Wednesday, October 3, 2012

అసలు దోషము నాదే! (నాయికలు ~ 3)

"ఇంకా రారేమే..?" నికుంజం వెలుపలికి తొంగి చూస్తూ, సరిగంచు చీర కొస వేలికి ముడివేసి విప్పుతూ చెలిని వందో సారి అడిగిందామె.
"వస్తారు సఖీ! ఎన్ని రాచకార్యాలూ.. చక్కబెట్టుకుని రావద్దూ?" సహనంతో వందోసారి సమాధానం చెప్పింది చెలికత్తె.

                                         
                                                 ***

"ఏం రావడమో ఏమో. నాకు విసుగొస్తోంది." శారిక పెనివిటిని ముక్కుతో పొడుస్తూ చెప్పింది.
"ఉండు మరీ.. ఇళ్ళలోకి దూరీ, చెట్లెక్కీ తొంగిచూసే అవసరం లేకుండా, ఈ రోజు మనమున్న తోటకే ఈ విరహిణి వేంచేసిందని సంబరపడు. కాస్త సహనం వహించు. ఈమె చెలికత్తె తో సహా పొదరింట ఎదురుచూస్తున్నది ఏ మగరాయనికోసమో! చూడద్దూ!"
"ఏం రాయడో.. పాడో! ఈమెకెంత ఓపికో! ఎంతసేపైనా ఎదురుచూపేనా! హ్మ్.. చెప్పకేం..ఏ మాటకామాటే! ఈమె రాకతో ఈ తోటకి జీవమొచ్చింది. నడిచొచ్చిన కుందనపుబొమ్మలా ఉంది కదూ! మేలిముసుగు ఆమె ముక్కెర తళుకులని ఆపలేకపోతోంది. అసలే పదారణాల పాళాబంగారంలా మిసమిసలాడే అందం.. దానికి మరింత శోభ తెచ్చే అలంకరణ! ఎంత తీరుగా ఉందీమె!" ముద్దులొకుకుతున్న ఆ జవ్వనిని చూస్తూ, ఆ పొదరింటికి అభిముఖంగా ఉన్న మల్లెపొదలో కూర్చున్న శారిక మురిసింది.
"మహ ముచ్చట పడిపోతున్నావ్! ఎన్ని ఉన్నా ఆ పెదవుల నవ్వు లేనిదే, ఆ కన్నుల బెంగ పోనిదే... అబ్బే!"
"వస్తాడని చెలికత్తె చెప్తోంది కదూ!వచ్చాడో.. వెన్నెల పూయించడూ! "
"ఆఁ.. ఈ తోటతోటంతా మొగ్గ విచ్చి గుమ్ముగుమ్మున పరిమళం విరజిమ్మడం మొదలుపెట్టి ఝామున్నర గడిచింది. పాలకడలివెన్న నడి మింట నిలబడ్డాడు. ఇంకా దయరాదా ఈ అపరంజిపై!" అంటున్న గోరువంకను ఆశ్చర్యంగా చూసింది శారిక.
"అయ్యో.. నువ్వేనా. 'ఉండు మరీ.. చెట్లెక్కక్కర్లేదూ.. పుట్లెక్కక్కర్లేదూ.. సంతోషించమన్నదీ!' విసవిసలాడుతావేం!"  దెప్పింది.

