పసిపాపలంత అందమైనవి ఈ భూప్రపంచంలో పువ్వులొక్కటే. ఘుమ్మున సువాసనలు వెదజల్లేవి, సుతారంగా ఓ చిన్న సుగంధ వీచికతో పలకరించేవి, చూపులకే సుందరమైనవి, ముళ్ళ అన్నయ్యల అనుంగు చెల్లాయిలంటివి, రంగురంగుల్లో, వివిధ పరిమాణాల్లో "భలే భలే అందాలు సృష్టించావు.. "అని పాడాలనిపించేలా చేసేవి పువ్వులే.
జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా ముడుస్తుంది. కొప్పున్నమ్మ ఎన్ని పువ్వులైనా ముడుస్తుంది. అదేంటో చిన్నతనంలో ఇదీ అదీ అనే బేధం లేకుండా కంట పడిన ప్రతి పువ్వూ తల్లో ముడవాలనిపించడం ఎంత అబ్బురం కలిగించే అమాయకత్వం. అయ్యకోనేరు దక్షిణ గట్టు ఆంజనేయస్వామి కోవెల్లోంచి బయటకు వచ్చి, శివ లింగం పువ్వులు సైతం పంచుకు జడలో తురుముకునే వాళ్ళం. నందివర్ధనాలు, గన్నేరు పువ్వులు, గొబ్బి పువ్వులు, డిసెంబరాలు, చంద్రకాంత పూవులు, వదిలేస్తే ఉమ్మెత్త పువ్వులు సైతం "జడలో పెట్టక మాననూ.. " అని బయలుదేరేవాళ్ళం.
సాయంత్రం ఏడున్నర దాటిందంటే సైకిల్ బెల్లు, కటకటాల దగ్గర చెప్పులు విప్పిన అలికిడి, కండువా తీసి పడక్కుర్చీ చేతి మీద వేసి, పంచ ఒడ్డునున్న సిమెంటు గోలెంలో చెంబు ముంచి కాళ్ళు కడుక్కున్న శబ్దం, తడి అడుగులు నట్టింట్లోకి తేకుండా కాళ్ళు తుడుచుకుని, చేతి సంచీ లోంచి కూరలో, పళ్ళో, తమలపాకులో, సరుకులో తీసి చెక్క బల్ల మీద పరిచే ముందు సువాసన ముక్కుకి తాకి తీరాల్సిందే, తాతగారు తెచ్చిన పువ్వుల పొట్లం లోంచి. మల్లెల కాలంలో, పండగ రోజుల్లో విధిగా పువ్వులు తెచ్చేవారు. తామరాకులోనో, అడ్డాకులోనో నీళ్ళు జల్లి పువ్వులు వేసి, అవి నలగకుండా, పొట్లంలోంచి జారకుండా బహు నేర్పుగా అరిటి నార తోనో, దారంతోనో కట్టి ఇచ్చేవారు పూలమ్ముకొనువారు. పువ్వులమ్మడం ఎంత భోగం కాకపోతే "పూలమ్మిన చోట.." అనే సామెత పుడుతుంది చెప్పండి? మొక్క ఎదిగి చిగురు తొడిగి మొగ్గ వేసి పువ్వు పూచిందంటే, కుదురు తీసి నీరు పొసి, ఎదురు చూసిన శ్రమ" హూష్ కాకీ.." అని ఎగిరిపోదూ!
