"వాల్మీకి లోకానికి ఓ మహోపకారమూ, ఓ మహాపకారమూ చేశాడు." అన్నారట ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు, ఎస్వీ భుజంగరాయశర్మ గారితో..
"రామాయణాన్ని వ్రాసి ఈ జాతి అభిరుచుల్నీ, అభిప్రాయాల్నీ యుగయుగాలుగా తీర్చిదిద్దాడు. అది మహోపకారం కాదా!"
"సరే, అపకారం ఏమి?" టన్నారు భుజంగరాయశర్మ.
"మరి కొత్తది రాయడానికి ఎవరికీ ఏమీ మిగిల్చిపోలేదు." అన్నారట హనుమచ్ఛాస్త్రి గారు.
వాల్మీకి రామాయణంలోంచి శాఖోపశాఖలుగా విస్తరించిన అభివ్యక్తులన్నీ దేశాల ఎల్లలు దాటి విస్తరించాయి. రామాయణపాత్రల్నీ, వర్ణనల్నీ మించి కొత్త ఊహ ఏదైనా ఉందా అంటే అనుమానమే. పూర్వకవుల దగ్గర్నుంచీ ఏదో ఒక పాత్రని ఆరాధించడమో, సన్నివేశాన్ని విశ్లేషించడమో, వాల్మీకంలో వాచ్యార్ధానికి వెనుక ఇంకా ఏదైనా ఉందా అని ఆలోచించడమో జరుగుతూనే ఉంది. ఆ చింతనల్లోంచి చిలవలు పలవలుగా పుట్టిన పిట్టకథలు వాల్మీకి రామాయణపు సొగసునూ, గాఢతనూ పెంచేవే. ఊర్మిళ నిద్ర అలాంటి కథ.
జనకుడికి నాగేటిచాలులో దొరికిన బిడ్డ సీత, ఆపై ఇంకొక కూతురు ఊర్మిళ. జనకుని తమ్ముడు కుశధ్వజుడు సాంకస్య పట్టణపు రాజు. ఆయనకీ ఇద్దరు కూతుళ్లు. నలుగురు రాజకుమార్తెల్నీ అయోధ్యా రాకుమారులకి ఇచ్చి ఒకే ముహూర్తానికి పెళ్లి చేసాడు జనకుడు. వాల్మీకి రామాయణంలో ఉన్నది ఇంతే.
ఊర్మిళ నిద్ర, లక్ష్మణదేవర నవ్వూ ఇవన్నీ జనకథలే. అన్నగారివెంట అడవులకి వెళ్లిన భర్త విరహాన్ని భరిస్తూ ఒంటరిగా ఉండిపోయిన ఊర్మిళ ఏమై ఉంటుందనే ఊహ మనసుని మెలిపెడుతుంది.
పతంజలి శాస్త్రిగారి "కచ్ఛపసీత" కథ ఆ ఊహని వేరే స్థాయికి తీసుకెళ్తుంది. ఈ కథ గురించి ధూళిపాళ అన్నపూర్ణ గారు సమీక్షించినప్పుడు తెలిసింది. ఆ విదుషిని మెప్పించిన కథ ఎంత బావుండి ఉంటుందో అనుకున్నాను. పుస్తకం అంది చదివిన మొదటిసారి, రెండో సారి, ఎన్నిసార్లో... ఇదిగో ఇప్పుడు ఇంకోసారీ కూడా అదే అలజడి. కొక్కేలు వేసి లాగే వాక్యాలు ఎన్ని ఉన్నాయని. రామాయణం కొన్ని సర్గలు ప్రత్యేకంగా వెతుక్కుని చదువుకున్నాను, మళ్ళీ కథ చదువుకున్నాను. తీరదే!
భారతీయ తాత్విక దృక్పథానికి రచయితకి ఉండాల్సిన అనుసంధానం గురించి శాస్త్రి గారి మాటల్లో అక్షరయాత్రలో విన్నవి మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకున్నాను. ప్రాచీన సాహిత్యకారులు తాత్వికతకి మనిషి అస్తిత్వానికి లంకె వేసి మనకందించారు. నెమ్మది నెమ్మదిగా సగర్వంగా అన్నీ జారవిడిచుకున్న తరానికి ఆఖరు ప్రతినిధిని నేను. ఇప్పుడు ఏడ్చి మొత్తుకుంటే దొరికేదా జ్ఞానం?
లక్ష్మణుడి సాన్నిహిత్యాన్ని, ప్రేమని తల్చుకు తల్చుకు శల్యమై పోతున్న కూతురితో తండ్రి చెప్పే మాటలు ఏ బాధకైనా వర్తించేవే. "దుఃఖాన్ని లేదనుకోవడం అజ్ఞానం, దాన్ని విస్మరించమని చెప్పడం అమాయకత్వం. నువ్వు ముందు దుఃఖాన్ని అర్ధం చేసుకో. నువ్వు ఏ ఉపశమనం కోరుకుంటున్నావో అది వెలుపల ఉండదు. నీలోనే, నీ ఆధీనంలోనే ఉంటుంది."
