Monday, December 31, 2012

గాలిసంకెళ్ళు


కౌముదిలో..  నేను రాస్తున్న "గాలిసంకెళ్ళు" ప్రచురితమవుతోంది.

Happy New Year!


Saturday, December 29, 2012

సగం మనుషులం..


చిన్నమ్మా,
వాచకాలలో నీతుల్ని వల్లిస్తూ
దరిద్రంలో హరిద్రాశోభల్ని గుర్తిస్తూ
ఓపిక లేని భార్యలకు సహనాన్ని బోధిస్తూ
ధైర్యంలేని తమ స్వభావాన్ని ధర్మమని పిలుస్తూ
బరువుగా బెదురుగా బతుకుతున్న వీళ్ళమధ్య
డైనమేట్ పేలాలి
డైనమోలు తిరగాలి

పేలాయి డైనమేట్లు.. చాలా సార్లు!


"సమాజం" ఎంత పెద్దపదమో! బరువుగా.. దినపత్రికల్లోనో, కవితల్లోనో, ఉపన్యాసాల్లోనో మాత్రమే ఇమిడే పదం. అక్కడ మాత్రమే బావుండే పదం. "నాన్నా, లేమ్మా పొద్దెక్కిందీ.. సమాజం ఎదురుచూస్తూంటుంది. మరమ్మత్తులు చెయ్యద్దూ!" అని ఏ అమ్మా మేలుకొలుపు పాడదు. "ప్రియా, నా జీవితం నీతో పెనవేసుకుంది. నా ప్రాణాలన్నీ నీకోసం తపిస్తున్నాయి. మనం ఏకమై మన పాపాయిని ప్రేమకి ప్రతిరూపంలా పెంచి సమాజానికి కానుకిద్దాం." అని ఏ ప్రియుడూ ప్రేమలేఖ రాయడు. ఎందుకు లేస్తున్నామో, ఎందుకు కడుపుకింత తింటున్నామో, ఎందుకు సంపాదిస్తున్నామో, ఎందుకు కంటున్నామో, ఎందుకు ఉంటున్నామో.. మోకాటి చిప్ప బద్దలైన క్షణం మాత్రమే పుట్టే ప్రశ్నలు. ఉదయాన్నే "కరాగ్రే వసతే లక్ష్మీ.." అనుకుంటూండగా మెదిలేవి కానేకావు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే బావుంది. అప్పుడప్పుడూ మనకి బోర్ కొడుతుంది. ఏదైనా కలకలం జరిగితే కుతూహలంగా ఉంటుంది. ఎవడో తాగి కార్ తోలి హత్య చేస్తే కోపమొస్తుంది. ఎవడో తవ్విన గోతిలో పడ్డ పాపాయి గురించి పేపర్లలో రాస్తే మన గుండె బరువౌతుంది. మనకీ ఏదో ఒక పని ఉండద్దూ! అప్పుడు గుర్తొస్తుంది. మనం సమాజంలో భాగమే అని. ఇంట్లో కూర్చుని చర్చించేవాళ్ళు ఎందరో..! బయటికెళ్ళి టీవీ మైక్ ముందు మాట్లాడేవాళ్ళు కొందరు. వెరసి సమాజం మారాలని కోరుకునే వాళ్ళమే అందరం!


సమాజమంటే ఏంటబ్బా? అద్దంలో చూసుకుంటే కనిపిస్తుందని, ఒళ్ళో కూర్చుని ఆడుకుంటుందనీ, 'స్కూల్ బస్ అందుకోలేకపోయాననీ, లేటయిపోయిందనీ' రాగాలు గునుస్తూ నాలుగున్నర అడుగుల ఎత్తున మన లివింగ్ రూమ్ లో నిలబడుతుందనీ, పప్పులో పోపు వేస్తూ ఇంగువైపోయిందని మైండ్ నోట్ చేసుకుని, మరో వైపు దోసె పెనం మీద తిరగేస్తూ వెనక్కి తిరిగి వాల్ క్లాక్ నీ, డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీ ఖాళీగా ఉందో ఎదురుచూస్తోందో చెక్ చేసుకుంటూ ఉంటుందనీ, ఈవెనింగ్ వాక్ వెళ్ళివస్తూ దార్లో కనబడ్డ జాంకాయల్ని తను తినలేనని తెలిసీ కొనుక్కొచ్చే మూడుకాళ్ళ నడకలో ఉంటుందనీ.. మనం ఊహించం!!


మనిషి పుట్టుకకి కర్త నిజంగానే పైనెక్కడో ఉండి ఉంటే.. అతను చేసిన పెద్ద తప్పు "మనిషికి తెలివి, బాధపడే మనసూ ఇవ్వడం" అదుండబట్టే ఆలోచించీ చించీ చించడానికే జీవితమంతా ఖర్చుపెట్టేస్తాం కానీ ఆచరణకొచ్చేసరికి ఎన్ని అడ్డంకులో! వాటిని తీసి పక్కన పెట్టి నడవగలిగే తెలివి మాత్రం ఉండదు. ప్చ్.. ఐరనీ! బాధపడీ, పడీ.. తెల్లారేసరికి మర్చిపోతాం. మళ్ళీ లేస్తాం తింటాం కంటాం.. ఏది మానేసాం!


ఆమె తన ప్రాణం ఖరీదు కట్టి దేశాన్ని "మరోసారి" నిద్ర లేపగలిగిందని సంతోషంగా ఉంది.

ఒక్కడు.. ఒక్కడంటే ఒక్కడు "ఆమెను జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లని జాగ్రత్తగా పెంచాలి. అమ్మ ఎన్ని చూసిందో.. ఇకపై చూసే కాస్తా సంతోషమే అవ్వాలి" అనుకుంటే చాలు.

ఒక్కతంటే ఒక్కతె జోల పాడుతూ "వీడికి ఆడదాని విలువ తెలిసేలా పెంచాలి. దీనికి మగాడిని ఎలా చూసుకుని, పిల్లలని ఎలా పెంచాలో తెలిసేలా పెంచగలగాలి." అని కూనల్ని తడుముకోగలిగితే చాలు.

పెనవేసుకున్న ఆ క్షణం.. ఒకే ఒక్క క్షణం.. ఆమె విలువ అతనికి, అతని విలువ ఆమెకీ అర్ధమవగలిగితే చాలు.

ఒక్కడంటే ఒక్కడు "నీ కళ్ళు పేలిపోను చూడవే నన్ను హాయ్.." హాయిగా లేదని పాట మార్చగలిగితే చాలు.సంతోషంగా ఉంది.. సంవత్సరం ఇలా ముగుస్తున్నందుకు.
సంతోషంగా ఉంది.. ఆమె వెళ్ళిపోయినందుకు.

(No RIPs please!)

Monday, October 8, 2012

ఎంత పున్నెమ్ము చేసినానే! (నాయికలు ~ 8)

"ఇన్నాళ్ళకు ఓ జంట సఖ్యంగా మన కళ్ళబడింది. ఏ ఊరో పండిపోయి ఉంటుంది." సంబరంగా చెప్పింది శారిక.
"అవునవును.. గువ్వల జంట కొమ్మ ఊయల మీద, పడుచు జంట ఉయ్యాల మీదా.. బాగు బాగు.." పొన్న చెట్టు  మీద నుంచి ఆ తోటలో సంజె చీకట్లు ముసురుకుంటున్న వేళ.. సరాగాలాడుతున్న ఆ ఇద్దరినీ తేరిపార చూసాడు గోరువంక.
"అలా చూస్తావేం.. మన దృష్టే తగులుతుందేమో అన్నట్టున్నారిద్దరూ!"
"ఓయబ్బో.. ఇన్నిరోజులూ చేసినదేంటీ..! ఎవరెలా వేగుతున్నారో, ఏమని వగస్తున్నారో చూసి కబుర్లు చెప్పుకోవడమే కదూ!"
"హ్హు.. వీసానికి వీగిపోతావు కదా! ఏదో ముద్దుగా ఉన్నారని మురిసానంతే!" చిన్నబుచ్చుకుంది గువ్వ.
"సరేలే.. అతగాడేదో బులిపిస్తున్నాడా భామను. నేనూ నేర్చుకుంటానుండు."
"నువ్వా!! చాల్లే.. కొండనాలిక్కి మందు వెయ్యకు!"
"సరి..! వద్దని కోరుకున్నది నువ్వే. ఆనక వగచి ప్రయోజనం లేదు." కవ్వించాడు గోరింక.
"ఉండవోయ్.. అతని మాటలు విననివ్వకుండా ఏవిటీ నీ ఘోష.. " విసుక్కుంది.

                                              ***

"ఐతే నా సింగారం బాలేదన్నమాట!" మూతిముడిచిందామె.
"బాగులేదనలేదు. పూర్తి కాలేదన్నాను." నవ్వాడతడు.
"ఏదీ.. మీరొచ్చే వేళయిపోయింది. త్వరపడి ముస్తాబవుతున్నానా.. ఇంతలో తలుపు తట్టారు."
"ఓహో.. తొందరగా వచ్చేసానా? తలుపు వెనుకే నిలబెట్టలేకపోతివా?"
"అయ్యో.. " నొచ్చుకుంటూ అతడి మోములోకి చూసింది.
"నీలాల కురులు ఇంత వైనంగా దువ్వి ముడిచావే.. ఇవిగో.. ఈ మల్లెలు తురమనిదీ నిండేదీ!"  లేచి పక్కన సజ్జలో ఉన్న మల్లెలచెండు అందుకుని ఆమె జడలో తురిమాడు. కళ్ళిప్పినవ్వాయి మల్లికలు.. తమ అదృష్టానికి మురుస్తూ.. తననే కన్నార్పక చూస్తున్న ఆతని చూసి సిగ్గుగా కళ్ళువాల్చి ఓరగా నవ్వింది.
"నవ్వకు ప్రియా. పాపం మల్లెలు చిన్నబోతాయ్.."
"మీరు మరీనూ.. " ముద్దుగా విసుక్కుని ఉయ్యాలపై కూర్చుంది.

మోకాలిపై గడ్డముంచి మంజీరాలను సవరించుకుంటూ.. కనులు విప్పి కలలు కంటోంది. ఆతని సాన్నిధ్యమిచ్చే పారవశ్యం ఆమెను తన్మయురాలిని చేస్తోంది. మాటమూగబోతుంది. పెదవులపై నవ్వు చెంగలించి ఉరుకుతూ ఉంటుంది. గుండె లయతప్పి కొట్టుకుంటుంది. మతి తప్పి మైకం కమ్ముతుంది. "ప్రేమ మహిమేనా ఇదంతా! ఏ జన్మ వరమో కదూ! ఉహూ.. ఎన్నో జన్మలు పంచాగ్నిమధ్యంలో, వాయుభక్షణ చేస్తూ తపస్సు ఆచరించి ఉంటుంది తను. ఏం.. రాజ్యాలూ, ఐశ్వర్యాలూ, మోక్షాలకోసమేనా తపస్సు! ఇంత మురిపించే మగని కంటే ఐశ్వర్యమేముంది! మనసు తెలుసుకు మసలే అతని కౌగిలి కంటే స్వర్గమున్నదా!" ఆలోచిస్తున్న ఆమెకాలికి చల్లని స్పర్శ! ఉలిక్కిపడి చూసింది. ఉయ్యాల పక్కన కింద కూర్చుని లత్తుక నెమలికన్నుతో తీసి తన పాదంపై దిద్దుతున్నాడు.
"అరెరే.. " కాలు వెనక్కి తీసుకోబోయింది.
పట్టుకుని ఆపాడాతను. "దిద్దనీ.. ఎంత ఎర్రగా ఉన్నాయీ పదపల్లవాలు! లత్తుక ఎరుపు కనిపిస్తుందా అసలు! కెందమ్ములమ్మీ నీ పాదాలు!" దీక్షగా దిద్దుతూ తల పైకెత్తకుండా ఆరాధనగా అన్నాడు.
కనులలో చిప్పిల్లుతున్న నీటికి మసకగా ఆనిందాతని రూపు. నవ్విందామె... గర్వంగా.

పారాణి దిద్దడం పూర్తి చేసి పక్కన చేరి ఆమెను చూసుకున్నాడు. ముగ్ధంగా తననే చూస్తోందామె. చూపులు కలిసినంతనే సిగ్గిలి మోము చేతులలో దాచుకుంది. ఆ అనుపమాన సౌందర్యానికి చిరుసిగ్గులు ఎంత వన్నె తేగలవో ఊహించలేనివాడు కాదు కదూ!
"ఏవిటది? నీ పెదవిపై..?" అమాయకంగా అడిగాడు.
చప్పున చేతులు తీసి, తన అందానికి ఏంతక్కువయ్యిందో చూసుకుందామని అద్దం కోసం ఇటూ అటూ వెతికింది.
"నేనున్నది ఎందుకూ.. ఇటు తిరుగు.. నేను తుడిచేస్తాను" అని నమ్మబలికాడు.
"ఊ,," మోము చూపిందామె. చటుక్కున ఆమె బింబాధరాలపై ముద్దుముద్దరలేసాడు. ఊహించని అతని చిలిపితనానికి మరింత సిగ్గుపడి ఆతని గుండెల్లో తలదాచుకుంది.
"సిగ్గే.. ఇటు చూడూ."
"ఉహూ.."
"చూడకపోతే ఎలా! జాబిల్లి లేక చీకటి!"
అర్ధం కానట్టు చూసింది.
"నీ మోము జాబిల్లి.." నవ్వుతూ చెప్పాడు.
ఆమె చెక్కిళ్ళు కెంపులయ్యాయి. మోవి సనసన్నని నవ్వులు చిలికిస్తోంది. కోలకళ్ళు తీయని మైకంలో వాలిపోతున్నాయి.

"కురులేమో.. కృష్ణ రజని. నవ్వులు వెన్నెలలు! వనకన్యవు నీవు! అన్ని వన్నెలూ నీలోనే దాచేసుకున్నావు. ఇదిగో.. ఇప్పుడీ గులాబి చెక్కిళ్ళకి ఎలా దిష్టి తీయాలబ్బా!"  గాజుల చేతులు రెండూ పట్టుకుని ఆమె సిగ్గుని తరిమేసే ప్రయత్నం చేస్తూ అడిగాడు.
"వదలండీ.." దూరంగా జరిగే ప్రయత్నం అసలు చేయకుండా బెట్టుచేసిందామె.
"తెలిసింది.." చటుక్కున లేచి పుప్పొడిలా మెరుస్తున్న బంగరుపొడి ఓ చిన్ని పాత్రతో తెచ్చి పక్కన చేరాడు. సన్నని కుంచె తీసుకున్నాడు.
అతని అల్లరి తెలిసిన ఆమె అనుమానంగా చూసింది.
"చెక్కులపైనే భామా! " నవ్వాడు.
తత్తరపడి నవ్వేస్తూ కనులు వాల్చింది.

మసకచీకటిని తరిమేస్తూ దేదీప్యమానంగా వెలుగుతున్న దీపకాంతులలో, పసిడి గొలుసుల ఊయలపై విలాసంగా కూర్చుని చెక్కిళ్ళపై మగని చేత మకరికలను దిద్దించుకుంటోందామె. ఏకాగ్రతతో తన బంగరుబొమ్మ అందానికి నగిషీ చెక్కుతున్నాడతను. గువ్వలు ముచ్చటగా చూస్తూ నవ్వుకున్నాయి.
ఇరులలో తారక లివియంచు, తానెనా
కురులలో మల్లియ విరులు తురుము!
అసలె కెందమ్ము లీ అడుగు లనుచు, ఎంతొ
పొందుగా లత్తుక పూయు తానె!
అదియేదొ అంటె నీ అధరాన నని, తన
మెత్తని పెదవుల నొత్తి తుడుచు!
చూచుచు, మరిమరి చూచి మెచ్చుచు, మక
రికల చెక్కిళ్ళ చిత్రించుతానె!

ఎంత పున్నెమ్ము చేసినానే, మగండు
ఒక్క క్రీగంటి చూపులో, ఒక్క లేత
నగవులో, నా మనస్సు నెరిగి గ్రహించి,
తీర్చునే యంచు మురియు 'స్వాధీన పతిక'.

                                    ***


* దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన "శృంగార నాయికలు" ఆధారంగా, కాసింత కల్పన జోడించి.


~  మనసేలే దొరలకు, వారి మనసెరిగి మసలే భామలకు..

Sunday, October 7, 2012

హృదయేశుడున్న ఆ పొదరింటి వరకు.. (నాయికలు ~ 7)

గాలి గుసగుసలతో వలపు రహస్యాలను, ఎవరో వేణుకుంజాల సాయమడిగి వర్తమానం పంపిస్తున్నట్టూ  ఉండుండీ సన్నని సవ్వడి.  రాత్రి మహ మత్తుగా సాగుతోంది.  తొలిఝాము గడవబోతోంది. పాలకడలి  మరిగి నురుగులతో నేలను ముంచెత్తినట్టు తెలివెన్నెల!  మబ్బులు ఆ ధవళిమనద్దుకుని ఆకాశదేశాన కులుకుతూ విహరిస్తున్నాయి. కలువలరాయుడు విరగబూసిన తన చెలియల సుగంధానికి మతితప్పి మురుసుకుంటున్నాడు.

కుటీరపు తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. వెన్నెలబొమ్మ గుమ్మం దాటి అడుగు బయట పెట్టింది. హంసకం ఘల్లుమన్నది. కోరడిని అల్లిన నీలిగోరింట.. "ఎక్కడికమ్మా..?" అన్నట్టు చూసింది. ఆమె తలుపు ఓరవాకిలి చేసి  ముందుకు నడిచింది.

వలిపెంపు చీర సింగారించిందామె. తళుకులీనే తెల్లని రవిక తొడిగింది. మిసమిసల మేలిముసుగున మోము దాచింది.  సోయగాలమాలికలల్లి ఎవరి పాలజేద్దామనో నడిచివెళ్తోంది. ఆమె పాదాలు తెలనాకులు! పల్చగా కాంతులీనుతూ మా జిగి చూసి ఆమె సొగసు ఊహించమంటున్నాయి. మీగాళ్ళపై దిద్దిన లత్తుక వెన్నెలలో మెరిసిపడుతోంది. మువ్వల సడి ఆమె తొందరలా గలగలమంటోంది. వీధి మలుపు దాటి వస్తూ ఎవరైనా గమనిస్తున్నారేమో అని ఆగి, మేలిముసుగు కాస్త తొలగించి చూసింది. చంద్రదర్శనమయిందని చకోరాలు సంబరపడ్డట్టు, ఆమె ముద్దుమోము చూసి జాబిలి సంతోషం పట్టలేక వెన్నెల పూవులు పూయించాడు. వీధిమొగ దాటి పచ్చని బయలువైపు అడుగులు వేసిందామె.

