కౌముదిలో ప్రచురింపబడుతున్న "గాలిసంకెళ్ళు" పదమూడో భాగం ఇక్కడ..
Tuesday, December 31, 2013
Tuesday, December 17, 2013
రాజహంస - ౨
నేలపై పారాడుతూ వెతుకుతోంది ఇళై. ప్రాతస్సంధ్యావందనం పూర్తి చేసుకుని,
దేవతార్చన మందిరానికి అటుగా వెళ్తున్న కులశేఖరుడు కుమార్తెని చూసి ఆగాడు.
దీక్షగా మూలమూలలా వెతుకుతోందా అమ్మాయి.
"ఏం వెతుకుతున్నావమ్మా?"
లేచి నిలబడింది. ఇంకా ఆమె కళ్ళు నేలని వెతుకుతూనే ఉన్నాయి. కులశేఖరుడు ఆమెనే చూస్తున్నాడు.
"నిన్న సాయంత్రం రంగడికి బొమ్మల పెళ్ళి చేసి మేనా ఇలా తీసుకొచ్చాం నాన్నగారూ. పవళింపు వేళ చూద్దును కదా.. స్వామి తురాయి కనిపించలేదు. ఎక్కడ పడిపోయిందా అని నిన్నటి నుంచీ ఈ దారంతా వెతుకుతున్నాను."
"..."
"శ్రీరంగం నుంచి వచ్చిన భట్టరు గారిచ్చిన తురాయది. అక్కడ స్వామిని కల్యాణానికి అలాంటిదానితోనే ముస్తాబు చేస్తారట."
"అలాగా! అయ్యో.. వెతికిస్తాను తల్లీ. దొరుకుతుందిలే. లేదా శ్రీరంగం నుంచే మరొకటి తెప్పిద్దాం." అనునయంగా పలికాడు.
"మరొకటి తెచ్చినా అది భట్టరుగారిచ్చినది కాదుగా!" మోము చిన్నబుచ్చుకుంది.
మాట మార్చకపోతే పిల్ల బావురుమంటుందేమో అనిపించిందతనికి.
"అది సరే కానీ అమ్మా.. శ్రీరంగనాథుడి బొమ్మ గీస్తున్నావు కదా! పూర్తయిందా మరి?"
"ఓ.. మీ మందిరంలో పెట్టించనా?" ఉత్సాహంగా అడిగింది.
"తప్పకుండా.. కానీ బొమ్మ నాకు ఇచ్చేస్తే.. నీకు ఉండద్దూ?" ముచ్చటగా చూసుకున్నాడు బిడ్డని.
"నాకు బొమ్మెందుకు? రంగడే కావాలి."
ఉలిక్కిపడ్డాడు. ఇళై కళ్ళు నిర్మలంగా తననే చూస్తున్నాయి.
తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం
రాఘవోర్హతి వైదేహీం తంచేయమసితేక్షణా
సౌశీల్యం, సౌందర్యం, నడత, కులము.. అన్నిటా రాఘవునకు తగినది వైదేహి మాత్రమే! ఇళై కనిపించలేదు ఆతని కళ్ళకి.. ఆ క్షణాన తను జనక మహరాజైపోయాడు.
దేవతార్చనవేళని సూచించే తూర్యనాదాలు కులశేఖరుని మైమరపుని చెదరగొట్టాయి.
***
"దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా.."
మేఘగంభీరంగా పలుకుతోంది కులశేఖరమహరాజు కంఠం. ముమ్మారు చప్పట్లు కొట్టి దేవతామూర్తులున్న కోయిలాళ్వార్ తలుపులు నెమ్మదిగా తెరిచాడు. చేతులు జోడించి, దీపకాంతిలో జాజ్వల్యమానంగా వెలుగుతున్న సీతారామలక్ష్మణులని తేరిపార చూసుకున్నాడు. క్షణకాలం అతని కనుబొమలు ముడివడ్డాయి. క్షణకాలం మాత్రమే..
"నవరత్నమాల కనిపించడం లేదా!!" అమాత్యులు ఆశ్చర్యంగా మొహాలు చూసుకున్నారు.
"రాముని మెడలో ఆభరణం కనిపించకపోవడమే చిత్రంగా ఉంది!"
"నెమ్మదిగా అంటారేం మహారాజా! ఘోరాపచారం.. ఎలా జరిగి ఉంటుందా అని."
"ఇదేదో మాయలా ఉంది." నిట్టూర్చాడు కులశేఖరుడు.
"మాయా మంత్రమూ కాదు. ఎవరో ఇంటిదొంగల పనే!" ముక్తకంఠంతో చెప్పారు మంత్రులు.
"ఇంటిదొంగలా!!"
"అవును మహాప్రభూ.. చెప్తే మీరు కోపగించుకుంటారు కానీ.. అడ్డూ అదుపూ లేకుండా వచ్చిపోయేవారిలో ఎవరో.."
"రామచంద్రప్రభో!" చెవులు మూసుకున్నాడు కులశేఖరుడు.
"రామ రామ!! ఎంత పొరబడ్డారు. ప్రాయశ్చిత్తం లేని పాపం సుమా నిర్దోషులని అనుమానించడం!" అతని గొంతులో ఆవేదన.
"లేదు
మహారాజా.. మా మాట నిజమని నిరూపిస్తాం.. రాజమందిరంలో విడిది చేసిన
భాగవతులని సోదా చేస్తే విషయం బయటపడుతుంది." మంత్రులు గట్టిగా చెప్పారు.
క్షణాల్లో బిలబిలమంటూ వచ్చిన సైనికులు స్వాములని చుట్టుముట్టి రాజు ఎదుట నిలిపారు.
"ఇదిగో ఈ దొంగస్వాముల మూటలో దొరికింది ప్రభూ!" సేనాధిపతి చేతిలో నవరత్నమాల!
"ప్రభో! మాకే పాపం తెలియదు. కులశేఖర పెరుమాళ్.. న్యాయం కాదిది!" స్వాములు ఆక్రోశించారు.
"కళ్ళకి కనిపిస్తున్న నిజాన్ని కాదని ఎలా బుకాయిస్తారు?" మంత్రులు అక్కసుగా అడిగారు.
కులశేఖరుడు సాలోచనగా మంత్రుల వైపు చూశాడు.
"కళ్ళకి కనిపించేదంతా నిజం కాదని నేను నిరూపిస్తాను." క్షణకాలం యోచించి స్థిరంగా చెప్పాడు.
***
రాజాజ్ఞ మేరకు ఓ కుండ, బుసలు కొట్టే ఓ కోడెనాగు తెప్పించబడ్డాయి. పాములవాడు ఆ కుండలో నాగుని విడిచిపెట్టి వాసెన కట్టాడు. మంత్రులు ముఖాలు చూసుకున్నారు.
