Thursday, June 30, 2011

పుష్ప బంధ(న)o


                                                                                                                                                  జ్యేష్ఠ బహుళ దశమి,
                                                                                                                                                  రేపల్లె.

నెచ్చెలీ,
కుశలమా?

నా లేఖ ఆలస్యం అయిందని అలిగి నీ ముద్దుమోము ఎర్రబరుచుకొని, కోలకళ్ళలో కినుక గుప్పించకు. ఇది మామూలు కుశల సమాచారం కాదు. ఆషాఢాన్ని మోసుకుని పుట్టింటికి నువ్వొచ్చాకే చెప్పాలనుకున్న సంగతులన్నీ ముందే లేఖ రాసేస్తున్నా! స్మృతులు నెమరు వేసుకుంటూ, సిగ్గు సగం దాచుకొని, సగం విదిలించుకొని.. మాటల దారం తో సంగతులు హారమల్లి ఇలా లేఖలో చుట్టి పంపే సరికి కూసింత జాగు అయింది. మన్నించూ..!!

నీకు లేఖ రాసేందుకు మంచి చోటు వెతికే సరికే, ఎంత సమయం వృధా అయ్యిందో తెలుసా! గ్రీష్మ తాపం తట్టుకోలేక యమున గట్టున కూర్చున్నాను . ఎక్కడినుండి వచ్చిందో నీటి గాలి! చల్లగా నా నడుముని చుట్టి "ఏం పిల్లా! ఏం రాస్తున్నావ్?' అని ఎంత చనువుగా అడిగిందో! "పోవోయ్, నీకు చెప్పేదేం కాదు. ఎంత చల్లని దానివైనా, నా నేస్తం కరస్పర్శ నీకేదీ?" అని విదిలించుకుని కదంబ వనానికి పరిగెత్తుకొచ్చా. పొన్న చెట్టు మొదట అలా వాలి, సంబోధన దాకా వచ్చానా! సరాసరి నా పయ్యెదపై వాలి ఓ చిలిపి గండు తుమ్మెద కుతూహలంగా తొంగి చూస్తోంది. కళ్ళెర్ర చేసి పొమ్మన్నాను. "గ్రీష్ముడి ధాటికి తోట పూలన్నీఇటొచ్చి నీ గుండెల్లో తలదాచుకున్నయేమో అని వచ్చా. రాధమ్మది చల్లని మనసని అంటారే, అందరూ!" అని  సన్నాయి నొక్కులు నొక్కుతూ కుంటి సాకులు చెప్తోంది. పోనీ గోశాలల వైపు వెళ్దామంటే జన సందోహం ఎక్కువాయె. నీ చెవిలో గుంభనంగా చెప్పాల్సిన ఊసులు, సిగ్గు విడిచి ఉత్తరం రాయడమే చాలు చాలు. రాస్తూన్న తలపులు గుచ్చుకుని ఎర్రబడిన నా మోము గుట్లన్నీ గట్టు దాటించదూ! అలా వెతికి వెతికి వేసారి ఇదిగో, కడిమి చెట్టు కింద ఉన్న తిన్నె మీద స్థిరపడ్డాను. "ఆ వచ్చేదేదో ఇందాకే రావొచ్చు కదా!" అని విసుక్కోకు.ఈ కడిమిని చూస్తే మొన్నటి దాకా బెంగ "కృష్ణుడు గుర్తొస్తాడేమో!" అని. ఈ రోజు సిగ్గు " కృష్ణుడు గుర్తొచ్చి!"

నిన్న కృష్ణుడొచ్చాడు. కలా.. నిజమా.. వైష్ణవమాయా.. తరచి తెలుసుకొనేంత విచక్షణ కుదరని విరహంలో మునిగి ఉన్న నన్ను అమాంతం ఆనందడోలలూగించాడు. సరిగ్గా ఇదే మునిమాపు వేళకి ఈ కడిమి చెంతకు దిగాలుగా వచ్చాను. "ముస్తాబయ్యావా?. గోధూళి అంటి, పనులలో సొలసీ చీదరగా ఉన్నావేమో! నేను అక్కడ ఉండి ఉంటే, రాధా! నీ అందానికి నగిషీ చెక్కేదాన్నిగా!" అని నొచ్చుకుంటున్నావేమో! విరహానికి నేను కనుగొన్న చక్కటి మందు అలంకరణ. చెదరిన కురులు, కరిగిన కాటుక సర్దుకుని మరీ సిధ్ధంగా ఎదురుచూసేంత ఆశ ఉంది ఈ రాధ విరహంలో! విరహానికి నేస్తం కన్నీరు కాదు. 'ఇహనో, ఈ క్షణమో వచ్చేస్తాడు.. వస్తాడా..? వస్తాడేమో!' అనే గుంజాటన లోంచి రెపరెపలాడే ఆశ. అదే నీ నేస్తానికి ఇన్నాళ్ళ కృష్ణ వియోగం నేర్పినది, ఊపిరిపోసినదీను.

