Thursday, October 4, 2012

నిలబడనీదు వెన్నెలల వాన.. (నాయికలు ~ 4)


వెన్నెలబాణాలు అమ్ములపొదిలో నింపుకుని, వెండిమబ్బుతేరుపై జైత్రయాత్రకు వచ్చిన కలువలరేడు ఆ ఉద్యానవనంలో తటాకం ఒడ్డున దిగులుగా కూర్చున్న ఓ వన్నెచిన్నెల ముద్దరాలిని చూసి ఉలిక్కిపడ్డాడు. "ఈ తెలిదమ్మి ఇంకా వికసించే ఉందే! ఇది తన పరాక్రమానికి చెడ్డపేర"ని భావించాడు. వెన్నెల తూపులతో దాడిచేయనారంభించాడు. ఒక్క సారిగా తోటంతా పరుచుకున్న చంద్రికలను చూసి నెవ్వెరపోయిందామె. ఇప్పటిదాకా లేని వెలుగు తన వగకాని రాకతో వచ్చి ఉంటుందని నలుదెసలా పరికించింది.  అతని జాడలేదని చిన్నబోయిన ఆమె మోమును చూసి, విజయగర్వంతో పొంగిపోయాడు వెర్రి చందమామ.

చెలికాని చూసి కొలనులో కలకలా విచ్చిన కలువల సుగంధం తోటంతా పరుచుకుంది. రోజంతా జుంటితేనెలారగించి మత్తుగా పూబోడుల ఎడదలపై వాలి నిద్దరోతున్న ఎలదేంట్లు ఆ పరిమళానికి ఉలిక్కిపడి లేచి, మరింత మత్తుతో సోలిపోయాయి. తెమ్మెరలు రజనీగంధాలనలదుకుని హడావిడిగా తిరిగేస్తున్నాయి. చకోరాలు విందారగించడం మొదలుపెట్టాయి.

ఇంత మనోహరమైన రాత్రి అలమటపడుతున్న ఆమే విరహిణి అని రూఢి చేసుకుని పరికించసాగాయి గోరువంకలు. ఆమె పాలరాతిబొమ్మ కాదని భారంగా విడుస్తున్న ఆమె వేడిఊపిరి చెప్తోంది. ప్రాణముందని ఎగసిపడుతున్న ఎడద చెప్పకనే చెప్తోంది.

"మరో విరహగాధ! తప్పదా? ఏవిటయ్యా ఇదీ?" శారిక పెనివిటిని నిలదీసింది.
"ఇన్ని చింతలూ, బాధలూ ఉన్న ప్రపంచంలో.. 'ప్రియుని కౌగిలి' అనే చిన్ని ఉపశమనం దొరకగానే తీరిపోయే బాధ ఇదొక్కటే! దానికే నోచుకోని పడతులున్నారంటే ఇది కదూ దారుణమంటే!"
"ఎవరైనా వింటే నవ్విపోగలరు! పొద్దస్తమానం ప్రేమేనా?"
"చరాచరసృష్టికి మూలం ప్రేమే! నవ్విపోదురుగాక..  వెరపేల!"
"బావుంది సంబడం.." గువ్వ నవ్వింది.
                                       
                                              ***

"కర్పూరంలో ఎక్కడిదా పరిమళం? కమలంలోనూ లేదు కదా ఆ సుగంధం! ఆ మోవి తావి! అతని పగడపు పెదవి తీయనిది. బహు తీయనిది! తీయదనమొకటేనా.. ఎంత మత్తైన తావి! మధురాధరాన ఎంత చక్కని పరిమళం కలిపి చెక్కాడా బ్రహ్మ.. నా ప్రాణాలు తీయడానికి కదూ! ఇంతకీ ఆ తీపి ముద్దుదా? ఆ ఆణికాడి మోవిదా? తేల్చేసుకుందామంటే ఇంకా రాడేమీ?" పలవరిస్తున్న ఆమెదెంత ఘాటైన మోహమో కానీ.. ఆమె మోము కలవరమద్దిన వింత సోయగంతో మెరుస్తోంది. చెక్కిలి చందురకావి అద్దుకుని పొగలు చిమ్ముతోంది. మిడిసిపడుతున్న ఆమె లావణ్యాన్ని చూసి 'తాపం ఇంత సొగసు పూయగలదా!' అని ఆశ్చర్యపోతున్నాడు జాబిలి. తనను వీడని తారకలను చూసి విసుక్కున్నాడు. విరహిణి ఒయారం చుక్కలకెక్కడిదీ!

