Thursday, February 14, 2013

అనగనగా ఓ ప్రేమకథ

"కోట ఎదురుగా ఉదయం తొమ్మిదింటికి కలుస్తాం. నువ్వేమో బస్సో, రైలో దిగి బయటికి వచ్చి అటువైపు వచ్చే ఆటో ఎక్కుతావ్."
"ఊ.."
"కూరలమ్మే వాళ్ళ హడావిడి, వేసవి చిరచిర..."
"లాల్చీ చివర్లతో మొహం తుడుచుకుంటూ నేను.." నవ్వాడు.
"లాల్చీ? నువ్వు టీషర్ట్ వేసుకుంటావనుకున్నాను."
"యంగ్ గా కనిపించాలనా? ఓకే ఓకే.."
"లాల్చీ బావుంటుందన్నానని కూరల మార్కెట్టుక్కూడానా.."
"నేను మీ ఊరొస్తున్నది కూరల మార్కెట్టుక్కాదేమో.. ?"
"గుడికో గోపురానికో కూడా కాదు. సర్సరే.. విను.."
"ఊ ఊ"
"మా వీధి చివర స్కూల్ జంక్షన్లో నిలబడి ఆటో కోసం చూస్తూంటాను.."
"రిష్కా కాదా?"
"ఉహూ.. రిష్కాల్లేవు గా. ఉన్నా ఒకటో అరో.. అయినా టైమైపోతూంటేనూ.."
"ఊ.. ఆటో దిగి.."
"ఉహూ.. ఇంకా నాకు ఆటో దొరకలేదు. స్కూల్ వేళ కదూ.. మొత్తానికో షేరింగ్ ఆటో పట్టుకుని కలువపువ్వు మేడ దగ్గర దిగుతాను."
"నేనొచ్చేదీ అక్కడికేనా?"
"కాదు బాబూ కోటకి. నాకింకా ఇక్కడి నుంచీ మరో పది నిమిషాల ప్రయాణం ఉంది. ఈ జంక్షన్ లో దిగానంతే."
"ఊ.. ఇంకా ఎంత సేపూ.." విసుగ్గా అడిగాడు.
"ఎదురుచూడవోయ్.. ఇన్నాళ్ళాగావా లేదా? మరో పదినిముషాల్లో కలుస్తున్నామంటే కంగారు పడతావేం?"
"చూస్తానమ్మాయ్.. చూస్తాను. ఇంతకీ ఎందాకొచ్చావ్?"
"కలువపువ్వు మేడ దగ్గర నుంచీ మరో ఆటో పట్టుకుని మెయిన్రోడ్ దగ్గర దిగిపోతాను. అక్కడికి ఇంకెంతా.. పదడుగుల దూరం. అప్పటికే నువ్వొచ్చేసుంటావా అని మొబైల్ లో టైం చూసుకుంటూ.."
"అటూ ఇటూ చూసుకుంటూ.. తెలిసినవాళ్ళెవరూ కనిపించకూడదని కోరుకుంటూ.. " అందించాడు.
"చూసినా పలకరించకుండా ఉంటే చాలు. ఈ లోగా అటుగా వస్తున్న ఏ ఆటోలోంచో నువ్వు తొంగిచూసి, నా గాభరా మొహాన్నీ, నా తింగరి నడకనీ.. చూసేస్తావేమో అని భయపడుతూ... కారిపోతున్న చమట చున్నీతో తుడుచుకుంటూ.. హహ్హా.. భలే అన్రొమాంటిక్ కదూ నేనూ!"