పూలంటు కాలంటి
పున్నెముందంటాది
వగలమారీ పడుచు
నగ తొడిగెనంటాది
తోట పూల మనసులు తెలుసు యెంకికీ
ఏడాదికి ఓ సారి మా ఇంట్లో నందివర్ధనం చెట్టు కొమ్మలు దగ్గరికి కొట్టించేసేవారు. ముందు రోజు కనుక బజార్లోంచి పువ్వులు తెచ్చుకోకపోతే, పూల సజ్జ చిన్నబోయేది . అప్పుడు తెలతెలవారుతూనే చిన్న చిన్న సజ్జలు పట్టుకుని, పక్కింటి నేస్తాన్ని సాయం తీసుకుని ఈశ్వర వారింటికి బయలుదేరేదాన్ని. "మా అమ్మ పువ్వులు కోసుకు రమ్మంది, ఈశ్వర తాతగారూ" అని పేపరు చదువుకుంటూ గుమ్మంలో కూర్చున్న ఆ ఇంటి యజమానికి చెప్పేసి వాళ్ళ పెరడు అనబడే నందనవనంలోకి వెళ్ళే వాళ్ళం. ఎన్ని రకాల మందారాలో! ముద్ద నంది వర్ధనాలు, నిత్య మల్లెలూ, గరుడ వర్ధనాలు, గన్నేరు పువ్వులూ మామూలే! నీలి గోరింట పువ్వులు ఎంత అపురూపంగా ఉండేవంటే, నీలి రంగులో చిన్న గులాబీ వర్ణం కలిసినట్టున్న సుకుమారపు రేకులు విచ్చి ప్రపంచాన్ని చూస్తూ, ఏ తుషార బిందువు తాకిడికో సిగ్గుగా ముడుచుకుని, కుతూహలం ఆపుకోలేక ఓరగా చూస్తున్నట్టు ఉండేవి. కసరు మొగ్గలు సైతం కోసి పారేసే బాల్యపు రోజుల్లో కూడా ఆ పువ్వులు మాత్రం కోయబుధ్ధేసేది కాదు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్పవిలాపానికి ప్రోద్బలం నీలి గోరింటల అంతులేని అనుపమాన సౌందర్యమేమో అని నా అనుమానం.
పూల జడల వైభోగం ఇంకో మరిచిపోలేని ముచ్చట. కాసిని కనకాంబరాలో, సన్నజాజులో కనిపించాయంటే "అమ్మా, జడ కుట్టవా" అని సాగదీసుకుంటూ గారాలు. కాదంటే వెక్కిళ్ళలోకి మారే దుఃఖం. "కనకాంబరాల దండ సాగిపోతుంది తల్లీ" అనో, "జాజులు రేపు ఉదయానికి వాడిపోతాయ్, ఎందుకు చెప్పు" అనో సర్ది చెప్పి, ఫలానా పువ్వులు రాగానే పెద్ద పూల జడ కుడతానని ప్రమాణం చేస్తే అప్పటికి శమించేదాన్ని. మొగలిపూలు వచ్చాయంటే ఎంత సంబరమో! మొగలిపూల జడ అయితే రెండు రోజులు ఉంచుకోవచ్చు చక్కగా! ఏ శనివారం ఉదయమో కుట్టించుకుంటే, ఆ రోజు పట్టు పరికిణీ, మెళ్ళో ముత్యాల దండ వేసుకొని ఘుమఘుమలాడే మొగలి బొమ్మాయిలా బడికెళ్ళి రావచ్చు. "మీ అమ్మ గారు కుట్టారా? ఏదీ ఓ సారి వాసన చూడనీ!" అని నేస్తాలందరూ అడుగుతారు. ప్రాణ స్నేహితులకి ఎలాగూ అమ్మనడిగి నాలుగో, ఫ్ఫదో మొగలు రేకులతో కుట్టిన పువ్వులు తీసుకెళ్ళొచ్చు. పసిమి పచ్చటి మొగలి రేకులు పువ్వులా మడిచి, వాటి మధ్య చిన్న గులాబీ పువ్వో, కనకాంబరం దండో పెట్టి కుట్టేది అమ్మ. నేస్తాలెవరైనా అదే రోజు మొగలి జడ కుట్టుకుంటే "నీ జడకెన్ని పువ్వులు పట్టాయ్, అంటే నీ జడకెన్ని?" అని లెక్కలేసుకొనేవాళ్ళం. మొగలి పొత్తి మధ్యలో ముదురు గోధుమ వర్ణంలో వెన్ను ఉంటుంది. దాన్ని ఓ పాత బట్ట చుట్టి దుప్పట్లు, తువ్వాళ్ళు పెట్టే చెక్క బీరువాలో పెట్టేది అమ్మ. బట్టలన్నిటికీ మంచి వాసన పడుతుందని. అప్పుడప్పుడు ద్వారకా తిరుమల నుంచి వచ్చిన బంధువులెవరైనా పొగడపువ్వుల దండలు తెస్తే, వాటినీ బీరువాలోనే పెట్టేది అమ్మ. పొగడపువ్వులూ పారిజాతాల్లాగే నేల రాలాక ఏరి దండలు గుచ్చుతారట.
