Showing posts with label మిథునం. Show all posts
Showing posts with label మిథునం. Show all posts

Sunday, April 1, 2012

"మిథునం" పాటలు.. ఎలా ఉన్నాయంటే..

వంకాయ బజ్జి పచ్చడిలో కొత్తిమీర ఎలా ఉండాలయ్యా అంటే "తత్వాలు పాడేటపుడు తంబురా శ్రుతిలా" అసలు విషయాన్ని మింగేయకుండా ఉండాలన్నాడు అప్పదాసు.

"నొష్ట రాసిన రాలు తుడిచినా పోదు - చీర చెరుగులు పెట్టి తుడిచినా పోదు - పైట చెంగుల తోటి పులిమినా పోదు" అని పాడేంత సర్వజ్ఞురాలు బుచ్చిలక్ష్మి. చూడబోతే ఇద్దరికిద్దరూ సంగీత సాహిత్యాలు కాచివడబోసినట్టే అనిపిస్తారు.

అచ్చ తెలుగు కథగా పుట్టి ప్రాణం పోసుకుని.. కాగితాల్లోంచి గుండెల్లోకి చరచరా నడిచివచ్చి, గూడు కట్టుకున్న ఆ "మిథునం" - చలన చిత్రమై వెండితెరపై కనువిందు చేయబోతోందని విన్నదగ్గరనుంచీ ఆత్రమే.. అనుమానమే.. ఆరాటమే! పాత్రధారులూ, చిత్రీకరణ.. "మిథునం"లో అతి ముఖ్యమైన భూమిక ఆ "తోట" ఎలా ఉండబోతోందా అనే ఆలోచనతో పాటూ సంగీతం గురించి కూడా ఊహాగానాలు మొదలయ్యాయి.

ఎట్టకేలకు ఆడియో విడుదల చేసారు. మచ్చుకు చూపించారు. ఆ పాటల కబుర్లు.. నాకు తెలిసినవీ.. నాకు తోచినవీ.. కొన్ని.

తనికెళ్ళ భరణి దర్శకత్వంలో, శ్రీరమణ "మిథునం" స్వరవీణాపాణి చేతిలో స్వరాలద్దుకుంది. జొన్నవిత్తుల, ఆనంద్ ముయిద రావ్, తనికెళ్ళ భరణిల కలంలో సాహిత్యాన్ని వ్రాయించుకుంది. కే. జే. యేసుదాసు, బాలసుబ్రహ్మణ్యం, జమునా రాణి, స్వప్న, జొన్నవిత్తుల గళంలో వినిపించింది.

* "షట్పద ఝుంకారమో.. ఏమో..!" అని ఒళ్ళు పులకలు తేలేలా మొదలయ్యే యేసుదాసు గంధర్వ గాత్రంలో "ఆది దంపతులె అభిమానించే అచ్చ తెలుగు మిథునం.." అనే పాట ఎంత విన్నా చాలుననిపించడంలేదు.

దాంపత్య రసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం

అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం

గృహస్థ ధర్మం సగర్వమ్ముగా తానెగరేసిన జయకేతనం

ఇలాంటి మెరుపులు తళుక్కుమన్న జొన్నవిత్తుల సాహిత్యం చక్కగా ఉంది. యేసుదాసు మంత్రజాలం గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది! జగద్విదితం.. అదో అద్భుతం!!

* నాకు అమితంగా నచ్చిన పాట - అప్పదాసునీ, బుచ్చిలక్ష్మినీ ఠక్కున కళ్ళెదుట నిలబెట్టిన పాట అలనాటి మేటి గాయని జమునా రాణి పాడిన "ఎవరు గెలిచారిప్పుడూ.. రంగా.. ఎవరు ఓడారిప్పుడూ.." ఆనంద్ ముయిద రావ్ వ్రాసారట.

పడుచు మనసున్నోడు పరుగులెడుతున్నాడు
అరవయ్యేళ్ళ పడుచు అలిగి కూర్చున్నాది

కలతలన్నీ కలిపి కలనేతలా నేసి
కన్నీళ్ళు ఒగ్గేసి కలిసి నవ్వేసారు

ఎవరు గెలిచారిప్పుడూ.. రంగా.. ఎవరు ఓడారిప్పుడూ
రెండు గుండెల చప్పుడూ.. రాగమొక్కటె ఎప్పుడూ..



