Tuesday, June 4, 2013

అలమండ రాజుగోరి గానమైన బేపి కత

'ఎంత ఎద్దైనా గిద్దెడు పాలైనా ఇవ్వకపోతుందా?' అన్నంత ఆశపడ్డాను.. దాని పేరు విని. కథ కొసాకూ మానికెల కొద్దీ సుద్దులు మాత్రం గరిపి పంపింది.

దాని ప్రవరేమైనా ఆషామాషీ అనుకున్నారా.. తాండ్ర వారింట పుట్టి, చెలికాని వారింట కొన్నాళ్ళు పెరిగి, ఉప్పలపాటి వారింట పెద్దై.. కాకర్లపూడి వారి మన్ననలందుకుంది. "చెవులు రిక్కించుకుని, తోక నిగిడించి, బోర విరుచుకుని నడుస్తూంటే.. చూసి తీరాలోయీ.. నల్ల పులోయీ.. ఏనుగైనా అలా నిలబడిపోయి దానిని బయ్యం బయ్యంగా చూడవలసిందే!!" అని సొయానా దాన్ని సాకుతున్న రాజుగోరు చెప్తూంటే.. నల్ల సిందువల్లే నడిచొస్తున్న దాని రాచఠీవి కళ్ళక్కట్టేయట్లేదూ! అదే బొబ్బిలి... వీరబొబ్బిలి. అలమండ ఊళ్ళో, ఉప్పలపాటి ఫకీర్రాజు దగ్గర పెరుగుతున్న జాతి కుక్క. భీకరమైన వేటకుక్క.

గాలి తోటలోంచి దూసుకుని వస్తున్నది. రెండు నిముషాల్లో వేట జట్టంతా మళ్లీ మామిడితోటలోకి ప్రవేశించారు. ఎండిపోయిన ఆకులు కాళ్ళ కింద నలుగుతున్నాయి. తోటలో చీకటి మరింత గుబురుగా వున్నది. బొబ్బిలి ఒక్క లాగు లాగి పరుగు మొదలుపెట్టింది. పడమటివైపు నుంచి సడ్ సడ్ సడ్ మని ఏదో భారీజంతువు పరిగెడుతున్నట్టు చప్పుడు వినిపిస్తోంది. బొబ్బిలి గుర్రుగుర్రుమంటూ హడావిడి పడిపోతున్నది. దాని చెవులు రిక్కబొడుచుకుంటున్నాయి. మెడమీదా, మూపుమీదా దాని చర్మం అలలు అలలుగా విరుచుకుపడుతున్నది. అక్కడి జూలులోని వెండ్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఒక్క గుంజు గుంజింది. బొబ్బిలిని పట్టుకున్న గోపాత్రుడి చేతులోంచి తాటికొసలు జారిపోయాయి. బొబ్బిలి రెప్పపాటులో చీకటిలో కలిసిపోయింది.

వేటకుక్కలతోనూ, ఈటెలతోనూ జరిగే సేరీవేటకి బయలుదేరిన రాజులు.. తమను నడిపించి, వేట జంతువుని చూపించే విషయంలో తమ కుక్కల ఆఘ్రాణశక్తి మీద ఆధారపడతారు. కుక్క ఉరుకుని బట్టి, ఆవేశాన్ని బట్టి జంతువు ఎంత దగ్గరలో ఉందో వేటగాడికి అర్ధమయిపోతుంది. శిక్షణ పొందిన కుక్కలు వేటగాడికి జాగా ఇస్తూనే జంతువుని చుట్టుముట్టి నానా అల్లరీ పెడతాయి. అయితే ఆ రాత్రి వేటలో ఇంతల్లరి చేసింది కదా ఈ బొబ్బిలి.. ఈ కుక్క ఎంతుందో దీని గుండెకాయా అంతే వుంటుందన్నాడు రాజుగోరు. వేటపొలం మీద ఒంటి పంది దీని కంటపడడానికి వీలులేదు. పడిందో... దగ్గర ఏ చెట్టుంటే ఆ చెట్టెక్కేసి ఆ ఒంటిపంది కనుచూపు మేరలో లేకుండా వెళ్ళిపోయేవరకూ దిగదు. అంత జాగర్తయిన కుక్క. ఆరోగ్యం మా జాగ్రత్తగా కాపాడుకుంటుంది.. ఇదీ పాపం రాజుగోరి మాటే! భవిషం తీసీసేరు కదూ! బొబ్బిలీ.. బొబ్బిలి..!! ఆకారం భీకరం అసలు శూన్యం అంటే ఇదేనన్నమాట!

