Thursday, December 22, 2011

చాలులే పవళింపులు! - కాత్యాయనీ వ్రతం - 8

నిశి కట్టుకొచ్చిన చుక్కల కుట్టుపువ్వుల చీరని కళ్ళింతలు చేసుకుని మరీ చూస్తూ, ముచ్చట పడుతూ  నెమ్మదిగా కదులుతోంది యమున. ఉండుండి తరగల కబుర్లతో ఆరాలు తీస్తోంది.

ఆ ఇంట్లో ఒక గోపి నిద్దుర దుప్పటిలో ముడుచుకుని కలలు కంటోంది. ఆ కలనిండా పువ్వులే పువ్వులు! మాలతీ మాధవాలు, ఆకు సంపెంగలు, మల్లెలు, మొల్లలు, పొగడలు, పారిజాతాలు, కెంపుల చామంతులు, కేతకీ సౌరభాలూ .. ఒకటా రెండా.. వేల రకాల పువ్వులు ఘుమ్ముఘుమ్మని మత్తెక్కిస్తున్న పూలవనంలో.. తిన్నెలు జాజులతోనూ, దారులు గులాబీలతోనూ, తటాకాలు కలువ చెలువలతోనూ నిండి పరిమళిస్తున్నాయి. తుమ్మెదలు ఝుంఝుమ్మని రొద చేస్తూ తేనెలు తాగి, మత్తెక్కి సొక్కి సోలిపోయి, పూబోడుల కౌగిళ్ళలో వాలి నిద్దరోతున్నాయి. మరి తన కౌగిలి లోనో! తన కౌగిట్లో ఒరిగిన మోహన కృష్ణుడు తెల్ల సంపెంగల తిన్నె మీద నీలాలు రాశి పోసినట్టు ధగధగా మెరుస్తున్నాడు!! తన తామరతూళ్ళ చేతులతో ఎంత బంధిస్తే, అంత దగ్గరగా ఒదిగిపోతున్నాడు. 'ఏ చెలి పిలుపు వినిపిస్తే పట్టువిడిపించుకు ఎక్కడ వెళ్ళిపోతాడో!' అని బెంగతో కౌగిలి ఇంకా బిగించేస్తోంది తను. చెలియలొస్తారు. తలుపు తడతారు. కృష్ణుడిని చూస్తే!!  తను అనుభవిస్తున్న మహదైశ్వర్యంలో వాటా అడుగుతారే! ఎలా..? రావద్దని ఎలా చెప్పడం.. ? ఈ రేయిని కరగనివ్వకని ఆకాశాన్ని ఎలా బతిమాలుకోవడం!

"విష్ణుప్రియా.. కృష్ణ వల్లభా! తెల్లవారబోతోంది లే లే!"
అదిగో.. వచ్చేసారు. కళ్ళు బిగించి నిద్దరోతే!!
"ఈ రోజు నీ వంతా అమ్మాయీ!? అందరి కంటే ముందే నిద్రలేచి, సుగంధాలు విరజిమ్మే పుష్పాలతో పూలసజ్జ నింపుకుని పూవయారిలా నడిచొచ్చే దానివి! కబుర్ల గలగలలతో యమున చిన్నబోయేలా సందడి చేసే దానివి! ఓ భామా! లే లే!"

సమాధానం చెప్పకుండా కనురెప్పలు బిగించింది విష్ణుప్రియ. ఆమె నిద్రపోతున్న తల్పం పక్కనే ఉన్న కిటికీ లోంచి, బయట నిలబడి మేలుకొలుపుతున్న తన నేస్తాల మాటలు సుస్పష్టంగా వినబడుతున్నాయి. నిద్రపోయే వాళ్ళని మేలుకొలపగలం కానీ, నిద్ర నటించే వారిని లొంగదీయడం ఎవరి తరం! స్వప్నసౌధపు మెట్లు దిగనని మొండిపట్టు పట్టిందా అమ్మడు. ఈ రోజు ఆమెది! మేలుకొలిపి స్నానానికి తీసుకెళ్ళే బాధ్యత చెలులది.

