Tuesday, November 1, 2011

ప్రేమ ఝరి


అనగనగా ఒక తోట. ఆ మాలి బహు నేర్పరి. కుదుళ్ళు తీసి, మొక్కలు నాటి, పాదులు చేసాడు. నీరు పోసాడు. తీవెలను చిక్కులు పడకుండా పందిళ్ళ నేసాడు. దివ్య పరిమళాలు వెదజల్లే పూవుల మొక్కలు, నీడనిచ్చి సేదదీర్చే తరురాజాలు, వాటినల్లిన విశేషమైన బదనికలు, చిత్రవర్ణ సుమాలద్దుకున్న లతానికుంజాలు ఎన్నో ఎన్నెన్నో. ఆ తోటలో పూవుల ప్రత్యేకత ఏమిటంటే అవి ఎన్నటికీ వసివాడవు, కసుకందవు. నిత్యనూత్నంగా, నవనవోన్మేషంగా బాటసారులకి కనువిందు చేస్తాయి, హాయి గొలుపుతాయి. ఆ మాలి "శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి గారు." ఆ పూవులు వారి రచనా సుమాలు.

దేవులపల్లి వారి రచన నారికేళపాకమేమీ కాదు. సులువైన, అందమైన తేనెలూరు పదాల్లో చిక్కని భావనని పొదిగే నేర్పు వారి సొంతం. అందినట్టే ఉండి చదివిన ప్రతి సారీ మునుపెరుగని కొంగొత్త సొబగులు చూపించే వైచిత్రి వారి రచనలది. వారి రచనలను నాబోటి సామాన్యులు విశ్లేషించాలని బయలుదేరడం, చీమ గంగా ప్రయాణమంత దుస్సాహసం. కానీ, చల్లని పిల్ల తెమ్మెరలా తాకే వారి రచనా సౌందర్యానికి ముగ్ధులై, చలించి "ఆహా..!!" అనకుండుట ఎవరి శక్యం! వీణియ పలికే రాగాల వెల్లువకి తడిసి తల తాటించని మనిషుండునా! వాడు సంగీత జ్ఞానం లేని పామరుడే అయినప్పటికిన్నీ! సముద్రపు అలవికాని ఆకర్షణకి లోనై దాన్ని కావలించుకోవాలని పరిగెత్తిన వాడికి, కాళ్ళు తడుపుకొని, అలలతో ఆడితే తృప్తి తీరదు, కానీ వేరే దారి లేదు. దేవులపల్లి వారి కైతల కడలి ఒడ్డున కాసేపు..

దేవులపల్లి వారనగానే మనసులో మెదిలేది కృష్ణపక్షం. కృష్ణపక్షమనగానే మనసు పొరల్లో తళుక్కున మెరిసే పద్యపంక్తులివి..

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజమ్ము,
చంద్రికలనేల వెదజల్లు చందమామ,
ఏల సలిలంబు పారు, గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

మావి గున్న కొమ్మను మధుమాస వేళ
పల్లవము మెక్కి కోయిల పాడుటేల?
పరుల తనియించుటకొ? తన బాగు కొరకొ?
గానమొనరింపక తన బతుకు గడవబోకొ.

అరడజను మంది ఆడపిల్లలలకి అందమైన పేర్లు ఈ రెండు పద్యాలలోనుంచి వెతికి పెట్టేసుకోవచ్చు. ఎంత చక్కని, సుకుమారమైన, భావపుష్టి గల పదాలు! కృష్ణ శాస్త్రి గారు సంపూర్ణమైన ఆశావాది. అలుపెరుగని ప్రేమ పిపాసి. ఆయన హృదయం పూరేకులా మహ సున్నితం. ఎక్కడా కఠినమైన పదాలనే వేడి వేసవి గాడ్పులు మనపై వీయనీయరు. చల్లగా, హాయిగా.. గున్నమావి, కోయిల, సలిలము,చందమామ అంటూ ప్రేమతత్వాన్ని ఉగ్గుపోసేస్తారు.

ఈశ్వరునికీ ముముక్షువుకీ మధ్యనవనీ, ప్రేయసీ ప్రియులమధ్య కానీ ఇరువురి మధ్య నుండే ప్రేమని మనసుకి అతి సాధారణమైన స్థితిగా భావించడం ఎంత గొప్పవిషయం! "పువ్వులు ఘుమ్మన్నాయా? చందమామ వెన్నెలతో మాయ చేసాడా? నీరు పల్లమెరుగును కదా? గాలి వీస్తోందా? అంత సామాన్యమైన భావన ప్రేమ కలగడం. నా జీవన పరమార్ధం నిన్ను ప్రేమించడమే. ఇదేం వింతా, కొత్తా కాదు సుమా! నా పని ఇదే!! కాల్చుట అగ్ని లక్షణమెలాగో, వీచుట గాలికి ఎంత సహజమో, నిన్ను ప్రేమించుట నా లక్షణం. నేను దీనిని గొప్పనుకోవట్లేదు. తన స్వభావమును పాటించని వస్తువు ఎంత సృష్టి విరుధ్ధమో, నీపై ప్రేమ లేని నేనూ అంతే. వద్దంటే చందమామ వెన్నెల దాచుకోగలడా? ఇదీ అంతే. నా ప్రేమ ఇంత!!" అని ప్రియుడో, ప్రేయసో ప్రేమ పట్టలేక "ఇదిగో.." అని మనసు తెరిచి చూపించినట్టుంటుంది. ఇంతకంటే నిర్ద్వంద్వంగా, నిష్కర్షగా తన ప్రేమలో స్వచ్చతని వేరొకరు చెప్పుకోగలరా! ప్రేమతో సంపూర్ణమవని హృదయమేల?