పచ్చని పసిరికపై తెల్లని ఆమె పాదాలు.. పచ్చిక అంచున నిలిచిన మంచు ముత్యాలలో  తడిసి తళతళలాడుతున్నాయి. ఇంకా ముందుకు వెళ్ళి తన ప్రాణేశ్వరుడున్న బృందావని వైపు నడిచింది. వేసిన అడుగు దూరం తగ్గిందని సంబరపడితే, వేయాల్సిన అడుగు విరహాన్ని మరిమరి పెంచుతోంది. ఎవరైనా చూస్తున్నారేమో అని చుట్టూ పరికించిచూసిన ఆమె కనులు బెదురు హరిణివి కావు, మిలమిలలాడే మీలు కావు. విచ్చిన కలువరేకులు కావు..  కనుల ధావళ్యానికి వన్నె తెచ్చే ఓ ఎర్రని జీర తళుక్కుమంటోందామె నేత్రాలలో.. అది విరహపడు కన్నులకు మాత్రమే సొంతమైన సొబగు. లేడికేం తెలుసా ఎడబాటు! వెర్రి చేపల పోలికా ఆ కన్నులకు! శతపత్రములకెక్కడిదీ ఆ తరళేక్షణ శోభ! అవి ఆమె కనులు.. రాధ కనులు! విరహవేదన నిండిన కలలవాకిళ్ళు.

ఇంతలో ఓ చిలిపి తెమ్మెర అటుగా వచ్చింది. మేలిముసుగును తొలగించి చూసింది. తుమ్మెదరెక్కల్లాంటి ముంగురులను చెదరగొట్టింది. సవరించుకుందామని గంధపొడి అద్దుకున్న చేయి పైకెత్తింది రాధ. గాజులు గలగలమని సంగీతమాలపించాయి. చప్పున వాటిని ఆపింది. ఈ కలవరంలో అడుగు వెయ్యగానే ఘల్లుమని గుట్టంతా రట్టుచెయ్యబోయాయి కడియాలు. "అడుగు సుతిమెత్తగా వేసినా ఈ అల్లరేంటీ!" అని మువ్వల కడియాలను విసుక్కుని, చీర చెరగున గాజులు కదలకుండా బిగించి, మునివేళ్ళమీద మరింత సుతారంగా అడుగులు వేసింది. "ఎంతకు తరిగేనీ దూరం..!  మార్గమధ్యంలో ఎవరి కంటైనా పడితే! ఈ విరహం తీరే క్షణం కోసం చేసిన ఈ ప్రయత్నమంతా వృధా కదూ! అక్కడ పొదరింట విరహంలో కనలుతూ వేచియున్న ప్రియుని చేరే దారింత సుదీర్ఘమైనదెందుకయ్యిందో.." అని కలవరపడింది. ఆతని తలపు ఇప్పపూవుల పరిమళమల్లే కమ్మేసిందామెను. మత్తుగా సోలి సిగ్గిలుతున్న కనులలో అరనవ్వు దాచుకుని వడివడిగా నడిచింది.

"ఈ వెన్నెలరేయి ఎంత బావుంటే మాత్రం కల్పవృక్షపు ఛాయలో కిన్నెర మ్రోగిస్తూ గడిపే అచ్చరలు భువికి చేరి సొగయడం ఎంత విడ్డూరం!" శారికతో అన్నాడు గొరవంక.
అప్పుడే విచ్చిన పారిజాతాల పరిమళానికి ఆ కొమ్మ మీదే రేయంతా గడుపుతున్న ఆ గువ్వలజంటకి, అల్లంత దూరాన నడిచి వస్తున్న ఆమె కనిపించింది.
"అచ్చర కాదామె..!"
"అవునా!"
"ఊ.. ఆ కనుల తడబాటు చూడు. ఇంత చల్లని వెన్నెల రేయి ముచ్చెమటల కరిగిన ఆ తిలకపు జాడ చూడామె నొసటిపై.. అచ్చరలే అయితే ఇంత విరహానికి ఎగిరెళ్ళి కౌగిళుల వాలిపోరూ!"
"ఎంత దూరం నుంచి నడిచొస్తోందో.. పాపం ఈ అభిసారిక!"

పారిజాతపు తిన్నె పక్కనే ఉన్న కలువల కొలను ఒడ్డున క్షణమాగింది రాధ. ఆమె మోముని చూసి గుప్పున పరిమళం చిమ్మాయి కలువలు. గుండెల నిండుగా ఆ సుగంధాన్ని పీల్చుకుని రెట్టింపైన విరహాన్ని ఓపలేక విలవిలలాడిందామె. అడుగులు తడబడ్డాయి. పొగడ పువు మొలనూలు జవజవలాడింది. ఒక్కో పూవూ రాలుతూ వింత ఆభరణంలా తోచింది. "చూస్తివా.." అంటూ గువ్వలు గుసగుసలాడాయి. ఆ శబ్దానికే అదిరి చుట్టూ చూసిందామె. పారిజాతపు శాఖపై ఒదిగి కూర్చున్న గోరువంకలు కనిపించాయి. తన బెదురును తలుచుకుని నవ్వుకుంది. పగడపు పెదవి చివర పూసిన నవ్వు పారిజాతమల్లే ఉంది. దానిని చూసి నేల చేరే సమయమాసన్నమైందని తలచి ఒకదాని వెంట ఆ పగడమల్లెలు జలజలా రాలాయి. జల్లుజల్లున తడిపేస్తున్న  పూవుల వర్షానికి ఆమె మరింతగా విరహాన వేగింది. ఆ కుసుమాల తాకిడి, దవ్వున పొదరింట ఎదురుచూసే మురళీమనోహరుని చూపులు తన తనూలతికను పలకరించే వైనాన్ని గుర్తు తెచ్చిందామెకు. క్షణమైనా ఆలస్యం చేయక నడక కొనసాగించింది. పారిజాతాల వర్షానికి తడిసిన ఆమె ముంగురులు నెలకూనల్లే ఉన్న ఆమె నుదుట అతుక్కుని వింత సోయగాన్నద్దాయి.

దట్టమైన కదంబవనంలోకి ప్రవేశించింది. వెన్నెల చారికలు నేలమీద అక్కడక్కడా కనిపిస్తున్నాయి. నేలమీది జాబిల్లిలా తెలికోకలో మేని మిసమిసలు దాచానని భ్రమపడి నడుస్తున్న ఆమెను చూసి మిణుగురులు నెవ్వెరపోయాయి. రివ్వున ఎగిరొచ్చి చుట్టూ చేరి తమ వెలుగులో ఆమెను చూసేందుకు తాపత్రయపడుతున్నాయి. రాత్రి వేళ ప్రకాశించే అపూర్వమైన ఓషధిలా మెరిసిందామె. దారి చూపుతూ ముందుకు సాగాయి మిణుగురులు.. అతని చేరేందుకు వడిగా సాగిన ఆమె నడక విరహవేదనని అడుగు అడుగుకీ తగ్గిస్తోంది.

నడిరేయి, కాని పున్నమినాటి వెన్నెల
పాల వెన్నెల జడివాన లీల!
హృదయేశు డున్న ఆ పొదరింటి వర కొరుల్
పసిగట్టకుండ పోవలయుగాదె!
తెలికోక, తెలిరైక, తెలిమేలిముసుగులో
మెయి సోయగపు మిసమిసలు దాచి,
కాలి యందెల కడియాల గాజుల మువల్
రవళింపకుండ  చెరగున జొనిపి

మోముపై, కేలిపై గంద వొడి నలంది
పులుగు రవ్వంత గూట కదల బెదురుచు
ఆకుసడి కదరుచు, గాలి అడుగులిడుచు,
వెడలె నభిసారికగ ప్రియు కడకు రాధ.                                    ***

* గువ్వలు రేపు కూడా రమ్మన్నాయి.
** దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన "శృంగార నాయికలు" ఆధారంగా, కూసింత కల్పన జోడించి..Saturday, October 6, 2012

పవళింపు గదిలోన.. (నాయికలు ~ 6)

"ఓ గువ్వా, ఇక్కడేం చేస్తున్నావో.." పక్కన వచ్చివాలుతూ ప్రశ్నించాడు గొరవంక.
"ష్.. గోల చెయ్యకూ.. నువ్వే చూడు." కవాటపు అంచు మీద కాస్త జరిగి పెనివిటికి చోటిచ్చింది శారిక.
"ఎంత పెద్ద మంచమో!!"
"మరి! ఈ పడకింటి సొగసుకే రెక్క కదపలేక ఆగిపోయాననుకో!"
"ఇంత బ్రహ్మాండమైన చప్పరపు పాన్పు ఎక్కడా చూడలేదమ్మీ!"
"సత్యం! అదొక్కటే కాదు. చూడు ఆ కొమ్మని"
"ఎవరీ భామ!"
"భామ అని చప్పగా అనేసి ఊరుకుంటావా! సర్లే.. చూడు చూడు"

పందిరిపట్టెమంచం పక్కన నిలబడి చెక్కిట చెయి చేర్చి ఆలోచిస్తూ నిలబడిందో లావణ్యరాశి. ఆమె తన నిడువాలు వేణీబంధం అలవోకగా చేతిమీద నుండి జార్చుకుని నిలబడిన తీరు ఏ గొప్ప చిత్రకారుని కుంచె కదిలి ఏర్పడ్డ  చిత్రమో అన్నటుంది. ఏదో నిర్ణయించుకున్నట్టు చటుక్కున గదిలోంచి బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చిందామె.. పాలనురగలాంటి జిలుగు దుప్పటి పట్టుకుని! చకచకా దుప్పటి పరిచి, తలగడలు అమర్చింది. బాలీసులు పేర్చి.. మల్లెమొగ్గలను శయ్య మీద జల్లింది. ఆ చప్పరం మీద నుండి వ్రేలాడుతున్న వితానపు మిసమిసలు చెప్పనలవి కావు. "గుట్లన్నీ మా చాటునే!" అంటూ గర్వంగా తలెగరేస్తున్నట్టుందా మేలుకట్టు.. సన్నగా ఊగుతూ.. గాలితో సరాగాలాడుతోంది. ఆ తెరలను పక్కకు సవరించి,  పాన్పు మీద మరిన్ని మల్లెలు గుమ్మరించి సంతృప్తిపడిందామె.

"అబ్బో! నేర్పరే! సెజ్జ ఎంతందంగా తీర్చిందో!"
"ఇదేం చూశావూ.. అక్కడ మంచం పక్కనే దంతపుకోళ్ళ బల్లపై ఉన్నవి చూడు."
"పళ్ళెరం.."
"వట్టి పళ్ళెరం కాదు. ఆ పళ్ళెరం చేత పట్టుకుని ఈ కలికి గదిలోకి అడుగుపెట్టిన తక్షణం మంత్రం వేసినట్టయి ఆగిపోయానిక్కడ. ఏమి దివ్య సుగంధం!! మునుపెరుగను సుమీ!"

ఓ కుదిమట్టపు గంధపుగిన్నెలో కస్తూరి, పునుగు కలిపి రంగరించిన మేలుచందనం . "పరిమళాల పోటీలో నేనే గెలవాల"న్నట్టు తన ఉనికిని నిఠారుగా నిల్చి తెలియచేస్తోంది పన్నీరు బుడ్డి. లతలు చెక్కిన పనితనం అణువణువునా ప్రదర్శిస్తోందది. దేశదేశాల్లో దొరకని అరుదైన మేలు అత్తర్లు పలు కుప్పెల్లో ఉన్నాయా పక్కన. మరో గిన్నెలో గులాబినీట తడిసిన తెలతెల్లని సున్నం. పచ్చకప్పురపు పలుకు తగిల్చి, గొంటు పోక చెక్కలు కత్తిరించి పెట్టింది. యాలకులు, లవంగాలూ.. కావలసిన ద్రవ్యాలన్నీ ఉన్నాయక్కడ. వాటికి సరిజోడు శ్రేష్ఠమైన కవటాకులు! అటుగా వచ్చి తమలపాకులను చూసి మరో సారి తృప్తి పడింది. నోట తాంబూలం పండని రేయి వృధా! అని ఎరిగిన జాణ ఆమె! కప్పురవిడెమిచ్చి వలపు పుచ్చుకోవాలని తెలుసామెకు.

బయటకు వెళ్ళబోతూ వెనక్కి తిరిగి మరోసారి తన పడకటింటి సొగసు చూసి మురిసి నిలబడిపోయింది. ఇంతలో మరచినదేదో గుర్తొచ్చి తన మతిమరపుని నిందించుకుంటూ నుదురు మునివేళ్ళతో కొట్టుకుంది. చిటికెలోఅగరు ధూపాన్ని వెలిగించి తెచ్చి, బల్లమీద పెట్టి నలుదెసలా ఆ పొగలు కమ్ముకుంటున్నాయని నిశ్చయించుకుని, తలుపు ఓరగా వేసి బయటకు నడిచిందామె. ఇంతందమైన పడకటిల్లు వదిలి ఈమె పరుగులు తీస్తున్నదెక్కడికీ అని గోరువంకలూ అనుసరించాయి.

ముంగిట చకచకా కళ్ళాపి జల్లి, నేల ఆరగానే ముగ్గు పెట్టడానికి ఆయత్తమైంది. "ఆహ్వానం పలకొద్దూ! అందుకే ఈ రంగవల్లులు!" గుసగుసలాడిన గోరువంక వైపేనా చూడక, తదేకంగా ఆమె అల్లుతున్న వర్ణచిత్రాన్ని చూస్తోంది శారిక. ఆమె నేర్పుగా వేలిసందులనుండి జార్చుతున్న రంగులు ఎన్నెన్నో హొయలుపోతూ ఆతని రాకకై సిధ్దపడుతూ.. ముగ్ధంగా, ముత్యాలముగ్గులా.. రూపుదిద్దుకున్నాయి. రంగవల్లిక పూర్తి చేసి, పచ్చని తోరణాలు గుమ్మానికి అలంకరించి ఇక క్షణమైనా ఆలస్యం చేయక లోపలికి దారితీసిందా అమ్మణ్ణి.

"పద పదా.. కవాటం దగ్గరకి." హడావిడిగా బయలుదేరదీసింది శారిక.
కిటికీ దగ్గర నిలబడి చూస్తున్న గువ్వలజంటకు గదిలో ఆమె అలికిడి వినిపించలేదు. ఈ పడతి ఏమయ్యిందని వెతుక్కుని చేసేదేం లేక ఎదురుచూడసాగాయి. మత్తిలిన అగరుధూపం మెలికలు తిరుగుతూ గదంతా తరచి చూస్తోంది. "అంతూదరీ లేని స్మరమోహానికి తావలమీ సెజ్జ" అనక మానరు ఎవ్వరైనా.. ఇంత భోగానికీ కేంద్రబిందువా పడతి. ఇంకారాదేమీ!  క్షణాలు గడుస్తున్నాయి. ఎదురుచూపులు ఇప్పుడు శారికల వంతయ్యాయి.

"హ్మ్.. ఆతని రేయి పండించేందుకు అవసరమైనవన్నీ సర్దిపెట్టి ఎక్కడికెళ్ళిందబ్బా ఈ అమ్మాయి!" స్వగతంగా అనుకుంది శారిక. ఇంతలో పడకటింటి తలుపు దగ్గర అలికిడికి రెండూ ఆత్రుతగా తొంగి చూశాయి.
"ఆమె కంటే ముందే అతనొచ్చేశాడా.. ఏం? "
"వెర్రిదానా.. అతను అప్పుడే రావడమే! చూశావా ఎక్కడైనా?"
"ఆమెకు ఎదురుచూపులు తప్పవని చెప్పకనే చెప్పావయితే.. ! ఓయ్.. అటు చూడు!!"

గదిలోకి నడిచి వచ్చిన ఆ తారుణ్యాన్ని చూడ వేయి వేల కళ్ళు చాలవు! పిడికెడంత లేని ఆ పిట్టలకు ఆమె అతిమానుష సౌందర్యం చూసి మాట రాలేదు.

మంచు బిందువుల స్నానమాడిన కాంచనమల్లే  కోమలంగా వచ్చి నిలిచిన ఆ తలిరుబోడి, తానమాడి మేన అద్దుకున్న పుప్పొడులు గుమ్మంటున్నాయి. అప్పటిదాకా రాజ్యమేలిన అగరుపొగలు మోము దించుకున్నాయి. రివ్వున వచ్చిన తెమ్మెర ఆమెను అమాంతం చుట్టేసి  మత్తైన పరిమళమద్దుకుని మురిసిపోయింది. నెరికురులను తీరుగా సిగ ముడిచి మల్లెలు తురిమింది. నుదుట దిద్దిన చంద్రవంక.. వెన్నెల రేయిని తెచ్చి ఆ గదిలో బంధించేసింది. చెక్కిళ్ళ నునుపు చూసి తెలనాకులు సిగ్గుతో వసివాడాయి. రేయి గడిచిపోక మునుపే  ఆ తమలపాకు చెక్కుల పిల్ల చేత చిలకలు చుట్టించుకునే ఆతని భాగ్యమెంతటిదో మరి! ఆమె కాటుకకనుల వైశాల్యం చూసి మల్లెలు చిన్నబోయాయి. "ఇంత చక్కని కళ్ళలోకి చూడక మా అందాన్ని చూస్తాడా ఆ వచ్చేదొర!" అనుకుంటూ..! సింగారించిన గంధపు వన్నె చీర వైనంగా బయటపెడుతున్న ఒంపుసొంపులను చూసి పరిమళద్రవ్యాలకు గర్వభంగమయ్యింది. ఇంతకంటే మత్తెక్కించడం మా వల్ల కాదంటూ చేతులెత్తేసాయి.  తను సృష్టించిన ప్రేమ సామ్రాజ్యానికి విచ్చేసి విందారగించే విభుని రాకకై ఎదురుచూస్తోందా చందనపు బొమ్మ. అంతేనా!  తన అందాన్ని కోటిరెట్లు చేసే అలంకరణ ఒకటి నేర్పున తొడిగిందా జాణ.. ఆ చిగురు పెదవులను వీడని మొలక నవ్వు!

పవళింపు గదిలోన, పగడంపు కోళ్ళ చ
ప్పరపు మంచముపైన పాన్పు పైన
వలిపంపు జిలుగు దుప్పటి వేసి, కస్తూరి
జవ్వాది కలిపిన గంధసార
మగరువత్తులు, మేలి అత్తరుల్, పచ్చక
ప్పురపు వీడియము పళ్ళెరమున నిడి
ద్వారాన తోరణాల్ కూరిచి, ముంగిట
వన్నెవన్నెల రంగవల్లు లుంచి

తానమాడి, పుప్పొళ్ళ నెమ్మేన నలది
నెరుల సిగ నల్లి, నుదుట చెందిరపు బొట్టు,
కనుల కాటుక, అలతి నగవులు మెరయ
విభుని కొరకు వాసకసజ్జ వేచియుండు.

                                       ***

* గోరువంకల వెంట వెళ్దాం రేపు కూడా..
** దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన "శృంగార నాయికలు" ఆధారంగా, కాసింత కల్పన జోడించి.. 


Friday, October 5, 2012

ఏలాగునీ మేఘవేళ.. ఒంటరి రేల.. (నాయికలు ~ 5)

చిటచిటా మొదలయిన చిరు చినుకుల సందడి క్షణక్షణానికీ పెరిగేలా ఉంది. టపటపా రెక్కలు విదిలించుకుంటూ ఆ తోట మధ్యలో  తీర్చిన ముచ్చటైన బొమ్మరింటి చూరున చేరుదామని ఎగిరొచ్చాయి గోరువంకలు.