"భాగవతులు నేరం చెయ్యరని రామచంద్రప్రభువు పాదాల సాక్షిగా నమ్ముతున్నాను. నా నమ్మకం అబధ్ధమైతే... ఈ నాగు కాటు వేస్తుంది." ప్రకటించాడు కులశేఖరుడు.
మంత్రులు గుసగుసలాడుకున్నారు. కాలనాగు కాటువేయక ఏం చేస్తుందిలే అని నవ్వుకున్నారు. స్వాములవైపు గేలిగా చూశారు. ఇంతలో హాహాకారాలు మిన్నంటాయి.
కులశేఖర మహరాజు ఆ కుండకి ఉన్న గుడ్డ విప్పి చెయ్యి పెట్టాడు!
ఆయన పెదవులు రామనామం పలుకుతున్నాయి. ముఖం ప్రశాంతంగా ఉంది. క్షణాలు గడుస్తున్నాయి. మంత్రులు జావకారిపోతున్నారు.
మణికంకణ శింజితం వినిపించేంత నిశబ్దం. కుండలో నుండి చెయ్యి బయటకు తీశాడు. పరమాశ్చర్యం.. పాము కాటు వెయ్యలేదు! మంత్రుల శిరస్సులు వాలిపోయాయి.
కులశేఖరుడు స్వాముల వైపు తిరిగి చేతులు జోడించాడు.
"అపచారానికి మన్నించండి. రాముని బంటుల బంటుల పరిచారకుల బంటులకి బంటుని నేను.. మీ పాదరేణువుని."
తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య
భృత్యస్య భృత్య ఇతిమాం స్మర లోకనాథ
***
ఋతువులు మారుతున్నాయి. సంవత్సరాలు గడుస్తున్నాయి. దృఢవ్రతుడికి యౌవరాజ పట్టాభిషేకమైంది. ఇక శ్రీరంగం ప్రయాణమే అని సంబరపడ్డాడు కులశేఖరుడు.
***
శ్రీరంగమెళ్ళేటి బుల్లి గోసాయీ
ఇచ్చటికి శ్రీరంగమెంత దూరమ్మూ...
అద్దాల మంటపాలాకు తోటల్లూ
అల్లదిగొ శ్రీరంగ గాలిగోపురమూ...
ఇళై పాడుతోంది. ఆమె చేతిలో తంబురని ఆ సన్నని వేళ్ళు సుతారంగా మీటుతున్నాయి. కవాటంలోంచి వస్తున్న పిల్లతెమ్మెరలు ఆమె పాటని వినివెళ్తున్నాయి.
"అమ్మాయీ.. శ్రీరంగమెళ్ళాలని ఉందా?" ఆర్ద్రంగా ఉంది కులశేఖరుని గొంతు.
ఇళై తలవంచుకుంది. ఆ అమ్మాయి మనసంతా శ్రీరంగనాథుడిని నింపుకుందన్న సత్యం కులశేఖరుడికి ఏనాడో తెలుసు.
తెలవారుతూనే చాటింపు వేయించాడు.
"శ్రీశ్రీశ్రీ కులశేఖర చక్రవర్తి శ్రీరంగ దివ్యక్షేత్రానికి వారి సుపుత్రికా సమేతంగా వెళ్తున్నారనీ.. ఇష్టమైన వారు కూడా రావచ్చనీ.." రాజ్యం నలుమూలలా చాటింపు వేయబడింది.
తమ రాజు శ్రీరంగ క్షేత్రానికి వెళ్తే ఇక వెనక్కి వచ్చేదుండదు. దృఢవ్రతుడింకా పద్దెనిమిదేళ్ళ చిరుతప్రాయంలోనే ఉన్నాడు. సువిశాలమైన చేర దేశాన్ని, సామంత దేశాలనూ సంరక్షించేంతటి సామర్ధ్యమింకా వచ్చి ఉండదని మంత్రుల అభిప్రాయం. ఉపాయం ఆలోచించారు.
సరిగ్గా రాజుగారు ప్రయాణానికి సిధ్ధమయేసరికి ఓ మహాపండితుడు వారి శిష్యబృందంతో సహా తరలివచ్చాడు. ప్రయాణం వాయిదా పడింది.
మర్నాడూ చాటింపు వేయబడింది. మర్నాడు మరో సాధువుల గుంపు ఎదురొచ్చింది.
మూడో నాడు రామకథ గానం చేస్తూ మరొకరొచ్చారు.
ప్రతీ రోజూ దేశంలో చాటింపు వెయ్యబడుతూనే ఉంది. ఆటంకాలొస్తూనే ఉన్నాయి. ప్రతి రేయీ నిద్రపోయేముందు కులశేఖరుడు "రంగయాత్రా దినే దినే.." అని నిట్టూరుస్తూనే ఉన్నాడు.
***
ఇళై యౌవనసౌరభాలద్దుకుంటోంది. క్షణానికి ముప్పిరిగొన్న సంతోషంతో ఆ పిల్ల మోము కళకళ్ళాడుతుంది. ఇంతలోనే ఏదో చెప్పలేని బెంగతో కళవళపడుతూ ఉంటుంది. ఆటలు ఆడడం లేదు. గొంతు విప్పి పాడడం లేదు. తల్లి చూసేసరికి, చటుక్కున నీరునిండిన కళ్ళని తుడుచుకుని మామూలుగా ఉండే ప్రయత్నం చేస్తోంది. తండ్రి మోములోకి ఆమె చూడనే చూడదు. పొడిపొడిగా మాటలాడి మరలిపోతుంది.
"ఎవరు దోచుకున్నారో ఈమె మనసు?" ఇదే అంతుచిక్కని ప్రశ్న.
పలువిధాల ప్రయత్నించగా ఇష్టసఖులు గుచ్చి గుచ్చి ప్రశ్నించగా ఇళై పెదవి విప్పింది.. "రంగా..." అని.
"రంగనాథుడిని వరించిందా?!" కోటా పేటా ఏకమై ఆశ్చర్యపోయాయి. ఏమాత్రం తొణకనిది తండ్రిగారొక్కరే.
***
ఇక ప్రయాణం తప్పలేదు. ఇళై ని వెంటబెట్టుకుని సపరివారసమేతంగా ముందుగా వేంకటాచలానికి చేరారు. అటునుంచి ఆ దివ్య ధామాన్ని విడిచి పెట్టలేక పెట్టలేక శ్రీరంగానికి ప్రయాణం కట్టారు. శ్రీరంగనాథుడికి పిల్లనిచ్చి పెళ్ళి చేసేంత భాగ్యం దక్కినందుకు పరవశించిపోయాడు కులశేఖరుడు.