* "పాకవేదం అపౌరుషేయం.. అంటే నీకెట్టా తెలుస్తుందీ.. నిరక్షర కుక్షివి.." అని బుచ్చిలక్ష్మిని ఆడిపోసుకుని శాకాల్లో ఘనపంచరత్నాల చిట్టా చదివిన అప్పదాసుకి ఓ మంచి పాకకళాసారం దట్టించిన పాట ఉండాలని భరణి అనుకున్నారేమో.. ఇదిగో ఆయన కలం నుంచే ఓ మాంచి రుచి కోరు రుచైన పాట.. "ఆవకాయ మన అందరిదీ.. గోంగూర పచ్చడీ మనదేలే"

ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ.. పెసరట్టులోకి అల్లమురా
దిబ్బరొట్టెకీ తేనె పానకం.. దొరకకపోతే బెల్లము రా

వేడి పాయసం ఎప్పటికప్పుడె.. పులిహోరెప్పుడు మర్నాడే..
మిర్చీ బజ్జీ నోరు కాలవలే.. ఆవడ పెరుగున తేలవలే..

గుత్తి వంకాయ కూర కలుపుకొని పాతిక ముద్దలు పీకుమురా..
గుమ్మడికాయ పులుసుందంటే ఆకులు సైతం నాకుమురా..

పనసకాయ నీకున్నరోజునే పెద్దలు తద్దినమన్నారూ..
పనసపొట్టులో ఆవపెట్టుకుని తరతరాలుగా తిన్నారూ..

అని అప్పదాసు మైమరచి పాడుతూంటే బుచ్చిలక్ష్మి పెనం మీద ఆవగింజలా చిటచిటలాడడం మన కళ్ళముందే కనిపించేయాలి కదా.. అతి చమత్కారంగా ముక్తాయింపిచ్చింది మరి..!  ఏమనీ..?

తిండి కలిగితే కండకలదనీ గురజాడవారు అన్నారూ..
అప్పదాసు ఆ ముక్క పట్టుకుని ముప్పూటలా తెగతిన్నారూ.. అని
భలే బుచ్చిలక్ష్మి కదూ! ఈ పాట బాలసుబ్రహ్మణ్యం, స్వప్న పాడారు. సాహిత్యం చదివితే ఓ మంచి పాటకి పేరడీ అని తెలిసిపోవడం లేదూ!

* "మావిడి పిందె కరష్టే కానీ.. అది చిలక కాదు.. ఉడత" అని ఇంగిలీషులో తేల్చి చెప్పింది కనుక బుచ్చిలక్ష్మి తన పెనివిటికి కాఫీ ఇస్తుందంటారా! ఇస్తుందేమో మరి! జొన్నవిత్తుల కాఫీ దండకమొకటి వ్రాసి, స్వయంగా పాడారు కూడా!

"అనుదినమ్మును కాఫీయె అసలు కిక్కు
కొద్దిగానైన పడకున్న పెద్ద చిక్కూ
కప్పు కాఫీ లభించుటే గొప్ప లక్కూ
అమృతమ్మన్నది హం బక్కు అయ్యలారా.." అని సాగే ఈ దండకం "టేస్టేశ్వరి.. బ్రూకు బాండేశ్వరి" లాంటి చిత్ర పద విన్యాసాలతో నడుస్తుంది. "ఎలా ఉందీ.. నచ్చిందా?" అంటే సినిమా చూసేదాకా చెప్పలేను.

* ఎంతటి ఆనందమైనా ఒక ముగింపుకు రాక తప్పదన్న చేదునిజం.. భరణి రచన "ఆట గదరా శివా.. ఆట గద కేశవా.." యేసుదాసు గళంలో వింటూ ఉంటే మసక చీకటిలా కమ్మేస్తుంది.

ఆట గద జననాలు
ఆట గద మరణాలు
మధ్యలో ప్రణయాలు
ఆట నీకూ..

అయిదే పాటలు.. అలరించే పాటలు!

ఆడియో సీడీ కచ్చితంగా మీ ఇంట్లో చేరి మీకు వీనులవిందు చేయాల్సినది.. వెళ్ళి కొని తెచ్చేసుకోండి మరి!


