Saturday, December 31, 2011

తల్లీ! వ్రజవల్లీ! మేలుకో! ~ కాత్యాయనీ వ్రతం - 17

"పచ్చవిల్తుడట.. నల్లకలువల బాణాలట! వాటికి ఇంత బలమెక్కడిదో.. ప్రియంవదా! పగలు ముందుకు పోదు. రేయి నిద్దుర రాదు!!" వాపోయింది నెచ్చెలితో కమలిని.
"హ్మ్.. యమునలో మునకలు తప్ప ఈ విరహకీలను చల్లార్చే దారి లేదు కదా! ఈ రోజు కృష్ణుడిని చూడవచ్చు. పెదవి విప్పి చెప్పే పనేముంది. అంతర్యామి ఎరుగని సంగతి ఉండదు కదా! ఓపిక పట్టాలి."ఊరడించింది ప్రియంవద.
యమున దగ్గర ఎదురుచూస్తున్న చెలులను చేరి స్నానమాచరించి, యథావిధిగా కాత్యాయనిని అర్చించి, ఉరకలేసే జలపాతాల్లా పరుగుపరుగున నందగోపుని ఇంటిముంగిలి చేరారు.

అల్లంత దూరాన గోపబాలలను చూసి నవ్వుకున్నాడు ద్వారపాలకుడు.
"అప్పుడే వచ్చేసారే! పూజ పూర్తి చేసుకున్నారా?" పలకరించాడు.
"ఓ! అయింది.. మేం లోపలికి వెళ్ళవచ్చునా!" ఎగసే గుండెలను అదుపులో పెట్టుకుంటూ అడిగారందరూ!
"తప్పకుండా వెళ్ళచ్చు. కానీ, ఒక్క మాట!"
ఇంకా ఏమిటన్నట్టున్నాయి వాళ్ళ చూపులు.
" మీరు కృష్ణుడిని చూసేందుకు అనుమతి ఇచ్చేవాడిని నేను కాదు. రాజుగారూ, రాణిగారూను! లోపల నందగోపుని మందిరం ఉంటుంది. యశోద ఉంటుంది. ముందు వాళ్ళని మేలుకొలిపి, అనుమతి పొంది అప్పుడు ముందుకు వెళ్ళండి. తెలిసిందా!" హెచ్చరించాడతను.
"సరే సరే!" ఏకకంఠంతో పలికారందరూ!
"సరే! శుభం! జాగ్రత్త! " రతనాల తలుపు గొళ్ళేం తీసి తలుపులు ఒక్క సారి తెరిచాడతడు. బంగారు ద్వారాలకున్న చిరుగంటలు ఘల్లుమని సవ్వడి చేసాయ్! "మ్రోగినది తమ గుండెలేనేమో!" అనుకున్నారు గోపతరుణులు. వణుకుతున్న పాదాలతో గడపదాటి లోనికి అడుగుపెట్టారు.

"నేరుగా కన్నయ్య వద్దకి వెళ్ళవద్దంటాడేం, ఆ కాపలాదారు?" ప్రశ్నించింది కమలిని.
"అవును మరి! మనకి ఎంత గొప్పనేస్తమైనా అమ్మ కొంగు చాటు బిడ్డేగా! అయినా ప్రజలందరూ సుఖంగా ఉండేలా కాపాడుతున్న రాజుగారు నందగోపుడు. ఆయన చెప్పనిదే మనలాంటి అమాయక గొల్లలకు ఏది చెయ్యాలో, ఏది కూడదో తెలిసేదా? నందగోపుడే మనకు మంచి త్రోవ చూపే గురువు! ఆ గురువు నేర్పే మంత్రం లాంటిది యశోదమ్మ. వారికి విన్నపం చేసుకోనిదే, వారి అంగీకారం, మార్గదర్శకత్వం లేనిదే ముందుకు వెళ్ళడం అసాధ్యం. పదండి వారినే నిద్రలేపుదాం!" ముందుకు నడిచింది ఆనందిని.

కప్పురపు దివ్వెల వెలుగులో విరాజిల్లుతున్న మందిరపు తలుపుల దగ్గర నిలబడ్డారు.
"ఓ నందగోపా..! నిద్ర లేవయ్యా! మా గొల్లలకు నీరూ, ఆహారమూ, కట్టుకోడానికి వస్త్రాలూ వేళకు అందేలా, లేవడి లేకుండా సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాలను గడిపే సదుపాయం చేస్తున్న ఏలికవు! మమ్మల్ని చల్లగా పాలిస్తున్న రాజువి! నీ పాలనలో పల్లె సుభిక్షంగా ఉంది. ఇకపై ఎలాంటి ఇక్కట్లూ లేకుండా నెలకు మూడు వానలు పడాలని కాత్యాయనీ వ్రతం చేస్తున్నాం. మాకు కావలసిన 'పర'వాద్యం నీ కుమారుడు కృష్ణుడు ఇస్తాడని చెప్పావు. మమ్మల్ని అతని వద్దకు పంపే దారి చూపాల్సిన వాడివి నువ్వే! నీ ఆనతి లేనిదే మేము ముందుకు పోలేము. నిద్ర లే!"

అలికిడి లేదు! "చీమ చిటుక్కుమంటే నిద్రలేస్తాడు. ఎల్లవేళలా కృష్ణుడిని కాచుకుని ఉంటాడు!" అని ఎన్ని గొప్పలు చెప్పాడు ద్వారపాలకుడు! నేరుగా లోపలికి వచ్చి పిలుస్తున్నా పలకడం లేదే! అని ఆశ్చర్యపోయారు. "మనని పరీక్షిస్తున్నారేమో! పధ్ధతి ప్రకారం పెద్దలనే నిద్రలేపుతారో, నేరుగా కన్నయ్య దగ్గరికి చనువుగా వెళ్ళిపోతారో అని చూస్తున్నారేమో!" అని గుసగుసలాడుకున్నారు.  "అయ్యవారిని పిలిచాం. ఇక యశోదమ్మనీ పిలిచేద్దాం. ఆమైనా నిద్రలేస్తుందేమో!" అనుకున్నారు.

"ఓ యశోదా! వ్రజవల్లీ! నీటిప్రబ్బలితీగెలా నందుని అల్లుకున్న లతవు. నీవు మా గోపకులానికి రాణివి. వెన్నలాంటి మనసున్న తల్లివి. నందగోపుని ఇంటి దీపానివి. రాజు తండ్రి వంటి వాడని చెప్తారు కదా! పిల్లలకు కావలసినవన్నీ తండ్రిని అడిగి పొందే మార్గం తల్లే కదూ! నువ్వు చెప్పకపోతే నందగోపునికి మాపై కరుణ కలుగుతుందా! నిద్ర లేవమ్మా! లేచివురు వలె మనోజ్ఞమైన నీ రూపం ఉదయాన్నే చూడనీ! నీ పోలిక పుణికి పుచ్చుకున్న ఆ కృష్ణుడే మాకు దిక్కు. అతనికి మా విన్నపం చెప్పుకోవాలంటే నీ అనుమతి కావాలి. నిద్ర లేచి రావమ్మా!"

మేలుకో! మేలుకో!
చాలించి నిదుర - మేలుకో!
ఏ లేవడి రానీక, ఎల్లవేళలరసే మా
ఏలికా! నందగోపాలకా! మేలుకో!
చాలించి నిదుర - మేలుకో!

తల్లీ! వ్రజవల్లీ! నవపల్లవాభిరామా!
అల్లన లేవమ్మా! యశోదమ్మ! నందగృహ దీపమ!
మేలుకో! మేలుకో!

గొంతెత్తి పిలిచినా, మేలుకొలుపు పాడినా అలికిడి లేకపోయేసరికి, కమలిని ఇంకాగలేక ఒక్క అడుగు ముందుకేసి కన్నయ్యనే పిలిచేసింది. "ఓ కన్నయ్యా! ఆకాశం, భూమీ, ఆపై బలిచక్రవర్తి తలా కొలిచిన సర్వవ్యాపి నువ్వని చెప్తారు. త్రివిక్రముడని పొగుడుతారు! ముల్లోకాల ఏలికవు! మేమడుగుతున్న చిన్న వాయిద్యం ఇచ్చేందుకు నిద్రలేచి రాలేవా? మేలుకో!"

భువిని దివిని మీరి భువన భువనముల నిండే
త్రివిక్రమా! పురుషోత్తమా! దేవదేవ! శ్రీకృష్ణా!
మేలుకో! మేలుకో!

చప్పున వెనక్కి లాగి వారించింది సురభి. "ఆగు కమలినీ! రాజదర్శనం అంత త్వరగా అయ్యేది కాదు! మనని పరీక్షిస్తున్నారేమో! నువ్వు సరాసరి కన్నయ్యని పిలిచేస్తే బలదేవునికి కోపమొస్తేనో!"
"వస్తే నందగోపునికో, యశోదమ్మకో రావాలి కానీ, బలదేవునికెందుకూ కోపం?"
"అయ్యో! ఎంత మాట! బలరాముడేమైనా సామాన్యుడనుకున్నావా? దేవకీ గర్భాన పడిన ఏడవ శిశువే బలదేవుడు. కంసుని బారి నుండి రక్షించేందు అతడిని సంకర్షించి, రోహిణీ గర్భాన ప్రవేశపెట్టారు. అందుకే బలరాముని "సంకర్షణుడు" అంటారు. నేలపడి బట్టకట్టిన ఏడవ బిడ్డయని దృష్టి తగలకుండా, బలదేవుని కాలికి ఓ అపరంజి కడియం వేసిందట రోహిణి. ఆ కాలు ముందుకు వేసినప్పుడల్లా బలదేవుడు "తాను కృష్ణుడి అన్నగారినని, అడుగడుగునా అతనిని కాపాడవలసిన బాధ్యత తనపై ఉందనీ" అనుకుంటూ ఉంటాడట! అందుకనే ఆతడు కన్నయ్యని విడిచి ఉండడు."
"లోకాలను కాపాడే వానిని కాపాడే వాడు బలరాముడన్నమాట!"
"అవును! ఇంకో సంగతి విను! వనవాసానికి వెన్నంటి వస్తానని బయలుదేరిన లక్ష్మణుడిని "నువ్వెందుకూ, రావద్దూ!" అని వారించాడట రాముడు. "క్రుధ్నంతీ కుశకంటకాః" నువ్వు నడిచే దారిలో గీసుకునే దర్భల్నీ, గుచ్చుకునే ముళ్ళనీ తొలగిస్తాను.. రానివ్వమని" వేడుకున్నాడట లక్ష్మణుడు. ఆ లక్ష్మణుడే ఈ బలరాముడు." చెప్పింది సురభి.
"అవునా! భలే! ఎంత అదృష్టవంతుడో కదా! ఏ అవతారంలో అయినా వెంటుండే అదృష్టం!!"
"కాదూ మరి! ఈ బలదేవుడూ, ఆనాడు లక్ష్మణుడూ సాక్షాత్తూ ఆదిశేషుని అంశ! ఆదిశేషుడెంత అదృష్టవంతుడో తెలుసా!

నివాస శయ్యాసనపాదుకాంశుక
ఉపధానవర్షాతపవారణాదిభిః
శరీరభేదైస్తవ శేషతాంగతైః
యథోచితం శేష ఇతీరితే జనైః

ఆ పరంధాముడికి ఉండేందుకు నివాసము, నిదురించేందుకు శయ్య, పాదాలను ఉంచుకునే పీఠము, తలగడ,  పైన ఉత్తరీయము, ఎండా వానా కాచే గొడుగూ అన్నీ నీవే అయి.. శేషుడనే పేరుకు తగినవాడివి నువ్వేనయ్యా! అని మెచ్చుకున్నారట ఆదిశేషుడిని!" ఆనందిని చెప్పింది.
"అవునా!! అపచారం అపచారం! బలదేవుని విస్మరించనే కూడదు! భగవంతుని కంటే ముందు భాగవతులను పూజించమని చెప్తారు కదూ పెద్దలు. బలదేవుడినే వేడుకుందాం!" నొచ్చుకుంటూ చెప్పింది కమలిని.
"మంచి పిల్లవి! బుధ్ధిశాలివి! పిలు మరి!" నవ్వుతూ కమలినినే ముందుకు వెళ్ళమన్నట్టు సైగ చేసింది ఆనందిని.

"ఓ బలదేవా! ఆదిశేషుని అంశవి నువ్వు! ఎంతో గొప్ప వాడివి! నీ శౌర్యం కృష్ణుడికి ఎల్లవేళలా రక్ష కావాలి! వీరోచితమైన ఆపరంజి కడియం నీ కాలికి అలంకరించబడి ఉంటుంది కదా! నీ చలవ వలనే కన్నయ్య మాకు దక్కాడు! ఆ పాదం నేలను మోపి లేచి రా! నీ తమ్ముని నువ్వే నిద్ర లేపి బయటకు రా! ఇద్దరు చందమామలు నేలమీద వెలిగేది ఒక్క మా రేపల్లెలోనే! బలరామకృష్ణులు!! అందంలోనూ, పరాక్రమంలోనూ, కరుణలోనూ కన్నయ్యకు దీటైన వాడివి. దయ చూపించవయ్యా! నిద్రలేచి బయటకు రా!"

కనక వీరమంజీరము ఘనపదముల తొడవుగా
తనరే బలదేవా! నీ తమ్మునితో మేలుకో!
ఆలించి మనవి మా మేలెంచి మేలుకో!

మెల్లగా తలుపు తెరచి బలరాముడు బయటకు వచ్చాడు. గోపకాంతలు సంబరంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రమణీయమైన ముఖాలతో, మనోహరమైన చిరునవ్వులతో మేలుకొలుపు పాడిన వారిని చూసి ప్రసన్నంగా నవ్వుతూ పలకరించాడు బలదేవుడు.

"అమ్మాయిలూ! ఇంత ఉదయాన్నే ఇలా వచ్చారేం? ఏమిటి పని?"
తామొచ్చిన పనిని వినయంగా చెప్పారు గోపికలు. విని తల పంకించాడాయన.
"అమ్మాయిలూ.. మీరు నన్ను అనుమతి అడిగినందుకు చాలా సంతోషం! కానీ కృష్ణుడు పసిబాలుడు కాదు. అమ్మ సందిట నిద్రపోతున్నాడనుకుంటున్నారా? ఇప్పుడు అతడు నీలాదేవి పెనిమిటి! ఆమె అంతఃపురంలో సుఖశయ్యపై నిద్దరోతూ ఉంటాడు. అంత సులువుగా నిద్రలేచి రాడు. అక్కడికే వెళ్ళి మేలుకొలుపు పాడండి. మీరు కోరిన పరవాద్యం ఇస్తాడు." అని చెప్పాడు. ఒకరివైపొకరు చూసుకుని సరేనని ముందుకు కదలబోయారు.

"ఒక్క మాట! తెల్లారబోతోంది. మీరు ఇప్పుడు వెళ్ళి అతగాని నిద్ర లేపి, కృష్ణుడు బయటకు వచ్చి, మీ విన్నపం వినే లోపు మీకు పనులకు వేళ మించిపోదూ! ఆలోచించుకోండి. రేపు తెలవారక మునుపే వచ్చి నేరుగా నీలామందిరానికే వెళ్ళండి. ఏమంటారు!" వెనక్కి లాగాడు బలదేవుడు.

ఉసూరంటూ ఇళ్ళకు బయలుదేరారు ఆ గొల్ల పిల్లలు. కళతప్పిన వారి ముఖాలను చూసి కమలిని ధైర్యం చెప్పింది. "అమ్మాయిలూ! కష్టపడి సాధించిన పండుకి రుచెక్కువ! ఎన్ని పరీక్షలైనా తట్టుకుని నిలబడితేనే మన వ్రతం ఫలిస్తుంది. కృష్ణుడు మనకు దక్కుతాడు. చిటికెలో రోజు గడిచిపోతుంది. రేపు కాత్యాయనీ పూజ అవగానే నేరుగా కన్నయ్య దగ్గరకే వెళ్ళవచ్చు.. నిరాశ పడకండి!" "అవునంటే అవునని" ఉత్సాహంగా ఇళ్ళకు చేరారందరూ! గొల్లపల్లె నిద్రలేచింది. పశువుల అంబారావాలతో, పాలు పితికే శబ్దాలతో, లయగా చల్లతరచే పడుచుల గాజుల సవ్వడితో, ఇవన్నీ చూసేందుకు ఉదయించిన దినమణి నులివెచ్చని కిరణాలతో..


* రేపైనా కన్నయ్య కాచేనా? ఏమో! చూద్దాం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Friday, December 30, 2011

"తలుపు తీయవా, అన్నా!" ~ కాత్యాయనీ వ్రతం - 16

యమున ఒడ్డుకు వచ్చి చేరిన గొల్లపడుచులు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు.
"అందరూ వచ్చేసారా? నమ్మశక్యంగా లేదు!" అంది సురభి.
"అందరం ఉన్నాం. ఆలస్యమెందుకు? స్నానానికి పదండి చెలులూ!" బయలుదేరదీసింది కమలిని.

పొద్దు పొడవక ముందే యమునలో స్నానం చేసి, తడి ఇసుకతో కాత్యాయని ప్రతిమను చేసి, దివ్వెలు వెలిగించారు. ధూపం సుడులు తిరుగుతోంది. వేడి వేడి పొంగలి ఘుమఘుమలు గాలిలో తేలివస్తున్నాయి. సుగంధాలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో 'కాత్యాయని'కి పూజచేసారా గోపకాంతలు. దేవికి మంగళ హారతులుపాడి మనసులో కోరికలు విన్నవించుకున్నారు. ప్రశాంతంగా సాగుతున్న యమున అట్టే సద్దు చెయ్యకుండా వింటోంది. నెలవంక చుక్కభామతో కలిసి ఇంటికేళ్ళే సన్నాహంలో ఉన్నాడు. శుక్రతార జిగేలున మెరుస్తోంది.

"తెలివెలుగు రేఖలైనా రాకుండానే పూజ చేసుకున్నాం. హమ్మయ్య!"
"అవును! ఇప్పుడేం చేద్దాం?"
"ఏం చేస్తాం? ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళి పనులు చేసుకోవడమే!"
"ఇంకా పొద్దు పొడవలేదు. కన్నయ్యని చూసేందుకు వెళ్తేనో!" ఉన్నట్టుండి మెరిసిన ఆలోచనను టక్కున చెప్పింది సురభి.
"కన్నయ్యనా..? ఇంకా నిద్దుర లేవడేమో!"సందేహాల పుట్ట విష్ణుప్రియ వెనక్కిలాగింది.
"నిద్ర లేపుదాం. ఈ పదిరోజులుగా మొద్దు నిద్దురపోయే చెలులనే నిద్రలేపాం!" పదిజతల కళ్ళు ఈ మాటలన్న సురభి వైపు గుర్రుగా చూసాయి.
"కృష్ణుడిని ఈ వేళప్పుడు చూడాలంటే కుదిరే పనేనా! ఎక్కడో 'ఆ మూల సౌధమ్ములో..' నిద్దరోయే స్వామిని చేరే దారి అంత సులువైనది కాదు సుమా!" అంది కమలిని.
"నిజమే! కష్టమేమో కానీ అసాధ్యమైతే కాదు."
"ఏ బలదేవుడో, యశోదమ్మో ఎదురై ఏం కావాలి? వేళకాని వేళ కన్నయ్యతో పనేమిటని అడిగితే! బృందావనికి మనతో ఆటలాడేందుకు వచ్చే కన్నయ్య వేరు. ఆ ఇంట్లో దొరబిడ్డ వేరు. " బెరుగ్గా వెనుకడుగు వేసింది తరళ.
"మనకి 'పర'వాద్యమిస్తానని మాట ఇచ్చాడు కదా! అందుకని వచ్చామని చెప్దాం."
"మంచి ఆలోచన. మంచి ఆలోచన!" అందరూ తేజస్వినిని మెచ్చుకున్నారు.
"అవును కదూ! మనం వ్రతం మొదలుపెట్టి పదిహేను రోజులు కావొస్తోంది. పర ఊసే మరచిపోయాం. సమయానికి గుర్తొచ్చింది. పదండి వెళ్దాం." బయలుదేరింది ఆనందిని.

అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉత్సాహంగా నందగోపుని భవనమున్న వీధిమొగ దాకా వచ్చారు. చుక్కల మధ్య జాబిలిలా వెలిగిపోతోందా ఇల్లు! ఆ వైభవం, ఇంటి బయట ఉన్న కాపలాదారుని చూసేసరికి, ఒక్కసారి అందరి మనసుల్లోనూ రక రకాల ప్రశ్నలు. రణగొణ ధ్వనితో ఒకరి అనుమానం ఒకరితో చెప్పసాగారు.
"ష్.. ఆగండి. అలా గోల చేస్తే వీధంతా నిద్ర లేస్తుంది. మనం మేలుకొలపాల్సింది కృష్ణుడిని మాత్రమే! పదండి వెళ్దాం."అడుగు వెయ్యబోయింది సురభి.
ఆమె భుజం పట్టుకుని ఆపుతూ "అక్కడ కాపలాదారు ఉన్నాడు. ఆపుతాడు. రాక్షస భయం మిక్కుటంగా ఉందని పగలూ రేయీ ఇంటికి కావలి కాసే భటుడిని నియమించాడు నందగోపుడు." హెచ్చరించింది ఆనందిని.
"చెప్దాం! కృష్ణుడికోసమని వచ్చామని చెప్దాం! మనకేమైనా భయమా?"
"అదే! ఏం చెప్తావ్! ఎలా మాట్లాడుతావ్?"
"ఓ కావలిభటుడా! కన్నయ్యని చూడాలీ! తలుపు తియ్య్!" అని చెప్తాం."
"ఇంకా నయం! అతనితో మంచిగా ఉంటేనే మన పని అవుతుంది. జాగ్రత్తగా మాట్లాడాలి." చెప్పింది ఆనందిని.
"సరే! నువ్వే మాట్లాడు. ఏమని మాట్లాడాలో!"
"అదే! ఓ నందగోపుని మందిర రక్షకా!" అని పిలుద్దాం."
"కన్నయ్య ఇంటి కావలి వాడా! అనకూడదా?" పెంకెగా ప్రశ్నించింది ఉత్పల.
"ఊహూ.. అనకూడదు! అలా అంటే కన్నయ్యకి నచ్చదు."
"నీకెలా తెలుసమ్మా?" బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది ఆనందినిని.

"రావణ సంహారం ముగించి పుష్పకమెక్కి సీతా లక్ష్మణ సమేతంగా వస్తున్న రామచంద్రుడూ.. అల్లంత దూరంలో అయోధ్య కనిపించగానే సంబరం పట్టలేక సీతకు చూపించి ఏం చెప్పాడటో తెలుసా!"
"ఊ.. ఏం చెప్పాడు?"
"రాజధానీ పితుర్మమ!" మా నాన్నగారి రాజధాని అదిగో! అని చూపించాడట. అది పధ్ధతి. 'నాది' అని చెప్పుకోవడం శిష్ట లక్షణం కాదు."
"అవునా! వెర్రి గొల్లలం! ఈ రాచపధ్ధతులు పెద్ద పెద్ద విషయాలూ మనకేం తెలుస్తాయి! పోన్లే.. నువ్వు చెప్పావు కనుక తెలిసింది. సరే! అలాగే పిలుద్దాం." అడుగు ముందుకు వేసారందరూ!

బంగారు చిరుగంటలు గాలికి అల్లనల్లన మ్రోగుతూండగా, కాగడాల వెలుగులో మెరుస్తోంది రాజుగారి ఇంటి సింహ ద్వారం. తలుపు గొళ్ళాలకు తాపడం చేసిన మణులు జిగేల్మంటున్నాయి. పైన గరుడ ధ్వజం గాలికి రెపరెపలాడుతోంది.

"రతనాలు తాపిన గొళ్ళాలున్నాయ్!!" ఆశ్చర్యపోయింది కమలిని.
"ఆ మణుల్లో మనని మనం చూసుకుంటూ ఒక్క క్షణం మైమరిచామా! ఇంక కృష్ణుని చూడలేం!"
"అవునా!!"
"అవును. ఆ తలుపులే అహంకార మమకారాలు. మెరిసే మణులు పొదిగిన గడియ, అందమైన ఆ తోరణం ఇవన్నీ మన దృష్టిని మరల్చే పాశాలు, బంధాలు! వాటి అందం మాయలో పడి కనుమరల్చామా.. కన్నయ్య చిక్కడు." చెప్పింది సురభి.
"అంత అంతరార్ధముందా!" అని నోరు వెళ్ళబెట్టి కదిలారందరూ.
"కన్నయ్య పుట్టాకే ఈ గరుడ ధ్వజం ఎగరేసారట కదా!" తలెత్తి దాన్ని చూస్తూ అడిగింది కమలిని.