సీతాకల్యాణమంత వైభవంగా జరపాలని సన్నాహాలు చేసారు. కన్యాదానసమయం ఆసన్నమైంది.
"ఇయం సీతా మమ సుతా..." అని జనకమహరాజు ఆ సీతామహాలక్ష్మి చేతిని రామచంద్రుడికి అందించినట్టు.. కులశేఖరుడు తన కుమార్తె ను 'కులశేఖర వల్లి ' అనే పేరిట కన్యాదానం చేసాడు. ఇళై కులశేఖరవల్లిగా రంగనాథుని పెండ్లాడింది.
కూతురి అత్తవారింట్లో ఎన్నాళ్ళుంటారు ఎవరైనా..? ఇక భవబంధాలొద్దనుకున్నాక.. రాజ్యానికి వెళ్ళాల్సిన పనీ లేదు. మరి ఎక్కడికెళ్ళాలి? ఏదీ కులశేఖరుడి చిరునామా?
చేరదేశాధిపతి కులశేఖరుడు.. రాజ్యాన్నీ, బంధాలనీ త్యజించి వేంకటాచలం చేరుకున్నాడు. శ్రీ వేంకటేశ్వరుడి గర్భగుడి ఎదుట నిలబడ్డాడు.
వేయికళ్ళైనా చాలని, కోటి జన్మలు కాంచినా తనివితీరని సౌందర్యమది. ఎలా వదిలి వెళ్ళడం? ఆ ఆనందధామాన్ని ఎలా విడిచి వెళ్ళడం? సాధ్యమా? సాధ్యమేనా?
"పడియాయ్ కిడందు ఉన్ పవళవాయ్ కాణ్బేనే.. " అని కులశేఖరుడు చేతులెత్తి కోరుకున్నాడు.
"ఇదిగో.. ఇలా నీ వాకిట మెట్టునైనా చాలు. నీ పగడాల మోవిని చూస్తూ ఉండిపోతాను." అర్ధించాడు.
కరుణించాడు పరమాత్మ. తిరుమలలో గర్భగుడి మెట్టు "కులశేఖర పడి" అయింది.
======================
ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే
తమహం శిరసా వందే రాజానం కులశేఖరం
చీకటి పడగానే పాలబువ్వ తినిపించినంత మురిపెంగా తాతగారు గరిపిన 'ముకుందమాల'... పలుకు తేనెలంటే అతిశయోక్తి కాదు. నలభై మణిపూసలు! కులశేఖర మహారాజు శ్లోకాల మాలలల్లి వేంకటేశ్వరునికి అర్పించాడట. వాటిని వల్లెవేస్తూ పొగడదండలా గుబాళించింది నా చిన్నతనమంతా. ఆ రాజు గారి కథని.. ఇలా కాస్త నా ఊహ జోడించి మీతోనూ పంచుకుందామని.
కృష్ణ త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్యైవ మే విశతు మానస రాజహంసః
ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః
కంఠావరోధనవిధౌ స్మరణం కుతస్తే?
కృష్ణా.. ఎరనెర్రని తామరలవంటి నీ పాదాలు.. ఆ పాదసౌందర్యమనే పంజరంలో నా మానస రాజహంసని ఇప్పుడే.. తక్షణమే బంధించనీ. ప్రాణాలు ఈ గూటిలోంచి పయనమయ్యే క్షణం దాకా ఆగితే.. కఫవాతపిత్తాలు నా కంఠాన్ని మూసేస్తాయేమో! ఈ క్షణమే నిన్ను స్మరించనీ..
కృష్ణార్పణం
Monday, December 16, 2013
రాజహంస
చిరచిరలాడించే చుఱుకుటెండ.
గుండిగలతో సేవకులు మోసుకొస్తున్న చల్లని నీళ్ళు ఎన్నైనా చాలడం లేదు..
ప్రాసాదం చుట్టూ వేలాడదీయబడిన వట్టివేళ్ళ చాపలపై ఇలా చల్లితే అలా
ఆవిరైపోతున్నాయి. లోపలి గదులలో వట్టివేళ్ళ సువాసనలు, కవాటాలకి ఆవల వార ఏపుగా
పెరిగిన మరువపు గుబాళింపులూ కలగలిసి గాలిలో తేలివస్తున్నాయి.
రత్నపీఠం పై కూర్చున్నాడతను. ముత్యాల బాహుపురులు, రత్నకంకణాలతో విరాజిల్లుతున్న ఆతని చేతులు జోడించబడి ఉన్నాయి. చారుచక్షువులు అరమోడ్పులైపోయినాయి. ఎదురుగా కూర్చున్న ఆచార్యులవారి వైపే ఆతని దృష్టి, మనసూ లగ్నమై ఉన్నాయి.
"సువేలాద్రిపై నుంచి లంకలో ఉన్న రావణుడి మీదకి దూకాడండీ సుగ్రీవుడు.. హుమ్మని హుంకరిస్తూ రావణుడికి శృంగభంగం చేసి చక్కా వచ్చాడు. వచ్చాడా.. 'ఆహా! ఎంత గొప్ప పని చేశావూ..!" అనలేదు రామచంద్రుడు.
త్వయి కించిత్ సమాపన్నే కిం కార్యం సీతయా మమ
'నీకేమైనా అయితే... సీతను పొంది మాత్రం నేనేం చేసుకోను!' అని విలవిల్లాడాడు. 'నీకేమైనా అయితే..' అనేది కూడా ఎంతో ఓగాత్యపు మాటలా అనిపించింది ఆయనకి. తప్పక, స్నేహితుడి దుందుడుకు పనికి గింజుకుంటూ అన్నాడు. అది స్వామీ మైత్రి అంటే!! కడవలకి కడవల నవనీతం తిన్నదేమో కృష్ణుడు.. రాముడైతే నిలువునా నవనీతమే కదూ! రూప దాక్షిణ్య మనోహరుడని అందుకే అంటారు.
తన్మయంగా చెప్తున్నారు ఆచార్యులవారు. ద్వాదశోర్ద్వపుండ్రాలతో భాసిస్తున్న మేనూ, శ్రావ్యమైన కంఠస్వరమూ వారి పై నుండి చూపరుల దృష్టిని మరలనివ్వవు. వారు మాట్లాడితే శిశుర్వేత్తి పశుర్వేత్తి.. అంతే! ఇక కథ మొదలుపెట్టారంటే దానికి చిలవలు పలవలూ పిట్టకథలు పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. వారు ఏ నవరాత్రుల్లోనో రామకథ చెప్తారంటే.. పురాణశ్రవణానికి దూరాభారమనుకోకుండా బగ్గీలూ, బండీలూ కట్టుకుని పిల్లపిల్లాద్రీ తరలి వస్తారు.
