ఆ రోజు ఆది వారం. మధ్యాన్నం భోజనాలు చేసి ఇంటిల్లి పాదీ కూటి కునుకు తీస్తున్నారు. మండువా పంచలో కూర్చుని చింత పిక్కలు ఆడుకుంటూ, నీళ్ళ కుండీలో తల ముంచి తపతపా విదిలిస్తున్న కాకిని చూస్తున్నాను. వీధిలో సైకిలాగిన అలికిడి.
"మాలక్షబ్బా, టాటగారికి జెబ్బు దల్లీ, రాంబూర్టి వొజ్జాడని!" జేబులోంచి రుమాలు తీసి నుదుటి మీంచి కళ్ళలోకి కారబోతున్న చమట ధారలను తుడుచుకుంటూ, వీధరుగు మీద కూలబడ్డారాయన. అయిదడుగుల బక్కపలచటి రూపం. ఫేంటు చొక్కా. కాళ్ళకి అరిగిపోయిన బాటా చెప్పులు, అవీ తాతగారివే. కళ్ళకి చత్వారం కళ్ళజోడు. ఆయన తల ఎత్తి గమ్మత్తుగా చూస్తూ మాట్లాడుతూంటే ముక్కు మీదికి జారడానికి అనువుగా సాగిపోయి ఉండేదది. చేతిలో నగల షాపు వారు ముద్రించిన పేరు దాదాపు చెరిగిపోయిన ఓ బేగు.
లోపలికెళ్ళి నాయనమ్మ చూడకుండా రాగిబిందెలోంచి చెంబెడు నీళ్ళు, ఆ పక్క ఉన్న వైరు బుట్ట లోంచి రెండు అరటి పళ్ళూ చేజిక్కించుకుని బయటి కొచ్చాను. మంచి నీళ్ళ చెంబు అందుకుని గటగటా తాగేసి "హబ్బయ్య.. మా లక్షివే దల్లీ!!" అని నా వైపు చూసి నా చేతిలోంచి అరటి పళ్ళు అందుకున్నారు. ఆయన అవి తిని తొక్కలు పారేసి వచ్చేలోపు, తాతగారొచ్చి అరుగు మీద వాల్చిన పడక్కుర్చీలో కూర్చున్నారు.
నెమ్మదిగా అక్కడి నుంచి ఖాళీ చెంబు పట్టుకుని వెళ్ళిపోయాను. ఓ పది నిమిషాల్లో తాతగారు ఎలాగూ పిలుస్తారని తెలుసు. పోనీ అక్కడే ఉందామంటే, పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు అక్కడ ఉండకూడదని వచ్చినవాళ్ళు వెళ్ళగానే మెత్త మెత్తగా చీవాట్లేస్తారు. పిలుపు వినబడగానే అలవాటు ప్రకారం, తాతగారి కరణీకం బల్ల మీద ఉన్న పర్సులోంచి ఐదు రూపాయల నోటు తీసి బయటికి తీసుకెళ్ళబోయాను.
"ఎక్కడికే! డబ్బులు తీసుకు బయలుదేరావూ?" ఎదురుగా నాయనమ్మ.
"రాంబూర్టి మేష్టారొస్తేనూ.." నసిగాను.
"ఐదు రూపాయలే! రెండు శేర్ల పాలొస్తాయ్. మీ తాతగారు ఆ డబ్బుల చెట్టు ఇంకాస్త గట్టిగా దులిపితే, కూతుళ్ళకి తలా కాసూ బంగారమైనా పెట్టేదాన్నిగా!" చిన్నగొంతుతో కసిగా సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
బతుకు జీవుడా అని ఆ నోటు తీసుకెళ్ళి రాంబూర్టి మేష్టారికి ఇచ్చి దణ్ణం పెట్టాను.
"షుభవ్, విడ్డా పాప్తిరష్టూ!" దీవించేసి సైకిలెక్కారాయన.
కుర్చీ చేతి మీదెక్కి"నాయనమ్మ చూసేసింది." గుసగుసగా చెప్పాను తాతగారికి.
"హ్మ్.." అన్నారాయన ఏమీ మాట్లాడకుండా.
"రాంబూర్టి మేషారంటే నాయనమ్మకి ఎందుకూ కోపం?" ఎన్నిసార్లు అడిగినా సమాధానం రాని ప్రశ్నే మళ్ళీ అడిగాను.
"రామ్మూర్తీ.." చెవి దొరకబుచ్చుకుని చెప్పారు తాతగారు.
విడిపించుకుంటూ చెప్పాను." ఏం కాదు. ఆయనే చెప్తారు 'రాంబూర్టి' అని. ఆయన పేరు ఆయనకి తెలీదా?"
"ఆయన పలకలేరు. మనం తప్పుగా పలకకూడదు."
"నత్తా?"
