Thursday, June 26, 2025

టూడీ

సోహం మెలుకువ తెచ్చుకుంటున్నాడు.

నీలి వెలుగు మిణుకుమిణుకుమంటూ అతని శరీరమంతా పరుచుకుంటోంది. 

కళ్ళు విప్పి అటూ ఇటూ కదిపి చూసాడు. కుప్పలా పడున్న శరీరాన్ని కూడగట్టుకుని మూటలా దగ్గరకి జరుపుకున్నాడు. సోహం వొళ్ళంతా నారింజవర్ణం వచ్చి చేరింది. సున్నాల్లో చుక్కలు పెట్టినట్టున్న కళ్ళు గిరగిరా ఇటూ అటూ తిరిగి చూశాయి. రోజు మొదలయింది. 

సోహం ప్లనేరియాలో ఎడమ చివర ఉన్న ఇంట్లో ఉంటాడు.  ఇల్లంటే పెద్దదేమీ కాదు. షట్కోణం మీద త్రికోణం పెట్టినట్టుంటుంది. అప్పుడప్పుడు సోహాన్ని అతని స్నేహితురాలు లిన్నా ఏడిపిస్తూ ఉంటుంది.. 'అది షట్కోణం కాదు పెద్ద త్రికోణాన్ని మొయ్యలేక తెగసాగిపోయిన చతుర్భుజ'మని. ఇంట్లో నేలంతా గుండ్రంగా గుండ్రగుండ్రంగా వృత్తాలుంటాయి. అవన్నీ నీలి ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. ఒకవైపున్న ఫ్రిజ్ లోంచి  కనిపించే నియాన్ పసుపు సమోసాలు తప్ప ఆ ఇంట్లో ఇంకేమీ ఉండవు. చెయ్యడానికి పనీ ఉండదు. సోహం పనంతా రోడ్డు మీదే.. 

ప్లనేరియాలో ఉన్న త్రికోణాలూ, గీతలూ, గుండ్రాలూ, గీతలూ వగైరాలు ఎక్కడైనా సొట్టలు పోతే వాటిని సోహం సాపు చేస్తూంటాడు. మూటలాంటి అతని శరీరం వాటిని నునుపు చేస్తూ పోడానికి బాగా సదుపాయంగా ఉంటుంది. రోజంతా అలా దొర్లుకుంటూ దార్లో ఎక్కడైనా వంకర త్రిభుజమో, సాగిపోయి వాలిపోతున్న అష్టభుజో కనబడగానే తాపీగా శరీరాన్ని దానికేసి తోస్తూ, పాముతూ.. సరిచేస్తాడు. 'రోజూ ఇదే పనా!' అని అప్పుడప్పుడు విసుగనిపించినా తను సర్దకపోతే ప్లనేరియా గతేమిటో తెలుసు కాబట్టి గర్వంగానే పనిచేస్తూంటాడు. 

అయితే ఎప్పుడైనా త్రిభుజాలు అతుకుల దగ్గర విడిపోతేనో, గుండ్రాలు నేలకి అంటి పైకి రానంటేనో మాత్రం పెద్ద చిక్కొచ్చి పడ్డట్టే! లిన్నా రావాల్సిందే. 

లిన్నా సమకోణ త్రిభుజాకారపు శరీరంతో, అంచులంట నీలిరంగులో వెండిమెరుపులు  కలిపి పూసినట్టు మెరుస్తూ ఉంటుంది. లిన్నా కదిలినప్పుడల్లా అంచులు చమక్కుమంటాయి. ఆ రంగుని రెండు కళ్ళూ తిప్పి వింతగా చూస్తాడు సోహం. 


పాడైపోయిన, విడిపోయిన ఆకృతుల్ని లిన్నా చకచకా సరిచేస్తూంటే చూడడం సోహానికి మరీ మరీ ఇష్టం. ‘తను సొట్టలు తీయగలడంతే.. బాగుచెయ్యాలంటే ఎంత పనితనం కావాలి!’


లిన్నా కష్టపడి పని పూర్తిచేసి అయిపోయిందన్నట్టు ఒళ్ళంతా గాఢనీలం రంగులో విరుచుకుంటుంది. అలాగే హుందాగా జారుకుంటూ గ్లో నూడుల్ కేఫ్ కి వెళ్ళిపోతుంది. తన వెనకే దొర్లుకుంటూ సోహం కూడా అక్కడికే చేరుకుంటాడు. 


గ్లో నూడుల్ కేఫ్ లో సోహానికి ఇష్టమైన నియాన్ సమోసాలుంటాయి. అవంటే లిన్నాకి చిరాకు. 