ఏమి నోముఫలమొ యింత ప్రొద్దొక వార్త, వింటి మబలలార వీనులార!
మన యశోద చిన్ని మగవానిని గనెనట, చూచి వత్తమమ్మ, సుదతులార!!
అని యశోద నోముల పంట, తమ పుణ్యము కొద్దీ పుట్టిన వాడేనని ఎక్కడెక్కడి నుంచో తరుణులు సింగారించుకుని వచ్చారట!"మురిసిపోతూ చెప్పింది సురభి.

"అంతేనా!

పాపనికి నూనె దలయంటి పసుపు బూసి
బోరుకాడించి హరిరక్ష పొమ్మటంచు
జలములొకకిన్ని చుట్టి రాజల్లి తొట్ల
నునిచి దీవించి పాడిరయ్యువిదలెల్ల

కన్నయ్య తలకు నూనె అంటి, పసుపు రాసి నలుగు పెట్టి తలంటిపోసి "శ్రీరామరక్ష" చుట్టి, సాంబ్రాణి పొగ వేసి, దిష్టి చుక్క పెట్టి ఉయ్యాలలో వేసారట! ఆ వైభోగం చూసిన వారివే కనులు!! అప్పుడు ఎగురవేసినదే ఈ గరుడధ్వజం! రాత్రీ పగలూ అనకుండా వచ్చే ప్రజకు దారి తెలిసేందుకు ఆ గరుడధ్వజాన్ని, తోరణాన్నీ కట్టించారు రాజుగారు." కళ్ళింతలు చేసి చెప్పింది ఆనందిని.

ఇంటి ముందుకొచ్చి నిలబడ్డారందరూ! బ్రహ్మాండమైన వైకుంఠ ద్వారాలల్లే తోచాయా తలుపులు. ఆ తలుపుల వెనుక ఉండేది వైకుంఠనాథుడే మరి! నోట మాట లేకుండా నిలబడిన ఆ పడుచులను, నీరు కారుతున్న పొడవైన తడి జుత్తుని కొసముడి వేసుకు వచ్చిన వారి తీరును చూసి "ఎవరా?" అని ఒక్క అడుగు ముందుకు వేసాడా ద్వార పాలకుడు. 'ఊళ్ళో ఆడపిల్లల్లా ఉన్నార'నుకున్నాడు. అనుమానించుట భటుని లక్షణం. ఏ రక్కసి మూక ఏ రూపంలో వస్తుందో తెలియదాయె! వారి బేల మొహాలను చూసి మోసపోకూడదనుకున్నాడు.

"ఎవరమ్మాయిలూ!" గర్జించాడు. గజగజలాడారందరూ!
ధైర్యం కూడగట్టుకుని ముందుకొచ్చిన సురభి, ఆనందిని, కమలిని మొహాలు చూసుకుని నువ్వెళ్ళంటే నువ్వని ఒకరినొకరు ముందుకు తోసుకున్నారు.
"ఓ నందగోపస్వామి మందిర రక్షకా! మేము కాత్యాయనీ వ్రతం చేస్తున్న గొల్ల పడుచులం." కమలిని ధైర్యం చేసింది.
"ఓహో! మరి ఇక్కడికెందుకు వచ్చారు?" అడిగాడతను.
"మేము కృష్ణుడి కోసం వచ్చాం. ఇదిగిదిగో.. ముందే కాదని చెప్పకుండా, దయచేసి సావధానంగా మా మాట విను." అభ్యర్ధనతో ముందరికాళ్ళకి బంధం వేసానని చెలులవైపు గర్వంగా చూసింది కమలిని.
"కృష్ణుడినా..?! ఈ వేళలోనా!! తెల్లారాక రండి." ఇక దయచేయమన్నట్టు చూసాడాయన.
"అయ్యయ్యో! అలా వెళ్ళిపోమని చెప్పకయ్యా! తెల్లారాక కాదు. ఇప్పుడే చూడాలి." బతిమాలుతున్న ధోరణిల్లో చెప్పింది ఆనందిని.
"ఇంకా పొద్దు పొడవలేదు. కటిక చీకటి, చలి రాత్రులు! మీరేదో వ్రతమని నిద్రలేచారని ఆ అయ్య నిద్రలేస్తాడా? నిద్దరోతున్నాడు. పగలంతా ఆతనికి పనే! ఎంతమందిని చూడాలీ! ఎన్ని రాచకార్యాలూ! మధ్యలో ఊరి మీద పడే రాక్షసులు.. వారి పీచమడచాలి!"ఏకరవు పెట్టాడు ద్వారపాలకుడు.
"అవును. కానీ మేము కృష్ణుడిని ఇప్పుడే చూడాలి. నిద్రపోతున్నప్పుడే చూడాలి. ఆ తామరరేకుల కనులు మూసుకుని, చిరునగవు చెదరనివ్వక ఓ చెయ్యి తలకింద పెట్టుకుని, హాయిగా నిద్దరోతున్న ఆ యదువంశదీపకుడిని చూడాలి. ఆ మోహనరూపం మా కళ్ళలో ముద్దర వేసుకోవాలి." తన్మయురాలై చెప్పింది సురభి.
"భలే వారే! ఏం ప్రేమమ్మా మీది? నిద్దరోతున్న సామిని చూసి, అలికిడి చేసి నిద్ర పాడు చేస్తారా? చాలు చాల్లెండి. వెళ్ళండింక. చూసి వెళ్తారట.. చూసి వెళ్తారు!" విసుక్కుని మళ్ళీ ద్వారం దగ్గరకి వెళ్ళి నిలబడ్డాడతడు.

ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. కొందరి కళ్ళు వర్షించడానికి సిధ్ధమైన మేఘాల్లా ఉన్నాయి. ఇంకొందరు వెనక్కి మరలేందుకు సిధ్ధమైపోయారు. ముందుకొచ్చిన తేజస్విని అందరికీ ధైర్యం చెప్పింది. "మనం వచ్చిన పని చెప్దాం. అతన్ని బతిమాలనిదే మనకి తలుపులు తియ్యడు. అలా బెంబేలు పడితే ఏం లాభం?పదండి" అని ధైర్యం నూరిపోసిందందరికీ. "సరే"నని ముందుకెళ్ళింది ఆనందిని.

"ఓ ద్వారపాలకా! నువ్వెంత గొప్ప వాడివి! ముల్లోకాల్ని కాచే ఆ పరమాత్మకు కావలి ఉంటున్నావు. రక్కసుల బారి నుండి అతడి నిద్రని కాచేవాడివి. అలసి సొలసిన ఆ కన్నులు సుఖమైన నిద్రపోకుండా మేలుకొలపడం తప్పే! కానీ, మాకు దిక్కు అతడే!

పూర్వం తాటకినీ, మారీచ సుబాహుల్నీ దునుమాడి మునిజనాన్ని రక్షించేందుకు విశ్వామిత్రుని వెంట దండకారణ్యానికి వెళ్ళిన రామచంద్రుడు, లక్ష్మణుడు రాత్రివేళ మార్గమధ్యంలో నిద్రపోయారట. తెలవారింది. ఆ పసిబాలుల ముద్దు మోము చూసి విశ్వామిత్రునికి మేలుకొలుపు పలకాలని అనిపించి ఉండకపోతే రాక్షసవధ జరిగేదా? "కౌసల్యా సుప్రజా.. రామా.. పుర్వాసంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం!" అని తీయగా మేలుకొలుపు పాడలేదూ! అమ్మ పేరు విని ప్రశాంతంగా నిద్రలేచి ఉంటాడు రామచంద్రుడు! మేమూ కృష్ణుడిని ఉలిక్కిపడేలా నిద్రలేపము. కమ్మని పాటలతో మేలుకొలుపుతాం. తీయని పలుకులతో కర్తవ్య బోధ చేస్తాం!"

"కర్తవ్య బోధా!? హ్హహ్హహా.. వెర్రి గొల్లపిల్లలూ! మీరే కర్తవ్య బోధ చేస్తారూ? విశ్వామిత్రునికీ, మీకూ పోలికా? హ్హహ్హహ్హహా!" పగలబడి నవ్వాడతడు.
"రేపల్లెలో నెలకు మూడు వర్షాలు పడాలని, పాడీ పంటా సమృధ్ధిగా ఉండాలనీ మేము ఈ వ్రతం తలపెట్టాం. వ్రతానికి మాకు 'పర' అనే వాయిద్యం కావాలి. మాకు కావలసిన సంభారాలు కన్నయ్యని అడిగి తీసుకోమని నందగోపుడే ఆ రోజు మాకు చెప్పాడు. తండ్రి చెప్పిన పని చెయ్యడం కుమారుని కర్తవ్యం కాదా! మాకు దిక్కెవరు! ఆ నందనందనుడు తప్ప!" ఆక్రోశించారు గొల్ల పడుచులందరూ!

వాళ్ళ దీనవదనాలు చుసి, చలిగాలికి ఎర్రబారిన వారి లేతముఖాలు చూసి కాస్త కరిగిందతని మనసు. దయగా చూస్తూ మార్దవంగా చెప్పాడు.
"అది సరే, అమ్మాయిలూ! కానీ నేరుగా కృష్ణుడి దగ్గరకి ఎలా పంపేది? మీరు అమాయకమైన పిల్లల్లా కనిపిస్తున్నారు. మీకు పెద్దల పధ్ధతులు తెలీవు. కృష్ణ స్వామి కంటే ముందు రాజుగారిని దాటి వెళ్ళాలి. కన్నయ్యకి ఎలాంటి ఆపదా రాకుండా నేను బయట కాపలా కాస్తున్నా.. లోపల ఆ మారాజుకి రేయంతా నిద్దరుండదు. పాపం! ఉలికీ ఉలికీ లేస్తూనే ఉంటారు. ఆయమ్మ యశోదమ్మా అంతే! ఝాము ఝాముకీ లేచి చూస్తూనే ఉంటుంది. మీరిలా బిలబిలా లోపలికి వెళ్ళారే అనుకోండి.. ఏ ఆవుల మంద రూపంలోనో రాక్షసులొచ్చారనుకుని రాజుగారు కత్తి దూసినా ఆశ్చర్యం లేదు. అంతేనా? తమ్ముడిని కంటికి రెప్పగా కాచుకునే బలరాముడున్నాడు లోపల. నాగలి చేతికందే దూరంలో ఉంచుకుని నిద్దరోతాడతను. చీమ చిటుక్కుమన్నా నిద్రలేస్తాడు. ఇంత మందిని దాటి మీరెలా రాచబిడ్డ దాకా వెళ్తారు? ఎప్పుడో పదిహేను రోజుల క్రితం మీరు అడిగిన వస్తువు గురించి ఎవరికి గుర్తు? వాళ్ళకి నిద్ర లేస్తే తామరతంపరగా వచ్చీపోయే జనాలు, రాచకార్యాలూనాయె! గుర్తుంటుందా అని!"

ఒక్క సారి ఉస్సురన్నారందరూ! ఆనందిని మాత్రం ఆశ కోల్పోలేదు.
"అయ్యో! అలా అనకు అన్నా! రాచకుటుంబం మాట తప్పరు. నందగోపుడికి ప్రజలు పిల్లలతో సమానం. అతడు మర్చిపోడు. కన్నయ్య అసలు మర్చిపోడు. సర్వం ఎరిగిన వాడాయన! లక్ష్మీసంపన్నుడు. మాకు ఇచ్చే వాయిద్యమొక లెక్కా అతడికి. "రామోద్విర్నావిభాషతే!" రాముడు రెండు మాటలు మాట్లాడడు. ఆడిన మాట తప్పడు. ఆ రాముడే ఈ కృష్ణుడు. కల్లలాడడు. లేదు పొమ్మనడు. మాకు నమ్మకముంది. నువ్వు మా ఆశల మీద పాల పొంగు మీద నీళ్ళు జల్లినట్టు నిరాశను చిలకరించకు. మణులతో పొదిగిన ఆ గొళ్ళెం తెరు! మమ్మల్ని లోపలికి వెళ్ళనీ..!" వేడుకుంది ఆనందిని.

ఆమె మాటలలో ఆవేదనకు చలించిన ద్వారపాలకుడు తలుపు తీయబోయి, ఒక్క క్షణమాగాడు. "తెలవారుతోంది. ఇంక యశోదమ్మ కృష్ణుని నిద్ర లేపి, నలుగు పెట్టి స్నానం చేయిస్తుంది. కుదురుగా తిలకం దిద్దుతుంది. ఈ పనులన్నీ ఈ గోపబాలికల వల్ల వేళ మించిపోతే.. నందుడు తనపై కోపం తెచ్చుకుని దండిస్తే! దండిస్తే పరవాలేదు.. తన సమర్ధతని శంకించి ఉద్యోగం మరొకరికి ఇచ్చేస్తే!? కృష్ణుడు నిదురించే మందిరం బయట నిలబడడమే అదృష్టమని మురిసిపోతున్నాడే తను! "జయవిజయుల సాటి నా పెనివిటి" అని తన భార్య అందరితోనూ ఎంతో గొప్పగా చెప్పుకుంటోంది కదా! వీళ్ళని ఈ వేళలో లోపలికి పంపి ఆ భాగ్యానికి ముప్పు తెచ్చుకోవడమా!" అని ఆలోచించసాగాడు.

అతని ముఖంలో ఆలోచన చూసి గొల్లెతలందరూ ఒకటిగా వేడుకున్నారతడిని.
"ఓ ద్వార పాలకా! వెర్రి గొల్ల పడతులం! స్నానం చేసి పరిశుధ్ధులమై, నిష్కల్మషమైన మనసులతో వచ్చాం. నల్లనయ్య మాకు మాటిచ్చి నిద్దురపోతున్నాడు. ఆ మాయవానిని మేము వెళ్ళి మేలుకొలపాలి. రతనాల తలుపు గొళ్ళెము తీయవా అన్నా!"

నందగోప స్వామి మందిర రక్షకా!
సుందర ధ్వజ తోరణ ద్వార పాలకా!
వల్ల కాదనకు! వలదనకు మునుమున్నె!
అల్లన రతనాల తలుపు గొళ్ళెము తీయ!

కల్లకపటము లేని గొల్లకన్నెలమన్న!
నల్లని తిరుమేనివానికై వచ్చేము

మ్రోయు పరవాద్యమిడెదనని నిన్ననే
మాయలాడు తానే మాట ఇచ్చేనని
ఈయెడ తానమాడి ఏతెంచినా మన్న!
తీయుమా తలుపు! పాడేము మేల్కొలుపు!

ఆర్ద్రంగా మధురంగా పాడుతున్న వారిని చూసి, నవ్వి చెప్పాడు ద్వారపాలకుడు. "ఓ అమ్మాయిలూ! తప్పకుండా తలుపు తీస్తాను. కానీ మీరు రేపు రండి. ఈ రోజు వేళ మించిపోయింది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి, మంగళ స్నానం చేసి, కృష్ణుడు చెయ్యవలసిన పనులెన్నో ఉన్నాయి. మీరు రేఫు ఇంకాస్త ముందు బయలుదేరి రండి. మారు మాటాడక లోనికి పంపుతాను. మీరు కృష్ణుడిని మేలుకొలిపి మీకు కావలసిన వస్తువు అడిగి పట్టుకెళ్ళండి."

ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. తప్పేదేముందని వెనక్కి తిరిగారు. ఆశ ప్రేమకు నీడ! వదిలిపోదు. బాలభానుని తొలికిరణాలలాగే వారి మనసుల్లో ఆశ ఉజ్వలంగా వెలుగుతోంది.
"రేపు రావచ్చు. కన్నయ్యని చూడవచ్చు!"


* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..

( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Thursday, December 29, 2011

నేనా 'గడుసరి'ని! మరి మీరో? - కాత్యాయనీ వ్రతం - 15

యదుశేఖరునికి కనిపించకుండా పూపొదరింట దాగింది వల్లరి. గోపభామినులందరూ కృష్ణుడితో కలిసి బృందావనిలో దాగుడుమూతలాడుతున్నారు. ఓ పొన్నచెట్టు వెనుక దాగిన కమలినిని చెయ్యిపట్టుకు బయటకు లాగి "దొంగ దొరికింది!" అని నవ్వాడు వెన్నదొంగ. కూడబలుక్కుని ఓ తిన్నెచాటున నక్కిన వారిజనూ, విష్ణుప్రియనూ చెవులుపట్టి కుందేలుపిల్లల్ని లేపినట్టు లేపాడు. "ఓడిపోయాం లే కన్నా! చెవి వదులూ!" అని వేడుకున్నారిద్దరూ! గుబురుగా ఉన్న కరవీర కుసుమాల మధ్యలోంచి కనిపిస్తున్న లేడికనుల మంజరిని, చటుక్కున వెళ్ళి వెనుక నుంచి కావలించుకు బయటకు లాక్కొచ్చాడు. కిలకిలా నవ్విందా పిల్ల. జట్టుగా ఓ నికుంజంలో దాగిన ఆనందిని, ప్రియంవద, ఉత్పల, వకుళ ఒకేసారి కృష్ణుని చేత చిక్కారు. ఇంక మిగిలినది వల్లరి!

బయట చెలుల నవ్వులు, అతని మాటలు వినిపించి పొదరింట ఇంకా ముడుచుకుని కూర్చుంది. ఆకుపచ్చని పావడా కట్టుకొచ్చినందుకు మరో సారి తనని తనే అభినందించుకుంది. పసిడి పాదాల మువ్వల్ని, చేతి గాజుల్నీ సడిచేయవద్దని వేడుకుంది. "కన్నయ్య ఇంకా రావట్లేదే! నేను గుర్తులేనా? చెలులైనా చూసుకోలేదా?" ఓ సారి బయటకి తొంగిచూద్దామనుకుని అలికిడి విని ఆగిపోయింది. గుబురుగా చిక్కగా అల్లుకున్న ఆ పొదరింట కూర్చుంటే, బయటకి కనపడే అవకాశమే లేదు! అందరినీ ఓడించే కన్నయ్య ఈరోజు తన చేతిలో ఓడిపోతున్నాడని సంబరపడింది.  అడుగుల సడి దగ్గరవుతూంటే తన గుండె కొట్టుకోవడం తనకే తెలుస్తోంది. చటుక్కున లేచి బయటకు పరుగెత్తి అతడిని గాఢంగా కౌగిలించుకోవాలని వెర్రి మోహం కలిగిందామెకి! తనని తనే వెనక్కి లాక్కుంది. పాదాలు కూడా బయటకి కనిపించకుండా ఒదిగి కూర్చుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తన పెంపుడు చిలుక రివ్వున ఎగిరొచ్చి పక్కన వాలి గోలగోలగా అరిచింది."ష్..ష్.. మాట్లాడకూ! ష్షూ.. " వల్లరి గాభరాగా అంది. ముక్కుతో ఆమె చేతి ఉంగరాన్ని కొరుకుతూ ఆమె మణికట్టుమీద వాలి కిమ్మనకుండా ఉండిపోయిందా చిలుక. మాట విన్నందుకు మెచ్చుకుంటూ ముద్దుపెట్టుకుంది వల్లరి. యజమానురాలు మెచ్చుకున్నందుకు సంబరంగా "కృష్ణా.. కృష్ణా..!" అని తనకి నేర్పిన పలుకుని వల్లెవేసిందది. మరుక్షణం వల్లరి కృష్ణుని బిగికౌగిట బందీయై ఉంది.

"దొంగా! దొరికిపోయావ్!! ఎంత వెతికానూ.. ఎంత వెతికానూ! నాకు చిక్కకుండా పోదామనే!" కళ్ళు మిలమిలా మెరిపిస్తూ అడిగాడు మోహనకృష్ణుడు.
"ఊ..!" నవ్వింది వల్లరి.
ఎగిరొచ్చి అతడి భుజం మీద వాలిందా రాచిలుక.
"నీకు జామ కాయ పెట్టనా.. వెన్నముద్ద పెట్టనా! ఈ అల్లరి వల్లరిని పట్టిచ్చావు కదా!" దానిని చేతితో నిమురుతూ ఓ తిన్నె మీద కుర్చుంటూ అడిగాడు.
"ఎంత గొల్లపల్లెలో చిలుకైతే మాత్రం.. వెన్న తింటుందా!?" వల్లరి ప్రశ్నించింది, పక్కనే కూర్చుంటూ.
"నేను పెడితే ఎందుకు తినదూ! అవునూ! ఇంతకీ ఈ చిలుకకి అంత తీయగా పలుకులు నేర్పిన కలకంఠి .. రేపల్లెలో 'శారికాకీరపంక్తికి చదువులు గరిపే చిన్నది' ఏం తింటుందో! జుంటి తేనెలా? చెరకు పానకాలా?" మనోహరంగా నవ్వుతూ ఆమె కళ్ళలోకి చూసాడు.
ఇంక మారు మాట్లాడగలదా? కృష్ణుని చూపులు తూపులై గుండెల్లో గుచ్చుకుంటే మారాడగలదా? అతని మేని సుగంధం..!! చందనమా.. ఊహూ.. కస్తూరీ.. హ్మ్.. కర్పూర పరాగం.. కాదు.. వనమాల.. ఇవేవీ కాదు.. మరేదో!! విరజాజుల పరిమళం మనసంతా మత్తు మత్తుగా కమ్మేసినట్టుందామెకు!

"ఇంకా నిద్దరోతున్నావా! ఈ రోజు నీ వంతా భామామణీ! ఏం కలలు కంటున్నావో!"
కృష్ణుడి కౌగిలిలోంచి.. అమాంతం తన పడకగదిలోకి వచ్చిపడడం అసలు నచ్చలేదు వల్లరికి. తెలవారిపోవడం ఇంకా నచ్చలేదు. కోపమొచ్చింది. ఎవరిపై అలక పూనాలో అర్ధం కాలేదు."ఈ చెలులొకరూ!  పిట్టలు లేచాయీ.. పశువులు అరిచాయీ.. అని మొదలెడతారింక. అప్పుడే తెల్లవారాలా? అప్పుడే కల కరిగిపోవాలా! అబ్బ! ఒక్క క్షణం.. ఇంకొక్క క్షణం ఆ ఆలింగన సౌఖ్యాన్ని, ఆ మోహన రూపాన్నీ అనుభవించనివ్వకుండా..!" అలకతో రంజిల్లుతున్న ఆ మోము మహ ముద్దుగా ఉంది. కనురెప్పలు కినుకగా బిగించింది.

"ఓ చిరుత రాచిలుక లేచి రావేమే! లేచియున్నామే!"
బయట నుంచి చెలులు పిలుస్తున్నారు. చిలుక ఊసెత్తేసరికి ఇంకా కోపం వచ్చిందామెకు. ఉక్రోషంగా లోపల నుండే బదులిచ్చింది.
"వేచేవారి నిదుర దోచుకున్నానో! ఓ చెలులు
నా నిదుర దాచుకున్నానో! లేచి వచ్చేనే!"
లోపల నుండి జవాబు వినిపించేసరికి ఉలిక్కిపడ్డారందరూ! ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు.
"ఓ అమ్మాయీ! లతాంగీ! నిద్ర లేచేవా.. మరి బయటకు రాకుండా లోపలేం చేస్తున్నావు?"

ఇంకా పెరిగిపోయిందామె ఉక్రోషం. లోపలేం చేస్తాను! నేనేమైనా కృష్ణ పరిష్వంగన సుఖాన్ని అనుభవిస్తున్నానేమో అనా వీళ్ళ అనుమానం?
"ఆ.. కన్నయ్యకి తిలకం దిద్దుతున్నాను. నిన్న రాత్రి నుండీ నా కౌగిల్లోనే ఉన్నాడేమో! చమటకు చెదిరిపోయింది!" సన్నాయి నొక్కులు నొక్కుతూ సమాధానం చెప్పింది వల్లరి.

