారు. "కన్నయ్య ఎప్పుడైనా మేనమామ ఇంటికి రాడా! పగ తీర్చుకోకపోతామా!" అని వారి ఆలోచన. ఆ ఏడు ఎద్దులూ మహా క్రూరమైనవి. ఒక్కో ఎద్దూ ఏడు ఏనుగులను తుదముట్టించేంత బలం కలిగి ఉండేది! అవి ఊరిమీద పడి చేస్తున్న ఆగడాలకు కుంభకుడు ముకుతాడు వెయ్యలేకపోయాడు. వీటి ముట్టె పొగరణచిన వాడికి తన కుమార్తె నీలను ఇచ్చి వివాహం చేస్తానని చాటింపు వేయించాడు.
"ఊ.. కన్నయ్య వెళ్ళాడా!"
"వెళ్ళడూ మరి! ఆ సౌందర్యరాశి నీల మనసులో తన బావ కృష్ణుడినే వరించింది. ఆమెను చేపట్టేందుకు మేనమామ ఇంటికి వెళ్ళిన కృష్ణుడు, ఆ భయంకరమైన సప్త వృషభాలను తన ముష్టి ఘాతాలతో తుదముట్టించి ఆమెను పెళ్ళి చేసుకున్నాడు"
"అవునా! మరి అంత గొప్పింటి పిల్ల మందిరానికి వెళ్ళి, కృష్ణుడిని బయటకు పంపమంటే ఆమె పంపుతుందా?" నిస్పృహతో అడిగింది కమలిని.
"ప్రయత్నిద్దాం. మంచిగా ఆమెను వేడుకుందాం."
"సరే! ద్వారపాలకునికే అన్ని పధ్ధతులున్నాయి కదా! మరి కృష్ణుని కొంగున కట్టుకున్న ఆ భాగ్యశాలిని ఎలా సంబోధించడం! ఆమెకు దయ కలిగేలా ఎలా మాట్లాడడం?" సందేహం వెలిబుచ్చింది కమలిని.
"వెర్రి దానా! అమ్మకు ఉన్నదే వాత్సల్యం. సాక్షాత్ లక్ష్మీరూపం నీల! సురుచిరాంగి.. మంచి మనసున్నదీ కూడా! అయితే ఏమని పిలిస్తే బాగుంటుందో!" సాలోచనగా ఆనందిని వైపు చూస్తూ అంది సురభి.
"ఆ.. ఏముంది. "నందగోపుని మందిర రక్షకా!" అని పిలిచాం. "నందగృహ దీపమా!" అని యశోదని పిలిచాం. అలాగే "నందగోపుని కోడలా..!" అంటే సరిపోతుంది." అల్లరిగా సమాధానం చెప్పింది తరళ.
"నవ్వులాటకు చెప్పినా సరైన మాట చెప్పావు. అలాగే పిలవాలి."నవ్వింది ఆనందిని.
"ఊరుకుందూ! యశోదకి మేనకోడలైతే, "నందుని కోడలా" అని ఎందుకూ పిలవడం!" అపనమ్మకంగా అడిగింది తరళ.

"మీకు అర్ధమయ్యేలా చెప్పాలంటే రామాయణంలోకి వెళ్ళాలి." అని నవ్వి చెప్పనారంభించింది ఆనందిని.
"అశోకవనిలో శోకంలో మునిగి, శింశుపా వృక్షం కింద కూర్చున్న సీతమ్మ దగ్గరకు వెళ్ళాడు హనుమ. అతనితో తను ఎవరని చెప్పిందో తెలుసా సీతమ్మ? "స్నుషా దశరథస్యాహం! దశరథుని కోడలిని నేను!" అని చెప్పుకుంది. ఆ తరువాతే జానకినని, ఆ పై రాముని ఇల్లాలిననీ చెప్పింది."
"అవునా!"
"ఊ.. అంతే కాదు. రామునికి సీత అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా? "దారా పితృకృతా ఇతీ!" మా తండ్రి అనుమతితో పాణిగ్రహణం చేసానీమెను! "మా నాన్నగారి కోడలు సీత!" అని చెప్పుకున్నాడు రామచంద్రుడు. కనుక "నందగోపుని కోడలా!" అని పిలిస్తేనే నీల, కృష్ణుడు కూడా సంతోషిస్తారు." చెప్పుకొచ్చింది ఆనందిని.
"సరే! అలాగే పిలుద్దాం. పదండి. వెళ్ళి నిద్ర లేపుదాం."లేచి మందిర ముఖ ద్వారం వైపు కదిలింది తరళ. వెనుకే మిగిలిన గోపకాంతలు.

మణికవాటాలకి వ్రేలాడుతున్న పల్చని తెల్లని జలతారు తెరలు కదులుతున్నాయి. 'ఏమని పిలవాలో, ఆమె బయటకు వస్తే ఏమని అడగాలో' ఒకటికి రెండు సార్లు ముందే అనుకుని నిర్ణయించుకున్నారు. తలుపు దగ్గరగా నిలబడి నెమ్మదిగా పిలిచింది కమలిని.