"మిథునం" ఆడియో సీడీ
కీర్తన మ్యూజిక్
వెల: రూ 60/-, $5

Sunday, December 4, 2011

అరచేతిలో ఉసిరికాయ

ఆషాఢం వెళ్తూ వెళ్తూ కొత్తకాపురానికి పచ్చ జండా ఊపి వెళ్ళిందేమో.. ఓ గూట్లోకి చేరిన ఆ నవదంపతులు  హుషారుగా కాలం గడిపేస్తున్నారు. ఓ వారాంతపు ఉదయం ఏం జరిగిందంటే..

"సీతమ్మ పెనివిటీ సీరామ చంద్రుడూ ఆజానుబాహుడమ్మా.. చూడగా అబ్బాయి హరవింద నేత్రుడమ్మా.."
"హరవింద ఏవిటీ..? "అరవింద" తెలుగు మేష్టారమ్మాయివి మళ్లీ!"
"ఏం కాదు. 'బుచ్చిలక్ష్మి' అల్లాగే పాడుతుంది."


"పిల్లా.. చూసావా?వంకాయలు ఎంత తాజాగా ఉన్నాయో!!కుమిలి వంకాయలు."
"పచ్చడికి తాజా వంకాయకంటే వాడినవే శ్రేష్ఠం."
"నీకెవరు చెప్పారోయ్! నిన్న కాక మొన్నేగా గరిట చేత పట్టావూ.. పాకశాస్త్రం  ఔపోసన పట్టిందాన్లా చెప్పేస్తున్నావ్!!!"
"అప్పదాసు అంటాడు. పచ్చడిలో కొత్తిమీర దూడ మేతలా ఊరిఖే వేసెయ్యకుండా.. అసలు విషయాన్ని మింగేయకుండా తత్వాలు పాడేటపుడు తంబూరా శ్రుతిలా ఉండాలటా!!"
"సరిపోయింది!"
"ఆ.. అసలు శాకాల్లో ఘన పంచరత్నాలని చెప్పేసి ఉన్నాయట! గుత్తి వంకాయ కూరా.. కందా బచ్చలీ, మంచి గుమ్మడీ శనగపప్పూ.."
"పనసపొట్టు ఆవకూర..."
"మీకెల్లా తెలుసూ.. 'మిథునం' చదవలేదంటిరే!"
"పనసపొట్టు కూర గురించి తెలుసుకోడానికి పుస్తకాలు చదవక్కర్లేదోయ్! తెలుగు నేలలో పుట్టి, దంతసిరున్న వాడెవ్వడైనా చెప్తాడు. ఇంతకీ ఏవిటా మిథునం? వంటల పుస్తకమా, ఏం?
"హవ్వ.. హవ్వ..!!"
"చాల్లేవో, నీ వేళాకోళం. ఆ నవలేదో ఇచ్చేమాటుందా లేదా?"
"నవల కాదు. కథ"
"ఓస్.. కథా. నేనింకా పేద్ద నవలనుకున్నానే.. నువ్వింతలా ఊదరగొట్టేస్తూ ఉంటే"
"నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల!"
"అబ్బో.. మంచి వకాల్తాయే తీసుకుంటున్నావ్!"


"ఏం చేస్తున్నావమ్మాయ్?"
"అంట్ల పిల్లలకి నీళ్ళు పోస్తున్నాను. ఏం కావాలటా?"
"భుక్తాయాసానికి విరుగుడు తాంబూల సేవనమూ, పుస్తక పఠనమూను."
"ఇంకా భుక్తాయాసమూ బీరకాయా అంటారేంటీ! ఎడాకటి వేళయిపోతూంటే!"
"పోనీ ఇంకో వక్కపలుకు తెచ్చి పెట్టి.. ఏదీ ఆ పుస్తకమేదో ఇలా ఇచ్చి వెళ్దూ!"
"మరే! కూటి కునుకు బాగా పడుతుంది పుస్తకం చేతిలో ఉంటే."
"హ్మ్..చదివే పుస్తకాన్ని బట్టి ఉంటుంది."
"ఇదిగో.. నిద్ర వచ్చిందో, రాలేదో చదివాక మీరే చెప్పండి ."
"నువ్వూ ఇక్కడే ఉండకూడదూ, నీకు అంత నచ్చేసిన కథ కదా! ఏ వాక్యానికావాక్యం ఇద్దరం ఓ మాటనేసుకోవచ్చు."
"వద్దులెండి. నా అభిరుచులేవో మీకు బలవంతంగా అంటించానని అపప్రథ నాకెందుకు? నచ్చితే చదవండి. లేదా గురక పెట్టి బజ్జోండి. అలా కూడా పుస్తకం హస్త భూషణమే!"
"అంత ఉడుక్కోకోయ్! నీకు అంత నచ్చిన కథ నాకు కొంతైనా నచ్చదా! నచ్చుతుందిలే."
"సరే అయితే.. నేనేం మాట్లాడను. "
"ఊ.. అప్పటికే పొద్దు వాటారింది."
"ష్ష్.."
"......"
"......"