అయినా ఊర్మిళకి దారి దొరకదు. దుఃఖంలోంచి, ఆగ్రహంలోంచి విజ్ఞతలోకి ప్రయాణిం చడమేమీ సులువు కాదు అంటాడు ఊర్మిళతో తండ్రి.
"బాల్యంలో తప్ప క్షత్రియస్త్రీ కి సుఖముండదు" అని చెప్తుంది సీత తన చెల్లెలితో. పుట్టింటికి వెళ్లిపొమ్మని, బాల్యాన్ని పునర్జీవించమని ప్రోత్సహిస్తుం ది. ఎంత గాఢమైన ఆలోచన! ఎంత అపురూపమైన ఊహ!
ఒడిదుడుకులు అన్నీ మానవప్రయత్నానికి లొంగి దారివ్వవు. ఒక్కోసారి తలవంచక తప్పదు. బాల్యంలోకి ఎలాగైనా పారిపోగలిగితే చాలని క్షణకాలమైనా అనుకోని వారుంటారా? ఇంత తాత్వికతని అస్తిత్వానికి లంకె వేసి కథలో చుట్టి అందించారు పతంజలిశాస్త్రి గారు.
"జీవితంలో మళ్ళీ సౌమిత్రిని చూడలేనేమోననే భయం హృదయం మీద శిలవలె ఉండేది. తన జీవితం భయం ఉండచుట్టిన వియోగం." అనుకుంటుంది ఊర్మిళ.
ఊర్మిళ అంటే 'కోరిక కలిగినది' అని చెప్తారు. ప్రతీ స్త్రీ ఊర్మిళ కాదూ? సంతోషంగా జీవితం గడపాలని చూసే మనిషి కాదూ?
కథకి మలుపు అవసరం కాబట్టి కచ్ఛపసీత ఊర్మిళ కథలోకి వస్తుంది. ఆమెకి పట్టుకొమ్మ దొరికినట్లయింది. తనలోకి తాను అంతర్లోకనం చేసుకోమని తండ్రి చెప్పాడు. బాల్యానికి వెళ్లిపొమ్మని అక్కచెల్లెలు చెప్పింది. దానికి మార్గమే తాబేలు రూపంలో కనిపించిందేమో. ప్రతీకాత్మకంగా సాగే కథలో మణిపూసల్లాంటి మాటలెన్నో. "ఎక్కడ నుంచి వస్తాయీయనకి ఇలాంటి ఊహలు!" అని ముచ్చటపడి మళ్ళీ చదువుకోవడమే. "ఊరుకో.. నీ కన్నీళ్లు సౌమిత్రి కళ్ళలో తిరుగుతున్నాయి." అన్న వాక్యం కొన్ని జన్మలకి కూడా నన్ను వదిలిపోదేమో!
ప్రాచీనసాహిత్యం అందకుండా ఒక తరాన్ని సాహిత్య పరంగా నిర్వీర్యం చేసిన మార్పుల గురించి కూడా పతంజలిశాస్త్రిగారికి కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి. పంచతంత్రం, పురాణేతిహాసాల్లో ఉన్న కాల్పనికత, మార్మికత మనిషి మెదడుకు పదును పెట్టే అంశాలు అంటారాయన. సమకాలీనతకు అద్దం పట్టేలా రాయడమొక్కటే సాహిత్యపు పరమావధి కాదు, ఆ పని చేసేందుకు వేరే మార్గాలున్నాయంటారు. పిడుగుపడి చెట్టు కూలితే బాల్కనీలోంచి చూసి అర్జంటుగా సోషల్ మీడియా లో కవిత్వమో కథో వెలార్చడాన్ని సృజనాత్మకత అనుకొమ్మని బలవంతం చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కొత్త విశేషణాలెందుకు పుట్టట్లేదు? కొత్త పోలికలు ఎందుకు అందట్లేదు? నింగికీ, మన్నుకీ, పచ్చని చెట్టుకీ, పారే నీరుకీ దూరమైన మనిషికి కల్పనా, కవిత్వమూ ఎక్కణ్ణుంచి వస్తాయి?
"పచ్చని చెట్ల నీడలో పడుకుని నీ బాల్యంలోకి వెళ్ళు. మన సుఖసంతోషాలని అక్కడ విడిచి వచ్చాం." అని చెప్తుంది సీత. కష్టాల కడలిలో ఎలా అంతర్ముఖమవ్వాలో కచ్ఛపసీత చూపి స్తుంది. ఊర్మిళ నిద్రపోతుంది.
నిజంగా నిద్రపోయిందా? అందులో స్త్రీ సాధికారత ఏముంది? అసలీ కట్టుకథ వలన ప్రపంచానికి ఏం ఒరుగుతుంది? అని ప్రశ్నించే వారికి ప్రతీకాత్మకత అంటే చెప్పగలిగిన శక్తి రామాయణభారతాలకి కూడా లేదు.