"ఓ నందగోపుని కోడలా! నీలా! మేలుకో! మద గజాలనోడించే భుజబలమున్న వాడు నంద గోపుడు. అతని కోడలివి నువ్వు! కాత్యాయనీ వ్రతానికి కావలసిన వస్తువులు నీ పెనిమిటి శ్రీకృష్ణుని అడిగి తీసుకెళ్ళాలని వచ్చాం. నువ్వు నిద్ర లేచి కృష్ణుని నిద్ర లేపు. నీ ముంగిట నిలిచి ఎదురుచూస్తున్నాం. లే నీలా! నిదుర లే!" తన వంతు పిలుపు అయిపోయిందన్నట్టు వెనక్కి తిరిగి చెలుల వైపు చూసింది కమలిని. ఉత్పల, తరళా పిలవనారంభించారు.
"నీలా! అదిగో కోళ్ళు కూస్తున్నాయి. తెలవారుతోంది. సద్భోధలు చేసే జీయరులు నిద్రలేచి హరినామ స్మరణ చేస్తున్నారు. వినిపించిందా? గురివింద పొదల్లో గొరవంకలు కూస్తున్నాయ్. నీ వద్ద సంగీత పాఠానికి సిధ్ధమై నీ శిష్యురాలు కోకిల వచ్చి మాధవీ లతపై కూర్చుంది. "కూ.. కూ.." అని నిన్నటి పాఠం వల్లెవేసి నిన్ను మెప్పించి, నిద్ర లేపాలని చూస్తోంది. మేమూ ఆ కోయిలలాంటి వాళ్ళమే! నీ పలుకుల కోసం ఎదురుచూస్తున్నాం. నిత్యవసంత శోభతో అలరారే వనలక్ష్మివి నువ్వు! నీకు కాకి కూత ఏదో, కోయిల పాటేదో తెలియదా? మా పిలుపులో మాధుర్యం, మన్నన నీకు వినిపించలేదా? మేము అలవికాని కోరికలు కోరే అత్యాశాపరులం కాదు. వెర్రి గొల్ల పొలతులం. మంచి మాటలు మాట్లాడేవాళ్ళం. మాపై దయ తలచకపోయినా ఆ పికానికి పాట నేర్పేందుకైనా నిద్ర లేవమ్మా!"

నీల అలసి సొలసి నిద్రపోతోందని నిశ్చయించుకున్నారందరూ! మళ్ళీ ప్రయత్నిద్దామని పిలవసాగింది సురభి.
"నీలా! ఓ సౌందర్య రాశీ! ఓ అన్నుల మిన్నా! నీ కంటే గొప్ప అందగత్తె ముల్లోకాలలోనూ ఉందా? నీ హొయలు మరొకతెకు సాధ్యమయ్యేదేనా? నీ అందాన్ని చూసి నిన్ను అనుకరించాలని ప్రతి కొమ్మా పూచింది. నీ సొగసు ముందు ఈ పువ్వులు ఓడిపోతున్నాయి! ఈ పూలని చూస్తే తెలుస్తుంది నీవెంత చక్కదనాల కొమ్మవో! విరగబూసిన ఈ పువ్వులను, కృష్ణుని కోసం ఎదురుచూస్తూ, నీ ఎర్రని నాజూకైన వేళ్ళతో మాలలు అల్లావు కాబోలు! ఆ మాలలను బంతులుగా చుట్టి మీరిద్దరూ ఆడుకున్నారేమో! సుమాల కంటే సుకుమారివి! పాపం! బంతులాడి ఆ పూలబంతి చేతిలో ఉండగానే నిద్రపోయావేమో! నిద్ర లే! నీ నీలాల కురుల నెత్తావి మమ్మల్ని తాకనీ! లే నీలా! ఓ మధుసూదనప్రియా! నిదుర లే!" అలికిడి లేని ఆ మందిరపు వాకిట నిలచి నిరాశగా ఒకరినొకరు చూసుకున్నారు వారందరూ!

"నీలా! మహా క్రూరమైన బలమైన ఏడు ఆబోతులను ఓడించి నిన్ను చేపట్టాడు నీ స్వామి! అతని భుజబలం నీకు తెలియనిది కాదు. మద జలమూరే చెక్కిళ్ళతో అడవిలో విహరించే ఏనుగు వంటి బాహుబలం కల స్వామి ఆ శ్రీకృష్ణుడు. అతని శరణు కోరి వచ్చాం. నువ్వు నిద్ర లేచి ఆయనను నిద్ర లేపాలి. ఎర్రని తమ్మి పూవులను పోలిన నీ చేతులకి ఉండే బంగారు కంకణాల వినసొంపైన ధ్వని మా చెవుల సోకనీ! ఆ పసిడి కంకణాలు కదిలేలా తలుపు తీయవా?"

నందగోపుని కొడలా! ఓ నీల!
ఎందుకమ్మా తలుపు తీయవు?
విందువా కోళ్ళు కూసేను. ఆ వంక
గురివింద పొదలందు పలికేను గోరింక

కందుకము వేళ్ళ సందిటను కలదాన!
అందమగు కురుల నెత్తావి కలదాన
కుందనపు కంకణాల్ చిందులాడీ పాడ
కెందమ్మి పోలేటి నీ సోగ కేల

సుందరుడు నీ స్వామి శుభనామములను మన
మనమందరమునూ కూడి పాడుకొందాము
క్రందుకొను గంధసింధుర బలముతో వైరి
బృందముల క్రిందుపడ జేయగల వాని

 నందగోపుని కోడలా! ఓ నీల!
ఎందుకమ్మా తలుపు తీయవు?

అలికిడి లేదు. తలుపు తెరుచుకోలేదు. తెలవారింది. "ఇంత పిలచినా నిద్రలేవని నీలాకృష్ణులు ఎంత గాఢనిద్రలో ఉండి ఉంటారో!" అనుకుంటూ ఇళ్ళకు మరలారు గోపవనితలు. రేపటి రోజున మళ్ళీ వద్దామని ఒకరిని ఒకరు సముదాయించుకుని వెనుతిరిగారు.

* రేపేం జరుగుతుందో.. ఎదురుచూద్దాం!


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)