                                                   ***

గమగమా గుబాళిస్తున్న సురపొన్న వైపు నుండి వినబడిన సడి తన ప్రియుని అడుగుల సవ్వడే అనుకుని, మెడలో తళుకులీనుతున్న సరాలు సవరించుకుని, చిగురు పెదవుల చిరునవ్వు దిద్దుకుని.. చెలివైపు తిరిగి "వెళ్ళి చూసి రా" అన్నట్టు సైగ చేసిందామె.
అటునిటూ చూసి పెదవివిరుస్తూ వెనక్కి వచ్చిన చెలిని రెండు భుజాలూ పట్టుకు ఊపేస్తూ "రారేమే ఇంకా! ఇక్కడికి రమ్మన్నారన్న సంగతి మరిచిపోయి ఉంటారా?"
"ఎందుకు మర్చిపోతారూ.. సంకేత స్థలం గురుతులు చెప్పి, సమయం చెప్పి నా చేతే కదూ కబురంపారూ! ఏ పనిలో చిక్కుకున్నారో!"
"వలచివచ్చిన ఆడపిల్లను ఇలా ఎదురుచూపుల్లో నిలబెట్టడం మర్యాదస్తుల లక్షణమా! హ్హు.. " కోపంగా పెదాలు బిగించింది.
"అంత మాటనేయకు. అతనేం సామాన్యుడు కాదు. బోలెడు పనులు చక్కబెట్టుకు రావద్దూ! నువ్వు సింగారానికెంత సమయం తీసుకున్నావో గుర్తులేదూ! అతనే ముందు వచ్చి ఉంటే.. ఇలా విసిగిపోయి తిట్టుకునేవాడా?" వేళ మించినా జాడలేని అతడిని వెనకేసుకొచ్చింది చెలికత్తె.
"నడిరేయి కావొస్తోంది. ఇలాంటి చోట జంటగా ఉంటే ప్రపంచం ఎంతో సుందరంగా కనిపిస్తుంది కానీ, ఇప్పుడు నాకు ఏమీ నచ్చడం లేదు."
"అవునులే.. వచ్చి నీ ఎదుట నిలబడిన క్షణం ఇన్ని మాటలూ మూటగట్టి పక్కన పెట్టి, ఆతని కౌగిట కరిగిపోదువులే.."
"నువ్వుండవే! నాకు కావాలనే అతను నన్ను నిర్లక్ష్యం చేశారేమో అని అనుమానంగా ఉంది." నొసలు ముడేస్తూ చెప్పిందామె.
"ఏమీ కాదులే. ఇంకాసేపు ఎదురుచూడు. నీవంటి అపరంజిబొమ్మని, వలపులరాశిని రమ్మని తాను రాకపోవడానికి అతనేమైనా పాషాణమా!"
"ఏమో... రాతిగుండె కాకపోతే వచ్చి ఇంతసేపయ్యింది. కీచురాళ్ళ రొద వినలేకున్నాను. ఈ విరహం భరించలేకున్నాను. ప్రేమించి వచ్చినందుకు ఇదా సన్మానం! నమ్మినందుకిదా పరిహారం!" అంతులేని వేదన ఆమె మాటల్లో.
"నిజమే! ఆలస్యమయ్యిందనుకో. అపార్ధం దేనికి? ఇంకాసేఫు చూద్దాం"

క్షణాలు గడిచి గడియల్లోకి మారుతున్నాయి. చల్లగాలి ఆర్పలేని ఆమె వేడి ఊర్పులకి, మోమంతా చిరుచెమటలు అలముకున్నాయి. దిద్దుకున్న కస్తూరితిలకం నీరై కారిపోతోంది. ఎంతో మక్కువగా అలంకరించుకున్న ఆభరణాలన్నీ భారంగా గుచ్చుకుంటున్నాయి. వచ్చిన క్షణాన ఎంతో ఆదరంగా ఆహ్వానం పలికిన ఆ సంకేతస్థలం ఇప్పుడామెకు భరింపశక్యం కాని విరహాన్ని కలిగిస్తోంది. అన్నిటికీ మించి "మోసపోయానేమో! అతను కావాలనే నిర్లక్ష్యం చేసాడేమో!" అనే అనుమానం ఆమెను దహించివేస్తోంది. దూరంగా నిద్దట్లో ఉలికిపడిన పక్షి చేసిన వింత ధ్వనికి ఆమె ఒళ్ళు ఝల్లుమంది. ఒక్క ఉదుటున పైకి లేచి చరచరా బయటకు కదిలింది.