"ఓపెనింగే ఓఘాయిత్యం మాటలూ.. ఏవిటోయ్ ఈ బుచ్చి లక్ష్మి!?"
"తినబోతూ రుచడుగుతారేం? బుచ్చిలక్ష్మి నోట పొల్లు మాట రాదులెండి కానీ, మాట్టాడకుండా చదువుకోండి. "
"వార్నీ ముసలి ఘటమా.. మీ అప్పదాసు తక్కువ వాడేం కాదో.. సతీ సహగమనం కోరుతున్నాడు. పాపం బుచ్చి లక్ష్మి!"
"అప్పుడే ఏవయిందీ.. "
"..."


"ఎవడి రుచి బతుకులు వాడివి. ఎంత కొడుకులైతే మాత్రం అకారణంగా వాళ్ళమీద వాలిపోకూడదు..నిజం కదూ! మంచి ఫిలాసఫీ అప్పదాసుది. అందుకని నూనెలో ముంచి తీసిన యేకులాంటి ఎనభైయేళ్ళ ముసలాయనా.. పెళ్ళామూ ఒంటరిగా ఉంటున్నారా! వింతే!"
".. "


"హహ్హహా"
"?"
"వెర్రి పుచ్చలు కాదు. నా బిడ్డలు రత్న మాణిక్యాలని బుచ్చిలక్ష్మి మురిపెంగా వెనకేసుకొస్తూంటే నవ్వొచ్చింది. తల్లి ప్రేమ! అయినా కొడుకుల దగ్గరికి తల్లిని వెళ్ళనివ్వకుండా ఆకట్టడం నేరం"
"చూస్తిరా! అప్పుడే బుచ్చి లక్ష్మిని వెనకేసుకొచ్చి అప్పదాసుగార్ని అనేస్తున్నారు!"
"హ్మ్.. "


"బావి గట్టుకి అందిపుచ్చుకునట్టు ఎప్పుడూ ఉరక తగిలే చోట అయిదారు అరటి చెట్లూ.. అమ్మకొంగు పట్టుకుని నిలబడ్డ పిల్లల్లా వాటిపిలకలూ.. అబ్బబ్బబ్బో.. ఏం చెప్పాడయ్యా! బుచ్చి లక్ష్మీ -  పిల్లలూ ఇల్లాగే ఉండే వారేమో ఓ కాలంలో!"
"హహ్హహ్హహా.. మంచి ఊహే!"


" రోజూ నీళ్ళడగని బాదం చెట్టు ఓ మూలనా, పక్కనే ఉన్నా తోటి కోడళ్ళలా అంటీ ముట్టనట్టు దబ్బా, నిమ్మా ఉన్నాయా.. పొల్లు మాటొక్కటుందా అని! ఒక్కో మాటా ఒక్కో మాణిక్యంలా జిగేల్మంటూ ఉంటే!"
"ఊ.."
"విన్నావా.. "నేల మీద చుట్టలు చుట్టలుగా అల్లుకున్న గుమ్మడి పాదు అప్పుడే ఊరేగి వచ్చిన శేష పాన్పులా..  ఇల్లెక్కిన ఆనప్పాదు అనూపంగా అల్లుకుని కప్పుని కపేసినప్పుడు ఆ బొమ్మరిల్లు అద్దంలో కొండ! తులసి కోట చుట్టూ పరిచారికల్లా మందారాలూ మంకెనలూ కాగడాలూ.. కోట స్థంభాల్లా కొబ్బరి చెట్లూ.. వాటి మానుల చుట్టూ దవనం, మరువం చేమంతీ చేరి స్థంభాలకు పచ్చలూ కెంపులూ పొదిగిన పొన్నులు తొడిగినట్టే" .. గాభరా వచ్చేస్తోంది.. అహ్హా.. ఏం తోటా ఏం తోటా..మా శేషమ్మామ్మగారి పెరడు గుర్తొచ్చేస్తోంది. చెప్పానా నీకు? శృంగవరపు కోటలో ఎకరం పెరడూ, మండువా ఇల్లూ అని. ఉండు మళ్ళీ చదవనీ!"
"హహ్హహా.. అచ్చం నాకూ ఇల్లాగే అనిపించింది మొదటి సారి చదివినప్పుడు! దార్లో పడ్డారన్నట్టే! ఆ.. చెప్పారు. పెళ్ళికి మీ తరపు వాళ్ళలో పెద్ద కానుక చదివించింది ఆవిడేగా. వెండి ఉగ్గుగిన్నె."
".."
"అబ్బా..స్స్.. గిల్లడాల్లేవ్. ఉడుక్కోడాలు అంతకన్నాలేవ్"


