Wednesday, December 8, 2010

చినుకులు

ఉదయం నిద్ర లేచి కిటికిలోంచి చూసేసరికి వర్షం పడుతూ ఉండడం ఒక పెద్ద గొప్ప అనుభవం.
వర్షం తడిపిన మట్టి వాసన ముక్కుకి గుడ్ మార్నింగ్ చెప్తుంది.
మసాబు వెలుగు కళ్ళకి చలువ అద్దాలు పెట్టుకున్న ఎఫెక్ట్ కలిగిస్తుంది.
చిరుచలికి మెడమీది నూగు నిక్కబొడుచుకొని మెదడుని మేల్కొలిపి శరీరాన్ని బజ్జోమంటుంది.
మొత్తానికి వర్షం బధ్ధకాన్ని రాజేసి మనల్ని దుప్పట్లో దాచేస్తుంది.

ఎన్ని గుర్తొస్తాయో..! ఇన్ని దాటి అప్పుడే ఇంత దూరం వచ్చేసామా అని ఎంత ఆశ్చర్యం కలుగుతుందో..!
అనుభవం, అనుభూతి రెండు వేర్వేరు పదాలు. వర్షం పడడం అనుభవం.. దాని పర్యవసానాలు అనుభూతులూను.

ఉదయం నిద్రలేచేసరికి వాన పడుతూ ఉంటే ఎన్ని లాభాలుండేవో నన్ను అడగండి చెప్తాను.. స్కూల్ కి "బేడ్ వెదరాలిడే " అనబడు బేడ్ వెదర్ హాలిడే ఇచ్చేవారు. ఇప్పట్లా స్నో (మంచు కాదు స్నో) తెగ కురిసిపోతున్నా.. ఉదయానే కూలి పనికి పోయే మేస్త్రిలా పలుగు,పారా తీసుకోని, చలికి కొయ్యబారిపోతూ కార్ ని తవ్వి వెలికితీసుకొని, విజయగర్వంతో రోడ్ మీద జారుకుంటూ, ఎవడొచ్చి మన కార్ ని ముద్దెట్టుకుంటాడో అని గుండెలు అరచేతిలో పెట్టుకొని, బతుకు జీవుడా అనుకుంటూ ఆఫీస్ కి వెళ్ళాలా ఏమిటి? ఎంచక్కా ఇంకో అరగంట దుప్పట్లో గువ్వ పిట్టల్లా మసిలి అప్పుడు లేవచ్చు.

స్నానం చెయ్యనిదే అమ్మ చద్దెన్నం, ఆవకాయ కాదుకదా, గ్లాసెడు పాలు కూడా మన మొహాన పొయ్యదని భయం ఉందనుకో! పరవాలేదు.. బకెట్ లో సబ్బు కలిపి నురగ వచ్చే దాకా ఆడుకొని.. ఆ నీళ్ళు బడ బడా శబ్దం వచ్చేలా పారబోసి మొహం మాత్రం కడుక్కొని బట్టలు మార్చేసుకొని వచ్చెయ్యొచ్చు. వర్షం పడుతూ ఉంటే మనమేం చేస్తాం? చస్తామా? తప్పేం లేదు. ఒక్క రోజు స్నానం చెయ్యకపోతే నష్టమేం లేదు.

చూరునుంచి ధారలు ధారలుగా కారుతున్న వాననీటి సంగీతం ఏ మహానుభావుడి స్వరరచనో కదా..!
అది వింటూ అమ్మ పెట్టిందేదో తినేసి ఆ ధారల్లో చెయ్యి కడుక్కోవడముందే. అదీ అనుభూతి అంటే.

