Tuesday, October 2, 2012

అవియేటి అలకలో! (నాయికలు ~ 2)

జాము రాతిరి వేళ ఆ మిద్దెటింటి అరుగు మీదకి, కడియాలు వింత చప్పుడు చేస్తుండగా తాపీగా నడిచి వస్తున్న ఆమెను చూసి, "ఈమేనా?" అని అడిగింది శారిక. ఆ ఇంటి తోటలో చిక్కగా అల్లుకున్న పొదరింట అమర్చిన తిన్నె మీద వాలి ఉన్నాయా గొరవంకలు.

"కనబడడం లేదా ఏం? చెలికత్తె నీకు యజమానురాలి వలే కనిపిస్తోందటే.. నీ అమరత్వం అటకెక్కిందన్నమాటే! నిజం చెప్పూ.. కళ్ళు ఆనుతున్నాయా?"
"అబ్బ.. పరాగ్గా చూసానూ. నువ్వు మరీ ఆటపట్టించక్కర్లేదు. ఏదో రోజుకో కథ చెప్తున్నావని ఊరుకుంటున్నానే కానీ.."
".. లేదంటే ఉపేక్షించక నా పనిపట్టేదానివే!"
"ఇంతకీ నువ్వు చెప్పిన ఆ వలతి ఎక్కడుందీ?"
"హ్మ్.. చల్లని గాలి..  మత్తుగా తేలివస్తున్న ఈ రేరాణి పరిమళం..  కోడెకాఱునెవరినైనా నిమ్మళంగా ఉండనిచ్చేనా? అయితే జంటగా విహారానికి రావాలేగానీ, ఒంటిగా ఈ గాలికి తిరగగలరా ఎవరైనా..? ఒంటరిరేయిని నిందిస్తూ నడిమింట కూర్చుని ఉంటుంది" 
"పాపం ఆ పిల్ల విరహంలో వేగుతూ ఉంటే ఈమె వీధరుగు ఎక్కి తాపీగా పచార్లు చేస్తోందా? వెళ్ళి ఓ మంచిమాట చెప్పి ఊరడించవచ్చునే! చూడు చూడు.. కూనిరాగాలు తీస్తోంది పైగా." విసవిసలాడింది శారిక.
"అబ్బా.. నీ రొద ఎక్కువైపోతోంది. అన్నీ తెలుసుకోనిదీ అభాండాలు వేసేయడమేనా?" విసుక్కున్నాడు.
"ఆ.. అయినా ఈమెని అనడం దేనికీ? జాము రేతిరైనా ఇల్లు చేరని ఈ ఇంటి మగాడిని అనాలి. ఇంటి గడప దాటారా ఇంక మా గోడు మీకు పట్టేనా? ఎదురుచూసే మా ఊసైనా తలపులోకొచ్చేనా? ఎన్ని రాచకార్యాలో..  ఎన్ని ఇళ్ళుచక్కబెట్టాలో.."
"ఇదిగో ఓయ్.. అందర్నీ ఓ గాటన కట్టేయకు. నిన్నటి కత వేరు."
"మరి ఈ ఇంటి కథేవిటో?"
"చూద్దాం. ఇదిగో.. ఈ తలుపు తీసిపెట్టింది. సడి సేయక లోపలికి పద.."  రివ్వుమని క్షణంలో ఇంట్లోకి దూసుకుపోయాడా మగ గోరింక.
"నీ అసాధ్యం పాడుగానూ.. ఇంట్లోకా..? ఇంట్లోకే!! ఓయ్.. ఆగూ ఆగూ.. "
                                          
                                                     ***

ఉయ్యాలబల్ల మీద పడుకుని వగపులో మునిగిన ఓ పరువంపుకొమ్మ మసకచీకట్లో సైతం వజ్రపుతునకలా మెరిసిపడుతోంది. అలముకోబోతున్న చీకటితో కొడిగట్టబోతున్న దీపం గూట్లోంచే పోరాడుతోంది.  సద్దుచేయకుండా గోరవంకలు ఎగిరొచ్చి క్రీనీడలో ఉన్న ఓ చూరు వెతుక్కుని సర్దుకున్నాయి. నూనె వేసి వత్తి పైకెగదోసి, నెమ్మదిగా ఆ చిన్నారి దగ్గరికి నడుచుకుని వచ్చిందామె చెలి.

