Tuesday, October 18, 2011

మణిదీపం

* తెనుగు వాకిళ్ళలో తెలి వెలుగు రేక పొడిచే వేళ పలికే మేలుకొలుపు

తెల్లవారవచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా..

* గిల్లికజ్జాల ఆప్యాయపు పసి స్నేహపు పాట

కొమ్మల మీద కోతికొమ్మచ్చులాడింది
తెల్లా తెల్లని ఓ బుల్లి ఎండ
నేల మీద వాలింది వాలుమొగ్గలేసింది
నల్ల నల్లని ఓ బుజ్జి నీడ

* వలచిన చినదాని వగరూ, హొయలూ పొగిడే మాటకాడి మురిపెం ..

చికిలింత చిగురు సంపంగి గుబురూ
చినదానీ మనసూ.. చినదాని మీద మనసూ..

* పగిలిన గుండె నెత్తుట చిమ్మే నిరాశను మాటల్లో పొదిగితే..

లాయిరీ నడి సంద్రములోనా
లంగరుతో పనిలేదోయ్
సుడిలో దూకి ఎదురీదక
మునకే సుఖమనుకోవోయ్

* విద్దెల తల్లి ముద్దుబిడ్డడి మనసున ఆయమ కొలువున్న తీరు చెప్పిన సౌరు..

మది శారదాదేవి మందిరమే..
కుదురైన నీమమున కొల్చేవారి మది.. శారదాదేవి మందిరమే!
                          ***

సూర్యుడికి దివిటీ పట్టడమంత అవివేకం.. మహా రచయిత, పుంభావ సరస్వతి, బహుభాషాకోవిదుడు, అజాతశత్రువు, కీర్తిశేషులు శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారిని గురించి పరిచయవాక్యాలు రాయడమంటే. చంద్రునికి నూలుపోగు సమర్పించడమంత అల్పాత్యల్పం వారి వైదుష్యాన్ని పొగడడమంటే..

"వచన రచనకు మేస్త్రి - రామకృష్ణ శాస్త్రి" అని ఆంధ్ర సాహితీ లోకం జేజేలు పలికిన మల్లాది వారి కథలు, హాస్య వ్యంగ్య ధోరణిలో పలువురు కవి మిత్రుల గూర్చి మల్లాది వారు రాసిన వ్యాస సంకలనం చలవ మిరియాలు, నా కవిమిత్రులు,  మణిదీపాలు, కిరణావళి గేయసంపుటం,  గోపిదేవి, బాల వంటి నాటకాలు,   హంస వింశతి, రాధికా స్వాంతనము వంటి తెలుగు కావ్యాలకు వారు రాసిన పీఠికలు.. తెలుగువారి భాగ్యాల కొలనులో పూచిన పొందామరలు. తేట తెలుగు ఉనికిని నిబిడీకరించిన మాధురులు.

2005లో మల్లాది వారి శతజయంతి సందర్భంగా.. ప్రముఖ రచయితలు వివిధ పత్రికలలో వ్యాసాలు, పద్యాలు, గేయాల రూపేణా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు పరమపదించినప్పుడు అర్పించిన నివాళులను, కొంతమంది ఈ తరం రచయితలు వారి గురించి రాసిన వ్యాసాలను "ఏ. పీ. సినీ రైటర్స్ అసోసియేషన్" వారు సంకలనంగా ప్రచురించారు. అదే "మణి దీపం". సంకలన బాధ్యతను సినీ గీత రచయిత కులశేఖర్ వహించారు. ఆ మణి దీపపు కాంతి రేఖల్లో కాసిని ఇక్కడ..