"ఎక్కడికమ్మా.. ఇంకాసేఫు చూద్దాంలే! సహనం.. సహనం.." వెనక్కిపట్టి ఆపింది చెలికత్తె.
"హ్హు.. సహనం! రమ్మన్నది తానే.. రానిది తానే! ఇది నిర్లక్ష్యం కాక మరేవిటి?"
"అయ్యో. ఇంత సింగారించుకుని, ఇంత సమయం ఎదురుచూసి.. ఇప్పుడు వెళ్ళిపోతే.." అర్ధోక్తిలో ఆగిపోయింది చెలి.
"ఏమవుతుంది. అసలు అతడు వస్తే కదా! నా ప్రేమను, విరహాన్నీ లెక్కచేస్తే కదా! మగవారి సహజగుణమిది. దక్కేదాకా లోకంలో వేరే ఏమీలేవన్నంత ప్రేమ గుప్పిస్తారు. ఆమే తనదయ్యాక ఇంక ఎదురుచూపులు కానుకిచ్చి చిత్తగిస్తారు."
"నువ్వు మరీ.."
"ఏం కాదు. నిజమే చెప్తున్నాను. ఎదురుచూపు శ్రుతిమించనంత వరకూ ఎంత తీయనిబాధో, మరీ ఎక్కువైతే మహ చేదెక్కుతుంది. కాల్చేస్తుంది. ఏమనుకున్నారసలు? ఇన్ని ఝాములు ఇక్కడ తనకోసం పడిగాపులు కాస్తూ ఉంటే ఇంత ఉదాసీనతా! నేను వరించినది ఇలాంటి వ్యక్తినా!"
"ఇదిగో.. మరీ అభాండాలు వేసేయకు. ఆనక బాధపడేది నువ్వే.." హెచ్చరించింది చెలి.
"హ్హా.. అభాండం. కానే కాదు. ఇప్పుడు పడుతున్న బాధేమైనా తక్కువా! పదునైన రంపంతో మనసును కోసేస్తున్నంత వేదన! నావల్ల కావడం లేదే!" ముఖకమలాన్ని అలముకున్న  నీలినీడలతో చిన్నబోయిన ఆమెను చూడగా గోరువంకలకే పుట్టెడు జాలి పుట్టేసింది.

"ఎలా విడిచిపెట్టాడో చూడు! దీపతరువులా ఈ చీకటిలో నిలబడి, అతనికోసం చేసుకున్న అలంకారాలు వృధాపోతూండగా.. "సన్నగా రోదిస్తోంది. ఓదార్చబోయిన చెలికత్తె చేతిని విదిలించికొట్టి.. చేతుల్లో మోము దాచుకుంది. గాజులు ఘల్లుమన్నాయి. ఆమె క్రోధం మిన్నంటింది.

" చేయి పట్టుకుంటే ఘల్లున సంగీతం పలకాలని ఏరికోరివేసుకున్నానీ గాజులను.. " విసురుగా చేతిగాజులు తీసి నేలను కొట్టిందామె.
"ఆగాగూ.. ఏవిటా ఉన్మాద చర్య!" చెలి నెవ్వెరబోయి వారించింది.
"ఉన్మాదమే! ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నా కలలు భగ్నం చేసినందుకు ఉన్మాదమే! ఇదిగో చెదిరిన నా ముంగురులు సవరించేటపుడు చూస్తారని  ఈ పాపిటి బిళ్ళ, ముత్యాలబావిలీలూ.. కోరి అలంకరించుకున్నాను. వీటి ప్రయోజనమేముందిప్పుడు? " రోషంగా తీసి విసిరేసింది.
"ఓయ్.. ఓయ్.. ఆగు.." చెలియ మాటలు పట్టించుకోకుండా జారుతున్న కన్నీళ్ళతో మోమంతా తడిసిన మంకెనలా మారిపోగా, తనువునంటుకుని ఉన్న ఒక్కో నగా వొలిచి విసిరేయనారంభించింది.

"ఇదిగో.. ఈ ముక్కెర.. ఈ హంస.. వారికెంతో ఇష్టమని.. ఇంత కష్టపడతానని ఎరుగక పెట్టుకున్నాను. ఈ ముత్యాలహారాలను సవరిస్తూ సల్లాపాలాడుతారనుకున్నాను." మెలికలు పడిన హారాలను గుప్పెళ్ళతో తెంచి పారేస్తూ అన్నది.

"హ్హు.. నలకనడుమేదని వెతుకుతారని ఈ వడ్డాణమలంకరించాను. ఇదీ నిష్ఫలమైన కైసేతే!
మిడిసిపడే పూవులతో పాటూ మిసమిసలాడే బంగారపు నాగరాన్ని జడలో అమర్చుకున్నాను. దేనికిది? దీని సొగసూ నా ప్రాయమల్లే అడవిగాచిన వెన్నెలే!" రోషారుణ నేత్రాలు ధారగా కన్నీటి ఏరై పారగా చెప్పిందామె. చేతులతో కురులకు అల్లిన పుష్పబంధాలను తీసివేయగానే గట్టుతెంచుకు ఉరికిన యమునలా, నల్లని ఆమె కేశాలు విడివడి వీపంతా పరుచుకున్నాయి. ఘననితంబాన్ని అలవోకన చుట్టేసిన మొలనూలు వొలిచి వణుకుతున్న చేతులతో నేలకు జారవిడిచింది. చెదరిన కుచ్చెళ్ళు కాళ్ళకు అడ్డుపడుతూ ఉండగా తడబడే అడుగులతో శోకదేవతలా కదిలి వెళ్ళసాగింది.