"సత్పురుషుల మైత్రి అలా ఉంటుందన్నమాట! అంతటి మసృణిమ ఉండాలనమాట స్నేహానికి! అంత చిక్కని స్నేహం... రామసుగ్రీవులది.. జయ జయ జానకీ వల్లభా! జయ దశరథ నందనా! ఆచార్య తిరువడిగళే శరణం." పురాణ కాలక్షేపం ముగించారు ఆచార్యులవారు.
అక్కడే కాస్త దూరంలో కూర్చున్న అమాత్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకరి వైపొకరు చూసుకుని ఇవాళ్టికి గండం గడిచిందన్నట్టూ నిట్టూర్చారు. రత్నపీఠం మీద నుంచి చివాలున లేచి ఆచార్యులకి సాష్టాంగ పడ్డాడు రాజచంద్రుడు.
***
అతని పేరు కులశేఖరుడు. చేరదేశాధిపతి. తిరువంజిక్కుళం రాజధానిగా రాజ్యం చేస్తున్నాడు. తండ్రి దృఢవ్రతుడి కోరిక మేరకు దేశాలన్నీ జయించి రాజ్యవిస్తరణ గావించిన శూరుడు. విల్లవర్, మలయర్, వానవర్, పంజువెట్టవాయర్ రాజవంశీకులందరూ ఆతని సామంతులు. అతని చేతిలో ఓడిన పాండ్యరాజు మెచ్చి పిల్లనిచ్చాడు.
అంతటి కులశేఖర మహరాజు పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్తే..
కృష్ణనిర్యాణమై కలి ప్రవేశించిన కొత్తలవి. ఇంకా పూర్వవాసనలు పోలేదు. ధర్మదేవత మూడోకాలు మెడ్డుతూ ఉంది. ఏతావాతా ప్రజలింకా సంతోషంగానే బ్రతుకుతున్నారు. కోళపట్టణంలో మహారాజు దృఢవ్రతుడు, నాదనాయకీ దంపతులకి 'మాసి' నెల శుక్లద్వాదశి నాడు, పునర్వసు నక్షత్రాన కుంభరాశిలో కులోద్దీపకుడు పుట్టాడు. "కులశేఖరుడ"ని నామకరణం చేశారు. జాతకర్మలు చేయించిన రాజపురోహితులు 'రాచబిడ్డ కారణ జన్ముడ'న్నారు.
దేశాటన చేస్తూ అటుగా వచ్చాడు ఓ సాధుపుంగవుడు. బంగరు ఉయ్యాలలో బజ్జుని, చిన్ని నవ్వులు చెంగలిస్తున్న ఆ బుడతడి ముఖం చూసి అబ్బురపడ్డాడు. చిగురెర్రని పిల్లవాడి పాదాలవైపు చూశాడు. పాపడు గాల్లోకి కాళ్ళు తన్ని చేతులతో అందుకుంటున్నాడు. పాదరేఖలు ప్రస్ఫుటంగా గోచరమయ్యాయి సాధువుకి. క్షణం తీక్షణంగా చూసి తలపంకించాడు. ఏదో అవగతమై ఆయన మోమంతా నవ్వు పులుముకుంది. "వైకుంఠపురం వదిలి వచ్చావా పెనుమాణికమా.." అని నవ్వగానే చటాలున చేతులందించాడు కులశేఖరుడు.
ఎత్తుకుని బిడ్డ చేతులని కళ్ళకద్దుకుని, రాణికి అందించి దృఢవ్రత మహరాజుతో చెప్పాడు సాధువు.. "రాజా! నీవెంతటి భాగ్యశాలివి! నీ కడుపున కారణజన్ముడు పుట్టాడు. విష్ణువక్షస్థలాన అలరారే కౌస్తుభమే నీ కులశేఖరుడు."
దృఢవ్రతుడి మేను గరిపొడిచింది. హృదయం ఉప్పొంగింది.
"మహానుభావా! ఎంత గొప్ప విషయం చెప్పారు! నా చిరంజీవి పట్ల మీ ఆశీర్వాదం ఎన్నటికీ ఇలాగే ఉండాలి. వాడు దేశాలేలాలి." అంటూ చేతులు జోడించాడు.
"శుభం! చిరంజీవి భక్తిసామ్రాజ్య చక్రవర్తి అవుతాడు." అని దీవించాడా సన్యాసి.
ఆ రాత్రి దృఢవ్రతుడి మనసు మనసులో లేదు. సుక్షత్రియ వంశాన్ని ఉద్ధరించి, రాజ్యవిస్తరణ చేసి పుత్రపౌత్రాభివృద్ధి చెయ్యాల్సిన కుమారుడు భక్తిమార్గం పట్టడమేమిటి! తెల్లారుతూనే అమాత్యులతో మంతనాలు జరిపాడు.
"ప్రభూ! తమకు తెలియనిదేముంది. వేసే ఎరువుని బట్టే పైరు, పెంచే తీరుని బట్టే బిడ్డలు. మనకి ముందే విషయం తెలిసింది కనుక.. జాగ్రత్త పడదాం." అని ధైర్యాన్ని నూరిపోసారు.
కులశేఖరుడు తండ్రి మనసునెరిగి వేదవేదాంగాలు, శాస్త్రాలు, పురాణాలు, సంస్కృతమూ తమిళమూ నేర్చాడు. కత్తిసాము, మల్లయుధ్ధం, అశ్వారోహణ గజారోహణాలూ, యుధ్ధవిద్యలలోనూ ఆరితేరాడు. ధనుర్విద్యా సాధన చేస్తున్న కులశేఖరుడిని చూసిన ప్రతిఒక్కరూ అలనాటి కోదండ రాముడిని చూడలేని లోటు నేడు తీరింది కదా అనుకునేవారు.
చిననాటి నుండీ కులశేఖరుడికి రామ అన్న రెండు అక్షరాలే ఉచ్ఛ్వాస నిశ్వాసాలూ.. గుండెచప్పుళ్ళూను. దృఢవ్రతుడు భయపడ్డట్టూ కులశేఖరుడు రాజ్యమొద్దనలేదు. రాజ్యవిస్తరణ చెయ్యననలేదు. క్షాత్రధర్మాన్ని విడనాడలేదు. రాముడు బాటే ఈ రాజు ది కూడా.. తండ్రి మాట జవదాటలేదు. చుట్టుపక్కల దేశాలన్నీ జయించి ఏకఛత్రం కిందకి తెచ్చి జనరంజకంగా పాలించనారంభించాడు. అదిగో.. ఆ సందర్భంలోనే పాండ్య రాకుమారిని పరిణయమాడాడు. ముత్యాల్లాంటి పిల్లలిద్దరు. కొడుకు పేరు మళ్ళీ దృఢవ్రతుడే. కూతురు ఇళై.