"డౌటా? నువ్వు పరిగెత్తుకొచ్చి నా భుజం ఫెడీల్మనిపించి పలకరిస్తావనుకుంటున్నాను. నిజంగా అంత టెన్షన్ పడతావా..?"
"పడతాననే అనుకుంటున్నాను. చిన్నప్పుడు పరిక్షకి బయలుదేరేముందు ఏదో గాభరాగా ఉండేదీ.. తిన్నది కక్కేసుకుంటానేమో అన్నట్టు.. అరచేతుల్లో చెమటలు పట్టేస్తూ.. కనీసం అలా అయినా ఉండదంటావా?"
"ఊ.. ఊ.." నవ్వుకున్నాడు.
"అసలేం తినను ఆ రోజు ఉదయం. సగం టెన్షన్ ఉండదప్పుడు."
"ముందే చెప్పి రక్షించావ్.. నేను సుష్టుగా బ్రేక్ఫాస్ట్ చేసే వస్తానైతే. నీతో పెట్టుకుంటే మాడ్చేసేలా ఉన్నావ్."
"తిను తిను.. కాదన్నానా? కాంప్లెక్స్ ఎదురుగా హాస్పిటల్ కనిపిస్తుంది. ఆ పక్కనే మయూరీ టిఫిన్స్. దోశ భలే ఉంటుందిలే. తినేసి రా పోనీ!  ఓయ్.. లేట్ చెయ్యకు."
"ఊ.. ఇంతకీ వచ్చాక ఎలా పలకరిస్తావ్ నన్నూ.. హాయ్ అనా, హలో అనా.. ఏమైనా ఆలోచించావా?" నవ్వుకుంటూ అడిగాడు.
"మూడుకోవెళ్ళు దాటగానే.. కోట కనిపించేసరికి.. చల్లబడిపోతానో క్షణం! తప్పేదేముందని మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, అక్కడున్నది నువ్వే కదా అనుకుంటానన్నమాట. నీకూ ఇలాగే ఉంటుందా? ఎలా పలకరించాలి.. హాయ్ అనా, నవ్వాలా? నవ్వొచ్చేస్తుందిలే.. అవునూ.. ఎవరు ఎవర్ని చూస్తాం ముందు?"
"నేను అప్పటికే వచ్చి ఎలెక్ట్రిక్ పోల్ లా ఎదురుచూస్తూంటే నువ్వు పలకరిస్తావు. నువ్వొచ్చి కాళ్ళు తొక్కేసుకుంటూ దిక్కులు చూస్తూంటే నేను పలకరిస్తాను."
"పెహ్.. నీతో చెప్పడం నాదీ బుధ్ది తక్కువ. అద్సరే కానీ, నేను సరిగ్గా కోట దగ్గరికి వస్తూండగా మొబైల్ కనుకా మోగిందో.. అప్పుడుంటుంది అసలు టెన్షన్."
"ఎందుకూ.."
"అది నీ కాల్ అయితే ఒక టెన్షన్, ఇంకెవరైనా అయితే మరో టెన్షన్... బాబోయ్.. నేనింకేం ఆలోచించను. నువ్వొచ్చేయ్.."
"హమ్మయ్య! ఇదిగో ఓయ్.. వస్తున్నది 'నేను'. నేనే కదా..! ప్లీజ్.. కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు. సరేనా?"
"ఊ.."