విష్ణుప్రియ నిజంగానే కృష్ణ వల్లభ! కులుకూ, అలకా ఎరిగిన జాణ. ఆమెకు పువ్వులంటే ఎంత ఇష్టమో, ప్రతి పువ్వులోనూ ఆమెకి కనిపించే కన్నయ్య నవ్వులంటే అంత కంటే ప్రాణం! బృందావనిని పోలిన పువ్వులతోట ఆమె ఇంటిచుట్టూ పెంచుకుంది. ఆ తోటలో లేని పువ్వు లేదు! వేసవిలో మల్లెలవనం. వానాకాలం గుమ్మెత్తే చంపక సుమాల సౌరభాలు.. శరత్తు వచ్చేసరికి చామంతులు.. హేమంతాన్ని పలకరించే గులాబీలు.. నిత్యమల్లెలా కుసుమించే తమ దొరసానికి తోడుండే పారిజాతాలూ, పొగడలూ, జాజులూ, మాలతీమాధవాలూ.. అన్నీ మురళీ మనోహరుని కోసం విరిసి ఎదురుచూస్తూ ఉంటాయి.

ఆ పూలవనంలో అప్పుడే విరిసిన గులాబిబాలల్లా గోపకాంతలు లోపల నిద్రపోతున్న తమ నెచ్చెలి కోసం ఎదురుచూస్తున్నారు. లోపల కృష్ణ స్వామిని కౌగిట చేర్చుకుని, కలలోంచి ఇలపైకి దిగిరానని పట్టు పట్టి సోయగాల మాలికలా పడక మీద ఉన్న ఆమె!

బయట నుంచి మేదిని చెప్తోంది. "ఇదిగో! చూడు తూరుపు దిక్కున వెలుగు రేఖలు పొడచూపుతున్నాయి. మంచుకి తడిసిన బిరుసైన గడ్డిని మేసేందుకు గేదెల మంద వెళ్ళింది. నల్లగా నిశిరాత్రి కదిలి వెళ్తున్నట్టు ఆ ఎనుములు వెళ్తున్నాయి చూడు!"
సమాధానమివ్వలేదు విష్ణుప్రియ.
"ఓ విష్ణుప్రియా! నువ్వింకా తెల్లారబోవడం లేదనుకుంటున్నావేమో! మన చెలియలందరూ యమున ఒడ్డుకు వెళ్ళిపోయారు. నువ్వింకా రాలేదని ఇంకొంతమందిని వెంటపెట్టుకుని, నిన్ను లేపుదామని వెనక్కి వచ్చాను. నవరత్నాల ఉంగరంలో ఏ ఒక్క మణి లేకపోయినా దానికి నిండు ఉంటుందా! నువ్వు లేని మన జట్టూ అంతే! లేచి రావమ్మా!"
"ఊహూ.. లేవను. సగం మంది వెళ్ళిపోయాక గుర్తొచ్చానా నేను..?! హు..!" కళ్ళు ముసుకునే కినుకగా పెదవి కొరుక్కుంది విష్ణుప్రియ.
"విష్ణుప్రియా, నువ్వు నిజంగానే మాలో మేటి గోపికవు. నిన్ను ముందు నిలబెట్టుకుని వెళ్తేనే కన్నయ్య మమ్మల్ని చూస్తాడు. అంత గొప్పదానివి నువ్వు! నువ్వు అల్లే మాలలే కదూ! ఆయన నిత్యం తన మెడలో వేసుకునేదీ! లే లే! నువ్వు లేచి వచ్చి, నీ తోటలో పువ్వులు తెచ్చి, మాలలు అల్లితే కానీ, మన వ్రతం ఎలా పూర్తవుతుంది చెప్పు!"
"ఊ.. అలా రండి దారికి."
"నీకూ కథలు చెప్పాలా! సురభి లేదే! ఆనందిని లేదే! నాకేమో పెద్ద పెద్ద వేదాంత విషయాలేవీ తెలియదాయె!కన్నయ్య చిన్ననాటి లీలలూ నేను చూడలేదు. నీలాగా నేనూ విన్నానంతే!" అని వాపోయింది మేదిని.
"మనకు తెలిసినవే చెప్దాం లే, మేదినీ..!" అని ధైర్యం చెప్పింది పక్కన ఉన్న తరళ.
"హ్మ్.. విష్ణుప్రియా.. నిన్ను నిద్ర లేపి తీసుకొస్తామని, పెద్ద బాధ్యత భుజాల మీద వేసుకుని వచ్చాం. వేళ మించిపోతే కష్టం! అయినా నాకు తెలియక అడుగుతున్నానూ! "చలి" అన్నది ఎరుగని పిల్లవి. రోజూ స్నానానికి యమునలో తొలిగా కాలుపెట్టి దిగేది నువ్వే! 'విరహంలో ఎంత మరిగి ఉన్నావో!' అని నిన్ను, నీ తాపాన్నీ చూసి చెలులందరూ గుసగుసలాడుకుని నవ్వేవారు కదూ! అలాంటిది నువ్వే చలికి ముడుచుకుని నిద్రపోతున్నావంటే నమ్మశక్యంగా లేదు. కేశిని చంపడానికి గోపాలకులు వారిస్తున్నా, కన్నయ్య ముందుకు దూకినట్టు నువ్వూ స్నానానికి ఉరకలు వేసే దానివి!"