రాజ్యమొద్దనలేదు కానీ తన భగవద్భక్తినీ, భాగవత భక్తినీ వదులుకోలేదు. ఏ వేళలో అయినా సాధువులూ, భక్తులు, పండితులూ, వైష్ణవస్వాములూ నిరభ్యంతరంగా రాజప్రాసాదంలోకి వచ్చి కులశేఖరుడిని చూడవచ్చు. అపరాత్రైనా ఎవరైనా వచ్చారని తెలిస్తే వాళ్ళ మంచీ చెడూ చూసి, వారే పుణ్యక్షేత్రాలు చూసి వచ్చారో అడిగి విశేషాలు తెలుసుకుని కానీ నిద్రపోయేవాడు కాదు. ఇది చూసి మంత్రులు భయపడుతూ ఉండేవారు. దేశాన్నేలే రాజుకి రక్షణ లేకపోతే ఎలా! కూడదని వారించారా, "అమాత్యవర్యా... రాముడున్నాడు. నా రక్షణకొచ్చిన చిక్కేమీ లేదు. వచ్చేది రాముడు పంపినవారే కదూ! అపచారం!!" అని ముక్కున వేలేసుకుని నొచ్చుకునేవారు రాజుగారు. చేసేదేముందింక! అడ్డూ ఆపూ లేకుండా వచ్చి పడే కాషాయగుడ్డల వాళ్ళనీ, నిలువు నామాల వాళ్ళనీ చూస్తే వారికి కారం రాసుకున్నట్టుండేది.
ఇది చాలదన్నట్టూ ఓ నాడేం జరిగిందంటే.. మధ్యాహ్నభోజనానికి ముందు పురాణశ్రవణం రాజుగారి రోజువారీ కార్యక్రమాల్లో ఒకటి. ఆచార్యులవారొచ్చి వెళ్తూండేవారు. రోజూ చెప్పినట్టే రామాయణంలో ఓ ఘట్టం వర్ణిస్తున్నారు. రాజుగారు శ్రధ్దగా వింటున్నారు.
"అలా సీతా లక్ష్మణసమేతంగా జనస్థానం చేరాడు రాఘవుడు. ఓనాడు దండకారణ్యంలోకి వ్యాహ్యాళికి వచ్చిన శూర్పణఖ ఆ బొమ్మరిల్లులాంటి పర్ణశాలని చూసింది. అక్కడో అందగాడిని చూసింది. అతనేమైనా సామాన్యుడా! పుంసాం మోహనరూపాయ.. అని చెప్తారు కదా! మన్మథ మన్మథుడు.. పురుషులకే మోహం కలిగించేంత సౌందర్యమాతనిది. చుప్పనాతి మనసు పడింది. నేరుగా వెళ్ళి తననేలుకోమంది. రాముడు నేను ఏకపత్నీవ్రతుడినన్నాడు. 'అల్లదిగో.. అక్కడ మా తమ్ముడున్నాడు. నాకేమీ తీసిపోడు.' అని సాగనంపాడు. లక్షణులవారేమో సాక్షాత్తూ బుసలు కొట్టే ఆదిశేషుడేనాయె.. 'హాత్తెరీ.. ' అని ముక్కూ చెవులూ కోసి పారేశాడు. పరిగెత్తుకు వెళ్ళిందయ్యా శూర్పణఖ. నేరుగా అన్నగారి దగ్గరకేమీ వెళ్ళలేదు. ముందు తన బంటుల్ని తోలింది. బంటులంటే అల్లాటప్పా వాళ్ళేం కాదు. దండకారణ్యంలో ఉండే మహర్షులనీ, మునులనీ నానాబాధలూ పెడుతూండేవారు.
తతః శూర్పణఖా వాక్యాత్ ఉద్యుక్తాన్ సర్వ రాక్షసాన్
ఖరం త్రిశిరసం చ ఏవ దూషణం చ ఏవ రాక్షసం
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఖర దూషణ త్రిశిరులనే ముగ్గురి నాయకత్వంలో అక్షరాలా పద్నాలుగు వేలమంది రాక్షసులు.. భీకరాకారులు.. మాయాయుధ్ధంలో ఆరితేరిన రక్కసులు బిలబిలమంటూ దిగిపోయారండీ.."
"అమాత్యా... యుధ్దభేరీ మ్రోగించండి." కంచు గంట లా మ్రోగింది కులశేఖరుని గొంతు. ఉలిక్కి పడ్డారు ఆచార్యులవారు.
కులశేఖరుని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కళ్ళలో ఎర్రజీర. అమాత్యులు అయోమయంగా చూస్తున్నారు. రాజుగారు స్పృహలో లేరు.
"ఏంటలా చూస్తున్నారు! పద్నాలుగు వేలమంది రాక్షసులు వచ్చేస్తున్నారు. పిలవండి మన సామంతులని.. మోహరించండి సైన్యం.. తక్షణం యుధ్ధానికి సర్వసన్నధ్ధం చెయ్యండి." అని చరచరా నడుస్తూ అస్త్రాగారం వైపు సాగిపోతున్నాడు. వెంట అమాత్యులు పరుగులు పెడుతున్నారు. ఆచార్యులవారికేం చెయ్యాలో పాలుపోలేదు. ఆలోచిస్తూ వెనుకే తానూ నడుస్తూ..
"మహాప్రభో.. కులశేఖర చక్రవర్తీ! రాముడొచ్చేశాడు. యుధ్ధంలో గెలిచి వచ్చేశాడు.." అని పొలికేక పెట్టారు.
టక్కున ఆగినవాడే వెనక్కైనా తిరక్కుండా.. సందేహంగా "నిజమా!" అని ప్రశ్నించాడు.
"ముమ్మాటికీ నిజం! రాక్షసులని చీల్చి చెండాడి మరీ వచ్చేశాడు.
త్వం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం
భభూవ హృష్టా వైదేహీ భార్తారం పరిషస్వజే
రాక్షసులందరినీ చంపి దండకారణ్యంలో మహర్షులకి వాళ్ళ పీడ వదల్చివేశాడు. అలా శత్రుసంహారం చేసి వచ్చిన రాముడుని చూసి.. ఆనందంతో ఆలింగనం చేసుకుంది సీతాకాంత. "
కులశేఖరుడు ఆగి సంతోషంగా నవ్వాడు. ఈ విపరీతధోరణికి అమాత్యుల గుండెల్లో రాయి పడింది. ఏవిటిదన్నట్టూ మొహాలు చూసుకున్నారు.