బుగ్గలు నొక్కుకున్నారందరూ! నిజంగా కృష్ణుడి కౌగిల్లోనే ఉన్న పిల్ల నోరు మెదిపి ఈ లోకపు బంధాలతో మాట్లాడలేదని ఎరిగిన వారు కదూ!
"భళి భళీ! ఎంత నుడికారితనమే!
తెలుసులే నీ నంగనాచితనము మాకు!"

గతుక్కుమంది వల్లరి. "నిజంగానే కన్నయ్య ఉన్నాడని అనుకుంటున్నారా ఏం! ఉంటే మాత్రం!! అంతలేసి మాటలంటారా నన్ను?" ముక్కు పుటాలెగరేసింది. అంతలోనే బయట చలిలో ఎదురుచూస్తున్న చెలులు గుర్తొచ్చారు. అయినా తగ్గేది లేదనుకుని సమాధానం చెప్పింది.
"మీరు గడుసరులు కారేమో పాపము!
నేనె కాబోలంత నేరువని దాన!
వచ్చిరో అందరును నెచ్చెలులు?"

"చూడు! చూడూ! "అందరూ వచ్చారా!" అని ప్రశ్నిస్తోంది దొరసాని! ఈవిడ మాత్రం ఇంట్లో గువ్వపిట్టలా కూర్చుని.. చలిలో గజగజ వణుకుతున్న మనని లెక్కలు అడుగుతోంది!" కయ్యానికి సిధ్ధమైపోయింది ఉత్పల. తలుపుకు దగ్గరా వెళ్ళి గొంతు హెచ్చించి సమాధానం చెప్పింది.
"ఆ! వచ్చి నీవే లెక్కపెట్టుకోవె!
విచ్చేయవే అమ్మ చెచ్చెర! లేకున్న
మచ్చిక పని యున్నదేమో ఏదైన!"

ఉత్పల సమాధానం విని నొచ్చుకుంది వల్లరి. నిజంగానే కన్నయ్యని పడకటింట్లో అట్టే పెట్టుకున్నాననుకుంటున్నారు నేస్తాలందరూ! దోరముగ్గిన జాంపండునైనా కాకెంగిలి చేసి పంచనిదే ఒక్క ముక్కైనా తినని దానినని తెలీదూ! అంతలేసి మాటలనేస్తున్నారు! ఒక్కదాన్ని చేసి ఆడిపోసుకుంటున్నారని చిన్నబుచ్చుకుంది. ఈలోగా బయట ఉత్పలను సురభి మందలించడం వినిపించి తలుపు దగ్గరకు వచ్చి వినసాగింది.

"తప్పు తప్పు! మాటకు మాట తెగులు - నీటికి నాచు తెగులు. చెప్పకనేం! హరినామస్మరణతో నిద్రలేపే చెలుల కోసం పడక దిగకుండా కూర్చుందామని నాకే ఉదయాన్నే బుధ్ధి పుట్టింది. "కృష్ణా..!" అని మేలుకొలుపు పాడు! కలహాలతోనూ, సాధింపులతోనూ కాదు. కృష్ణునికి ప్రియమైన వారెవరైనా మనకి ఆప్తులు కావాలి. అది కదూ ప్రేమ అంటే!" మెత్త మెత్తగా మందలించింది. ఒక్క క్షణం ఆరిపోయిన ఉత్పల ముఖం వెంటనే సర్దుకుని మళ్ళీ కళకళ్ళాడింది.
"నిజమే సురభీ! మీదపడే 'కువలయాపీడం' లాంటిది కోపం! కన్నయ్య దాని పొగరణచినట్టు మనమూ అదుపులో పెట్టుకోవాలి."
"బాగు బాగు! ముందా చిలుక పాపాయిని నిద్ర లేపండి! ఓ అమ్మాయీ! అందరమూ వచ్చాం. నువ్వొచ్చి లెక్క పెట్టుకో! వరుసగా నిలబడతాం. ఒకటీ రెండూ మూడూ.. అని నీ కోమలమైన చేతితో మమ్మల్ని తాకి లెక్కపెట్టుకో! పరుసవేది తాకగానే ఇనుము బంగారమైనట్టు నీ స్పర్శతో మేమూ పుణ్యాన్ని పొందుతాము. కృష్ణుని ప్రియసఖివి. లేత రాచిలుకలా ఆతని పేరు నిత్యం పలికే దానివి. నువ్వు లేక మా సమూహం చిన్నబోయింది. రా.. అందరం కలిసి ఆ వంశీమనోహరుడి లీలలు పాడుతూ యమున చేరుదాం. చన్నీట "హరిహరీ!" అని మునుగుదాం. 'కాత్యాయని'కి పరిమళాలు విరజిమ్మే పూలతో పూజ చేద్దాం. సగం దూరం వచ్చేసాం అమ్మీ! ఇప్పుడు వ్రతానికి వేళ మించనివ్వకు! కృష్ణుడనే మావిగున్నకు అల్లుకుని చివురులేసే లతవి! అనురాగ వల్లరివి! రా! బయటికి వచ్చి మాతో చేరు!"

ఉరుమత్తగజకుంభ మరియ మొత్తినవాని,
అరులదర్పమ్ము నరవర చేయువాని,
అరిది గుణముల వాని, హరిని కీర్తింప,
అరుగగా వలయు బిరబిర రమ్మ! ఓ అమ్మ!

ఓ చిరుత రాచిలుక! లేచి రావేమే! వేచియున్నామే!

తటాలున తలుపు తీసి చిరునగవుతో బయటకు వచ్చిన వల్లరిని, ఆహ్లాదంగా నవ్వుతూ తమ బృందంలో చేరుచుకున్నారు చెలులు. అందరూ యమున వైపు అడుగులు వేసారు. నిద్ర ఆపుకుని ఈ విడ్డూరం ఇంతవరకూ చూసిన నెలవంక నవ్వుకుంటూ ఆవులించింది.


* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Wednesday, December 28, 2011

మాకు చెప్పి నీవే నిద్దరోతావా? - కాత్యాయనీ వ్రతం - 14

మంచుతెరల దుప్పటి తొలగించుకుని నిద్ర లేచే ప్రయత్నం చేస్తోంది రేపల్లె. నిన్న రాత్రి చెలికాని చేత చిక్కి నేలజారిన జవరాలి జలతారు వల్లెవాటు క్రీనీడలలో మెరిసినట్టుంది యమున.

ఈనాటికి ఎన్ని రోజుల వ్రతం పూర్తయిందో లెక్కపెట్టుకుని సంతృప్తిగా పడకలు దిగారు కొందరు గొల్లెతలు. "ఇంకా సగం దూరమైనా రాలేదే!" అనుకుంటూ ఉస్సురని తలగడని కావలించుకుని, శయ్యల మీద ఇంకాసేఫు పొర్లసాగారు మరికొందరు. చెదిరిన కురులు సర్దుకుని బయటకు వచ్చి, పూలతోటలో తిరుగుతోంది కమలిని. ఆకు కనబడకుండా పూచిన నందివర్ధనాలను చూసి ముచ్చటపడింది. చెట్టు మొదట నేల కనబడకుండా రాలిన పారిజాతాలను ఏరింది. బయట అలికిడై అటుచూస్తే కదంబమాల నడిచివస్తున్నట్టు కిలకిలా నవ్వుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ చెలులందరూ తన ఇంటివైపే వస్తున్నారు. నవ్వుతూ ఎదురెళ్ళింది.

"నెచ్చెలులూ! పక్షుల కంటే ముందు పడతులే నిద్రలేస్తున్నారు రేపల్లెలో! బాగు బాగు! అందరూ వచ్చేసినట్టేనా?" పలకరించింది.
"తరళా.. ప్రియంవదా, ఉత్పలా.. అదిగో విష్ణుప్రియా.. " మునివేళ్ళ మీద లేచి లెక్కెట్టుకుంది. "ఆనందిని లేదు!!"
అందరూ ఒకరి మొహాలు మరో సారి చూసుకున్నారు. అందరికంటే ముందుండే ఆనందిని ఈ రోజు ఇంకా నిద్ర లేవలేదన్న ఆశ్చర్యం! దాని వెంబడే.. అన్నీ తెలిసిన పిల్ల ఒక వేళ ఇంకా నిద్రపోతే ఏం చెప్పి నిద్రలేపాలా? అని ఆలోచన!
"నిద్ర లేచే ఉంటుంది. దారిలో ఏ పువ్వులైనా కోస్తోందేమో!" సమాధానపరుచుకుంటూ చెప్పింది ఉత్పల.
"అవునవును. వాళ్ళ పెరటి కొలనులో తామరలు కోసి తెస్తానని నిన్న అంది. అందుకని ఆలస్యమయిందేమో!" గుర్తు చేసుకుంది విష్ణుప్రియ.
"సరే.. సరే.. పదండి." అని ఆనందిని ఇంటి వైపు కదిలారందరూ.

విశాలమైన ప్రాంగణంలో బొమ్మరిల్లులా ఉంటుంది ఆనందిని ఇల్లు. పెరటి వైపు అందమైన చిన్న కొలను. పెంపుడు లేడికూనలు ఓ పొదరింట ముడుచుకుని నిద్రపోతున్నాయి. మరో వైపు పలుపు తాడు నములుతూ అరుస్తోంది ఓ లేగదూడ. యజమానురాలు విప్పగానే చెంగున వెళ్ళి తల్లి పొదుగులో దూరిపోదామని ఆత్రపడుతోంది. ఇంటి చుట్టూ బారులుతీరిన చేమంతులు కళ్ళు విచ్చి, లోపలికి వస్తున్న ఆ ఇంతులను పలకరించాయి.

"అలికిడి లేదు! ఇంకా నిద్ర లేవనే లేదా.. ఏం!" ఆశ్చర్యంగా తలుపు దగ్గరకు వెళ్ళి తట్టి చూసారు. "రామా.. పరంధామా.. వాసుదేవా.. నారాయణమూర్తీ!" అని కైవారాలు చేసారు.
"ఆనందినీ! సర్వం ఎరిగిన పిల్లవి. నీకెలా మేలుకొలుపు పాడాలో మాకైతే అర్ధం కావడం లేదు. నిన్ను మేము నిద్ర లేపవలసి వస్తుందని ఊహించలేదు సుమా! లే.. మేలుకో హరిప్రియా! ఓ ఆనందినీ! లే లే!" పిలిచింది కమలిని.
ఔనంటే ఔనన్నారు చెలులు. కళ్ళు తెరిచేసరికి నవ్వుతూ పలకరించే అమ్మ, ఆ రోజు ఇంకా నిద్రపోతూంటే ఏం చెయ్యాలో తోచని పిల్లల్లా ఉంది వాళ్ళ పరిస్థితి.
"మేమెవరైనా నిద్ర లేవకపోతే మంచి మాటలు చెప్పి, తెలవారుతోందని గుర్తులు చూపించీ, కమ్మని కథలు చెప్పి నిద్రలేపేదానివి! నీకు చెప్పడానికి మాకు మాటలే దొరకట్లేదు!" బేలగా అంది విష్ణుప్రియ.
"మమ్మలని పరీక్షిస్తున్నావా ఆనందినీ! నిన్నటి దాకా నిద్ర లేవకుండా రోజుకొకరం గారాలుపోయామని మాపై కోపమొచ్చిందా?!" తరళ అనుమానంగా ప్రశ్నించింది. విష్ణుప్రియ, ప్రియంవదా, వారిజ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. 'నిజమేనేమో!' అని అనుమానపడ్డారు.
"అబ్బే! మీరలా బెంగ పెట్టుకోకండి. ఆనందిని అలాంటిది కాదు. వెన్న లాంటి మనసున్నది. మనని ముందు నిలబడి నడిపించేది. ఏదో కారణం లేనిదే ఇంతలా నిద్రపోదు! కన్నయ్యని తలుచుకుంటూ రాత్రంతా నిద్రపోలేదేమో! తెలవారు ఝామున గాఢంగా నిద్ర పట్టేసి ఉంటుంది." ధైర్యవచనాలు పలికింది సురభి.
"సురభీ! ఆనందినితో సమానంగా అన్నీ తెలిసిన దానివి! గొప్ప గొప్ప వేదాంత విషయాలు మీ ఇద్దరూ చర్చించుకుంటారు కూడా! నువ్వే ఆమెను నిద్ర లేపేందుకు సమర్ధురాలివి." తరళ ప్రోత్సహించింది.
"అందరం ప్రయత్నిద్దాం!" తలుపు దగ్గరగా వెళ్ళింది సురభి.

"ఓ ఆనందినీ! అమ్మడూ! అందరూ నిద్రలేచారు. నీ గుమ్మం ముందు నిలబడ్డారు. నువ్వు నిద్ర లేచి వస్తావని, బోలెడు కబుర్లు చెప్తావని ఎదురు చూస్తున్నారు. మాటైనా మాటాడక నిద్రపోతున్నావా? అదిగో! నీ పెరటికొలనులో నల్ల కలువలు ముకుళించాయి. ఎర్ర తామరలు విరబూస్తున్నాయి. మంచు బిందువులు నిలచి చలిగాలికి తలలూచుతున్న ఆ కెందామరలు ఎంత అందంగా ఉన్నాయో తెలుసా! నువ్వే వచ్చి చూడు..! "
గాజుల గలగలలో, కాలిమువ్వల శబ్దమైనా వినబడుతుందని ఒక్క క్షణం అందరూ జాగ్రత్తగా విన్నారు. ఊహూ.. పాన్పుపై పక్కకు తిరిగి ఆనందిని మంత్రమేసినట్టు నిద్రపోతోంది.

యమున ఒడ్డున సైకతవేదికలపై చెలియలతో కలిసి దాగుడుమూతలాడుతోంది ఆనందిని. హఠాత్తుగా వెనుకనుంచి నల్లకలువల్లాంటి ఆమె కళ్ళను మూసిన చిరపరిచితమైన చేతుల స్పర్శ!! శంఖాకృతిలో వెలుగులు చిమ్ముతున్న ఆమె మెడ మీదుగా వెచ్చగా.. "ఎవరో చెప్పుకో చూద్దాం!!" అని వనమాలా సౌరభం వెంటరాగా మధురమైన స్వరమొకటి వినిపించింది. "ఎవరని చెప్పాలి..!? మునిజన మానస రాజహంస అనా! గోపికా హృదయ చోరుడనా! మోహన మురళీధరుడనా! నందనందనుడనా! ముల్లోకాల వేల్పు అనా!" పెదవి పలకని మాటలెరిగిన వాడు.. కొంటెగా నవ్వుతున్నాడు! కెందమ్మి కన్నులతో.. పగడాల పెదవితో.. తెలిముత్తెపు పలువరుసతో.. తననే చూస్తూ నవ్వుతున్నాడు.

"నల్ల కలువలు ముడుచుకున్నాయీ.. ఎర్ర తామరలు విచ్చుకున్నాయీ... అంటే నీ కనులు మూసి నవ్వుతున్న యదునందనుడిని తలుచుకుంటున్నావేమో! కలలు చాలించి నిద్ర లేవమ్మా! మమ్మల్ని నిద్రలేపుతానని మాటిచ్చి ఈ రోజు నువ్వే పడక దిగి రానంటున్నావే! నిన్ను అంత మురిపిస్తున్న ఆ స్వప్నమేవిటో!" బయట నుంచి పిలుస్తోంది ఉత్పల.
"పోనీ.. ఇంకో గుర్తు చెప్తాం విను. మీ ఇంటికి వస్తున్న దారిలో మాకు జీయరులు ఎదురయ్యారు. కాషాయాంబరాలు ధరించారు. హరి నామస్మరణ చేస్తున్నారు. వారు "హరీ..!" అని పెదవి తెరచినప్పుడల్లా వారి పలువరుస తళుక్కున మెరుస్తోంది. వారి చేతిలో తాళపు చెవులున్నాయి. కుంచెకోలలతో బీగం తెరిచి కోవెల తలుపు తీసి సుప్రభాత సేవ చేసేందుకు వెళ్తున్నారు. తెలవారిందని నమ్ముతావా.. లే ఆనందినీ! లే బంగారు తల్లీ!"

కలువ కనుమూసినది
కమలమ్ము పూచినది
కలికిరో! నీ పెరటి కొలనులో!

తెలిదంతముల జియ్యరులు, కావి తాలుపులు,
తరలేరు కుంచెకోలల తెరవ కోవెలలు

మిమ్ము నేనే వచ్చి మేలుకొలిపెదనని
అమ్మచెల్లా! నీవు నిదురింతువే!
కమ్మగా నెరవాది మాటలన్నీ ఆడి
ఎమ్మెలాడీ! నీవు సిగ్గుపడవే!

వరశంఖ చక్రధారిని, హరిని, శౌరిని,
పురుషోత్తముని, వికచజలజ లోచనుని,
తరుణులందరితోడ తనివారగా పొగడ
తరలిరావమ్మ! నిద్దురమాని, ఓ కొమ్మ!

"నీకు చెప్పేందుకు నీకు తెలియని కథలేమీ మాకు తెలియవు! అయినా మాకందరికీ బోలెడు సుద్దులు చెప్పి, నువ్వే నిద్రపోతున్నావా! సిగ్గుగా లేదూ!" నిష్టూరమే గతి అనుకుని సూటిపోటి మాటలాడనారంభించింది కమలిని.
"ఊరుకో పిల్లా! పరుషం పలకూడదని వ్రత నియమం! మర్చిపోయావా!" హెచ్చరించింది తరళ.

"ఓ అమ్మాయీ! ఆ కన్నయ్య చేతిలో ఉండే పాంచజన్యమెంత అదృష్టం చేసుకుందో తెలుసా! అతడి అధర సుధాపానం చేసే అదృష్టం!! ఆ ఎర్రని పెదవిపై ఆనే ఆ శంఖం పుణ్యమెంత గొప్పదో! ఆ వరద హస్తాన నిలచే జన్మ ఎంత సార్ధకమో కదా!! అలాంటి భాగ్యం కోసం వ్రతం చేస్తున్నాం! వేళ మించే పని చెయ్యబోకు సుమా! నిద్ర లేచి రా!"
చటుక్కున కళ్ళు విప్పి, ఒక్క ఉదుటున తలుపు తీసింది ఆనందిని.
"అయ్యో! ఎంత మొద్దు నిద్రపోయాను!" సిగ్గుగా నొచ్చుకుంటూ బయటకు వచ్చింది.
"హమ్మయ్య! లేచావా!! నొచ్చుకోవడం తరువాత.. అంత కమ్మని కలేమిటో చెప్పాల్సిందే!" అల్లరిగా అడిగింది ఉత్పల.
"యమున ఒడ్డున మనమందరం దాగుడు ముతలాడుతున్నామట! ఇంతలో వెనుక నుంచి..." ఆనందిని చెప్తూ యమున వైపు అడుగులు వేసింది. ఆమెను అనుసరిస్తూ కదిలారు "కాత్యాయనీ పూజ" చేసేందుకై గోపబాలలందరూ..



*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


Tuesday, December 27, 2011

చలితహరిణ నయనా! లెమ్మా! - కాత్యాయనీ వ్రతం - 13

అప్పుడే కళ్ళిప్పి లోకాన్ని ముగ్ధంగా పలకరిస్తున్న సుమబాలలకు మంచు ముత్యాలు ముస్తాబు చేస్తున్నాయి. నిన్న లేని సుగంధాన్ని విరజిమ్ముతున్న వాటి నెమ్మోము సోయగాలను చూసి తెమ్మెర ఆశ్చర్యపోతోంది. విచ్చుకోవాలని ప్రయత్నిస్తున్న కమలాన్ని చూసి "ఇలాంటి కళ్ళెక్కడో చూసానే!" అని గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తోంది. ఆ కమలాల కనుదోయి గల చిన్నది 'వారిజ'.

చెంపకు చారెడు కన్నుల వయారి! హాయి నిద్దురపోతోంది. చెలియలందరూ తన మొగసాల నిలచి తనను పిలుస్తూంటే తను మాత్రం స్వప్నలోకాలలో తేలుతోంది. నిద్రాదేవికి ఎంత ముద్దొచ్చాయో ఆమె కళ్ళు.. వీడిపోనంటోంది! తమ నిడివిని కట్టడి చేసే కాటుక రేఖలు లేనందుకు ఆమె కనుదోయి  మిడిసిపడుతోంది. నల్లని కనురెప్పలు వంపు తిరిగి కాటుక లేని లోటు తీరుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఆమెది అద్భుతమైన దేహఛ్ఛాయ! మంచి గంధపు నిగ్గులో మెరిసిపోతోంది. ఆమె కట్టుకున్న నీలిచీర ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తోంది. కోమలంగా పూలచెండులా ఉన్న ఒక చేతిని గుండెల మీద, రెండో చేతిని నుదుటి మీద వేసుకుని చిత్రమైన నాట్య భంగిమలో నిద్రపోతున్న కిన్నెరలా ఉంది.

రోజూ ఎవరో ఒక చెలియ ఇంకా నిద్దుర పోవడం, తాము వెళ్ళి కృష్ణలీలాగానంతో మేలుకొలపడం అలవాటైన గోపకాంతలు "ఈ రోజెవరి ఇల్లు..?" అని వెతుక్కుని వారిజ ఇంటి ముందు నిలబడి పిలుస్తున్నారు.

"ఓ అమ్మాయీ, వారిజా! నువ్వు నిద్రపోవడానికి కారణం మాకు బాగా తెలుసు. నీ అందమైన కళ్ళు కన్నయ్యకే ఎంతో ఇష్టమైనవి. వాటి తళతళల్లో తన రూపు చూసుకుని మురిసిపోతాడతను. ఆ రోజు బృందావనిలో తటాకం ఒడ్డున కూర్చుని నీ సారసనేత్రాలకు అంజనం దిద్దడం మేము చూసాం లే! అలాంటి కళ్ళను రాత్రైతే మాత్రం విడిచి పెడతాడా..! కలలోకొచ్చి వెళ్ళనని మారాం చేస్తున్నాడు కాబోలు! కానీ తెల్లారబోతోంది. కలలు పక్కనపెట్టి నిద్రలేచే సమయం ఆసన్నమైంది. లే లే! యమునకి వెళ్ళి స్నానం చెయ్యాలి." పిలిచింది ఉత్పల.
లోపల నుంచి అలికిడి లేదు. అలాగే బంగరు బొమ్మలా నిద్రపోతోంది వారిజ.
"హ్మ్... అంత సులువుగా ఎందుకు నిద్ర లేస్తావు!? మా మనసులను విరహకీల దహిస్తోంది. ఎంతట చన్నీట మునిగి ఈ తాపం తీర్చుకుందామా అనిపిస్తోంది. నీకేమో కలలో కూడా ఎడబాటు తెలియనివ్వట్లేదతడు. చాలులే కలలు! లేవమ్మా లే లే!" నిష్టూరాలాడింది విష్ణుప్రియ.

"పక్షులు నిద్ర లేచాయి. మేత వెళ్ళేముందు తమ పిల్లల్ని గూళ్ళలో వదిలి, బోలెడు జాగ్రత్తలు చెప్తున్నట్టు కిలకిలారావాలు చేస్తున్నాయి చూడు! వినబడలేదా! ఎంత మొద్దు నిద్రపోతున్నావో! నీలాంటి సుకుమారికి.. అందాల భరిణకు తగిన నిద్ర కాదు సుమా!"
"పక్షులు మా అలికిడికే నిద్రలేచాయనుకుంటున్నావేమో! బయటకు వచ్చి చూడు! బృహస్పతి అస్తమించాడు. తూర్పు దిక్కున శుక్రతార దేదీప్యమానంగా వెలుగుతోంది. శుక్రుడిని చూస్తూనే మునిపల్లెలో వేదాధ్యయనం మొదలైపోయింది. వినబడలేదా?" పిలిచింది సురభి.

"కృష్ణుడి కథలేమైనా చెప్తే గానీ బయటకు రావద్దని నియమం పెట్టుకున్నావా? ఓ పిల్లా! కృష్ణుడి అద్భుత శౌర్యగాధలు చెప్తే నువ్వు భయపడతావు. నీ లేడి కళ్ళలో భీతి కృష్ణుడే కాదు... మేమూ చూడలేము." విష్ణుప్రియ బెదిరించింది.
"ఓయమ్మో! నువ్వేదో పెద్ద ధైర్యస్తురాలివన్నట్టూ..!" నవ్వింది విష్ణుప్రియని చూస్తూ కమలిని.
"నాకేం భయం లేదు. కథ చెప్పి చూడండి కావాలంటే.." రోషపడింది విష్ణుప్రియ.