వేసవి గాడ్పులు నా నిట్టూర్పులతో పోటీ పడి ఓడి చల్లబడసాగాయి. పెయ్యలు బొజ్జల నిండా పాలు తాగి, ఆయాసంతో ఊపిరి తీస్తూ నురగలు గాలిలోకి ఊదుతున్నాయి. పొదుగుల భారం తీరి అమ్మలు నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటున్నాయి. చీకటి మధువు తాగి రేపల్లె మత్తుగా సోలుతోంది. యమున నిదానంగా ఆకాశం లో పొడుస్తున్న చుక్కల్ని లెక్కెడుతోంది. కడిమికి ఆవలనున్న చెట్ల కింద ఏదో అలికిడి. "కుందేలేమోలే!" అని ఆశని చటుక్కున చూడబోతున్న నా కళ్ళ కొలకుల్లో నొక్కిపెట్టాను. అకస్మాత్తుగా నా చుట్టూ చందన పరిమళం, శీతల పవనం వందిమాగధుల్లా హడావిడిగా కమ్మేసి "ఓ అమ్మాయీ, లే, లే.. ఏదీ, కాటుక రేఖలు బాగానే ఉన్నాయి కానీ, కస్తూరి కలిపే పెట్టుకున్నావా తిలకం? కుచ్చెళ్ళు సరి చేసుకో! ఇదిగో, పాంజేబు కడియాలు, మువ్వలూ పెట్టుకున్నావా? ఓయ్.. మనలో మనమాట! పాలెల మొలతాడో! అబ్బే! ఈ నీలి చీరె బదులు గంధపు రంగుదైతే ఈ మునిమాపు వేళ,  మహ సొగసుగా ఉండేది. సర్లే, ఎవరొచ్చారో చూడూ! తల అలా గిరుక్కున తిప్పెయ్యకు, వెర్రి దానా! నీ ఆత్రం అంతా కనిపించేస్తుంది. నెమ్మదిగా, నీ సోగ కళ్ళ వైశాల్యం తెలిసేలా, చెక్కిలి నొక్కులు, బెల్లం ముక్క లాంటి గడ్డపు చక్కదనము కనిపించేలా, ముంగురులు అల్లనల్లన ఎగసేలా.. నువ్వలా పక్కకు తిరిగితే నీలో కలవరానికి నీ పయ్యెద రవ్వంత చెదిరేలా చూడు. చిగురు పెదవి వణుకుని అదిమి పెట్టి చూడు" అని హెచ్చరించాయి. నిజం చెప్పొద్దూ, ప్రియంవదా! కృష్ణుడి రాకని గమనించి నువ్వు ఎంత గుట్టుగా నన్ను హెచ్చరించి తప్పుకొనే దానివో గుర్తొచ్చి భలే బెంగొచ్చింది తెలుసా!

నన్ను వదిలి కృష్ణుడు ద్వారకకు వెళ్ళినది మొదలు, "ఎదురు పడనీ.. ఇది అడిగేద్దాం.. అలా నిష్ఠూరాలాడుదాం." అని ఎన్ని అలోచించుకున్నానో! అంతా శూన్యం. పాలిపోయి మంచుబొమ్మలా నిలబడిపోయాను. మోహన వంశీధరుడు  ఓ ముత్యమంత నవ్వు నవ్వాడు. ఏం పలకరించాడో, కుశలమడిగాడో, లేదో, సంజాయిషీ చెప్పుకున్నాడో, మన్నించమని పాదాలే పట్టుకున్నాడో.. ఏమీ తెలియదు నాకు. ఆ భగవంతుని సంకల్పమే మోక్షమట." ఇదిగో, నువ్వింత పుణ్యం చేసావు. నువ్వు నాకు నచ్చావు. నీకు మోక్షం ఇస్తున్నాను. తీసుకో! సిధ్ధపడు!" అని ఇంత లావాదేవీలు, శ్రమ ఉండదట. "ఈ జీవుడికి మోక్షం ఇద్దామా!" అని సంకల్పం పరమాత్మ మనసులో కలిగిన తత్క్షణం జీవుడికి మోక్షం సంప్రాప్తించేస్తుందట. మధ్యలో పంచాయితీలు, విచారణలు, సన్మానాలు, సభలు ఏమీ ఉండవట. అంత నిశ్చింత, అనాయాసమూను మోక్షమంటే! అలాంటి మోక్షం తెలుసా కృష్ణుని కౌగిలి! కృష్ణుడు ఎదురుపడడమే తెలిసింది. కౌగిలించుకోవాలని ఆతడు తలచిన క్షణం నేను ఆతని సుందర బాహువులలో కరిగిపోయాను. మరు క్షణాన్ని గురించి కాని, తరువాతి చర్యను గురించి కాని లేశమాత్రమైన చింతన రానివ్వని కోట ఆ కౌగిలి..

అసలు ఎడబాటు అంటే ఏమిటి? ఎడబాటుని దుఃఖ భరితం చేసి కొలుచుకునేదా ప్రేమ? ఇంత మోహం, బెంగ కలిగిందంటే, అంత ప్రేమ ఉంది అని నిర్ణయించుకోవాలా? కేవలం సాంగత్యమే ప్రేమ ఉనికికి, మనుగడకు ఆధారమా? ప్రేమ నిత్యాగ్నిహోత్రంలా మండేందుకు సన్నిహితంగా ఉండడం, అభిప్రాయాలు కలబోసుకోవడం, "నీకోసం నేను ఇది చేస్తున్నాను చూడూ!" అని నిరూపించుకోవడమే ఉపకరణాలా? అలా అయితే ఎడబాటు చివర కలిసినప్పుడు కలిగే సంతోషం ప్రేమ కాదా? ఎన్ని సందేహాలో తెలుసా! నవ్వుకుంటున్నావా! చెలీ! నీ మనసులో ఉన్నది చెప్పకనే తెలుసుకొని, నువ్వు పట్టలేని ప్రేమ భావనను నీలో పుట్టించే మరో వ్యక్తి ఇలాతలం పై ఉండడమే అరుదు. నీకు కనిపించడమే అదృష్టం. అంత అధ్భుతమే జరిగాక ఇంక శంకలేల? కోరికలేల? కట్టుబాట్లేల? అనాఘ్రాత పుష్పాన్నో, ఎంగిలవ్వని అభిషేక జలాన్నో, ఆటంకం లేని ధూపదీప కైంకర్యాన్నో,గాలి సోకని నైవేద్యాన్నో కోరుకుని ఈశ్వరుడే పొందలేడు. మనమెంత?

నేనేం చదువుకున్న దాన్ని కాదు. నాకేం ఆస్తి పాస్తులు లేవు. అందమా.. మాధవుని చూపు రాజేసిన సౌందర్యమే కాని, ఈ తోలు తిత్తికి సుగంధమెక్కడిదీ? ఇలాంటి నాలో కార్చిచ్చు రగిల్చినట్టు వలపు రగిల్చాడు. నా ఉనికి, నా తపన, నా సౌందర్యము, నా మనసు అన్నీ రాగరంజితం చేసాడు. చాలదా హరినామ సంకీర్తనము, నాకు చాలదా హితవైన చవులెల్ల నొసగ. నేను శ్వాశించేదీ, స్నానమాడేదీ, భుజించేదీ, చలించేదీ, రమించేదీ నా వంశీ మనోహరుని ప్రేమే! అంత అధ్భుతాన్ని ఘడియలతోను, రోజులతోను, కోసుల దూరంతోను, ఏకాంత వేళ పొందే సుఖంతోను కొలుచుకొని పరిమితం చేసుకుంటున్నానా ఇన్నాళ్ళూ! ఎంత వెర్రి దాన్ని. రాధే కృష్ణ స్వరూపమని తెలుసుకోలేకపోయాను. కృష్ణుడే రాధకు రూపమని కానుకోలేకపోయాను.