"అబ్బబ్బబ్బా.. తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా అని కొట్టుంటున్నారయ్యా మొగుడూ పెళ్ళాలూను.. మరీ ఉప్పూ నిప్పూను!"
"తినగా తినగా గారెలు చేదని మనమూ, ఇంకా మాట్టాడితే ప్రతి మనువూ అంతేనేమో! కొత్తొక వింత!!"
"అబ్జెక్షన్ యువరానర్. అభాండమ్స్ వెయ్యవలదు. నాకు పాత రోతేం కాదని నీకు నిరూపిద్దామంటే నువ్వు నా ఏకైక మొదటి పెళ్ళానివాయె!"
"హహ్హహా.. మీకు నేను చాలు కానీ..రామాయణంలో పిడకల వేటా..!"
"చూడు.. అంతలోనే సత్సంగత్యమని పెళ్ళానికి జామ కాయ నమిలి పెట్టాడు! మా మగాళ్ళ మనసు వెన్న."
"ఆహా..ఆడాళ్ళ మనసేమో కవ్వమూ కుంపటీను? చదవండి కబుర్లాపి."


"హహ్హహా.. వెర్రి బుచ్చి లక్ష్మి! మరీ ఇంత అమాయకురాలేం! "ఉల్లి మన నేలన ఊరదురా.. చూసాంగా!" అని పెనివిటిని పట్టిచ్చేసిందీ!"
"బుచ్చి లక్ష్మి అమాయకత్వం ఇప్పుడేం చూసారు! ముందుంది."
"ఈ నక్షత్రకుడు మాత్రం పాపం తెగ తిట్లు తింటున్నాడు. "తోకచుక్క లా నా కొంప చుట్టూ తిరుగుతావేమిట్రా!" అని ఆడిపోసుకుంటున్నాడు అప్పదాసు!..హహ్హహా!!"
".."


"ఈ అప్పదాసుకి పొద్దస్తమానం తిండి రంధేనా.. ఏం? కానీ శబ్బాష్ .. ఇతగాడి మాటే మాట!! "ధప్పళం తెర్లుకుంటే క్షీరసాగర మథనంలా కోలాహలంగా ఉండవలె.. పోపు పడితే తొలకరిలా ఉరిమి రాచ్చిప్పలో ఉప్పెన రావలె - నా శార్ధం రావలె.. " హ్హహ్హహ్హా.. బుచ్చి లక్ష్మి ముక్తాయింపు మాత్రం అద్దిరిపోయింది."
"హ్మ్మ్.. మరే.. మీ మగాళ్ళు! కడుపే కైలాసం సాపాటే పరమావధీను."
"ఆ మాటకొస్తే కోటి విద్యలూ కూటి కొరకేగా! అయినా మా మగాళ్ళని ఆడిపోసుకోనేల బాలా? వండుకున్నమ్మ తినక మానుతుందా!
"సరే, పిండి రుబ్బుకుని పెసర పుణుకులు వేసుకు తినొస్తాను. వండుకునేదీ నేనే. తినేదీ నేనే. మీకు మాత్రం అంతా మిధ్య. చదూకోండి. కథ రసకందాయంలో పడుతోందిగా.. రసపట్టులో తర్కం కూడదని గీతాచార్యుడు మాయాబజార్లో చెప్పాడు కూడాను!"
"రాక్షసీ"
"ఆనక 'రాకా శశీ' నేనే అంటారు.. పెసర పుణుకులూ, అల్లం పచ్చడీ కమింగ్ రైట్ అప్"


పచ్చీ మిర్చీ కొత్తిమీర, తంబూరా శ్రుతిలా తగిల్చిన తత్వంలా వేడివేడి పెసర పుణుకులూ, రుద్రాక్ష పరిమాణంలో ఇంగువ పోపుతో అల్లం పచ్చడీ వంటింట్లో రూపు దిద్దుకోవడం పూర్తయ్యే సమయానికి, మౌనంగా వచ్చి ఆమెని వెనక నుండి కావలించుకున్నాడు. జ్వరం తగ్గి మంచం దిగొచ్చిన పిల్లాడిని సవరదీసినట్టు, మునివేళ్ళతో అతని తల నిమురుతూ ఉండిపోయింది తను.