"సరే, ఎలాగూ ఆ అమ్మడూ లేచి రావాలి కదా.. కన్నయ్య లీల ఒకటి చెప్తాను. వినండి. ఒక రోజు ఆలమందలనూ, అల్లరి నేస్తాలనూ వెంటబెట్టుకుని కృష్ణుడు అడవిలోకి వెళ్ళాడట!" మొదలుపెట్టింది సురభి.
"ఊ.."
"పశువులన్నీ మేత మేసాయి. చల్లని నీళ్ళు తాగాయి. చెట్ల నీడల్లో పడుకుని తిన్న మేత నెమరేసుకుంటున్న మందలో ఒక్కసారి కలకలం మొదలయింది. 'ఏవిటా..!' అని గోపాలకులందరూ వెళ్ళి చూద్దురు కదా.. హిమాలయంలా ఓ పేద్ద కొంగ!"
"కొంగా!"
"ఆ.. అవును. కొంగే! పశువులు దాన్ని చూసి భయపడి పరుగులు తీయనారంభించాయి! పెద్ద కొండలా భీకరాకారంలో ఉన్న ఆ కొంగ సరాసరి కన్నయ్య మీదికి వచ్చేసింది!"
"హమ్మయ్యో!" బెదురుతూ అనబోయి తమాయించుకుంది విష్ణుప్రియ.
"ఊ.. పేద్ద నోరు తెరిచి కన్నయ్యని అమాంతం మింగేసింది. పక్కనున్న గొల్లపిల్లలందరూ హాహాకారాలు చేసారు. ఏం చెయ్యాలో తోచక తమ ములుగఱ్ఱలతో ఆ కొంగ మీదికి లంఘించి పొడవనారంభించారు. తనను మింగిన కొంగ గొంతులో కన్నయ్య అడ్డంగా నిలబడ్డాడు. మండే అగ్ని గోళాన్ని మింగినట్టు ఆ కొంగకి చెప్పలేని బాధ కలిగి నోరు తెరిచిందిట."
"ఆ..!!"
"నోట్లోంచి బయటకు వచ్చిన కన్నయ్య దాని ముక్కు పట్టుకుని విడదీసి చీల్చి చంపేసాడట!"
"హమ్మయో!" ఈ సారి తన కోలకళ్ళలో తొంగిచూస్తున్న బెదురుకి ముసుగు వెయ్యలేకపోయింది విష్ణుప్రియ.
"అదిగో.. చూసావా.. భయపడిపోయావు." నవ్వింది సురభి.
"ఏం కాదు. కన్నయ్యవన్నీ దుడుకు పనులే! ఆనందినీ.. ఎంచక్కా కమ్మని రామకథ చెప్పవచ్చు కదా!" ఆనందిని వైపు చూస్తూ అడిగింది.
"మనం కృష్ణుడికోసం వ్రతం చేస్తూ రాముడి కథెలందుకు? కన్నయ్య కథలెన్ని చెప్పుకున్నా తరగవు."అంది కమలిని.
ఆమె రామకథను కాదనడం ఎవరికీ నచ్చలేదు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వేళ్ళతో చీరకొంగు ముడి వేసి విప్పుతూ ఎటో చూస్తున్న ఆ వెర్రి గొల్ల పడుచు మనసులో, కృష్ణుడి మీదున్న ప్రేమ అర్ధమయింది ఒక్క ఆనందినికే! ఆమె చిన్నగా నవ్వుకుంది.
"సరే కమలినీ.. నువ్వెలా అంటే అలాగే! కన్నయ్య కథొకటి చెప్తాను వినండి." చెప్పడం మొదలుపెట్టింది.

"ఓ నాడు కన్నయ్య బువ్వ తిననని మారాం చేస్తున్నాడట. అవును మరి! పగలంతా ఊళ్ళో అందరి ఇళ్ళలోనూ దొంగతనంగా దూరి వెన్నలూ, పాలూ తిన్నంత తిని, తాగినంత తాగి, తన నెచ్చెలులకు పెట్టి, ఇంకా మిగిలితే కోతిపిల్లలకు పెట్టేవాడాయె .. ఇంక సందెవేళ ఆకలెలా వేస్తుంది!"
ప్రశాంతంగా మారిపోయాయందరి ముఖాలూ! చిన్ని కృష్ణుని కబుర్లు వెన్నముద్దలంత ముద్దుగా ఉంటాయి కదూ!
"అప్పుడేమో యశోద అల్లరి నల్లనయ్య వెనుక ఇల్లంతా పరుగులు పెట్టింది. "నాకొద్దంటే వద్దని" చిక్కకుండా లేడి కూనలా పరుగులు తీస్తూ కన్నయ్య...! యశోద అలా ఎంతో సేపు పరిగెట్టాక విసుగొచ్చి బువ్వ పెట్టకుండా ఊరుకుందామనుకుంది. ఓ స్థంభానికి చారపడి అలుపు తీర్చుకుంటోందట . ఉయ్యాల బల్ల మీద ఎక్కి కొంటె నవ్వులు నవ్వుతున్నాడట అల్లరి పిల్లాడు!"
"హ్హహ్హహ్హహా..!"
"యశోదకి పట్టలేని పంతం వచ్చింది. ఎలాగైనా తినిపించి తీరాలనుకుంది. కన్నయ్యకి ఇష్టమైన కథ చెప్పడం ప్రారంభించింది."
"ఏం కథా?"
"రామ చంద్రుడి కథ! పాయసం తిని కౌసల్య కన్న తియతియ్యని రాముని కథ."
"నువ్వు భలే దానివి సుమీ! ఊ.. చెప్పు చెప్పు!" వెన్నెల పువ్వు విచ్చుకున్నట్టు నవ్వేసింది కమలిని.
"రాముడు పుట్టాడు. శివధనువు విరిచి సీతాకాంతను చేపట్టాడు. కల్యాణమాడాడు. మంధర మాటలు విని కైక కూడని కోరికలు కోరింది. తండ్రి మాట దాటని రామయతండ్రి అడవుల పాలయ్యాడు."
"...."
"అదిగో.. అలా చూస్తే ఆపేస్తాను." సజలనయనాలతో చూస్తున్న చెలులని హెచ్చరించింది ఆనందిని.. తర్జని చూపుతూ!
"లేదులే చెప్పు."
"ఇంతలో పసిడి మాయలేడిని చూసి సీతమ్మ ముచ్చట పడిందా.. తెచ్చి ఇస్తానని రాముడు అడవిలోకి వెళ్ళాడు. అన్నకి సాయం లక్ష్మణుడిని పంపిందామె. మాయ రావణుడు బిక్ష వెయ్యమన్నాడు. గీత దాటిన సీతను ఎత్తుకుపోతున్నాడు.. ఆ పాటికే బువ్వ తినేసి అమ్మ కొంగుకి మూతి తుడుచుకుని, అమ్మ ఒళ్ళో తలపెట్టుకుని మాగన్నుగా నిద్రపోతూ 'ఊ' కొడుతున్న కన్నయ్య హఠాత్తుగా  మెరుపులా పైకి లేచి "సౌమిత్రే! ధనుః !!" "లక్ష్మణా, నా విల్లేదీ!" అని గర్జించాడట."
"అవునా!!" లక్కపిడతల్లా నోళ్ళు వెళ్ళబెట్టి, కళ్ళింతలు చేసి అడుగుతున్న వాళ్ళందరినీ చూసి ఫక్కున నవ్వేసింది ఆనందిని.
"నవ్వుతావేంటీ!? అలా అడిగాడా! నిజమా!" చిన్నబుచ్చుకుంది కమలిని.
"అడగడూ మరి! అతనే తానైనపుడు! అప్పుడు రాముడు - ఇప్పుడు కృష్ణుడు. అవసరాన్ని బట్టి వేషం వేస్తాడు జగన్నాటక సూత్రధారి."
"నిజమే కదూ! ఏంటో అలా మాట్లాడేసాను. అపచారం.. అపచారం!" లెంపలు వేసుకుంది కమలిని.
"పరవాలేదులే! తప్పులేని వారెవరు! "నీలమేఘనిభం.. అంజన కుంతలం.." అని వర్ణించారు కన్నయ్యని. రాముడూ కృష్ణుడూ నీలిమబ్బు వన్నె వారే! కాటుక నల్లని కురుల వారే! కలువ కన్నుల వారే!" నవ్వింది ఆనందిని.

ఇంకా నిద్రలేవని తమ సఖికి మేలుకొలుపు పాడనారంభించారు.

లలితశయనా! చలిత
హరిణ నయనా! లెమ్మ!
తెలవారుచున్నదమ్మా!
అలరు కొమ్మా! తళుకు
పసిడి బొమ్మా! లెమ్మ!
తెలవారుచున్నదమ్మ!

పులుగులవె మేతలకు తరలెను
మెల్లమెల్ల గురుడస్తమించేను
అల శుక్రతార మింట పొడిచెను
కలసి మాతో రమ్మ! కపటమును విడువమ్మ!

బకదైత్య వైరి! ఆ దశకంఠ సంహారి
అకలంక చరితముల ఒక చోట చేరి
ఈ పుణ్య దివసాన సకియలు పాడేరు
తీపారు వలినీట తీర్థమాడగదమ్మ!

తెలవారుచున్నదమ్మా!
లలితశయనా! హరిణనయనా!

నెమ్మదిగా విచ్చిన ఆమె కమలాల కనుల కెంజాయ జీర మెరిసింది. మంచు ముత్యాల గిలిగింతలకు నవకమలం విరిసింది. పూలసజ్జలు నింపుకుని వస్తున్న పూబంతులను చూసి పలకరింపుగా యమున తరగలతో నవ్వింది.


*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Monday, December 26, 2011

నిలువ చోటు లేదు! నిదుర లే! - కాత్యాయనీ వ్రతం - 12

కృష్ణపక్షానికి వీడ్కోలు పలికింది ఆకాశం. నిన్ననే పుట్టిన తన జాబిలికూనని మురిపెంగా యమునకి చూపిస్తోంది.

రేపల్లెలో ఆ ఇంటి వింతలు చెప్పుకోనివారు ఉండరు. ఆలనా పాలనా లేనిదే ఆ ఇంటి పశువులు అంత పాడి ఎలా ఇస్తున్నాయో అందరికీ ఆశ్చర్యమే! నీళ్ళు తోడి పొయ్యకపోయినా ఆ ఇంటి ముంగిట్లో పూలతోట అంత పచ్చగా ఎలా ఉంటుందో ఎవరికీ అర్ధం కాదు. ఆ ఇంటి గోపన్న పొద్దస్తమానం కన్నయ్య వెంట తిరుగుతాడు మరి! గోపన్న కన్నయ్యకి ప్రియనేస్తం. నిద్ర లేచింది మొదలు ప్రతిక్షణం కన్నయ్య వెంట అతనూ ఉండితీరాల్సిందే! ఆలమందలను మేతకు తీసుకువెళ్ళేటప్పుడు కృష్ణుడి కంటే ఓ అడుగు ముందే నడుస్తాడతడు. ఏ ముల్లైనా కృష్ణుడిని గుచ్చే ప్రమాదం ఉంటుందని అతడి బెంగ. చల్ది మూటలు మోస్తాడు. కొండవాగుల్లోంచి చల్లని నీళ్ళు ఆకుదొన్నెల్లో పట్టి తెస్తాడు. కన్నయ్య వేణువూదితే ఒళ్ళు మరచి నాట్యం చేస్తాడు. పుట్టతేనెలు తెచ్చి కృష్ణుడి నోట్లో పిండుతాడు. కొండగోగుపూలు పరిచి కన్నయ్య విశ్రమించేందుకు పడక సిధ్ధం చేస్తాడు. తన తొడపై తలుంచి కృష్ణుడు నిద్రపోతూంటే రెప్పవెయ్యకుండా అతని రూపాన్ని కళ్ళలో పదిల పరుచుకుంటాడు. 'ఏమరుపాటుగా ఉన్న కృష్ణుడిపై ఏ రక్కసి వచ్చిపడుతుందేమో!' అని అనుక్షణం చురుకుగా కావలి కాస్తాడు. కృష్ణుణ్ణి ఇంట్లో దింపి యశోదమ్మ పక్కనే నిలబడి దిష్టి తీసేదాకా ఊరుకోడు. కన్నయ్య బువ్వ తిని నిద్దరోయాక అతని ముద్దు మోము మరోసారి చూసి కడుపు నింపుకుని ఇంటికొచ్చేస్తాడు. మళ్ళీ వేగుచుక్క పొడవకముందే నిద్రలేచి నందగోపుడి ఇంటి ముందు నిలబడతాడు.

"గోపన్నా.. అన్నం తినడం మర్చిపోయినా నవనవలాడతావు. అమృతం తాగావేంట్రా!?" అని గోపన్న తల్లి ఆశ్చర్యపోతుంది. "కన్నయ్యని చూస్తే కడుపు నిండిపోతుందే! పాయసం కంటే తియ్యగా ఉంటాయి ఆ పలుకులు! అమృతం నాకెందుకో..!" అని నవ్వేస్తాడు. "నీ అశ్రధ్ధకి చిక్కనైనా చిక్కవురా ఎనుములు..!! నువ్వేం తింటున్నావో.. వాటికేం మేపుతున్నావో!" అని బుగ్గలు నొక్కుకుంటుందావిడ. కృష్ణనామామృతం తాగి సమృధ్ధిగా చిక్కటి కమ్మటి పాలనిస్తాయి గోపన్న ఇంటి ఎనుములు.

అలాంటి అన్నకి వెన్నుతట్టి పుట్టిన చెల్లెలు అమృత. పాలు పితుకుతూ కడవపొర్లి ధారలు నేలపై పారినా ఒంటిపై తెలివి రాదాపిల్లకి. చల్ల చిలుకుతూ చిలుకుతూ వెన్న ఏర్పడి కరిగిపోయినా పట్టదా అమ్మడికి! పువ్వులు కోస్తున్నాననుకుని ఆకులు దూసి మాలలు కడుతుంది. కాటుకతో బొట్టు దిద్దుకుంటుంది చంద్రహారం నడుముకు చుడుతుంది. అనుక్షణం కృష్ణస్మరణలో ఇహం మరచి ఎప్పుడూ బృందావనిలోనే ఉంటుందామె మనసు!

"ఇంకా అమృత నిద్ర లేవలేదు. అసలే పరధ్యానం పిల్ల. అసలు గదిలో ఉందో లేదో!" అని కిటికీ సందుల్లోంచి చూసారు చెలులు. ఆ వేళ చలి మిక్కుటంగా ఉందేమో చిగురుటాకుల్లా వణికిపోతున్నారందరూ! లోపల హాయిగా నిద్రపోతోంది అమృత.

"ఓ పిల్లా! అమృతా.. నిద్ర లే లే! పొద్దు పొడిచే వేళయిపోతోంది. మీ ఇంటి పశువులు ఎప్పుడనగా నిద్రలేచాయో! వాటి అంబారావాలకు మీ తోటలో గూడుకట్టుకున్న పక్షులన్నీ నిద్రలేచి ఎప్పుడో ఎగిరిపోయాయి. నీకు ఇంకా తెలివి రాలేదా?" పిలిచింది కమలిని.
"ఓ అమ్మాయీ! నువ్వు తొందరగా నిద్ర లేచి రాకపోతే మా అందరం నీ ఇంటి ముందు గడ్డకట్టుకుపోయేలా ఉన్నాం. ఈ రోజు మంచు వర్షంలా కురుస్తోంది. అబ్బో! చలి భరించలేకపోతున్నాం. మా మీద దయుంచి లే తల్లీ! ఈ మంచు వానలో తడిసే కంటే యమునలో మునగడం మహా సులువు!" గజగజా వణుకుతూ చెప్పింది ఉత్పల.

"ఈ నేలంతా ఎంత చిత్తడిగా ఉందో చూసారా!" కిందకి చూస్తూ అంది కమలిని.
"అవును! నిద్ర లేచిన ఎనుములు దూడలను తలుచుకుని పాలను వాటంతట అవే కార్చేస్తున్నాయి. ఆ పాల మడుగులివి!"
"అవునా! ఏం చోద్యమిది! పాలు పిదికి కడవల్లో నింపుకోవాలి కానీ, నేలపాలు చేస్తారా!? అపచారం.. అపచారం!" లెంపలు వేసుకుని ఆ పాల మడుగు దాటి గుమ్మానికి దగ్గరగా నిలబడింది కమలిని.
"మన రేపల్లె మొత్తానికి గోపన్న ఒక్కడేనేమో.. ఇలా పనులు మానుకు కన్నయ్య వెనుక తిరిగే వాడు. పోషణ లేకపోయినా పాలిస్తాయి ఈ ఇంటి పశువులు.. నీళ్ళుపొయ్యకపోయినా ఆ చామంతులు చూడు! పచ్చని తివాచీలా ఎలా పూచాయో! ఈ పిల్ల తలలో ఎప్పుడు చూసినా.. చేమంతి ఆకుల దండే! అదేమని అడిగితే అప్పుడే తెలివొచ్చినట్టు చూసి నవ్వేస్తుంది. అన్నా చెల్లెలూ ఇద్దరూ ఇద్దరే!" చెప్పింది ఉత్పల.
"ఎంత అదృష్టమది! ఇహం మరచి, తన సుఖం విడిచి కన్నయ్య వెంట తిరిగే అదృష్టం ఎందరికుంటుంది!" అంది సురభి.
"నువ్వు మరీ చెప్తావులెద్దూ! నిన్నేగా తేజస్వినిని చూసి, పనిమంతురాలూ. ఆమెకోసమే కన్నయ్య వస్తాడు అని అనుకున్నాం.. ఈ రోజు రెండో నాలుకతో మాట్టాడుతున్నావేవమ్మా?"
"తేజస్విని పని వదిలి రానిదీ కన్నయ్య కోసమే.. ఈ గోపన్న పనిమాలా వెంట తిరిగేదీ కృష్ణ సానిధ్య సుఖం కోసమే!"చెప్పింది సురభి.
"హ్మ్.. ఆమె భరతుడైతే ఈతడు లక్ష్మణుడంటావ్!"
"నిస్సందేహంగా..! లక్ష్మణో లక్ష్మిసంపన్నః  అన్నారు. ఆనాడు ఆ లక్ష్మణుడి దగ్గరా, ఈనాడు ఈ గోపన్న దగ్గరా ఉన్నది కైంకర్యమనే లక్ష్మి. అందుకోసం కర్మని తోసిరాజన్నా సంపద వారి వెంటే ఉంది చూడు! సర్వైశ్వర్యాలూ, అమరభోగాలూ, ఏడేడులోకాల సార్వభౌమాధికారమూ ఇచ్చినా రామన్న పక్కన ఉండే అనుభవిస్తానన్నాడు లక్ష్మణుడు. ఇంత సంపద ఉండి గోపన్నకి ఏమైనా పట్టిందా.. తెలవారితే మళ్ళీ కన్నయ్య చెంతకు లేగదూడలా పరుగులు తీస్తాడు."

"ఈ అమృత అన్నకు తగిన చెల్లెలే! యమునకు నీళ్ళకు వెళ్ళి కడవ నింపుకుని ఏరోజైనా తిరిగి వచ్చిందా! ఎప్పుడూ ఖాళీ కడవ నట్టింట్లో దించడమే! నాలిక కరుచుకుని మళ్ళీ యమునకి బయలుదేరడమే!" నవ్వింది ఉత్పల.
"అవునవును! నిద్రలేపండి దొరసానిని. చలికి తట్టుకోలేకపోతున్నాం. ఈ ముంగిట్లో నిలబడే చోటు కూడా లేదు" గుమ్మం పట్టుకు ఒంటికాలిపై నిలబడి వణుకుతోంది కమలిని.

ఏమి వింతలొ గాని చెలియరో! అయ్యయో!
నీ మదిని కమ్మినది ఏమాయ నిదురో

జామాయె నీ ఇంటి మోసాలలో వేచి
ఈ మంచులో గడపనానుకుని నిలిచి

వైరియౌ లంకాధిపతిని తునుమాడిన
శౌరిపై,ఆ మనోహారిపై మా పాట
ఊరివారెల్లరును చెవులార విన్నారు!
ఔరౌర! ఇకనైన లేవమ్మ! మా అమ్మ!

తన లేగలను తలచికొని అరచి చేపుగొను
చనుమొనల, ఎనుము ఎడతెగక కురిసే పాల!
మునివాకిటను బందగానైన వీటిలో
ఎనలేని సంపదలు గలవాని చెల్లెలా!

గొంతెత్తి పాడింది ఆనందిని. వింటున్న కాసేపూ చలిని మరచిపోయిన ఆ గొల్లపిల్లలందరూ మళ్ళీ వణకడం ప్రారంభించారు. లోపల నుండి అలికిడైనా లేదు.

"మనం ఇంత చలిలోనూ వ్రతం పూనినది కృష్ణుడి కోసమైతే, నువ్వేంటమ్మడూ.. రాముడి ఊసు తప్ప మరోటి మాట్లాడవే!" ఆనందినిని వేళాకోళం చేసింది ఉత్పల.
"హ్మ్.. రామకథ తియ్యగా ఉంటుంది. అదీ కాక తనవారికి నొప్పెడితే తను బాధపడే రాముడినే కదా.. ఈ చలిబాధలో తలుచుకోవలసింది!"
"హ్మ్.."
ఇంకా కథ చెప్తుందేమో అని ఎదురుచూస్తున్న చెలుల ఉద్దేశ్యం గమనించి గలగలా నవ్వింది ఆనందిని.
"పిట్టకథే! పెద్ద కథేం కాదు. వానరసేనను వెంటబెట్టుకుని సంద్రానికి ఆనకట్ట వేసి, సీతను చెరపట్టిన రావణుడితో యుధ్ధానికి తలపడ్డాడట రామచంద్రుడు."
"ఊ.."
"రావణుడు వేసిన బాణమొకటి వచ్చి సుగ్రీవుడికి గుచ్చుకుందట!"
"ఆ..!"
"ఆ దెబ్బ చూసి తనకి దెబ్బ తగిలినట్టు విలవిల్లాడాడట రాముడు."
"పాపం!"
"అంత సుతిమెత్తని మనసు రామచంద్రుడిది. అంతకు తగ్గ మనోహరమైన రూపం ఆయనది. ఆ రూపాన్ని చూస్తేనే దెబ్బలూ, నొప్పులూ, బాధలూ మాయమైపోతాయి. అలాంటి మనోహరుడిని, రాముడిని తలుచుకోవద్దూ ఈ చలిరక్కసి కొరికేస్తూంటే!"

"రామచంద్రా! నిజమేనమ్మాయిలూ.. పాపం! ఎంత చలిలో ఎదురుచుస్తున్నారో! పదండి పదండి!" తలుపుతెరుచుకుని బయటకు వచ్చి పెరటివైపు దారితీసింది అమృత.
"అమ్మాయీ! నల్లటి ఎనుము కదుపులు యమునలా ఉన్నాయి సరే! స్నానానికి సరిపడా పాలనూ కురిపిస్తాయి.. కానీ మనం మునగాల్సింది అసలు యమునలో! అటు వెళ్ళాలి పద!" అని నవ్వుతూ యమున వైపు కదిలారందరూ.



*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


Sunday, December 25, 2011

అందాల భరిణా! మేలుకో! - కాత్యాయనీ వ్రతం - 11

యమునా, నింగీ ఒకదాని నల్లదనంతో ఒకటి పోటీ పడుతున్నాయి. చుక్కలు జిగేలుమన్నపుడల్లా యమున పందెం గెలుస్తోంది. ఆ చుక్కల వెలుగు నీళ్ళలో తళుక్కుమన్నప్పుడల్లా ఆకాశం నెగ్గుతోంది. తెలవారితే ఆకాశం ఎలాగూ ఓడి తెల్లబోతుందని తెలిసిన యమునమ్మ గోపకాంతల్లాగే తొలిఝాము కోసం ఎదురుచూస్తోంది. ఓటమినెరుగని తేజస్విని మాత్రం ఒళ్ళెరుగక నిద్రపోతోంది.