చిలుకలూ, గోరువంకలు లగాయితూ పశుపక్ష్యాదులచేత మాట్లాడించడం, సుద్దులు చెప్పించడం కవిగారు రాసే కావ్యమన్నాక చాల బోలెడు సందర్భాల్లో కద్దు. అచ్చం అల్లాగే.. పోకడలు పోయే కుక్కోటి భూపెపంచకంలో ఉందంటే అది బొబ్బిలే. మాట్లాడే కుక్క ఇస్కో అంటే ఉస్కో అందని చెప్పుకోడమే కానీ, పుట్టి బుధ్ధెరిగాక ఇస్కో అన్నదీ లేదు. ఉస్కో విన్నదీ లేదు. సరే ఈ బొబ్బిలి సంగతేవిటో చూద్దామంటే దాని సిగదరగా.. ఎన్ని వేషాలూ.. ఎన్నెన్ని కబుర్లూ.. మా గానవైన బేపి కాదో!!

తన పరువు తీసిన రాజుగోరి మీద అలిగి.. సన్నాకుల మావిడి చెట్టు కింద, మట్టిలో గుంట చేసుకు బజ్జున్న బొబ్బిలి అలక చూసి తీరాల్సిందే. ఎంత కోపం!! ఏం పౌరుషం!! రాచకూడు తిన్నాక ఆ మాత్రం రోషం ఉండద్దూ! అలిగి కూర్చున్నా ఆకలవుతుంది కదా మరీ! బోయినం చేసి బతకమని బగమంతుడు శపించేడు గాబట్టి, ఇంతటిదైన వీరబొబ్బిలి కూడా కందా ఇంట్లోంచి వస్తున్న ఘుమఘుమలకి చిత్తైపోయి, గిన్నెలు గానీ కడిగీసేరంటే చాలా నష్టం జరిగిపోతుందనే విషయాన్ని గ్రహించి.. 'బోయినం అంటే అదేం పోయిందని తినేస్తా'నని బయలుదేరింది. అలా అని పౌరుషం చచ్చి మాత్రం కాదు.. అక్కడే మహారాజశ్రీ బొబ్బిలి విలక్షణత బయటపడుతుంది. మనుషులకైతే బోయినం కంటే పౌరుషం ముఖ్యం గావొచ్చు. కుక్కలకైతే అన్నిటి కంటే విశ్వాసమే ముఖ్యం గావొచ్చు. ఇక్కడ బొబ్బిలి మాట్లాడే కుక్క కదూ.. అందుకని మనుషులకుండే హక్కులూ, కుక్కలకుండే సదుపాయాలూ ఆకళింపుచేసుకుంది. అందుకే పోలుగు పిట్టల మాంసం కూరలో హక్కుభుక్తమైన తన వాటా తను తినడానికి "నా ఇంట్లో నన్నొకడు పిలిచేదేంటి? నేనే ఇంట్లో లేకపోతే యీ కొంపకి కళేమిటి?" అని తన తరపు వకాల్తా తానే తీసుకు వాదించుకు నెగ్గింది. తర్కజ్ఞానం లేకపోతే కడుపు మాడ్చుకోవలసి వస్తుందీ అని తెలుసుకోవాలిక్కడ. ఇక కుక్కలకుండే సదుపాయాల సంగతి మా బాగా ఎరిగినది కనుకే.. "వంటగది తలుపు వెనక్కి ఓ సారి లాగి మళ్ళీ ముందుకు తొయ్యి.. తెరుచుకుంటుంది." అని తలుపు దొంగ చేతే తీయించి మరీ, "ఈ ఇంట్లో దేనిలోనైనా నాకు వాటా వుంది. నా వాటా మాంసం రేపు ఎలాగూ నాకు కట్టబెట్టాలి. నాకిప్పుడు తినాలని వుంది కాబట్టి నా వాటా నాకు యిచ్చీమంటున్నాను" అని దర్పంగా దొంగ చేతే అన్నం కలిపించుకుని తినగలిగింది. దీన్ని బట్టి వ్యవహారజ్ఞానం బొబ్బిలికి జాస్తి అనిపించడంలేదూ!

ఊరు ఊరంతా రెండు వర్గాలైపోయి.. భూమి గుండ్రంగా పంపర పనసకాయనాగుందా? బల్లపరుపుగా పెదపాత్రుడి మంచంనాగుందా? అని జట్టీకి దిగి, సంతబయల్లో దొమ్మీలో కొట్టేసుకుందామనీ, గెలిచినవాడేం చెప్తే భూమాత అలాగే ఉండితీరాలనీ అనేసుకున్నారా..


బొబ్బిలి "మూర్ఖజనంతో జట్టీకి దిగకూడదు" అంది.

భూమి చదరంగా ఉందన్న గోపాత్రుడే రైటంది.

"ఒకడు మనకి చెప్పడవేటోయ్ గోపాత్రుడూ.. భూ ప్రపంచకంలో మనకి ఏదైనా చెప్పగలిగిన దిల్ ఎవడికున్నది?" అని తెగేసి రొమ్మువిరిచింది.

"ఫలానీ రాజు ఫలానీ కుక్కని పెంచి చెడిపోయినాడని జనం చెప్పుకుంటే లోకంలోని కుక్కలన్నిటికీ మచ్చగాదా?" అని ఆవేదన చెందింది.