జనరంజకంగా పరిపాలిస్తున్న తమ రాజు ఏమైపోతాడో అనే బెంగ వారిలో రోజురోజుకీ పెరిగిపోతోంది. ఈ భక్తి అనే వెర్రి ఒక్కటి తగ్గించే మార్గం వెతికితే చాలు.. రాజు తమవాడే! ఉపాయమాలోచిస్తూ తర్జన భర్జనలు పడసాగారు.
పులి మీద పుట్రలా మర్నాడే మరో ప్రమాదం వచ్చి పడింది.
"అమాత్యా.. నేను శ్రీరంగం వెళ్ళిపోతున్నాను. ఇదిగో ఈ స్వాములతో కలిసి.. ఇకపై రాజ్యభారం మీదే!" తులసి పూసలూ, నారవస్త్రాలతో నిలబడి చెప్తున్న కులశేఖరుడిని చూసేసరికి వారికి మతి పోయింది.
ఒక మంత్రి క్షణమాలోచించి పొంగిపొరలుతున్న ఆ భక్తి సాగరానికి అడ్డుకట్ట వేశాడు.. తాత్కాలికంగా.
"తప్పకుండా మహాప్రభూ! కానీ.. చిన్ననాటి నుండీ ప్రతీ విషయంలోనూ రామచంద్రుడిని అనుసరిస్తున్న మీరు.. ఈ ఒక్క విషయానికీ ఆయన చూపిన బాటని ఉల్లంఘిస్తున్నారే!"
"రాముడిని ఉల్లంఘించడమా!!" ఆశ్చర్యపోయాడు రాజు.
"కుశలవులిద్దరినీ పట్టాభిషిక్తులని చేసి కానీ, రాముడు వైకుంఠానికెళ్ళలేదు ప్రభూ!"
"నిజమే! లోకరక్షణార్ధం సీతమ్మనే విడిచిపెడతానన్నాడు రామచంద్రప్రభువు. నా ప్రజలనెలా విడిచి పెట్టను! దృఢవ్రతుడిని నన్ను మించినవాడిని చేసి.. అప్పుడు నేను శ్రీరంగం వెళ్ళిపోతాను."
అప్పటికి ముప్పు తప్పింది. మంత్రులు చర్చించుకున్నారు.. ఈ వైష్ణవస్వాముల బెడద వదిలిస్తే కానీ తమకు రాజు దక్కడని నిర్ణయించుకున్నారు.. కులశేఖరుడికి వారిపై ఏవగింపు కలిగించాలని పన్నాగం పన్నారు.
***
Saturday, December 7, 2013
ఐ... మీ... అహం బ్రహ్మాస్మి
"సాన్ జే..?"
షీట్
ప్రొటెక్టర్ లోంచి
కనిపిస్తున్న కాగితం
దగ్గరకి తీసుకు
చూసి
పిలిచింది డవానా.
గట్టున బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ నావైపు చూసి 'ఓ.. నువ్వా..!' అన్నట్టు తలూపింది. కిందటివారం నేను చేసిన భీభత్సం స్విమింగ్ స్కూల్ చరిత్రలో మరో దశాబ్దకాలం నిలిచిపోతుంది మరి! పూల్లో విహరిస్తున్న నల్లకలువలా నవ్వి రమ్మని సైగచేసింది. మేకపోతు గాంభీర్యం పులుముకుని నీళ్ళలోకి దిగిపోయాను. మేకలకి ఈతొచ్చా?
***
గట్టున బిక్కుబిక్కుమంటూ నిలబడ్డ నావైపు చూసి 'ఓ.. నువ్వా..!' అన్నట్టు తలూపింది. కిందటివారం నేను చేసిన భీభత్సం స్విమింగ్ స్కూల్ చరిత్రలో మరో దశాబ్దకాలం నిలిచిపోతుంది మరి! పూల్లో విహరిస్తున్న నల్లకలువలా నవ్వి రమ్మని సైగచేసింది. మేకపోతు గాంభీర్యం పులుముకుని నీళ్ళలోకి దిగిపోయాను. మేకలకి ఈతొచ్చా?
***
పెళ్ళి చూపుల్లో శశిని
చూడగానే అనిపించింది.. ఇంతందగాణ్ణైన నా
పక్కన
నిలబడడానికి ఈ
కాటుక
కళ్ళమ్మాయ్
చాలని.
మరీ
మింగేసేంత బ్యూటీ
ఎవడిక్కావాలి?
పిక్చర్ పీపుల్ వాడి క్యూపన్ చూడగానే విజిలేసి చెప్పాను శశికి..
వీకెండ్ పోట్రైట్ తీయించుకుందామని. "పోట్రైటా?!" తెల్లమొహమేసింది. వారం
రోజులై
శశికి
నేర్పుతున్న 'అమెరికా జీవనవిధానం' అనే
సబ్జెక్ట్ లో
ఎన్నెన్ని టాపిక్కులో! శుక్రవారం సాయంత్రం ఆకుపచ్చ చుడీదార్ లో
సిధ్ధమై, కారెక్కుతున్న తనని
చూస్తే
సరిగ్గానే ఎంచుకున్నానని మరోసారి అనిపించింది. పరవాలేదు. బానే
ఉంటుంది.
"నాకంటే నువ్వే
బావున్నావ్.." బుంగమూతి పెట్టింది ఫ్రేమ్
గోడకి
తగిలించగానే.
"అఫ్కోర్స్.." ఒప్పేసుకున్నాను.
"నేను యెలో
చుడీదార్ వేసుకోవలసిందేం.." ఫొటోలో నేను
వేసుకున్న యెలో
స్ట్రైప్డ్ నల్ల
టీ
షర్ట్
వైపు
చూస్తూ
అంది.
"ఉహూ.. నీకు
యెలో
బాగోదు
శశీ."
"ఊ..."
"ఇంకా డార్క్
గా
కనిపిస్తావ్."
"ఎంత బావున్నావో సంజూ.."
ఫోటోని
కళ్ళార్పకుండా చూస్తూ
చెప్పింది.
నవ్వాను తెలుసన్నట్టూ..
"నేను మేకప్
వేసుకోవలసిందేం.."
"నిజమే..
కనీసం
లిప్
స్టిక్.."
నిజాయితీగా చెప్పాను.
***
మాగన్నుగా నిద్రపడుతోంది.
అప్పటిదాకా ఒంటికి
తగులుతున్న మెత్తదనం నెమ్మదిగా దూరం
జరిగి
జరిగి...
మిస్సింగ్. మొరాయిస్తున్న కళ్ళని
బలవంతంగా తెరిచాను. బాత్రూమ్ తలుపు
ఓరగా
తీసి
ఉంది.
లైట్
వెలుగులో అద్దంలో చూసుకుంటూ పెదాలకి ఏదో
పూసుకుంటోంది. టైం
చూస్తే
పన్నెండున్నర! మరో
నిమిషంలో లైట్ ఆరిపోయింది.