ఎనభై పేజీల ఈ పుస్తకంలో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జీవిత విశేషాలు, ఉషాపరిణయం అనే సినిమాకి వారి చేతి రాతతో రాసి ఇచ్చిన పాటలు, (కమలాకర కామేశ్వర రావు గారి దర్శకత్వంలో రావలసిన ఆ సినిమా ఎందువలనో షూటింగ్ వరకూ వెళ్ళలేదట) వీటితో పాటూ తాపీ ధర్మారావు, సముద్రాల రాఘవాచార్య, శ్రీ శ్రీ, పింగళి, ఆత్రేయ, ఆరుద్ర, సంగీత దర్శకుడు అశ్వథ్థామ, పీ బీ శ్రీనివాస్, రావి కొండల రావు, వేటూరి, భువన చంద్ర, కులశేఖర్ వరకూ ప్రతిఒక్కరు రాసిన ప్రతీ వ్యాసం మహ సొగసుగా మల్లాది కవిభాస్కరుని కాంతి పుంజాలను, వెన్నెల సోనల్లా ప్రతిఫలించాయి.

వ్యక్తిగా, స్నేహితునిగా, గురువుగా, రచయితగా, మార్గదర్శిగా, తలవంచని మేరుసమానుడిగా, చిరునవ్వు చెరగని చల్లని మనసుగా, తన బహుభాషా కౌశల్యాన్ని కానీ, శాస్త్రాలు నేర్చిన నేర్పరితనాన్ని కానీ, పుట తిరగేసే అవసరం లేని ధారణని కానీ ఈషణ్మాత్రమైనా గొప్పగా  ప్రదర్శించని నిగర్విగా మల్లాది వారి బహు పార్శ్వాలను వీరందరూ చూపిన వైనం చదివి తీరాల్సిందే.

"పోయినోళ్ళందరూ మంచోళ్ళు" అని వారి వెనుక వారిని పొగడడం లోకతీరు. కానీ రచనల విషయంలో వారి గుప్త సహకారాన్ని ప్రస్తావిస్తూ "నేను పక్కనే ఉంటాను కానీ, రచన అన్నగారి(సముద్రాల) పేరుమీదే సాగనీ, బ్రదర్!" అని శాస్త్రిగారు నిర్మాత దర్శకులతో అనేవారని, సముద్రాలే స్వయానా చెప్పారని ఆరుద్ర వెల్లడి చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వెండి తెరపై కావచ్చు, పుస్తకపు పుటల్లో కావచ్చు.. తన పేరు చూసుకోనవసరం లేదనుకునే కీర్తి కాంక్ష లేని రచయితను తాటిచెట్ల ప్రమాణంలో మనుషులు, సముద్రాలంతేసి వాళ్ళ మనసులూ ఉండే సత్తెకాలంలోనే కానీ, ఈ కాలంలో చూడం కదా!

ఇవన్నీ ఒక ఎత్తు, వ్యాసాల రూపేణా రచయితలందరూ మల్లాది వారిని సంస్మరిస్తూ రాసిన అచ్చ తెలుగు జోతలు మరో ఎత్తు. "ఏమి చక్కని భాష!! ఎంత అందమైన తెలుగు!!" అనుకోకుండా ఉండలేం. అవును మరి! రతనాల కోనలోకి సామాన్యుడు వెళ్ళి కొంగున ముడేసుకు వచ్చిన ముడి రంగు రాళ్ళకీ,  రత్నకారుడు ఏరి తెచ్చి, బహుచక్కని చెక్కడపు పసిమి నగలో పొదిగిన జాతిమణికీ తేడా ఉంటుంది కదా! మల్లాది వారి రచనలను, వారి వ్యక్తిత్వాన్నీ ప్రముఖ రచయితల విశ్లేషణగా వినడం మనోరంజకంగా ఉంది. ఈ పొత్తానికి మణిదీపమన్న పేరు సార్ధక నామమనిపిస్తుంది.



"ఈ పుస్తకం బాగుంది" అని చెప్పి ఊరుకోకుండా, నేను చదువుతున్నప్పుడు తళుక్కుమని మెరిసి నా మనసు రంజిల్ల జేసిన కొన్ని వాక్యాలను ఇక్కడ రాయకుండా ఉండలేకపోతున్నాను.
                    