"తప్పూ.. నశ్యం"
"నశ్యమంటే?"
"ఏదీ, నిన్న ఎక్కడి దాకా చెప్పుకున్నాం? "కరచరణ సరోజే కాంతిమన్నేత్ర మీనే..."
"మురభిది మా విరమస్వ చిత్తరంతం" అయిష్టంగా మొదలెట్టాను.
"రంతుం" సవరించారాయన.
"సుఖతరమపరం నజాతు జానే.. హరిచరణ స్మరణామృతేన తుల్యం"
రామ్మూర్తి మేష్టారు వారానికి రెండు సార్లు తాతగారి దగ్గరికి రావడం, ఐదు రూపాయిలు తీసుకెళ్ళడం చాలా ఏళ్ళు జరిగింది. ఆయనేం తాతగారి స్నేహితుడు కాదు, సహోద్యోగీ కాదు.. అసలాయన మేష్టారే కాదట. అటెండర్. కానీ ఎవరూ ఆయనకి టీ కాఫీలు తేవడం లాంటి చిన్న చిన్న పన్లు చెప్పరు. బేంక్ పన్లు అవీ చేస్తారట హై స్కూల్లో. ఎప్పుడైనా హై స్కూల్ వైపు వెళ్తే కార్బన్ పేపర్లు, పెన్సిళ్ళు కావాలంటే తెచ్చి ఇచ్చే వారు.
ఓ సారి దసరాకి కళాభారతి ఆడిటోరియంలో బోలెడు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. "మంగళం పల్లి బాలమురళీ కృష్ణ" గారట. ఆయన కూడా వస్తారట, మదరాసు నుంచో.. ఎక్కడి నుంచో! ఆయనెవరు అంటే ఆకాశ వాణి విశాఖపట్నం కేంద్రం ఉంది కదా! అందులో ఉదయం భక్తి రంజనిలో "గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజలు చేదమంటే.. గంగలోని చేప కప్ప ఎంగిలన్నవిరా లింగా.. మాహానుభావా.. మా దేవ శంభో" అని పాడుతారు కదా.. ఆయనన్నమాట!
సాయంత్రం ఆరయ్యేసరికి తాతగారితో పాటూ ఏదో ఫలహారం తినేసి వెళ్తే, నిద్దరొచ్చేదాకా పాటలూ, పద్యాలూ వినచ్చు. హరికథలు, యక్షగానాలు, లలిత సంగీతం, బాలకనకమయ చేల, భామనే సత్యా భామనే.. అన్నీ చూడచ్చు. ఒకవేళ నిద్రపోయామా.. "రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ" అయిపోయే వేళకి తాతగారు నిద్రలేపుతారు. అప్పుడు పళ్ళెంలో డబ్బులు వేసి దణ్ణం పెట్టేసుకుంటే తాతగారి శాలువ మనం కప్పేసుకుని, నడుచుకుంటూ ఇంటికెళ్ళిపోవడమే!
ఆ బాలమురళీ కృష్ణ గారు వచ్చినప్పుడు మన రామ్మూర్తి గారు కూడా స్టేజ్ ఎక్కారన్నమాట. ఆయన వాతాపి గణపతిం, ఎందరో మహానుభావులు, తిల్లానా, పిబరే రామరసం ఇలా ఎన్ని పాటలు పాడారో అన్నింటికీ, రామ్మూర్తి గారు తబలా మోగించారు. తప్పు తప్పు.. సహకారం అందించారు అనాలట.
మర్నాడు ఓ నాటిక వేసారు ఉత్సవాల్లో. మూకాభినయం అంటారట దాన్ని. అంటే మాటలుండవన్నమాట. ఆకలిగా ఉన్న ఓ మనిషి ఊరంతా వెతుకుతాడు. ఎక్కడా తినడానికి ఏదీ దొరకదు. అలా వెళ్ళగా వెళ్ళగా ఓ నూతిగట్టు మీదకి వాలి ఉన్న జాంచెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టెక్కి పండొకటి కోసుకుంటూ ఆ మనిషి నూతిలో పడతాడన్నమాట. నూతిలోంచి బయట పడడానికి సహాయం కోసం చూస్తూంటే ఇంకో మనిషి వచ్చి తాడు వేసి బయటికి లాగుతాడు. ఇద్దరికీ ఆకలిగానే ఉంటుంది. బయటికి వచ్చిన మనిషి చేతిలో జాంపండు కోసం ఇద్దరూ పెనుగులాడుకుని ఈసారి ఇద్దరూ కలిసి నూతిలో పడతారు. కలిసి పంచుకుంటే ఇద్దరికీ కడుపు నిండేది, అపాయమూ తప్పేది అని నీతిట. ఇంకా నయం, అది బాదం చెట్టవలేదు! నీతి కంటే మాటల్లేకుండా అట్టముక్కలతో చేసిన నూతిలో పడడం, పెనుగులాడడం, నీళ్ళలోంచి బయటికి లాగడం అవీ భలే బాగున్నాయ్. నాకేం పెద్దగా అర్ధం కాలేదు కానీ, అందరూ బాగా చప్పట్ట్లు కొట్టారు. నేనూ కొట్టాను. దాన్ని సభా మర్యాద అంటారట.