“ఇవే పొద్దస్తమానం తింటూంటే ఎప్పుడో ఒకప్పుడు నీ ఒళ్ళు కూడా అతుకులు విడిపోయి పగిలిపోతుంది. అప్పుడు నేనే బాగుచెయ్యాలి! ఇప్పటిదాకా ఒక్క బ్లాబ్ ని కూడా బాగుచెయ్యలేదు నేను. నువ్వే ఫస్ట్! చూసుకోమరి..” అని ఏడిపిస్తూ ఉంటుంది. పరవాలేదన్నట్టు కళ్ళు తిప్పి, ఓమీ తెచ్చిచ్చిన సమోసాలు బొజ్జ మీద పెట్టుకుని తనలో కలిపేసుకుంటాడు సోహం. 


లిన్నాకి మింట్ స్క్వేర్ లు చాలా ఇష్టం. తను కేఫ్ లోకి రాగానే ఓమీ అలమరలోంచి మింట్ చదరాలు తెచ్చి పెడుతూంటాడు. లిన్నా నాజూకుగా ఒకటో రెండో తీసుకుని కడుపుకి పెట్టేసుకుంటుంది. 


ఓసారెప్పుడో కేఫ్ లో అలమరా అంచు బద్దలై విలువైన స్టార్ కేండీలు దబదబా ఒలికిపోయాయి. అప్పటికప్పుడు లిన్నా వచ్చి బాగుచేసింది. అందుకని లిన్నా అంటే గౌరవం ఓమీకి. ఎవరి జోలికీ పోని సోహం అంటే కూడా ఇష్టమే కానీ, బోలూ వస్తే మాత్రం చిరాకుపడతాడు. వస్తూనే బోలెడు అల్లరి చేస్తాడు కూడాను. సోహం, లిన్నా రావడమేంటి ఎక్కడున్నా తనూ ప్రత్యక్షమైపోవలసిందే. స్టార్ కేండీ తప్ప ఇంకేమీ ముట్టుకోడు బోలూ.


ముగ్గురూ కేఫ్ లో తిని, కబుర్లు చెప్పుకుని ఇంటిదారి పట్టారు. కేఫ్ గుమ్మందాకా వచ్చినవాడే ఏదో గుర్తొచ్చినట్టు బోలూ వెనక్కిళ్ళి ఓమీ పల్స్ చెక్ చేసి వచ్చాడు. విసుక్కుంటూనే బోలూని దగ్గరకి రానిచ్చాడు ఓమీ. పల్స్ చెకర్ బోలూని ప్లనేరియాలో ఎవరూ కాదనడానికి వీల్లేదు. అంత ముఖ్యమైనపని మరి. ప్లనేరియాలో ఉండేవారు దభేలున కింద పడిపోకుండా ఉండాలంటే పల్స్ కొట్టుకుంటూ ఉండాలి కదా! 


బోలూ పేరుకి తగ్గట్టే చక్కగా గుండ్రంగా గులాబీరంగుకి బంగారమద్దినట్టు ధగధగలాడుతూ హడావిడిగా పరుగులు తీస్తూంటాడు. ఎక్కడా క్షణమాగడు, ఎదురుపడ్డ వాళ్ళు ఎవరి పల్సయినా చూడకుండా వదలడు. 


బోలూని తనింట్లో విడిచిపెట్టి చీకటిపడుతోందని ఇంటికి బయల్దేరారు లిన్నా, సోహం. కొత్త డిస్కో ఫ్లోర్ చూసి కాసేపు డాన్స్ చేసి వెళ్లమని బలవంతపెట్టాడు బోలూ. బయటినుంచే చూసేసి బావుందన్నారు. మెరుస్తూ ఎర్రగా బోలూ లాగే గుండ్రంగా ఉంటుంది వాడి ఇల్లు కూడా. ఇంటి మీద బోలెడు బొమ్మలేస్తూ చెరిపేస్తూ ఉంటాడు బోలూ.  లిన్నా ఇల్లు తనకిష్టమైన మింట్ స్క్వేర్ లాగే ఉంటుంది. 


‘తన ఇల్లు మాత్రమే తనలా ఎందుకు లేద’ని ఆ రోజు రాత్రి నిద్రలోకి జారుకుంటూ ఆలోచించాడు సోహం. తనకో ఆకారముంటే కదా! 


***


“హిక్..” తల అదిరిపోయినట్టయింది సోహం కి.. ఉన్నట్టుండి మెలుకువొచ్చేసింది.


తెల్లారిపోయిందప్పటికే. కలలో ఏం జరిగిందో గుర్తుచేసుకోడానికి ప్రయత్నిస్తూ ఒళ్ళు కూడగట్టుకోబోయాడు. 


మళ్ళీ “హిక్..” 


తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా వంకర్లు పోయినట్టు తోచిందో క్షణం. కళ్ళకేమీ తిన్నగా ఉన్నట్టు కనబడడం లేదు! చుట్టూ అన్నీ వంకర్లు టింకర్లుగా.. అర్ధం పర్ధం లేనట్టు తోస్తున్నాయి. 


లేచి చుట్టూ చూసాడు. పెద్దగా వెక్కిళ్లు మొదలయ్యాయి. చుట్టూ ఉన్న ఆకృతుల వంకర్లు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. అతిప్రయత్నం మీద జారుకుంటూ తోసుకుంటూ  లిన్నా ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే లిన్నా తనవైపు పరుగులు పెడుతూ వస్తోంది. 


“ఏమయింది?” ఆందోళనగా అడిగింది సోహాన్నే పరీక్షగా చూస్తూ.. 

మళ్ళీ పెద్దగా వెక్కిళ్లు పెట్టాడు. ఆకాశంలో ఒకదాని వెంట ఒకటిగా వెళ్తున్న పక్షులు కలిసి గుండ్రంగా గిరికీలు కొట్టడం మొదలెట్టాయి దెబ్బకి. 


“నీకేదో అయింది!” భయంగా సోహాన్ని చూస్తోంది లిన్నా. 


“ఏం చేద్దామిప్పుడు? ఈ వంకర్లు చూసావా? ప్లనేరియా అంతా సాపు చేసుకోవాలి! చూడెలా వంకర్లు వంకర్లు పోయిందో.. బోలూని పిలిచి నా పల్స్ చూడమందామా?” వెక్కిళ్లు ఆపుకుంటూ ఏడుపుమొహం పెట్టాడు సోహం. 


“ఉహుఁ.. నువ్వు.. వెంటనే సాధుసాధు గారి దగ్గరికి వెళ్ళు!” 

“ఎవరది?”


“వైబ్ గార్డెన్ లో ఉంటారు. ప్లనేరియాలో ఎవరికైనా అంతుచిక్కని సమస్య వస్తే ఆయన దగ్గరకే వెళ్తారు.” త్వరపెట్టింది లిన్నా. 


***


సాధుసాధు అంచులు పాదరసంలా మిలమిలా మెరుస్తున్నాయి. రెండు కళ్లూ సగానికి మూసుకుని ఉన్నాయి. సోహం చెప్పేది శాంతంగా విన్నారాయన. 


“వెక్కిళ్లు రాగానే ఏమవుతుంది?”

“హిక్.. క్క్…” 


సాధుసాధు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా వెలిగి విచ్చుకున్నాయి. ఆయన కూర్చున్న చదరం వంకర్లు టింకర్లుగా తయారయ్యింది. సోహానికి జరుగుతున్నదేమిటో ఆయనకి స్పష్టంగా అర్ధమయింది. 


“నువ్వు వేరే లోకం గురించి ఆలోచిస్తున్నావా?” సోహాన్ని సూటిగా ప్రశ్నించారు. 


అదేమిటన్నట్టు చూసాడు సోహం. మరోసారి వెక్కిళ్లు రాబోతూంటే బలవంతంగా ఆపుకున్నాడు. అసలే బ్లాబ్ లాంటి శరీరం విపరీతంగా కదిలిపోతోంది. లోపల్నుంచి నీలిరంగులు ఉండుండి విరజిమ్ముతున్నాయి. 


“నువ్వు వెక్కిళ్లు పెట్టినప్పుడల్లా.. ప్లనేరియా బయటికి నెట్టబడుతున్నావ్.”

“అక్కడెవరున్నారు? నేనెందుకెళ్తున్నాను?”


“అప్రస్తుతం. అలా దాటివెళ్లేందుకు నీకింకా సమయం రాలేదు, నీ శక్తి సరిపోదు.” చెప్పారు సాధుసాధు 


“ఇప్పుడు నేనేం చెయ్యాలి?” 


సోహం ప్రశ్నకి సమాధానం చెప్పకుండా వజ్రంలా మెరుస్తున్న వస్తువొకటి అందించారు.


“ఇదేంటి?”

“దీన్ని కర్వ్ కీపర్ అంటారు. నీ దగ్గరే ఉంచుకో..” 


దాన్ని అందుకోగానే సోహం వెక్కిళ్లు తగ్గుముఖం పట్టాయి. కర్వ్ కీపర్ ని అటూ ఇటూ తిప్పి దగ్గరగా తెచ్చుకున్నాడు. చుట్టూ ఉన్న వంకర్లన్నీ నెమ్మదిగా యథాస్థితికి చేరుకుంటున్నాయి. 


“నాకిలా ఎందుకు జరుగుతోంది?” వదలకుండా సాధుసాధుని అడిగాడు సోహం.  