"నా కన్నీళ్ళ ఏరు పారిన ఈ నేల అడుసాయెనని అతనికి చెప్పేదెవరు! ఇంత వేదనకు నన్ను బలిచేసిన ఆ మోసగాడిని శిక్షించేదెవరు! నాదే తప్పు. నమ్మిన నాదే తప్పు! ఈ శిక్ష నాకు పడాల్సిందే!" వెక్కిళ్ళు పెడుతూ నడుస్తున్న ఆమెను చెలి మౌనంగా అనుసరించింది. ఆమె అడుగుల సడి దూరమవుతూండగా ఆమె నిలిచిన ప్రదేశంలో చెదిరి జల్లుకున్న ఆమె కాలిమువ్వలు నేలతెగిపడిన నక్షత్రాల్లా మౌనంగా మెరిసాయి.

ఈ తీవ యోవరియే గదా తాముర
మ్మన్నయేకాంత గృహమ్ము! తాము
మెత్తురనే గదా, మెలత, ఈ కయిసేత!
ఈ నిరీక్షణము లింకెంతసేపె?
కడచెనే రేయిసగ; మ్మెన శ్రీవారి అడుగుల
సడియును పడదు చెవుల
మరిమరి పొగడకే మాయల మారిని,
విసిగిన ప్రాణాలు వేపి తినకె!

పదవె, అడుసాయె నేల నా భాష్పవారి
ననుచు నెవ్వగ మెయినగ లన్ని ఊడ్చు;
"అసలు దోషము నాదే" నటంచు ఏడ్చు,
విరహమున వేగిపోయిన విప్రలబ్ధ


ఆమె వెతకు మూగసాక్షులుగా నిలిచిన చెట్లన్నీ జాలిగా తలలూపుతున్నాయి. గంధవాహుడు నిట్టూర్చి పూబోడుల పరిమళాన్ని ఇక మోయలేనని బాధగా ఆగిపోయాడు. గువ్వల జంట ఒకరినొకరు చూసుకుని నిట్టూర్చారు.

"వలపులకిసమసలు చూడలేకున్నాను. ఇంత వేదనా! రూపం లేని మదనుడి మహిమ ఇంత బలీయమా!!" ఆశ్చర్యపోయింది శారిక.
"హ్మ్.. కౌగిట ఒదిగిన క్షణమెంత సౌఖ్యమో, విరహవేదన అంత నరకం. అందునా నిర్లక్ష్యమైపోయానని తెలియడం బహుచెడ్డ బాధ కదూ! మనసున్న పాపానికి ఈ వలపు వింతలూ, వేదనలూ తప్పించుకోలేరెవ్వరూ..!" నిట్టూర్చాడామె మగడు.

                                                   ***


* గువ్వల జంట కంటపడిన మరో కథ రేపు..

*దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన ""శృంగార నాయికలు"   ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..

11 comments:

 1. దక్కేదాకా లోకంలో వేరే ఏమీలేవన్నంత ప్రేమ గుప్పిస్తారు. తనదయ్యాక ఇంక ఎదురుచూపులు కానుకిచ్చి చిత్తగిస్తారు.. :)

  papam kada tanu.. Bhale rasaru.. :)

  ReplyDelete
  Replies
  1. నిజమేనండీ.. పాపం కదూ! ధన్యవాదాలు :)

   Delete
 2. "ఆమె అడుగుల సడి దూరమవుతూండగా ఆమె నిలిచిన ప్రదేశంలో చెదిరి జల్లుకున్న ఆమె కాలిమువ్వలు నేలతెగిపడిన నక్షత్రాల్లా మౌనంగా మెరిసాయి."
  ఇక్కడెందుకో వేటూరి గుర్తొచ్చారండీ నాకు :-) రేపటి నాయిక కోసం ఎదురు చూస్తూ....