సిగ్గుగా నవ్వుకుని, చిన్నగా కదిలి వినసాగింది విష్ణుప్రియ!
"సరే! కథ చెప్తే కానీ నిద్ర లేవకపొవడం ఆనవాయితీ అయిపోయింది కదా! నాకు తోచినట్టు చెప్తున్నాను. ఈ కథ అయ్యేసరికి నిద్ర లేచి వచ్చి మా మాట దక్కించు!"
"సరే, చెప్పండన్నట్టు" గాజులు గలగల్లాడించింది లోపలనుండి.
సంకేతాన్నదుకున్నట్టు సంబరపడి, తనకు తోచిన విధంగా కథ చెప్పనారంభించింది మేదిని. కృష్ణ లీలలు ఎవరు ఎలా చెప్పినా వినదగినవే!
"కన్నయ్య తన స్నేహితులతో కలిసి ఆవుల మంద వెనుక వెళ్ళి అడవిలో తిరుగుతున్నాడట. కంసునిచే పంపబడిన 'కేశి' అనే రాక్షసుడు ఓ పొగరెక్కిన అడవిగుర్రం రూపంలో కన్నయ్య ఉన్న చోటికి వచ్చాడట. పశువులన్నీ కడుపు నిండా గడ్డి మేసి, నీళ్ళు తాగి, చెట్ల నీడలలో పడుకుని నెమరేస్తున్నాయట. కన్నయ్య తన స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ ఒక చెట్టు కింద కూర్చుని చల్ది మూటలు విప్పుకుని తింటున్నాడట. దూరంగా నీళ్ళ మడుగు దగ్గర అలికిడై, వెళ్ళి చూసి వద్దామని నడిచిన గోపాలకుడొకడికి.. తన ముందు కాళ్ళు ఎత్తి పశువులని తన్ని చంపేస్తున్న ఈ అడవి గుర్రం కనిపించిందిట!! పరుగున అందరూ వెళ్ళి చూసేసరికి కనిపించిన పశువుని కనిపించినట్టు మట్టికరిపిస్తోందట ఆ గుర్రం! దాని నోటి నుండి అగ్ని జ్వాలలు వెదజల్లుతోంది! అది సకిలిస్తూ ఉంటే వినేవాళ్ళ గుండెలు అవిసిపోతున్నాయట. అలా నోరులేని జీవాలని పొట్టన పెట్టుకుంటున్న ఆ పొగరుబోతు గుర్రాన్ని లొంగదీసుకోడానికి, స్నేహితులంతా వద్దు వద్దంటున్నా వినిపించుకోకుండా సింహం లంఘించినట్టు ఉరికాడట కన్నయ్య! భీకరంగా సకిలిస్తూ, ముందు కాళ్ళు ఎత్తి దూకబోయిన ఆ కేశి ని ఒడుపుగా తప్పించుకుని, అ గుర్రం నోట్లో చెయ్యి పెట్టాడట కన్నయ్య!"
"ఆ!!"
"ఆ.. ! ఆ కేశి దవడలు పట్టుకు చీల్చి ప్రాణాలను హరించేసాడట!"
ఒక వైపు కృష్ణుడి విజయాన్ని విని సంతోషంగా ఉన్నా, మనసంతా భయంతో నిండి.. మరీ ముడుచుకుపోయింది లోపల ఉన్న విష్ణుప్రియ!
"అంతేనా! కృష్ణుడి శౌర్యమంటే చాణూర ముష్టికులనే మల్లులను జయించినప్పుడే చూడాలి! బలరామ కృష్ణులిద్దరినీ మధురాపురికి పిలిపించిన కంసరాజు, చాణూరుడు, ముష్టికుడు అనే ఇద్దరు మహా బలవంతులైన మల్లులని పంపించాడట. రాచవీధిలో మదపుటేనుగుల్లా తమకు అడ్డుపడిన ఆ మల్లులిద్దరినీ, సింహాలు వాటి కుంభస్థలం మీదికి లంఘించి చంపినట్టు.. తమ అజేయమైన శౌర్యపరాక్రమాలతో చంపేసారట బలరామ కృష్ణులు!"