"సఖీ.. రెండో ఝాము దాటిపోతోంది. నిద్రపోమ్మా." లాలనగా పలికింది.
"....." మూగనోము పట్టిందామె. బాలీసు పై ఆన్చిన తల అటువైపు తిప్పుకుంది.
"కాస్తైనా ఎంగిలి పడలేదు. పోనీ, కాసిని పాలు తెచ్చివ్వనా?"
"ఉహూ.."
"ఇలా మాటామంతీ లేకుండా, తిండీతిప్పలూ మానేసి రేయంతా కూర్చుంటావా? ఆరోగ్యం ఏం గాను?"
"...."
"ఇదిగో.. ఏమయ్యిందో సరిగా చెప్పనిదే ఎలా తెలిసేది?"
"చదరంగం.."
"ఊ... చదరంగం..?"
"ఆడుతూంటే కలహం."
"ఓ.. ఆటలో నెగ్గలేదని అలిగావా?"
"కాదు."
"ఊ.. మరి?"
"...."
"ఏమయ్యిందో వివరంగా చెప్పు తల్లీ.. "  స్థంభానికి చేరగిలబడి కూర్చుంటూ అడిగింది.
ఆమె ఉయ్యాల బల్ల మీద నిటారుగా లేచి కూర్చుని జరిగిన విషయం చెప్పనారంభించింది.

"సాయంత్రమనగా వచ్చారు కదా. . ఇంకా బోలెడు పొద్దు ఉందని చదరంగం ఆడుతున్నాం. ఎప్పుడూ నెగ్గేది నేనే. ఈ రోజు ఓడిపోయాను."
"ఈ మాత్రానికేనా అలక?"
"ఉహూ.. ఓడిపోయానని నొచ్చుకున్నాను. పందెం గుర్తుచేసారు. ఓడినవారు గెలిచినవారి మాట వినాలని."
"ఓహో... ఎవరోడినా అతగాడే నీ బానిస కదూ..! ఇంతోటిదానికీ గెలుపోటములెందుకూ?"
"హ్హు.. వినవే ముందూ.  నా మనసు బాధతో బరువెక్కి నన్ను చంపేస్తోంది."
"ఊ.. ఊ.."
"ఓడే జాతి కాదు నాది.  మీరే తొండి చేసారన్నాను. "ఎక్కడైనా చుట్టరికం కానీ వంగతోట దగ్గర కాదూ.. నేనే గెలిచాను. ఓటమినొప్పనన్నారాయన. పైగా ప్రతిసారీ నేనోడి నిన్నుగెలిపిస్తున్నాన"ని కవ్వించారు. అలిగి మోము దాచాను. మాట్లాడను పొమ్మన్నాను."
"మరీ బావుంది. చిలికి చిలికి గాలివాన చేసావే!"
"చెయ్యనూ మరీ.. 'కిందపడ్డా నీదే పైచేయంటావు కదూ.. మంకులాడీ..' అన్నారు."
"అన్నాడే అనుకో.. పరాయివాడా! అరిగిపోతావా? పెనివిటితో కలహం గడపదాటనివ్వకూడదన్న ఇంగితమేమాయె?" బుగ్గలు నొక్కుకుంది.
"ఏమోనే, ఆ మాటనేసరికి ఉడుకుమోత్తనం పట్టలేకపోయాను.. "
"ఆ ప్రథమకోపం విడిచిపెట్టమని ఏనాడో చెప్పాను. చెవిని పెడ్తివి కావు కదా!" .
"ఊ.. నాదే తప్పంటావా?" బేలగా అడిగిందా అమ్మడు.
"తప్పూ ఒప్పూ అని కాదమ్మాయీ. తెగేదాకా లాగకూడదు. సరసం విరసం అయ్యింది చూడూ.."
"అవును.. నాకే అనిపిస్తోంది. ఇంత చిన్న విషయానికి రాధ్ధాంతం చేశానే! అని. మరే.. ఆయన ఇక రారంటావా?" ముంచుకొచ్చేసిన బెంగతో ఆమె నీలాలకనులు నిండిపోయాయి.
"నన్నడుగుతావేం.. ఆ మారాజు విసవిసా నడిచెళ్ళిపోయిన వైనం చూస్తేనే తెలుస్తోంది. ఎంత విసిగించావో!"
"పాపం.. ఎంత బతిమాలారో.. తెలుసా?" వేదనగా అంది.
"ఊ.."
"చిన్న మాటకి అంత కోపమెందుకన్నారు. ప్రియమైనదానివి కనుకే చనువున ఓ మాటన్నాను సఖీ అని బతిమాలారు.. " గొంతు జీరబోయిందామెకు.. అతడిని తలుచుకుని.