ఎన్ని ఝాములు గడిచాయో నాకు తెలియలేదు కానీ, తుమ్మెద తృప్తిగా గ్రోలిన మకరందం లా నా సొగసు మాధవుని కళ్ళలో నిండి ఆతని హృదయాంతరాళాలలోకి వెచ్చగా చేరుకుంది. కౌస్తుభ శోభ కాదది రాధ తళుకు. "హ్మ్మ్.. ఇంకా..!" అన్నాడు తీయతేనియ పెదవులు విచ్చి. అల్లెతాటి ఝంకారంలా మ్రోగి నాలో ప్రకంపనలు పుట్టిస్తుందా స్వరం. హరివిల్లునయ్యాను. రంగులు దోచి తన నలుపులో కలిపేసుకున్నాడు. విరిజల్లునయ్యాను. పూల పాన్పుని చేసాడు. 'వెన్నెల లేదేం?' అని బెంగ లేదు. కర్పూరమంటి రాధను హారతి అందుకున్నాడు. నా చేతి వేళ్ళను అదేదో అమర వాయిద్యం పలికించినట్టు మీటుతాడు. సంగీతం పలుకుతుంది. అవి నా గాజుల గలగలలు కావు. కృష్ణుడు మాయావి అని రేపల్లంతా కోడై కూస్తుందా! యశోద కి అనుమానం రాలేదేమో కానీ, నాకు అప్పుడప్పుడు వస్తుంది సుమా! విచిత్రంగా ఇవే గాజులు కృష్ణుడు చెంత లేనప్పుడు సంగీతం పలకవు. వట్టి గలగలలే!

పొగడలు ఏరుకొచ్చి మాలలు అల్లాను, వేణు గానం వింటూ!
"పొగడ పూల బంధనాలు అల్లుతున్నావ్! నన్ను కట్టేద్దామనే!" మేలమాడాడు.
"కట్టుబడదామనే!" నేనేం తీసిపోయానా?
 "పోనీ నేనే కట్టెయ్యనా!" నర్మగర్భంగా నవ్వాడు.
 "కాదంటానా!" పెదవులు తడారిపోతుండగా పలికాను.

నీలిమేఘం మెరుపు కన్నియను దరి చేర్చుకున్నట్టు నా నలక నడుము ఒక చేత్తో, పొగడ పూల చెండును మరో చేత్తో దరిచేర్చుకున్నాడు. మెరుపు మెరిసింది. పొగడ పూలు నా నెలవంక మెడవంపులో నవ్వాయి. జలజలా నా కళ్ళు ముత్యాలు రాల్చాయి. ఇది సత్కారమేం కాకపోవచ్చేమో! కృష్ణుడికి రాధ పై నున్న అనురాగం. మన ఆత్మకి మనతో, రాధకు మాధవుడితో మెచ్చుకోళ్ళు, గిల్లికజ్జాలు, కవ్వింపులు, కాళ్ళబేరాలు ఇవేవీ కుదరవు. ఇది అతిమానుష సంబంధమో కాదో కానీ, ఆత్మ బంధం.

ఈ కాలం భలే మాయలాడి సుమా! రాబోయే మంచి ఘడియలకి సిధ్ధం కమ్మని చెప్పదు కానీ,  వచ్చిన మధుర క్షణాలను కౌగిట్లోంచి లాక్కొని ఎగరేసుకుపోతుంది. మబ్బులు తొలిగాయి చెలీ! యోగులను, పసిపాపలను సంతోషం వీడనిదెందుకో తెలిసింది. తల్లి కుడి రొమ్ము విడిపించి ఎడమ రొమ్ము అందించే లోపు బిడ్డ ఏడ్చేది ఎడబాటు తోనా? బెంగతోనా? లోటుతోనా? అదో తాత్కాలిక భ్రమ. అలాంటిదే విరహమూను.

చిగిర్చిన కడిమి నీడలో, కృష్ణుని ప్రేమలో మునిగి, నీ రాకకై ఎదురుచూస్తూ,

నీ
రాధ.

Friday, June 24, 2011

ఇస్తినమ్మ వాయినం (నాన్నగారి నోబెల్ శాంతి బహుమతి రెండో భాగం)

"అమ్మాయీ! రేపే నీకు పెళ్ళి చూపులు ." చెప్పారు నాన్నగారు.
"పాట పాడేదా, నాన్నగారూ!"
"తప్పదామ్మా?" బితుకు బితుగ్గా అడిగారు.
"మీరు అంత బతిమాలాలా, తప్పకుండా!" అభయం ఇచ్చాను.
"అహనా పెళ్ళియంట కాదుగా!" దొంగాడా.. కరవకురా.. అన్నట్టు అడిగారు.
"అది నిశ్చితార్ధం అయ్యాక కదా!" అనుమానం వెలిబుచ్చాను.
"హమ్మయ్య..!!" అని గుండెల మీద చెయ్యి వేసుకొని నిద్ర పోవడానికి ప్రయత్నిస్తూ ఆ రాత్రి గడిపేసారాయన.

చిన్నప్పటి నుంచి నాకు మోళీ చేసే వాళ్ళన్నా, కొబ్బరి చెట్లెక్కే వాళ్ళన్నా, నూతిలో కవ్వు తీసే వాళ్ళన్నా, ఈల వేసే వాళ్ళన్నా భలే ఇష్టం. మా కుటుంబ సాంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకొని, నా లిస్టులో వీరిలో అందరినీ కొట్టెయ్యగా ఈల వేసే మొగుడిని మాత్రం తీసుకొస్తానని నాకు మా తండ్రి గారు ఎప్పుడో చిన్నప్పుడే మాటిచ్చారు. అది మొదలు నేను, మా నాయనమ్మ నూతి గట్టు మీద జారి పడినప్పుడూ, ఎదురింటి కుర్రాడు కనిపించినప్పుడు, మా పక్కింటి మాధవి నా కోసం దొంగతనంగా జీడిపప్పు తెచ్చిపెట్టినప్పుడూ ఈలలేస్తూ కాబోయే పతివ్రతనని లోకానికి గుర్తు చేస్తూ వచ్చాను.