“ఆలోచనలే ప్లనేరియాలో మార్పులకి కారణం. నేనేమిటి? ఇక్కడెందుకున్నానని ప్రశ్నలు వేసుకుని ఉంటావ్..” 


“మామూలే కదా ఆ ప్రశ్నలు!” కాదా అన్నట్టు అనుమానంగా అడిగాడు సోహం.  


“ఆలోచించకూడదా అయితే?” మళ్ళీ తనే ప్రశ్నించాడు. 


“ఆలోచనల్ని ఎలా ఆపుతావు? వాటిని లోలోపలే సాపు చేసి ఒక దారికి తెచ్చుకోవాలి. నీకు చేతనైన పనే కదా?” నవ్వారు సాధుసాధు. 


“అదే ఎలా?” ఏడుపుమొహం పెట్టాడు సోహం 


కాసేపు మౌనంగా ఆలోచించి “నీ పేరేమిటి?” అనడిగారు సాధుసాధు


అదేం ప్రశ్నన్నట్టు చూసాడు సోహం.  


“నీ పేరు నువ్వే లోపల్లోపల తలుచుకుంటే నీ ప్రశ్నల వంకర్లు పోతాయి. ఎప్పుడైనా ఇంకా ఇబ్బంది కలిగితే కర్వ్ కీపర్ కాపాడుతుంది. అయితే గుర్తుంచుకో..  ఇది నిన్ను ఇక్కడ పట్టి ఉంచనూ గలదు, లేదా అమాంతం అటువైపు విసిరేయనూ గలదు. జాగ్రత్త!” మృదువుగా స్థిరంగా చెప్పారు సాధుసాధు. 


“ఒకటి అడగొచ్చా? అక్కడ.. ఏముంటుంది?” 

అర్ధమైందన్నట్టు నవ్వారు సాధుసాధు. నవ్వినప్పుడల్లా వృత్తాకారపు అంచులు మృదువుగా వెలుగుతున్నాయి. 


“పువ్వులు ఎలా ఉంటాయో ఎప్పుడైనా చూసావా?” 

“బోలూ ఇంటి మీదున్నాయి. చూసాను.” 


“అడ్డుగానూ, నిలువుగానూ ఉండే రేకులు పై వైపుకి కూడా విచ్చుకుంటే ఎలా ఉంటుందో ఊహించగలవా?”

“విచ్చుకోడమంటే? పై వైపు? హహ్.. అదెలా సాధ్యం?” 


“కళ్ళు మూసుకుని ఊహించుకో.. వేరే లోకంలో పువ్వులు విచ్చుకుంటాయి. మూడో డైమన్షన్..”

“సమోసా కూడానా?” ప్రశ్న అడిగేసాక నవ్వొచ్చింది సోహానికి. 


“సమోసా మూడు పలకలుగా ఉంటుంది. దాన్ని తినచ్చు కూడా..” 

“అంటే?” ఆశ్చర్యంతో తబ్బిబ్బైపోయాడు సోహం. 


“ఇప్పుడు సమోసానేం చేస్తున్నావు? నీ బొజ్జకి అణుచుకుంటున్నావు. అది నీలో కలిసిపోతోంది. అక్కడైతే నోట్లో పెట్టుకుని తినచ్చు. రుచి తెలుస్తుంది..” 


సాధుసాధు చెప్తున్న మాటల్ని వింటూ ఊహించుకుంటే గమ్మత్తుగా అనిపించింది సోహానికి. ‘ఇప్పుడు సమోసా బొజ్జలోకి వెళ్తే వెచ్చదనం, శక్తి రావడం తెలుస్తుంది. రుచి తెలుస్తుందా? అదెలా ఉంటుంది?’ 


“పువ్వులు పూస్తాయి.. సమోసా తినచ్చు.. ఇంకా?”

“ఇప్పటికిది చాలు..”


“నాకు.. భయమేస్తోంది.” కొంచెం బెదురుగా అన్నాడు సోహం. 

“భయమేమీ అక్కర్లేదు. జాగ్రత్తగా ఇంటికెళ్ళు.” 


***


“వేరే లోకమా!” అరిచినంత పని చేసింది లిన్నా. 

“హుష్షు.. అరవకు..” దాచుకున్న వజ్రం తీసి లిన్నాకి చూపించాడు. 


“ఇదేంటి? ఏముంటాయట అక్కడ? ఎందుకిలా జరిగింది?” ఆసక్తిగా అడిగింది సోహంని.. 

“నువ్వు బోలూ గాడికి చెప్పనని మాటిస్తేనే చెప్తాను.” 

చెప్పనన్నట్టు కదిలి ఒట్టు పెట్టింది లిన్నా. 


“సమోసా మూడు కోణాలతో ఉంటుందట.” 

“నాలాగ?” 