నాటకం అయ్యాక మా ఊరి రాజా వారి చేతుల మీదుగా ఆ నటులకు సన్మానం జరిగింది . వారితో పాటూ రామ్మూర్తి మేష్టారికి కూడా. "ఆయనకెందుకూ?" అని అడిగితే తాతగారు చెప్పారు. ఆ నాటకం మొత్తం నేపధ్యంలో తబలా సహకారం ఇచ్చింది మేష్టారేనట. నీళ్ళలో దబ్బున పడడం, మునక వేస్తున్నట్టు శబ్దం, తాడు వేసి లాగుతున్నప్పుడు మళ్ళీ నీళ్ళ శబ్దం అంతా తబలా మీద అందించినదేనట. రామ్మూర్తి మేష్టారు ఎంత గర్వంగా నవ్వేసుకుంటున్నారో అనిపించింది స్టేజి మీద ఆయన్ని చూస్తే. చెప్పొద్దూ.. నాకూ గొప్పనిపించేసింది. నన్ను "మాలక్షివబ్బా.." అని ఈయనేగా అనేవారు అని గర్వమన్నమాట.
ఇది జరిగిన నెల రోజుల దాకా రామ్మూర్తి మాస్టారు చాలా రిహార్సల్ కి వెళ్లేవారట. నెల తరువాత మా ఇంటికి వచ్చారు. నేను చెంబుతో మంచి నీళ్ళు తెచ్చేలోగా, నాయనమ్మ నా చేతికి మజ్జిగ గ్లాసిచ్చింది. ఇదేంటా అని ఆశ్చర్యపోయేలోపు తలుపు వార నిలబడి ఆయనతో మాట్లాడింది కూడాను! మేష్టారు అమేరికా వెళ్తారట. మొన్న ఉత్సవాల్లో వేసిన నాటిక రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా వేసి నెగ్గారట. అంతా మేష్టారి గొప్పేనంట. అమేరికాలో తెలుగు సభల్లో వెయ్యడానికి వెళ్తున్నారట. మేష్టారు "అమేరికా రాంబూర్టిగారై"పోతారన్నమాట. ఆయన 'అమేరికా' అని ఎలా పలుకుతారో విందామని నేనూ అక్కడే నిలబడ్డానా.. నాయనమ్మ కసిరేసి లోపలికి పొమ్మంది. నేనూరుకుంటానేంటి? వీధి గది కిటికీ దగ్గరికి వెళ్ళి విన్నాను అమేరికా కబుర్లు.
రెండు నెలల్లో ప్రయాణమట. చలిగా ఉంటుందని కోటు, బూట్లు కొనుక్కోమన్నారట మేష్టారిని. మొత్తం ట్రూపు అంతటికీ రాఘవరాజు లీడరట. అంటే ఆ రోజు నూతిలో పడిన మొదటాయనన్నమట. అతనే డైరెట్రు కూడానట. అమేరికాలో గాజు రోడ్లుంటాయట. అద్దాల కార్లు, తాడెత్తు ఇళ్లూ ఉంటాయట. మనుషులందరూ ఎర్రగా పొడుగ్గా, సినిమా హీరోలు కృష్ణ, శోభన్ బాబు కంటే అందంగా ఉంటారట. మన భాష వాళ్ళకి రాదుట. బ్రెడ్డే తింటారట. ఇలా బోలెడు కబుర్లు చెప్పారు మాష్టారు.
రామ్మూర్తి మేష్టారి అమెరికా యాత్ర మా ఇంట్లో ఓ పెద్ద చర్చనీయాంశమైపోయింది. నెల రోజుల అమెరికా యాత్రలో ఆయన ఏం చూస్తారో ఏం చేస్తారో కానీ, మా నాయనమ్మ మాత్రం బోలెడు ప్రశ్నలడిగేది తాతగారిని. "అదే నెలలో ఉన్న మాష్టారి తల్లిగారి ఆబ్దికం సంగతెలాగో!" అని కూడా నాయనమ్మకే బెంగ. ఏది ఏమయినా ఆయన చేత అమెరికా సబ్బులు తెప్పించమని మాత్రం కచ్చితంగా చెప్పేసింది. అవి రుద్దుకుంటే ఆమడ దూరం సువాసన వస్తామట. "యోజనగంధిలాగా?" అని నేనడిగితే చల్లకవ్వం విసిరేసింది నామీద. ఓ పది సబ్బులైనా తెప్పించాలని చెప్పేసింది. అన్నిటికీ తాతగారు నవ్వేసి "వెర్రి దానా" అనేవారు, అంటే అలాగే అనో.. కుదరదనో నాకు తెలీదు మరి.