పెళ్ళివారొచ్చారు. పెళ్ళికొడుకు ఇంటికి మూడో కొడుకుట. మందీ మార్బలంతో వచ్చిన వారిని చూసి మా తమ్ముడు జాలిగా నవ్వుకుంటూ అహ్వానించాడు. కుశల ప్రశ్నలు, కాజా కారప్పుసలు అయ్యాక నన్ను పిలిచారు. వెళ్ళి కూర్చున్నాను. అవధానం మొదలయింది.

"పేరేంటి?"
చెప్పాను.
"సంగీతం నేర్చుకున్నావామ్మా?"
"చదువు పాడయిపోతుందని నేర్పించలేదండీ." మా నాన్నగారు అందుకున్నారు.
"ఎంత వరకూ చదువుకుందో?"
"అబ్బే, డిగ్రీ అయ్యాక తల్లికి తోడుగా ఇంటి పట్టునే ఉందండీ."
"వంటా వార్పూ.."
"అబ్బే, పిల్లకి ఇంటి పనితో వంటకి ఖాళీ ఏదీ..!"
"ఓహో, అయితే ఇల్లంతా చక్కబెడుతుందన్నమాట."
"చక్కగానే తీర్చి దిద్దుతుందండీ..( తిలకం)"  - అశ్వథ్థామ హతః
"కుట్లూ అల్లికలూ.."
"దండగ ఖర్చు కదండీ? అయినా ఈ రోజుల్లో అన్నీ రెడీమేడ్ కదా!"

.....

"పోనీ, కొంచెం పాడనా?" నెమ్మదిగా కలుగజేసుకొని అడిగాను.
"పిల్ల పాడుతుందిట్రోయ్.. సినిమా లోదామ్మా?"
"ఊ" సిగ్గుగా చెప్పాను.

అప్పటిదాక ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్క క్షణం బిక్కచచ్చి స్థంభించింది. నాన్నగారు మినహా మిగిలిన మా కుటుంబ సభ్యులు మడుగులో జలస్థంభన చేస్తున్న సుయోధనుడిలా మౌనంగా, నవరంధ్రాలు బంధించి యోగ సమాధిలోకి వెళ్ళిపోయారు. "ఎట్నుంచి ఎటొచ్చినా నేనున్నాననే" కృష్ణ పరమాత్మలా మా నాన్నగారు ప్రథమ చికిత్స ప్రథమంగా ఎవరికి అవసరమవుతుందా అని అలోచించుకుంటూ సిధ్ధమయిపోయారు.

అష్ట దిక్ కుంభి కుంభాగ్రాలపై మన సింహ ధ్వజముగ్రాల చూడవలదె
గగన పాతాళ లోకాల సమస్త భూతకోటులు నాకె మ్రొక్కవలదె
ఏ దేశమైన నా ఆదేశముద్ర పడి సంభ్రమాశ్చర్యాల జరుగవలదె
"హయ్ హయ్ ఘటోత్కచ"  "జై హే ఘటోత్కచ" అని దేవ గురుడె కొండాడవలదే
ఏనె ఈయుర్వినెల్ల శాశించవలదె
ఏనె ఐశ్వర్యమెల్ల సాధించవలదె
ఏనె మన బంధుహితులకు ఘనతలన్ని కట్టపెట్టిన ఘనకీర్తి కొట్టవలదే... ఏ .. ఏ..

"సయ్.. సయ్య్.. సయ్య్.. " ఈల వినబడి తన్మయత్వం నుంచి తేరుకొని, ఎస్వీ రంగారావు గారి ఆత్మకి ఉద్యాపన చెప్పి, కళ్ళు తెరిచి చూసాను. మందు తిన్న ఎలకపిల్లల్లా పడ్డవారు పడగా మేరునగ ధీరుడిలా నిఠారుగా నిలబడి పెళ్ళి చూపులకొచ్చిన ఆరడుగుల అబ్బాయి, వారి చెల్లెలు మాత్రం నావైపు చూస్తున్నారు. నాకు వినిపించిన ఈల ని పదే పదే గుర్తు చేసుకుంటూ సిగ్గు ముంచుకు రాగా లోపలికి పరుగు తీసాను.

పడిన వారిపై చెరుకు పానకం కళ్ళాపి జల్లి నిద్రలేపాడు మా తమ్ముడు. శక్తి బారిన పడ్డ లక్ష్మణ స్వామిలా చేష్టలుడిగిన అబ్బాయికి అమృతం లాంటి ఫిల్టర్ కాఫీ వాసన చూపించి మామూలు మనిషిని చేసారు మా నాన్నగారు. ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడి ఈల వేసిన పదహారేళ్ళ "సీత" అనబడు, సదరు పిల్లాడి చెల్లెలికి చెయ్యి నూట పదహార్లిచ్చి నా దగ్గరికి పంపేసారు. మూర్చ పోయామని తెలుసుకోలేకపోడానికి పెళ్ళి వారు వెర్రివారు కాదు కానీ, అంతా కృష్ణ మాయ. చూపులకి వచ్చిన అబ్బాయికి నేను తీసిపెట్టుకున్న ఫిల్టర్ డికాషన్ తో కాఫీ చేసిచ్చి జీవితాంతం ఇంత చక్కటి కాఫీ ఉదయాన్నే తాగచ్చని, పుచ్చపువ్వు లాంటి నా మొహం కిటికీ లోంచి చూపిస్తూ, మేడ మెట్ల మీద కూర్చోబెట్టి నచ్చచెప్పారు నాన్నగారు. "గేలం మహత్యం"..రెండు నెలల్లో పెళ్ళి ముంచుకొచ్చేసింది.