“ఉహు.. ఉబ్బుగానట.. దాన్ని అక్కడివాళ్లు తింటారట.” 

“ఎలా? ఎందుకూ?”

“అదేం ప్రశ్న? రుచిగా ఉంటుందట.” 

“రుచా? అదేంటి?” అయోమయంగా అడిగింది లిన్నా 


“రుచంటే రుచే.. ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పటిది చాలు.” 

“ఇంతకీ ఇదెందుకు జరిగిందో కనుక్కున్నావా? ఇలా గీతలన్నీ వంకర పోయీ పోయీ విరిగిపోతే నేను బాగుచేసుకోలేక చావాలి!” భయంగా ఆందోళనగా చెప్పింది లిన్నా.. 


“ఆఁ.. ఆలోచనల వలన అని చెప్పారు.”

“నాకుండవా ఏంటి ఆలోచనలు?”

ఏమోలే అన్నట్టు దొర్లి ఊరుకున్నాడు సోహం. 


ఇద్దరూ ఇంటిదారి పట్టారు. ఆరోజు కేఫ్ దగ్గర కూడా ఆగలేదు. 


***


“ఒకవేళ.. మూడో డైమెన్షన్ కే వెళ్ళామనుకో.. నువ్వేం చూడాలనుకుంటున్నావ్?” లిన్నాని అడిగాడు సోహం.  

“పక్షులు.. నిలువుగా, గుండ్రంగా ఎగరడం కాకుండా అవి ఎగిరి ఎక్కడికైనా పారిపోతే ఎలా ఉంటుందో చూడాలి.”


ఈ ఆలోచనల ధాటికి ఏ క్షణం ఏమవుతుందో అన్నట్టు లిన్నా చెప్పేది వింటూ వజ్రాన్ని గట్టిగా అదుముకున్నాడు. 


“ఇంకా.. గుచ్చుకునే చెట్లు చూడాలి.”

“గుచ్చుకునేవా? ఎలా?” ఆశ్చర్యపోయాడు. 


“ఏమో.. అనిపించిందంతే.. ఒక గదిలో ఇంకో గది ఉంటే ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకీ అక్కడుండేవాళ్ళకి మనమెవరో తెలుస్తుందా?”

“వాళ్ళు ఆలోచిస్తే తెలుస్తుందేమో! నాకు తలనొప్పొస్తోంది. చాలింక..” అన్నాడు సోహం. 


***


“లైటాపేస్తున్నాను.. బయటికెళ్ళొచ్చాక బొమ్మలేసుకోవచ్చు పద టింకూ..” 


“ఉహు.. యూ గో..” నేల మీదకి వాలి కాగితాల మీద శ్రద్ధగా గీస్తున్నాడు.  


“నిన్ను వదిలేసెక్కడికి? డిన్నర్ బయట చేద్దాం పద. సమోసా తిందామా? అక్కడికి రష్మి, వాళ్ళ అమ్మా నాన్నా వస్తున్నారు..”


“నిజంగా?” తలెత్తి చూసాడు తల్లివైపు.


వాడిని త్వరపెట్టి కార్ పార్కింగ్ దగ్గరకి లాక్కెళ్ళింది. టింకూ కాగితాలు ఒక చేత్తో, డ్రాయింగ్ పేపర్ల పుస్తకం మరో చేత్తో పట్టుకుని బయల్దేరాడు. 


“వచ్చాక గీసుకోవచ్చంటే!” కార్లో కూర్చోబెడుతూ ముద్దుగా విసుక్కుంది అమ్మ 

“ఏం గీస్తున్నావ్ టింకులూ..” వాళ్ళు కూర్చున్నాక కార్ రివర్స్ చేస్తూ అడిగాడు నాన్న 


“లిన్నా ఇంటికి వెళ్తోంది.. పక్షులు రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి..” వెనక నున్న బూస్టర్ సీట్ లోంచి ముద్దుగా సీరియస్ గా చెప్పాడు టింకూ.. 


“లిన్నా నీ ఫ్రెండా?”

“కాదు..  సోహం కి ఫ్రెండ్..”

“ఎక్కడికెళ్తోంది ఇంతకీ.. “ 

“లిన్నా ఇల్లు షైనీ మింట్ టవర్. అక్కడికి..” 


“నీకేమైనా అర్ధమయిందా?” అమ్మని అడిగాడు నాన్న నవ్వుతూ.. 

“ఏదో కార్టూన్ లో చూసుంటాడు. బొమ్మలే బొమ్మలు! పోన్లే.. గోడల జోలికి రాకుండా కాగితాల మీద గీసుకుంటే చాలు.”


***

కార్ లోంచి దిగుతూనే పుస్తకంలోంచి చిన్న చిన్న కాగితం ముక్కలు నేల మీద పడిపోయాయి. ఏడుపు లంకించుకున్నాడు టింకూ.. 