కనుచూపుమేర చిక్కని చీకటి. ముసురు మేఘాలు కమ్మిన నింగి ఉండుండీ మెరుపుతీగల్ని విదిలిస్తోంది. ఉరుముల ధాటికి పిట్టా పురుగూ భయపడి గూళ్ళు చేరుకున్నాయి. చెంగలువలు తలలూచుతూ..  తటిల్లతల కాంతిలో వెన్నముద్దల్లా జిగేల్మంటున్నాయి. వానకారు పేరంటానికి మొగలిభామలు అత్తరు పూసుకొచ్చి పచ్చపచ్చగా మెరుస్తున్నాయి. మొల్లలు సరేసరి! వాటి ఘుమఘుమల సంబరం అంతా ఇంతా కాదు. ఆ తోటలో, ఆ బాటలో ఉన్న ప్రతి మొక్కా పూవుగట్టి ఉంటే, ఇంటి ముంగిట ఉన్న  మందారువు మాత్రం బోసిపోయింది.

"తీరైన ఇల్లు.. ఎవరిదో!"
"ఏమోనమ్మీ, బావుంది కదూ! ఆ పక్కగా పక్షులకు ఎంత అందమైన గూడు కట్టారో చూడు. వెళ్ళి పలకరిద్దామా ఈ ఇంటి శారికని?"
"వెళ్దాం వెళ్దాం. ఇటు చూసావూ.. నెమిలి ఉందిక్కడ చూరుకింద."
"ఇంత ముసురుపట్టి ఉరుముతుంటే దిగాలుగా కూర్చుందేం పాపం! క్రేంకరించి ఆడాలి కానీ!"
"ఏమో మరీ.. ఆహా ఎంత బావుందీ వాతావరణం! సృష్టిలో ఏ కాలానికా కాలమే రమ్యంగా ఉంటుందిలే!"
"ఊ.. ఆహ్లాదకరమైన పరిమళం! ధరణీపరాగమో.. కేతకీ సుగంధమో!"
" ఆ దారంతా బారులు బారులుగా మొగలి పొదలూ, మొల్ల గుబురులూ ఎవరో తీర్చి నిలబెట్టినట్టు ఎంత పరిమళం వెదజల్లుతున్నాయో చూడు."
"చినుకుల సంగీతానికి, ఉరుముల తాళానికీ ఈ నెమలి కనుక ఆడిందా.. అప్పుడు కదా సంపూర్ణమవుతుందీ మునిమాపు!"
"అవునవును!"
"ఇంతకీ ఈ వీట ఎవరూ లేనట్టుందే! అలికిడి లేదూ.." తొంగి చూసాడు గొరవంక.

శయ్యపై వాలి ఉందామె! గూటిలోని పెంపుడు గొరవంక కలకలం వినబడిందింతలో..  లేచి బయటకు వచ్చి చూసింది. పడమటిగాలి రివ్వున వీచి ఆమె ముంగురులను చెదరగొట్టింది. నడిచి వస్తున్న యజమానురాలిని చూసి మయూరం లేచి దగ్గరకు చేరింది. ముంగాళ్ళ మీద నిలిచి దానిని సవరించిందామె. మెరుపు వెలుగులో అవ్యక్తంగా కనిపిస్తున్న ఆమె సామాన్యమైన సౌందర్యవతి కాదని గోరువంకలకు అర్ధమయ్యింది. నీలి చీరెలో, పొందికైన అవయవ సౌష్టవంతో, తెగబారెడు నీలాల కురులు జారుముడి వేసి, తగుమాత్రపు అలంకరణతో లక్షణంగా ఉందా ఇంతి. విసురుగా వీచిన ఈదురు గాలికి ఓరగా తెరుచుకున్న తలుపులోంచి, బయటకు చొచ్చుకొచ్చిన దీపకాంతి ఆమెను మరింత స్పష్టపరిచింది. చెక్కుటద్దాల ప్రతిఫలిస్తున్న దీపపు వెలుగులు ఆమె ముద్దులమోమును మరింత నిగ్గులుదేఱ్చాయి. ఆమె ముక్కు సంపెగ, ఛాయ చెంగలువ, సోయగం మొల్ల, పరిమళం గొజ్జంగి..గుత్తంగా వానకారు పనుపున పెరిగి పెద్దైన గారాల పూబోణిలా ఉందామె.

చూరు కింద నిలచి వర్షపు ధాటిని అంచనా వేస్తూ నెమలితో మాటలాడింది. "మయూరీ.. ఇంత ముసురుపట్టిందేమే! చీకటికి తోడు ఈ వర్షం.. ఏవిటోలా ఉందే! వారు గుర్తొస్తున్నారు. ఇలాంటి మేఘవేళ ఉరమగానే బెదిరి వారి కౌగిట చేరినపుడు, భయం టక్కున తీసిపారేసినట్టు పోయేది కదూ! "ఉరిమితే బెదిరే పిల్లవి. ఒంటరివేళల వాన పడితేనో!" అనడిగేవారు నన్ను దగ్గరకు పొదువుకుంటూ.  ఏం చెప్పేదాన్నో తెలుసా! "ఉరుము కంటే ముందే వచ్చే మెరుపు చూడగానే మీరే నా చెంత నిలుస్తారు. ప్రేమేం కాదులెండి. నా భయాన్ని ఆటపట్టించడం మీకు సరదా కదూ!" అని. "నీకేం తెలుసూ.. ఆ బెదురుకళ్ళలో మెరిసే మెరుపెంత మనోహరమో!" అంటూ నన్నే చూస్తున్న ఆ కళ్ళు.. ఆ ననతూపు చూపులు. గుర్తొస్తున్నాయే మయూరమా! ఏడుపొస్తోంది. ఆ ఒంటరి రేయి రానే వచ్చింది. జడివాన కూడింది. మనసంతా దిగులు దిగులుగా ఉంది. నిజం చెప్పూ..  నీకూ అంతేగా! నిన్ను చేరదీసే యజమాని వీట లేడని పురి విప్పి ఆడక నీ సహజ లక్షణాన్ని కూడా పక్కన పెట్టావు. ఎంత ప్రేమ నీది!" ఆమె మాటలు వింటూ మూగగా చూస్తున్న మయూరం ఆమె పాదాలను రాసుకుంటూ వెనుదిరిగి ఓ మూలచేరి కూర్చుంది. దానిని చూసి నిట్టూర్చి పెంపుడు గువ్వ గూటి వైపు కదిలింది.

గోలగోలగా ఏవేవో పలుకుతున్న శారికను చేతిమీదికి తీసుకుంది. నెమ్మదించిన గోరువంకను మునివేళ్ళతో సవరిస్తూ.. "ఏమయిందే శారికా.. వర్షమేగా! భయమెందుకూ..? హ్హు.. నీకు చెప్తున్నానా నేను! ఈ చల్లని వేళ ఆ ఉయ్యాలలో జంటగా వెచ్చవెచ్చగా కూర్చుని ఆ కొండమీదనుండి దూకుతున్న వాగుల ధ్వని వింటూ, మయూరి నడకలను.. పురివిప్పి ఆడే ఆ వయారాన్నీ చూసి ఆనందిస్తూ, చూరు నుండి ధారలుగా నేలచేరుతున్న నీలి నీటిదారాలను లెక్కబెడుతూ.. ఇందాకా కొంగలబారులెలా వెళ్ళాయో తలుచుకుని  ఊసులాడుతూ, కాస్త తెరిపివ్వగానే  చెంగల్వదండలు కూర్చుకుని మార్చుకుని.. అరతడిసిన వొళ్ళారబెట్టుకుంటూ.. గూట్లోంచి ఊసులాడుతున్న నిన్ను చూసి నవ్వుకుంటూ.. దీపపు వెలుగులో  నిశి వేళను జమిలిగా ఆస్వాదించేవాళ్ళం కదూ! ప్చ్.. ఇలా ఒంటరిగా గడిపే రేయి వస్తుందని.. దూరదేశానున్న ఆతని తలపులే ఇంతలా వేధిస్తాయనీ  ఊహించనేలేదు సుమా!" దిగులుగా చెప్పింది. శారిక కువకువలాడుతూ తన గూట్లోకి వెళ్ళిపోయింది. తనకు నవ్వులూ, కబుర్లూ నేర్పే యజమానురాలు ఇలా బేలగా మాట్లాడితే దానికి నచ్చలేదు.

ఎడతెగని వర్షధారలు పెంచేస్తున్న గుబులు తీర్చుకునేదారి ఆమెకు తోచలేదు. అటూఇటూ పచార్లు చేసింది. లోపలికి నడిచి శయ్య మీద చేరింది. కళ్ళు మూసుకుంది. అటుఇటు పొర్లింది.  అతని కబుర్లకి నేపధ్యంలో వినిపించే వర్షపు సంగీతం ఎంత మత్తుగా ఉండేదో! ఇప్పుడేంటింతలా వేధిస్తోందీ.. అని విసుక్కుంది. చలి ఆమెను వణికించ ప్రయత్నించి విఫలమై గదిలోంచి బయటకు పోయింది. రాని నిద్రని ఆహ్వానించి విసిగి మంచపు చివర కూర్చుని ఆలోచించసాగింది. ఒళ్ళంతా కమ్మేస్తున్న విరహం.. ఆతని తలపులు మరిమరి గుర్తొచ్చి ముంచేస్తున్న దుఃఖం. శయ్య పక్కనే ఉన్న చల్లని పన్నీరు తీసి జల్లుకుంది. ఆ చల్లదనానికి కాస్త శమన కలుగుతుందేమో అని భ్రమపడినంత సేపు పట్టలేదు.. పన్నీరు ఆవిరై.. గాలిలో ఆ పరిమళం కలిసి ఆమెను మరింత రగిలిపోయేలా చేయసాగింది. కర్పూరపరాగపు చల్లదనానికి ఆశపడింది. మేన రాసుకుంది. ఆమె ఒంటి తాపానికి ఆ సుకుమారమైన పుప్పొడి ఎప్పుడు మాయమైపోయిందో తెలియరాలేదు.

లేచి వీధిలోకి వచ్చి చూసింది. "ఏ దేవతలో కరుణించి శ్రీవారిని ఇంటి ముంగిట నిలబెడితే.. పరుగున వెళ్ళి కౌగిట వాలిపోతే.. ఎంత బావుంటుంది.." అనే వెర్రి ఆశ రగిలి వగచింది. మౌనంగా తలవాల్చి నిలచిన మందారతరువును చూడగానే ఆమె దుఃఖం మరింత పెరిగిపోయింది. సాయంవేళ ఆ మందారపు చెంతనే నిలిచి ఎదురుచూస్తున్న తనను చూసి నవ్వుతూ వచ్చి హత్తుకునే అతని సామీప్యసుఖం.. ఇంకా ఎంత దూరాన ఉందో! ఈ నిరీక్షణలెంతసేపో! తలపులు ప్రయాణించినంత సులువుగా తనువులు సైతం వెళ్ళగలిగే ఏ మాయో తెలియకూడదూ విరహాన వేగే వారికి! ఏ బెంగా తెలియనివ్వని మత్తు నిద్దరైనా రాకూడదూ ఆతనొచ్చేవరకూ..!

"అటు చూడ వీటి ముంగిటను మౌనమ్ముగా
తల వాలిచి మన మందార తరువు!
పురి విప్పదు మన పెంపుడు మయూరమ్ము ది
గులు చెంది దిక్కు దిక్కులకు చూచు!
సారెసారెకు మన శారిక  పలవించు

కలవరపడి ఏదొ పలకబోవు!
ఏలాగు నీ మేఘవేళ ఒంటరి రేల
ప్రాణేశ్వరు ప్రవాసి బాసి" యనుచు

చల్లుకొను మేన చలువ గొజ్జంగి నీరు;
గప్పుకొనును కప్పురము తోడి పుప్పొడులను;
పొరలు సెజ్జ, లేచి మరల నొరుగు సుంత;
పొగులు ప్రోషిత భర్తృక మగని కొరకు.


"చూసావూ.. మనకి మనోహరంగా తోచిన వర్షపురాత్రి, ఈ విరహిణికి ఎంత వెతలరేయో కదూ! ఇంకా ఏ సముద్రాలు దాటి ఏనాటికొచ్చేనో ఈమె ప్రాణవల్లభుడు! " కురుస్తున్న వర్షాన్ని, వేగివేసారుతున్న ఆమెనూ మార్చి చూస్తూ గోరువంకలు నిట్టూర్చాయి.

Thursday, October 4, 2012

నిలబడనీదు వెన్నెలల వాన.. (నాయికలు ~ 4)


వెన్నెలబాణాలు అమ్ములపొదిలో నింపుకుని, వెండిమబ్బుతేరుపై జైత్రయాత్రకు వచ్చిన కలువలరేడు ఆ ఉద్యానవనంలో తటాకం ఒడ్డున దిగులుగా కూర్చున్న ఓ వన్నెచిన్నెల ముద్దరాలిని చూసి ఉలిక్కిపడ్డాడు. "ఈ తెలిదమ్మి ఇంకా వికసించే ఉందే! ఇది తన పరాక్రమానికి చెడ్డపేర"ని భావించాడు. వెన్నెల తూపులతో దాడిచేయనారంభించాడు. ఒక్క సారిగా తోటంతా పరుచుకున్న చంద్రికలను చూసి నెవ్వెరపోయిందామె. ఇప్పటిదాకా లేని వెలుగు తన వగకాని రాకతో వచ్చి ఉంటుందని నలుదెసలా పరికించింది.  అతని జాడలేదని చిన్నబోయిన ఆమె మోమును చూసి, విజయగర్వంతో పొంగిపోయాడు వెర్రి చందమామ.

చెలికాని చూసి కొలనులో కలకలా విచ్చిన కలువల సుగంధం తోటంతా పరుచుకుంది. రోజంతా జుంటితేనెలారగించి మత్తుగా పూబోడుల ఎడదలపై వాలి నిద్దరోతున్న ఎలదేంట్లు ఆ పరిమళానికి ఉలిక్కిపడి లేచి, మరింత మత్తుతో సోలిపోయాయి. తెమ్మెరలు రజనీగంధాలనలదుకుని హడావిడిగా తిరిగేస్తున్నాయి. చకోరాలు విందారగించడం మొదలుపెట్టాయి.

ఇంత మనోహరమైన రాత్రి అలమటపడుతున్న ఆమే విరహిణి అని రూఢి చేసుకుని పరికించసాగాయి గోరువంకలు. ఆమె పాలరాతిబొమ్మ కాదని భారంగా విడుస్తున్న ఆమె వేడిఊపిరి చెప్తోంది. ప్రాణముందని ఎగసిపడుతున్న ఎడద చెప్పకనే చెప్తోంది.

"మరో విరహగాధ! తప్పదా? ఏవిటయ్యా ఇదీ?" శారిక పెనివిటిని నిలదీసింది.
"ఇన్ని చింతలూ, బాధలూ ఉన్న ప్రపంచంలో.. 'ప్రియుని కౌగిలి' అనే చిన్ని ఉపశమనం దొరకగానే తీరిపోయే బాధ ఇదొక్కటే! దానికే నోచుకోని పడతులున్నారంటే ఇది కదూ దారుణమంటే!"
"ఎవరైనా వింటే నవ్విపోగలరు! పొద్దస్తమానం ప్రేమేనా?"
"చరాచరసృష్టికి మూలం ప్రేమే! నవ్విపోదురుగాక..  వెరపేల!"
"బావుంది సంబడం.." గువ్వ నవ్వింది.
                                       
                                              ***

"కర్పూరంలో ఎక్కడిదా పరిమళం? కమలంలోనూ లేదు కదా ఆ సుగంధం! ఆ మోవి తావి! అతని పగడపు పెదవి తీయనిది. బహు తీయనిది! తీయదనమొకటేనా.. ఎంత మత్తైన తావి! మధురాధరాన ఎంత చక్కని పరిమళం కలిపి చెక్కాడా బ్రహ్మ.. నా ప్రాణాలు తీయడానికి కదూ! ఇంతకీ ఆ తీపి ముద్దుదా? ఆ ఆణికాడి మోవిదా? తేల్చేసుకుందామంటే ఇంకా రాడేమీ?" పలవరిస్తున్న ఆమెదెంత ఘాటైన మోహమో కానీ.. ఆమె మోము కలవరమద్దిన వింత సోయగంతో మెరుస్తోంది. చెక్కిలి చందురకావి అద్దుకుని పొగలు చిమ్ముతోంది. మిడిసిపడుతున్న ఆమె లావణ్యాన్ని చూసి 'తాపం ఇంత సొగసు పూయగలదా!' అని ఆశ్చర్యపోతున్నాడు జాబిలి. తనను వీడని తారకలను చూసి విసుక్కున్నాడు. విరహిణి ఒయారం చుక్కలకెక్కడిదీ!

"వెళ్ళి విభుని తీసుకురమ్మని పంపిన దూతికలింకా రాలేదు. శ్రీవారు సభామంటపంలో ఏ సాహిత్య గోష్ఠో, ఏ రాచకార్యమో నెరపుతూ ఉండి ఉంటారు. వీళ్ళేమో ఆతని ధీరగంభీర విగ్రహం అల్లంత దూరంలో కనిపిస్తేనే, చాటుకు వెళ్ళేంత సిగ్గరులు. ఇంక వెళ్ళి మాటలాడుతారా! నీ ప్రియభామిని విరహాన వేగిపోతోంది. చప్పున రమ్మనే సందేశాన్నిస్తారా? మతిమాలిన పని కాకపోతే వారిని పిలుచుకు రమ్మని ఎలా పంపాను! హ్మ్." నిలువలేక సోలిపోతున్న ఆమె నెన్నడుము కడుసన్ననైపోయింది. వెన్నెలదీపంతో జగతిని వెలిగించానని విర్రవీగుతూ, శత్రుశేషం ఉంచకూడదని రేరాజు చీకటికోసం వెతుకుతున్నాడు. నల్లని ఆమె కనులు, నలనల్లని ఆమె కురులు.. కృష్ణవర్ణానికి ఆవాసమయ్యాయని తెలిసి ఏమీ చెయ్యలేక గర్వభంగమై చిన్నబోయాడు. నెమ్మదించిన వెన్నెలవాన ఆమెకు కాస్త ఊరట కలిగించింది.

ఇంతలో కడుపునిండిన చకోరాలు ముక్కులు రాసుకుంటూ చేస్తున్న కూజితాలు ఆమె చెవిన పడ్డాయి. తన చుట్టూ అన్ని ప్రాణులూ జంటలుగా ఉన్నాయనే భావన ఆమెను మరింత కలవరపెట్టింది. "ఒంటరితనమేలా! ఆతని సన్నిధి లేని క్షణాలేలా! నా సౌందర్య సామ్రాజ్యమేలే దొర కాడూ! ఇక వేరే ఉద్యోగమెందుకని రాడేలా! ఈ వెన్నెల రేపుతున్న జ్వాలలేలా నన్ను దహించవు!" వేదనగా చెక్కిలి చేతను చేర్చి వేసటగా అనుకుందామె.

