Tuesday, October 22, 2013

ఆ ఊళ్ళో ఏముంది?

"కూ...... తుక్ తుక్ త్వైను..." సిరి కేరింతలు నా ఆలోచనలని చెదరగొట్టాయి.

లక్కరంగు ట్రైన్ బొమ్మని నేలమీద పాకిస్తూ దాని వెంట తనూ గుండ్రంగా పాకుతోంది. ఆ తేనెరంగు మొహంలో ఉబికివచ్చే సంతోషం నా మనసులోకి ప్రశాంతంగా పంపిణీ అయ్యేది ఎప్పుడూ. వారంలో ఎంతమార్పు!

"పరమేశ్వర్ గారు.." ఫోన్ తెచ్చి నా చేతికిస్తూ చెప్పింది వినత.
"హలో.. "
"ఏవయ్యా భయపడ్డావా? అపాయింట్మెంట్ కేన్సిల్ చేయించావట?" అట్నుంచి పరమేశ్వర్ గొంతు ఖణీమని మోగింది.
"ఏవో అర్జంటు పనులుంటేనూ.. అపాయింట్మెంట్ పోస్ట్ పోన్ చేసుకోడానికి డేట్ తెలీక కేన్సిల్ చేయించానంతే. భయం లేదూ ఏం లేదూ..." నవ్వేసాను.
"సరే సరే.. సెకండ్ థాట్స్ ఏమో అనుకున్నాను. చలో... టేక్ కేర్."

"చేయించేసుకోవల్సింది చక్రీ.." సిరి వాళ్ళమ్మని ఎత్తుకోమని గారాలు పోతోంది.
"ప్చ్.. "
"మొదలెట్టేయాల్సింది కదా.. ఏడాది ప్రాసెస్ అంటున్నారసలే. ఇవాళ మొదటి సిటింగ్ అయిపోయేది కదా!"
"కంగారేం లేదులే. అయినా పెళ్ళిచూపులకేమైనా వెళ్ళాలా ఏం? ఏ ముచ్చటా లేకుండానే ఉచ్చులో చిక్కాను కాదో!" నవ్వుతున్నాననుకున్నాను.
"అదొక్కటే తక్కువ. ఏమార్చి బుట్టలో వేసుకున్నదెవరో.." నా కాలి వైపు కళ్ళతో చూపిస్తూ దెప్పింది.

నీట్ గా ఫైల్ చేసి ఉన్న గోళ్ళతో అతిశుభ్రంగా తళతళలాడే నా పాదాలని పొద్దస్తమానం షూస్ లో బంధించి ఉంచేవాడిని. పరిచయమైన కొత్తలో గుడికెళ్దామని వినత అడిగిన మూడోసారి.. ఇక తప్పక బయట షూస్ విప్పినప్పుడు నా కాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూసి నవ్వింది.. "ఇందుకా షూస్ విప్పనిదీ..!" అన్నట్టు. నా కాలి బొటన వేలికీ దాని పక్కవేలికీ ఇన్నర్ స్పేస్ చాలా ఎక్కువ.. మరో వేలు పట్టేంత ఖాళీ. 

"ఇది దాచలేదుగా పోనీ.." ముందు పళ్ళకి మధ్య ఉన్న ఖాళీలో టేబుల్ మీదున్న పేపర్ క్లిప్ అడ్డంగా ఇరికించుకుని గమ్మత్తు చేసాను.
"గొప్పేలే.. అంతలేసి ఖాళీలేం దాస్తావూ? సిరిపాపాయీ.. నీ ట్రైన్ ని పంపించేద్దామా నాన్న నోట్లోకి?" పిల్లదాన్ని అమాంతం గాల్లోకి లేపి చంకనేసుకుంది.
"మ్..మ్మా... త్వైను.. తుకు తుకు త్వైను.." నేలమీద పడి ఉన్న బొమ్మ వైపు సాగిపోతూ ఏడుపు మొదలెట్టింది సిరి.
వంగి బొమ్మ అందుకుని సిరి చేతిలో పెట్టి, బుగ్గ నిమురుతూ చెప్పాను.. "బజ్జోమ్మా.. పదైపోతోంది."
"నువ్వూ బజ్జోమ్మా.. ఉదయాన్నే ఆమ్మ వస్తారు కదా?" వినత బెడ్రూమ్ లోకి నడుస్తూ చెప్పింది.