మరి పగలు వెంట రాత్రిలా, విరహం వెంట రాని ప్రేమ.. గాఢత పొందని స్థితిగా మిగిలిపోదూ! విరహమూ ఉంది. "ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?" అన్న బాధా వీచిక అందుకే. విషాద సౌందర్యం దేవులపల్లికే ఎరుక.
"చంపేసావయ్యా?" ఇది సామాన్యుడి బాధలోంచి పుట్టిన మాట.
"ఏదొ వక్షమ్మునందు బాధింప దొడగె
హృదయమా! కాదు బాణంపుటినుపముక్కు." అంటారు విరహాగ్నిలో రగులుతున్న గాలిబ్ గుండెను ఆవహింపచేసుకున్న దాశరధి.
కృష్ణశాస్త్రి అయితే చేదు తెలియనివ్వని హోమియోపతి మాత్రలాంటివారు. మిఠాయి ముసుగేసి కటిక నిజం చూపిస్తారు.వారి పంథా వేరే. విరహపు బాధని అలతి పదాలలో పేర్చి మన గుండెని తన బందీ చేసేసుకుంటారు.

నాకు స్వతఃసిధ్ధమూ , విధేయమూ అని నిన్ను ప్రేమించానే.. నాకూ తప్పదా ఈ విరహబాధ? " ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను?" నిను మరచి, ఈ మనసుని విరిచి పోలేనా? మామిడి కొమ్మెక్కి, చివురులు మెక్కి కోయిల 'కుహూ..' అనడం దేనికి? నలుగురూ వింటారనా? తన సంతోషానికా? పాడనిదే తన బతుకు గడవకా? పరుల కోసమో, తను బాగుపడాలనో కాదు. అది అసంకల్పితం, జన్మ లక్షణం. పాట పాడకుండా ఉండలేక. ఎలా? "పుష్ప వ్రజం పరిమళం విరజిమ్మినట్టు. చంద్రుడు వెన్నెల కురిసినట్టు, నీరు పారినట్టూ, గాలి వీచినట్టు, నా హృదయము నిన్ను ప్రేమించినట్టూ.." ఎంత అందమైన, సులువైన, అద్వైత భావన!!

మరి వేరే దారి లేదా! ఈ విరహపు గుదిబండ గుండెలను పిండి చేయక తప్పదా!

హృదయమక్కట! నవసుమ మృదులమగుట
విరహబాధ కన్నీరుగా వెడలరాదే
అతి భయంకర సాంద్ర నీలాభ్ర పటలి
వాన గురిసిన ధవళిమ బూనుగాదే?

అని వాపోతారు. ప్రేమకు, విరహబాధకు సున్నితమైన అభివ్యక్తి మరొక చోట చూడలేము. నిజంగా ఏ ప్రభువుకోసమో, ఏ ప్రేమకోసమో పరితపిస్తున్న ఈ హృదయపు పిలుపు విని ఆగగలడా ఎంత బండ హృదయపు మొండి వేలుపైనా!? ఊర్వశైనా ఈ ప్రేమకి బానిస కాక ఉండగలదా!?

ఇంట ఎదురుచూస్తున్న పసి పెయ్యల చేరాలని, ఉరుకులు పరుగుల రేపల్లెకి చేరిన గోవుల గిట్టలు రేపిన నారింజ ధూళి మిన్నటింది. కర్మసాక్షి మింటి పెత్తనం నవమినాటి జాబిలికి ఇచ్చి ఇంటికెళ్ళిపోయాడు. గూటిలో దీపమంటి గోకులం చీకటి చీల్చుకు మినుకు మినుకుమంటున్న వేళ, యమున చల్లని గాడ్పుల మురిసి, కడిమి మొదట నిలచి, అల్లంత దూరాన సైకత వేదికల ఆటలాడుతున్న గోపకాంతల మనసులు దోచేందుకు పిల్లనగ్రోవి పలికించాడు కృష్ణుడు. మురళీగానానికి ఇహం మరిచి రాధ మనసు ఎలా పరవళ్ళు తొక్కిందో దేవులపల్లి వారికి మాత్రమే ఎరుక.

పరువు పరువున పోవు నెదతో
పరువులెత్తితి మరచి మేనే
మరచి సర్వము నన్ను నేనే
మరిచి నడిరేయిన్ ..

మాధుర్యపు జ్వాలలా మదిని చేరి మరిగించిన వేణుగానపు హాయిని తాళలేక, అంచుదాటి దూకబోతున్న పాలపొంగులాంటి పారవశ్యాన్ని మోయలేక, "తీయ తేనియ బరువు మోయలేదీ బతుకు మ్రోయింపకోయ్ మురళి మ్రోయింపకోయ్ కృష్ణా!" అని రాధిక కృష్ణశాస్త్రి గారి పలుకులలో ఒక్కసారి ముద్దు మోమెత్తి అర్ధిస్తే ఆ నల్లనయ్య క్షణమాగడా! మోక్షమీయడా!! అనిపించదూ!?* భావకవితా ఝరి కీ.శే. "శ్రీ దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి" (నవంబర్ 1,1897 – ఫిబ్రవరి 24,1980) గారి 114వ జయంతి సందర్భంగా స్మృత్యంజలి.