హఠాత్తుగా ఆమెకు కర్తవ్యం బోధపడింది. "జ్వాలలు.. ! తెలిసింది. ఈ బాధకు కారణమైన ఆ పూవింటిజోదునే శరణంటాను. వెన్నెలనారి సవరించి తూపుల గాయాలు చేయబోకుమని వేడుకుంటాను. అయ్యో మదనదేవా!  ఒంటరిని.. నా మీద కనికరం లేదా! అరవిందమో, చూతమో..ఏమో.. ఏ బాణమేసావో! ప్రాణాలు పోతున్నాయి.  నా మేను విరహపు వేడికి నీలోత్పలమైపోక మునుపే నాకు దారి చూపించు.." కనిపించని ఆ కాముడిని వేడుకుందామె. సడీ సవ్వడీ లేదు. గాలితేరునెక్కి అప్పుడప్పుడూ రాలుతున్న పొగడలు తప్ప వేరే అలికిడి లేదు.

"ఓ మదనా.. గిరిబాలను, హరునితో కలిపేందుకు ఆనాడెంత సాహసం చేసావు! కథలు కథలుగా చెప్పుకుంటారే! నీ సతిమాంగల్యమెంత గట్టిదో అని వేనోళ్ళ మీ జంట అన్యోన్యతను పొగుడుతారే! అన్నీ తెలిసిన నీవు నామీద కక్ష పూనడం న్యాయమా! బాణాలు సంధిస్తే సంధించావులే! ఎంత తుమ్మెదల అల్లెత్రాడైతే మాత్రం విడిచిన బాణం గుండెల్లో దిగకపోతే నీ శౌర్యానికి మచ్చ కదూ! నువ్వే గెలిచావులే! ఒప్పేసుకున్నాను. శరణన్నాను. ఇక నువ్వే నాకో పురుషకారం చేయకతప్పదు. వెళ్ళు.. నువ్వే వెళ్ళు. అతనుడివి! నీకు శరీరం లేకపోవడమెంత గొప్ప సౌలభ్యమో! ఎక్కడికైనా వెళ్ళగలవు. అతనెక్కడున్నా అతని మనసులో చేరగలవు! నా మాట చెప్పగలవు! దయుంచి నాకీ వేదన తప్పించు. ఆజన్మాంతం నీకు ఋణపడిఉంటాను. ఈ వలవంత నా వల్ల కాదు. కుసుమకోమలమైన నన్ను పూలబాణాలతో చంపిన పాపం నీకేల! వెళ్ళవూ.. నా ప్రాణదీపాన్ని నా చెంత చేర్చవూ!" అని వేడుకుంది.

విభుని దోతేర పంపిన ప్రియదూతిక
లెంతకు తిరిగిరారేమొ కాని-
ఘనుల సద్గోష్ఠిలో మునిగి యున్నాడని
వెరతురేమో స్వామి దరయుటకును,
నిప్పుల వర్షమై నిలువెల్ల దహించు
నిలబడనీదు వెన్నెలల వాన;
అయ్యయో, మదనదేవా! మ్రొక్కుదాన, నా
పైననా ననతూపు పదను బాకు?

అతనుడవు, నీవు పోగల వటకు, వారి
ఉల్లమున జేరి నా మాట నూదగలవు;
చనుము - నా ప్రాణముల నిల్పుమని నెలంత
తల్లడిలు విరహోత్కంఠిత వలవంత


"ఈ వెన్నెలలేల..  ఆతని నవ్వులుంటే! ఈ మల్లెలెందుకూ.. ఆతని కౌగిలుంటే! ఈ రేయి ఆతని సందిట నలుగని నా సౌందర్యమేల! ఈ వేదనకి నా ప్రాణమైనా పోదేల!" తల్లడిల్లుతూ తొడిమ విడిన పూవల్లే నేల జారిపోయింది. 'అతనికీ ఇంతే విరహాన్ని కలిగించి ఆమె చెంతకు చేర్చలేకపోయానే!' అనుకుంటూ జాబిలి చాటుకు వెళ్ళి తన చేతకానితనానికి సిగ్గుపడ్డాడు.

                                                 ***

* గొరవంకల వెంట ఇంకో కథ కోసం మరో ప్రయాణం రేపు..

** దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన "శృంగార నాయికలు" ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..


Wednesday, October 3, 2012

అసలు దోషము నాదే! (నాయికలు ~ 3)

"ఇంకా రారేమే..?" నికుంజం వెలుపలికి తొంగి చూస్తూ, సరిగంచు చీర కొస వేలికి ముడివేసి విప్పుతూ చెలిని వందో సారి అడిగిందామె.
"వస్తారు సఖీ! ఎన్ని రాచకార్యాలూ.. చక్కబెట్టుకుని రావద్దూ?" సహనంతో వందోసారి సమాధానం చెప్పింది చెలికత్తె.

                                         
                                                 ***

"ఏం రావడమో ఏమో. నాకు విసుగొస్తోంది." శారిక పెనివిటిని ముక్కుతో పొడుస్తూ చెప్పింది.
"ఉండు మరీ.. ఇళ్ళలోకి దూరీ, చెట్లెక్కీ తొంగిచూసే అవసరం లేకుండా, ఈ రోజు మనమున్న తోటకే ఈ విరహిణి వేంచేసిందని సంబరపడు. కాస్త సహనం వహించు. ఈమె చెలికత్తె తో సహా పొదరింట ఎదురుచూస్తున్నది ఏ మగరాయనికోసమో! చూడద్దూ!"
"ఏం రాయడో.. పాడో! ఈమెకెంత ఓపికో! ఎంతసేపైనా ఎదురుచూపేనా! హ్మ్.. చెప్పకేం..ఏ మాటకామాటే! ఈమె రాకతో ఈ తోటకి జీవమొచ్చింది. నడిచొచ్చిన కుందనపుబొమ్మలా ఉంది కదూ! మేలిముసుగు ఆమె ముక్కెర తళుకులని ఆపలేకపోతోంది. అసలే పదారణాల పాళాబంగారంలా మిసమిసలాడే అందం.. దానికి మరింత శోభ తెచ్చే అలంకరణ! ఎంత తీరుగా ఉందీమె!" ముద్దులొకుకుతున్న ఆ జవ్వనిని చూస్తూ, ఆ పొదరింటికి అభిముఖంగా ఉన్న మల్లెపొదలో కూర్చున్న శారిక మురిసింది.
"మహ ముచ్చట పడిపోతున్నావ్! ఎన్ని ఉన్నా ఆ పెదవుల నవ్వు లేనిదే, ఆ కన్నుల బెంగ పోనిదే... అబ్బే!"
"వస్తాడని చెలికత్తె చెప్తోంది కదూ!వచ్చాడో.. వెన్నెల పూయించడూ! "
"ఆఁ.. ఈ తోటతోటంతా మొగ్గ విచ్చి గుమ్ముగుమ్మున పరిమళం విరజిమ్మడం మొదలుపెట్టి ఝామున్నర గడిచింది. పాలకడలివెన్న నడి మింట నిలబడ్డాడు. ఇంకా దయరాదా ఈ అపరంజిపై!" అంటున్న గోరువంకను ఆశ్చర్యంగా చూసింది శారిక.
"అయ్యో.. నువ్వేనా. 'ఉండు మరీ.. చెట్లెక్కక్కర్లేదూ.. పుట్లెక్కక్కర్లేదూ.. సంతోషించమన్నదీ!' విసవిసలాడుతావేం!"  దెప్పింది.

                                                   ***

గమగమా గుబాళిస్తున్న సురపొన్న వైపు నుండి వినబడిన సడి తన ప్రియుని అడుగుల సవ్వడే అనుకుని, మెడలో తళుకులీనుతున్న సరాలు సవరించుకుని, చిగురు పెదవుల చిరునవ్వు దిద్దుకుని.. చెలివైపు తిరిగి "వెళ్ళి చూసి రా" అన్నట్టు సైగ చేసిందామె.
అటునిటూ చూసి పెదవివిరుస్తూ వెనక్కి వచ్చిన చెలిని రెండు భుజాలూ పట్టుకు ఊపేస్తూ "రారేమే ఇంకా! ఇక్కడికి రమ్మన్నారన్న సంగతి మరిచిపోయి ఉంటారా?"
"ఎందుకు మర్చిపోతారూ.. సంకేత స్థలం గురుతులు చెప్పి, సమయం చెప్పి నా చేతే కదూ కబురంపారూ! ఏ పనిలో చిక్కుకున్నారో!"
"వలచివచ్చిన ఆడపిల్లను ఇలా ఎదురుచూపుల్లో నిలబెట్టడం మర్యాదస్తుల లక్షణమా! హ్హు.. " కోపంగా పెదాలు బిగించింది.
"అంత మాటనేయకు. అతనేం సామాన్యుడు కాదు. బోలెడు పనులు చక్కబెట్టుకు రావద్దూ! నువ్వు సింగారానికెంత సమయం తీసుకున్నావో గుర్తులేదూ! అతనే ముందు వచ్చి ఉంటే.. ఇలా విసిగిపోయి తిట్టుకునేవాడా?" వేళ మించినా జాడలేని అతడిని వెనకేసుకొచ్చింది చెలికత్తె.
"నడిరేయి కావొస్తోంది. ఇలాంటి చోట జంటగా ఉంటే ప్రపంచం ఎంతో సుందరంగా కనిపిస్తుంది కానీ, ఇప్పుడు నాకు ఏమీ నచ్చడం లేదు."
"అవునులే.. వచ్చి నీ ఎదుట నిలబడిన క్షణం ఇన్ని మాటలూ మూటగట్టి పక్కన పెట్టి, ఆతని కౌగిట కరిగిపోదువులే.."
"నువ్వుండవే! నాకు కావాలనే అతను నన్ను నిర్లక్ష్యం చేశారేమో అని అనుమానంగా ఉంది." నొసలు ముడేస్తూ చెప్పిందామె.
"ఏమీ కాదులే. ఇంకాసేపు ఎదురుచూడు. నీవంటి అపరంజిబొమ్మని, వలపులరాశిని రమ్మని తాను రాకపోవడానికి అతనేమైనా పాషాణమా!"
"ఏమో... రాతిగుండె కాకపోతే వచ్చి ఇంతసేపయ్యింది. కీచురాళ్ళ రొద వినలేకున్నాను. ఈ విరహం భరించలేకున్నాను. ప్రేమించి వచ్చినందుకు ఇదా సన్మానం! నమ్మినందుకిదా పరిహారం!" అంతులేని వేదన ఆమె మాటల్లో.
"నిజమే! ఆలస్యమయ్యిందనుకో. అపార్ధం దేనికి? ఇంకాసేఫు చూద్దాం"

క్షణాలు గడిచి గడియల్లోకి మారుతున్నాయి. చల్లగాలి ఆర్పలేని ఆమె వేడి ఊర్పులకి, మోమంతా చిరుచెమటలు అలముకున్నాయి. దిద్దుకున్న కస్తూరితిలకం నీరై కారిపోతోంది. ఎంతో మక్కువగా అలంకరించుకున్న ఆభరణాలన్నీ భారంగా గుచ్చుకుంటున్నాయి. వచ్చిన క్షణాన ఎంతో ఆదరంగా ఆహ్వానం పలికిన ఆ సంకేతస్థలం ఇప్పుడామెకు భరింపశక్యం కాని విరహాన్ని కలిగిస్తోంది. అన్నిటికీ మించి "మోసపోయానేమో! అతను కావాలనే నిర్లక్ష్యం చేసాడేమో!" అనే అనుమానం ఆమెను దహించివేస్తోంది. దూరంగా నిద్దట్లో ఉలికిపడిన పక్షి చేసిన వింత ధ్వనికి ఆమె ఒళ్ళు ఝల్లుమంది. ఒక్క ఉదుటున పైకి లేచి చరచరా బయటకు కదిలింది.

"ఎక్కడికమ్మా.. ఇంకాసేఫు చూద్దాంలే! సహనం.. సహనం.." వెనక్కిపట్టి ఆపింది చెలికత్తె.
"హ్హు.. సహనం! రమ్మన్నది తానే.. రానిది తానే! ఇది నిర్లక్ష్యం కాక మరేవిటి?"
"అయ్యో. ఇంత సింగారించుకుని, ఇంత సమయం ఎదురుచూసి.. ఇప్పుడు వెళ్ళిపోతే.." అర్ధోక్తిలో ఆగిపోయింది చెలి.
"ఏమవుతుంది. అసలు అతడు వస్తే కదా! నా ప్రేమను, విరహాన్నీ లెక్కచేస్తే కదా! మగవారి సహజగుణమిది. దక్కేదాకా లోకంలో వేరే ఏమీలేవన్నంత ప్రేమ గుప్పిస్తారు. ఆమే తనదయ్యాక ఇంక ఎదురుచూపులు కానుకిచ్చి చిత్తగిస్తారు."
"నువ్వు మరీ.."
"ఏం కాదు. నిజమే చెప్తున్నాను. ఎదురుచూపు శ్రుతిమించనంత వరకూ ఎంత తీయనిబాధో, మరీ ఎక్కువైతే మహ చేదెక్కుతుంది. కాల్చేస్తుంది. ఏమనుకున్నారసలు? ఇన్ని ఝాములు ఇక్కడ తనకోసం పడిగాపులు కాస్తూ ఉంటే ఇంత ఉదాసీనతా! నేను వరించినది ఇలాంటి వ్యక్తినా!"
"ఇదిగో.. మరీ అభాండాలు వేసేయకు. ఆనక బాధపడేది నువ్వే.." హెచ్చరించింది చెలి.
"హ్హా.. అభాండం. కానే కాదు. ఇప్పుడు పడుతున్న బాధేమైనా తక్కువా! పదునైన రంపంతో మనసును కోసేస్తున్నంత వేదన! నావల్ల కావడం లేదే!" ముఖకమలాన్ని అలముకున్న  నీలినీడలతో చిన్నబోయిన ఆమెను చూడగా గోరువంకలకే పుట్టెడు జాలి పుట్టేసింది.

"ఎలా విడిచిపెట్టాడో చూడు! దీపతరువులా ఈ చీకటిలో నిలబడి, అతనికోసం చేసుకున్న అలంకారాలు వృధాపోతూండగా.. "సన్నగా రోదిస్తోంది. ఓదార్చబోయిన చెలికత్తె చేతిని విదిలించికొట్టి.. చేతుల్లో మోము దాచుకుంది. గాజులు ఘల్లుమన్నాయి. ఆమె క్రోధం మిన్నంటింది.

" చేయి పట్టుకుంటే ఘల్లున సంగీతం పలకాలని ఏరికోరివేసుకున్నానీ గాజులను.. " విసురుగా చేతిగాజులు తీసి నేలను కొట్టిందామె.
"ఆగాగూ.. ఏవిటా ఉన్మాద చర్య!" చెలి నెవ్వెరబోయి వారించింది.
"ఉన్మాదమే! ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నా కలలు భగ్నం చేసినందుకు ఉన్మాదమే! ఇదిగో చెదిరిన నా ముంగురులు సవరించేటపుడు చూస్తారని  ఈ పాపిటి బిళ్ళ, ముత్యాలబావిలీలూ.. కోరి అలంకరించుకున్నాను. వీటి ప్రయోజనమేముందిప్పుడు? " రోషంగా తీసి విసిరేసింది.
"ఓయ్.. ఓయ్.. ఆగు.." చెలియ మాటలు పట్టించుకోకుండా జారుతున్న కన్నీళ్ళతో మోమంతా తడిసిన మంకెనలా మారిపోగా, తనువునంటుకుని ఉన్న ఒక్కో నగా వొలిచి విసిరేయనారంభించింది.

"ఇదిగో.. ఈ ముక్కెర.. ఈ హంస.. వారికెంతో ఇష్టమని.. ఇంత కష్టపడతానని ఎరుగక పెట్టుకున్నాను. ఈ ముత్యాలహారాలను సవరిస్తూ సల్లాపాలాడుతారనుకున్నాను." మెలికలు పడిన హారాలను గుప్పెళ్ళతో తెంచి పారేస్తూ అన్నది.

"హ్హు.. నలకనడుమేదని వెతుకుతారని ఈ వడ్డాణమలంకరించాను. ఇదీ నిష్ఫలమైన కైసేతే!
మిడిసిపడే పూవులతో పాటూ మిసమిసలాడే బంగారపు నాగరాన్ని జడలో అమర్చుకున్నాను. దేనికిది? దీని సొగసూ నా ప్రాయమల్లే అడవిగాచిన వెన్నెలే!" రోషారుణ నేత్రాలు ధారగా కన్నీటి ఏరై పారగా చెప్పిందామె. చేతులతో కురులకు అల్లిన పుష్పబంధాలను తీసివేయగానే గట్టుతెంచుకు ఉరికిన యమునలా, నల్లని ఆమె కేశాలు విడివడి వీపంతా పరుచుకున్నాయి. ఘననితంబాన్ని అలవోకన చుట్టేసిన మొలనూలు వొలిచి వణుకుతున్న చేతులతో నేలకు జారవిడిచింది. చెదరిన కుచ్చెళ్ళు కాళ్ళకు అడ్డుపడుతూ ఉండగా తడబడే అడుగులతో శోకదేవతలా కదిలి వెళ్ళసాగింది.

"నా కన్నీళ్ళ ఏరు పారిన ఈ నేల అడుసాయెనని అతనికి చెప్పేదెవరు! ఇంత వేదనకు నన్ను బలిచేసిన ఆ మోసగాడిని శిక్షించేదెవరు! నాదే తప్పు. నమ్మిన నాదే తప్పు! ఈ శిక్ష నాకు పడాల్సిందే!" వెక్కిళ్ళు పెడుతూ నడుస్తున్న ఆమెను చెలి మౌనంగా అనుసరించింది. ఆమె అడుగుల సడి దూరమవుతూండగా ఆమె నిలిచిన ప్రదేశంలో చెదిరి జల్లుకున్న ఆమె కాలిమువ్వలు నేలతెగిపడిన నక్షత్రాల్లా మౌనంగా మెరిసాయి.

ఈ తీవ యోవరియే గదా తాముర
మ్మన్నయేకాంత గృహమ్ము! తాము
మెత్తురనే గదా, మెలత, ఈ కయిసేత!
ఈ నిరీక్షణము లింకెంతసేపె?
కడచెనే రేయిసగ; మ్మెన శ్రీవారి అడుగుల
సడియును పడదు చెవుల
మరిమరి పొగడకే మాయల మారిని,
విసిగిన ప్రాణాలు వేపి తినకె!

పదవె, అడుసాయె నేల నా భాష్పవారి
ననుచు నెవ్వగ మెయినగ లన్ని ఊడ్చు;
"అసలు దోషము నాదే" నటంచు ఏడ్చు,
విరహమున వేగిపోయిన విప్రలబ్ధ


ఆమె వెతకు మూగసాక్షులుగా నిలిచిన చెట్లన్నీ జాలిగా తలలూపుతున్నాయి. గంధవాహుడు నిట్టూర్చి పూబోడుల పరిమళాన్ని ఇక మోయలేనని బాధగా ఆగిపోయాడు. గువ్వల జంట ఒకరినొకరు చూసుకుని నిట్టూర్చారు.

"వలపులకిసమసలు చూడలేకున్నాను. ఇంత వేదనా! రూపం లేని మదనుడి మహిమ ఇంత బలీయమా!!" ఆశ్చర్యపోయింది శారిక.
"హ్మ్.. కౌగిట ఒదిగిన క్షణమెంత సౌఖ్యమో, విరహవేదన అంత నరకం. అందునా నిర్లక్ష్యమైపోయానని తెలియడం బహుచెడ్డ బాధ కదూ! మనసున్న పాపానికి ఈ వలపు వింతలూ, వేదనలూ తప్పించుకోలేరెవ్వరూ..!" నిట్టూర్చాడామె మగడు.