***

"ఉహూ.. బజ్జో.." అటు తిరిగి చెప్పింది.
"అప్పుడే నో నో వీక్ మొదలయిపోయిందా?!" సిరి తరువాత మూడేళ్ళ గేప్ కావాలని ప్లాన్ చేస్తోంది వినత.
"యెస్.. "
"దారుణం వినీ ఇది.. మరీ కేలెండర్ చూసుకు చేసే కాపురమైపోయిందీ.."
"శరీరాన్ని మెడికేట్ చెయ్యకూడదు. పాపం అది.."
"పెళ్ళే ముఫ్ఫైల్లోకొస్తూ చేసుకున్నాం. ఇదే మేనరికమైతే ఈపాటికి చిలక్కొట్టుళ్ళతో కలిపి పుష్కరమయ్యేది." నిట్టూర్చాను.
"ఉంటే చేసుకోవల్సింది.. మేనరికం.." కవ్వించింది.
"చాల్లే.. అమ్మానాన్నదే మూడో తరం మేనరికమట. ఇంకేమైనా ఉందా? నాకున్నవి చాలు." గుండెల మీద చేతులేసుకుని పడుకున్నాను.

నా వైపు పూర్తిగా తిరిగి బెడ్ లేంప్ వెలుగులో నన్ను చూస్తూ అడిగింది వినత.
"అయితే ఈ ఖాళీ మేనరికం వల్లే అని కన్ఫర్మా?" పెదాల మీద వేలితో రాస్తూ..
"ఏమో..! Diastema కి కారణమేదైనా కావచ్చన్నాడు పరమేశ్వర్. మేనరికం వలన కూడా చాన్స్ ఉందట. బ్రేసెస్ వల్ల ఫిల్ చెయ్యడానికి కుదరనంత గేప్ ఇది. లోపల చిగురే లేదూ.. మరో పన్ను ఇరికించాల్సిందే అని. నాలుగు upper incisors కి బదులు మూడే ఉన్నాయనీ.. "
"అలా వదిలేద్దాం చక్రీ.." భయంగా అంది.
"వయసయ్యే కొద్దీ జా బోన్ వంగిపోతుందట వినీ.. తప్పదెప్పుడైనా"
"మరి ట్రీట్మెంట్ మొదలెట్టేస్తే పోయేది కదా.."
"ప్చ్.. విసుగ్గా ఉంది."
"రేపు ఆమ్మ తో వెళ్దామా?" నా అశాంతికి కారణం తెలుసు వినతకి.
"ఏమో.."
"ఆలోచించు చక్రీ... నాకు వెళ్తే పోయిందేముందీ అనిపిస్తోంది."
"చరిత్ర తవ్వి తలకెత్తుకుందామా? పోయిన అమ్మ పోయిందెలాగూ.." నా గొంతు నాకే చిత్రంగా తోచింది.
"చక్రీ... నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. జరిగినది వెనక్కి తేలేం కదా! వెళ్దాం.. అందరిళ్ళకీ వెళ్ళినట్టే. ఏం.. అతనక్కడుంటే మనకేం?"

***

"చిలకలా ఉందిరా.. అచ్చం నానమ్మ పోలికే!!" సిరిని ఒళ్ళో కూర్చోబెడితే ఆమ్మ కళ్ళలో సంబరం.
"సిరీ... చెప్పూ... ఆఆమ్మ..." ఆమ్మ మెడలో పగడాల పేరుని పరిశీలిస్తున్న సిరితో చెప్పాను.
"మ్మమ్మా..." పలికింది చిలక.
"దానికీ ఆమ్మనేనేవిట్రా.. నానమ్మనే నీకూ.. పెదనానమ్మని."
"నిన్న కాక మొన్నే మాటలొచ్చాయ్. పెదనానమ్మ అనాలంటే మరో ఏడాది పడుతుందేమో.." నవ్వాను.
"అదేంట్రా చక్రీ.. ఆడపిల్లలు ఏడాది లోపే సొష్టంగా పలుకు నేర్చేస్తారసలూ!"
"ఏమో ఆమ్మా.. ఏడాదిన్నర దాటాక మాట్లాడింది. భయపడ్డాం.. అమ్మ పోలికేనేమో ఇందులో కూడా అని.."

సిరి మొహంలోకి నవ్వుతూ చూస్తున్నదల్లా చటుక్కున తలెత్తి చూసింది నావైపు. వినతనూ నన్నూ మార్చి మార్చి చూసింది.