"ప్రభుత్వం అనకపోయినా ప్రజాదృష్టిలో ఆయన ఒక మహోపాధ్యాయుడు. పానగల్ పార్కులో వారు విశ్రమించే చెట్టొక బోధి వృక్షం. వారు కూర్చునే రాతిబల్ల అధ్యక్ష పీఠం. అక్కడ మదన శాస్త్రం నుంచీ మంత్ర శాస్త్రం దాకా వారు బోధించేవారు." - సముద్రాల రాఘవాచార్య

"కవికుల పిత
రసికుల నేత" - ఆత్రేయ

"ఆయన నవీన నాగరికతకు దూరుడు కాదు. కానీ సిగరెట్టు ఆయన కథల్లో 'శ్వేత కాష్ఠమై'పోతుంది. కాఫీ 'తిక్తమధురమై'పోతుంది." - పాలగుమ్మి పద్మరాజు

"విశ్వకోశానికి కాళ్ళు రాగా వీరై నడిచింది. ఎవరేదడిగినా ప్రమాణయుక్తంగా ఆశువుగా ప్రవచించగల ప్రజ్ఞాశాలి" పీ.బీ. శ్రీనివాస్

"తన రచనలు తాను భద్రపరచని గుణం సాహిత్యపరులలో కొద్దో గొప్పో చాలామందికి ఉంది కానీ, ఈ విషయంలోనూ రామకృష్ణ శాస్త్రిగారు మాంచి మోడలిస్టు." జరుక్ శాస్త్రిగారి నిష్టూరంతో నిండిన ఆవేదన.

"మల్లాది సీంబాదంపప్పు, కలకండ కలేసి తిన్నట్టుండే తియ్యటి పాటలు రాసారు" - ఎం వీ ఎల్

"గరుడపచ్చమాలలు అల్లినట్టుండే హస్తాక్షరి వారిది. ఒక సారి పాట రాస్తే సవరణ ఉండదు. "పాట అర్ధం కాకపోతే నువ్వు నీ చూపు మార్చుకో, తెలుగు నేర్చుకో, అంతే కానీ పాట మార్చమనకు" అన్న నిరంకుశుడాయన." - వేటూరి మాటల్లో "హంసపాదెరుగని వలరాజహంస" మల్లాదివారు.

"చెలువారు మోమున లేలేత నగవుల కలహంస నడకల కలికీ ఎక్కడికే?" అని సరళంగా రాసినదీ ఆయనే. "సామగ సాగమ సాధారా! శారద నీరద సాకారా! ధీరాధీనా ధీసారా!" అని గ్రాంధిక గుంఫనతో రాసినదీ ఆయనే." - రావి కొండలరావు.


"శ్రీశ్రీ ని ఆవాహన చేసుకుని విప్లవకవిత్వాన్ని, కృష్ణ శాస్త్రిని ఆవాహన చేసుకుని భావకవిత్వాన్నీ వ్రాయచ్చేమోగాని మల్లాది వారి మనసుని ఆవాహన చేసుకోడం ఇంపాజిబుల్." - భువనచంద్ర

"కొదమ షట్పదం కృష్ణ గీతాలాలపిస్తూనే వుంది
కరాగ్ర ధూమ శిఖ కవనబోధ చేస్తూనే వుంది
కృష్ణ రసాన్ని, కృష్ణసాన్ని తెలుగువాడికి పరిచయం చేసిన ఘనత మీది" - కులశేఖర్

ఇవి మచ్చుకు మాత్రమే! ఇల విడిచివెళ్ళిన రాజహంసను తలుచుకు నొచ్చిన తెనుగు మనసు, వారి కైతల కాన్కలను తలుచుకుని దాశరధి మాటలకు ఔనని తల ఊచి తీరుతుంది.

ఆంధ్ర జనులార! మీ హృదయాంగణముల
మల్లెపందిళ్ళువేసి యా మండపముల
మల్లెకన్న మెత్తని మనసులుల్లసిల్ల
సరసు మల్లాదిని ప్రతిష్ఠ సలుపుడోయి

("మణిదీపం" - వెల రూ. 50/-, అన్ని ప్రముఖ పుస్తక విక్రయ శాలలయందూ, ఏవీకేఎఫ్ లోనూ లభ్యం.)