నిముషాలను గిర్రున వెనక్కి తిప్పే శక్తే ఉంటే అలా బతిమాలుతున్న అతడి పెదాలపై చప్పున మునివేళ్ళు ఉంచి ఆపి, "సర్లెండీ.. తప్పు నాదే!" అనాలనిపిస్తోందామెకు. అతని రూపం, లాలిస్తున్న అతని మాటలు కనుల ముందు కదులుతూ దుఃఖం పట్టలేక మనసు భారమైపోతోంది. 'పనిమాలి తెచ్చుకున్న కలహం కదా..' అని వాపోతోంది.

"అవును మరి! వలచి వచ్చిన వాడు. లాలన తెలిసిన వాడు. అతడు కనుక భరిస్తున్నాడు నీలాంటి తిక్కలపిల్లని.."
"అబ్బా.. నీకు ప్రియంవద అని పేరెవరు పెట్టారే! గాయం మీద కారం జల్లుతావు కదా!" విసుక్కుంది.
"జల్లనూ మరీ.. నీకు తెలిసి రావాలి. అతనేమైనా సామాన్యుడా! జగదేకసుందరుడు. చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ నీ వలరాయడు పాలతరకే! అందమొక్కటేనా, ఎంత ప్రేమా.. ఎంత మురిపెం నువ్వంటే!  అలాంటివాడు కోరి వచ్చినప్పుడే కొంగున కట్టుకోవాలి."
"ఊ.. " కనులు వర్షించేందుకు సిధ్ధమవుతున్నాయి.
"తప్పు తెలియద్దూ.. ఎవరితోనైనా మంకుతనానికి పోవచ్చేమో కానీ మనసేలే దొరతోనా.. అంతటి యోగ్యుడితోనా! తప్పు అమ్మాయీ.. తప్పు!" సుద్దులు చెప్పింది ప్రియంవద.

పెదవి కొరుకుతూ ధారలుగా చెక్కులని తడిపేస్తున్న కన్నీళ్ళని ఆపే ప్రయత్నం కూడా చేయకుండా నేలచూపులు చూస్తూ కాసేపాగి, "ఎంత మతిమాలిన దాన్ని. నా నాథుడిని ఎంత నొప్పించాను. కోరి కజ్జా తెచ్చుకున్నాను కదా! ఎంత బుజ్జగించారు!"
"ఊ..."
"ఇంత రచ్చ చేసి అలిగిన నన్ను, నాలాంటిదాన్ని సైతం ఎంత ప్రేమించి ఉంటారు! ఇంత జరిగాక కూడా ఏమన్నారో తెలుసా..? కుసుమించని కురవకమైనా నీ దయకు నోచుకుంటుందేమో కానీ.. నేనంత పరాయి వాడినయ్యానా, ప్రియా?" అన్నారు.. చివరి మాటలు దుఃఖంలో కలిసిపోతూండగా.. చెలియలికట్ట దాటిన శోకాన మునిగి ఉయ్యాలలో వాలిపోయి రోదిస్తూ తనను తానే నిందించుకుంటూ పలవరించసాగిందామె.
"మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందట వెనకటికి నీలాంటిదే.. అప్పుడేమో అలకలూ.. ఇప్పుడు ఉస్సురస్సురులూ.. " సణిగింది చెలియ.

"మనసార వలచి వచ్చినవాడు, నీ రేడు
తొగరేని మించు సోయగము వాడు;
లాలించినాడు, తన్నేలుకొమ్మన్నాడు-
చప్పగా వాయైన విప్పవపుడు.
అవియేటి అలకలో! ఆ మూతి ముడుపులు,
ఆ మొండిపట్టులు, ఆ బిగువులు!
ఇక నిప్పుడోయమ్మ! ఎన్ని నిట్టూర్పులు
అసురుస్సురనుటలు, అలమటలును! 

ఓసి, ఇవియేటి చేతలే బైసి మాలి!
ఏరు విన్నను నవ్వగలరు లె"మ్మ
టంచు చెలి పల్క, తెలివొంది అలవి కాని
వెతల పాలౌచు కలహాంతరిత తపించు.


ఆమె వెతలాగే ఆ యింట చీకటి నల్లగా కమ్మేసింది. గోరువంకలు ఇక చూసేదేముందని జారుకుని బయటికొచ్చాయి.
"చూస్తివా.. అతనిదే తప్పంటివి! అన్న చిన్నమాటకి ఎంత యుధ్ధమయ్యిందో చూడు! అందుకే మాట అదుపు, అణకువా ఉండాలి"
"'మీ ఆడంగులకు..' ఊ.. అదేగా మనసులో మాట. అనేయ్.. చల్లకొచ్చి దాపిరాలెందుకూ?" శారిక అనేసి మొహం తిప్పుకుంది. ఇంతలో ఏదో గుర్తొచ్చి పెనివిటివైపు తిరిగి..
"అవునూ.. కుసుమించని కురవకం..!"
"ఊ.. కురవకానికి ఆలింగనమే దోహదం.. ప్చ్.. ప్రేమికుడు.. సరసుడు!" మాట ముగిస్తూ శారిక వైపు చూసాడు సాలోచనగా..
"ఊ.. ఊ.. నేనంత తెలివిమాలినదాన్ని కాదులే! ఇలాంటి కజ్జాలు పెట్టుకోనుగా!" నవ్వింది శారిక.