                                           *****

బస్ కాంప్లెక్స్ లోకి తిరుగుతూండగా తెలివొచ్చింది అతనికి. "నిద్రమొహమా అని తిడుతుంది." నవ్వుకున్నాడు.
"ఇలా తీసుకొస్తున్నాడేంటో.. వెనకవైపు నుంచీ.." పక్కన కూర్చున్న పెద్దమనిషి మాటలు విని బయటికి చూశాడు. బస్ డిపోలో ఆగింది.
లేచి బ్యాగ్ తీసుకుని అతన్నే అడిగాడు. "సర్, కోట వైపు వెళ్ళే ఆటోలు.."
"దిగి తిన్నగా కుడిచేతివైపు వెళ్ళండి. అటు వైపు ఎంట్రన్స్ లో కనిపిస్తాయ్."

దిగి నడుస్తున్న అతనికి వాతావరణం తేడాగా అనిపించింది. హడావిడిగా తిరుగుతున్న మనుషులు, కాంప్లెక్స్ బయట బారికేడ్, పోలీసులు, గోలగోలగా వినిపిస్తున్న సైరన్లూ.. ఏ మినిస్టరైనా వస్తున్నాడేమో! నిలబడి మాట్లాడుకుంటున్న ఓ ఇద్దరి దగ్గరికి వెళ్ళి "ఏంటండీ హడావిడీ, ఆటోలేం అటు వెళ్ళవా? బారికేడ్ కట్టేసి ఉందీ?" మొబైల్ జేబులోంచి తీసి టైం చూసుకుంటూ అడిగాడు. ఎనిమిదీ నలభై..
"లేదండీ, అటు వైపు యాక్సిడెంట్ అయింది. ఎదురుగా ఉన్న హాస్పిటల్ కి తీసుకొస్తున్నారు వాళ్ళని."
"యాక్సిడెంట్? ఏమయిందీ? ఎటువైపు?"
"పెద్దదేనండీ. గేస్ సిలెండర్ల వేన్ ని, వెనకనుంచి లారీ గుద్దేసిందట. సిలెండర్లు పేలిపోయాయంట. బాగా డేమేజి అయిందంటున్నారు. అటువైపు స్లమ్స్ మీద నిప్పురవ్వలు పడి ఇళ్ళంటుకున్నాయని చెప్తున్నారు. సిలెండర్లు పేలినప్పుడు కొందరు పోయారంట పాపం! వస్తున్నాయ్ ఆంబులెన్స్ లు. ప్చ్.. లేచిన వేళ."
తడారిపోతున్న గొంతుతో అడిగాడు "ఎక్కడ జరిగిందండీ.. ఈ యాక్సిడెంట్?"
"కలువపువ్వు మేడ దగ్గర.." ఆ మాటలు అతనిలో సత్తువని పీల్చేసుకుంటున్నాయ్..

క్షణంలో తేరుకుని మొబైల్ తీసి కాల్ చేసాడు. రింగవుతున్న శబ్దం. మోగి మోగి ఆగిపోయింది. చెమటలు పట్టేశాయతనికి. మళ్ళీ రింగ్ చేస్తూ గాభరాగా అడిగాడు.
"వేరే వైపు నుంచి వెళ్ళచ్చాండీ? కోట వైపు వెళ్ళాలి.. అదే కలువపువ్వు మేడ వైపు.."
"దిగ్బధనం చేసేశారు చూసారు కదా. ఎవరైనా ఉన్నారా అక్కడా?" మాటలాపి, పాలిపోతున్న అతని మొహం వైపు చూసారిద్దరూ.
"ఏమోనండీ, అటు వైపునుంచి వస్తారని తెలుసు. ఏం అయి ఉండదులెండి. వెళ్ళాలి" ఆపకుండా కాల్ ప్రయత్నిస్తూనే, భుజాన వేసుకున్న బ్యాగ్ తీసి మరో భుజానికి మార్చుకుంటూ "పోనీ, పోలీస్ ని అడిగితే.." అనుకుంటూ నడిచాడు.
"లేదండీ, అలా వెళ్ళలేరు." చెప్పేశాడు పోలీస్.
కాంప్లెక్స్ కి ఎదురుగా ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లోకి గోలగోలగా దూసుకెళ్తున్న ఆంబులెన్స్ లు, పోలీస్ వేన్ లూ.. గుంపులు గుంపులుగా నిలబడి మాట్లాడుకుంటున్న జనం. తను ఫోన్ ఆన్సర్ చెయ్యడం లేదు.
"దెబ్బలు తగిలుంటాయా? ఏమోలే అసలు వీధిచివర ఆటో దొరికి ఉండకపోయుండచ్చు. మరి ఫోన్..? పికప్..." పెదాలు బిగించి మళ్ళీ ట్రై చేస్తున్నాడు. సన్నగా వణుకు మొదలయ్యింది అతనిలో.
"ఛ ఛా.. ఏం అయి ఉండదు. ఈ హడావిడికి రింగ్ అవడం వినిపించలేదేమో!" ఈ ఆలోచన బావుంది.
క్షణాలు దొర్లుతున్నాయ్.. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఫోన్ మోగుతూనే ఉంది. చెమట నుదుటి మీద పరుచుకుంది. అసహనంగా తిరుగుతూ మొబైల్ వేఫు చూసుకుంటున్నాడు.