రేపల్లెలో నిత్యం జరిగే పందెం "ఎవరికెక్కువ పశువులున్నాయో..! ఎవరి పశువులు ఎక్కువ పాలనిస్తాయో..!" అని. తేజస్విని ఇంట్లో పశువులను మించినవి ఇంకెవరి ఇంట్లోనూ లేవు. ఆ పశువులిచ్చిన పాడి మరొకరి పశువు ఇవ్వలేదు. కామధేనువు కన్న పెయ్యల్లా ఉంటాయవి!! అంతే కాదు.. అన్ని ఆవులూ మంచి యవ్వనంలో ఉంటాయి. వట్టిపోవడమంటే వాటికి తెలీదు. పాలివ్వమని వాటిని అడగడం తేజస్వినికి తెలీదు. అడగకుండానే ఎడతెగని క్షీరధారలు కురిపిస్తూ ఉంటాయవి. నిత్యం అవి కురిపించే పాలధారలను, కడవలతో నింపడం... రాయిలా తోడుకున్న పెరుగును తరిగోలలతో చిలికి వెన్నతీయడం, తన పశువుల మందలో నిత్యం ఏదో ఒక ఆవు ఈనడం.. ఇలా పశువుల సంరక్షణతో క్షణమైనా ఖాళీ లేకుండా తేజస్విని పగలంతా పనిచేస్తూనే ఉంటుంది.

తెలవారకముందే మొదలయ్యే ఆమె పని  పొద్దు గూకే దాకా సాగుతూనే ఉంటుంది. ఆలమందలను కాచి కాపాడుకునే క్రమంలో ఆమెకు విహారాలకు, రాసలీలలకు క్షణమైనా తీరిక ఉండదు. పువ్వుల మాలలు అల్లే సమయం ఉండదు. పూబంతులాడే అవకాశం ఉండదు. బృందావనిలో మురళి మ్రోగే వేళ ఆమె తన పెరట్లో ఆవులకు నీళ్ళు పెడుతూనో, పాలు పితుకుతూనో ఉంటుంది. "ఎప్పుడూ ఉండే పనులే కదా.. వదిలి రా! కన్నయ్యని చూసేందుకు వెళ్దాం." అని నేస్తాలెవరైనా పిలిచినా సున్నితంగా నవ్వేసి తిరస్కరిస్తుందామె.

"కన్నయ్య ని ఈ రోజు దాగుడు మూతల్లో ఓడించాను తెలుసా! కృష్ణుడు నాకోసం దోర జామకాయలు కోసిపెట్టాడు! ఈ రోజు మేమందరం కన్నయ్యతో కలిసి యమునలో జలకాలాడాం..!" ఇలా ఎవరో ఒక చెలి మోసుకొచ్చే కబుర్లను  తన పని ఒకవైపు చేసుకుంటూనే నవ్వుతూ వింటుందామె. బదులివ్వదు. అసూయపడదు. తన పనిని తను విసుక్కోదు. ఒక్క క్షణం ఏమరుపాటుగా పాలు పొంగి పొరలనివ్వదు, పెరుగు పులవనివ్వదు. ఒళ్ళలసేలా కష్టపడి ఆమె శరీరం ధృఢంగా ఉంటుంది. నడుము పిడికెడు! చేతులు చూసేందుకు నాజూకుగా ఉన్నా, కడవల కొద్దీ గడ్డపెరుగు చిలికీ చిలికీ ఆమె నరాలు ఎంతో బలాన్ని కలిగి ఉంటాయి. తన పశువులపై ఈగవాలనివ్వదు. అవసరమైతే మందలను పచ్చిక బయళ్ళలోకీ, కొండమొదట్లోకీ నిర్భీతిగా మేతకు తోలుకుపోగలదు. ఇతర గోపకాంతల్లా సుకుమారి కాదు. నీడ బూచులకు, తోడేళ్ళకు, రాక్షసులకు భయపడదు. ఆమె ఇంట్లో వారంతా వీరులే. అమాయక గొల్లలు కాదు. శత్రువులకు వెరచేవారు కాదు. గోపాలకులలో అంత శౌర్యం అరుదు!

"పొద్దస్తమానం ఆ పశువుల మధ్య తిరుగుతుందే కానీ, ఓ ఆటా ఓ పాటా..? ఆమెకు గర్వం. తనది గొప్ప వంశమని! గోపాలకులందరిలోనూ శ్రేష్ఠమైన పాడి ఆమె ఇంట్లోనే ఉందని. గొప్ప ధనవంతురాలని. పోనీ మనతో కలవకపోతే మానెయ్య్.. కనీసం కన్నయ్యకోసమైనా ఆ పనులు పక్కన పెట్టి రాదే! ఏం నిర్లక్ష్యం!" అని చాటున అనుకుంటారందరూ! తన వద్దకే వచ్చి అడిగిన వారికి చాలా మందికి చిరునవ్వే ఆమె సమాధానం. అయితే ఆమెను ద్వేషించడం ఎవరితరం కాదు. అవును మరి! అడిగిన సాయం చేసేదీ, చూడచక్కనిదీ, చిరునవ్వు పెదవంచున మెరిసే చిన్నదీ ఆ పడుచు. ఆమెకి గిట్టనివారు లేరు! పనికి వెరచే పిల్లలకు ఆమెను ఉదాహరణగా చెప్పని పెద్దవారుండరు.. ఆమెను చూసి రేపల్లెలో ఓ సామెత పుట్టింది. "కూర్చున్నమ్మ కుంగిపోయింది.. చేసినమ్మ చేవతేలిందీ.." అని!

ఆమె చక్కదనాల చుక్క. ఎవరో మహాశిల్పి బహు జాగరూకతతో నిద్రాహారాలు మాని చెక్కిన శిల్పంలా ఉంటుంది. నేలజారిన గంధర్వకన్యలా ఉంటుంది. మిగిలిన గోపకాంతలెవరూ ఆమెను చూసి అసూయపడరు. మగవాడిగా పుట్టని తమ దురదృష్టానికి చింతిస్తారు! ఆమె అపురూప లావణ్యాన్ని చూసేందుకు పనికట్టుకు వాళ్ళింటికి వెళ్తారు. ఆమె పాలు పితకడానికి కూర్చుంటే, ఆమె చురుకైన కదలికను చూసి ముచ్చట పడతారు. పాలకడవ నడుముకెత్తుకుని నడుస్తున్న ఆమె ఘనజఘనాన్ని చూసి ఆశ్చర్యపోతారు. పిరుదులు దాటేదాకా ఉండే ఆమె నల్లని ఒత్తైన జుత్తుని ఆరాధిస్తారు. "అయ్యో! ఇంత అందాన్ని కృష్ణుడికి దూరంగా ఈమె ఇంట్లోనే బంధించి అడవి కాచిన వెన్నెల చేసేస్తోందే!!" అని నొచ్చుకుంటారు. ఆమెను ఎలాగో ఒకలా బృందావనికి తీసుకుపోవాలని ప్రయత్నిస్తారు.

ఎవరికీ తెలియని విషయమొకటుంది. పాలు పితుకుతూ, పనిచేస్తూ, చల్ల చిలుకుతూ ఆమె తలచే తలపులోంచి రూపం దాల్చి.. వంశీకృష్ణుడు నిత్యం ఆమె ఎదుటే ఉంటాడు!! ఆమె పాలు పితుకుతూ ఉంటే చెంతనే కూర్చుని కబుర్లు చెప్తాడు. చల్ల చిలికేవేళ అల్లరిగా ఆమె నడుము గిల్లి నవ్వుతాడు. పనులలో అలసి చెదిరిన ముంగురులు సవరిస్తాడు. విడిన కొప్పు సరిచేసి, పువ్వులు స్వయంగా మాలలల్లి ఆ నీలాల కురులను ఆమె మెడపై పడకుండా కట్టడి చేస్తాడు. చమటతో తడిసిన ఆమెకు వీవనలు వీస్తాడు. అలసిన ఆమె తమలపాకు పాదాలు తన ఒళ్ళో పెట్టుకుని మెత్తమెత్తగా ఒత్తుతాడు. "అయ్యో! తప్పు తప్పు!" అని వారిస్తున్న ఆమెను చూసి నవ్వుతూ "మీ ఇంటి పాడీ, వెన్నా తింటున్న వాడిని! ఈ మాత్రం సేవ చేసుకోనీ! ఆలమందల్ని నీ పెరట్లోనూ, ఈ అల్లరి కృష్ణుడిని నీ పాదాల దగ్గరా కట్టేసుకున్నావు! జాణవి సుమా!" అని మేలమాడుతాడు. బుగ్గల్లో గులాబులు పూయిస్తుందామె. వెన్నెలను కళ్ళతోనే కురిపిస్తుంది. హరివిల్లుని తన ఒంపుల్లోనే చూపిస్తుంది. ఇంక కన్నయ్యకి ఆమెతో వన విహారాలెందుకు! ఆమెకు యమునలో అతనితో సరిగంగ తానాలో లెక్కా?! ఈ భాగ్యం ముందు..

"అలసిపోయి నిద్రలేవలేదని ఒక్క తేజస్విని గురించి మాత్రమే అనుకోగలం! ఈ ఆలమందలను ఒక్కచేత్తో సమర్ధించుకు వస్తోందంటే అలిసిపోదూ మరి! అప్పటికీ ఈ వ్రతం మొదలెట్టిన దగ్గర నుంచీ క్రమం తప్పకుండా ఇల్లు విడిచి పూజకి వస్తోందాయె! ఏనాడైనా ఆమె మనతో విహారాలకు రావడం ఎరుగుదుమా!" తేజస్విని ఇంటి ముందు ఆగుతూ సురభితో అంది ఉత్పల.
"నిజమే! చెలులందరూ వచ్చేదాకా బయటే నిలబడదాం. ఇంకాసేఫు నిద్రపోనీ పాపం!" జాలి చూపించింది సురభి.
"ఏమాటకామాటే! ఇంత అందం ఉండి, ఇన్ని పశువులు ఉండీ అసలు గర్వం అన్నది ఎరగని పిల్లెవరంటే తేజస్వినే!"
"నిజం ఉత్పలా! ఏం అందమసలు! అందమొక్కటేనా!  ఏ పనైనా తను చేసినట్టు మన పల్లెలో మరో ఆడపిల్ల చెయ్యగలదా? గొప్పింట్లో పుట్టింది. గారాలపట్టి. అయినా ఎంత పనిమంతురాలో!" మెచ్చుకుంది కమలిని.

అంతలో వచ్చి చేరిన ఆనందిని అంది "పదండి.. వెళ్ళి నిద్ర లేపుదాం అమ్మడిని! ఈ రోజెందుకంత ఆలస్యమయిందో! అన్ని పనులుండీ రోజూ ముందే వచ్చేస్తోంది కదా! జాగ్రత్త! మన అలికిడికి ఈ పశువులు నిద్ర లేస్తే కష్టం! అందునా.. ఒకటా రెండా.. వేల పశువులు.. పాల కుండలు ఒకదానికొకటి చేర్చి ఉంచినట్టున్నాయి మసక వెలుతురులో!"
"ఒక్క ముసలి ఆవు ఉండదు కదా! అన్నీ ఒకే వయసులో లేతగా.. ఇంకా దూడల్లాగే ఉంటాయి! ఆశ్చర్యం!!" చెప్పింది కమలిని.
"అదే వింత! దేవతలందరూ వీళ్ళ పెరట్లో ఆవులై పుట్టారేమో! వారికే నిత్య యవ్వనం సాధ్యం!" నవ్వుతూ చెప్పింది ఆనందిని.
"నిజమా!"
"అవును! అమృతం తాగిన దేవతలు ఎప్పుడూ పాతికేళ్ళ పడుచు వయసులో ఉంటారట! ఎన్ని సంవత్సరాలైనా సరే! అమృతం పాలరూపేణా ఇచ్చే ఈ పశువులూ అంతే! తేజస్విని అందానికి మోహించి వచ్చి కన్నయ్య ఈ పెరట్లో నిలబడి వేణువూదుతాడేమో నిత్యం! లేకపోతే ఈ మందలకు అంత గొప్ప పాడి,ఆ అమరత్వం ఎక్కడిది!"
"ఏమో! నిజమేనేమో! ఆ.. ఎంతందముండి ఏం ప్రయోజనం! ఒక్క నాడు ఆ కురులలో సుమ మాలికలు ధరించదు కదా! ఒక్కనాడు తీరికగా గోరింటాకూ, పారాణీ అలదదు కదా! ఎప్పుడూ పనీ పనీ!" వాపోయింది ఉత్పల.
"ఆ పనిలోనే ఆమెకు కన్నయ్య ఉన్నాడు. విహితమైన కర్మలను చేస్తూనే పరమాత్మని మరువని వారే మహా యోగులు! అలాంటి యోగిని తేజస్విని!" చెప్పింది ఆనందిని.
"నువ్వెన్నైనా చెప్పు.. కృష్ణుడికి దూరంగా ఈ ఇంట్లో ఎన్ని సార్లు కన్నయ్యని తలుచుకుని ఏం లాభం!" వాదించింది కమలిని.
"రామన్న వెంట అడవులకు వెళ్ళి అనుక్షణం నీడలా అన్నని కాపాడుకున్న లక్ష్మణుడి అదృష్టం వేరు. అన్నలాగే తనూ తండ్రి మాటని కాదనకుండా రామపాదుకలే తోడుగా రాజ్యం చేస్తూ క్షణమొక యుగంగా రాముని విరహంలో గడిపిన భరతుడిదొక తీరు. ఎవరు గొప్పని అడిగితే ఏం చెప్పగలం!"
ఆనందిని మాటలకు మారుమాట్లాడలేదు చెలులందరూ! నిజమే కదూ! ఆలమందలను కాచడమే వృత్తి. అది దాటి వెళ్ళకుండా, తన దగ్గరకే కన్నయ్యని రప్పించునే శక్తి ఎవరికుంటుంది! మనస్వినికి తప్ప! 'స్వధర్మం నిధనం శ్రేయః' అన్నారు కదూ!

విశాలమైన పెరడు దాటి, ఆ ఇంటి ముంగిట్లో నిలబడి లోపల నిద్రపోతున్న తేజస్వినిని 'శహన రాగం'లో పిలుస్తున్నారందరూ!

రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!
రావే! పాముపడగ బోలే కటికలదాన!

లేవే! నీరదశ్యామ మోహనుని నామముల
నీ వాకిటనే నిలచి నీవారు పాడేరు

మేలిపొదుగుల ఆలు వేలు కలవారు, ఆ
భీల రణమున అరుల బీరమడచేవారు, గో
పాలకులమున వెలసే ఓ వనమయూరీ
లేవే! కలుముల నెలవౌ ఓ నారి! వయ్యారి!

రావే! గోపవంశాన రాజిల్లే లతకూన!

"ఓ తేజస్వినీ! 'పుంసాం మోహన రూపాయ..' అని పురుషులు సైతం మోహించేంత మోహన రూపుడట శ్రీరామచంద్రుడు! ఆ చాలు నీకెలా వచ్చిందో!! నీ సౌందర్యం ఆడపిల్లలం మాకే మోహాన్ని కలిగిస్తుంది! నీ వన్నెలు చూసి వలచని ప్రాణి లేదేమో! నువ్వు మాతో కూడి నోము నోచడమే మా అదృష్టం! కన్నయ్యనే నీ ఇంటికి రప్పించుకునే జాణవు. గొప్ప భక్తి గలదానివి. నువ్వు మాతో ఉంటే మా నోము పండుతుంది." పిలిచింది ఆనదిని.

"నీలిమబ్బు వన్నెలో వెలుగుతూ అంతులేని మోహాన్ని కలిగించే సుందరాకారుడు.. ఆ కృష్ణుడు! అతడిని తలుచుకుంటూ 'కృష్ణా.. కృష్ణా!' అని పిలుస్తున్నాం! మబ్బు తలపుకే పరవశించి ఆడే మయూరిలాంటిది నీ మనసు! గొప్ప వంశంలో, గొప్ప పాడి ఉన్న ఇంట్లో పుట్టానన్న ఆభిజాత్యం లేని దానివి. కృష్ణుని నీ అణువణువునా నింపుకున్నావు. రా.. నిన్ను చూస్తే చాలు! మాకు కృష్ణుడిని చూసినంత ఆనందం కలుగుతుంది. మేలుకో! లేచి రా వయ్యారీ!" పిలిచారు చెలులు.
"ఎంత అలసి సొలసి నిద్రపోతున్నావో! నిన్ను నిద్ర లేపాలంటే మాకు మనసు రావడం లేదు! కానీ పూజకి వేళవుతోంది. ఇంకా స్నానం చెయ్యాలి. పూజకు సిధ్ధం చేసుకోవాలి! వేళయిపోతోంది అమ్మాయీ! లే లే!" మరో సారి పిలిచింది కమలిని.
అలకిడైనా లేదు! తలుపుకు దగ్గరగా నిలబడి మృదుమధురంగా చెప్పనారంభించింది సురభి.
"ఓ చెలీ! ఓ తేజస్వినీ! నువ్వెంత గొప్పదానివో, ఎంత అందచందాల భరిణవో నీకు తెలీదు. పొద్దస్తమానం పనిపాటల్లో మునిగి నీ అందానికి మెరుగులు దిద్దుకోవడం లేదని మేమంతా అనుకుంటామా..! అసలు కాటుక, తిలకాలూ, రకరకాల పువ్వులు, అత్తర్లతో అలంకరించుకునే మాకంటే నువ్వు కొన్ని వందలరెట్లు అందగత్తెవి! సహజ సౌందర్య రాశివి! నీ ఘన నితంబ ప్రదేశం చూసి మోహించని వారుండరు తెలుసా! పాముపడగలా ఉంటుంది నీ కటిభాగం! యోగసాధన చేసి సాధించిన శరీర లావణ్యం నీది! నీ యోగం, నీ ఉపాసనా అన్నీ కృష్ణుడే కదా!"

"నిజం! ఎంత సేఫు పితికినా ఖాళీ అవని కడవల్లాంటి పొదుగులున్న ఆవులు నీ పెరట్లో వేలసంఖ్యలో ఉన్నాయి. వాటి ఆలనా పాలనలో నీకు క్షణమైనా తీరిక ఉండదు పాపం! పొద్దున్న ముడిచిన కొప్పు.. ఏ పాల కడవ వంటింట్లో దింపుతూనో దార్లో కనిపించిన ఏ చామంతో పుణికి కొప్పులో తురుముకుంటావు. మళ్ళీ ఆ ఊసైనా పట్టించుకొనే దినచర్యా నీది! అందుకే నీకోసం కన్నయ్యే వస్తాడట! నిజమేనా!? నెలవంకలాంటి నీ నుదుటిమీద చిందిన స్వేదం తన పీతాంబరపు అంచుతో తుడుస్తాడట! నీ ముంగురులు సర్ది, నువ్వు చల్ల చిలుకుతూ ఉండగా విడిపోయిన నీ పొడవైన జుత్తు సవరిస్తాడట. నీ పెరట్లో విరజాజి తీగొకటి ఉంది కదా! ఆ పువ్వులు కోసి తెచ్చి మాలలు కట్టి, స్వయంగా నీ కురులను ఆ మాలలతో బంధిస్తాడట కదా!"

తన రహస్యాలన్నీ చెలులకి ఎలా తెలిసిపోయాయో  అని ఆశ్చర్యపోతూ, సిగ్గుపడుతూ తలుపు తీసింది తేజస్విని. మెరుస్తున్న ఆ కళ్ళ ధవళిమను, సిగ్గుతో కందిన ఆ బుగ్గల అరుణిమను.. బంగారుతీగెలా నిలబడిన ఆమె సౌందర్యాన్ని చూస్తూ రెప్పవెయ్యడం మరచిపోయారు చెలులందరూ!

"నన్ను నిద్రలేపి మీరందరూ కళ్ళుతెరిచి కలలు కంటున్నారల్లే ఉంది. కృష్ణ కృష్ణా! పదండి పదండి స్నానానికి! కాత్యాయని పూజకు వేళ మించకూడదు!" దారితీసింది తేజస్విని.


*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..


( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Saturday, December 24, 2011

ఆ తులసి పరిమళమెక్కడిది? - కాత్యాయనీ వ్రతం -10

ఏ పదార్ధం ఎటు వడ్డించాలో తెలిసిన ఇల్లాలు, మక్కువతో తన మగనికి వడ్డించిన విస్తరిలా ఉంటుంది రేపల్లె! నీరిచ్చే నది, పాలిచ్చే గోవులు, వాటికి అవసరమైన పచ్చిక బయళ్ళు, నీడ నిచ్చే చెట్లు, పచ్చని పంటచేలు, విహారానికి అందమైన పూల తోటలు, రాయంచలు తిరిగే తటాకాలు, కష్టించి పనిచేసే గొల్లలు, ఆప్యాయత నిండిన వారి మనసులు.. ఆ మనసుల్లో కొలువున్న కృష్ణుడు..!! ఇంతకంటే గొప్ప ప్రదేశం ఏడేడు లోకాల్లోనూ ఉండదని ఆ పల్లెలో పుట్టిన పురుగూ పిట్టా మీద కూడా దేవతలు సైతం అసూయ పడుతూ ఉంటారట! అలాంటి పల్లెలో పుట్టి, కన్నయ్యని వలచి వరించి, అతడిని పొందేందుకు నియమ నిష్టలతో "కాత్యాయనీ వ్రతం" చేస్తున్న గోపభామినులందరూ చిన్న పెద్దా, గొప్పా కొద్దీ తేడా లేకుండా అసూయ పడేది 'ప్రియంవద' మీద!

ప్రియంవద కృష్ణుడి పక్కింట్లో పుట్టిన పిల్ల. "ఎంత అదృష్టవంతురాలో!! కన్నయ్యకీ, ఆ పిల్లకీ ఒక్క గోడే అడ్డు కదా! ఏ వేళలో అయినా అల్లరి కృష్ణుడిని చూడగలిగేంత దగ్గరగా ఉంది కదా!" అని మిగిలిన చెలియలందరూ అసూయపడుతూ ఉంటారు. అతని చేష్టలనూ, దుడుకు పనులనూ, అనన్య శౌర్యపరాక్రమాలనూ, మధురాతి మధురమైన అతని సౌందర్యాన్నీ ఒకరికొకరు చెప్పుకుని మురిసిపోతున్న సమయంలో.. ప్రియంవద మాటాడదు! అవుననదు.. మారు పలకదు! పాలరాతి బొమ్మలా చెక్కిట చెయ్యి చేర్చుకుని, పెదవంచున దోబూచులాడుతున్న చిరునవ్వుతో మౌనంగా.. ముగ్ధంగా.. వింటూ ఉంటుంది. "అన్నీ కలిసొచ్చిన పిల్ల! అందం, విధేయత, మంచి బుధ్ధికుశలత.. ఇవేవీ కలిపి కూడా సరిపోని గొప్ప అదృష్టం కన్నయ్య పక్కింట్లో పుట్టడం! ఇంక మనలా తలచుకు తలచుకు మురిసే పనేముంది? పక్కనే కోరిన వాడుంటే!" అని గుసగుసలాడేవారామెను చూసి అందరూ!

తమ ముఖ వర్ఛస్సుతో, నవ్వినప్పుడల్లా మేలిముత్యపు పలువరుస జిలుగులతో, చేతులూపుతూ కబుర్లు చెప్పుకుంటూ తమ గాజుల మెరుపులతో రేపల్లె వీధుల్లో చలికి బిగుసుకున్న చీకటి రేయిని వెలిగిస్తూ, తెలవారుతోందన్న సంకేతాన్ని ప్రతి పులుగుకీ అందిస్తూ.. ఆ గోపవనితలందరూ నడిచి వస్తున్నారు. రాజుగారి వీధి మొగలోకి వచ్చేసరికి గాజులు సవరించుకునీ, పైటలు సరిచేసుకునీ, ముంగురులు సరిగా ఉన్నాయో లేదో చూసుకునీ.. ఒకరినొకరు చూసుకుంటూ నెమ్మదైన నడకలతో వస్తున్నారు. "కన్నయ్య నిద్దరోతున్నాడా..? పొరపాటున మెలుకువొచ్చి మనని చూస్తే..?! చూస్తే బాగుండును..!" అనే స్త్రీ సహజమైన ఆశ, లజ్జ కలగలసి అప్పుడే విచ్చుకోవడానికి సిధ్ధమవుతున్న కమలాల తీరున మిసమిసలాడుతున్నారందరూ!