పెళ్ళి పీటలమీద కూర్చున్నప్పుడు అబ్బాయిని ఈల వెయ్యమని వేధించకుండా, వేమురి బలరాం గారి పై ముఖ్యమంత్రి స్థాయిలో ఒత్తిడి తెచ్చి మరీ,,రాబోయే వారం స్వాతి సంచిక తెప్పించి నా మధుపర్కం కుచ్చెళ్ళలో పెట్టి, నా దృష్టి మళ్ళించి పెళ్ళి జరిపించారు మా తండ్రి గారు. ఇప్పటికీ నాకు అర్ధం కాని ఒకే ఒక విషయం ఏమిటంటే, అప్పగింతలు నా బదులు మా ఆయన్ని ఇచ్చారేంటో విచిత్రంగా!

నేను పెట్టె సర్దుకుంటూ ఉండగా వచ్చి నా తెంపరి తనాన్ని, ముక్కు మీది కోపాన్ని గూట్లోనో, ఉట్టి మీదో వదిలేసి వెళ్ళకపోతే నా మాయా బజార్ డివీడీ ఇచ్చేది లేదని బెదిరించి మాట తీసుకున్నారు నాన్నగారు. ఉదయం స్నానం చెయ్యగానే, సంజె దీపం పెట్టాక విధిగా నేను భక్తితో వల్లె వేసుకొనే పద్యాలను, మనసులోనే పాడేసుకుంటానని కత్తి వీర కాంతా రావు గారి మీద, మధుబాబు షాడో మీద, పనసపొట్టు కూర మీద ఒట్టు వేయించుకున్నారు. నా కొత్త కాపురం ఓ గాడిలో పడేసరికి మా చిన్నాడపడుచు లక్షాధికారిణి అయిపోయి, వైజాగ్ అశీల్ మెట్ట జంక్షన్ లో రెండు షాపులు, ఓ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కొనేస్కుంది. మా నాన్నగారు భారత ప్రభుత్వం దగ్గర అత్యధిక పర్సనల్ లోన్ తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగిగా రికార్డు సృష్టించారు.

ఈల వేయడం రాని వాడికి ఇచ్చి నా గొంతు కోసినందుకు పరిహారంగా, మా నాన్నగారి చేత అయిదు దినపత్రికలు, పదహారు వార పత్రికలు, ఎనిమిది మాస పత్రికలకి, పన్నెండు అంతర్జాతీయ సైన్సు జర్నళ్ళకి, ఇంటిల్లిపాది పేరా తలా జీవిత చందా కట్టించి నా దఃఖాన్ని దిగమింగి కాపురం చెయ్యసాగాను.

ఓ మూడు కేలండర్లు తిరిగాయ్. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరీ ప్రశాంతంగా ఉన్నట్టనిపించి, "యోగక్షేమం వహామ్యహం" అని అభయ హస్తం చూపించి, నేను పతీ సమేతంగా వలస వచ్చాను. ఏడు వారాల నగల్ని ఓ శనివారం సాయంత్రం దిగేసుకొని వాల్ మార్ట్ కెళ్ళిన నన్ను చూసి "యూ లుక్ ప్రెట్టీ" అని షేక్ హాండ్ ఇచ్చాడో తెల్లబ్బాయి. వాడి ఆత్మీయతకి మురిసి ఈల వేసి, వాడి జబ్బ మీద ప్రేమ గా ఓ చరుపు చరిచానంతే! మరీ సుకుమారం సుమండీ వీళ్ళూ! భూన భోనాంతరాలు దద్దరిల్లేలా ఒక్కరుపు అరిచి గుడ్లనీరు కుక్కుకుంటూ పారిపోయాడు ఆ మాత్రానికే! అయినా వాల్ మార్ట్ కంటే మా ఆయనకి టార్గెట్టే నచ్చుతుండిలెండి.

అప్పట్లోనే, ఇంకోసారి మా ఎదురింటావిడ గోరింటాకు పెడతానందని వెళ్ళాను. ఈనెలు తీగలు వేసి నా చెయ్యంతా ఖరాబు చేసింది. "సరే, తెలియదేమోలే! చందమామ, చుక్కలు చూపిద్దామని" ఆవిడ చేతి మీద పెట్టి చూపించానంతే. ఆవిడకి ఎంత కృతజ్ఞత అంటే, నాలుగు నెలలదాక గోరింటాకు చెరిగిపోతుందని చేతికి క్రేప్ బేండేజ్ తియ్యకుండా తిరిగింది. పైగా అపార్ట్మెంట్స్ లో అందరికీ ఎంత గౌరవంగా పరిచయం చేసేదో నన్ను.

నా కీర్తి ప్రతిష్ఠలు కళ్ళారా చూస్తారని మా తలిదండ్రులని పిలిపించాం. ఈ సందట్లో నాకు సుపుత్రోదయం జరిగింది. మా వారు పేరు ఎంచి పెట్టుకున్నారు. నాకు ఇంకో పేరు నచ్చింది. పతితో జగడమెందుకని, నేను చెప్పిన పేరు పెట్టించకపోతే, ఒట్టు తీసి గట్టు మీద పెట్టి ఈసారి "ధారుణి రాజ్యసంపద మదంబున.. పాడెద బాలసారెలో..ఓ.. ఓ..ఓ.." అని మా తండ్రి గారికి సవినయంగా మనవి చేసుకున్నాను. తప్పేదేముందని, చుట్టు పక్కల వారిని పిలిచి పిల్లాడి పేరు చీటీలలో రాసి ఓటింగ్ పెట్టించి, దేశ క్షేమాన్ని కోరి రిగ్గింగ్ చేసి మరీ నాన్నారు నన్ను గెలిపించారు.

పిల్లాడు యథాశక్తి గిలక్కాయలు చూపరుల టెంకి పగిలేలా విసురుతూ, ఎత్తుకున్నఇరుగు పొరుగు వారి వేళ్ళను బాల భీముడి బ్రదర్ లా విరిచి ఆడుకుంటూ వాడి అమ్మ కడుపు చల్లగా దిన దిన ప్రవర్ధమానమవుతున్నాడు. మూడో నెల వచ్చిందని, "ముద్దకుడుముల వాయినానికి" ముత్తయిదువులని పిలుద్దామని ఇరుగు పొరుగులకి వెళ్తే, అందరూ "జనవరిలో బిగుసుకున్న నయాగరా చూసేందుకు వెళ్ళాం. ఇంట్లో లేమని" చెప్పారు తలుపు వెనక నుంచి.