                                                   ***


* గువ్వల జంట కంటపడిన మరో కథ రేపు..

*దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ""శృంగార నాయికలు"   ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..

Tuesday, October 2, 2012

అవియేటి అలకలో! (నాయికలు ~ 2)

జాము రాతిరి వేళ ఆ మిద్దెటింటి అరుగు మీదకి, కడియాలు వింత చప్పుడు చేస్తుండగా తాపీగా నడిచి వస్తున్న ఆమెను చూసి, "ఈమేనా?" అని అడిగింది శారిక. ఆ ఇంటి తోటలో చిక్కగా అల్లుకున్న పొదరింట అమర్చిన తిన్నె మీద వాలి ఉన్నాయా గొరవంకలు.

"కనబడడం లేదా ఏం? చెలికత్తె నీకు యజమానురాలి వలే కనిపిస్తోందటే.. నీ అమరత్వం అటకెక్కిందన్నమాటే! నిజం చెప్పూ.. కళ్ళు ఆనుతున్నాయా?"
"అబ్బ.. పరాగ్గా చూసానూ. నువ్వు మరీ ఆటపట్టించక్కర్లేదు. ఏదో రోజుకో కథ చెప్తున్నావని ఊరుకుంటున్నానే కానీ.."
".. లేదంటే ఉపేక్షించక నా పనిపట్టేదానివే!"
"ఇంతకీ నువ్వు చెప్పిన ఆ వలతి ఎక్కడుందీ?"
"హ్మ్.. చల్లని గాలి..  మత్తుగా తేలివస్తున్న ఈ రేరాణి పరిమళం..  కోడెకాఱునెవరినైనా నిమ్మళంగా ఉండనిచ్చేనా? అయితే జంటగా విహారానికి రావాలేగానీ, ఒంటిగా ఈ గాలికి తిరగగలరా ఎవరైనా..? ఒంటరిరేయిని నిందిస్తూ నడిమింట కూర్చుని ఉంటుంది" 
"పాపం ఆ పిల్ల విరహంలో వేగుతూ ఉంటే ఈమె వీధరుగు ఎక్కి తాపీగా పచార్లు చేస్తోందా? వెళ్ళి ఓ మంచిమాట చెప్పి ఊరడించవచ్చునే! చూడు చూడు.. కూనిరాగాలు తీస్తోంది పైగా." విసవిసలాడింది శారిక.
"అబ్బా.. నీ రొద ఎక్కువైపోతోంది. అన్నీ తెలుసుకోనిదీ అభాండాలు వేసేయడమేనా?" విసుక్కున్నాడు.
"ఆ.. అయినా ఈమెని అనడం దేనికీ? జాము రేతిరైనా ఇల్లు చేరని ఈ ఇంటి మగాడిని అనాలి. ఇంటి గడప దాటారా ఇంక మా గోడు మీకు పట్టేనా? ఎదురుచూసే మా ఊసైనా తలపులోకొచ్చేనా? ఎన్ని రాచకార్యాలో..  ఎన్ని ఇళ్ళుచక్కబెట్టాలో.."
"ఇదిగో ఓయ్.. అందర్నీ ఓ గాటన కట్టేయకు. నిన్నటి కత వేరు."
"మరి ఈ ఇంటి కథేవిటో?"
"చూద్దాం. ఇదిగో.. ఈ తలుపు తీసిపెట్టింది. సడి సేయక లోపలికి పద.."  రివ్వుమని క్షణంలో ఇంట్లోకి దూసుకుపోయాడా మగ గోరింక.
"నీ అసాధ్యం పాడుగానూ.. ఇంట్లోకా..? ఇంట్లోకే!! ఓయ్.. ఆగూ ఆగూ.. "
                                          
                                                     ***

ఉయ్యాలబల్ల మీద పడుకుని వగపులో మునిగిన ఓ పరువంపుకొమ్మ మసకచీకట్లో సైతం వజ్రపుతునకలా మెరిసిపడుతోంది. అలముకోబోతున్న చీకటితో కొడిగట్టబోతున్న దీపం గూట్లోంచే పోరాడుతోంది.  సద్దుచేయకుండా గోరవంకలు ఎగిరొచ్చి క్రీనీడలో ఉన్న ఓ చూరు వెతుక్కుని సర్దుకున్నాయి. నూనె వేసి వత్తి పైకెగదోసి, నెమ్మదిగా ఆ చిన్నారి దగ్గరికి నడుచుకుని వచ్చిందామె చెలి.

"సఖీ.. రెండో ఝాము దాటిపోతోంది. నిద్రపోమ్మా." లాలనగా పలికింది.
"....." మూగనోము పట్టిందామె. బాలీసు పై ఆన్చిన తల అటువైపు తిప్పుకుంది.
"కాస్తైనా ఎంగిలి పడలేదు. పోనీ, కాసిని పాలు తెచ్చివ్వనా?"
"ఉహూ.."
"ఇలా మాటామంతీ లేకుండా, తిండీతిప్పలూ మానేసి రేయంతా కూర్చుంటావా? ఆరోగ్యం ఏం గాను?"
"...."
"ఇదిగో.. ఏమయ్యిందో సరిగా చెప్పనిదే ఎలా తెలిసేది?"
"చదరంగం.."
"ఊ... చదరంగం..?"
"ఆడుతూంటే కలహం."
"ఓ.. ఆటలో నెగ్గలేదని అలిగావా?"
"కాదు."
"ఊ.. మరి?"
"...."
"ఏమయ్యిందో వివరంగా చెప్పు తల్లీ.. "  స్థంభానికి చేరగిలబడి కూర్చుంటూ అడిగింది.
ఆమె ఉయ్యాల బల్ల మీద నిటారుగా లేచి కూర్చుని జరిగిన విషయం చెప్పనారంభించింది.

"సాయంత్రమనగా వచ్చారు కదా. . ఇంకా బోలెడు పొద్దు ఉందని చదరంగం ఆడుతున్నాం. ఎప్పుడూ నెగ్గేది నేనే. ఈ రోజు ఓడిపోయాను."
"ఈ మాత్రానికేనా అలక?"
"ఉహూ.. ఓడిపోయానని నొచ్చుకున్నాను. పందెం గుర్తుచేసారు. ఓడినవారు గెలిచినవారి మాట వినాలని."
"ఓహో... ఎవరోడినా అతగాడే నీ బానిస కదూ..! ఇంతోటిదానికీ గెలుపోటములెందుకూ?"
"హ్హు.. వినవే ముందూ.  నా మనసు బాధతో బరువెక్కి నన్ను చంపేస్తోంది."
"ఊ.. ఊ.."
"ఓడే జాతి కాదు నాది.  మీరే తొండి చేసారన్నాను. "ఎక్కడైనా చుట్టరికం కానీ వంగతోట దగ్గర కాదూ.. నేనే గెలిచాను. ఓటమినొప్పనన్నారాయన. పైగా ప్రతిసారీ నేనోడి నిన్నుగెలిపిస్తున్నాన"ని కవ్వించారు. అలిగి మోము దాచాను. మాట్లాడను పొమ్మన్నాను."
"మరీ బావుంది. చిలికి చిలికి గాలివాన చేసావే!"
"చెయ్యనూ మరీ.. 'కిందపడ్డా నీదే పైచేయంటావు కదూ.. మంకులాడీ..' అన్నారు."
"అన్నాడే అనుకో.. పరాయివాడా! అరిగిపోతావా? పెనివిటితో కలహం గడపదాటనివ్వకూడదన్న ఇంగితమేమాయె?" బుగ్గలు నొక్కుకుంది.
"ఏమోనే, ఆ మాటనేసరికి ఉడుకుమోత్తనం పట్టలేకపోయాను.. "
"ఆ ప్రథమకోపం విడిచిపెట్టమని ఏనాడో చెప్పాను. చెవిని పెడ్తివి కావు కదా!" .
"ఊ.. నాదే తప్పంటావా?" బేలగా అడిగిందా అమ్మడు.
"తప్పూ ఒప్పూ అని కాదమ్మాయీ. తెగేదాకా లాగకూడదు. సరసం విరసం అయ్యింది చూడూ.."
"అవును.. నాకే అనిపిస్తోంది. ఇంత చిన్న విషయానికి రాధ్ధాంతం చేశానే! అని. మరే.. ఆయన ఇక రారంటావా?" ముంచుకొచ్చేసిన బెంగతో ఆమె నీలాలకనులు నిండిపోయాయి.
"నన్నడుగుతావేం.. ఆ మారాజు విసవిసా నడిచెళ్ళిపోయిన వైనం చూస్తేనే తెలుస్తోంది. ఎంత విసిగించావో!"
"పాపం.. ఎంత బతిమాలారో.. తెలుసా?" వేదనగా అంది.
"ఊ.."
"చిన్న మాటకి అంత కోపమెందుకన్నారు. ప్రియమైనదానివి కనుకే చనువున ఓ మాటన్నాను సఖీ అని బతిమాలారు.. " గొంతు జీరబోయిందామెకు.. అతడిని తలుచుకుని.

నిముషాలను గిర్రున వెనక్కి తిప్పే శక్తే ఉంటే అలా బతిమాలుతున్న అతడి పెదాలపై చప్పున మునివేళ్ళు ఉంచి ఆపి, "సర్లెండీ.. తప్పు నాదే!" అనాలనిపిస్తోందామెకు. అతని రూపం, లాలిస్తున్న అతని మాటలు కనుల ముందు కదులుతూ దుఃఖం పట్టలేక మనసు భారమైపోతోంది. 'పనిమాలి తెచ్చుకున్న కలహం కదా..' అని వాపోతోంది.

"అవును మరి! వలచి వచ్చిన వాడు. లాలన తెలిసిన వాడు. అతడు కనుక భరిస్తున్నాడు నీలాంటి తిక్కలపిల్లని.."
"అబ్బా.. నీకు ప్రియంవద అని పేరెవరు పెట్టారే! గాయం మీద కారం జల్లుతావు కదా!" విసుక్కుంది.
"జల్లనూ మరీ.. నీకు తెలిసి రావాలి. అతనేమైనా సామాన్యుడా! జగదేకసుందరుడు. చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ నీ వలరాయడు పాలతరకే! అందమొక్కటేనా, ఎంత ప్రేమా.. ఎంత మురిపెం నువ్వంటే!  అలాంటివాడు కోరి వచ్చినప్పుడే కొంగున కట్టుకోవాలి."
"ఊ.. " కనులు వర్షించేందుకు సిధ్ధమవుతున్నాయి.
"తప్పు తెలియద్దూ.. ఎవరితోనైనా మంకుతనానికి పోవచ్చేమో కానీ మనసేలే దొరతోనా.. అంతటి యోగ్యుడితోనా! తప్పు అమ్మాయీ.. తప్పు!" సుద్దులు చెప్పింది ప్రియంవద.

పెదవి కొరుకుతూ ధారలుగా చెక్కులని తడిపేస్తున్న కన్నీళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయకుండా నేలచూపులు చూస్తూ కాసేపాగి, "ఎంత మతిమాలిన దాన్ని. నా నాథుడిని ఎంత నొప్పించాను. కోరి కజ్జా తెచ్చుకున్నాను కదా! ఎంత బుజ్జగించారు!"
"ఊ..."
"ఇంత రచ్చ చేసి అలిగిన నన్ను, నాలాంటిదాన్ని సైతం ఎంత ప్రేమించి ఉంటారు! ఇంత జరిగాక కూడా ఏమన్నారో తెలుసా..? కుసుమించని కురవకమైనా నీ దయకు నోచుకుంటుందేమో కానీ.. నేనంత పరాయి వాడినయ్యానా, ప్రియా?" అన్నారు.. చివరి మాటలు దుఃఖంలో కలిసిపోతూండగా.. చెలియలికట్ట దాటిన శోకాన మునిగి ఉయ్యాలలో వాలిపోయి రోదిస్తూ తనను తానే నిందించుకుంటూ పలవరించసాగిందామె.
"మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందట వెనకటికి నీలాంటిదే.. అప్పుడేమో అలకలూ.. ఇప్పుడు ఉస్సురస్సురులూ.. " సణిగింది చెలియ.

"మనసార వలచి వచ్చినవాడు, నీ రేడు
తొగరేని మించు సోయగము వాడు;
లాలించినాడు, తన్నేలుకొమ్మన్నాడు-
చప్పగా వాయైన విప్పవపుడు.
అవియేటి అలకలో! ఆ మూతి ముడుపులు,
ఆ మొండిపట్టులు, ఆ బిగువులు!
ఇక నిప్పుడోయమ్మ! ఎన్ని నిట్టూర్పులు
అసురుస్సురనుటలు, అలమటలును! 

ఓసి, ఇవియేటి చేతలే బైసి మాలి!
ఏరు విన్నను నవ్వగలరు లె"మ్మ
టంచు చెలి పల్క, తెలివొంది అలవి కాని
వెతల పాలౌచు కలహాంతరిత తపించు.


ఆమె వెతలాగే ఆ యింట చీకటి నల్లగా కమ్మేసింది. గోరువంకలు ఇక చూసేదేముందని జారుకుని బయటికొచ్చాయి.
"చూస్తివా.. అతనిదే తప్పంటివి! అన్న చిన్నమాటకి ఎంత యుధ్ధమయ్యిందో చూడు! అందుకే మాట అదుపు, అణకువా ఉండాలి"
"'మీ ఆడంగులకు..' ఊ.. అదేగా మనసులో మాట. అనేయ్.. చల్లకొచ్చి దాపిరాలెందుకూ?" శారిక అనేసి మొహం తిప్పుకుంది. ఇంతలో ఏదో గుర్తొచ్చి పెనివిటివైపు తిరిగి..
"అవునూ.. కుసుమించని కురవకం..!"
"ఊ.. కురవకానికి ఆలింగనమే దోహదం.. ప్చ్.. ప్రేమికుడు.. సరసుడు!" మాట ముగిస్తూ శారిక వైపు చూసాడు సాలోచనగా..
"ఊ.. ఊ.. నేనంత తెలివిమాలినదాన్ని కాదులే! ఇలాంటి కజ్జాలు పెట్టుకోనుగా!" నవ్వింది శారిక.


        
                                         ***

* మరో కథ రేపు..

* దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ""శృంగార నాయికలు"   ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..

Monday, October 1, 2012

వలపు బిచ్చమొద్దు.. పో.. (నాయికలు - 1 )

మునిమాపువేళలు మహచక్కనైనవి. అందమైన రోజుకి ముక్తాయింపు సాంధ్యరాగాలతో ఇవ్వబూనిన సృష్టికర్త ఎంత నేర్పరి! నారింజవెలుగుల పడుగుకి నీలవర్ణపు పేక కలనేసి, అక్కడక్కడా మినుకు చుక్కల బుటాలు అద్దినట్టున్న సంజె చీర చాటున భూమీ ఆకాశం పెనవేసుకోబోతున్నట్టున్నాయి. ఆ వర్ణచిత్రం ఎంత మనోహరంగా ఉన్నా దానికి నిండు తెచ్చేదైతే ములుగఱ్ఱ చేతపట్టి, మందలను అదలిస్తూ ఇల్లు చేరేందుకు వడివడిగా అడుగులేస్తున్న అతడు. వీధిమలుపు తిరగగానే అతని చూపు వెతికేది ఎవరినో తెలుసా.. కళ్ళవాకిళ్ళలో ఆహ్వానపు దీపాలు వెలిగించి ఎదురుచూస్తున్న ఆమెను!   ఆమే గమ్యం.. అతని నడకకీ, ఆ మాపుకీ.

ప్రతి సాయంత్రం ఇంత మామూలుగా ఉంటే, ప్రతి జంటా ఇంతే పొత్తుగా ఉంటే, ఆపై ప్రతి రేయీ ఇలాగే నల్లేరుమీద బండిలాగా గడిచిపోతే అదిగో.. ఆ గురివింద పొదరింట కువకువలాడుతున్న  దేవలోకపు శారికలకు ముచ్చట్లాడుకోడానికి కబుర్లేముంటాయీ? ఆ గొరవంక జంట తిరిగి వాటి అచ్చర లోకానికి వెళ్ళాక త్రవ్విపోసుకోడానికి కథలేముంటాయీ?

                                                    ***

"అలా తలుపేసేసిందా! నేను నమ్మనుపో.." కుడిరెక్కని ముక్కుతో గీరుకుంటూ కువకువమందా శారిక.
"ఏం.. నన్ను ముక్కుతో పొడిచి తరిమిన రోజులు లేవేమో ఎవరి ఖాతాలోనో! మీ ఆడవాళ్ళకి మామూలేగా.. మూతిముడుపులూ, శాపనార్ధాలూ, వెటకారాలు నూరడాలూ.." అదును చూసుకు అక్కసు తీర్చుకున్నాడా పిట్ట పెనివిటి.
"పోవోయ్, మరీ చెప్తావు. చెట్టంత మగాడిని తలుపు బయట నిలబెట్టి చెరిగేసిందంటే అతగాని తప్పేవీఁ లేకుండానే?!"
"పిట్టంత నువ్వే నమ్మనప్పుడూ.. అతడు ఇక చెట్టంత ఉండీ ప్రయోజనమేముందీ!" నిట్టూర్చాడు.
"ఇలా కాదు కానీ, ఏం జరిగిందో నువ్వు సగం సగం చూసి చెప్పడం, నేను వినడం దేనికీ? పద వెళ్ళి చూసొద్దాం." రెక్కలు టపటపలాడిస్తూ ఆయత్తమైంది.
"ఇదిగో.. లేచిందే ఎగరడమా..? మాయ గోరింకా.. నీకు రాత్రీ పగలూ తేడా లేకపోవడం నాకు చచ్చేచావయ్యింది. ఉండూ.. ఆ దక్షిణం వీధిలో రెండో ఇల్లు." అరుస్తూ అనుసరించాడు.
గోరింకలు జంటగా ఎగిరెళ్ళి ఆ ఇంటి వాకిట్లో విశాలంగా విస్తరించిన చంపకవృక్షపు కొమ్మల్లో చేరాయి. సన్నగా వీస్తున్న పిల్లగాలి ఉండుండీ సంపెగ అత్తరు పూసుకు మత్తెక్కిసోలుతోంది. చీకటి ఆపని కంటిచూపు ఆ గోరువంకల లక్షణం. సూటిగా ఆమె పడకింటి కిటికీ కనిపించేలా ఓ కొమ్మ మీద సర్దుకుని, బయట గుమ్మంలో నిలబడ్డ అతడిని పరికిస్తూ వినసాగాయి.
                                                      ***

"రాధా,, తలుపు తీయవే అమ్మీ.."
"అయ్యో దొరవారూ! ఇంకా గుమ్మంలోనే ఉన్నారా? చిత్తగించారనుకున్నానే!" కావలసినంత వెటకారం ప్రతి పలుకులోనూ కూరి కూరి సంధించిందామె.
"కాస్త ఆలస్యమైనందుకే ఇంత కినుకా బంగారూ! ఎలా వెళ్ళనూ.. నిన్ను చూడనిదే ఉండలేనని తెలీదూ! నువ్వు నా ప్రాణానివి.." ఓరగా తెరిచిన కిటికీ కి దీనంగా తల ఆన్చి పిలిచాడు.