పెద్ద పిన్ని వాళ్ళింటికి వేసవి సెలవుల్లో వెళితే బొండు మల్లెలు పెట్టుకోవచ్చు. చీపురు పుల్లలు చిన్న చిన్న ముక్కలుగా విరిచి చక్రం ఆకారంలో దారంతో కట్టి వాటికి బొండుమల్లెలు గుచ్చేది పిన్ని. మల్లెపూల చక్రం అన్నమాట. జడ కూడా రోజూ అమ్మ వేసినట్టు ఒక్క వెంట్రుకా చెదరకుండా బిగదీసి కాకుండా, పైన చిన్న చిన్న పాయల నాగరం జడ వేసి, మెడ మీదుగా వదులుగా మిగిలిన జడ వేసేది పిన్ని. "చిక్కులు పడిపోతుందే, రేపు ఉదయాన్నే దీని శోకాలు, రణగోల భరించాలి." అని అమ్మ సణుగుతూ ఉండేది పక్క నుంచి. అయినా పిన్నిని అమ్మ ఏం అనలేదు కదా! తెగ బారెడు జడలో ఒక్క బొండుమల్లెల చక్రం పెట్టుకున్నా ఎంత దూరం ఘుమఘుమల వర్తమానం పంపేదో వేసవి సాయంత్రాల చిరు గాలి, "మల్లెలు ముడిచిన ముద్దుగుమ్మలొస్తున్నారహో.." అని.
అమ్మమ్మ గారింట్లో లేని పూలమొక్క లేదు తెలుసా! శ్రావణ భాద్రపదాల్లో ఎప్పుడైనా వెళ్ళామా, చెంగలువలు చూడచ్చు. జడివాన కురవాలి చెంగలువలకి. అప్పన్న కొండ మొదట్లో ఉండే దేవస్థానం వారి పూల తోటలోంచి నెమళ్ళ క్రేంకారాలు వినిపిస్తే చాలు.. ఇళ్ళలోంచి పిల్లలని బయటికి వెళ్ళ నిచ్చేవరు కాదు. "బురదలో జారిపోతారు. వర్షం వస్తుందిప్పుడు. మేఘం చూడు ఎంత నల్లగా ఉందో! నెమళ్ళు అరుస్తున్నాయ్ వినబడలేదూ!" అని బెదిరించి కూర్చోబెట్టే వారు. మాట వింటే బజ్జీలో, వేయించి కారం జల్లిన పనస పిక్కలో ఇస్తారనుకో! ఆ వచ్చే వర్షం చీకట్లో కాకుండా సాయంకాలం వస్తే మహ బాగుంటుంది. నల్లటి కొండకి ఇంకా నల్లటి మబ్బుల దుప్పటి కప్పేసి, మధ్య మధ్య మిరుమిట్లు గొలిపే మెరుపు మెరిసి, ఉగ్ర నార సింహుడి గర్జనలా ఒక్క ఉరుము ఉరిమిందా, గడ్డి దుబ్బులా ఉండే మొక్క మొదట్లోంచి చివాలున తలెత్తి చినుకులని కావలించుకోడానికా అన్నట్టు రేకులు విప్పేస్తాయ్ తెలతెల్లటి చెంగలువలు. నేను చూసిన అధ్భుత దృశ్యాలలో వెన్నముద్దల్లాంటి చెంగలువలు విరియడం ఒకటి. అవి కోద్దామంటే అమ్మమ్మ తిట్టేది. "అపురూపమైన పువ్వులవి. ఉన్నంత సేపు మొక్కకే ఉండనివ్వండి. కోసి పాడు చెయ్యడమెందుకూ? రోజూ జాజి తీగలు ధ్వంసం చేస్తున్నారు చాలదూ!" అనేది.