  ReplyDelete
 3. చక్కగ రాశారు! ఉప్పు, నూనె, కారం ఎంతెంతుండాలని ఆవకాయలో ఎలా ఫార్ములా పెట్టుకున్నారో అలాగే రాసేప్పుడు అలంకారాల విషయంలోకూడా అద్భుతమైన ఓ ఫార్ములా డిరైవ్ సేసుకున్నారు కాబోలు! ఇంత తీయని అలంకారాలెలా రాస్తారూ!

  కథ రమ్యంగా సాగిందండీ! జోహార్లు!!
  ----------------------
  "ఇంత వేదనకు నన్ను బలిచేసిన ఆ మోసగాడిని శిక్షించేదెవరు! నాదే తప్పు. నమ్మిన నాదే తప్పు! ఈ శిక్ష నాకు పడాల్సిందే"

  "వలపులకిసమసలు చూడలేకున్నాను. ఇంత వేదనా! రూపం లేని మదనుడి మహిమ ఇంత బలీయమా!!"

  "కౌగిట ఒదిగిన క్షణమెంత సౌఖ్యమో, విరహవేదన అంత నరకం. అందునా నిర్లక్ష్యమైపోయానని తెలియడం బహుచెడ్డ బాధ కదూ! మనసున్న పాపానికి ఈ వలపు వింతలూ, వేదనలూ తప్పించుకోలేరెవ్వరూ..!"
  ------------------------
  మాటల్లేవండీ!

  "అడుసాయె నేల నా భాష్పవారి
  ననుచు నెవ్వగ మెయినగ లన్ని ఊడ్చు" ఎంత సుందరమైన పదాలో! కృష్ణశాస్త్రికే చెల్లు...

  విప్రలబ్ధ - అత్యధికంగా నా మదినాకట్టుకున్న నాయికలలో ఒక్కత్తె!
  "నీవేమి సేతువయ్యా నే వచ్చుటే దోసము; ఈ వేళ వెన్నెలగాసీ నిదియేపో దోసము; మలసి యింతసేసిన మరునిదే దోసము; పొంగార దైవము దయ పుట్టించని దోసము!"
  అంతటి వేదనలోకూడా నీ దోషమేమీలేదు; దోషమంతా నాదే అని ఎంద అందంగా సర్దిచెప్పుకుంటుందో ఈ నాయిక!

  ReplyDelete
  Replies
  1. అన్నమయ్య మాటల్లో విప్రలబ్ధ మరింత గొప్పగా కనిపిస్తోందండీ! మంచి కీర్తనని ప్రస్తావించారు. మీ ప్రశంసకు ధన్యవాదాలు!

   Delete
 4. ఐదు, ఆరు, నాలుగు...! క్రోనలాజికల్ ఆర్డర్ వదిలేసి... తర్వాత ఎవరో ఊహించడానికి లేకుండా చేశారుగా. ఇది కూడా బాగానే ఉంది. కానీయండి.

  ReplyDelete
  Replies
  1. క్రోనలాజికల్ ఆర్డర్ వదిలేసానని మొదట గుర్తించి అడిగినది మీరేనండీ. అవును.. కావాలనే ఎంచుకున్నానలా. ఈ వరుసా మీకు నచ్చే అవకాశం ఉందనుకుంటున్నాను. ధన్యవాదాలండీ. :)

   Delete
 5. >>ఈ తోటతోటంతా మొగ్గ విచ్చి గుమ్ముగుమ్మున పరిమళం విరజిమ్మడం మొదలుపెట్టి ఝామున్నర గడిచింది. పాలకడలివెన్న నడి మింట నిలబడ్డాడు.>>
  మాటల్లేవ్ అంతే, ఏ౦మ్మాటిడినా రసాభాస అవుతుందని భయం. థాంక్యు

  ReplyDelete
  Replies
  1. అయ్యో.. ఎంత మాట! చదివేవారి ఆదరం, ప్రశంస, విమర్శ, సలహా ఇచ్చే ఉత్సాహమే వేరండీ. రసాభాస ఏం కాదు. ధన్యవాదాలు!

   Delete
 6. మీ రచనలు ఇప్పుడే చూసాను. బాపు గారే వుంటే, ఈ మీ నాయికల కధల్ని తెరకెక్కిస్తే ఎంత బావుంటుందో...

  ReplyDelete