విష్ణుప్రియ మనసంతా కన్నయ్య మీద చెప్పలేనంత బెంగతో నిండిపోయింది. ఆతని సుందర దేహం గుర్తొచ్చింది. "చిన్నప్పటి నుంచీ ఆ యశోదమ్మ మొత్తుకుంటూనే ఉంది.. 'కన్నా.. దుడుకు పనులు వద్దూ..!' అని వింటేనా..? అపాయంతో చెలగాటమాడడం కన్నయ్యకి అలవాటయిపోయింది. గెలిచేది తానే అయినా ఆ చేతులు ఎంత కందిపోయి ఉంటాయో! ఆ భుజాలు ఎంత నొప్పెట్టి ఉంటాయో!" ముఖమంతా అలుముకున్న బాధతో వడిలిన కమలంలా ఉంది విష్ణుప్రియ.

చానా లేవే చాలే పవళింపులు
చానా లేవే చాలులే పవళింపులు
ఔనే అచట చెలులనాపి వచ్చేమే
పూని నోము స్నానమాడ వలచేదాన

అల్లదే చూడవే! తూరుపు
తెల్లవారెనె, ఎనుము కదుపులు
మెల్లగా తరలెనే! మంచున
తడియు పచ్చిక బీళ్ళ మేయగ!

చేరి వాద్యముల కైవారముల కావింప
కూరిమితో దేవదేవుడు కృపను మనపై చూపునే!
వారువము వలె వచ్చు రక్కసు
నోరు చీరినవాని వేడగ
క్రూర చాణూరాది మల్లుల
బీరమడచిన వాని పాడగ!

చానా లేవే చాలు పవళింపులు

విష్ణుప్రియ మనసు కాస్త కుదుట పడింది. వీనులవిందైన "నీలాంబరి" రాగానికి కళ్ళు తెరచుకోవాలనే ప్రయత్నం చెయ్యాలనిపిస్తోంది. ఈలోగా బయట ఆనందిని మాటలు వినిపించాయి!