శయ్యపైనుండి లేచి కవాటం వైపు నడిచివచ్చిందామె. ఆశగా తలుపువైపో అడుగు వేశాడతడు. కిటికీలోంచే చెయి సాచి ఆతని మెడలో వేలాడుతున్న పున్నాగల మాల పట్టుకు ఆపింది. అనుమానపు కటకటాల అవతల ఆమె, ఇవతల ఆతడు. తీయగా నవ్వి మాయ చేద్దామనుకున్నాడు. టక్కరి వేషాలు పట్టనట్టు అతనిని ఇంకా దగ్గరకి లాగి ఆతని మేను మత్తుగా విరజిమ్ముతున్న పరిమళాన్ని పసిగట్టిందామె.
"చందనం..!" ముక్కు ఎగబీలుస్తూ రోషంగా పలికింది.
"నీ కోసమే! సింగారాలు మగువలకేనా.. మేమూ మిమ్మల్ని మెప్పించద్దూ?"
"మాయమాటలాడకు మురారీ!"
"లేదమ్మీ..నిజం! నమ్మవూ!"
"ఉహూ.. నిన్ను నమ్మమన్నదెవరు? టక్కరివి, జిత్తులమారివి."
"అబ్బా.. రాధా. నా వల్ల కాదీ శిరోవేదన!"
"నేనా! నేనేనా శిరోవేదననీ!"
"ఉహూ.. కాదు కాదు. అపార్ధం అపార్ధం! తలనొప్పి రాధా. లోపలకి రానివ్వవూ.. నీ ఒడిలో తలపెట్టుకు పడుకుని, నీ నాజూకైన వేళ్ళ స్పర్శ తగిలితే కానీ పోదు."
"హ్హు.. నా వేదన ముంది నీదెంత!"
"చందనమద్దుకుంటేనే అనుమానమా! ఇలా సాధిస్తావని తెలిసి ఉంటే చెమట ఒంటితోనే నీ ముంగిట వాలేవాడినిగా! పన్నీట సరిగంగ స్నానాలాడేవాళ్ళం. రాధా.. ఎన్నాళ్ళయ్యిందో మనం జలక్రీడలాడి!" కవ్వించాడు.
కరిగి నీరవబోయేదే.. క్షణంలో ఆమె చూపు సూటిగా ఆతని పెదవులను తాకింది. ఆతని సెలవి నంటిన తమ్ములపు ముద్ర!! ఆమె కంటబడింది.

విసురుగా వెనక్కి తిరిగి, చరచరా శయ్య చేరి కనుకొలకుల జారుతున్న నీరు అటుతిరిగి దాచుకుంది. ఆమె కోమలమైన చేయి పందిరిమంచపు స్థంభం చుట్టూ బిగిసి రక్తవర్ణంలోకి మారసాగింది. పెదవులు అదురుతున్నాయి. చూపు మసకబారి, కాటుక కన్నీట కరిగి గులాబిబుగ్గలను కమ్మేసేందుకు సిధ్ధపడుతోంది. నిస్త్రాణగా వాలిపోతోంది ఆమె తనువు.

"అమ్మీ.. చీకటి! నేనొచ్చి ఝామయ్యింది. కరుణ కరుణ!" పడకటింట ప్రవేశం కోసం జగదేకవీరుడైనా "పాహి..!" అనడానికి సైతం వెనకాడడు మరి!
"ఆ కరుణ దగ్గరకే వెళ్ళు." గద్గద కంఠంతో ఉరిమిందామె.
"ఇంత అనుమానమైతే కష్టం సుమీ.. ఏమయ్యిందిప్పుడూ.."
"బుకాయించకు మాయావీ. నువ్వు కోటి పూవుల వాలే తేటివని ఇన్నాళ్ళూ విన్నానంతే.. ఇప్పుడు సాక్ష్యాలతో కన్నాను. మహా సంతోషంగా ఉంది. కడుపు నిండిపోయింది." వెనుతిరగనైనా తిరగకుండా విసురుగా చెప్పింది.
"అన్యాయం!! నీవే తప్ప ఇతఃపరంబెరుగ.." నమ్మబలికాడు.
ఒక్క విసురున ఇటుతిరిగింది ఆవేశంగా.. వాల్జడ నాగుపామై గాలిలో ఎగిరి ఆమెను చుట్టేసింది.
"అవునేం! నేనే తప్ప వేరే ఇంతిని ఎరుగని వాడివి కదూ! ఆ చందనపు పూత ఏవిటో, ఎవరిదో తమరెరుగరు. కదూ!"
"ఉహూ.. " అనేసి నాలుక కరుచుకున్నాడు.
"అదే అదే.. ఒకరా ఇద్దరా! వెయ్యికి పైగా  ప్రియురాళ్ళు. రేయికి ఝాములు మూడేనాయే! చుక్కల్లో చంద్రుడు నయం! నెలకోమారు అని వంతు ఇవ్వగలడు. తమరికి లెక్క గుర్తుండే అవకాశమేదీ!"
"నీ కోసమని ఇంత దూరం వస్తే.. ఇదా మరియాద?"
"హ్హహ్హా.. నా కోసమా! నమ్మమంటావా?"
"నిజం భామినీ.. నీ కోసమే! నిజం.."
"ఉహూ.. నమ్మనుగాక నమ్మను. దారితప్పే వచ్చావు. చీకటిపడగానే ఏదో మోహయాత్రకి బయలుదేరి ఉంటావు. ఒక ఇంట గంధపు మైపూత పూసి ఉంటుందో చెలి. ఆనక మరో ఇంట వేరే పడతిని కూడి ఆమెను చుంబించి ఉంటావు. ఆమె తాంబూలంతో నీ పెదవి ఎరుపెక్కింది. ఆ తమ్ములపు చారిక నీ పెదవి కొసకు అంటింది. నేను చూడలేదూ! నా కళ్ళు నన్ను మోసం చేస్తాయా? తాంబూలం పంచుకున్నావంటేనే అర్ధమవుతోంది.. ఆమెకు నీ మనసులో ఎంత చోటిచ్చావో!"
అప్పటిదాకా క్రోధంతో ఎరుపెక్కి ఉన్న ఆమె కళ్ళు హఠాత్తుగా సజలాలైపోయాయి. గొంతు పూడుకుపోతూండగా అంతులేని వేదనతో తడబడుతున్నాయి ఆమె మాటలు.
"ఆ పెదవులు.. నా కాంతుడి పెదవులు.. మరొక పడతి ముద్దాడిందంటే అంతకంటే నన్ను దహించే నరకం మరొకటుంటుందా?"

ఆపలేని కన్నీటి జడివానలో తడిసిముద్దైన మోము, వలిపంపు పయ్యెద.. ఆమె అందాన్ని ద్విగుణం చేసి అతనిని ఇంకా ఆకర్షిస్తున్నాయి. వణికిపోతున్న ఆమెను బిగికౌగిట బంధించి ఓదార్చాలనుకున్నాడు.
"అంత ప్రేమగా నిన్ను మాత్రమే ముద్దాడగలను. రా ప్రియా, కౌగిలీయవూ!"
"అబధ్ధం!" క్రుధ్ధంగా అరిచింది ముకుపుటాలదురుతూండగా..
"..........."
"నువ్వు అబధ్ధం. నీ ప్రేమ అబధ్ధం.. ఫో.. దారితప్పి ఈ వేళ వస్తే వచ్చావు. మరోసారెప్పుడూ ఇటు వచ్చి పరువు పోగొట్టుకోకు. నీ చెలియలెందరో ఎదురుచూస్తూ ఉంటారు. నీకేం లోటూ...?" దుఃఖం వెక్కిళ్ళలోకి మారుతూ ఉండగా తెగిన మణిహారంలా నేలపై పడి, అలకలో కూడా ఆమె సౌందర్యదీపమల్లే ప్రకాశిస్తోంది. చందనగంధ న్యాయం.. ఆమె శోకంలో కూడా ముచ్చటగా ఉంది.

ఆతనికి విసుగు రావడం లేదు. ఆఖరు ప్రయత్నంగా మునివేళ్ళతో తలుపు మీద కొట్టాడతడు.
"వెళ్ళిపో.. నీకు లోటు లేదు. నేను కాకపోతే మరొకరు. కావలసినన్ని కౌగిళ్ళు నీకోసం ఎదురుచూస్తున్నాయి. పో.. నీకిక్కడ చోటు లేదు. ఇది మానవతులుండే ఇల్లు. ఇక్కడ నిన్ను వలపు బిచ్చమడిగే వారెవరూ లేరు. పో.. వెళ్ళిపో.. నష్టపోయింది నేనే కదూ.. నీ ప్రేమను నమ్మి.. " పలవరిస్తూ సోలిపోయిందామె.

విన్నవే ఇన్నాళ్ళు, కన్ను లారగ చూసి
నాను, నే డెంతొ ఆనందమాయె;
ఆ చందనాంకము లా తమ్ములపు ముద్ర
లే లేమవో చెప్పలేరు తామె;
వేయికి పైనాయె ప్రియురాండ్రు, రేయికో
మూడె యామము లాయె - మోహయాత్ర
నేదొ ఈ దారి నూరేగు చుబుసుపోక
వేంచేసినార లీ వేగుబోక;

వలదు విడియగ నిట మానవతులె గాని
వలపు బిచ్చ మాశించెడు వారులేరు,
పిలుచుచున్నవి వేరె కౌగిళులు, వెడలు
మనుచు తెగనాడు 'ఖండిత'యైన రాధ.గొరవంకలు మొహాలు చూసుకున్నాయి. జాలిగా ఉందామెపై.. అతనిపై ఆమె వేసినవన్నీ అభాండాలే అని తేలి ఇద్దరూ కలిసిపోతే బాగుండుననిపించింది. మౌనంగా ఆ 'ఖండిత నాయిక'ను చూస్తూ నిట్టూర్చి, అక్కడి నుండి తప్పుకున్నాయా పిట్టలు.

"హ్మ్.. గొడవ సుఖాంతమైతే బాగుండును." పలికింది శారిక.
"నీ పలుకు తథాస్తు దేవతలు వింటే బాగుండును." బదులు పలికాడామె పెనివిటి.
"ఇంతేనా.. సుఖంగా గడిపే జంటలు లేవా ఈ ఊళ్ళో..?"
"ఇంటికో కథ. కాసేపు విశ్రమించు.. అన్నీ ఒకే రోజా!" అన్నాడు నవ్వుతూ మగ గోరింక.
                                       
                                                ***

* గొరవంకల కంటపడిన మరో కథ రేపు ..

* దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ""శృంగార నాయికలు"   ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..

Monday, August 27, 2012

మా ఇంటికి రండి..

ఊఁ.. రిక్షా ఎక్కి సర్దుకు కూర్చున్నారా..? పదండి.  రివ్వురివ్వున పరుగులు తీస్తూ కోట దాటి, డెంకేషావలీబాబా మసీదు దగ్గర కుడి వైపు డౌన్లోకి తిరిగిపోతాం. అలాగే జిడ్డువారి మేడ దాటొచ్చి గుమ్చీ దాటి అలా ముందుకొచ్చేయడమే! దార్లో వెంకటేశ్వరస్వామి కోవెల కుడిచేతివైపు కనిపిస్తుంది చూడండీ.. రిక్షాలోనే చెప్పులు విప్పేసి ఓసారి దణ్ణం పెట్టేసుకోండి. అయ్యకోనేరు గట్టుమీద ఇంకాస్త ముందుకొచ్చాక మళ్ళీ కుడిచేతివైపే గణపతి గుడి . అది దాటగానే కుడివైపు రిక్షా స్టాండు. ఎడమ వైపు నిష్ఠల వారి లైబ్రరీ. అక్కడిదాకా వచ్చాక చేతిలో ఉన్న పర్సూ, పిల్లాడూ, కాళ్ళదగ్గరున్న సామానూ జాగ్రత్తేం! రిక్షా డౌన్లోకి దిగుతుంది మరి!  రిక్షా అబ్బికి తెలిసినా దారి చెప్పడం మన ధర్మం. "ఎడం చేతివైపు డౌన్లోకి పోనీ బాబూ" అని చెప్పాలి. టర్నింగ్ తిరిగేటప్పుడు తాడు తో హేండిల్బార్ కి కట్టి ఉన్న బెల్ ని లాగి టంగ్ టంగ్ మనిపిస్తాడు. బావుంటుంది.

డౌన్లోకి దిగాక "రెండో రైటు రెండో రైటు.."
"పాలెపారి ఈదేనామ్మా. తెలుసు తల్లే.."
"కుడిచేతి వైపు లైట్ పోల్ ముందు ఇల్లు.."
"......"
"ఆ.. ఇలా ఆపేయ్.." అదేంటో అంత బాగా చెప్పినా అతను కచ్చితంగా పక్కనున్న ధవళవారింటి దగ్గరే.. ఆపుతాడు. ఇంటి ముందు రిక్షా ఆగడం ఎంత గొప్ప విషయమసలూ.. ఆగాక ఎవరో ఒకరు బయటికొస్తారు. తొంగి చూస్తారు. మనం దిగి డబ్బులిచ్చేలోపే "ఎవరూ.. " అని ప్రశ్న వినిపిస్తే "నేనే.. పక్కింటికి. ఇక్కడాపేసాడు" అని చెప్పాలి. ధవళ మామ్మగారికి కళ్ళు సరిగా ఆనవు కదా పాపం.

"ఉంకో రూపాయిప్పించడమ్మా, బోల్డు దూరవుఁ లాగినానూ.."
"అంతా డౌనే కదా!" అనాలి మనసులో జాలిగా ఉన్నా కూడా.. లేదంటే అమ్మ మన వీపు చీరేస్తుంది.
"బోనీ బేరం తల్లే.." సాయంత్రం ఏడయినా ఇదే చెప్తాడు. అదేవిటో మరి!

స్వర్గానికెన్ని మెట్లు..? రెండే రెండు. అప్పట్లో స్వర్గమని ఒప్పుకోకపోయినా ఇప్పుడు విలువ తెలిసొస్తోందిగా! ఆ మెట్లెక్కి పాలపిట్టరంగు కటకటాల లోపలివైపు గడియ ఎడమ చేతి వేళ్ళతో లాఘవంగా తీయడం సాధనతో పొందిన  విద్య. తీసుకుని లోపలికెళ్ళామా.. సన్నటి వరండా. చెప్పులు విప్పేసి పంచపట్టులోకెళ్ళి అక్కడ చెక్క సోఫాలో కూలబడడమే. కాళ్ళు కడుక్కోమని నాయనమ్మ అరిచేదాకా..

మధ్యలో ఖాళీ జాగా విడదీస్తున్న రెండు వాటాల ఇల్లు. అచ్చం ఒకేలా ఉండే రెండు వాటాలు! వీధిలోకి కిటికీ ఉన్న గది పిల్లలది. వేసవి కాలపు ఆటలు, పాటలు, బొమ్మల పెళ్ళెళ్ళు, ఆ మూల పాత జాజికాయ పెట్టెలో దాచిన రంగు రంగుల బొమ్మల బట్టలు , గాజుముక్కలు, ఎన్నికల అభ్యర్ధులు పంచిన రంగుల పాంప్లెట్లతో కుట్టి రాసుకున్న పుస్తకాలు, బద్దలైన ఆకాశనీలపు "తిరుపతి - పద్మావతి" గాజుల కోసం నేస్తంతో తగువులూ, వెక్కెక్కి ఏడవడాలూ, నారింజతొనలు పంచుకు తింటూ ఆడిన చింతగింజలు, వైకుంఠపాళీలు. చందమామలు, బాలమిత్రలూ, విస్ డమ్ లూ .. డిటెక్టివ్ నవలలూ.. అది దాటాక నవలలు, వారపత్రికలూ మడతమంచం మీద బోర్లా పడుక్కుని కాళ్ళూపుతూ చదువుకున్న జ్ఞాపకాలు.. ఇక్కడే.. ఈ గదిలోనే పదిలం!  ఇంతేనా..? రహస్యమొకటి చెప్పనా.. గదికి కిటికీ ఉంది చూడండీ. ఆ కిటికీ ఎన్ని జతల కళ్ళు పంపిన ఆశలరాయబారాలను  తలుపు వెనుక దాగి చూస్తున్న చారుచకోరనేత్రకు చేరుతున్నాయని తెలియనివ్వకుండా నిర్దాక్షిణ్యంగా రెక్కచాటు చేసిందో తెలుసా..?! అదన్నమాట ఆ గది ప్రత్యేకత!

పడగ్గది లో భోషాణం వెనుక దాచిన ఖాళీ అమృతాంజనం సీసాలు, చెక్క బీరువా కిర్రుమనకుండా తీసి అమ్మ చూడకుండా వేసుకెళ్ళిన కొత్తబట్టలు, బట్టల కింద మొగలి పొత్తులూ, పొగడదండలూ, సబ్బు రేపర్లూ దాచిన పరిమళం.. టైం మెషీన్ అంటే జ్ఞాపకాల తేరు. అంతే కదూ! అన్నట్టు కుమిలి చాకలి తెచ్చిన బట్టల మూట ఆ భోషాణానికీ, బీరువాకీ మధ్య ఉన్న మూలనే దింపించేవారు. ఎవరూ చూడకుండా ఆ మూటని కావలించుకు వాసన చూడాలనిపించేది. నవ్వకండేం. మీకు మాత్రం.. మంచం పై అమ్మ పరిచిన చాకింటి దుప్పటీ మీద మొదట మీరే పడుకోవాలనిపించదూ? పోటీ వస్తే తమ్ముడ్ని నిరంకుశంగా తోసేయాలనిపించదూ?

ఆ గదిలో గోడకి  చెక్కబద్దలమధ్య బిగించిన పెద్ద అద్దం వేలాడుతోంది చూసారూ.. అదే.. అమ్మకి తెలియకుండా తిలకం తెచ్చుకు మనవేఁ బొట్టుపెట్టేసుకోవాలని ప్రయత్నించిన రోజు జరిగిన భీభత్సానికి ప్రత్యక్షసాక్షి. తిలకం సీసా చేయిజారి ఆరోజు తిన్న చీవాట్లు అన్నీ ఇన్నీనా.. అమ్మో! అంతేనా.. పదారు కళలూ నింపుకుంటున్న లేలేత వయసుని మొదటగా చూసినది ఆ అద్దమే. ఎన్ని కొత్త బట్టలు వేసుకున్న సంబరాలను చూసిందో. ఎన్ని సార్లు పూల జడలనూ, జడగంటలనూ.. నాకు చూపించే ప్రయత్నం చేసిందో. "ఒప్పుడు సూసినా.. అద్దం ముందలే నిలుసుంతారూ.. సూసిన కొద్దీ పెరిగిపోద్దేటమ్మా అందవూఁ..!!" అని చీపురు పట్టుకుని ధడాలున తలుపు తోసుకుని గదిలోకొచ్చి బండారం బయటపెట్టేసిన అప్పల్నరసని ఏం చేసినా పాపం లేదు కదూ!