ఇన్ని ఆగడాలు భరించిన మా నాన్నగారి అల్లుడు చంగల్పట్టు శాంతారాం, ఇక సహించలేక స్థంభోద్భవ నార సింహుడై రణగోల చేసారు. "ఏం చేస్తారో, తండ్రీ, కూతురు కలిసి ముగ్గురు ముత్తయిదువులను పట్టుకు రండని" నిర్దాక్షిణ్యంగా మమ్మల్ని శనివారం ఉదయం బాలభోగం వేళకి "శివ విష్ణు టెంపుల్ ఆఫ్ డేటన్" లో దింపి వెళ్ళిపోయారు.

"నాకేల చింత.. పక్కన నాన్నారుండగా!" అని భారం ననుగన్న మా నాన్న మీద వేసి దొరికిన కొబ్బరి ముక్క తింటూ కూర్చున్నాను. పలకరిస్తే జనం పారిపోసాగారు. అలా చాలా మందిని భయపెట్టాక, ఉస్సురంటూ నా పక్కన చతికిల పడ్డారు తండ్రి గారు. దూరంగా జనాలను పలకరించి భయపెడుతున్న ఇంకో ఇద్దర్ని"అమ్మలూ, అదిగో ఇంకో ముద్దకుడుముల వాయినం వాళ్ళే!" అని ఉత్సాహంగా చూపించారు. వారి కదలికలను గమనించి "అబ్బే, కాదని" వారెవరో చెప్పాను. ఓ రెండు క్షణాలు ఆలోచించి, పక్కనున్న "ఆలయానికి దారి" బోర్డు పీక్కొచ్చి దాని మీద రెండు వాక్యాలు రాసి పట్టుకు నిలబడ్డారు నాన్నగారు. అటు వెళ్తూ అది చదివిన ఓ ముగ్గురు ఆడవాళ్ళు మర్నాడు "వాయినం" తీసుకొడానికి మా యింటికి వచ్చి కథ సుఖాంతం చేసారు. ఇప్పుడు చెప్పండి. మా నాన్నగారిని మించిన శాంతి కాముకులు ఎవరుంటారు? ఏంటీ?ఇంతకీ ఆయన రాసిన వాక్యాలేమిటంటారా?

" amway వాళ్ళం కాదు. ముద్దకుడుముల వాయినానికి మా ఇంటికి వస్తారా?"

Saturday, June 18, 2011

మా నాన్నగారికి నోబెల్ శాంతి బహుమతి?

అప్పుడే శుభాకాంక్షలు చెప్పెయ్యకండి. అబ్బే.. ఇంకా రాలేదండి. 'ఇహనో, ఇప్పుడో వచ్చేస్తుందేమో!' అని నాకు అనుమానం. ఎందుకంటారా! జీళ్ళు తినడానికి సుబ్రహ్మణ్య షష్ఠి జరుపుకునే బాపతు కదా నేను. గిన్నెడు పాయసం వండుకొని, పెద్ద ఇత్తడి పళ్ళెం నిండా మైసూర్ పాక్ పోసి, మా నాన్నగారికి ఓ ఫోన్ కాల్ చేసేసి "ఫాదర్స్ డే" జరిపేసుకోవాలని నిర్ణయించుకున్నాను. "మరి ఆయనకి ఏమిస్తే బాగుంటుందా!" అని ఆలోచిస్తే ఆయన ప్రపంచానికి చేసిన సేవలకి "నోబెల్ శాంతి బహుమతి" కి తక్కువదేదీ  సరిపోదనిపించింది. వినరా నాయనమ్మ వీర కుమారుని విజయగాథ నేడూ!

అది కొన్ని దశాబ్దాల క్రితం నేను పుట్టిన రోజు. ఆరునొక్క రాగంలో ఆలాపన అందుకున్న నన్ను ఊరుకోబెట్టడం ఎవరి తరం కావట్లేదట. తపస్సులో కూర్చొని కూర్చొని కాళ్ళు తిమ్మిరెక్కి, హిమాలయాల నుండి విశాఖ తీరానికి వ్యాహ్యాళి కి విచ్చేసిన శ్రీశ్రీశ్రీ చిదంబరానంద స్వామి వారు ఆ వైపుగా వెళుతూ, నా రాగానికి ముగ్ఢులై మా ఇంట్లోకి విచ్చేసారట.

"సమయానికి అరుదెంచారు మహానుభావులు. మా పిల్ల కచ్చేరీ వినలేక ఊరంతా గగ్గోలు పెడుతోంది. ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోమని" వారిని వేడుకున్నారట మా తండ్రి గారు. నా హావభావాలు, ఏడుపులో స్థాయీ బేధాలను స్వామి వారు గడ్డం గోక్కుంటూ గమనించి, తన సూక్ష్మబుధ్ధికి తట్టిన తరుణోపాయం సెలవిచ్చారట. "నాయనా!  పిల్ల ఏడుపుకి కారణం పొట్ట ఉబ్బరమో, పాలు సరిపోకో కాదు. ఈ శిశువు సామాన్య శిశువు కాదు. మీ పిల్ల పెద్దయి సాధించాల్సిన రాచకార్యాలు చాలా ఉన్నాయి. మీరు చూస్తే ఇంత మెతకవారిలా కనిపిస్తున్నారు. మరి పిల్లది అఖండ కీర్తిని ఆర్జించే క్రమంలో పెట్టే రాటు పోట్లకు తట్టుకోగలరా!"  "అయ్యో ఎంతమాట! తొలిచూలు ఆడపిల్ల. మహాలక్ష్మి. అందునా గొప్ప కీర్తిని ఆర్జిస్తుందని చెప్తున్నారు. దేనికైనా సిధ్ధమే స్వామీ!" అని కమిటైపోయారట నాన్నగారు. "సరే! జాగ్రత్తగా విను కుటుంబరావ్. మీ పిల్ల కి ఉత్సాహం పాళ్ళు ఎక్కువ. "రేపేం జరుగుతుందా!" అనే ఆలోచన బహు మెండు. "బాలసారెలో ఏం పేరు తగిలిస్తార్రా నాయనోయ్!" అని శిశుభాషలో ఆలోచించుకుంటోంది. అంతే!" అని సెలవిచ్చారట స్వాముల వారు. బుర్ర గోక్కుంటూ ," ఇప్పటికేం అనుకోలేదు కానీ, స్వామీ! తప్పకుండా మంచి పేరే పెడతాం. పదిరోజులు ఆగలేదా!" అని ఆశ్చర్య పోయారట నాన్నగారు. "అబ్బే, లేడికి లేచిందే పరుగు. కళ్ళంలోనే కందులు వేయించేస్తుంది మీ కుమారీ మణి. మీరు ఉన్నఫళాన పిల్ల తృప్తి పడి తలాడించే పేరు ఆలోచించి, దాని చెవిన వేసి ఆమోద ముద్ర వేయించుకుంటే తప్పితే ఏడుపు ఆపదు. ఇది మొదలు మాత్రమే! ఆల్ ద వెరీ బెస్టోయ్!" అనిచెప్పి చక్కా వెళ్ళిపోయారట.