మేష్టారు కోటు కొనుక్కు తెచ్చుకున్నారు. బూట్లు కొనుక్కోవాలని చెప్పారు. నెలకి సరిపడా గ్రాసం సమకూర్చుకోవాలని చెప్పారు. ఉప్పూ, కందిపొడి సరే, గొల్ల నరస పోసే పాలు, రెండో పూట దాటితే విరిగిపోతాయని అమ్మ చెప్తుంది కదా! నెల రోజులకి పాలెలా పట్టుకెళ్తారో నాకర్ధం అయ్యేది కాదు. ఏమైనా మాట్లాడితే ఏమంటారో అని నా అనుమానాలన్నీ నాలోనే దాచేసుకునే దాన్ని. పాపం నేను!
అమెరికా ప్రయాణం నాలుగు రోజుల్లో ఉందనగా, ఓ రాత్రి వేళ తలుపు కొట్టారు మేష్టారు. నాన్న తలుపు తీసి వచ్చి గాభరాగా తాతగారిని లేపారు. వీధి అరుగు మీద కూలబడిన మేష్టారిని ఇంట్లోకి భుజాలు పట్టి తీసుకొచ్చారు నాన్న. కుర్చీలో వాలిపోయి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు మేష్టారు! భలే బాధనిపించింది. అప్పుడెప్పుడో ముదినేపల్లివారి ఇంటరుగు మీద నుండి పడిపోయి, మోకాలు చీరుకు పోయి కుట్లు వేసినప్పుడు కూడా నేను అంతలా ఏడవలేదు. కాసేఫున్నాక చెప్పారు ఏంటో.. అసలే ఆయన మాటలు అర్ధం కావేమో, నిద్ర కళ్ళమీదున్న నాకేం బోధపడలేదు. ఉదయం దాకా ఆయన అలా పంచపట్టునే నిద్రపోయి, ఉదయాన్నే వెళ్ళిపోయారట.
ఉదయం స్కూల్ కి వెళ్ళే ముందు అడిగాను తాతగారిని "ఇంతకీ రామ్మూర్తి మేష్టారెందుకు ఏడ్చారు? అమెరికా తీసుకెళ్ళనన్నారా ఆయన్ని?" అని. జానకత్త ఇంటికి నన్ను తీసుకెళ్ళకుండా నాయనమ్మ ఒక్కర్తే వెళ్ళిపోయినప్పుడు నాకూ ఇంతే ఏడుపు వచ్చినట్టు గుర్తు. "లేదమ్మా, నువ్వు మాష్టారు కనిపించినా ఏం అడక్కు. తెలిసిందా?" అన్నారు. "మరి నాటకమెలా వేస్తారు వాళ్ళు? మేష్టారు లేనిదే?" అని అడిగాను. అమెరికా వాళ్ళు చప్పట్లు కొట్టకపోతే సభామర్యాద కాదు కదా! "రికార్డ్ చేసుకుని తీసుకెళ్ళారట. మేష్టారికి టికెట్ దొరకలేదని" అన్నారాయన.
నాన్న చెప్పులు వేసుకుంటూ "ముసలాయనకి ఆశ పెట్టడం అన్యాయం. వాళ్ళేం బాగుపడతారు? పాపం, వెర్రి మనిషి, అసలే అర్భకపు ప్రాణి!" అన్నారు తాతగారితో. "టికెట్టు డబ్బులు మిగులని కాబోలు వెధవాయిలు. అమేరికా వెళ్తే ముసలాయనకి డబ్బు వదిలెయ్య్.. పేరయినా దక్కేదా? ముష్టి నూటపదహార్లు చేతిలోపెడతారా... ఘోరం!!" కోపంగా, బాధగా అంది నాయనమ్మ. "ఈయన వెళ్తే వాళ్ళు కనిపించరు కదా అమ్మా! ప్రాణం పోసాడు వాళ్ళ వెర్రి గెంతులకి."అన్నారు నాన్న
"ఎవరి స్వార్ధం వారిది. ఏం చెప్తాం! చిన చేపను పెద చేప." అన్నారు తాతగారు, నిట్టూరుస్తూ. "అడిగే వాళ్ళు లేక! కళని దోచుకుంటారా? రాత్రికి రాత్రి రికార్డింగ్ చేయించుకు పోయారు త్రాష్టులు!" పటపటా పళ్ళు కొరికారు నాన్న.
తాతగారి ముఖం శాంతంగానే ఉన్నా చెయ్యి పడక్కుర్చీ చేతిమీద బిగుసుకోవడం కనిపించింది నాకు.