"నేనేమీ భయపడలేదండత్తయ్య గారూ.. ఈయనే ఓ.. హడావిడి చేసేసారు. అందులోనూ వాళ్ళమ్మ పోయిన ఏడాదిలోగా పుట్టింది కదా.. ఆవిడే మళ్ళీ వచ్చారని అపురూపం! డాక్టర్లూ చెప్పారు.. మాటల్రాకపోవూ.. కొందరికి ఆలస్యమవుతాయంతే అని. వినరే..." సిరిని ఆమ్మ ఒళ్ళోంచి తీసుకుంటూ చెప్పింది వినత.
***

ఆ సాయంత్రం మేం బయలుదేరుతామనగా దగ్గరికి పిలిచింది ఆమ్మ. "ఓ ఐదు నిముషాలు కూర్చోరా చక్రీ.." అని. అన్నదమ్ముల పిల్లలైనా,  వయసులో సహస్రాంతం తేడా ఉన్నా.. అమ్మా, ఆమ్మా ఏకప్రాణంగా పెరిగారు. ఆమ్మ కొడుకులిద్దరూ విదేశాల్లో సెటిలైపోయాక తనూ వెళ్ళిపోయింది. అమ్మ పోయినప్పుడు కబురంపితే ఆఘమేఘాలమీద వచ్చి వాలుతుందనుకున్నాను. "అదృష్టవంతురాలు..." అని ఫోన్ పెట్టేసింది. ప్రేమ ఎక్కువున్నా అంతేనేమో అనిపించింది. అమ్మపోయిన మూడేళ్ళు దాటాక ఇదే ఇటువైపు రావడం. తన మరిదిగారింట్లో దిగుతూనే కబురంపింది.

"పెద్దదాన్నైపోతున్నానురా చక్రీ.."
"ఏదీ.. ఇంకా మరో పుంజీడు తెల్లవెంట్రుకలైనా రానీ ఆమ్మా.." నవ్వాను.
"మీ అమ్మ వెళ్ళిపోయింది."
"......"
"నీ కూతురికి వేదవల్లి అని పెట్టుకోవల్సింది కదరా పేరూ.."
"పేరు కలిపానామ్మా.."
"ఏమీ సోకు తక్కువయ్యిందా!" ఆమ్మ కళ్ళలో నిష్టూరం.
"ముమ్మూర్తులా అమ్మలాగే ఉందా పిల్ల.. ఇక పేరుదేముంది? అయినా అలా పేరుపెట్టి ఎలా పిలవమంటావ్ చెప్పూ? మా ఆవిడ అత్తమీద కోపం దుత్త మీద చూపించిందనుకో.. గొడవలైపోవూ..?" ఆమ్మ చేతి మీద చేయి వేస్తూ రహస్యం చెప్పాను.

నా చేతిమీద చేత్తో రాస్తూ చాలా సేపు అలా ఉండిపోయింది. వినత గభాలున గదిలోకి వచ్చినదే... మమ్మల్ని చూసి వెనక్కి వెళ్ళిపోయింది.

"మీ ఆవిడ విలక్షణంగా ఉందిరా.. కలుపుగోలు పిల్ల. నేను మళ్ళీ ఈ దేశం వస్తానో.. రాగలనో.. లేనో.. ఒంట్లో ఏం సుఖంగా లేదు. ఎప్పుడో దేశం కాని దేశంలోనే ఎగిరిపోతుందీ ప్రాణం." ఏదేదో మాట్లాడుతోంది.
"ఏం కాదు కానీ... నా కూతురి అట్లబంతికి వస్తావు చూడు.." ట్రైన్ కి టైమైపోతోందని ఆవిడకి ఎలా చెప్పడమా అని ఆలోచిస్తున్నాను.
"మీ అమ్మ మూగది కాదురా..."

నాకు అర్ధం కాలేదు. చాలాసేపు అర్ధం కాలేదు. అర్ధమవడం మొదలుపెట్టాక.. నాకు వినబడుతున్న ఒక్కోమాటా నా మెదడుని చిత్రవధ చేసిమరీ లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసింది. 