అలా మొదలైన పరీక్షలు మా తండ్రి గారి సహనాన్ని రికార్డు స్థాయిలో పెంచుకుంటూ వచ్చాయి. అది మొదలు ప్రతి రోజూ నాకొచ్చే రకరకాల ప్రశ్నలకు, సరైన సమాధానమో, మార్గమో వెతికే వరకూ నిద్ర పోనిచ్చేదాన్ని కాదట. "పిల్ల బుగ్గలు బూరెల్లా ఉన్నాయ్ రా!" అని మా నాయనమ్మ నన్ను చూసి ముద్దులాడిందిట. బూరెలెలా ఉంటాయో రుచి చూపించే దాకా సంగీత సాధన చేసానట. ఇలా పాల సీసా మొదలు, పట్టు పరికిణీల వరకూ నేను వేసిన ప్రతి అడుగు వెనకా మా నాన్నగారి సహనం ఎంతైనా ఉంది. అర్ధ రాత్రనక అపరాత్రనక  నాతో పాట్లు పడలేక నన్ను, మా నాన్నగారిని శాశ్వతం గా ఆరుబయటికి నెట్టేసారట ఇంట్లోవాళ్ళు. పదే పదే నాకు రేకెత్తే ప్రశ్నలకు నిద్రలేచే మా నాన్నగారు, పనిలో పనిగా వీధిలో దొంగలబెడదని నివారించే రక్షకభటుడయి అందరి మన్ననలు అందుకున్నారట.

కత్తిరిస్తే, అవి నేను చింతపిక్కలు, ఏడుపెంకులు ఆడుకొనే రోజులు. పందెం వేసుకున్న బెల్లం, శెనగపప్పు ఎగ్గొట్టిందని వనజని ఇదిగో.. ఇలా ఓ చిన్న కంకర రాయి విసిరి దండించానంతే! ఆ పిల్లకి క్రీడా స్పూర్తి బొత్తిగా లేదనుకోండి. బొటబొటా కన్నీరు చిందించి పంచాయితీ పెట్టించేసింది. అప్పటి నుంచి నా తోటి బాల బాలికల సంక్షేమార్ధం, నన్ను ఇల్లు విడిచి ఆటలకు పంపించేది లేదని మా తండ్రి గారి చేత అష్ట దిక్పాలకుల మీదా, ఆరు ఋతువుల మీద ప్రమాణం చేయించుకున్నారు పుర ప్రజలు. ఏం తోచక ఇంటిల్లి పాది గోళ్ళూ కొరికేస్తున్న నాకు, మనోల్లాసం కలిగించే నిమిత్తం చందమామ, బాలమిత్ర, ఆంధ్ర భూమి, యుగంధర్ పరాక్రమ చంద్రిక ఇత్యాది పుస్తకాలు కొనితెచ్చి, సాహిత్య సర్వస్వాన్ని నేను ఆకళింపు చేసుకొనే సదుపాయం కలిగించారు. చూసారా! భావి తరానికి నాలాంటి రచయిత్రిని అందించడానికి ఆయన అక్కడే పునాది రాయి వేసారన్నమాట.

మా తండ్రి గారికి విద్యా శాఖ వారి కచ్చేరీలో పని. అది దేశ సంక్షేమానికి ఎలా ఉపయోగపడిందో చెప్తాను వినండి.

"అమ్మాయీ, పన్నెండో ఎక్కం రాసావా!"
"పక్కమ్మాయి చేత రాయించారు కదా,మాస్టారూ! నేనూ రాస్తే మీకు విసుగు రాదూ! "

"ఉపకారికినుపకారము పద్యం చెప్పు, తల్లీ!"
"ఉపకారమా.. మామిడి ముక్కల్లో నంచుకుంటే బాగుంటుందేమో కదండీ"

నీకు నచ్చిన పండగ గురించి వ్యాసం రాసావా?
"ఓ.. నా పుట్టినరోజు పండగ గురించి రాసానండీ"

ఏదీ పాడమ్మా.."వరవీణా.. మృదుపాణీ.."
కవల పిల్లలాండీ వీళ్ళు.. తేనె మనసులు సినిమాలో కుట్టి పద్మిని లాగా!

ఇలా వారి వారి ప్రాణాలు విసిగి పోయేవరకు నా మేధస్సుకు పదును పెట్టిన మాస్టార్లని, వీలున్నప్పుడల్లా బదిలీ చేయించి, వారిని, వారి కుటుంబాలను కాపాడారు మా తండ్రి గారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కంటే ఈ బదిలీ బహు గొప్పదని వారందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు కూడాను.