"కథ ఇలా ముగిసిందేమనిపించట్లేదు!"
"అదే కదా! ఎందుకో ఇంతకంటే వేరే ముగింపు ఊహకి కూడా అందదు."
"..."
"మీకెవరు నచ్చారు! నాకయితే బుచ్చిలక్ష్మి అంటే మహా ఇష్టం. మీకు అప్పదాసు నచ్చుతాడేమో!"
"ఊహూ.."
"మరి!"
"వాళ్ళిద్దరూ కాదు. దీవెన్ల ఫకీరు ఆకా తోకచుక్క వెధవ నచ్చాడు."
"హహ్హహ్హా.. ఊహించలేదు సుమీ!"
"మనని మనం ఏ పాత్రతో ఎక్కువ పోల్చుకుంటామో వారేగా ఎక్కువ నచ్చుతారు కదా!"
"అయితే మీకు అప్పదాసూ, బుచ్చిలక్ష్మీ ఇద్దరూ చెప్పలేనంత నచ్చేసారు. దీవెన్ల ఫకీరుకి నచ్చినంత!"
"ఊ.. ఈ కథ నీకు కంఠతా కదూ! బహుశా నాక్కూడానేమో ఇక నుంచీ"
"కంఠతా, కరతలామలకమూను. పుల్ల పుల్లగా, తిన్నాక తీపి మిగిల్చే ఉసిరికాయలా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇదే మంచి అనుభూతి ఎన్నిసార్లు చదివినా దొరికేస్తుంది. "ఎందుకూ..? " అని ఆలోచించేదాన్ని. బహుశా అప్పదాసు గారూ, బుచ్చిలక్ష్మీ ఉన్నట్టు ఇంకొకరు ఉండలేరు, ఉండాలని ఆశ లేనివారూ ఉండరు. అదే అనుకుంటా ఈ కథ విజయరహస్యం."

వంటింటి కిటికీలోంచి ఇంటి వెనకున్న బీడుకి అడ్డం పడి వస్తున్న పశువుల మందని చూస్తున్నాయ్ వాళ్ళ కళ్ళు మౌనంగా. దూరంగా ఆవుల అంబారవాలూ, కాపరుల అదిలింపులూ, మాటలూ వినిపిస్తున్నాయి.

"ఏట్రా పైడితల్లీ ఎర్రావు ఈతకొచ్చీసినాదేటి! జున్నెప్పుడెడతావ్?"
"నేదు మావా.. మూన్నెల్లాగాల! దీపాలమాసెక్కానీ ఈనదురా మా ఎర్రమాలచ్చిమి!"

మందలో ఆఖరుగా, నారింజ ధూళి రేపుతూ భారంగా సాగిపోతున్న ఎర్రావుని చూస్తూంటే.. అప్పదాసు గారు దాని ఒళ్ళంతా నిమిరి "మళ్ళీ జున్నెప్పుడు పెడతావమ్మా?" అని అడిగి, తన వాటా శనగల్లో గుప్పెడు ఆప్యాయంగా తినిపించిన కామధేనువు గుర్తొచ్చింది ఆ ఇద్దరికీ.. ఒకే సారి. "మిథునం" మరి కొన్నేళ్ళు .. ఇంకా ఎక్కువే గుర్తుండిపోతుందేమో!!
  
                               **********


* శ్రీరమణ "మిథునం" కథ మరోసారి చదివిన సందర్భంలో.. శతపోరి నాచేత ఈ కథ చదివించిన నేస్తానికి చిరుకానుకగా..

తెలుగు పాఠకులకు చిరపరిచితమైన ఈ కథపై చర్వితచర్వణమే అయినా సమీక్ష రాయమని ప్రోత్సహించిన బ్లాగ్మిత్రులు "అంచేత నేను చెప్పొచ్చేదేంటంటే!!!!!" శంకర్ గారికి ధన్యవాదాలు.