"లిప్ స్టిక్కా? చీకట్లో దేనికీ?"
దగ్గరకి లాక్కున్నాను.
"ఉహూ..
గుడ్నైట్"
***
***
"అమెరికాలో కాళ్ళులేకపోయినా బతికేయొచ్చు కానీ
కార్
లేకపోతే బతకలేం."
గంభీరంగా చెప్పాను.
"మనకుందిగా?"
"అదే డ్రైవింగ్ రాకపోతే... " సర్దిచెప్పాల్సి వచ్చింది.
"నిజమే
సంజూ..
నిన్ను
ప్రతీచిన్న పనికీ
ఇబ్బంది పెట్టక్కర్లేదు కదా.."
మూడురోజుల్లో పూనమ్ తో కలిసి
వెళ్ళి
లెర్నర్స్ పర్మిట్ తెచ్చేసుకుంది. "పోన్లే.. వీకెండ్ నేర్పుతాన"ని
అభయమిచ్చాను.
"కుడి వైపు
ఉన్న
పెడల్
ని
'Gas'
అంటారు..
దాని
పక్కనే..
"
"స్కూల్ గ్రౌండ్ వైపు
వెళ్దామా?" రివర్స్ చేస్తూ
అడిగింది.
"ఓయ్.. ఓయ్..."
"పూనమ్
నేర్పుతోంది సంజూ.
తనది
పాతకారే కదా
అనీ.
పేరలల్
పార్కింగ్ చేతకావట్లేదింకా.. " స్టాప్ సైన్
దగ్గర
నా
చేతిలో
కాఫీ
తొణకలేదు.
***
***
"దిక్కుమాలిన అమెరికాలో గాలి
పీల్చినా ఊరిపోతాం బాబూ...!"
వేలాదిమంది ఎన్నారై మహిళల
ఆక్రోశానికి శశి
గొంతు
కలిపింది.
"Jog
baby.. Jog.."
"ఉహూ..
లాభం
లేదు.
కాళ్ళరిగిపోతున్నాయ్ కానీ,
అరపౌండ్ కూడా
తగ్గట్లేదు." పిటపిట్లాడుతున్న జీన్స్
ని
కుర్తీతో కవర్
చేసి
బయలుదేరింది.
"ఇదిగో.. ఈ
red velvet cake flavored కొవ్వు
ఒంట్లో
పేరుకుపోతోంది ఎక్కడికక్కడా.." frozen yogurt కప్పులో రెండు
స్పూన్స్ వేసి
తెస్తూ
చెప్పింది.
"కొన్ని
శరీరతత్వాలంతే." నా tight abs గర్వంగా ఇంకాస్త లోపలికెళ్ళాయ్.
***
***
"స్విమింగా? నాకు
సైనస్
ఉంది."
నిర్దయగా రానన్నాను.
"హ్హుహ్హుహూ... సంజూ..."
"నా కార్డియో నాకు
చాలు."
"నాకోసం
రావొచ్చుగా.."
***
***
"పూల్ కెళ్దాం వస్తావా?" రోబ్ చుట్టబెట్టుకుంటూ హాల్లోకి వచ్చింది.
"మన పూల్లో
లైఫ్
గార్డ్
ఉండడు."
ఆదివారం ఉదయం
సోఫాలోంచి కదలమనడమంత క్రైమ్
మరోటి
ఉండదు.
"అక్కడే పడుకుందువులే. పూనమ్
వాళ్ళూ
యెలో
స్టోన్
పార్క్
కి
వెళ్ళారు.. లేకపోతే ప్రతివారం నిన్ను
రమ్మంటున్నానా?"
"నీకు సాయం
పూల్
లో
దిగాలా?
నో
వే!!"
"అక్కర్లేదు. లేమ్మా
సంజూ..
ప్లీజ్."
భుజాలు
నొక్కుతూ వెనక
నిలబడింది. ట్రిక్స్ తెలిసిపోయాయ్ అమ్మడికి. ఇంకాసేపా సుఖాన్ని అనుభవించి ఐపాడ్
పట్టుకు లేచాను.
***
***
రోబ్
విడిచి
పూల్లోకి దిగుతోంది శశి.
దీన్సిగతరగా... అమెరికా స్విమ్
సూట్లు
బావుంటాయేం! సీగ్రీన్ ఏమైనా
మంచి
కలర్.
పూల్
నాలుగడుగులేం కాదూ...
ఇటు
నాలుగూ..
అటు
ఆరు?
ఆరేనా..?
'సారొస్తారొస్తారూ...' ఓయబ్బో...
ఈదేస్తోందీ!!
అరగంట సేపు ఇలా
కూర్చోవడం కష్టమే
కానీ...
ఈదడం
సులువే
అయుండచ్చులే. నాకు
విసుగొచ్చేదాకా ఈదింది.
పూల్లోంచి వస్తూ.. "షవర్ చేసొస్తా.. " అంటోంది. 'నే సందెవేళ జాబిలీ...' ఛ ఛా.. లంచ్ టైం అవుతోంది సందెవేళేంటీ... ఆకలి దంచేస్తోంది.
***
పూల్లోంచి వస్తూ.. "షవర్ చేసొస్తా.. " అంటోంది. 'నే సందెవేళ జాబిలీ...' ఛ ఛా.. లంచ్ టైం అవుతోంది సందెవేళేంటీ... ఆకలి దంచేస్తోంది.
***
"Weekly
twice?" దోసకాయ పప్పు కలుపుతూ అడిగాను.
ప్రశ్నార్ధకంగా చూసింది.
"స్విమింగ్ క్లాసులు"
"మొదటి సీజన్
రెండు
క్లాసులు తీసుకున్నాను కదా
సంజూ.
చెప్పానేమో. ఇప్పుడు ఫ్రీస్టైల్ వచ్చేసింది కనుక
ఒకటే
తీసుకుంటున్నాను."
"ఓహో.. సో..
ఆదివారం మన
అపార్ట్మెంట్ పూల్
లోనా?"
"ఊ ఊ..
సమ్మర్
వచ్చిన
దగ్గర్నుంచీ పూనమ్,
నేనూ
మన
పూల్
ని
వాడేసుకుంటున్నాం. apartment amenities ఉన్నదెందుకూ..? నైన్
పౌండ్స్ తగ్గాను తెలుసా
సంజూ..
మొత్తం!
బెండకాయ... వేసుకో
కొంచెం."
***
***
"Hey San.. jay..! I'm Joey. Is this your first
class?" సూపర్
వైజరనుకుంటా పలకరించాడు. డవానా
కి
నా
ప్రాణాలనప్పగించిన అప్రాచ్యుడు. ఉహూ..