ఆ వీధి చివరలో ఉన్న ఉత్పల బయటకి వచ్చి చెలులని పలకరించింది.
"అందరూ వచ్చేసినట్టేనా? ప్రియంవద లేదు!! రోజూ ముందే ఉండేదిగా.. పదండి పదండి.. ఎందుకు నిద్ర లేవలేదో!" అనుకుంటూ అడుగులేసింది.
మిగిలిన వారంతా అనుసరించారు. ప్రియంవద ఇల్లు ఇంకా నిద్రపోతోంది.కిటికీల వద్దకి వెళ్ళి తట్టి చూసారు. తలుపు వద్ద నిలబడి పిలిచి చూసారు. లోపల హాయిగా నిద్రపోతోంది ప్రియంవద.

ఉన్నట్టుండి బయట నిలబడిన చెలులని ఓ చిరపరిచితమైన సౌరభం పలకరించింది. అది తులసి పరిమళం! నిత్యం కృష్ణుని గళసీమని అలంకరించి, హృదయంపై వాలే భాగ్యశాలి.. 'వనమాలా'సౌరభం!! ఒకరి ముఖమొకరు చూసుకున్నారు. కళ్ళతోనే మాట్లాడుకున్నారు. "తమ అనుమానం నిజమేనా!?" అని దూరంగా వెళ్ళి మళ్ళీ ఆ తలుపుల దాకా వచ్చి మరీ పరిశీలించారు కొందరు! అందరికీ కమ్మని తులసి మాల పరిమళం కచ్చితంగా తెలిసింది. అందరి ముఖ కమలాలూ కాస్త వాడిపోయాయి. కాటుక, పువ్వులూ విడిచి.. పాలూ, నెయ్యీ మరచి.. పొద్దు పొడవక ముందే గడ్డకట్టించే చన్నీటి స్నానాలు చేసి దీక్షతో కాత్యాయనికి పూజ చేస్తున్నది ఎందుకు? కృష్ణుని పొందాలనే కోరికతో! పాడీ పంటా బాగుండేలా వానలు కురవాలనే సదుద్దేశంతో! తామింత కష్టపడుతూ ఉంటే.. గోడవతల ఉన్న కన్నయ్య గోడ దూకి ఎప్పుడొచ్చాడో.. రేయంతా ఆమెతోనే ఉన్నాడో.. ఏమో!?

"కన్నయ్యకైనా అనిపించలేదా.. అందరమూ ఒకటేనని?" కలవరపడుతున్న కనులతో తోటి గోపికలతో అంది కమలిని.
"అందరమూ ఒకటే ఎలా అవుతాం? ఆమె ఉండేది పక్కింట్లో.. మనమేమో ఎక్కడో దూరంగా.." అక్కసుగా చెప్పింది అందరికంటే దూరంగా ఉండే మేదిని.
"కనీసం ప్రియంవదకైనా అనిపించలేదా? తెలవారితే మనమొస్తామని.. అడుగుతామని.. బాధపడతామని.." కన్నయ్యని నిందించలేని ఉత్పల వాపోయింది.
"అయ్యో! వెర్రి దానా..!! అతను మహా మాయగాడు. ఎదుటపడితే పశుపక్ష్యాదులే రెప్పవెయ్యలేవు. మనమెంత!! ప్రియంవద ఎంత? మురళి మ్రోగిస్తే ఆలమందలు పాలవాన, పొన్నచెట్లు పూలవానా కురిపించాల్సిందే! ఆ వయారి వలపు ఆరబోయక ఏంచేస్తుంది!!" చెప్పింది మల్లిక.
"ఎవరికేది ప్రాప్తమో.. ఏ క్షణం కన్నయ్య కౌగిట కరగాలని రాసి ఉందో! అదృష్టవంతురాలు! ఎన్ని నోములు నోచి పక్కింట్లో పుట్టిందో!" వేదాంతం వల్లెవేసింది విష్ణుప్రియ.

సురభి, ఆనందినీ ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకున్నారు. మిగిలిన చెలులకు అర్ధం కాలేదు. ఒకరిద్దరికి కోపం వచ్చింది కూడా..
"గోప బాలలూ.. మనమిక్కడికి వచ్చినది ప్రియంవదని మేలుకొలిపేందుకు! ఆ పని చేద్దాం ముందు." అని  ఇద్దరూ ఏకకంఠంతో చెప్పారు. మిగిలిన నేస్తాలకు వచ్చిన అనుమానానికీ, కోపానికీ నవ్వుకుంటూ ప్రియంవదని నిద్రలెమ్మని పిలిచారు.

"ప్రియంవదా.. ఆ జానకిలా కోమలమైన అద్భుత సౌందర్యం నీది! అంత సౌందర్యాన్ని మించిన మంచి మనసున్న దానివి. నీ పలుకులు ఎంత హాయిని కలిగించేవో.. మీ పెద్దవారికి ఎలా తెలిసిందో సుమా.. నువ్వు 'ప్రియంవద'వని! బహుశా పుట్టగానే "కృష్ణా!" అని ఉంటావు. ఆనందం కలిగించే ఆ పలుకు నీ నోట విని, నీకా పేరు పెట్టి ఉంటారు." తన కోయిల కంఠంతో సుప్రభాతం పలికింది ఆనందిని.
"మధురా.. మధురాలాపా..! అని రామచంద్రుడు వర్ణించిన సీతాభామినిలాంటి దానివి! 'కృష్ణా!' అన్న పేరు ఎవరైనా తలిస్తే నువ్వు మూగపోతావు. ఆమె కూడా అంతేనట! తన రాముడినీ, మామగారు దశరథ మహారాజు గొప్పతనాన్నీ గురించి హనుమ చెప్తూ ఉంటే పారవశ్యంలో ఆమెకు నోటమాట రాలేదట! మా నోట కృష్ణుని కథలు వినిపిస్తాయన్న తలపుకే నీ పెదవులు సిగ్గుతో, పరవశంతో పలకనంటున్నాయా!?" అంది ఆనందిని.

ఈ వరసేం నచ్చని చెలులు పక్కన నిలబడి చూస్తున్నారు.
"కుంభకర్ణుడిలా నిద్దరోతున్నావా!" అక్కసుగా అంది కమలిని.
"కృష్ణుడు నీ వద్దే ఉంటే.. ఆ 'పర'వాద్యమేదో అడిగి మాకివ్వమ్మా! మేము వెళ్ళి వ్రతం పూర్తి చేసుకుంటాం. నీకేమవసరం.. మాలా కష్టపడాల్సిన దానివి కాదు. స్వర్గసుఖాలలో తేలుతున్నావు కదా!" ఎర్రగా కందిన ముఖంతో రుసరుసలాడుతూ అంది ఉత్పల.
"తలుపు తీయకపోతే మానేసావు.. ఒక్క మాటైనా పలుకు లోపల నుండీ..!!" మల్లిక సన్నాయి నొక్కులు నొక్కింది.

వాళ్ళ పలుకులే పాట కట్టి మధురంగా 'అసావేరి' ఆలపించసాగింది ఆనందిని.

పోనీ తలుపుతీకుంటే
మానేవుగానీ!
ఔనే! ఒక్కమాటైనా
మాతో అనవేమీ?

చానా! నోమూని స్వ
ర్గానూన భోగముల
ఆనందించే దాన!
మా తల్లి కాన!

నారాయణుడు కోమలామోద తులసీ
శ్రీరుచిరమౌళి మనపాలి వరదాయి!
గారాన పరవాద్యమ్ము కరుణించు!
నోరార చేయు కైవారముల ఆలించు!

పాములూ, పశువులూ, పాపలూ సైతం విని పరవశించే పాట కూడా కరిగించలేని రాతి హృదయాలు కావా గొల్లపిల్లలవి! బహు సున్నితం! కోపం కరిగిపోయింది!!

తలుపు తీసుకుని ప్రసూనంలా నవ్వు చిందిస్తూ బయటకు వచ్చింది ప్రియంవద. తనను దాటి ఇంట్లోకి చూస్తున్న వారి చూపులు అర్ధం కానట్టు చూసింది.
"ఏవమ్మా! ప్రియంవదా.. మీ ఇంట్లోంచి కన్నయ్య మెడలో ఉండే తులసి మాల సువాసన ఘుంఘుమ్మని మమ్మల్ని వివశల్ని చేస్తోంది. నువ్వూ ఆ మాల వాలినట్టే ఆతని గుండెలపై వాలి ఇహాన్ని మరిచావేమో! అని చెలులందరూ అనుమాన పడుతున్నారు." కోపం నటిస్తూ చెప్పింది ఆనందిని.
"నారాయణుడు లేని చోటేది!? మీ ఇళ్ళలో మాత్రం లేడూ! రాత్రీ పగలూ కూడా ఉంటాడే!!" స్వచ్ఛంగా నవ్వుతున్న ప్రియంవద అబధ్ధం చెప్తోందని ఏ ఒక్క గోపికా అనుకోలేకపోయింది.
"నువ్వేమో సీతాకాంతలా బహు చక్కనిదానివి! ఆమెలాగే ఎల్లప్పుడూ ప్రియమైన మధురమైన పలుకులు పలికే దానివి.. మరి కుంభకర్ణునిలా అంత నిద్రెలా వచ్చింది, అమ్మడూ!" అమాయకత్వం చిందిస్తూ ప్రశ్నించింది సురభి.
"కలలో అంతులేని జలరాశి.. అందులో ఓ మర్రాకు. చూద్దును కదా! ఆ ఆకు మీద ఓ బుజ్జాయి!! కాలిబొటన వేలు చేతితో పైకెత్తి, నోట్లో పెట్టుకుని చప్పరిస్తున్న పాపడు!ఎంతచూసినా తనివి తీరదే! కళ్ళు తెరచుకోవే! అతిప్రయత్నం మీద లేచి వచ్చాను." స్పటికంలా తళతళా మెరుస్తున్నాయి ఆమె కళ్ళు ఆనందంతో.. అమాయకత్వంతో!
"ఆహా..!అదృష్టమంటే నీదే కదా, చెలీ! కన్నయ్య పక్కింట్లో ఉన్నావని నీమీద అసూయచెందుతున్నారు చెలులంతా! నీ పున్నెమంతా ఇంతానా..? నీకు స్వప్నంలో కనిపించినది వటపత్రశాయి!! ప్రళయకాలంలో సమస్త ప్రాణికోటినీ బొజ్జలో దాచుకుని కాపాడుతున్న పాపడిని చూసావు!

కరార విందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం
వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి!

చేతులు జోడించింది ఆనందిని. ఒళ్ళు గగుర్పొడిచింది మిగిలిన వారందరికీ!
"పదండి..స్నానానికి వేళ మించిపోవట్లేదూ..!"నడిచింది ప్రియంవద.
"ఆ తులసి పరిమళం.."అర్ధోక్తితో ఆపేసింది ఉత్పల.
"వెర్రిదానా.. కృష్ణమాయ!" తేటగా నవ్వింది కమలిని.



*ఇంకొంత కథ రేపు ఉదయం..

( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Friday, December 23, 2011

మణికవాటము తీయవే! - కాత్యాయనీ వ్రతం -9

నిద్రపోతున్న రేపల్లెలో గిరికీలు కొట్టి వస్తున్న ఓ పిల్ల తెమ్మెరని యమునమ్మ పలకరించింది. "ఏవిటోయ్.. అంతలా పరిమళాలు వెదజల్లుతున్నావ్!! ఎచట నుంచి నీ రాక!?"
అల్లరి తెమ్మెర  నవ్వుతూ "ఈ పల్లెలో చీకటి పడగానే వెలిగే సంజె దీపంలాంటి ఇల్లొకటుంది. మా గొప్పవారిల్లు! ఆ ఇంటికెళ్ళి వస్తున్నాను" అని మహ గర్వంగా చెప్పింది.
"వెళ్ళి చూడలేని దాన్నని తెలుసు కదా! నువ్వేమో కన్నయ్యలాగే ఎక్కడికైనా వెళ్ళి రాగలిగే సమర్ధత ఉన్న సర్వవ్యాపివి. నన్నూరించకుండా ఏవిటా పరిమళం.. ఎంత గొప్ప ఇల్లూ.. చెప్పవచ్చు కదా! వింటాను." అని అడిగింది యమున.

తెమ్మెర చెప్పడం మొదలుపెట్టింది. "ఆ ఇంటి గోడలు బంగారు తాపడం చేసి ఉంటాయి. కిటికీలకు మణులు పొదగబడి ఉంటాయి. ఆ ఇల్లు కుబేరుని సౌధంలా అణువణువునా ఐశ్వర్యంతో మెరిసిపడుతూ ఉంటుంది. ఆ ఇంటి వాకిట్లో వెండి గిన్నెలూ, బంగారపు పళ్ళెరాలతో పక్షులకు నీళ్ళు, నూకలు పెడతారు. ఆ ఇంటికి మరకతమణులూ, నీలాలూ పొదిగిన కవాటమొకటి.. దక్షిణపు గాలి ధారాళంగా వచ్చేలా ఉంది. నేను ఎప్పుడూ ఆ దారంటే ఆ ఇంటికి వెళ్ళొస్తాను."
"ఊ.. ఎవరుంటారా గదిలో!?" ఆసక్తిగా అడిగిని యమున.
"నేను దేశదేశాలు తిరిగానా..! ఎంతో మంది ధనికుల ఖజానాల్లో తారట్లాడానా..! కొండల లోయల్లోంచి గరుడపక్షుల ఆహారానికి అంటుకుని కొండచరియల్లో విడిచిపెట్టబడి, ఎండకి మెరిసే పెద్ద పెద్ద వజ్రాలను చూసానా? ఎక్కడా చూడని ఓ అద్భుతమైన రత్నం ఆ గదిలో ఉంది."
"అవునా! ఏవిటా రత్నం? వైఢూర్యమా? మరకతమా? నీలమా?"
"అలా ఒక రంగులో మెరిసే రాయి కాదు. నిత్యం కృష్ణనామ సంకీర్తన చేస్తూ అద్భుత తేజస్సుతో మిలమిలలాడే రత్నం!"
"అబ్బా.. చెప్దూ! మాట్లాడే మాణిక్యమా!!"
"అవును! కృష్ణ లీలలే ఉగ్గుపాలుగా పోసి, కృష్ణుడి తలపే పాలబువ్వలుగా, పంచభక్ష్యాలుగా కొసరికొసరి తినిపిస్తూ ఆ ఇంటి యజమానురాలు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న గారాలపట్టి... మంజుల!"
"ఓ... మంజులా!! నాకెందుకు తెలియదు! కాత్యాయనీ వ్రతానికి రోజూ వస్తుంది కదా!"
"అవును. ఆ మంజులే! నీ ఒడ్డున వాళ్ళాడిన ఆటలూ, పాటలూ, నీ చల్లని తరగల్లో ఆడిన తానాలే చూసావు నువ్వు. ఆ పిల్ల ఎంత భాగ్యవంతుల బిడ్డో నీకు తెలియదు."
"ఎంత భాగ్యశాలికైనా అసలుసిసలు ఐశ్వర్యం కన్నయ్యే కదా!"
"అవుననుకో! అలా అయినా గొప్ప ధనవంతుల ఇల్లది! నీకు తెలియని సంగతొకటి చెప్తాను విను. మంజుల ప్రతి రేయీ తన గది ఎంత అందంగా అలంకరిస్తుందో తెలుసా!"
"అవునా! ఎందుకూ?"
"ఎందుకంటావేమిటీ! "ఏ క్షణంలో కన్నయ్య ఎదురుపడతాడో!" అని ఆ గొల్లపిల్లలందరూ అనుక్షణం ముస్తాబు చేసుకుని కడిగిన ముత్యాల్లా ఉండరూ! అలాగే  "ఏ వేళలో కన్నయ్య వస్తాడో!" అని తన గదిని మంజుల అలాగే అలంకరించుకుని ఉంచుకుంటుంది."
"వాసక సజ్జిక!"
"అవును. గోమేధికాలు, గరుడ పచ్చలూ పొదిగిన బంగారు ప్రమిదెల్లో, పరిమళాలు వెదజల్లే నూనె పోసి దివ్వెలు వెలిగిస్తుంది. దంతపు కట్టున్న చక్కటి అద్దాలు బిగించిన ఆ గది గోడలు, ఆ దీపాల వెలుగును పదింతలు చేస్తూ ఉంటాయి."
"ఆహా!"
"అంతేనా..!! బహు చక్కని లతల చెక్కడపు వెండి పన్నీరు బుడ్డి, నిత్యం పన్నీరు నింపుకుని అతని కోసం సిధ్ధంగా ఉంటుంది. మేలు చందనపు చెక్క పన్నీట అరగదీసిన గంధం మరో వెండిగిన్నెలో సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.
"ఆహా.. విత్తం కొద్దీ వైభవం కదా!"
"ఈ మాత్రానికేనా! లేలేత తమలపాకులూ, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు, లవంగాలూ తదితర ద్రవ్యాలూ, పోక చెక్కలూ.. ఓ ముద్దులొలికిలే బంగారు పళ్ళెంలో ఆ శయ్య పక్కనే ఎదురుచూస్తూ ఉంటాయి. శయ్య అంటే మామూలు తల్పమనుకునేవు! ఆ పన్నగపు శయ్యపై పరుండే స్వామికి, శేషతల్పానికి దీటైన పరుపు ఉండద్దూ! సౌఖ్యమైన హంసతూలికా తల్పం.. చక్కని పట్టు తలగడలూ.. పాలతరగల మేలుకట్టు, మిసమిసలాడే పల్చని తెరలు!!  చమరీ మృగాల కేశాలతో తయారు చేసిన చామరాలు.. వింజామరలు!!"
"ఆహా.. భోగ నారాయణుడికి ఆ మాత్రం ఉండద్దూ! భేష్!!"
"ఆ గదిలో సుడులు తిరుగుతూ దివ్యపరిమళాలు వెదజల్లే అగరుధూపం క్షణమైనా విశ్రమించదంటే నమ్మాలి నువ్వు!"
"అబ్బ! ఇంత భోగ్యమైన పడకటిల్లు వదిలి కృష్ణుడు ఇంకెక్కడికి పోతాడూ!? నిత్యం మంజుల కౌగిట్లో బందీయై ఆ సౌధం దాటి రాడేమో!"
"అన్నావూ..! గోపికలందరికీ అదే అనుమానం. ఇందాకా "కృష్ణా.. కృష్ణా!" అని పలవరిస్తూ మంజుల కలలో తేలుతోందా! బయట గుమ్మం దగ్గర నిలబడిన గోపికలందరూ అదే అనుకుంటున్నారు! ఎంత పిలిచినా మేలుకోవడం లేదంటే ఆమె ఇంట్లో కన్నయ్య ఉన్నాడేమో! కన్నయ్యే తన చెంత ఉంటే ఇంక వేరే వ్రతాలెందుకని ఆ భాగ్యశాలి తలుపుతీయట్లేదేమో!" అని అనుమానపడుతున్నారు."
"నిజమా!!" ఆశ్చర్యపోయింది యమున.
"అవును.. నిన్న రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళాను. నేనిలా లోపలికి వెళ్ళానా.. ఆ అమ్మాయి కవాటం బిగించేసింది. చేసేదేముందని ఆ మందిర సౌందర్యాన్ని చూస్తూ, అగరుపొగలతో ముచ్చట్లాడుతూ రాత్రంతా గడిపేసాను. ఆ పక్క గదిలోనే వాళ్ళమ్మ కూడా ఉంది. ఆ గది కిటికీ తెరచి ఉండడం గమనించి, తెల్లారబోతోంది కదా అని బయటికి వచ్చాను. రాత్రంతా మంజుల గదిలో తారట్లాడనేమో.. నా ఒళ్ళంతా ఆ అగరు సుగంధం పట్టేసింది." చెప్పుకొచ్చింది తెమ్మెర.
"సరిపోయింది! ఇంతకీ నిజంగానే ఆ గదిలో కృష్ణుడు లేడా?" అనుమానంగా అడిగింది యమున.
"హు.. కన్నయ్య లేనిదెక్కడని! ఆ పిల్ల రాత్రి ఊపిరెన్నిసార్లు తీసిందో అన్ని సార్లూ "కృష్ణా.. కృష్ణా..!" అంటూనే ఉంది!"
"అయితే కలలోనే ఉన్నాడనమాట కన్నయ్య!పాపం, ఆ పిల్ల నిద్ర లేవడం లేదని చెలులు ఎన్ని అభాండాలు వేసి మాటలాడుతున్నారో! అసూయ, అనుమానం మహ చెడ్డవి కదూ! కబుర్లు చాల్లే కానీ.. ఇదిగో! చప్పున వెళ్ళి అక్కడేం జరుగుతోందో చూసి రా!" పురమాయించింది.
"రాత్రంతా మంజుల నిట్టూర్పుల చండ్రగాలుల్లో మరిగి ఉన్నాను. ఒక్క స్నానం చేసి వెళ్ళనిద్దూ!"
"స్నానం చేసి వెళ్ళే సమయం లేదు. వెళ్ళు వెళ్ళు.. చెలులతో కలిసి తీరిగ్గా జలకాలాడుదువు గాని!  వెళ్ళి చూసి రా.. ఇక్కడున్నట్టు వెళ్ళి రావాలి తెలిసిందా!!" తరిమింది యమునమ్మ.
తప్పేదేముందని మంజుల ఇంటివైపు పరుగులు తీసింది పిల్ల తెమ్మెర.

"ఓ మంజులా! నిన్ను పిలిచీ పిలిచీ మా గొంతు జీరబోతోంది. లేమ్మా..! నీలాంటి గొప్ప ధనవంతురాలు మాతో కలిసి వ్రతం చెయ్యడమే గొప్పని మురిసిపోతున్నాం. అంతస్థులో నీతో సమానమైన వాళ్ళమేం కాదు కానీ, ఏదో.. నువ్వు మా మేనమామ కూతురివి కదా.. ఆ చనువుతో నీతో కలిసి తిరుగుతున్నాం." పిలుస్తోంది కమలిని. ఆ బంగారు వాకిలి ముందు పడిగాపులు కాస్తున్నారు మిగిలిన చెలులందరూ. అటు వెళ్ళిన పిల్ల తెమ్మెర అక్కడే తారట్లాడుతూ వింత చూస్తోంది.
"ఈ పిల్ల అంత చక్కని శయ్యమీద నిద్దరోతే ఆ సౌఖ్యానికి తెలివేం వస్తుంది! నిద్ర లేస్తున్న పక్షులతో సమానంగా ఇంత సేపటి నుంచీ  పిలుస్తున్నాం. మంజులకి వినబడలేదు సరే! కనీసం అత్తకైనా వినబడలేదంటావా!?" వాపోయింది సురభి.
"పోనీ ముందు అత్తనే పిలుద్దాం. అత్తా.. లే లే!! నీ ముద్దుల కూతుర్ని నిద్ర లేపి 'కాత్యాయనీ వ్రతానికి' పంపించు. స్నానానికి వేళ మించిపోతోంది. పెద్ద దానివి! అన్నీ తెలిసిన దానివి! కనీసం నీకైనా తెల్లవారుఝామున తెలివి రానంతగా మొద్దు నిద్ర పట్టేసిందా!" పిలిచింది కమలిని.
"ఓ అత్తా! నీ చిన్నారి నిజంగానే నిద్రపోతోందా? లేక కృష్ణుడే ఆ గదిలో ఉన్నాడని, సడి లేకుండా ఆ మోహనాకారుడిని చూస్తూ మూగదైపోయిందా!"
"కనీసం పిలుపైనా వినిపించని చెవిటిదా? కిటికీ తలుపు తెరిచి "మీరెళ్ళండర్రా.. మీతో రావాల్సిన అవసరం నాకేంటి!" అని మమ్మల్ని పంపించేయచ్చు కదా!" నిష్టూరమాడింది సురభి.
"అత్తా.. పోనీ.. కన్నయ్య ఆ గదిలో లేడనుకో! కలలో "కృష్ణా కృష్ణా!" అని జపం చేస్తున్న నీ కూతురికి తపోభంగం కాకుండా, నువ్వే కావలి ఉండి నిద్ర లేవకుండా చూసుకుంటున్నావా, ఏం?"
"మీ ఇద్దరికీ గాఢనిద్రామంత్రమేమైనా ఎవరైనా వేసారా?" తనవంతు ఇంకొన్ని మాటల బాణాలు వేసింది ఉత్పల.