14 comments:

  1. చేసిన పాపం చెబితే పోతుంది అంటారు కదా.. నాకీ పుస్తకం వచ్చిన విషయమే తెలీదు.. తెలియ జెప్పినందుకు మీకెన్ని థాంకులు చెప్పుకున్నా తక్కువే..
    ఎప్పుడెప్పుడు చదువుదామా అని ఉంది నాకు.. మీ టపా గురించి ప్రత్యేకంగా చెప్పాలంటారా? :-)

    ReplyDelete
  2. Thanks a ton for this post. I came to know about this sometime back but couldn't get a copy.

    మీరు ఇలాంటి అపురూప పుస్తకాల గూర్చి రాయబూనినప్పుడు పుస్తకం సైటు గుర్తు రావాలంటే మేమేం చేయాలో తెలియజెప్పగలరు. :) ప్రస్తుతానికి ఈ పోస్టు లింక్‍ను పుస్తకం.నెట్‍లో ఇస్తున్నాను.

    ReplyDelete
  3. చాలా మంచి పుస్తక పరిచయం చేసారు. ఈ "అఙ్నాతకవి" కి 50 భాషలు తెలుసునట!
    గిరిజాకళ్యాణం కూచిపూడి యక్షగానం ఆయన వ్రాసిన వాటిలో నేను అత్యుత్తమమయినదిగా తలుస్తాను.RIP

    ReplyDelete
  4. మంచి పుస్తక పరిచయం! ఈసారి పుస్తకాల షాప్ లో చూస్తాను.

    ReplyDelete
  5. మల్లాది వారి గురించి అయితే తప్పకుండా చదవాలి ఈ పుస్తకం. పుస్తకాన్ని పరిచయం చేసిన విధానం బాగుంది.

    ReplyDelete
  6. మీ టపాలు వినిపించినప్పుడల్లా మా నాన్నగారు "ఇంత చక్కని భాష ఎలా రాస్తున్నారో ఈవిడ" అనడం. నేను ఏమో మరి అనడం జరిగేవి.
    ఇప్పుడర్ధమైంది మీ భాష వెనుకున్న గురువెవరో

    ReplyDelete
  7. //మీ టపాలు వినిపించినప్పుడల్లా మా నాన్నగారు "ఇంత చక్కని భాష ఎలా రాస్తున్నారో ఈవిడ" అనడం. నేను ఏమో మరి అనడం జరిగేవి.
    ఇప్పుడర్ధమైంది మీ భాష వెనుకున్న గురువెవరో //
    excellent comment...i feel the same...

    ReplyDelete
  8. ఆయన భాష - ఆంధ్రికి వరమైనది. అధిక చక్కనిది.
    ఆయన గుఱించి చెప్పుకోవాలంటే మళ్ళీ ఆయన మాటల్నే గుర్తు చేసుకోవాల్సి వస్తుంది మఱి.

    ReplyDelete
  9. మురళి గారూ, ధన్యవాదాలు. చదివాక మీ అభిప్రాయం టపా రాస్తారు కదూ!

    పూర్ణిమ గారూ, అయ్యో! ఎంతమాట. తప్పకుండా పుస్తకం డాట్ నెట్ ని గుర్తుంచుకుంటానండీ. ధన్యవాదాలు.

    చాతకం గారూ, మీక్కూడా గిరిజా కల్యాణం ఇష్టమా! భలే!! నాకు ప్రాణం. అవునండీ, మల్లాదివారికి నేపాళ భాష తో సహా చాలా భాషలు తెలుసునట.అజ్ఞాత కవి పేర వారు రాసిన వ్యాసాలు అచ్చులో ఉన్నాయేమో మీకు గానీ తెలుసా? ధన్యవాదాలండీ.

    కృష్ణప్రియ గారూ, తప్పక చదవాల్సిన పుస్తకమండీ. ధన్యవాదాలు.

    బులుసు సుబ్రహ్మణ్యం గారూ, ధన్యవాదాలు. చదవండి తప్పకుండా.