        
                                         ***

* మరో కథ రేపు..

* దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ""శృంగార నాయికలు"   ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..

16 comments:

  1. మీమీద అభిమానం పెరగకుండా ఏమైనా చర్యలు చేపట్టాలి. తప్పదు.

    ReplyDelete
    Replies
    1. అయ్యో! ఎంతమాటనేసారు! :) ధన్యవాదాలండీ!

      Delete
  2. ఇలాంటివన్నీ మాలాంటి వాళ్లచేత చదివించీ, నాలాంటివాళ్ళ చేత పెళ్ళో పెళ్ళో అని గోల చేసేట్టూ చేస్తున్నారు గా..
    అద్భుతః.
    రోజూ ఇలా అద్భుతం అని చెప్పకుండా కొత్తగా ఎలా చెప్పాలండీ?

    ReplyDelete
    Replies
    1. హ్హహ్హహా.. పోన్లెండి. రోజూ దీపం వెలిగించగానే మీ ఇల్లాలు నన్ను తలుచుకుంటుంది. పూట పూటా గరిటె పట్టుకోగానే మీరు తలుచుకుందురు గాని :) థాంక్యూ!

      Delete
  3. కలహాంతరిత!!
    'కుసుమించని కురవకం' దగ్గర ఫక్కున నవ్వించారండీ...
    ఇంతకీ, తర్వాత రాబోతున్నది అభిసారికేనా? :-)

    ReplyDelete
    Replies
    1. ఆగండాగండి! అభిసారిక కంటే మీకే తొందరెక్కువలా ఉందే! :) ధన్యవాదాలు!

      Delete
  4. wow! Awesome, kothavakaya gArU :-)

    ReplyDelete
  5. గ్రాంధి కములోని కాఠిన్య బంధ నములు
    ద్రుంచి - వ్యావహారిక తెల్గు తోరణముల
    నెంత కనువిందు గావించె నీ కథనము !
    ఔర ! రుచి కరము గద ! కొత్తావకాయ
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. ఎంత పెద్ద ప్రశంస! ధన్యోస్మి!

      Delete
  6. కోవా గారు అసలు ఎంత బాగా రాసారండి ! నిజం గా నాకు చాలా నచ్చింది ఈ అమ్మాయి :-)
    ఇంతకీ కుసుమించని కురవకం అంటే ఏంటండీ ?

    ReplyDelete
    Replies
    1. నచ్చిందా! థాంక్యూ!

      కురవకం అంటే ఎర్రగోరింట చెట్టండీ. అది బాగా పూయాలంటే దానిని కౌగిలించుకోవాలని శాస్త్రం! :)

      Delete
  7. చాలా బావున్నదండి. తులసీ దళములచే అనే కృతిలో రకరకాల పూలతో పూజచెయ్యాలని చెబుతూ చంపక పాటల కురువక అని రాశారు త్యాగరాజస్వామి. కొన్ని పుష్పించే మొక్కలు, చెట్లు సరైన సమయానికి పూయకపోతే వాటికి "దోహదము" చెయ్యాలని శాస్త్రము. ఈ దోహదాలు రకరకాలుగా ఉంటాయి - పాదంతో తాకడం నించీ కౌగలించుకోవడం వరకూ.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు, నారాయణస్వామి గారూ! ఇళ్ళలో పొట్లపాదుకి పొగపెట్టడమో, కత్తి చూపించడమో కద్దు కదండీ. :)

      కావ్యాలలో దోహదక్రియ ప్రస్తావన బహుసుందరంగా ఉంటుందండీ. ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను. అశోకవృక్షాలను పాదతాడనంతో పుష్పింపచేసేవారట అమ్మవారు.. శంకరులు చెప్తారు కదూ సౌందర్యలహరిలో. భైరవభట్ల కామేశ్వరరావు గారి మహచక్కని వ్యాఖ్యానం చదివే ఉంటారు.

      http://www.telugupadyam.blogspot.com/2011/12/blog-post_30.html

      Delete