చల్లగా చేతిని తాకిన స్పర్శకి తుళ్ళిపడి వెనక్కి చూశాడు. పాలిపోయిన మొహంతో అయోమయంగా చూస్తూ నిలబడింది. మాటరాలేదు.
"హమ్మయ్య!" చటుక్కున తనని బంధించిన అతని చేతులన్నాయీ మాట. "థాంక్ గాడ్!! " అన్నాడు తేరుకుంటూ.. ఇంకా అలాగే చూస్తోంది.

"పద, అలా కూర్చుని మాట్లాడుకుందాం.. " చెయ్యి పట్టుకుని నడిపించాడు కాంప్లెక్స్ లోకి. ఎక్కడా కూర్చోడానికి వీలు లేనంతమంది ఉన్నారక్కడ. బస్ దిగిన వారెవరూ ఊళ్ళోకి వెళ్ళలేదు మరి. బస్సులాగి ఉన్న వైపు నడిచి ఓ బస్ ఎక్కి కూర్చున్నారిద్దరూ..

"ఏమయింది. కోట వైపు వెళ్ళాలి కదా. ఇటెలా వచ్చావ్?" తన చేతిలో బిగుసుకుని ఉన్న ఆమె చేతిని నెమ్మదిగా రాస్తూ అడిగాడు.
"ఊ.. " కలలోంచి తేరుకున్నట్టు చూసింది. కళ్ళలో జివ్వుమని ఎగిసిన నీళ్ళు.
"ఏమైందమ్మా? ఆర్ యూ ఓకే?" వీపు మీద నిమురుతూ దగ్గరకి తీసుకున్నాడు.
జలజలా జారిపోతున్న కన్నీళ్ళతో బుగ్గలు తడిసిపోతున్నాయ్. కాసేపటికి తేరుకుంది.

" నీకు సర్ప్రైజ్ ఇద్దామని కాంప్లెక్స్ కి వద్దామనుకున్నాను. చెప్పావు కదా బస్ కే వస్తున్నానని. వీధి చివర మూర్తంకుల్ కనిపించారు. కాంప్లెక్స్ వైపే వెళ్తారాయన. లిఫ్ట్ అడిగాను. కలువపువ్వు మేడ దగ్గరికి వస్తూండగా మెయిన్ రోడ్ మీద నుండి వస్తున్న లారీ, గొడౌన్ లోంచి రివర్స్ తీసుకుంటున్న వేన్ ని గుద్దేసింది.. సరిగ్గా మా వెనక..! పడిపోయాం ఆ శబ్దానికి భయపడి. సరిగ్గా మాకు ఏభై అడుగుల దూరంలో ఇదంతా.. మూర్తంకుల్ లేచి బండి తీసారు. ఎలా ఎక్కానో గుర్తు లేదు." సన్నని వెక్కిళ్ళలోకి దిగిపోయింది.