గది వదలక తప్పదా.. సరే.. ముందు పంచ పట్టుకి.. రండ్రండి. ఈ చూరు కింద నేను రాసిన పేర్లు చూసారా? నాదీ, తమ్ముడిదీ.  ఎప్పుడో నాలుగో తరగతిలో రాసినవన్నమాట. అప్పుడంత ఎత్తుకెలా రాయగలిగానా..! తావీజ్ మహిమ. అన్నీ చెప్పేస్తారేంటీ? పంచలో దూలం పట్టుకుని వేలాడుతూ బావ, పొడవెదగాలని కసరత్తులు చేసేవాడు.  "వెధవయ్యా.. కసరత్తులు చేస్తే ఎదిగిపోర్రా.. చదువు.. చదువు..  పొట్టిగా ఉన్నా లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి కాలేదూ!" అని వినిపించే చురకలకి పాపం, మొహం ఎంత చిన్నబుచ్చుకునేవాడో! మనమేం చేస్తాం. పంచపట్టున ఈ స్థంభం చూసారా.. ఇంటికి వెల్ల వేయించిన తరువాత నాల్రోజులు మాత్రమే దీని రంగు తెలుపు. బర్రెదూడల్లా స్థంభం చుట్టూ తిరుగుతూ సున్నం రాల్చేసి, పెచ్చులు పీకేస్తూ ఉంటే ఎంత బావుంటుందో! ఎవరూ చూడకుండా చెయ్యాలది.. ష్ష్...

ఈ చిన్న గది ఉందే.. దీన్ని పంచ గది అంటారన్నమాట. మామూలుగా అయితే తాతగారి పుస్తకాల భోషాణం, టీవీ,  అలమరలో పుస్తకాలు, పెన్నులూ అవీ ఉంటాయి. దసరాకి మాత్రం బొమ్మల కొలువు ఈ గదిలోనే. ఎదురుగా ఈ పంచలోనే పేరంటాళ్ళు కూర్చుంటారు. పసుపు సువాసన, పట్టుచీరల గరగర, గాజుల గలగల, పూల గుబాళింపులు.. కబుర్లు, నవ్వులు. శివశంకరీ పాటలో ఎంటీఆర్ ఒక్ఖడే  ఐదుగురైనట్టూ..  లక్ష్మీదేవి పేరంటాళ్ళ గుంపులుగా మారి వచ్చేసినట్టుండేది.  సంక్రాంతికి పసుపూ కుంకుమ తెచ్చి పంచే వారికోసం రెండు పళ్ళాలు ఇక్కడే సోఫా బల్ల మీద పెట్టేవాళ్ళం. పళ్ళెం నిండగానే అమ్మని పిలవాలి. తాంబూలం లో దక్షిణ మనం తీసేసుకున్నాకే లెండి. హ్హహ్హా..

రెండు వాటాలకీ మధ్యనున్న ఖాళీ జాగా చూసారా.. దాన్ని పందిరి అంటారు. వేసవిలో కొబ్బరి మట్టలు కొట్టించి పందిరి నేయించేవార్లెండి. అందుకన్నమాట ఆ పేరు. పగలంతా బోలెడు ఎండ వస్తుందా..  ఊరగాయలకీ, అప్పడాలకీ, వడియాలకీ మంచిదట. మనక్కాళ్ళుకాల్తాయ్ కానీ. తూర్పు గోడ విశ్వనాథవారితోనూ, పడమటి గోడ ధవళవారితోనూ పంచుకున్నాం కదా.. మన టీవీ ఏంటినా ఆ మాత్రం వాళ్ళ మేడల మీద పెట్టరేంటీ. కానీ ఏ కాకైనా వాలిందా.. ఏంటెనా కర్రతో కదుపుతూ "కనిపిస్తోందా.. వస్తోందా.. ఇప్పుడు.. ఇప్పుడో.." అని మనం మేడెక్కి అరవాలి. ఎన్ని కష్టాలసలు! తూర్పు గోడకి వరుసగా పేర్చిన కుండీలు అమ్మ ఆస్తి. పువ్వుల మీద చెయ్యి వేసామా.. వీపు సాపే! గులాబి అంట్లకి పేడ గోరింట పెట్టేది. చిగుళ్ళు బాగా వస్తాయట. అది చూసి "ఈ మొక్కకి పూచిన గులాబీలు నేను పెట్టుకోను గాక పెట్టుకోను." అని శపథం పూనేదాన్ని. పదిరోజులు గడిచేసరికి పన్నీరు గులాబీ ఘుమ్మున పూస్తే శపథాలా ఏమన్నానా.. పుణికేసి తురిమేసుకోవడమే! తెల్లచామంతులు, కాణీ చామంతులు, చిట్టి చామంతులు, ఊకబంతి, ముద్దబంతి, సీమ బంతి సరేసరి. తులసైతే వనమే! "కుండీల్లోనే తోట పెంచేస్తోంది మీ కోడలు!" అని ఎవరైనా మెచ్చుకుంటే "ఆ.. పొద్దస్తమానం పన్లు మాని సేవలు చేస్తే పూయవూ..!" అని సన్నాయి నొక్కేది నాయనమ్మ. అన్నట్టు చుట్టూ పచ్చపచ్చగా తోరణంలా అల్లేసిన ఈ మనీప్లాంట్ నేను తెచ్చినదే.. మనీప్లాంట్ అడిగి తేకూడదు. కొట్టుకొచ్చేయాలట. హ్హహ్హహా.. అవును. మీరు అనుకుంటున్నది నిజమే!

వెనుక వాటా పంచలో రేడియో ఉంటుంది. ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం అన్నమాట. సుప్రభాతం మొదలుకుని సైనిక మాధురి దాకా అన్నీ వినదగినవే, వినాల్సినవే! ఆ పంచ ఒడ్డున కూర్చుని నాయనమ్మ కూరగాయలు తరిగేది. అరిటి పువ్వు ఒలిచేది. చిక్కుడుకాయలు బాగుచేసేది. అరిటి దూట చక్రాలు తాపీగా తరిగేది. చల్ల చిలికి వెన్న తీసేది. ఓ పిల్లి అక్కడే కాసుకు తిరిగేది.. ఏ సుశీలో "నీ మది చల్లగా" నిదురపొమ్మందని కదా అని మోమాటానికి పోయి రెప్పకొడితే ఇంతేసంగతులు. ఈ పంచ ఒడ్డునే ఇంటిల్లిపాదీ కూర్చుని ఉదయాన్నే గుండుగ్లాసులతో కాఫీలు తాగేవారు. ఒక కాలు జాపుకుని,  స్థంభానికి ఆనుకు కూర్చుని అమ్మ నాకు జడవేసేది. చిక్కు తీస్తే ఏడుపు, ఒంటి జడ వేయనంటే ఏడుపు, రిబ్బన్లతో గాఠ్ఠి గా బిగించి వేస్తే మరో ఏడుపు.. ఏతావాతా అమ్మ పెట్టే రెండూ పెట్టాల్సిందే! అప్పుడెలాగూ ఏక ఏడుపే!

భోజనాల గది, వంటిల్లు.. ఉహూఁ.. ఇప్పుడు ప్రవేశం లేదు. ఘుమఘుమలు మాత్రం గుమ్మంలోంచే యధేచ్ఛగా పీల్చేసుకోవచ్చు. ఈ పంచలో చిన్న గది ఉందే.. అది  "మనత్తుకినియానై" సన్నిధి. మనోహరుడు.. మా ఇంటి రాముడి కొలువు! తీరుగా తిరునామాలు దిద్దిన నల్ల చేవ తలుపులు. వైకుంఠద్వారాలు తెరుచుకున్నంత ఠీవిగా అవి ఫెళ్ళున తెరుచుకోగానే మసక చీకటి పొరలను చీల్చే దీపశిఖల కాంతిలో మెరిసే శేషతల్పం. కొలువైతివా రంగ శాయీ..!  వయ్యారి జానకీబాలతో రామచంద్రుడు, కుడివైపున సౌమిత్రి. ఉహూ.. ఆంజనేయుడుండడు. మా రాముడు వనవాసానికి వెళ్ళి ఇక్కట్లు పడ్డ వాడు కాడట. పెళ్ళిపచ్చలారని యువరాజట! మైథిలీ మనో విహారి! "పాపం హనుమన్న లేకుండానా..?" అంటే,  "అదేవిటమ్మలూ! మనం లేవూఁ... రాంబంటు అంశ!" అనేవారు తాతగారు.

ఇలా రండి. ఇది వెనక వరండా.. దక్షిణపు గాలి ఎంత చల్లగా వీస్తోందో చూసారా? అందుకే తాతగారు వేసవి సెలవుల్లో ఇక్కడ కూర్చోబెట్టి సంత చెప్పేవారు. పదండి పెరడు చూసేసి వచ్చి ఇక్కడ కూర్చుందాం. నీళ్ళ కుండీలు, స్నానాల గదీ ఎడంవైపు. అదిగో నూతి గట్టు మీదకి వాలి కొబ్బరి చెట్టు. ఆ వెనుక మరొక చెట్టుంది కదా. వెనుక చెట్టువి నీళ్ళ బొండాలు. ఈ ముందు చెట్టు కాయలకే తీయని కొబ్బరి ముక్క ఉంటుంది. ఎంత రుచో మాటల్లో చెప్పలేం. ఊరికే ఓ పచ్చిమిరపకాయా, చింతపండు, ఉప్పు, రవంత పసుపు వేసి కచ్చాపచ్చా రుబ్బి విస్తట్లో వేసే కొబ్బరిపచ్చడి వేలితో నాక్కుంటే అద్దీ రుచి! కొబ్బరి చెట్టు మొదలుకి గోనెసంచిలో ఉప్పు వేసి కట్టేవారు.. కాపు బావుంటుందని! స్నానాల గది గోడనానుకుని బచ్చలి, పొట్ల తీగె, చంద్రకాంతం పూవులు, నిత్యమల్లి. బియ్యం కడిగిన నీళ్ళు పోసుకుని పచ్చగా నవనవలాడే కరివేప.

మధ్యాహ్నం వేళ నూతి గట్టున కొబ్బరిచెట్టు నీడలో కూర్చుని పుస్తకం చదూకుంటే ఎంత బావుంటుందో తెలుసా..! "రావే లోపలికీ.. మొహం తిరిగి పడతావ్. ఇల్లంతా వదిలేసి నూతిగట్టున చదువులేంటీ?" అని అమ్మ అరుస్తుందనుకోండీ. ఆట్టే పట్టించుకోకూడదు. విశ్వనాథవారింటి వైపు గోడకానుకుని నందివర్ధనం చెట్టు.. ఆ గట్టు మీదెక్కితే వారమ్మాయితో కబుర్లు చెప్పుకోవచ్చు. మిట్టమధ్యాహ్నం కాకుల్లా తిరుగుతున్నామని వీధి తలుపు తాళం వేసినా మన స్నేహబంధం మహ జిడ్డు. ఇలా పెరట్లో గోడ దగ్గర వేలాడుతూ కబుర్లు చెప్పేసుకోవడమే! ఇహ తలంట్లు, నూతిలో కవ్వు తీయించడం, కొబ్బరికాయలు దింపించడం గురించి చెప్తే.. ఈ రోజు సరిపోదు. పదండి పదండీ..

వరండా.. ఓ పక్క తాతగారి కరణీకం బల్ల. ఓరోజు "భగవద్గీత నాకెందుకూ.. పెద్దవాళ్ళకి కదూ!" అని విసుగ్గా అన్నానని "పదమూడేళ్ళ అమ్మలు కోసం.." అని మొదటి పేజీలో రాసి అచ్చమైన అందమైన తెలుగులో నాకోసం, అచ్చంగా నాకోసమే ఇదే బల్ల దగ్గర కూర్చుని భగవద్గీతను తెనిగించారాయన. నా పుణ్యం ఖర్చైపోయిందేమో..  ఓ రోజున  ఆ హంసని పైవాడు రివ్వున ఎగరేసుకుపోయాడే అనుకో.. నాకిక్కడేం లోటని!?

ఆ కాగితాలను తడుముతూ ఉంటే.. తాతగారి గోరంచు పంచె కుచ్చెళ్ళలో కూర్చున్నట్టూ.. ఆయన యజ్ఞోపవీతానికి బంధం వేసుకున్న పగడపు ఉంగరాన్ని విప్పే ప్రయత్నం చేస్తున్నట్టూ.. వెనక వరండా గుమ్మంలో.. ఇదిగో ఇక్కడే.. కూర్చుని ముకుందమాల సంత చెప్పుకుంటున్నప్పుడు,  గాలి ఆయన ఒంటి చందనపు పరిమళం అద్దుకుని నా వైపు వీచినట్టూ ఉండదూ..నాకిక్కడేం లోటని!?

Monday, July 16, 2012

రవి గాంచనిది (మలి భాగం)

 "యెంకి గాలొకసారి యిసిరినా సాలు - తోటంత రాజల్లె తవ్విపోసేను.. యెంకి సూపే సాలున"న్నాడు నాయిడుబావ. నిజమే! యెంకి లాంటి పిల్ల చూపే పడితే మహరాజయోగమే!

"అమ్మకడుపు చల్లగా నూరేళ్ళు బతక"మని కోరుకునే మనసూ, అవసరమైన క్షణాన వెర్రిబసవన్నకైనా కొమ్ము విసిరే పొగరు నేర్పే తెలివీ, పుచ్చపువ్వంటి వెన్నెల రేయి వృధా పోనివ్వక కులుకు చూపి ముందడుగు వేయించే ఒడుపూ.. ముప్పేటలా అల్లుకున్న పదారణాల ఎన్నెల పిల్ల” పాట – “ఆరుద్ర” వ్రాసిచ్చిన పాట."అటు ఎన్నెలా.. ఇటు ఎన్నెలా.." అంటూ తన బంగారు సామిని చూసి మురుస్తున్న పిల్లకి ఏకాంతం కొండంత చొరవనిచ్చింది. బిడియాన్ని పక్కన పెట్టి  తన ఇష్టాన్ని చూపాల్సిన తరుణం. అమాయకుడైన పడుచువాడిపై మనసు పడింది. లాలిత్యం పోతపోసిన పల్లె పాట పాడుతోంది.

కలువంటి మోము దానివనో, వెన్నెలంటి నీ నవ్వనో.. ఆడపిల్లని పోల్చి పొగడదండలేయడం కద్దు. అటు ఇటైతేనో! మగరాయని బులిపించేందుకు మగువకు మాటలు కరువా? కానేకావు! "మల్లె మొగ్గల నవ్వు నవ్వకురా.. ఓరందగాడ బంగారు సాఁవీ.. నీ నవ్వు లోనే తెల్లవారునురా!" అని హెచ్చరించింది.

ఎన్నెలల సొగసంత ఏటిపాలేనా? ఊఁహూ.. కానివ్వననంటోంది. ఏరులాగ ఎన్నెలంతా జారిజారి పారిపోతే.. ఏటికి ఎడద అడ్డువేసిమరీ ఆపేస్తానంటోంది. ఎంత మక్కువ పిల్లకి!  ఎన్నెలంటేనా? ఎన్నెల్లో నవ్వుతున్న బంగారు సామంటేనా?

స్త్రీసహజమైన సిగ్గరితనాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండానే గుట్టుమాటలలో మనసు పలికించింది. "కన్ను నిన్నే కౌగలించెనురా.. నిన్ను చూస్తే మనసు నిలవదు.. రా" అని.

అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా
ఎటు సూస్తే అటు ఎన్నెలా

ఓరందగాడ బంగారు సాఁమీ
నా మనసు ఎవరి పాలు సేతునురా
వయసు ఎవరీ పాలు సేతునురా 

మీద జూస్తే సందమాఁవ
కింద జూస్తే తెల్లకలవ
మల్లెమొగ్గల నవ్వు నవ్వకురా
నీ నవ్వులోనే తెల్లవారునురా
 
ఏరులాగ ఎన్నెలంతా జారిజారి పారిపోతే
ఏటికెడద అడ్డమేసెద రా
రందగాడ బంగారు సాఁమీ
నీటి మీదె కొంగు పరతును రా
 
ఆశ పెట్టే లేతపెదవి
ఆవులించే దోరవయసు
కన్ను నిన్నే కౌగలించెనురా
..రందగాడ బంగారుసాఁమీ
ఇలా నిన్ను జూస్తే మనసు నిలవదు రా

                                                                  ***

"ఆడువారి మాటలకు అర్ధాలె వేరులే!" అని పెద్దలు చెప్పిన మాట జ్ఞప్తికి లేకపోతే - తప్పక తప్పుదారి పట్టించే పాటొకటుంది. "పాలగుమ్మి పద్మరాజు"దిగుమ్మపాలల్లే కమ్మనిది!

ఆశల రంగవల్లులల్లిన కన్నెప్రాయపు మునివాకిట.. ఎప్పుడెదురవుతాడో, ఏనాడొస్తాడో ఊహించలేని అతిథి "అతడు". "అతిథి దేవోభవ" అన్నారాయే! ఎప్పుడొస్తాడో తెలియని వానికైనా మరియాదలు తక్కువ చేయని సంప్రదాయం మనది. అది అమ్మాయీమణీ పుణికిపుచ్చుకుంది. ఇల్లు కడిగిన ముత్యంలా ఉంచాలనుకుంది. తానూ ముచ్చటగా అలంకరించుకుని ఎదుర్కోలు పలకాలనుకుంది. వేళకానివేళలో వచ్చిన అనుకోని అతిథికి ఆకలవుతుందేమో.. పంచభక్ష్యాలు సిధ్ధం చేయాలనుకుంది. పనులన్నీ తెమలేలోగా అతనొచ్చేస్తే.. ఎలా?

"నేనొచ్చే వేళకి నీ అలంకరణలో జాప్యమా! ఇదేనా నీ ఎదురుచూపు?" అని తప్పు పట్టుకుంటేనో?
అందుకే.. "సిగలో చేరేందుకు విచ్చుకోని సిరిమల్లెలదే జాగు" అని చెపుతోంది.
"నిద్దురనీడలు వీడని కనులకు కాటుకెలా దిద్దనూ?" అని వాపోతోంది.
"తాను మనసులో సన్నిధ్ధమే" ఆతనికి చెప్పకనే చెప్పాలనుకుందే కానీ రమ్మని బిడియం విడిచి పిలువలేదు. ముగ్ధ సౌందర్య నాయిక!
"రాకోయీ అనుకోని అతిథీ.." పెదవంచున మాటే కానీ ఆతను వచ్చే క్షణం కోసమేగా ఇన్నాళ్ళూ వేచి ఉన్నది!