"ఏం? ఆ ముద్దరాలింకా నిద్రలేవలేదా..!!  మీరేం చేస్తున్నారు బయట!?"
"ఏం చేస్తున్నామేమిటి? 'కృష్ణ కృష్ణా!' అన్నాం.. అదిగో గేదెలు నిద్ర లేచాయ్ చూడమన్నాం.. గుర్రాన్ని చీల్చి చంపిన కన్నయ్య కథ చెప్పాం!" చెప్పింది మేదిని.
"చాణూరాది మల్లుల సంహారం కూడా! పాట కూడా పాడాం." ఇచ్చిన పనిని చేసామని నమ్మకంగా చెప్పింది తరళ.
"ఏవిటేవిటీ!!! సుమసుకుమారమైన మనసున్న ఆ జవరాలికి మేలుకొలుపులు ఇలా పాడారా? మంచి వాళ్ళే!! ఆవులు నిద్ర లేచాయి. కాటుక పిట్టలు కూసాయి. అంటే అందం! కానీ ఉదయాన్నేఎనుముకదుపుల గురించా చెప్పేదీ!" బుగ్గలు నొక్కుకుంటూ అడిగింది ఆనందిని.
బిక్కమొహాలేసారు మేదినీ, తరళా.. వాళ్ళకి సాయం ఉన్న ఇంకొంతమంది. పున్నాగపువ్వులు చిన్నపోయినట్టున్న వాళ్ళ వాలకం చూసి నవ్వొచ్చింది.. జాలేసింది ఆనందినికి.
"సర్లేండి! అసుర సంహారం ఇప్పుడు కన్నయ్యకీ తప్పలేదు. అప్పుడు రామయ్యకీ తప్పలేదు. మీరేం చేస్తారు? వాళ్ళ కథలన్నీ రక్కసి మూకని చంపడమే అయితేనూ..!" సాంత్వన పలికింది.
"హమ్మయ్య!" అనుకున్నారు అందరూ.
"కృష్ణుడు రేపల్లెకి వచ్చిన రాక్షసులను మట్టి కరిపించినట్టే ఆనాడు రాముడూను..." ఓ అందమైన రామకథ చెప్పనారంభించింది ఆనందిని.