అమ్మమ్మ గారి ఇంటి చుట్టూ జాజి తీగలు మేడ మీదకి ఎక్కించి ఉండేవి. పిట్ట గోడ మీద సాగరసంగమం కమలహాసన్ లా విన్యాసాలు చేస్తూ పిల్లకాయలందరం పువ్వులు కోసేవాళ్ళం. నాలుగున్నర అయ్యాక సందులో కుళాయికి ప్లాస్టిక్ పైప్ తగిలించి మొక్కల మొదళ్ళలో వేసి, పువ్వులు కోసి ఇంట్లోకి తీసుకెళ్ళేసరికి సరిగ్గా గంట పట్టేది. అమ్మమ్మ ఉయ్యాల బల్ల మీద కూర్చుని పువ్వులని మాలలు అల్లడం మొదలెట్టేది. "నాకు ఈ రోజు మూరెడు దండ కావాలంటే, నిన్నా నీకే పెద్ద దండ ఇచ్చింది, ఈ రోజు నాకే.. " అని కీచులాటలు. విని విని విసుగొచ్చి "అన్ని పువ్వులూ కృష్ణుడి మెడలో వేసేస్తా భడవల్లారా.. వెళ్ళి నీళ్ళు పోసుకొని జడలేసుకుని రండి" అని అరిచేది అమ్మమ్మ. "పుష్ప కైంకర్యం చేస్తున్నారా, రంగనాయకమ్మ గారూ?" అని వేళాకోళమాడేవారు తాతగారు. "ఏం కైంకర్యమో, ఏమో! సాయంత్రం అలా కోవెల దాకా వెళ్ళొద్దామంటే కుదరదు కదా! ఈ రోజు మానేద్దాం అనుకుంటే, ఈ పిల్లల మొహాలు చూస్తే "అయ్యో!" అనిపిస్తుంది. రంగయాత్రా.. దినే దినే" అని నిట్టూర్చేది.
ఎనిమిది మంది గోధుమవన్నె త్రాచుల్లాంటి ఆడపిల్లల జితమత్తమధుకరశ్రేణుల్లాంటి వేణులలో జాజుల దండలు ముడవాలంటే ఆవిడకి ఎంత ఓపిక ఉండాలి! మేము ఎనిమిదిమందీ గంటలో కోసుకొచ్చిన జాజిపూవులు ఆవిడ శరవేగంతో గంటలో దండ కట్టేది. ఇంట్లో ఎంత మంది ఉన్నా, ఆవిడ మాలలల్లిన నేర్పు, ముద్దగా అందంగా ఒక్క పువ్వూ నలగకుండా, తీగె నుండి కోసిన మొగ్గ కళ్ళు విప్పేలోపు దండలో కూర్చే చాకచక్యం ఇంకెవరికీ లేదు మరి. పిల్ల తలలో పూలు కళ్ళిప్పినాయంట. అన్నట్టే మొగ్గల దండలు మా జడల్లో ఒదిగి, పొద్దు గూకే కొలదీ ముగ్ధంగా పరిమళాలు విరజిమ్మేవి. ఏ సంపెంగపువ్వులో ఉన్న రోజు మేము జాజులని చిన్న చూపు చూసినా, యధావిధిగా మాల అల్లి మూడడుగుల కృష్ణ విగ్రహానికి వేసేది అమ్మమ్మ.
నూరు వరహాల పూవులని ఒకదానిలో ఒకటి అమర్చి గిన్నెలు గిన్నెలుగా పరుచుకొని ఆడుకొనేవాళ్ళం. ఎవరు ఎక్కువ దొంతులు చేస్తే వారు గొప్ప. చీపురు పుల్లలకి పసుపు, తెలుపూ కలిసినవి, ఎర్రటివి నూరువరహాల పూవులు గుచ్చి బాణాల్లా సంధించుకొని యుధ్ధాలు చేసుకునేవాళ్ళం. ఇక రామబాణపు పువ్వులైతే గుత్తులు గుత్తులుగా పూసి తేనెలూరుతూ ఉండేవి. ఇంట్లో తిండికి కరువొచ్చినట్టు, ఆ పువ్వులను పీల్చి మకరందం తాగే వాళ్ళం. ఇంత విధ్వంస కాండ చేసినా, నాలుగు రోజులయ్యేసరికి మళ్ళీ పిల్ల మూకకి పువ్వుల విందు తయారయ్యేది. అమ్మ లాగే, మొక్కలు కూడా కదా!