ఎంత సేపయినా చందమామలు, ఆంధ్ర ప్రభలు చదువుకోనిస్తారు. వర్షంలో తడవకుండా ఇంటి పట్టున మనం ఉండడమే పెద్దవాళ్ళకి కావలసినది. పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదివేసాక, నెమ్మదిగా జారుకొని నేస్తాలని చేరుకున్నామా! బోలెడు చెయ్యచ్చు వర్షంలో. పడవలు, కత్తి పడవలు మన పేర్లు రాసి పందాలు వేసి వదలచ్చు. పిడతలు, బుల్లి బకెట్లతో వాన నీళ్ళు పట్టి పారపొయ్యచ్చు.(తాగచ్చు కూడా..! )  కొంచెం వాన వెలిసిందా.. వీధిలో మిగిలిన దోస్తులేం చేస్తున్నారో చూసి , మేసే గాడిదలేమైనా మిగిలిపోతే చెడిపెయ్యొచ్చు. మన ఎకౌంటులో ఓ పది పైసలేమైనా ఉంటే ఇంతమందీ పోలోమని రోడ్డు మొదట్లో ఉన్న పాన్ షాప్ లో బిస్కెట్లు, గోల్డ్ ఫింగర్ లు కొనేసుకొని కాకెంగిలి చేసుకు పంచేసుకోవచ్చు. ఆ బురదలో హవాయ్ చెప్పులతో తపతపా అడుగులేసుకుంటూ ఇంటికి వచ్చాక మన గౌను వెనక ఏర్పడ్డ నల్లటి పోల్కాడిజైన్ చూసి ఇంట్ళో మన నడ్డి బద్దలగొడతారు. దురదృష్టం ఏమిటంటే, ఆ బురద చిందులు పడతాయని ముందు అసలు ఊహించం. 'ప్చ్..వట్టి కాళ్ళతో వెళ్ళొచ్చేసే వాళ్ళమే!' అని తరువాత పశ్చాత్తాపపడతాం.

ఇంకాస్త వయసొచ్చాక - వర్షం, రోజుకి కొత్త రంగులద్దేది.
వాన పడ్డ రోజు ఇంట్లో కూర్చోని హౌసీ, బేంక్ (మోనోపలీ),అంత్యాక్షరి ఆడడం, వేడిగా వేరుశనక్కాయలో,పకోడీలో తినాలనిపించడం, నేస్తాలతో దుప్పటి కప్పుకు కూర్చోని గాసిప్ మాట్లాడుకోవడం.
వర్షం బధ్ధకం కాదు, కొత్త కొత్త కోరికలు నేర్పేది.
చినుకులు చూస్తూ మనసుకు నచ్చిన వాళ్ళతో ముచ్చట్లు, గిల్లి కజ్జాలు.. అబ్బో..
మనసైన వాళ్ళో, వరసైన వాళ్ళో దాపుల్లో ఉంటే చెంగలువలు పూసితీరుతాయ్ మనసులో..
దొంగచూపులు, దోర నవ్వులని దాటి, కళ్ళు కలిపి కబుర్లు చెప్పే ధైర్యం చినుకులు, చలి ఇస్తాయంటే నమ్ముతారా?

మా అమ్మమ్మ గారింటికి వెళ్తే దొరికే అపురూపమైన వస్తువులేమిటంటే.. అమ్మమ్మ కుట్టే సంపెంగల జడ, చేసి పెట్టే గులాబి పువ్వులు (చెట్లకి పూసేవి కాదు.. వేడి వేడి చట్రానికి పూసేవి..హ్హాహ్హాహ్హా), పనస తొనలు,  బెండకాయ ముక్కలు వేసిన చారు, అప్పన్న దర్శనం,చిట్టి గారెలు. వర్షాకాలంలో వెళ్ళామా ఇంక కళ్ళకి విందే! జడివాన మొదలయిన క్షణంలో మెరుపు మెరిసినంత వేగంగా విరబూసి పలకరించే తెలతెల్లని చెంగలువలు. ఏం సువాసన.. ఏం అందం.. మరి రావు కదా! అపురూపమైన వస్తువుని చూస్తే 'మళ్ళీ ఎప్పుడా?' అనే బాధ చిన్నప్పుడు ఉండేది కాదు. దొరికినపుడు అనుభవించేయ్యడమే. ఇప్పుడో! అది దాచుకోవాలనో, సొంతం చేసుకోవాలనో తపన, స్వార్ధం. ఈ గుంజాటనలో అసలు విషయం అనుభవించలేకపోతున్నామనే  ధ్యాస ఉండదు.

ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని, పెద్దరికం ముసుగేసేసుకొని, డాలర్లు సంపాదిస్తున్నామా?
కనీసం నా పిల్లలు వర్షం లో తడిసి ఇంటికి వస్తే అయినా మనసుకు తశ్శాంతి కలుగుతుందేమో!

8 comments:

  1. భలే చెప్పారండీ -
    నాందీ ప్రస్తావనలో చెప్పిన ఈ వాక్యం ఒక్కటీ బుర్రకెక్కలేదుకానీయండీ "వర్షం పడడం అనుభవం.. దాని పర్యవసానాలు అనుభూతులూను."
    - పల్లెటూరులో గడిపిన బాల్యాన్ని కళ్లముందు నిలబెట్టారు

    ReplyDelete
  2. వాన పడడం అనుభవం. "చూరు ధారల్లో చేతులు(,తల) తడుపుకొని, నీళ్ళు తాగి జలుబు తెచ్చుకోవడం, బురదలో తిరిగి నడ్డి బద్దలుగొట్టించుకోవడం ఇత్యాదులు" పర్యవసానాలూను అని. వాన వెలిసాక కూడా తలుచుకోగలిగేవే కదండీ అనుభూతులంటేనూ.

    ReplyDelete
  3. వానజల్లులో తడిసినంత ఆహ్లాదకరంగా ఉంది!

    ReplyDelete
  4. chala bavundandi nenu ivanni anubhavinchaka poyina anubhavam ayyala chepparu santhoshamga undi chala rojula tharuvatha

    ReplyDelete
  5. ఇన్నాళ్ళు ఎలా మిస్సైయ్యనా కొత్తావకాయ????

    ReplyDelete
  6. "ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని, పెద్దరికం ముసుగేసేసుకొని, డాలర్లు సంపాదిస్తున్నామా? "చాలా బాగా చెప్పారు...మీ టపా మొత్తం చదివేసరికి ఏదో వింత అనుభూతి...ఇంచుమించు ఇలాంటి అనుభూతి కలిగినప్పుడు నేను రాసిన టపా...వీలైనప్పుడు చూడండి http://naarathalu.blogspot.com/2010/07/blog-post_12.html

    ReplyDelete
  7. ఇన్ని బంగారు క్షణాలు ఖర్చుపెట్టేసుకొని, పెద్దరికం ముసుగేసేసుకొని ...నిజమండీ...

    హవాయి చెప్పులూ అవీ గుర్తు చేసారు... :) ఇప్పుడు పిల్లలకి ఆ బూట్లూ ..ఈ బూట్లూ అని గారాబం చేసేస్తున్నామేమో! మా అబ్బాయిని అందుకే అన్నిటిలోనూ ( స్నో లోనూ, వాన లోనూ, ఎండ లోనూ) తిప్పేస్తానండీ... మా వారు తిడుతున్నా సరే ! :)

    ReplyDelete
  8. వాన జల్లులో బాఘా తడిపేశారు.:-)
    ఇప్పుడైనా సరే, పొద్దున్నే వాన మొదలైతే (సామెత ప్రకారం అది వదలకపోయినా పర్లేదు)కిటికీలోంచి చూస్తూ కాఫీ తాగడం, ఆకుల మీద నిశ్శబ్దంగా జారిపోతున్న చినుకుల్ని చూడ్డం,ఎంత బాగుంటుందో! తెల్లవారు జామున వాన బయట మొదలైన శబ్దం గొప్పగా ఉంటుంది. ఆ సవ్వడి వింటూనే లేచి కిటికీలో కూచునో,బాల్కనీలో నిలబడో దూరాన మెయిన్ రోడ్డు మీద వీధి దీపాల వెలుగులో జారే వెండి తీగలు చూడ్డం, ఆ చీకటివేళ భలే ఉంటుంది.

    ReplyDelete