వాడిని ఊరుకోబెట్టి అవన్నీ ఏరి ఇచ్చాడు నాన్న. అక్కడే నేల మీద కూర్చుని ఆ కాస్త వెలుగులోనే అన్నీ సర్దుకున్నాడు టింకూ. ఇంతలోనే కాగితాలన్నీ సరిచూసుకుని అరిచాడు.. 


“డైమండ్ కర్వ్ కీపర్ ఏదీ!! నో…” 


***

Wednesday, May 19, 2021

కచ్ఛపసీత

"వాల్మీకి లోకానికి ఓ మహోపకారమూ, ఓ మహాపకారమూ చేశాడు." అన్నారట ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు, ఎస్వీ భుజంగరాయశర్మ గారితో.. 


"రామాయణాన్ని వ్రాసి ఈ జాతి అభిరుచుల్నీ, అభిప్రాయాల్నీ యుగయుగాలుగా తీర్చిదిద్దాడు. అది మహోపకారం కాదా!" 
"సరే, అపకారం ఏమి?" టన్నారు భుజంగరాయశర్మ.
"మరి కొత్తది రాయడానికి ఎవరికీ ఏమీ మిగిల్చిపోలేదు." అన్నారట హనుమచ్ఛాస్త్రి గారు. 

వాల్మీకి రామాయణంలోంచి శాఖోపశాఖలుగా విస్తరించిన అభివ్యక్తులన్నీ దేశాల ఎల్లలు దాటి విస్తరించాయి. రామాయణపాత్రల్నీ, వర్ణనల్నీ మించి కొత్త ఊహ ఏదైనా ఉందా అంటే అనుమానమే. పూర్వకవుల దగ్గర్నుంచీ ఏదో ఒక పాత్రని ఆరాధించడమో, సన్నివేశాన్ని విశ్లేషించడమో, వాల్మీకంలో వాచ్యార్ధానికి వెనుక ఇంకా ఏదైనా ఉందా అని ఆలోచించడమో జరుగుతూనే ఉంది. ఆ చింతనల్లోంచి చిలవలు పలవలుగా పుట్టిన పిట్టకథలు వాల్మీకి రామాయణపు సొగసునూ, గాఢతనూ పెంచేవే. ఊర్మిళ నిద్ర అలాంటి కథ. 

జనకుడికి నాగేటిచాలులో దొరికిన బిడ్డ సీత, ఆపై ఇంకొక కూతురు ఊర్మిళ. జనకుని తమ్ముడు కుశధ్వజుడు సాంకస్య పట్టణపు రాజు. ఆయనకీ ఇద్దరు కూతుళ్లు. నలుగురు రాజకుమార్తెల్నీ అయోధ్యా రాకుమారులకి ఇచ్చి ఒకే ముహూర్తానికి పెళ్లి చేసాడు జనకుడు. వాల్మీకి రామాయణంలో ఉన్నది ఇంతే. 

ఊర్మిళ నిద్ర, లక్ష్మణదేవర నవ్వూ ఇవన్నీ జనకథలే. అన్నగారివెంట అడవులకి వెళ్లిన భర్త విరహాన్ని భరిస్తూ ఒంటరిగా ఉండిపోయిన ఊర్మిళ ఏమై ఉంటుందనే ఊహ మనసుని మెలిపెడుతుంది. 

పతంజలి శాస్త్రిగారి "కచ్ఛపసీత" కథ ఆ ఊహని వేరే స్థాయికి తీసుకెళ్తుంది. ఈ కథ గురించి ధూళిపాళ అన్నపూర్ణ గారు సమీక్షించినప్పుడు తెలిసింది. ఆ విదుషిని మెప్పించిన కథ ఎంత బావుండి ఉంటుందో అనుకున్నాను. పుస్తకం అంది చదివిన మొదటిసారి, రెండో సారి, ఎన్నిసార్లో... ఇదిగో ఇప్పుడు ఇంకోసారీ కూడా అదే అలజడి. కొక్కేలు వేసి లాగే వాక్యాలు ఎన్ని ఉన్నాయని. రామాయణం కొన్ని సర్గలు ప్రత్యేకంగా వెతుక్కుని చదువుకున్నాను, మళ్ళీ కథ చదువుకున్నాను. తీరదే! 

భారతీయ తాత్విక దృక్పథానికి రచయితకి ఉండాల్సిన అనుసంధానం గురించి శాస్త్రి గారి మాటల్లో అక్షరయాత్రలో విన్నవి మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకున్నాను. ప్రాచీన సాహిత్యకారులు తాత్వికతకి మనిషి అస్తిత్వానికి లంకె వేసి మనకందించారు. నెమ్మది నెమ్మదిగా సగర్వంగా అన్నీ జారవిడిచుకున్న తరానికి ఆఖరు ప్రతినిధిని నేను. ఇప్పుడు ఏడ్చి మొత్తుకుంటే దొరికేదా జ్ఞానం? 