ఇలా చెలులు అంటున్న మాటలని వారించింది ఆనందిని. "ఆగడాగండి అమ్మాయిలూ!! ఈ రేపల్లెలో 'అందరికీ సమానమైన సొత్తు' కృష్ణుడని మీకు తెలీదూ! అయినా అత్తమ్మ మంజులని ఎలా పెంచిందో మనం చూడలేదూ! తన ఐశ్వర్యాన్ని చూసి కృష్ణుడు వస్తాడని భ్రమ పడేంత తెలివి తక్కువదా ఆ పిల్ల! తప్పు..తప్పు! గాఢ నిద్రామంత్రమేసినారో! అని నిష్టూరాలాడుతున్నారు కదా! నిజమే! కృష్ణుడే ఆ మంత్రం!
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగ సందష్ట సంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జపజప సతతం జన్మసాఫల్యమంత్రం

అన్నింటికంటే గొప్ప మంత్రం కన్నయ్య పేరు తలవడమే! ఆ పేరు తలచీ తలచీ మత్తులో మునిగిపోయిందా పిల్ల. విత్తొకటేస్తే చెట్టొకటి రాదు కదా! ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది. అత్తమ్మ నేర్పిన పలుకులే పలుకుతోంది మంజుల. ఏవైనా మంచి కబుర్లు చెప్పి నిద్ర లేపక నిష్టూరాలతో లేపుతామా?" అందరినీ శాంతింపచేసింది ఆనందిని.

మనవి వినవే! మామ కూతుర!
మణికవాటము తీయవే!
మణిఖచిత సౌధమ్ములో పరి
మళపు దివ్వెల వెలుగులో,
నునుతలిమమున కనులు మొగిడిచి
కునుకుదువుగానీ! లేవే!

మూకయో! చెవిటిదో! అత్తా!
ముద్దులా చిన్నారి కూతురు!
కాక కావలి కదలనీయరొ?
గాఢనిద్రామంత్రమేసిరొ

"శ్రీకరా! వైకుంఠనాధా!
మాధవా! మాయావి! హరి!"యని
నీకుమార్తెను లేపుమా, శుభ
నామపారాయణమ్ముతో!

బయట ఆ "కల్యాణు'ల మేల్కొలుపు విని కళ్ళు విప్పింది వాళ్ళ అత్తమ్మ. కూతురిని "మాధవా! కృష్ణా!" అని పిలుస్తూ నిద్ర లేపుదామని వెళ్ళబోతూ ఉండగా, ఆమెకి బయట నుంచి మాటలు వినిపిస్తున్నాయిలా..

"అత్తా! నీవెరుగని విషయమేముంది! నీ కూతురిలాగే గోపస్త్రీలందరమూ కృష్ణుని ముఖచంద్రబింబం కోసం చకోరాల్లా ఎదురుచూస్తున్న వాళ్ళమే! విరహపు వేడి సెగలో, వేడి నిట్టూర్పు గాడ్పుల్లో వేగి వేసారుతున్న వాళ్ళమే! ఈ తాపానికి, కన్నయ్యని పొందాలనే మా సంకల్పానికీ యమునలో మునకను మించిన ఉపశమనమేముంది, తరుణోపాయమేముంది?"
"అడవిలో ఆలమందలను కబళించిన దావాగ్నిని కన్నయ్య అమాంతం మింగినట్టు, ఆ యమున మా తాపాన్ని చల్లార్చితే బాగుండును!" దిగులుగా చెప్పింది ఉత్పల.
"నీ కూతురు మహా భాగ్యశాలి. గోపాల చూడామణిని నిత్యం తన గుండెలపై ధరిస్తుంది. కృష్ణ మంత్రాన్ని క్షణమైనా మరువదు. ఆమెను తో కలిసి వ్రతం పూర్తి చేస్తేనే మా నోము పండుతుంది."

చిరుగంటలు ఘల్లుమని మ్రోగుతూ బంగారువాకిలి తెరుచుకుంది. శేషతల్పం దిగివచ్చిన సిరిలా వెలుగుల నవ్వులు వెదజల్లుతూ బయటకు నడిచి వచ్చింది మంజుల. 'కాత్యాయని పూజ'కు కదిలివెళ్ళారందరూ!


*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..



( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)

Thursday, December 22, 2011

చాలులే పవళింపులు! - కాత్యాయనీ వ్రతం - 8

నిశి కట్టుకొచ్చిన చుక్కల కుట్టుపువ్వుల చీరని కళ్ళింతలు చేసుకుని మరీ చూస్తూ, ముచ్చట పడుతూ  నెమ్మదిగా కదులుతోంది యమున. ఉండుండి తరగల కబుర్లతో ఆరాలు తీస్తోంది.

ఆ ఇంట్లో ఒక గోపి నిద్దుర దుప్పటిలో ముడుచుకుని కలలు కంటోంది. ఆ కలనిండా పువ్వులే పువ్వులు! మాలతీ మాధవాలు, ఆకు సంపెంగలు, మల్లెలు, మొల్లలు, పొగడలు, పారిజాతాలు, కెంపుల చామంతులు, కేతకీ సౌరభాలూ .. ఒకటా రెండా.. వేల రకాల పువ్వులు ఘుమ్ముఘుమ్మని మత్తెక్కిస్తున్న పూలవనంలో.. తిన్నెలు జాజులతోనూ, దారులు గులాబీలతోనూ, తటాకాలు కలువ చెలువలతోనూ నిండి పరిమళిస్తున్నాయి. తుమ్మెదలు ఝుంఝుమ్మని రొద చేస్తూ తేనెలు తాగి, మత్తెక్కి సొక్కి సోలిపోయి, పూబోడుల కౌగిళ్ళలో వాలి నిద్దరోతున్నాయి. మరి తన కౌగిలి లోనో! తన కౌగిట్లో ఒరిగిన మోహన కృష్ణుడు తెల్ల సంపెంగల తిన్నె మీద నీలాలు రాశి పోసినట్టు ధగధగా మెరుస్తున్నాడు!! తన తామరతూళ్ళ చేతులతో ఎంత బంధిస్తే, అంత దగ్గరగా ఒదిగిపోతున్నాడు. 'ఏ చెలి పిలుపు వినిపిస్తే పట్టువిడిపించుకు ఎక్కడ వెళ్ళిపోతాడో!' అని బెంగతో కౌగిలి ఇంకా బిగించేస్తోంది తను. చెలియలొస్తారు. తలుపు తడతారు. కృష్ణుడిని చూస్తే!!  తను అనుభవిస్తున్న మహదైశ్వర్యంలో వాటా అడుగుతారే! ఎలా..? రావద్దని ఎలా చెప్పడం.. ? ఈ రేయిని కరగనివ్వకని ఆకాశాన్ని ఎలా బతిమాలుకోవడం!

"విష్ణుప్రియా.. కృష్ణ వల్లభా! తెల్లవారబోతోంది లే లే!"
అదిగో.. వచ్చేసారు. కళ్ళు బిగించి నిద్దరోతే!!
"ఈ రోజు నీ వంతా అమ్మాయీ!? అందరి కంటే ముందే నిద్రలేచి, సుగంధాలు విరజిమ్మే పుష్పాలతో పూలసజ్జ నింపుకుని పూవయారిలా నడిచొచ్చే దానివి! కబుర్ల గలగలలతో యమున చిన్నబోయేలా సందడి చేసే దానివి! ఓ భామా! లే లే!"

సమాధానం చెప్పకుండా కనురెప్పలు బిగించింది విష్ణుప్రియ. ఆమె నిద్రపోతున్న తల్పం పక్కనే ఉన్న కిటికీ లోంచి, బయట నిలబడి మేలుకొలుపుతున్న తన నేస్తాల మాటలు సుస్పష్టంగా వినబడుతున్నాయి. నిద్రపోయే వాళ్ళని మేలుకొలపగలం కానీ, నిద్ర నటించే వారిని లొంగదీయడం ఎవరి తరం! స్వప్నసౌధపు మెట్లు దిగనని మొండిపట్టు పట్టిందా అమ్మడు. ఈ రోజు ఆమెది! మేలుకొలిపి స్నానానికి తీసుకెళ్ళే బాధ్యత చెలులది.

విష్ణుప్రియ నిజంగానే కృష్ణ వల్లభ! కులుకూ, అలకా ఎరిగిన జాణ. ఆమెకు పువ్వులంటే ఎంత ఇష్టమో, ప్రతి పువ్వులోనూ ఆమెకి కనిపించే కన్నయ్య నవ్వులంటే అంత కంటే ప్రాణం! బృందావనిని పోలిన పువ్వులతోట ఆమె ఇంటిచుట్టూ పెంచుకుంది. ఆ తోటలో లేని పువ్వు లేదు! వేసవిలో మల్లెలవనం. వానాకాలం గుమ్మెత్తే చంపక సుమాల సౌరభాలు.. శరత్తు వచ్చేసరికి చామంతులు.. హేమంతాన్ని పలకరించే గులాబీలు.. నిత్యమల్లెలా కుసుమించే తమ దొరసానికి తోడుండే పారిజాతాలూ, పొగడలూ, జాజులూ, మాలతీమాధవాలూ.. అన్నీ మురళీ మనోహరుని కోసం విరిసి ఎదురుచూస్తూ ఉంటాయి.

ఆ పూలవనంలో అప్పుడే విరిసిన గులాబిబాలల్లా గోపకాంతలు లోపల నిద్రపోతున్న తమ నెచ్చెలి కోసం ఎదురుచూస్తున్నారు. లోపల కృష్ణ స్వామిని కౌగిట చేర్చుకుని, కలలోంచి ఇలపైకి దిగిరానని పట్టు పట్టి సోయగాల మాలికలా పడక మీద ఉన్న ఆమె!

బయట నుంచి మేదిని చెప్తోంది. "ఇదిగో! చూడు తూరుపు దిక్కున వెలుగు రేఖలు పొడచూపుతున్నాయి. మంచుకి తడిసిన బిరుసైన గడ్డిని మేసేందుకు గేదెల మంద వెళ్ళింది. నల్లగా నిశిరాత్రి కదిలి వెళ్తున్నట్టు ఆ ఎనుములు వెళ్తున్నాయి చూడు!"
సమాధానమివ్వలేదు విష్ణుప్రియ.
"ఓ విష్ణుప్రియా! నువ్వింకా తెల్లారబోవడం లేదనుకుంటున్నావేమో! మన చెలియలందరూ యమున ఒడ్డుకు వెళ్ళిపోయారు. నువ్వింకా రాలేదని ఇంకొంతమందిని వెంటపెట్టుకుని, నిన్ను లేపుదామని వెనక్కి వచ్చాను. నవరత్నాల ఉంగరంలో ఏ ఒక్క మణి లేకపోయినా దానికి నిండు ఉంటుందా! నువ్వు లేని మన జట్టూ అంతే! లేచి రావమ్మా!"
"ఊహూ.. లేవను. సగం మంది వెళ్ళిపోయాక గుర్తొచ్చానా నేను..?! హు..!" కళ్ళు ముసుకునే కినుకగా పెదవి కొరుక్కుంది విష్ణుప్రియ.
"విష్ణుప్రియా, నువ్వు నిజంగానే మాలో మేటి గోపికవు. నిన్ను ముందు నిలబెట్టుకుని వెళ్తేనే కన్నయ్య మమ్మల్ని చూస్తాడు. అంత గొప్పదానివి నువ్వు! నువ్వు అల్లే మాలలే కదూ! ఆయన నిత్యం తన మెడలో వేసుకునేదీ! లే లే! నువ్వు లేచి వచ్చి, నీ తోటలో పువ్వులు తెచ్చి, మాలలు అల్లితే కానీ, మన వ్రతం ఎలా పూర్తవుతుంది చెప్పు!"
"ఊ.. అలా రండి దారికి."
"నీకూ కథలు చెప్పాలా! సురభి లేదే! ఆనందిని లేదే! నాకేమో పెద్ద పెద్ద వేదాంత విషయాలేవీ తెలియదాయె!కన్నయ్య చిన్ననాటి లీలలూ నేను చూడలేదు. నీలాగా నేనూ విన్నానంతే!" అని వాపోయింది మేదిని.
"మనకు తెలిసినవే చెప్దాం లే, మేదినీ..!" అని ధైర్యం చెప్పింది పక్కన ఉన్న తరళ.
"హ్మ్.. విష్ణుప్రియా.. నిన్ను నిద్ర లేపి తీసుకొస్తామని, పెద్ద బాధ్యత భుజాల మీద వేసుకుని వచ్చాం. వేళ మించిపోతే కష్టం! అయినా నాకు తెలియక అడుగుతున్నానూ! "చలి" అన్నది ఎరుగని పిల్లవి. రోజూ స్నానానికి యమునలో తొలిగా కాలుపెట్టి దిగేది నువ్వే! 'విరహంలో ఎంత మరిగి ఉన్నావో!' అని నిన్ను, నీ తాపాన్నీ చూసి చెలులందరూ గుసగుసలాడుకుని నవ్వేవారు కదూ! అలాంటిది నువ్వే చలికి ముడుచుకుని నిద్రపోతున్నావంటే నమ్మశక్యంగా లేదు. కేశిని చంపడానికి గోపాలకులు వారిస్తున్నా, కన్నయ్య ముందుకు దూకినట్టు నువ్వూ స్నానానికి ఉరకలు వేసే దానివి!"

సిగ్గుగా నవ్వుకుని, చిన్నగా కదిలి వినసాగింది విష్ణుప్రియ!
"సరే! కథ చెప్తే కానీ నిద్ర లేవకపొవడం ఆనవాయితీ అయిపోయింది కదా! నాకు తోచినట్టు చెప్తున్నాను. ఈ కథ అయ్యేసరికి నిద్ర లేచి వచ్చి మా మాట దక్కించు!"
"సరే, చెప్పండన్నట్టు" గాజులు గలగల్లాడించింది లోపలనుండి.
సంకేతాన్నదుకున్నట్టు సంబరపడి, తనకు తోచిన విధంగా కథ చెప్పనారంభించింది మేదిని. కృష్ణ లీలలు ఎవరు ఎలా చెప్పినా వినదగినవే!
"కన్నయ్య తన స్నేహితులతో కలిసి ఆవుల మంద వెనుక వెళ్ళి అడవిలో తిరుగుతున్నాడట. కంసునిచే పంపబడిన 'కేశి' అనే రాక్షసుడు ఓ పొగరెక్కిన అడవిగుర్రం రూపంలో కన్నయ్య ఉన్న చోటికి వచ్చాడట. పశువులన్నీ కడుపు నిండా గడ్డి మేసి, నీళ్ళు తాగి, చెట్ల నీడలలో పడుకుని నెమరేస్తున్నాయట. కన్నయ్య తన స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుని చల్ది మూటలు విప్పుకుని తింటున్నాడట. దూరంగా నీళ్ళ మడుగు దగ్గర అలికిడై, వెళ్ళి చూసి వద్దామని నడిచిన గోపాలకుడొకడికి.. తన ముందు కాళ్ళు ఎత్తి పశువులని తన్ని చంపేస్తున్న ఈ అడవి గుర్రం కనిపించిందిట!! పరుగున అందరూ వెళ్ళి చూసేసరికి కనిపించిన పశువుని కనిపించినట్టు మట్టికరిపిస్తోందట ఆ గుర్రం! దాని నోటి నుండి అగ్ని జ్వాలలు వెదజల్లుతోంది! అది సకిలిస్తూ ఉంటే వినేవాళ్ళ గుండెలు అవిసిపోతున్నాయట. అలా నోరులేని జీవాలని పొట్టన పెట్టుకుంటున్న ఆ పొగరుబోతు గుర్రాన్ని లొంగదీసుకోడానికి, స్నేహితులంతా వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా సింహం లంఘించినట్టు ఉరికాడట కన్నయ్య! భీకరంగా సకిలిస్తూ, ముందు కాళ్ళు ఎత్తి దూకబోయిన ఆ కేశి ని ఒడుపుగా తప్పించుకుని, అ గుర్రం నోట్లో చెయ్యి పెట్టాడట కన్నయ్య!"
"ఆ!!"
"ఆ.. ! ఆ కేశి దవడలు పట్టుకు చీల్చి ప్రాణాలను హరించేసాడట!"
ఒక వైపు కృష్ణుడి విజయాన్ని విని సంతోషంగా ఉన్నా, మనసంతా భయంతో నిండి.. మరీ ముడుచుకుపోయింది లోపల ఉన్న విష్ణుప్రియ!
"అంతేనా! కృష్ణుడి శౌర్యమంటే చాణూర ముష్టికులనే మల్లులను జయించినప్పుడే చూడాలి! బలరామ కృష్ణులిద్దరినీ మధురాపురికి పిలిపించిన కంసరాజు, చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మహా బలవంతులైన మల్లులని పంపించాడట. రాచవీధిలో మదపుటేనుగుల్లా తమకు అడ్డుపడిన ఆ మల్లులిద్దరినీ, సింహాలు వాటి కుంభస్థలం మీదికి లంఘించి చంపినట్టు.. తమ అజేయమైన శౌర్యపరాక్రమాలతో చంపేసారట బలరామ కృష్ణులు!"

విష్ణుప్రియ మనసంతా కన్నయ్య మీద చెప్పలేనంత బెంగతో నిండిపోయింది. ఆతని సుందర దేహం గుర్తొచ్చింది. "చిన్నప్పటి నుంచీ ఆ యశోదమ్మ మొత్తుకుంటూనే ఉంది.. 'కన్నా.. దుడుకు పనులు వద్దూ..!' అని వింటేనా..? అపాయంతో చెలగాటమాడడం కన్నయ్యకి అలవాటయిపోయింది. గెలిచేది తానే అయినా ఆ చేతులు ఎంత కందిపోయి ఉంటాయో! ఆ భుజాలు ఎంత నొప్పెట్టి ఉంటాయో!" ముఖమంతా అలుముకున్న బాధతో వడిలిన కమలంలా ఉంది విష్ణుప్రియ.

చానా లేవే చాలే పవళింపులు
చానా లేవే చాలులే పవళింపులు
ఔనే అచట చెలులనాపి వచ్చేమే
పూని నోము స్నానమాడ వలచేదాన

అల్లదే చూడవే! తూరుపు
తెల్లవారెనె, ఎనుము కదుపులు
మెల్లగా తరలెనే! మంచున
తడియు పచ్చిక బీళ్ళ మేయగ!

చేరి వాద్యముల కైవారముల కావింప
కూరిమితో దేవదేవుడు కృపను మనపై చూపునే!
వారువము వలె వచ్చు రక్కసు
నోరు చీరినవాని వేడగ
క్రూర చాణూరాది మల్లుల
బీరమడచిన వాని పాడగ!

చానా లేవే చాలు పవళింపులు

విష్ణుప్రియ మనసు కాస్త కుదుట పడింది. వీనులవిందైన "నీలాంబరి" రాగానికి కళ్ళు తెరచుకోవాలనే ప్రయత్నం చెయ్యాలనిపిస్తోంది. ఈలోగా బయట ఆనందిని మాటలు వినిపించాయి!

"ఏం? ఆ ముద్దరాలింకా నిద్రలేవలేదా..!!  మీరేం చేస్తున్నారు బయట!?"
"ఏం చేస్తున్నామేమిటి? 'కృష్ణ కృష్ణా!' అన్నాం.. అదిగో గేదెలు నిద్ర లేచాయ్ చూడమన్నాం.. గుర్రాన్ని చీల్చి చంపిన కన్నయ్య కథ చెప్పాం!" చెప్పింది మేదిని.
"చాణూరాది మల్లుల సంహారం కూడా! పాట కూడా పాడాం." ఇచ్చిన పనిని చేసామని నమ్మకంగా చెప్పింది తరళ.
"ఏవిటేవిటీ!!! సుమసుకుమారమైన మనసున్న ఆ జవరాలికి మేలుకొలుపులు ఇలా పాడారా? మంచి వాళ్ళే!! ఆవులు నిద్ర లేచాయి. కాటుక పిట్టలు కూసాయి. అంటే అందం! కానీ ఉదయాన్నేఎనుముకదుపుల గురించా చెప్పేదీ!" బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది ఆనందిని.
బిక్కమొహాలేసారు మేదినీ, తరళా.. వాళ్ళకి సాయం ఉన్న ఇంకొంతమంది. పున్నాగపువ్వులు చిన్నపోయినట్టున్న వాళ్ళ వాలకం చూసి నవ్వొచ్చింది.. జాలేసింది ఆనందినికి.
"సర్లేండి! అసుర సంహారం ఇప్పుడు కన్నయ్యకీ తప్పలేదు. అప్పుడు రామయ్యకీ తప్పలేదు. మీరేం చేస్తారు? వాళ్ళ కథలన్నీ రక్కసి మూకని చంపడమే అయితేనూ..!" సాంత్వన పలికింది.
"హమ్మయ్య!" అనుకున్నారు అందరూ.
"కృష్ణుడు రేపల్లెకి వచ్చిన రాక్షసులను మట్టి కరిపించినట్టే ఆనాడు రాముడూను..." ఓ అందమైన రామకథ చెప్పనారంభించింది ఆనందిని.

"వనవాసానికి బయలుదేరిన రామచంద్రుడు సీతమ్మతోనూ, లక్ష్మణుడితోనూ కలిసి జనస్థానం చేరుకున్నాడట. అక్కడ ఓ అందమైన కుటీరం నిర్మించుకుని ఉండసాగారు. ఈలోగా అక్కడ ఉండే మునులంతా వచ్చి, రామయ్యని చూసి తమ జపతపాలకు భంగం కలిగిస్తున్న రక్కసిమూక గురించి మొరపెట్టుకున్నారట."
"ఊ.."
"అయ్యో! మీరు చెప్పకుండానే మీరెలా ఉన్నారో, మీకే కష్టాలున్నాయో కనుక్కోవలసిన బాధ్యత నాదీ! మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేనున్నాను కదా!" అని అభయమిచ్చాడట. వాళ్ళు వెళ్ళాక సీత అందటా.. "ఏదో కుటీరం వేసుకుని కాయాకసరూ తింటూ పద్నాలుగేళ్ళూ గడిపేయకుండా.. ఏవండీ.. ఇక్కడికొచ్చినా రాచకార్యాలు తప్పవా? రాక్షస వధ తప్పదా? అని."
"అవునా!!"
"ఊ.. ఆవిడకీ మనకున్నట్టే బెంగ ఉంటుంది కదా! రాజ్యాలేలే రాజైనా తల్లికి బిడ్డే.. ఆలికి మగడే!"
తమ మనసుల్లో కన్నయ్య దూకుడు గురించి ఉన్న బెంగలన్నింటికీ ఊతం దొరికిందని సంతోషించారందరూ.
"అప్పుడు రాముడన్నాడట.. "నిన్నైనా విడిచిపెడతాను, తమ్ముడినైనా విడిచిపెడతాను.. మునులకు ఇచ్చిన మాట మాత్రం విడిచిపెట్టనూ.." అని చెప్పి విల్లందుకుని అడవిలోకి వెళ్ళిపోయాడట."
"రూపం బహు సుందరమే కానీ, మాట మహ కచ్చితం! ఇద్దరూ ఒక్కరేగా!!" అంది మేదిని.
"హ్హహ్హహా.. మరే! అలా అడవిలోకి వెళ్ళిన రామభద్రుడు పద్నాలుగు వేల పద్నాలుగు మంది రాక్షసులను చంపి.. ఆక్షరున ఖరుడనే రాక్షసుడిని చంపి ఇంటికొచ్చాడట."
"హమ్మయ్యో! పద్నాలుగు వేల మందే!!" నోరు వెళ్ళవెట్టింది తరళ.
"రామయ్యకి విల్లైనా ఉంది. ఈ దుడుకు కన్నయ్యో!! కాలితోనూ, చేతితోనూ, నోట్లో దూరీ, నెత్తెక్కి నాట్యం చేసీ.. " వాపోయింది మేదిని.
"హ్హహ్హహ్హహా.. భలే వారే అమ్మాయిలూ! చీకటిని పారద్రోలడమే వెలుగు లక్షణం! అప్పుడు ఇంటికొచ్చిన రఘువీరుడిని చూసి సీతమ్మ ఏం చేసిందో తెలుసా!?"
"ఆ.."
"త్వం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం!
భభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే!! "
"అర్ధం చెప్పు, బంగారుతల్లీ!"
"శత్రువులను హతమార్చి, మహర్షుల మనసులను రంజింపచేసి, వారికి సుఖాన్నొసగి ఇంటికి వచ్చిన తన పతిని చూసి, మనసు ఉప్పొంగి.. ఆ సీతాకాంత పరుగున వెళ్ళి గాఢంగా కౌగిలించుకుందట!!"
"భలే!!" ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టారు చెలియలందరూ..
"మరి రక్కసి గుంపును కాలరాసిన కృష్ణుడికి నీ కౌగిలి ఇచ్చి అభినందించాలి కదూ, విష్ణుప్రియా! రా బయటికి! వ్రతం పూర్తి చేసుకుని కన్నయ్యని కొంగున కట్టేసుకోవద్దూ!" ఊరించింది.
ఒక్క అంగలో వచ్చి తలుపు తెరిచి, సిగ్గులు చిందిస్తూ నవ్వేసింది విష్ణుప్రియ. గాఢాలింగన సౌఖ్యమెరిగిన ప్రౌఢాంగన మరి!!
"హమ్మయ్య!! కలకలమని పక్షిగణములు పలికేను.. కల్యాణీ! స్నానానికి వేళయింది. "కాత్యాయని"ని కొలిచే సమయమయింది. పద పద!" యమున వైపు దారితీసింది ఆనందిని... వెనుకే చెలులందరూ!