"నూటేభై ఎకరాల ఆసామీ మీ తాత. ఏనాడ ఊరంతా మీ తాతదే! వేద ఒక్కగానొక్క కూతురు. మేనరికం చేసి తన చెల్లెలి కొడుకు చలపతిని ఇల్లరికం తెచ్చుకుందామనుకున్నాడు. మీ అమ్మకి ఇష్టం లేకపోయింది. మీ అమ్మమ్మ అన్నకొడుకు... నరహరి.. అంటే మీ అమ్మకి బావే.. కాపోతే మావ కొడుకు బావ.. వాడిని ప్రేమించింది. ఏడ్చింది. పోరాడింది. కానీ డబ్బు గెలిచిందిరా చక్రీ... విడదీసేసారిద్దర్నీ. చలపాయ్ నే కట్టుకోవలసి వచ్చింది. పెళ్ళిక్కూడా ఎవర్నీ పిలవలేదు. అంత గొప్ప ఏనాడ జమీందారు కూతురి పెళ్ళీ రాత్రికి రాత్రీ జరిగిపోయింది. ఏవిటా అన్నవాళ్ళకి మూలనున్న ముసలమ్మ.. మీ తాతమ్మని వంక చూపించారు. అంతే.. మూడు ముళ్ళూ పడ్డ క్షణం నుంచీ మీ అమ్మ ఇక మాట్లాడలేదు."

అయోమయంగా చూస్తూ కూర్చుండిపోయాను. వినత వచ్చి 'రైలుకి టైమైపోతోందండీ..' అని ఆమ్మతో చెప్పడం. 'వస్తాడ్లే..' అని తనని పంపేయడం లీలగా తెలుస్తోంది.

మర్నాడుదయం బయలుదేరుతూంటే అడిగింది ఆమ్మ..
"మీ ఊరొస్తాన్రా వచ్చేవారం. మళ్ళా రెండువారాల్లో నా తిరుగుప్రయాణం ఉంది కదా.. మీ ఇంటినుండి ఏనాడ వెళ్ళి చూసొద్దామని ఉంది. తీసుకెళ్తావా?"
"అక్కడెవరున్నారో మరి. నాకా ఊరే తెలీదు." అన్యమనస్కంగా అన్నాను.
"నువ్వు పుట్టాక ఆ ఊరితో మీకెవరికీ రాకాపోకా లేవుగా.. మీ తాతిల్లు అమ్ముకుతిన్నాడు కదా చలపాయ్! ఇంకేముందా ఊళ్ళో! వెళ్దాంలే. చుట్టాలెవరో ఉండే ఉంటారు.. " తటపటాయిస్తూ చెప్పింది.. "నరహరి ఆ ఊళ్ళోనే ఉండిపోయాడ్రా.."


***

"నిజమా!!" నోరు తెరుచుకుని ఉండిపోయింది వినత. సోఫాలో కూలబడ్డ నన్ను అయోమయంగా చూస్తూ కూర్చుంది.
"ముఫ్ఫై మూడు సంవత్సరాలు... అమ్మ మాట్లాడలేదు." ఒక్కోమాటా కూడబలుక్కుంటూ చెప్పినట్టూ నాకు నేనే నమ్మబలుకుతున్నట్టూ నెమ్మదిగా చెప్పాను.
"అసలు ఒక మనిషికి ఇది సాధ్యమా!! ఆవిడ ఎంత బాధపడకపోతే అలా చేసుంటారు!"
"షటప్ వినీ..." అరిచాను. తుళ్ళిపడింది.
"ఆవిడ మూర్ఖత్వానికి నేను బలైపోయాను. మా నాన్న బలైపోయారు. లక్ష అనుకుంటాం లైఫ్ లో.. అన్నీ జరిగిపోతాయా? కనీసం నేను పుట్టాకైనా ఆవిడ మనసు మారి ఉండకూడదా!! నాకు మా అమ్మ జోలపాడలేదు. నాతో కబుర్లు చెప్పలేదు. నేనెప్పుడూ ఆవిడ గొంతు వినలేదు.." నాలో గూడుకట్టుకున్న షాక్ కరుగుతోంది నెమ్మది నెమ్మదిగా.. గొంతు జీరబోతోంది.
"చక్రీ..."
"ఆఖరికి.. ఆఖరికి నాన్న ఏక్సిడెంట్లో పోయినప్పుడైనా..." కళ్ళు చెమ్మగిల్లాయి.
"...."
"తాత ఆస్తి మా నాన్న అమ్ముకుతిన్నాడన్నారు.. ఎవరికోసం? ఈవిడిలా ఉండబట్టేనేమో.. ఆయన దేశాలు పట్టుకు తిరుగుతూ అలా తిరుగుతూనే పోయారు."
"లేదు చక్రీ.. అత్తయ్య అంత చెడ్డామె కాదేమో.." వినత నెమ్మదిగా అంది.
"మన పెళ్ళి పట్టుబట్టి చేయించిందనేనా?" సూటిగా చూస్తూ అడిగాను. తడబడింది.