"వనవాసానికి బయలుదేరిన రామచంద్రుడు సీతమ్మతోనూ, లక్ష్మణుడితోనూ కలిసి జనస్థానం చేరుకున్నాడట. అక్కడ ఓ అందమైన కుటీరం నిర్మించుకుని ఉండసాగారు. ఈలోగా అక్కడ ఉండే మునులంతా వచ్చి, రామయ్యని చూసి తమ జపతపాలకు భంగం కలిగిస్తున్న రక్కసిమూక గురించి మొరపెట్టుకున్నారట."
"ఊ.."
"అయ్యో! మీరు చెప్పకుండానే మీరెలా ఉన్నారో, మీకే కష్టాలున్నాయో కనుక్కోవలసిన బాధ్యత నాదీ! మీరు నిశ్చింతగా వెళ్ళండి. నేనున్నాను కదా!" అని అభయమిచ్చాడట. వాళ్ళు వెళ్ళాక సీత అందటా.. "ఏదో కుటీరం వేసుకుని కాయాకసరూ తింటూ పద్నాలుగేళ్ళూ గడిపేయకుండా.. ఏవండీ.. ఇక్కడికొచ్చినా రాచకార్యాలు తప్పవా? రాక్షస వధ తప్పదా? అని."
"అవునా!!"
"ఊ.. ఆవిడకీ మనకున్నట్టే బెంగ ఉంటుంది కదా! రాజ్యాలేలే రాజైనా తల్లికి బిడ్డే.. ఆలికి మగడే!"
తమ మనసుల్లో కన్నయ్య దూకుడు గురించి ఉన్న బెంగలన్నింటికీ ఊతం దొరికిందని సంతోషించారందరూ.
"అప్పుడు రాముడన్నాడట.. "నిన్నైనా విడిచిపెడతాను, తమ్ముడినైనా విడిచిపెడతాను.. మునులకు ఇచ్చిన మాట మాత్రం విడిచిపెట్టనూ.." అని చెప్పి విల్లందుకుని అడవిలోకి వెళ్ళిపోయాడట."
"రూపం బహు సుందరమే కానీ, మాట మహ కచ్చితం! ఇద్దరూ ఒక్కరేగా!!" అంది మేదిని.
"హ్హహ్హహా.. మరే! అలా అడవిలోకి వెళ్ళిన రామభద్రుడు పద్నాలుగు వేల పద్నాలుగు మంది రాక్షసులను చంపి.. ఆక్షరున ఖరుడనే రాక్షసుడిని చంపి ఇంటికొచ్చాడట."
"హమ్మయ్యో! పద్నాలుగు వేల మందే!!" నోరు వెళ్ళవెట్టింది తరళ.
"రామయ్యకి విల్లైనా ఉంది. ఈ దుడుకు కన్నయ్యో!! కాలితోనూ, చేతితోనూ, నోట్లో దూరీ, నెత్తెక్కి నాట్యం చేసీ.. " వాపోయింది మేదిని.
"హ్హహ్హహ్హహా.. భలే వారే అమ్మాయిలూ! చీకటిని పారద్రోలడమే వెలుగు లక్షణం! అప్పుడు ఇంటికొచ్చిన రఘువీరుడిని చూసి సీతమ్మ ఏం చేసిందో తెలుసా!?"
"ఆ.."
"త్వం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం!
భభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే!! "
"అర్ధం చెప్పు, బంగారుతల్లీ!"
"శత్రువులను హతమార్చి, మహర్షుల మనసులను రంజింపచేసి, వారికి సుఖాన్నొసగి ఇంటికి వచ్చిన తన పతిని చూసి, మనసు ఉప్పొంగి.. ఆ సీతాకాంత పరుగున వెళ్ళి గాఢంగా కౌగిలించుకుందట!!"
"భలే!!" ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టారు చెలియలందరూ..
"మరి రక్కసి గుంపును కాలరాసిన కృష్ణుడికి నీ కౌగిలి ఇచ్చి అభినందించాలి కదూ, విష్ణుప్రియా! రా బయటికి! వ్రతం పూర్తి చేసుకుని కన్నయ్యని కొంగున కట్టేసుకోవద్దూ!" ఊరించింది.
ఒక్క అంగలో వచ్చి తలుపు తెరిచి, సిగ్గులు చిందిస్తూ నవ్వేసింది విష్ణుప్రియ. గాఢాలింగన సౌఖ్యమెరిగిన ప్రౌఢాంగన మరి!!
"హమ్మయ్య!! కలకలమని పక్షిగణములు పలికేను.. కల్యాణీ! స్నానానికి వేళయింది. "కాత్యాయని"ని కొలిచే సమయమయింది. పద పద!" యమున వైపు దారితీసింది ఆనందిని... వెనుకే చెలులందరూ!


*ఇంకొన్ని కబుర్లు రేపు ఉదయం..

( * ఆండాళ్ "తిరుప్పావై" పాశురాలకు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత.. )
(* ఆండాళ్ "తిరుప్పావై", బమ్మెర పోతనామాత్య ప్రణీత "శ్రీమదాంధ్ర భాగవతము", పిలకా గణపతి శాస్త్రి గారి "హరి వంశము" ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)


10 comments:

 1. "తెల్ల సంపెంగల తిన్నె మీద నీలాలు రాశి"

  ఎన్ని రకాలుగా వర్ణించినా ఇంకా ఏవేవో అందమైన పోలికలు మిగిలే ఉంటాయేమో - మీ భాషా మందసం లో అనిపిస్తుంది.