"థాంక్ గాడ్..!! ఏడవకు. కళ్ళు తుడుచుకో.." వాటర్ బాటిల్ తీసిచ్చాడు.
లేచి బస్ దిగి మొహం కడుక్కుంది. మిగిలిన నీళ్ళు తాగి చున్నీతో మొహం తుడుచుకుంటూ.. పేలవంగా నవ్వింది. "చాలా పెద్ద యాక్సిడెంట్ కదూ! వెనక్కి చూస్తూనే ఉన్నాను బండి మీద కూర్చుని. పడిపోతానేమో అనుకున్నా దారిలో ఎక్కడో.."
"ఊ.."
"చాలా మందికి దెబ్బలు తగిలుంటాయ్.." ఆంబులెన్స్ సైరన్లు వినిపిస్తున్న వైపు చూపిస్తూ అంది.
"ఊ.. పెద్ద యాక్సిడెంటే.." ఇంకేం చెప్పలేదతను.
ఏదో ఆలోచిస్తూ నవ్వింది.
"ఏమయింది?"
"ఒకే ఒక్క క్షణం ఒక ఆలోచన వచ్చింది."
"ష్.. ఏం మాట్లాడకు.." వారించాడు.
"ఉహూ.. కాదు. అది కాదు. నేను సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నట్టే నువ్వూ ఏ కలువపువ్వుమేడ దగ్గరో వచ్చి ఉండి ఉంటే?!"
"ఉంటే.. ఇందాకా నేను పడ్డ టెన్షన్ నువ్వు పడేదానివి. అద్సరే నీ ఫోన్ ఏదీ? మీ మూర్తంకుల్ ఏరీ?"
"నన్ను సగం దూరంలో దింపేసి వెంటనే వెనక్కి వెళ్ళారాయన. నా హేండ్ బ్యాగ్ రోడ్ మీద పడిపోయినట్టుంది. చూసుకోలేదు."
"పోన్లే, నువ్వు క్షేమంగా ఉన్నావ్. చాలు." చేతిమీద చెయ్యి వేసి నొక్కాడు.
"పాపం ఎంతమందికి దెబ్బలు తగిలుంటాయ్ కదా! మనకి స్వార్ధం. మనం బాగుంటే చాలు." బాధగా చెప్పింది.
"అదంతే. మానవ నైజం. డిసెక్ట్ చేసి మనసు పాడుచేసుకోకు. మనం చెయ్యగలిగిందేం లేదిక్కడ. కదా? పద అలా బయటికి వెళ్దాం.. రెండో వైపు ఏదైనా దారి ఉందా? ఊళ్ళోకి కాకుండా ఇటు వైపు.. ఆకలి దంచేస్తోంది." నడిచాడు.

                                        *****

"ఏయ్ మనం వెంటనే పెళ్ళి చేసేసుకుందామా?"
"ఓ యెస్, కానీ ఎందుకూ?" నవ్వాడు.
"ఎందుకేంటీ? పో..! ఏయ్.. నిజం చెప్పూ, నాకేదైనా అయితే అని బెంగ పడలేదా నువ్వూ? అనిపించింది. చెప్పాను." నొచ్చుకుంది.
"సరే అన్నాను కదా! ఇవాళ తీసుకుపోనా పోనీ..? తప్పనిది ఎప్పుడైతేనేంటి? కానీ...కానీ.. "
"నాకేం అక్కర్లేదులే. నిజానికి నువ్వు నా వెంటపడాలి.. ఇంతోటి అందగాడివనీ.."
"అందం కొరుక్కు తింటామా ఏంటీ? అందుకేగా నిన్ను ప్రేమించిందీ.." కవ్వించాడు.
"పోవోయ్.. నా కంటే అందగత్తె కావాలా నీకూ? ఏం చూసుకునీ నీకింత పొగరూ?" అతని భుజం మీద లేని గోళ్ళతో గిచ్చింది.
"స్స్.. రాక్షసీ, గోళ్ళు లేకుండానే ఇంతలా గిల్లేస్తున్నావ్. ఏం చూసుకునా..? మా ఊళ్ళో నాకు ఇల్లుంది తెలుసా? కొబ్బరి తోపులో డాబా ఇల్లు. హాయిగా చుట్ట కాల్చుకుంటూ కరణీకం చేసుకు బతికేయచ్చు."
"చుట్టా! యాక్.. నేన్నిన్ను చేసుకోను ఫో.."
"హమ్మయ్య..! బతికించావ్"
"....."
"అయినా నీలాంటి దాన్ని చేసుకుంటే ఆ డాబా మీద నుండి నన్ను తోసేస్తావేమో అని అనుమానం." ముడుచుకున్న పెదాలవైపు చూసి నవ్వుకుంటూ చెప్పాడు.
"నేనా! ఎందుకూ.. ?" కళ్ళు పెద్దవిగా చేసింది.
"చంద్రుడిలో ఉన్నది పేద రాశి పెద్దమ్మ అని నువ్వూ, కుందేలని నేనూ కొట్టుకుంటాం కదా!"
"హహ్హహా.. రెండూ కాదు. జాగ్రఫిక్ డిఫెరెన్స్. మోస్ట్ ఇగ్నొరెంట్ ఫెలోవి నువ్వు."
"చూశావా.. ఇంకా నేను నిన్ను అన్రొమాంటిక్ అనే అనుకున్నాను. ఇంత మేధావివి కూడానా! నాకొద్దు బాబోయ్!"
"నిన్నూ...." కాళ్ళు నేలమీద కొడుతూ అరిచింది.