"వెళ్ళి విభుని తీసుకురమ్మని పంపిన దూతికలింకా రాలేదు. శ్రీవారు సభామంటపంలో ఏ సాహిత్య గోష్ఠో, ఏ రాచకార్యమో నెరపుతూ ఉండి ఉంటారు. వీళ్ళేమో ఆతని ధీరగంభీర విగ్రహం అల్లంత దూరంలో కనిపిస్తేనే, చాటుకు వెళ్ళేంత సిగ్గరులు. ఇంక వెళ్ళి మాటలాడుతారా! నీ ప్రియభామిని విరహాన వేగిపోతోంది. చప్పున రమ్మనే సందేశాన్నిస్తారా? మతిమాలిన పని కాకపోతే వారిని పిలుచుకు రమ్మని ఎలా పంపాను! హ్మ్." నిలువలేక సోలిపోతున్న ఆమె నెన్నడుము కడుసన్ననైపోయింది. వెన్నెలదీపంతో జగతిని వెలిగించానని విర్రవీగుతూ, శత్రుశేషం ఉంచకూడదని రేరాజు చీకటికోసం వెతుకుతున్నాడు. నల్లని ఆమె కనులు, నలనల్లని ఆమె కురులు.. కృష్ణవర్ణానికి ఆవాసమయ్యాయని తెలిసి ఏమీ చెయ్యలేక గర్వభంగమై చిన్నబోయాడు. నెమ్మదించిన వెన్నెలవాన ఆమెకు కాస్త ఊరట కలిగించింది.

ఇంతలో కడుపునిండిన చకోరాలు ముక్కులు రాసుకుంటూ చేస్తున్న కూజితాలు ఆమె చెవిన పడ్డాయి. తన చుట్టూ అన్ని ప్రాణులూ జంటలుగా ఉన్నాయనే భావన ఆమెను మరింత కలవరపెట్టింది. "ఒంటరితనమేలా! ఆతని సన్నిధి లేని క్షణాలేలా! నా సౌందర్య సామ్రాజ్యమేలే దొర కాడూ! ఇక వేరే ఉద్యోగమెందుకని రాడేలా! ఈ వెన్నెల రేపుతున్న జ్వాలలేలా నన్ను దహించవు!" వేదనగా చెక్కిలి చేతను చేర్చి వేసటగా అనుకుందామె.

హఠాత్తుగా ఆమెకు కర్తవ్యం బోధపడింది. "జ్వాలలు.. ! తెలిసింది. ఈ బాధకు కారణమైన ఆ పూవింటిజోదునే శరణంటాను. వెన్నెలనారి సవరించి తూపుల గాయాలు చేయబోకుమని వేడుకుంటాను. అయ్యో మదనదేవా!  ఒంటరిని.. నా మీద కనికరం లేదా! అరవిందమో, చూతమో..ఏమో.. ఏ బాణమేసావో! ప్రాణాలు పోతున్నాయి.  నా మేను విరహపు వేడికి నీలోత్పలమైపోక మునుపే నాకు దారి చూపించు.." కనిపించని ఆ కాముడిని వేడుకుందామె. సడీ సవ్వడీ లేదు. గాలితేరునెక్కి అప్పుడప్పుడూ రాలుతున్న పొగడలు తప్ప వేరే అలికిడి లేదు.

"ఓ మదనా.. గిరిబాలను, హరునితో కలిపేందుకు ఆనాడెంత సాహసం చేసావు! కథలు కథలుగా చెప్పుకుంటారే! నీ సతిమాంగల్యమెంత గట్టిదో అని వేనోళ్ళ మీ జంట అన్యోన్యతను పొగుడుతారే! అన్నీ తెలిసిన నీవు నామీద కక్ష పూనడం న్యాయమా! బాణాలు సంధిస్తే సంధించావులే! ఎంత తుమ్మెదల అల్లెత్రాడైతే మాత్రం విడిచిన బాణం గుండెల్లో దిగకపోతే నీ శౌర్యానికి మచ్చ కదూ! నువ్వే గెలిచావులే! ఒప్పేసుకున్నాను. శరణన్నాను. ఇక నువ్వే నాకో పురుషకారం చేయకతప్పదు. వెళ్ళు.. నువ్వే వెళ్ళు. అతనుడివి! నీకు శరీరం లేకపోవడమెంత గొప్ప సౌలభ్యమో! ఎక్కడికైనా వెళ్ళగలవు. అతనెక్కడున్నా అతని మనసులో చేరగలవు! నా మాట చెప్పగలవు! దయుంచి నాకీ వేదన తప్పించు. ఆజన్మాంతం నీకు ఋణపడిఉంటాను. ఈ వలవంత నా వల్ల కాదు. కుసుమకోమలమైన నన్ను పూలబాణాలతో చంపిన పాపం నీకేల! వెళ్ళవూ.. నా ప్రాణదీపాన్ని నా చెంత చేర్చవూ!" అని వేడుకుంది.