లక్ష్మణుడి సాన్నిహిత్యాన్ని, ప్రేమని తల్చుకు తల్చుకు శల్యమైపోతున్న కూతురితో తండ్రి చెప్పే మాటలు ఏ బాధకైనా వర్తించేవే. "దుఃఖాన్ని లేదనుకోవడం అజ్ఞానం, దాన్ని విస్మరించమని చెప్పడం అమాయకత్వం. నువ్వు ముందు దుఃఖాన్ని అర్ధం చేసుకో. నువ్వు ఏ ఉపశమనం కోరుకుంటున్నావో అది వెలుపల ఉండదు. నీలోనే, నీ ఆధీనంలోనే ఉంటుంది." 

అయినా ఊర్మిళకి దారి దొరకదు. దుఃఖంలోంచి, ఆగ్రహంలోంచి విజ్ఞతలోకి ప్రయాణించడమేమీ సులువు కాదు అంటాడు ఊర్మిళతో తండ్రి. 

"బాల్యంలో తప్ప క్షత్రియస్త్రీ కి సుఖముండదు" అని చెప్తుంది  సీత తన చెల్లెలితో. పుట్టింటికి వెళ్లిపొమ్మని, బాల్యాన్ని పునర్జీవించమని ప్రోత్సహిస్తుంది. ఎంత గాఢమైన ఆలోచన! ఎంత అపురూపమైన ఊహ! 

ఒడిదుడుకులు అన్నీ మానవప్రయత్నానికి లొంగి దారివ్వవు. ఒక్కోసారి తలవంచక తప్పదు. బాల్యంలోకి ఎలాగైనా పారిపోగలిగితే చాలని క్షణకాలమైనా అనుకోని వారుంటారా? ఇంత తాత్వికతని అస్తిత్వానికి లంకె వేసి కథలో చుట్టి అందించారు పతంజలిశాస్త్రి గారు. 

"జీవితంలో మళ్ళీ సౌమిత్రిని చూడలేనేమోననే భయం హృదయం మీద శిలవలె ఉండేది. తన జీవితం భయం ఉండచుట్టిన వియోగం." అనుకుంటుంది ఊర్మిళ. 
ఊర్మిళ అంటే 'కోరిక కలిగినది' అని చెప్తారు. ప్రతీ స్త్రీ ఊర్మిళ కాదూ? సంతోషంగా జీవితం గడపాలని చూసే మనిషి కాదూ? 

కథకి మలుపు అవసరం కాబట్టి కచ్ఛపసీత ఊర్మిళ కథలోకి వస్తుంది. ఆమెకి పట్టుకొమ్మ దొరికినట్లయింది. తనలోకి తాను అంతర్లోకనం చేసుకోమని తండ్రి చెప్పాడు. బాల్యానికి వెళ్లిపొమ్మని అక్కచెల్లెలు చెప్పింది. దానికి మార్గమే తాబేలు రూపంలో కనిపించిందేమో. ప్రతీకాత్మకంగా సాగే కథలో మణిపూసల్లాంటి  మాటలెన్నో. "ఎక్కడ నుంచి వస్తాయీయనకి ఇలాంటి ఊహలు!" అని ముచ్చటపడి మళ్ళీ చదువుకోవడమే. "ఊరుకో.. నీ కన్నీళ్లు సౌమిత్రి కళ్ళలో తిరుగుతున్నాయి." అన్న వాక్యం కొన్ని జన్మలకి కూడా నన్ను వదిలిపోదేమో! 

ప్రాచీనసాహిత్యం అందకుండా ఒక తరాన్ని సాహిత్య పరంగా నిర్వీర్యం చేసిన మార్పుల గురించి కూడా పతంజలిశాస్త్రిగారికి కచ్చితమైన అభిప్రాయాలే ఉన్నాయి. పంచతంత్రం, పురాణేతిహాసాల్లో ఉన్న కాల్పనికత, మార్మికత మనిషి మెదడుకు పదును పెట్టే అంశాలు అంటారాయన. సమకాలీనతకు అద్దం పట్టేలా రాయడమొక్కటే సాహిత్యపు పరమావధి కాదు, ఆ పని చేసేందుకు వేరే మార్గాలున్నాయంటారు. పిడుగుపడి చెట్టు కూలితే బాల్కనీలోంచి చూసి అర్జంటుగా సోషల్ మీడియా లో కవిత్వమో కథో వెలార్చడాన్ని సృజనాత్మకత అనుకొమ్మని బలవంతం చేసే పరిస్థితుల్లో ఉన్నాం. కొత్త విశేషణాలెందుకు పుట్టట్లేదు? కొత్త పోలికలు ఎందుకు అందట్లేదు? నింగికీ, మన్నుకీ, పచ్చని చెట్టుకీ, పారే నీరుకీ దూరమైన మనిషికి కల్పనా, కవిత్వమూ ఎక్కణ్ణుంచి వస్తాయి? 