*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..

( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


Wednesday, December 21, 2011

దొరసానీ! లేవవే!! - కాత్యాయనీ వ్రతం - 7

అప్పుడే నడక నేర్చిన అల్లరి బుజ్జాయి వెనుక పగలంతా పరుగులు తీస్తూ, వాడు చేసే కొంటె పనులను ఓ కంట కనిపెడుతూ, వచ్చే పోయే అతిధులతో కళకళ్ళాడే పెద్ద ఇంటిని సమర్ధించే ఇల్లాలు, పొద్దు గూకిన తరువాత ఇల్లు చక్కబెట్టుకుని, పక్కలో పాపడిని పొదువుకుని అలసి సొలసి ఒళ్ళెరగక నిద్రపోయినట్టుంది.. సద్దుమణిగి నిద్దరోతున్న ఆ గొల్లపల్లె. రాత్రైనా నిద్ర లేనిది ఒక్క కన్నయ్యకే! అవును! గోప భామినుల కలల్లోకి వెళ్ళి కన్నయ్య ఎన్ని కబుర్లు చెప్పాలో, ఎంత అల్లరి చెయ్యాలో, ఎవరి అలకలు తీర్చి మురిపించి మరిపించాలో కదా! క్షణమైనా ఆ గోపాల చూడామణిని మరువని వారిని కలలో కూడా అతడు వదలలేడు.

నిన్నటి రోజు తనని చెలులు అతి ప్రయత్నం మీద నిద్ర లేపారని, ఈ రోజు ఓ గడియ ముందే నిద్ర లేచింది వకుళ. పసిడి పాదాల అందెలు ఘల్లు ఘల్లున చేతి గాజుల సంగీతానికి జతగా సడి చేస్తూంటే, పూలసజ్జ నింపుకుని ఉత్పల ఇంటికి వెళ్ళింది. వకుళ పిలుపు విని నిద్ర లేచిన ఉత్పల కళ్ళు నులుముకుంటూ బయటికి వచ్చింది.

"ఊరికి ముందే నిద్ర లేచేసావా? చిన్నారీ! బుధ్ధిమంతురాలివి సుమీ!" అని నవ్వింది.
"ఏం చెయ్యమంటావు చెప్పు! మీరంతా ఇంటి బయట అలా నిలబడి ఎదురుచూస్తూ ఉంటే భలే బాధనిపించింది." చిన్నబోతూ చెప్పింది వకుళ.
"భలే దానివే! ఈ చలికి ఎవరైనా మత్తుగా నిద్దరోవాల్సిందే!
"లేదులే అక్కా! నాకే ఏదో మాయ కమ్మేసింది."
"కన్నయ్య మాయ! కలలో కృష్ణుడు నీ వీణాగానం వింటూ కదలనన్నాడో! ఇద్దరూ బృందావనిలో చెలరేగి పూలబంతులతో ఆడుకుంటున్నారో!" ఆటపట్టించింది ఉత్పల.
"ఏమాటకామాటే అక్కా! నిద్ర లేచేసరికి కృష్ణ లీలలు చెవిన పడడం అంత మధురమైన సుప్రభాత గీతిక మరొకటి ఉండదు తెలుసా!" నిన్నటి కబుర్లు తలుచుకుంటూ చెప్పింది వకుళ.
"కాదూ మరి! తేనె కంటే తీయనిది కన్నయ్య పేరు .. మాయల్లో పెనుమాయ కన్నయ్య చేష్టలూ.. నీ పుణ్యమా అని మేమూ ఎన్ని మంచి మంచి సంగతులు మాట్లాడుకున్నామో!" చెప్పింది ఉత్పల.

"ఈ రోజెవర్ని నిద్ర లేపాలో! అరే! వకుళాదేవి అప్పుడే నిద్ర లేచిందే!" మేలమాడింది ఎదురుగా మిగిలిన గోపికలందరినీ వెంట పెట్టుకుని వస్తున్న సురభి.
"కమలిని రాలేదింకా.. మీ ఇంటి పక్కనేగా! నువ్వెళ్ళి చూడలేదా సురభీ!" అడిగింది ఉత్పల.
"అయ్యో.. తలుపు వేసి ఉంటే కమలిని నిద్ర లేచి, నన్ను పిలిచి నేను లేవకపోతే మీ దగ్గరకి వచ్చేసిందనుకున్నానే!"
"మంచి దానివే! పద పద.. వెళ్ళి చూద్దాం. ఈ రోజు ఆమె గారు  స్వప్న డోలికలలో ఊగుతోందనుకుంటా!"

అందరూ కలిసి కమలిని ఇంటి ముందు నిలబడ్డారు. నిన్న వకుళ నిద్రపోయినట్టే ఈ రోజు కమలిని గాఢంగా నిద్రపోతోంది. పక్కకు తిరిగి నిద్రపోతున్న ఆమె 'పడమటి కొండల బారులా' ఉంది. రెండు కొండల మధ్య పొంగి నేల చేరుతున్న పాల జలపాతంలా.. చెదరిన ఆమె జలతారు వల్లెవాటు, నడుము పై నుండి కిందకు జారి వేలాడుతోంది. అలసిసొలసి నిద్రపోతోందేమో.. చెదిరిన ముత్యాల సరాలు ఆమె గుండెలపై చిక్కులు పడి అదివరకు ఎవరూ పెట్టుకోని వింత ఆభరణంలా ఉన్నాయి. ఆమె చేతిలో దంతపు కట్టున్న చిన్న అద్దం ఉంది. ఆమె నుదుట కస్తూరి రంగరించిన తిలకం అర్ధ చంద్రాకృతిలో దిద్ది ఉంది. "తిలకం ఇలా దిద్దుకుంటే బాగుంటుందా! కృష్ణుడికి నచ్చుతుందా?" అని నిద్రపోయే ముందు దిద్దుకుని అద్దంలో చూసుకుంటూ నిద్రపోయినట్టుంది.

"ఓ దొరసానీ! నువ్వే ముందు ఉండి మమ్మల్ని నిద్ర లేపే దానివి.. ఈ రోజు ఇంకా నిద్దరోతున్నావేవమ్మా! కమలినీ! ఓ కృష్ణప్రియా! లే లే!" పిలిచింది సురభి. ఆమె గది కిటికీ దగ్గరకి వెళ్ళి తట్టి చూసింది.

బయట నిలబడ్డ చెలులందరూ ఒకే సారి "కృష్ణా.. కృష్ణా!!" అని పిలిచారు. వెయ్యి వీణలు ఒక్క సారి మీటినట్టు, వెయ్యిమంది విలుకాళ్ళు ఒకే సారి బాణాలు వదిలితే అల్లెత్రాటి ఝుంకారాలు మిన్నంటినట్టూ వాళ్ళ గొంతులు మ్రోగాయి.

చలనం లేదామెలో! నిశ్చింతగా నిద్దరోతోంది.
"కమలినీ.. ఇంతలా పిలిచినా లేవట్లేదు! అదిగో మా కృష్ణ శబ్దాన్ని చెట్ల మీది ఏట్రింతలు అనుకరిస్తున్నాయి విను!!"
చెట్లమీది కాటుక పిట్టలు వాటి చిట్టి గొంతులిప్పి "కృష్ణా. కృష్ణా.. కృష్ణా.. " అని అరుస్తున్నాయి. ఒక పిట్ట అరుపు విని మరో పిట్ట అందుకుని కృష్ణ శబ్దం అలలు అలలుగా రేపల్లె మొత్తం మారుమ్రోగింది. ఆ శబ్దానికి ఇళ్ళలో నిద్ర లేచిన గొల్ల ఇల్లాళ్ళు, పక్కల్లో అప్పుడే నిద్ర లేచి కళ్ళు తెరవకుండానే ఒళ్ళు విరుచుకుంటూ బధ్ధకాలు తీర్చుకుంటున్న తమ పసి కందుల్ని నెమ్మదిగా తీసి, గుడ్డ ఉయ్యాళ్ళలో వేసారు. నిద్రలో వదులయిన చీర ముడి సరి చేసుకుని, విడిన కొప్పులు ముడుచుకుంటూ చంటి పాపాయిలకు ఊరు తెలవారక ముందే ఉగ్గు పట్టేందుకు సిధ్ధపడుతున్నారు.

"ఏట్రింతల మరో పేరు భరద్వాజ పక్షులు కదూ! భరద్వాజుడు భరతుడిని పరీక్షించినట్టు అవి నిన్ను పరిక్షిస్తున్నాయనుకుంటున్నావా?" ఆ కథ గుర్తొచ్చి నవ్వుకుంటూ అడిగింది ఆనందిని.
"భరద్వాజుడా..? భరతుడా..? చెప్పకుండానే నవ్వేసుకుంటున్నావే! చెప్పు ఆనందినీ.. ఇంకా సమయం ఉందిగా! ఆ మహరాణి లేచి రావాలిగా ఇంకా!" అడిగారు విష్ణుప్రియా, మేదిని.
"అమ్మాయిలూ, క అన భయం. కథ అంటారుగా!" నవ్వింది ఆనందిని.
"చెప్పవూ! భరతుడంటున్నావూ.. నువ్వు రామ కథలు మహగొప్పగా చెప్తావు కూడానూ!" ఇంటి అరుగు మీద కూర్చుంటూ అడిగింది సురభి.
"సరే తప్పేదేముంది! చెప్తాను వినండి." చెప్పడం ప్రారంభించింది ఆనందిని. చెక్కిట చేతులు చేర్చుకు కొందరూ, పక్క వాళ్ళ భుజం మీద చెయ్యాన్చి నిలబడి కొందరూ.. ఊ కొట్టేందుకు సిధ్ధమయ్యారు.

"ఉచక్షుడనే మునికి మమత అనే భార్య ఉండేది. ఆమెకి పుట్టిన వాడే భరద్వాజుడు. ఆయన సాక్షాత్తూ బృహస్పతికి ఔరసుడు. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ వేదాధ్యయనం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు భరద్వాజుడు. శతాయుః పురుషః అన్నారు కదా.. ఆ నిండూ నూరేళ్ళూ శ్రధ్ధగా వేదాధ్యనం చేసాడతడు. చదివిన చదువు తృప్తి కలిగించలేదు. ఇంకా చదవాలనుకున్నాడు. తన ఆయుష్షు అయిపోనుందని గమనించి ప్రజాపతిని మరో వందేళ్ళు వరమడిగాడు. "సరే"నన్నాడు ప్రజాపతి. ఆ రెండో వందేళ్ళూ అయినా భరద్వాజుడికి వేదాలు నేర్చుకునేందుకు సరిపోలేదట. మరో వందేళ్ళు అడిగి తెచ్చుకున్నాడు. మూడు వందలేళ్ళు పూర్తవుతూండగా ఇంకా సంతృప్తి చెందక మళ్ళీ వరమడిగాడు."
"ఊ.."
"అప్పుడు ప్రజాపతి భరద్వాజుడిని ఓ నాలుగు పేద్ద పర్వతాల దగ్గరికి తీసుకెళ్ళాడట."
"ఊ.."
"అప్పుడు ప్రజాపతి అన్నాడటా.. "భరద్వాజా..! ఇదిగో ఇవే వేద పర్వతాలు. మూడు వందల సంవత్సరాలు కఠోర దీక్షతో నువ్వు అధ్యయనం చేసిన వేదభాగం ఎంతో తెలుసా..?" అని మూడు పిడికిళ్ళ మట్టి తీసి పక్కన పెట్టాడట!"
"ఆ..!!!" ఆశ్చర్యం వారి కళ్ళని రెండింతలు చేస్తే, అందమేమో పదింతలయ్యింది.
"వేదం అనంతం. వేదాలు వర్ణించిన ఆ పరంజ్యోతి గొప్పతనంలాగే! ఎన్ని వేల సంవత్సరాలు నేర్చుకుంటే నీకు తృప్తి కలుగుతుంది కనుక! పో.. వెళ్ళి ఈ మూడు వందల ఏళ్ళు నువ్వు వేదాధ్యయనం వల్ల గడించిన తపోసంపద, శక్తీ వినియోగం చేసిరా! నీకు మోక్షమే!" అన్నాడట ప్రజాపతి.
సరే అని బయలుదేరిన భరద్వాజుడు లోకమంతా తిరిగాడట. అప్పటికే రాముడు తన ఇల్లాలినీ, అనుజుడినీ వెంటపెట్టుకుని అడవులకెళ్ళిపోయాడు.

"ఊ..!" రామ కథలోకి వచ్చేసామని ఆనందం, ఏమవుతుందో అని ఆత్రుత వాళ్ళ గొంతులో!
"భరద్వాజుడు నేరుగా నందిగ్రామానికి వెళ్ళాడు. అక్కడ 'రాముడు విడిచి వెళ్ళిన అయోధ్య.. దేముడు లేని కోవెలలాంటిదని', రామ పాదుకలకు పూజ చేస్తూ, వనవాస వ్రతాన్ని తానూ చేపట్టి ఓ కుటీరంలో ఉన్నాడు భరతుడు."
"ఊ.."
"భరద్వాజుడు వెళ్ళి భరతుడిని అడిగాడటా.. "ఏవయ్యా, మీ అన్న అడవులకెళ్ళాడు కదా! నువ్వు రాజ్యమేలకుండా ఇలా నార బట్టలు కట్టుకుని, జడలు కట్టిన కేశాలతో, కాయా కసరూ తింటూ ఈ కారడవిలో ఉన్నావేం?" అని."
"వాళ్ళమ్మదే పన్నాగమంతా.. పాపం బిడ్డ అమాయకుడే!" తీర్పు ఇచ్చి భరతుడిని వెనకేసుకొచ్చారు  గొల్లపిల్లలంతా.
"ఊ.. మరే! "రామన్న లేని అయోధ్య జీవుడు లేని శరీరం కదా!" అందుకే విడిచిపెట్టానన్నాడు భరతుడు. భరద్వాజుడికి భరతుడి మాటల మీద నమ్మకం కుదర లేదు. నిజంగానే అన్న మీద ప్రేమా? లోకానికి వెరచి రాజ్యం ఏలట్లేదా? అని అనుమానమొచ్చింది."
"ఛ ఛా.. పాపం భరతుడికి అలాంటివి తెలియదు." తమకు తెలుసన్నట్టు చెప్పారు.
"అవునులే! మరి నిజం నిగ్గు తేలాలిగా! అప్పుడు భరద్వాజుడు తన అపార తపశ్శక్తితో ఆ అడవిలోనే ఓ బ్రహ్మాండమైన రాజ్యాన్ని  మణిమయ భవంతులతోనూ, అన్ని హంగులతోనూ నిర్మించి భరతుడితో చెప్పాడట. "నీ భ్రాతృ ప్రేమ కి మెచ్చి ఈ నగరం నీకు కానుక ఇస్తున్నాను. అయోధ్యకైతే వెళ్ళలేవు కానీ, ఈ రాజ్యాన్ని ఏలుకో. రాచబిడ్డవి అడవుల్లో కష్టపడడం నేనే చూడలేకపోతున్నాను." అన్నాడట.
"ఊ..!!"
"ముని వాక్యాన్ని కాదనకుడదు కదా! అందుకని భరతుడు ఆ రాజ్యంలో ప్రవేశించాడు"
"నిజమా!!" అపనమ్మకం.. పాలు నల్లగా ఉంటాయంటే నమ్మగలమా?
"ఊ.. పెద్దల మాట కొట్టివేయడం మహా పాపం! అందుకని భరతుడు ఆ రాజ సభలో ప్రవేశించి, సింహాసనం మీద రామ పాదుకలు ఉంచి పక్కన నిలబడి వింజామర వీస్తూ, కళ్ళంట నీటి ధారలు కారిపోతూ ఉండగా అలా నిలబడిపోయాడట. భరతుడు అచ్చం రాముడిలాగే ఉంటాడట!  అతని కళ్ళలో నీళ్ళు చూసి భరద్వాజుని గుండె కరిగిపోయిందట!!"
కళ్ళ నీళ్ళు బొటబొటా కార్చేస్తూ.. "ఊ.." అన్నారు అందరూ.
"తన అంచనా తప్పనందుకు పరమానంద భరితుడైన భరద్వాజుడు రెండు చేతులతోనూ భరతుడి భుజాలు పట్టుకుని "తండ్రీ! నా శక్తి ని ధారపోసి మరీ నిన్ను పరీక్షించాను. నీ రామ భక్తి ఇంత గొప్పదని లోకానికి చాటాను. మూడువందలేళ్ళు కూడబెట్టిన నా శక్తికి ఇంతకంటే సార్ధకత మరొకటి ఉండదు. రామానుజులను మించిన తమ్ములు వేరొకరికి ఉండరు! భగవంతుని కంటే భాగవతులను అంటే నీలాంటి భక్తులను కళ్ళారా చూడడమే గొప్ప అదృష్టం! " అని పొగిడి వెళ్ళిపోయాడట!"
"ఊ.."
"అలాంటి భరద్వాజుడి పేరు పెట్టుకుని ఆ భరద్వాజ పక్షులు తెల్లవారకుండానే కూసి,  వ్రతం పట్ల ఉన్న మన భక్తిని పరీక్షిస్తున్నాయని అనుకుంటున్నావా? అని కమలినిని అడిగాను."
"నిజంగానే తెల్లవారబోతోంది కానీ, ఈరోజు ఏటిరింతలు మంచి కథే వినిపించాయి." అంది సురభి.
"ఆ విషయం లోపల ఉన్న ఆయమ్మకి తెలియాలి కదా!"
"కమలినీ! వింటున్నావా.. మేమూ, ఏట్రింతలే కాదు రేపల్లెంతా నిద్ర లేచింది."

"కమలినీ! రోజూ నువ్వే ముందు ఉండే దానివి. ఈ రోజేంటి వింతగా నువ్వే నిద్రపోతున్నావా? అదిగో! దధి చిలకడానికి తరుణులందరూ సిధ్ధమయినట్టున్నారు! పాల సంద్రంలో మంధరపర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి ని తాడుగా చేసి ఆనాడు అమృతమథనం జరిపినట్టు, పెరుగు చిలికి వెన్న తీయడానికి సిధ్ధపడుతున్నారు. లే.. లే!"

"అదిగో విన్నావా! వాళ్ళ మెడలో కాసుల పేర్లు, పట్టెడలూ ఒకదానికొకటి ఒరుసుకుని గలగలా శబ్దం చేస్తున్నాయి. దధిమథనం మన గొల్లవారికి దేవతార్చనతో సమానం కదా! అందుకని ఉదయాన్నే స్నానం చేసి పువ్వులు అలంకరించుకుని మరీ పెరుగు తరిచే పనిలో ఉన్నారు. తెల్లగా గట్టిగా రాయిలా ఉన్న పెరుగు చిలకడానికి వాళ్ళు బలమంతా ఉపయోగించి అవస్థ పడుతూ ఉంటే, వాళ్ళ జుత్తు ముడి ఊడిపోతోంది. వాళ్ళ కొప్పుల్లో ఉన్న పువ్వుల సువాసన ఊరంతా ఘుమ్మని వ్యాపిస్తోంది. నీకు తెలియడం లేదా! "

కమలిని నెమ్మదిగా కదులుతోంది. ఎక్కడో లీలగా వినిపిస్తున్న మాటలు! నిన్న వకుళని నిద్ర లేపిన విషయం గుర్తొచ్చింది. అలా తనకూ ఏవైనా కథలు చెప్తారేమో అని కళ్ళు మూసుకునే వింటోంది.

"అమ్మడూ! కమలినీ! నారాయణా.. కేశవా.. అని గోవిందనామాలు పాడుతూ చల్ల చేస్తున్నారు అందరూ! విను విను.."
"కేశి అనే రాక్షసుడిని చంపిన వాడా!! అందమైన కేశ సంపద గలవాడా!! అని కన్నయ్యని పొగుడుతున్నారు విను!"
"కన్నయ్యని పొగిడితే లేవవా! సరే! నిన్ను పొగుడుతాం విను!" అని నవ్వుతూ చెప్తోంది సురభి.

"నువ్వే మా బృందానికి శోభ నిచ్చేదానివి. నువ్వు లేకపోతే చిన్నబోయినట్టుంది, బంగారూ! నిత్యం "కృష్ణా కృష్ణా" అని జపం చేస్తూ ఏడు నలుగులూ పెట్టుకుంటావు కాబోలు! గులాబిరేకుల్లో నిద్దరోతావేమో! పాల మీగడ తప్ప వేరేది తినవేమో! వెన్నెల తాగిన వన్నెలాడీ! లే.. లే! నీ శరీరపు వన్నె ఎంత అందమైనదనుకున్నావూ..? నువ్వు కన్నయ్య పక్కన  నిలబడితే, మెరుపుతో కల్సిన మేఘంలా కన్నయ్య మరింత వెలుగులు చిమ్ముతాడు. తేజోరాశివి! చక్కదనాల చుక్కవి! రా బయటికి! లేచి తలుపు తెరు! భరద్వాజుడు భరతుడిని చూసి పొందిన పుణ్యం, మేము నిన్ను చూసి మూట కట్టుకుంటాం! నీలా కన్నయ్యని కొలిచేదెవరని!?"
"హు.. ఈ రాణీ గారికి కూడా పాట పాడాలి కాబోలు! నిన్న వకుళకి తనే మేలుకొలుపు పాడింది. ఈ రోజు మనం పాడక తప్పదు." చెప్పింది మేదిని.

చెలుల పొగడ్తలకూ, కన్నయ్య పక్కన తనని ఊహించుకుని మెచ్చుకున్నందుకూ ఉబ్బితబ్బిబ్బై లేచి కూర్చుని, పాట విందామని చప్పుడు చెయ్యకుండా ఎదురుచూస్తోంది కమలిని. గొంతు సరి చేసుకుని, వేయి వీణలు ఒకేసారి మ్రోగినట్టు  "సింహేంద్రమధ్యమ రాగం"లో మేలుకొలుపు పలుకుతున్నారు బయట నుంచి.

వినలేదటే వెర్రి జవరాలా!
వినియె హాయిగ పవళించేవటే!
తనితనిగ తెలవారెనని కీచుకీచుమని
మునుమునుగ ఏటిరింతలు మూగి పలికెను.

ఘల్లుమనగా కంఠసరులు కాసులపేర్లు,
జల్లగా కడల క్రొమ్ముడులు వాసనలు
గొల్ల ఇల్లాండ్రు తరిగోలలను కైకొనుచు
పెల్లుగా చల్ల తరిచే సవ్వడి

హరిని నారాయణుని కైవారముల మేము
ఆలపించిన ఆలకించనే లేదటే
దొరసాని! వౌరౌర ఓ బాల లేచి,
తెరవవే వాకిలి! ఓసి తేజోవతీ!

మెల్లిగా తలుపు తీసి "హరి..హరీ!" అంటూ చెలులను చూసి నవ్వింది కమలిని. ఆమె చిగురు పెదవులు పలికిన హరినామానికి వాళ్ళందరి ముఖాలూ వికసించాయి. స్నానమాడి, "కాత్యాయని"ని కొలిచేందుకు యమున వైపు .. లేళ్ళ మంద నీళ్ళు తాగడానికి కదిలినట్టు అందరూ గబగబా అడుగులు వేసారు.


* ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..



( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)