"చక్రీ నేనూ ప్రేమించుకున్నామండీ.. మా ఇంట్లో ఒప్పుకోలేదు. నాకు వేరే పెళ్ళి చేసేస్తామంటున్నారు." అమ్మవారి గుళ్ళో అమ్మ ఎదురుగా తలవంచుకు చెప్పిన వినతనీ, నన్నూ చెరో చేత్తోనూ పట్టుకుని.. ఇంటికి తీసుకొచ్చేసింది అమ్మ. ఇదేవిటన్న నాన్నని ఒకే ఒక్క చూపుతో నిలవరించింది. కోడలు అడుగుపెట్టిన నెలలో మావగారిని మింగేసిందని చాటున గుసగుసలాడిన పనిమనిషిని సైతం మళ్ళీ గడపలోపలికి రానివ్వలేదు. 

"ఏమో చక్రీ.. ఆమెలో మూర్ఖత్వం పాళ్ళెంతో నాకు తెలీదు. ఒక్క విషయం మాత్రం తెలుసు.. ప్రేమించినవాడికోసం ఆడపిల్ల ఎంతకి తెగించగలదో బాగా తెలుసు. పిల్లలు పుడితే పాతప్రేమలు చెరిగిపోతాయా, పోవా అంటే మాత్రం నేను చెప్పలేను. నాకా అవసరం రానివ్వలేదామె.." ఖాళీ పాలసీసాని నేలకేసి కొడుతున్న సిరి వైపు చూస్తూ చెప్పింది.
"ఇప్పుడా ఊరు వెళ్ళాలట.. అతగాడిని చూడ్డానికి ఈ ఆమ్మగారు వెళ్తూంటే సాయం... నాన్సెన్స్.." విసురుగా లేచి బయటికి నడిచాను.

ఆ వారం రోజులూ నిజాన్ని పూటపూటకీ కొద్దికొద్దిగా ఇంకేలా చేసాయి.

***

మరో నిద్రలేని రాత్రి తెల్లారింది. ఆమ్మ వచ్చింది.

***

నల్లగా రివటలా ఉన్నాడతను. నేనూహించినట్టే పెళ్ళి చేసుకోలేదట. హుషారుగా ఉన్నాడు. తెల్ల అడ్డ పంచె, తెల్ల చొక్కాలో పూలరంగడిలా ఉన్నాడు. ఇంటిముందు బోలెడు మొక్కలు.. ఉన్న కాస్త పొలం కౌలుకిచ్చి వచ్చినదాంతో హాయిగా బతికేస్తున్నాడు. చీకూ చింతా.. పెళ్ళీ పెళ్ళామూ.. ఏమీ లేని సన్నాసి జీవితం కదూ మరీ! వంటింట్లోంచి కాఫీ గ్లాసులు ట్రే లో పెట్టి తెస్తున్న అతనికి ఎదురెళ్ళింది వినత. నాకు నచ్చలేదు.

"ఉంటానయ్యా నరహరీ.. మళ్ళీ రాగలనో లేనో.." కారెక్కుతూ చెప్పింది ఆమ్మ.
"భలేదానివే పుష్పొదినా...!" చటుక్కున ఆమె చేతులు పట్టుకున్నాడు. అతని గొంతు గరగరగా ఉంది..

విసుగ్గా డ్రైవింగ్ సీట్లో కూలబడ్డాను. వెనక ఆమ్మ వినతతో ఏవేవో చెప్తోంది.

"అయ్యో.. డైపర్ బేగ్ మర్చిపోయాను చక్రీ..." వీధి మలుపు తిరుగుతూండగా అరిచింది వినత. 

విధిలేక వెనక్కి వెళ్ళిన నాకు పంచె ఎగ్గట్టి పరిగెత్తుకొస్తూ అతనెదురయ్యాడు. కళ్ళలోకి చూడకుండా బేగ్ అందుకుని వెనక్కి తిరగబోతూండగా... క్షణంలో సగం సేపు అతని కాళ్ళ మీద పడింది దృష్టి.. నా కళ్ళు బైర్లు కమ్మాయి.

అతని కాలివేళ్ళ మధ్య ఖాళీ... మరో వేలు పట్టేంత... 


Tuesday, October 1, 2013

గాలిసంకెళ్ళు ~ 10

కౌముదిలో ప్రచురించబడుతున్న "గాలిసంకెళ్ళు" పదవ భాగం ఇక్కడ..