"పచ్చని చెట్ల నీడలో పడుకుని నీ బాల్యంలోకి వెళ్ళు. మన సుఖసంతోషాలని అక్కడ విడిచి వచ్చాం." అని చెప్తుంది సీత. కష్టాల కడలిలో ఎలా అంతర్ముఖమవ్వాలో కచ్ఛపసీత చూపిస్తుంది. ఊర్మిళ నిద్రపోతుంది. 

నిజంగా నిద్రపోయిందా? అందులో స్త్రీ సాధికారత ఏముంది? అసలీ కట్టుకథ వలన ప్రపంచానికి ఏం ఒరుగుతుంది? అని ప్రశ్నించే వారికి ప్రతీకాత్మకత అంటే చెప్పగలిగిన శక్తి రామాయణభారతాలకి కూడా లేదు. 

శాస్త్రిగారు ఒక మాట అంటారు.. ప్రాచీన సాహిత్యమొక్కటే సాహిత్యమని వాళ్లెప్పుడూ చెప్పలేదు. కానీ ఆధునికులు అభ్యుదయ సాహిత్యమొక్కటే సాహిత్యమని ఒక తరాన్ని గొప్ప అనుభవం నుంచి దూరం చేసేసారు అని.. ఎంత కఠోరనిజమది! 
 
సి. ఆనందారామం అంటారు.. "కాపీరైట్ హక్కులు లేవనే కదా రామాయణ భారతాల్ని ఇష్టానికి తిరగరాస్తున్నారు?" అని. నచ్చనిదాన్ని విశ్లేషించడమో, విమర్శించడమో కాక తమ భావజాలాన్ని ఆ పాత్రల మీద రుద్దడంలో  నైతికత ఎప్పుడూ ప్రశ్నార్ధకమే.     

అసలు కథ సౌందర్యాన్ని వెయ్యింతలు చేసేలా రాసిన "కచ్ఛప సీత" లాంటి కథ చదివి ఆ తిరగరాతల్ని చదివిన బాధని కడిగేసుకున్నాననిపించింది. 

మొన్న జరిగిన పతంజలిశాస్త్రిగారి పుట్టినరోజు సందర్భంగా "సారంగ"లో వచ్చిన వ్యాసాల్లో రెండు - "గోదావరి పడవలా మా అన్నయ్యగారు" లో తల్లావఝల శివాజీ తన అన్నగారి కంటే తనెన్ని వందలేళ్ళ చిన్నో నిరూపించుకునే విఫలప్రయత్నం చేశారు. శివాజీగారి మెటాఫర్లకి నేను వీరాభిమానిని. "ఎంగిలి కాని వాక్యాలతో అసలు కథ" అని కె. రామచంద్రారెడ్డి గారు వడ్లచిలకలు కథ గురించి రాశారు. "ఈమాట" లో  కె. సురేష్ గారు "శాస్త్రిగారి అరవై ఏళ్ల అక్షరయాత్ర" ని  సింహావలోకనం చేశారు. మూడూ ఇంకోసారి చదువుకుని, మృణాళిని గారి అక్షరయాత్ర చూసి, నిద్రకి ఒరుగుతూ ఇంకోసారి కచ్ఛపసీతని తల్చుకున్నాను. 

ఊర్మిళకి దొరికిన దారి ఎప్పటికైనా నాకూ దొరకకపోతుందా.. ఇలాంటి కథలు చదువుతూ చదువుతూ ఉంటే ఎప్పటికైనా అని. 

అన్నట్టు మనలో మన మాట - రామచంద్రారెడ్డి గారి విసురొకటి భలే నచ్చిందబ్బా! "ఎందుకింత శ్రమపడి చెరకు చీల్చి రసం తాగడం. డిస్పోజబుల్ గ్లాస్లో ఐస్ కలిపి గొంతులోకి దిగిపోయే రెడీమేడ్ సరుకు వుండగా అనే చదువరులకు ఓ దణ్ణం." అని... 

చెరుకుముక్క నవులుతూ... శాస్త్రిగారికి ఓ దణ్ణం పెట్టుకుంటున్నా. 



*** 

కచ్ఛపసీత కథ, మరో పదకొండు కథలతో కలిపి "రామేశ్వరం కాకులు" కథాసంకలనంలో ఉంది. ఛాయా ప్రచురణ