సాయంత్రం దాకా తిరిగీ తిరిగీ అలిసిన కాళ్ళు లాగేస్తూంటే, ఓ కల్వర్ట్ మీద కూలబడ్డారిద్దరూ. గాలి ఉండుండీ వీస్తోంది. చీకట్లు పల్చగా కమ్ముకుంటున్నాయ్.
"అటు చూడూ..." చూపించాడు.
దూరంగా చీకట్లో చప్పుడుచేసుకుంటూ వెళ్తున్న రైలు పెట్టెలు మిణుగురుల్లా మెరుస్తూ మాయమయ్యాయ్.
"ఓయ్.." పిలిచింది అతని భుజానికి తల ఆన్చి..
"ఊ.."
"ఐ లవ్ యూ అబ్బాయ్.."

12 comments:

  1. బావుంది. వాలంటైన్స్ డే స్పెషల్!

    ReplyDelete
  2. Love is in the air it seems..

    మీ టపా గురించి చెప్పడానికి ఏముంటుందండీ కొత్తగా....
    ఎప్పటిలాగే బ్రహ్మాండం...

    ReplyDelete
  3. ఒహో...అదా కథా !!

    ReplyDelete
  4. కొద్దిగా సినిమాటిక్ గా ఉన్నా, మొత్తానికి సుపర్బ్.. చాలా..చాలా.. బావుంది...

    ReplyDelete
  5. బాగుందండి.

    ReplyDelete

  6. లాల్చీ! :)

    బ్రహ్మాండంగా లేదు.. సినిమాటిక్‌గా కూడా లేదు.. కానీ నాకు బావుంది!

    ఉద్విగ్నత.. ఎదురుచూపులు.. ఆందోళన.. ఉపశమనం.. బాధ.. చిలిపితనం...
    అన్నీ కొంచెం కొంచెంగా మిళితమై.. చివరాఖరిగా ఆ మాజిక్ సెంటెన్స్!
    ప్రేమకధకి ఇవి చాలు! అంటే మనం రిలేట్ చేసుకోడానికి ఇవే సరిగ్గా సరిపోతాయి!

    పెద్ద పెద్ద ట్విస్టులు.. ఆపైన డ్రమాటిక్ సుఖాంతాలు.. ఎప్పుడూ ఇవే అక్కర్లేదు!

    ReplyDelete
  7. మీరు కూడానా... మీ నుంచి ఎక్స్‌పెక్ట్‌ చేయని స్టోరీ. ఆలస్యంగా చూసినా సరే.

    ReplyDelete
  8. ఐ మీన్... ఇలాంటి వాటికి మాలాంటి బచ్చాగాళ్ళుంటారు కదండీ...

    ReplyDelete
  9. good show.
    మధ్యలో ఇంక నేరెటివ్ లేకుండా, కేవలం డయలాగ్ తో రాసి ఉండాల్సింది, శ్రీపాదవారి జంటల కథల్లాగా .. ఇంకా కత్తిలా ఉండేది.
    Interesting arrangement of scenes .. starting with nailbiting suspense and then easing off into a casual stroll.

    ReplyDelete
  10. kadha chaala bagundi...chaala samvatsaraala tarvaata vizianagaram gurtu cheseru..okasari ooru chusinattu anipinchindi...

    ReplyDelete