తిట్టట్లేదు. మూడో
నంబర్
లేన్
లో
నన్ను
దింపి
వెళ్ళిపోయాడు.
సరిగ్గా డిజిటల్ క్లాక్ లో పదకొండయింది. ఆదివారం కోలాహలమంతా స్విమింగ్ స్కూల్లోనే ఉన్నట్టుంది. 'శశి
టెన్నిస్ ప్రాక్టీసుకెళ్తున్నానని నమ్మేసి ఈదేసుకుంటూ ఉంటుంది.. హ్హుహ్హహ్హా...' అని
మనసులో
నవ్వుకుంటున్నానా.. పక్క
లేన్
లో
బికినీలేసుకుని ఇద్దరూ,
షార్ట్
వేసుకుని ఒకడూ,
సింగిల్ పీస్
పువ్వుల సూట్
వేసుకుని మరొక
పిల్లా
దిగారు..
వాళ్ళ
అమ్మా
నాన్నలతో కలిసి.
నీళ్ళలో మునగమని, నీళ్ళ కింద బబుల్స్ వదలమనీ,
బోర్లా
తేలమని
నా
పొట్టకింద చెయ్యి
పెట్టి
చక్కిలిగిలిపెట్టింది డవానా.
పైగా
ఉపన్యాసం కూడానూ..
"భయం
సహజం.
I totally understand . నీరు
మనకెంత
అవసరమో...
అదే
నీరు
మనని
భయపెడుతుంది. I can help you come over that fear." దీని చాదస్తం!!
నాతో పాటూ డవానా దగ్గర నేర్చుకుంటున్న మిగిలిన ముగ్గురూ బాగా బెదురుగొడ్లు. పక్క లేన్ లో లిలీపుట్ స్విమర్స్ కి రైమ్సూ చప్పట్లూ.. కోలాహలం. టైమ్ పాస్ కి చూస్తున్నా.. చూస్తున్నా..
నాతో పాటూ డవానా దగ్గర నేర్చుకుంటున్న మిగిలిన ముగ్గురూ బాగా బెదురుగొడ్లు. పక్క లేన్ లో లిలీపుట్ స్విమర్స్ కి రైమ్సూ చప్పట్లూ.. కోలాహలం. టైమ్ పాస్ కి చూస్తున్నా.. చూస్తున్నా..
"Humpty Dumpty sat on a wall.. Humpty Dumpty had a
great fall.... " పక్క
లేన్
లో
గట్టున
కూర్చున్న ఏడునెలల పిల్లా
డుబుంగున పూల్లో
దూకేసింది. హమ్మనీ!!
వాళ్ళమ్మ అందుకుంది. విజయగర్వంతో అటూ
ఇటూ
చూస్తోందీ పిల్ల....
వేలెడంత లేదూ..!
"Attention Parents and Swimmers.. We've got a little
swimmer getting her first ribbon today! Give her a big hand... Mithayee Paul!!"
అరుస్తున్నాడు జోయీ.
ఇందాకా
బుడుంగున మునిగితేలిన బుడత
పిల్లకి పాకడం
సరిగా
రాదు
కానీ
రిబ్బన్ కొట్టేసిందా?
డవానా
నన్ను
"Last turn!" అని
పిలిచేసరికి వీరావేశమొచ్చింది. ఆఫ్టరాల్ నాలుగడుగుల పూల్
లో
తేలలేనా? ఊపిరి
బిగించి మునిగి
కాళ్ళు
కదిపాను శరవేగంగా... అంతే..
***
***
రెండో వారం స్విమింగ్ క్లాస్
తక్కుతూ తారుతూ
దిగ్విజయంగా పూర్తిచేసుకుని ఇంటికొచ్చాను. లంచ్
పూర్తయింది.
"సంజూ... "
"ఊ..."
" ఏదైనా మాట్లాడు సంజూ..."
లవ్
సీట్
ఇరుకయ్యింది.
"అద్సరే కానీ...
ఈతెందుకు?"
"ఆ..?"
"అదే స్విమింగ్.. ఎందుకూ?"
"లావైపోతున్నాను కదా!
నువ్వేమో.. యంగ్
అండ్
హేండ్సమ్.. " గుండెల మీద
సున్నాలు చుడుతూ
బాణాలేసేస్తోంది.
"నన్నెందుకూ నేర్చుకోమన్నావు?" టీవీ ఆపేద్దామనిపించింది.
"సైనస్ అన్నావు కదా..
వద్దులే."
"ఉహూ.. నాలుగైదు సార్లడిగావు."
"మరేమో.. కొడుకు
పేరు సోమలింగమా అని నవ్వకూడదు."
"ఉహూ..."
"స్విమింగ్ స్కూల్
కీ
చిన్న
చిన్న
పిల్లలొస్తారు సంజూ..
Aqua babies అనీ..
ఆర్నెల్ల వయసు
నుండీ
అనుకుంటా జాయిన్
చేసుకుంటారు."
"ఊ ఊ.."
"మన బేబీని
కూడా
తీసుకెళ్ళొచ్చు కదా
అనీ.."
"దానికి నేనెందుకూ? నువ్వు
ఈదేస్తున్నావు కదా
సాగరకన్యలాగా.." నిష్టూరం పలికించకుండా ఉండలేకపోతున్నాను.
"అబ్బా... పూల్
లో
దిగడానికి పేరెంట్స్ కి
ఈత
రావక్కర్లేదు. మన
బేబీకి
స్విమింగ్ వచ్చేసరికి మనక్కూడా వస్తే భలే బావుంటుంది కదా
అనిపించింది."
"........"
"........"
"ఓ పిల్ల
ఉంటుంది సంజూ...
మొన్నెప్పుడో చూసాను.
దేశీ పిల్లే!
లడ్డూ లా ఉంది.
పేరేదో
విచిత్రంగా ఉందిలెద్దూ.. భలే
యాక్టివ్."
"మిఠాయీ
పాల్?"
బయటికి
చెప్పలేదు.
***
***
"అవునూ.. లిప్స్
కి
ఏం
రాస్తున్నావేంటీ?"
"ఏమీ లేదూ...."
గారాలు
పోయింది.
"బావున్నాయ్ నిజంగా."
నా
పెదాలకంటే.. అనబోయి
ఊరుకున్నాను.
"తేనె రాస్తేనూ... బావుంటాయని చదివా
ఎక్కడో."
"అర్ధరాత్రి రాసుకోవాలని కూడా
చదివావా...?"
"ఉహూ..
నైట్ రాసుకు పడుక్కోమన్నారు కానీ..."
కిలకిలా నవ్వేసింది.
శశి బావుంటుంది.
చాలా...
***
Subscribe to:
Posts (Atom)