పెద పండగకైతే బంతి పూల సంబరాలు. చలికాలపు వేకువల్లో గులాబీ బాలల సోయగాలు. ఇన్ని పువ్వులు చూసినా, ఇన్ని అనుభవించినా నాకు తనివి తీరని దివ్య పరిమళం "పన్నీరు గులాబీది." ఆ పువ్వు రంగు చూస్తే "గులాబీ రంగు అంటే ఇది" అనిపిస్తుంది . తెలవారు ఝామున ఘుమ్మని సువాసనతో చలి గాలితో కలిసి, నాసికని చేరి మెదడుని తట్టి నిద్రలేపడం ఎంత అందమైన అనుభూతో! ఆ గులాబి మొక్క దరిదాపుల్లో కూర్చుంటే మన సర్వాయవాలు పన్నీట ముద్దైపోయినంత సువాసన. ఖచ్చితంగా అది దేవతా పుష్పమే అని నా నమ్మకం. ఎందుకంటే పనిగట్టుకు పండగలకి పూసేది ఆ పువ్వు. కోసి జడలో తురుముకున్నానా.. వందమందిలో ఉన్నా కళ్ళుమూసుకుని పిలిచేది అమ్మ . "నన్ను అడుగూ, గులాబీ కోసి ఇస్తానని చెప్పానా? గోటితో గిచ్చి కోసేసావ్. మళ్ళీ మొగ్గ పెట్టాలా? ఇంటికి రా, నీ పని చెప్తాను" అని.
వినాయక చవితి వస్తోందంటే చెరువుల్లోంచి కోసుకు తెచ్చుకున్న తామరపువ్వులు, తోటలమ్మట పడి తెచ్చుకున్న పత్రితో బొజ్జ గణపయ్యకి దండిగా పూజలు జరిగేవి. ఎన్ని రకాల పూవులు దొరికితే అన్నింటితోనూ ముంచెత్తేసేవాళ్ళం. చేమంతుల సంబరాలు చెప్పనే అక్కర్లేదు. చిట్టి చేమంతుల దండ ఎంత బరువున్నా బుజ్జి మట్టి వినాయకుడు మొయ్యాల్సిందే! చేమంతుల తోరణాలు కట్టేసి పండగను లాక్కొచ్చి నట్టింట్లో కూర్చోబెట్టేవాళ్ళం.
"ఇంత పువ్వుల పిచ్చి ఉన్న పిల్లనే! మీకిది న్యాయమా? పుష్ప విలాపం చదివాక తెలుగు వారెవరైనా చెయి జాచి పూవు దూయగలరా మహానుభావా? బొజ్జ గణపతి వచ్చేదే ఏటికొకమారు. గరిక పూజతో సరిపెట్ట మనసు రాదయ్యా." అని కరుణశ్రీ ని నిలదీస్తే పూవుల సౌకుమార్యం, పరిమళం అద్ది, పద్య కుసుమాలను ఇచ్చి "వీటితో పూజ చేస్కో ఫో.." అన్నారాయన. విఘ్ననాయకునికి పూజ చేసుకుందామా మరి?
లడ్డూ జిలేబి హల్వాలె యక్కరలేదు
బియ్యపుండ్రాళ్ళకే చెయ్యిచాచు
వలిపంపు పట్టుదువ్వలువలే పనిలేదు
పసుపు గోచీకె సంబ్రాలుపడును
ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదుపొట్టిగుంజిళ్ళకే పొంగిపోవు
కల్కి తురాయీలకై తగాదా లేదు
గరికపూజకె తలకాయ నొగ్గుపంచకల్యాణికై యల్కపాన్పు లేదు
ఎలుక తత్తడికే బుజాలెగురవైచు
పంచభక్ష్యాలకై మొండిపట్టు లేదు
పచ్చి వడపప్పె తిను వట్టి పిచ్చితండ్రి
కుడుము లర్పించు పిల్లభక్తులకు నెల్ల
యిడుములం దించి కలుము లందించు చేయి
పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి
తెనుగు బిడ్డల భాగ్యాలు దిద్దు గాక!