విభుని దోతేర పంపిన ప్రియదూతిక
లెంతకు తిరిగిరారేమొ కాని-
ఘనుల సద్గోష్ఠిలో మునిగి యున్నాడని
వెరతురేమో స్వామి దరయుటకును,
నిప్పుల వర్షమై నిలువెల్ల దహించు
నిలబడనీదు వెన్నెలల వాన;
అయ్యయో, మదనదేవా! మ్రొక్కుదాన, నా
పైననా ననతూపు పదను బాకు?

అతనుడవు, నీవు పోగల వటకు, వారి
ఉల్లమున జేరి నా మాట నూదగలవు;
చనుము - నా ప్రాణముల నిల్పుమని నెలంత
తల్లడిలు విరహోత్కంఠిత వలవంత


"ఈ వెన్నెలలేల..  ఆతని నవ్వులుంటే! ఈ మల్లెలెందుకూ.. ఆతని కౌగిలుంటే! ఈ రేయి ఆతని సందిట నలుగని నా సౌందర్యమేల! ఈ వేదనకి నా ప్రాణమైనా పోదేల!" తల్లడిల్లుతూ తొడిమ విడిన పూవల్లే నేల జారిపోయింది. 'అతనికీ ఇంతే విరహాన్ని కలిగించి ఆమె చెంతకు చేర్చలేకపోయానే!' అనుకుంటూ జాబిలి చాటుకు వెళ్ళి తన చేతకానితనానికి సిగ్గుపడ్డాడు.

                                                 ***

* గొరవంకల వెంట ఇంకో కథ కోసం మరో ప్రయాణం రేపు..

** దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించిన "శృంగార నాయికలు" ఆధారంగా.. కాసింత కల్పన జోడించి..


15 comments:

 1. హ్మ్ ..చాలా బాగా వ్రాసారు.
  ఎందుకో మనసు బాధగా ఉంది

  ReplyDelete
 2. "గాలితేరునెక్కి అప్పుడప్పుడూ రాలుతున్న పొగడలు తప్ప వేరే అలికిడి లేదు."
  మిగిలిన వాక్యాలు నన్ను చూసి నవ్వుతాయని తెలిసీ చేస్తున్న సాహసమండీ..

  ReplyDelete
 3. "ఈ వెన్నెలలేల.. ఆతని నవ్వులుంటే! ఈ మల్లెలెందుకూ.. ఆతని కౌగిలుంటే! ఈ రేయి ఆతని సందిట నలుగని నా సౌందర్యమేల! ఈ వేదనకి నా ప్రాణమైనా పోదేల!"

  చక్కని వచనంలో ఇంతకంటే స్పష్టంగా విరహోత్కంఠితను చూపగలిగినవారెవ్వరూ!!
  నాకు బాగా నచ్చే ముగ్గురిలో ఈమె ఒకరు :-)

  ప్చ్, నువ్వు బాగా రాయడం.. అది ఎంత బావుంటుందో చెప్పడానికి విశేషణాలన్నీ అయిపోయి, మేము మూగలైపోవడం!!

  ReplyDelete
 4. చాలా బాగుంది...
  అభినందనలు మీకు...
  @శ్రీ

  ReplyDelete
 5. మామూలు తెలుగు మాటల
  కామని తేనియల నద్ది యలరించుట మీ
  కేమాడ్కి యలవడెనొ ఓ
  ధీమతి ! కొత్తావకాయ ! తెలుపగ వలయున్ .
  ----- సుజన-సృజన

  ReplyDelete
  Replies
  1. మీబోటి పెద్దల ఆశీర్వచనం, ఆదరం.. అంతేనండీ! ధన్యవాదాలు!

   Delete
 6. ఇప్పటి దాకా చూసొచ్చిన ఐదుగురు నాయికల్లో ఈవిడ కొంచెం ఎక్కువే మనసు దోచుకున్నట్టు అనిపిస్తుందండీ.. :)

  ReplyDelete