శాస్త్రిగారు ఒక మాట అంటారు.. ప్రాచీన సాహిత్యమొక్కటే సాహిత్యమని వాళ్లెప్పుడూ చెప్పలేదు. కానీ ఆధునికులు అభ్యుదయ సాహిత్యమొక్కటే సాహిత్యమని ఒక తరాన్ని గొప్ప అనుభవం నుంచి దూరం చేసేసారు అని.. ఎంత కఠోరనిజమది!
సి. ఆనందారామం అంటారు.. "కాపీరైట్ హక్కులు లేవనే కదా రామాయణ భారతాల్ని ఇష్టానికి తిరగరాస్తు న్నారు?" అని. నచ్చనిదాన్ని విశ్లేషించడమో, విమర్శించడమో కాక తమ భావజాలాన్ని ఆ పాత్రల మీద రుద్దడంలో నైతికత ఎప్పుడూ ప్రశ్నార్ధకమే.
అసలు కథ సౌందర్యాన్ని వెయ్యింతలు చేసేలా రాసిన "కచ్ఛప సీత" లాంటి కథ చదివి ఆ తిరగరాతల్ని చదివిన బాధని కడిగేసుకున్నాననిపించింది.
మొన్న జరిగిన పతంజలిశాస్త్రిగారి పుట్టినరోజు సందర్భంగా "సారంగ"లో వచ్చిన వ్యాసాల్లో రెండు - "గోదావరి పడవలా మా అన్నయ్యగారు" లో తల్లావఝల శివాజీ తన అన్నగారి కంటే తనెన్ని వందలేళ్ళ చిన్నో నిరూపించుకునే విఫలప్రయత్నం చేశారు. శివాజీగారి మెటాఫర్లకి నేను వీరాభిమానిని. "ఎంగిలి కాని వాక్యాలతో అసలు కథ" అని కె. రామచంద్రారెడ్డి గారు వడ్లచిలకలు కథ గురించి రాశారు. "ఈమాట" లో కె. సురేష్ గారు "శాస్త్రిగారి అరవై ఏళ్ల అక్షరయాత్ర" ని సింహావలోకనం చేశారు. మూడూ ఇంకోసారి చదువుకుని, మృణాళిని గారి అక్షరయాత్ర చూసి, నిద్రకి ఒరుగుతూ ఇంకోసారి కచ్ఛపసీతని తల్చుకున్నాను.
ఊర్మిళకి దొరికిన దారి ఎప్పటికైనా నాకూ దొరకకపోతుందా.. ఇలాంటి కథలు చదువుతూ చదువుతూ ఉంటే ఎప్పటికైనా అని.
అన్నట్టు మనలో మన మాట - రామచంద్రారెడ్డి గారి విసురొకటి భలే నచ్చిందబ్బా! "ఎందుకింత శ్రమపడి చెరకు చీల్చి రసం తాగడం. డిస్పోజబుల్ గ్లాస్లో ఐస్ కలిపి గొంతులోకి దిగిపోయే రెడీమేడ్ సరుకు వుండగా అనే చదువరులకు ఓ దణ్ణం." అని...
చెరుకుముక్క నవులుతూ... శాస్త్రిగారికి ఓ దణ్ణం పెట్టుకుంటున్నా.
కచ్ఛపసీత కథ, మరో పదకొండు కథలతో కలిపి "రామేశ్వరం కాకులు" కథాసంకలనంలో ఉంది. ఛాయా ప్రచురణ
Enjoyed reading this piece. Worth reading a few times. Worth saving for future reference also but I am having difficulty copying. Can you please enable copying for this and your future essays? Thanks.
ReplyDeleteబుక్ మార్క్ చేసుకోవచ్చండీ. ధన్యవాదాలు!
Deleteమీ కధలు కూడా నాకు "వడ్లచిలకలు" లాగా అనిపిస్తాయి. ఒకటికి రెండుసార్లు చదవవలసి వస్తుంది. సాహిత్యం గురించి మీవంటివారు అయినా రాయకపోతే చాలా తప్పు చేసినట్లే సుమా !
ReplyDeleteచదువుకుని ఊరుకోవడమే కానీ, రాయడం ఎందుకో అలవాటవలేదండీ. అప్పటికీ అప్పుడప్పుడిలా.. :) ధన్యవాదాలు.
Deleteపతంజలి శాస్త్రిగారి కథా వస్తువులు, శైలి, శిల్పం.. అన్నీ పాఠకుల్ని ముగ్ధుల్ని చేసేవే. సామాన్యమైన వస్తువుని అసామాన్యమైన కథగా మార్చే నైపుణ్యం పుష్కలంగా ఉన్న రచయిత. వీరి తాజా కథ 'రమ సంగతి?' ఇంకా వెంటాడుతోంది.. 'కచ్ఛప సీత' మూణ్ణాలుగు సార్లు చదివిన కథ. మీ విశ్లేషణ - ఎప్పటిలాగే - బాగుంది..
ReplyDelete"రమ సంగతి?" కథ గురించి మీరు రాయాలండీ మురళి గారూ!
Deleteఒక లైకో,లవ్వో కొట్టేసిపోయే అవకాశం ఉంటే ఇలా రాయకపోదునుకదా...😊
ReplyDeleteThank you.
:) ధన్యవాదాలు!
Delete