    ReplyDelete
  10. పక్కింటబ్బాయి గారూ, మీ అభిమానానికి చాలా సంతోషమండీ. ఏకలవ్య శిష్యులకి కొదవలేని పక్షపాతమెరుగని ద్రోణుడు కదండీ మల్లాదివారు. మీ తండ్రిగారికి నా ధన్యవాదాలు అందించండి. మీక్కూడా!

    ఎన్నెల గారూ! మీ అభిమానం! ధన్యవాదాలు.

    వేదుల బాలకృష్ణ మూర్తి గారూ, అవునండీ! ఆంధ్రికి పెట్టని నగ మల్లాది వారి రచన. ధన్యవాదాలండీ!

    ReplyDelete
  11. కొత్తపాళీ గారూ,

    భలే! మీరెప్పుడో చదివేసిన పుస్తకమన్నమాట. :)

    ReplyDelete
  12. సుస్మితా, కొన్ని పోలికలను రాసేముందు జాగ్రత్తగా సరి చూసుకోవాలి.
    "మల్లాది కవిభాస్కరుని కాంతి పుంజాలను, వెన్నెల సోనల్లా ప్రతిఫలించాయి." - అని రాశారు. ఇది మహా దుష్ట ఉపమానం. దీనికి మీ ఆమోదం ఉండి ఉండవచ్చు గాక. మీరు మంచి రచయిత్రిగా పరిణతి సాధించే క్రమంలో, ఇటువంటి ముఖ్యమైన దోషాలు సరిచూసుకోవాలనీ, సరిదిద్దుకోవాలనీ, మా వంటి పాఠకుల అభిలాష.

    ReplyDelete
  13. అనానిమస్ గారూ,

    ఆ వాక్యం దుష్ట ఉపమానం ఎలా అయిందో నా ఊహకి రెండు కారణాలు తోచాయి. (మీరు వివరణ ఇవ్వనందువలన.)

    మొదటిది భౌతికమైన అర్ధం. "కవులు రాసిన వ్యాసాలు మల్లాది కవి భాస్కరుని కాంతిపుంజాలను వెన్నెల సోనల్లా ప్రతిఫలించాయి". కవి భాస్కరుడని మళ్ళీ వెన్నెల సోనలు అన్నాను కదా! ఇక్కడ కవులని చంద్రునితో పోల్చానని మీకు అర్ధమై ఉండదని అసలు అనుకోను. కనుక అది కాదు.

    రెండోది వాక్యపు ఆత్మ. ఇక్కడ ఓ విషయం ముచ్చటించాలి. మల్లాది వారు విశ్వనాథ వారి గురించి ఇలా రాసుకున్నారు. "ఈ కవితా విశ్వానికి నిన్ను నాథుణ్ణి చేస్తాను.. సరేకదూ.." అని ఆదిమూర్తి ఆ పసికందును లాలించి ఉంటాడు.. సత్యమే.. సవితృమండల మధ్యవర్తిలా .. ఆ దీవెనల బలాన.. సాక్షాత్కరించి ఉంటాడు: శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారు.. నవీనులందరిలోనూ .. నిజంగా అన్వర్థాభిధానులు." అని. సాటి కవి గురించి ఎంత గొప్పగా, సొగసుగా, సౌకుమార్యం చిప్పిల్లేలా రాసుకున్నారో చూడండి. ఇలాంటి ఒక్క వాక్యమూ మల్లాదివారిని గురించి సముద్రాలవారితో సహా ఏ ఒక్కరూ రాయలేకపోయారే అని చిన్న లోటు. అయితే మహానుభావుల గురించి తేలిక చేసి రాసేసేంతటిదాన్ని కాను. పరుషం పలకలేను. అందుచేత శ్లేష వాడి రాసుకున్నాను. మల్లాది కవిభాస్కరుని తీక్ష్ణత మిగిలిన వారికెలా అబ్బేను! అయితే కవిత్వాన్ని పొగడాలంటే కవిత్వమే రాయక్కర్లేదు కదా! "ఆహా..!" అని చిన్ని వెన్నెల సోనలు మాత్రమే కురింపించారు ఈ పుస్తకంలో కవులందరూ. ఇదీ నా అభిప్రాయం. ధన్యవాదాలు.

    ReplyDelete