  ~లలిత

  ReplyDelete
 2. కూడలి లో ఇంకా ఈ పాశురం కనిపించట్లేదు. ఏంటబ్బా ఇవాళ్టి కబుర్లు మీరింకా మొదలు పెట్టనేలేదా అని నా ఆత్రం కొద్దీ మీ బ్లాగ్ కి వస్తే - దొరికేశాయి. ధన్యోస్మి....

  ~లలిత

  ReplyDelete
 3. అమ్మా ! దేవులపల్లి కొత్తావకాయా ... ఎక్కడున్నారమ్మా.. ! ఇంక్రెడిబులు మీరు ! అంతే !

  ReplyDelete
 4. హెమంతంలో కొత్త ఆవకాయ ఘాటు అత్యంత రుచికరం, అమొఘం...

  ReplyDelete
 5. @ లలిత: ధన్యోస్మి! ఈ మాట అనాల్సింది నేనండీ!

  @ Sujata: పొగడ్తలకేం కానీ, మీ బుజ్జమ్మకి దిష్టి తియ్యండి ముందు! భలే చూస్తోంది సుమండీ! :)ధన్యవాదాలండీ!

  @ Mohanavamshi: :) ధన్యవాదాలు!

  ReplyDelete
 6. "నిశి కట్టుకొచ్చిన చుక్కల కుట్టుపువ్వుల చీరని కళ్ళింతలు చేసుకుని మరీ చూస్తూ, ముచ్చట పడుతూ నెమ్మదిగా కదులుతోంది యమున. ఉండుండి తరగల కబుర్లతో ఆరాలు తీస్తోంది. "

  --హృదయం నిండిపోయింది. నాలుగేళ్ల క్రితం రేపల్లె పక్కన యమునా తటి పై కూర్చుని, బక్క చిక్కి శల్యమై,కాలుష్యపు నురగలతో ప్రవహిస్తున్న యమున చూసి నేను ఆహా ఇక్కడి నుంచే కదా, వసుదేవుని తల పైన బుట్టలో, వర్షపు రాత్రి కృష్ణుడు రేపల్లె చేరాడు.. అని పదే పదే అనుకున్నాను.

  ఈ పాశురాల మాట ఎలా ఉన్నా, (ఎలా ఏంటి? అవి అద్భుతం అనుకోండి..) యమున వర్ణనలు అద్భుతం!

  ReplyDelete
 7. అలాగే.. 'తెల్ల సంపెంగల తిన్నె పై నీలాల రాశి' - థాంక్స్!

  ReplyDelete
 8. "నిశి కట్టుకొచ్చిన చుక్కల కుట్టుపువ్వుల చీరని కళ్ళింతలు చేసుకుని మరీ చూస్తూ, ముచ్చట పడుతూ నెమ్మదిగా కదులుతోంది యమున."
  "తెల్ల సంపెంగల తిన్నె పై నీలాల రాశి"
  మాటల్లేవ్!!

  ReplyDelete
 9. >>నిశి కట్టుకొచ్చిన చుక్కల కుట్టుపువ్వుల చీరని కళ్ళింతలు చేసుకుని మరీ చూస్తూ, ముచ్చట పడుతూ నెమ్మదిగా కదులుతోంది యమున. ఉండుండి తరగల కబుర్లతో ఆరాలు తీస్తోంది.
  >>తెల్ల సంపెంగల తిన్నె మీద నీలాలు రాశి..

  రెండుమూడునెలలకోసారి టపా రాయడమే గగనమైపోతోంది నాకు. అలాంటిది రోజూ ఇంత మోహనంగా ఎలా రాస్తున్నారో అర్ధం కావట్లేదు. కుళ్లుకుందామన్నా మీ అందమైన పదాల అల్లిక మనసుని ఇంతలా ఆహ్లాదపరిచాక సాధ్యమయ్యేనా?..

  ReplyDelete
 10. తోట భలే వుంది...పూల సుగంధం నా చుట్టూతా..

  ReplyDelete