త్రికోణమితి సమాధాన పత్రం నిండా రంగు రంగుల ముక్కోణాలు గీసి ఇచ్చిన నా ప్రతిభకు మెచ్చి, ఇంటర్మిడియట్ బోర్డువారు నన్ను రాజలాంఛనాలతో డిగ్రీ కాలేజీ కి పంపించి చేతులు దులిపేసుకున్నారు. అందరు ఆడపిల్లల్లాగే కళ్ళనిండా కోటి ఆశలతో కాలేజీలో అడుగుపెట్టాను. కాలేజీ ఎదురుగా ఉన్న చెరుకు రసం అమ్మేవాడిని, కొబ్బరిపువ్వు, తేగలు, మొక్క జొన్న పొత్తులు అమ్మే వారిని ఇతోధికం గా పోషిస్తూ, రిలీజయిన సినిమా అయినట్టుగా చూసేస్తూ మూడేళ్ళు ముచ్చటగా గడిపేసాను. నన్ను అలరించే మిత్ర బృందం పుణ్యమా అని ఓ మూడేళ్ళు మా నాన్నగారికి తాత్కాలిక ఉపశమనం కలిగించాను. ముందుంది గా మరి ముసళ్ళ పండగ!

అవి మండువేసవి సెలవులు. మామిడిపళ్ళు, కొత్తావకాయతో జీవితం అనిభవించేస్తున్న నాకు పెళ్ళి చేసెయ్యాలని సంకల్పించారు మా మాతాపితరులు. కానీ నా వినయవిధేయతలు తెలిసినవారు కనుక , వారు కొంచెం చింతాక్రాంతులై ఉండగా మా పితృదేవుల కలలోకి,  నేనంటే అమితమైన మక్కువ గలిగిన మా పితామహులు (పరమపదవాసి) కనిపించారట.

"ఏమిటి రామయ్యా, దీర్ఘం గా ఆలోచిస్తున్నావు?"
"ఏం లేదు, ఇంటికీ గొడ్ల సావిడికీ బేరం కుదిరితే కానీ మీ మనుమరాలికి పెళ్ళి చెయ్యగలిగేలా లేను."
"అయ్యో, వెర్రి నాగన్నా! మన వంశపారంపర్య "గేలం" గురించి ఈ సమయానికి నీకు గుర్తుచెయ్యమని మీ అమ్మ కి చెప్పానే! సర్లే, టీవీ సీరియళ్ళలో పడి మర్చిపోయి ఉంటుంది. ఖర్చు లేకుండా అల్లుణ్ణి వెతికి పట్టుకొనే అద్భుత శక్తి గల గేలం మన పూర్వీకుల నుంచి సంక్రమించింది నాయనా. నీకు దిగులు వలదు. పూర్వం సత్రాజిత్తు తన కుమార్తె సత్య భామకి వరుణ్ణి వెతికే నిమిత్తం ఈ గేలం తయారు చేయించాడు. గేలానికి శమంతక మణి ఎరవేసి వదిలితే శ్రీకృష్ణుడు తగిలాడు. శమంతక మణిని మన సత్యభామ "పూజ చేస్కుంటాను. ఇవ్వవోయ్!" అని వెనక్కి తీసేసుకుంది. కృష్ణుడు లాభం. "
"మరి శమంతక మణి నాకెక్కడిది, నాన్నగారూ!"
"అయ్యో తండ్రి, తరాలు గడుస్తున్న కొద్దీ మణులు కరిగి అమ్మాయీ మణులే మిగిలారు. సిరి ఉట్టిపడే విలక్షణమైన ముఖ పద్మాలు మనింటి ఆడపిల్లల సొత్తు. నువ్వేం బెంగడిల్లకు. వ్యవస్థ దాని పని అది చేసుకుపోతుంది. గేలం దింపించి చూడు."
"సరే కానీ, మీ మనుమరాలి సంగతి తెల్సిందే కదా! దీన్ని భరించే భర్త పుట్టాడా.. అని."
"ఓయీ రామానుజం! నీకో పిట్ట కథ చెప్తా...శంక మాని శ్రధ్ధగా విను.

కుశ ధ్వజుడనే రాజుగారికి రేవతి అని ఓ చక్కని పిల్ల ఉండేది. వయసుతో పాటు ఆ పిల్ల పొడవు కూడా ఎదుగుతూ వచ్చింది. వయసు, పొడవుతో పాటు రేవతికి, ఛాయాదేవికి ఉన్నంత ముట్టె పొగరు, సూర్యకాంతానికి ఉన్న వాచాలత, నీ కూతురికి ఉన్నంత అత్యుత్సాహం,  దుంప తెంపి ధూపమేసే గుణం ఉన్నాయి. రోజు రోజుకీ పొడవు తో పాటూ ఇవన్నీ పెరుగుతూ ఉంటే రాజు గారు నీలాగే బెంగతో కుంగి కుదేలయ్యేవారట. అలా ఎదిగి ఎదిగి ఆ పిల్ల ఇంటి చూర్లని, తాటి చెట్లని దాటి ఆకాశం దాకా ఎదగ సాగిందట. స్వయంవరం సంగతి దేముడెరుగు. అసలు ఆ అమ్మాయిని కళ్ళలో కళ్ళు పెట్టి చూసే మగాడెవడని? అప్పుడు ఆపధ్బాంధవుడిలా వచ్చాడట బలరాముడు. "మీ పిల్లను వంచుతాను. నచ్చితే పెళ్ళాడతాను" అని అభయం ఇచ్చాడట. నాగటి కొన ఆ పిల్ల నెత్తిన పెట్టి శక్తి మేరా కిందకి లాగి తనతో సమానంగా చేసుకున్నాడట. ఇంక చెప్పేదేముంది. "వంగెననంగుని చాపము, వంగెను బాలేందుధరుడు, వంగెను శైలరాణ్ణందన.. పూలందుకొనుడంచు సుమనోంజలి జాచి.."అన్నట్టు పిల్ల వంగింది. పెళ్ళీ అయింది.  కాబట్టి నాయనా! పిల్లంటూ పుట్టాక అల్లుడు దొరకడా.. ఆల్ ద బెస్ట్!" అనేసి అంతర్ధానమైపోయారట.

కొత్త ఉత్సాహం తెచ్చుకొని మా తండ్రిగారు నాకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసారు.

(ఈ మాత్రానికి నోబెల్ బహుమతి ఇచ్చేస్తారటండీ ఎవరైనా! ఇంకా చాలా ఉంది. తరువాయి భాగం అతి త్వరలో!)