"బోయినం ముఖ్యమా? విశ్వాసం ముఖ్యమా?" అనే ధర్మసందేహానికి ఆకటివేళల ఏది ముఖ్యమో కచ్చితంగా చెప్పింది.

రావిచెట్టు కింద నిలిచిన రాజుల ఫౌజులో ఫకీర్రాజు పక్కనే నిలబడింది.

జామి కోర్టులో "బొబ్బిలి" అనే గ్రామసింహం మీద కేసు మోపబడింది.కాబట్టీ.. ఎంతసేపూ కుక్క ఇంటి కాపలాకి పనికొస్తాదా?

వేటజేయడానికి పనికొస్తాదా?

కోసేసి ఊరగాయ పెట్టుకుని, దొబ్బితిండానికి పనికొస్తాదా? అని ఆలోచిస్తారు గానీ.. "కుక్క కోసమే కుక్క"***

వీరబొబ్బిలి మానవజాతికి నేర్పిన పాఠాల పూర్తి పాఠాన్ని K.N.Y. పతంజలి వ్యంగ్య రచనలలో చదవాల్సిందే..* బేపి - కుక్క

16 comments:

 1. కుక్క కోసమే కుక్క
  ----------------
  The reality :-) Nice one as usual will wait to hear you !

  ReplyDelete
 2. Replies
  1. బొబ్బిలి అక్కడ! :)ధన్యవాదాలు!

   Delete
 3. నిజం గానే మా గానమైన బేపి!!
  రొంగలి అమ్మన్నని అడ్డం పెట్టుకుని అలమండ రాజులకీ, వెలమలకీ జుట్లు ముడి పెట్టేసింది కాదో... "ఆ అమ్మన్న గాడేటన్నాడో అదీ చెప్పు" దగ్గర బొబ్బిలి లౌక్యం అమోఘం..
  మీ రేడియో ప్రోగ్రాం కోసం ఎదురు చూస్తూ....

  ReplyDelete
  Replies
  1. మరే! కథంతా అయ్యాక రొంగలి అమ్మన్నని చూసి ఎంత ఆశ్చర్యపోతామో, బొబ్బిలి నెరిపిన రాజకీయాన్ని చూసీ ముక్కునవేలేసుకుంటామంతే! ప్రోగ్రాం మొత్తానికి పూర్తయిందండీ. ధన్యవాదాలు! :)

   Delete
 4. "అందుకని మనుషులకుండే హక్కులూ, కుక్కలకుండే సదుపాయాలూ ఆకళింపుచేసుకుంది"

  భలే

  "కుక్క కోసమే కుక్క"

  మరే నిజమే కదూ

  ReplyDelete
 5. ఏం గేనమో ఏమో బావ్. గోపాత్రుడు గోరి పెళ్ళాం చెవిపట్టి కరిసిత్తే, మనిషి కుక్కని కరిసిడమేటన్నారే గాని అలమండలో ఒక్కరన్నా నమ్మారా? బొబ్బిలి గుడ్ల నీళ్ళుకక్కుకోలేదూ?

  ReplyDelete
  Replies
  1. జంతర్నాటి అలమండలో అంతోటి సత్తెవుంటే.. భూవి బల్లపరుపుగా వెందుకుంటాది బావూ..!? గేనం ఉంది గనుకనే.. మడుసుల నోట్లో నోరెట్టడవెందుకనీ,మూర్ఖజనంతో జట్టీకి దిగనన్నాది బొబ్బిలి.

   Delete
 6. మా గాన మైన బేపి నెండి ...అలపింటి బేపి గురించి రాస్తే మా అలమండ గాందీ బాబు రాయాల. నేదా కొత్తావకాయ రాయల అనిపించీసేరు. సెబాసో ... సెబాసు ..

  ReplyDelete
  Replies
  1. నన్ను సంపీసినారు బావూ..! గాందీ బావుతో సాపత్యానికి నాను కోటి జలమలెత్తాలి పంతులు గోరూ. సెబాసన్నారు.. వది సాల్దా?

   Delete
 7. I heard ur radio program. Did u record it ? I was so impressed with ur way of story telling but there were so many breaks. I cant hear it completely.. Can u share it please ?

  ReplyDelete
  Replies
  1. మీకు Streaming లో ఏమైనా సమస్య వచ్చిందేమోనండీ. Podcast సిధ్ధమవగానే link ఇస్తాను. ధన్యవాదాలు! :)

   Delete
 8. Usually your GaliSankellu comes starting of every month, but this month no update yet. Can we expect that soon...??

  ReplyDelete
  Replies
  1. అనివార్యకారణాల వల్ల బ్లాగ్ లో అప్డేట్ చెయ్యడం ఆలస్యమయిందండీ. కౌముదిలో ప్రతినెలా ఒకటో తారీకునే వచ్చేస్తుంది "గాలిసంకెళ్ళు". ధన్యవాదాలు!

   Delete