ఎంతటి అందానికైనా తెలివితేటలూ, గడుసుదనమూ తోడయితేనే - బంగారానికి తావి అబ్బినట్టు!
"రాకోయీ.." అంటూనే ఎదురుచూస్తున్న తానేమైనా చులకనౌతుందేమో అని అనుమానమొచ్చిందేమో.. ఆతనికో చిక్కు ప్రశ్న విసిరింది.
"వచ్చావు.. బాగానే ఉంది. ఊరక దారిని పోతూ పోతూ అలసే వచ్చితివో.." అంటూ
 నొసలు ముడివేసింది.
"అబ్బే లేదు లేదు.. నీకోసమే వచ్చానని" దాసుడు ఒప్పుకునే లోగా మరో చెణుకు "ఒంటరిగా ఉన్ననని నే తెలిసీ వచ్చితివో.."
అవుననగలడా? కాదని మనగలడా? అదీ ఆడపిల్లంటే!
అప్పటికే ఏమనాలో తెలియక బెంబేలుపడే పురుషుడికి అప్పుడే ఊరట కలిగించేస్తే ఎలా..?
"రమ్మనుటకు సాహసము చాలదు"
"హతోస్మి!" అని వెనుతిరగబోతాడేమో!
"పొమ్మనుటా మరియాద కాదిది.." అయినప్పటికీ "త్వరపడి రాకోయీ అనుకోని అతిథీ.."
ఇన్ని మెలికలున్న ఆహ్వానపత్రాన్ని అర్ధం చేసుకునే విజ్ఞత ఉంటేనే కల్యాణీ, కల్యాణమూను!రాకోయీ అనుకోని అతిథీ
కాకిచేత కబురైన పంపక

వాకిటి తలుపులు తెరువనె లేదు
ముంగిట ముగ్గులా తీర్చనె లేదు
వేళకాని వేళా.. వేళకాని వేళా
ఇంటికి రాకోయీ అనుకోని అతిథీ
సిగలో పువ్వులు ముడవాలంటే సిరిమల్లెలు వికసింపనె లేదు
కన్నుల కాటుక దిద్దాలంటే
నిద్దుర నీడలా వీడనె లేదు
పాలు వెన్నలు తేనే లేదు
పంచ భక్ష్యములా చేయనె లేదు
వేళ కాని వేళా వేళకాని వేళా
విందుకు రాకోయీ అనుకోని అతిథీ
ఊరక దారిని పోతూ పోతూ
అలసీ వచ్చితివో
ఒంటరిగా ఉన్నానని నే తెలిసే వచ్చితివో
రమ్మనుటకు సాహసము చాలదు
పొమ్మనుటా మరియాద కాదది
వేళకాని వేళా వేళ కానివేళా
త్వరపడి రాకోయీ అనుకోని అతిథీ

                                                                  ***

మనసేలే దొరకై ఎదురుచూపులో మధురమైన బాధ! తీయని నరకాన్ని, హింసించే హాయినీ.. అనుభవానికి తెచ్చే ఎడబాటు కడవాకిట - అతడొచ్చే క్షణం కోసం వేచియున్న ప్రోషిత భర్తృకని, భక్తురాలిని.. “దేవులపల్లి కృష్ణశాస్త్రి” తప్ప వేరొకరు పదాలలో ప్రతిష్ఠ చేయలేరేమో!

"అట చూడ వీటి ముంగిటను మౌనముగా తలవాల్చె మన మందార తరువు.." అని తానూ అలాగే ఎదురుచూసే ఆమెలో స్థితప్రజ్ఞతను కూడా రంగరించి మలచిన పాట ఒక మణిపూస! మాణిక్యపు నాణ్యతని వెలకట్టాలనో, రంగునో, తళుకునో వర్ణించాలనో ప్రయాసపడడం అత్యాశ. అయినప్పటికీ "ఆహా!' అని అబ్బురపడడం మానవసహజం!

"నీవొచ్చే మధురక్షణమేదో కానుకోలేని మందమతిని! కాస్త ముందు తెలిసినా.. మందిరమిటులుంచేనా?" అని వాపోతుంది. "వాకిట సుందరమందారకుంద సుమదళములు పరచి నీ కనులకు విందులివ్వాలి.." అని కోరిక వెలిబుచ్చుతుంది. అయితే అంత వెసులుబాటేదీ! ఎదురు చూడని క్షణంలో ఆతడొచ్చినా..  తోట పూలు ఆమెకు బాసట నిలిచే చెలులు. అతడి దారిపొడవునా ఆమె తలపుల్లా అప్రయత్నంగానే జారి ఎదురుచూస్తున్న పారిజాతాలున్నాయి. "వాటిపై నీ అడుగుల గురుతులు.. ప్రభూ! అవి చాలవూ!" అని తాదాత్మ్యం చెందుతుంది. అవి శీతవేళ తడిసిన పారిజాతాలట.. ఎడబాటుతో చెమ్మగిల్లిన తలపులకు ఇంతకంటే అందమైన పోలిక వేరేది!
"ఏలాగు మేఘవేళ - ఒంటరి రేల.. ప్రాణేశ్వరు ప్రవ్వసి బాసి.." అని వేసారుతూ బ్రతుకంతా ఎదురుచూచినా నీవు రాలేదు.. ఎప్పుడో, ఎదురు చూడని వేళనో వచ్చి ఇట్టే మాయమౌతావు!" అని తాననుభవించే వెర్రిబాధకు మాటలు వెతుక్కుంటుంది. అలా అని వచ్చిన ప్రభువును బంధించే ప్రయత్నమూ చేయలేక నిలచిపోయింది. బంధించేతటిదా.. ఆమెకా శక్తి ఉందా? హృదయమే సంకెల జేసి బంధించాలనుకుందట. మరి ఎందుకు ఆకట్టుకోలేకపోయిందో..? ఎవరి రాక కోసం ప్రాణాలు నిలుపుకుందో ప్రభువే ఎదురయ్యాక వేరే బంధనాల గురించి ఆలోచించేంతటి మతి ఉంటుందా?  ఆనంద స్థితే తప్ప!

ముందు తెలిసెనా ప్రభూ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధురక్షణమేదో 
 కాస్త ముందు తెలిసెనా ప్రభూ..

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే  
సుందర మందార కుంద సుమ దళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై  
నీ అడుగుల గురుతులే నిలిచిన చాలును

బ్రతుకంతా ఎదురుచూచు పట్టున రానేరావు
ఎదురరయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముసము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల జేసి

                                                                  ***

కన్నెజాజి.. ఆమె కనుల నిండా కలలు! వరకట్నపు  విసపుకోరలతో కాటేయబోయిన పెళ్ళిచూపుల పాము నుండి తెగువతో తప్పించుకుని, గాయపడ్డ మనసు చిక్కబట్టుకుంటోందా పిల్ల
ఇంతలో అతడు కనిపించాడు. శ్రీమన్మహారాజ మార్తాండ తేజుడూ.. ఆనందరాయుడూ.. అందగాడు! అప్పుడెప్పుడో అల్లరిగా అల్లుకున్న ఊహలన్నీ పలకరించాయి. వాటిని సంబాళించుకోలేక సతమతమవుతున్న మనసుని అదిలించి లొంగదీసుకోవాలని ఆమె చేస్తున్న విఫలప్రయత్నం.. అక్షరాలలో ఆడపిల్ల గుబులూ, నిజమైన ఆశా, దానిని వారించే నిరాశా.. “వేటూరి సుందరరామమూర్తిరచించిన గీతం. ఇదో అందమైన గులాబీ.. వెంటబరువైన భావపు” ముళ్ళుంటాయి.. మనసుకు గుచ్చుకుంటాయి.

అతనిని చూస్తే ఆమె మనసు తుళ్ళిపడుతుంది. అదురుపాటు అతని కంట పడకుండా దాచుకోమని మనసుకి తొలి హెచ్చరిక చేస్తోందామె "మనసా తుళ్ళి పడకే.. అతిగా ఆశపడకే.." అంటూ.

మాట వినని ఆశకి ఎంత పిరికిమందు నూరి పోస్తోందో.. ఎంత నిరాశ తలకెక్కిస్తోందో.. వెర్రి పిల్ల! "అతనికి నీవూ నచ్చావొ లేదో.. శుభ ఘడియ వచ్చేనొ రాదో" అంటూ గతం మిగిల్చిన గాయపు మచ్చని తడుముకుంటోంది. "తొందరపడతావేమో.. అలుసవుతావు సుమా!" అని వెనక్కి లాగుతోంది.

"ఏం?  అతను అందరిలాంటి వాడూ కాదేమో!" అని ఆశకి ఊపిరిపోయబోతున్న వలపుకి కళ్ళెం వేసేందుకు "ఏమన్ని సిరులున్నాయనీ వచ్చేను నిన్ను వలచీ?" అని ప్రశ్నిస్తోంది. "సొగసూ లేదు. చదువూ, పదవీ లేనేలేవు. ఇంకేమున్నాయని కలలు కంటున్నావు?" అని చేదు పాట పాడుతోంది.

అలా అని ఆతనిపై వల్లమాలిన అనురాగం లేకపోలేదు. " నోము నోచావు? దేముడిస్తాడు వరాన్ని?" అని అతనిని మనసులోనే సింహాసనమెక్కించేసింది. "మనసా వినవే మహ అందగాడు.. తనుగా జతగా మనకందిరాడు" అని పెదవి విరిచింది.కన్నెమనసుని కలలాపమని బతిమాలుకుంది.

తనపై తనకు విశ్వాసమున్న ఆడపిల్ల.. కాలపు దెబ్బలకు లొంగి పరిస్థితులకు తలవంచినప్పటికీ, "మనసు" మహ మొండిది. అందునా ఆడపిల్ల మనసుపడిందంటే ఒక పట్టాన మార్చుకోదు. అలాంటి మనసుని అదుపులో పెట్టుకునేందుకు ఒక అమ్మాయి ఇంతకంటే నైచ్యానుసంధానం చేయదేమో! కోణాన్నీ కవి చిత్రించగలిగాడు! అదే ఆశ్చర్యం!

 
మనసా తుళ్ళిపడకే
అతిగా ఆశ పడకే 
అతనికి నీవు నచ్చావొ లేదో
శుభఘడియ వచ్చేనొ రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
 
ఏమంత అందాలు కలవని
వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి ఉందని మురిసేను నిన్ను తలచి
చదువా పదవా ఏముంది నీకు? 
తళుకు కులుకూ ఏదమ్మ నీకూ? 
శ్రుతి మించకే నీవు మనసా
 
నోము నోచావు నీవని
దొరికేను ప్రేమ ఫలము
దేవుడిస్తాడు నీకని
అరుదైన అంత వరమూ
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నెమనసా..

                                                                     ***

అడ్డాల నాటి బిడ్డడు ఎదిగి గడ్డాలవాడైనా అమ్మ పాడే జోల అతడిని నిదురపుచ్చుతుంది. అదే అమ్మడు పాడే పాట కుర్రవాడికి కునుకు తెప్పిస్తుందా..? కర్తవ్యబోధ చేస్తుందా..? “సి. నారాయణరెడ్డికలం నుండి జాలువారిన పాట.. జోలపాట కాదు. కన్నె కస్తూరి  వైనంగా బావకి తెలుపుకున్న విన్నపాల పాట.

జో కొట్టి నిదుర ఊచే ముందు పాపడికి దేవుడి కథలో, దేవుడి కబుర్లో చెప్పడం ఆనవాయితీ కదా! అలాగే తన బావ నీలాల కన్నులకి నిత్యమల్లి జోల పాడుతున్న మరదలు కూడా పుట్టెడు దేవుళ్ళ సాటి తెచ్చి ఊసులు చెప్తోంది."రేపల్లెలో గోపన్న రేపటి చింత మరచి నిదురపోయాడు. యాదగిరి నరసన్నో.. ఆదమరచి నిదరోయాడు. ఏడుకొండల ఎంకన్న ఎపుడనగానో నిదరోయాడు. ఇంతలేసి కళ్ళతో నన్ను నమిలేసేలా చూస్తున్న కోడె పిల్లడా.. నీకేమో కునుకైనా రావట్లేదేం?" అని ప్రశ్నిస్తోంది. అది ఆశ్చర్యమేమీ కాదు. తనకి కావలసినదీ అదేగా! కునుకు పక్కన పెట్టి కబుర్లు వింటున్న బావకి మనసు విప్పి చెప్పుకునే అదను కోసమేగా పాటలూ.. పదాలూ!

"నీ తలపుల్లో తానాలు చేస్తున్న నా చుట్టూ చేపపిల్లలా తిరిగి అల్లరి చేయబోకురా.." అని మత్స్యావతారం ఎత్తవద్దని చెప్పేసింది. అలా అని కృష్ణుడిలా కోకలెత్తుకుపోయే అల్లరీ వద్దంది. వామనావతారమెత్తితే బ్రహ్మచారివై ఉండాలాయే. మనకి సామి ఊసొద్దు. బుధ్ధావతారమో.. బోధి చెట్టుని అంటి ఉండాలి. అదీ వద్దు. ఇంకెలా ఉండాలని కోరుకుంటోందా మరదలు?

చిననాటి నుంచీ విన్న కథల మూలాన ఆడపిల్ల మనసులో ముద్రవేసుకున్న ఒకే ఒక పురాణ పురుషుడు రాముడేమో! "రఘువంశ తిలకుడివై, రాముడివై, రమణుడివై.. సీతతోనే ఉండిపోరా!" అని కోరుకుంటోంది. తన గీత దిద్దేది అతడేనని చెపుతోంది.

జోలా జోలమ్మ జోలా జేజేలా జోల
నీలాలా కన్నులకూ నిత్యమల్లే పూల జో

రేపల్లె గోపన్న రేఫు మరచీ నిదరోయే
యాదగిరీ నరసన్న ఆదమరచి నిదరోయే
ఏడుకొండలా ఎంకన్న ఎపుడనగా నిదరోయే
కోడెపిల్లడా నీకేమో కునుకైనా రాదాయే

మీనావతారమెత్తి మేనిచుట్టూ రాబోకురా
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
వామనావతారమెత్తి సామిలాగ ఐపోకు
బుధ్ధావతారమెత్తి బోధిచెట్టునంటి ఉండకు
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై
సీతతోనే ఉండిపోరా గీత నువ్వే దిద్దిపోరా
సీత తోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా

                                                                  ***
వడ్డించిన విస్తరిలాంటి జీవితం. సంతోషపు తీరాన్ని చేరేందుకు అలల్లా ఎగసే కోరికలు. ఆమె మనసే అంతఃపురం. అందులో కొలువున్నవాడికోసం మహరాణేం చేసింది? “సిరివెన్నెల సీతారామశాస్త్రిపదాల్లో.. ఆనందం, ఆశలు, జీవితం.. వీటిని దాటి స్త్రీ అనే మహాసముద్రపు ఆవలి తీరాన్ని సుస్పష్టంగా దర్శింపచేసిన అందమైన పాట.నా లోకం మహా అందమైనది. వెన్నెల్లో నడిచే మబ్బులు, వర్షంలో తడిసే సంద్రంలా పోటెత్తిన సంతోషం, పువ్వులు, నవ్వులూ.. అంతా సౌందర్యమే! ఇవన్నీ నీకోసమే!

నీతో ఎన్ని కబుర్లు చెప్తే కరుగుతాయని? నీతో ఎన్ని ఆశలు పంచుకుంటే తరుగుతాయని? అనంతం కదూ! అచ్చం సముద్రంలో అలల్లాగే..!

నా కలలు కోటానుకోట్లు.. ఆకాశంలో చుక్కల్లాగ! చిత్రం! అవన్నీ నిజమై కళ్ళెదుటే నిలుస్తున్నాయి. అణువణువూ అమృతంలో తడిసిన అద్భుతంలా తోస్తోంది. చిత్రమేముంది..?  వెన్నెలరాజల్లే నువ్వే నా ఎదలో వాలినప్పుడు! కలలన్నీ సాకారమై.. నీలా.. ఇలా.. నా ఎదుట!

నీతో పంచుకునే ప్రతీ క్షణం నాకు మహా ప్రియమైనది. అరెరే.. విలువైన క్షణాలేవీ శాశ్వతం కావట్లేదే! కరిగిపోతున్నాయ్ సుమా! ఆనందాన్ని పట్టి బంధించాలంటే ఏం చెయ్యాలో నాకు తెలుసు. చెప్పనా.. హాయంతా పట్టి పాపాయిగా చేసి, నా ప్రాణాలు పోసి నీకిస్తాను. మన నూరేళ్ళ జీవితాన్ని భద్రంగా నీ చేతిలో కానుకలా పెట్టలేనా?"

ఇలా సృష్టిని ముందుకు నడిపే మహరాణి కాలాన్ని ఏలదా? తన నూరేళ్ళ జీవితంలో మరో నూరేళ్ళని పండించ గలిగే శక్తి అమ్మకే కదా ఉంది! తనకోసం కాదు, తనవాడికోసం. అతడితో తను కలిసి శాశ్వతమయ్యేందుకు!

వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగ
వర్షంలో తడిసే సంద్రంలా
ఊరేగే పువ్వుల్లో చెలరేగే నవ్వుల్లో
అంతా సౌందర్యమే అన్నీ నీకోసమే

నాలో ఎన్ని ఆశలో అలల్లా పొంగుతున్నవి
నీతో ఎన్ని చెప్పినా మరెన్నో మిగులుతున్నవి
కళ్ళల్లోనే వాలి నీలాకాశం అంతా ఎలా ఒదిగిందో
గగనాన్నే ఏలే పున్నమి రాజు ఎదలో ఎలా వాలాడో
నక్షత్రాలన్నీ ఇలా కలలై వచ్చాయి
చూస్తూనే నిజమై అవే ఎదుటే నిలిచాయి
అణువణువు అమృతంలో తడిసింది అద్భుతంలా

ఇట్టే కరుగుతున్నది మహా ప్రియమైన క్షణం
వెనకకు తిరగనన్నది ఎలా కాలాన్ని ఆపడం
వదిలామంటే నేడు తీయని స్మృతిగా మారి ఎటో పోతుందే
కావాలంటే చూడు ఆనందం మనతో తనూ వస్తుంది
హాయి అంతా మహా భద్రంగా దాచి
పాపాయి చేసి నా ప్రాణాలే పోసి
నూరేళ్ళ కానుకల్లే నీ చేతికీయలేనా

ఆకాశం అంతఃపురమయ్యింది నాకోసం అందిన వరమయ్యింది
రావమ్మా మహరాణీ.. ఏలమ్మా కాలాన్నీ అందీ లోకమే
అంతా సౌందర్యమే.. అన్నీ నీకోసమే.. 

                                                      *** 

పాటల వివరాలు: 
కొమ్మ మీద కోయిలుందిరారాజనందిని (1958)
సఖియా వివరించవే - నర్తనశాల (1963)
మీరజాలగలడా - శ్రీకృష్ణతులాభారం (1966)
అందెను నేడే అందని జాబిల్లి - ఆత్మగౌరవం (1966)
అటు ఎన్నెలా ఇటు ఎన్నెలా - సాక్షి (1967)
రాకోయీ అనుకోని అతిథీ - శ్రీరాజేశ్వరివిలాస్ కాఫీ క్లబ్ (1976)
ముందు తెలిసెనా ప్రభూ - మేఘసందేశం (1982)
మనసా తుళ్ళిపడకే - శ్రీవారికి ప్రేమలేఖ (1984)
జోలాజోలమ్మజోలా - సూత్రధారులు (1989)
వెన్నెల్లో నడిచే మబ్బుల్లాగ - అంతఃపురం (2001)


* వ్యాసం "12వ ఆటా సభల మహా జ్ఞాపిక - 2012" లో..  299 వ పేజీలో..
 ఇక్కడ కూడా చదవవచ్చు. 

* చిత్రాలు, పాటలూ..  గూగుల్ మరియు చిమటమ్యూజిక్ వారి సౌజన్యంతో..